కదంబ వృక్షం అంటే తెలుసు కదా! దుర్గాదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన చెట్టు. రాజస్తాన్‌లోని పిప్‌లాంత్రీ గ్రామంలో మనం అడుగు పెడితే పచ్చగా, అందంగా ఈ కదంబ వృక్షాలే కనువిందు చేస్తుంటాయి. ఎందుకంటారా ఆ గ్రామంలో అమ్మాయి పుడితే సంబరాలు చేసుకుంటారు. ప్రకృతికి మారుపేరైన అమ్మాయి పుట్టినందుకు ఓ మొక్క నాటుతారు. ఈ సంబరాల వెనుక ఓ విషాదం ఉంది. ఆ ఊరి మాజీ సర్పంచ్ శ్యామ్‌సుందర్ పాలీవాల్. 2006లో ఆయన 16 ఏళ్ల వయసు కుమార్తె కిరణ్ చనిపోయింది. ఆమె స్మృతి కోసం ఓ కదంబ మొక్క నాటారు. ఆ కదంబ చెట్టే తన కూతురంటూ ఆ చెట్టును వాటేసుకునేవారు. ప్రతి ఇల్లు తిరుగుతూ కూతురు పుడితే సంబరాలు చేసుకోవాలని, మొక్కల్ని పెంచాలని అవగాహన పెంచారు. అసలే కరువు ప్రాంతమైన రాజస్తాన్‌లో ఓ ఏడాది నీటి కటకట ఏర్పడింది. ప్రభుత్వం రైళ్ల ద్వారా ఆ ఊరికి నీరు సరఫరా చేసింది. దీంతో ప్రకృతి లాంటి ఆడపిల్లనే కాదు.. ప్రకృతిని కూడా కాపాడుకున్నారు. పిప్‌లాంత్రీతో పాటుగా చుట్టుపక్కల గ్రామాల్లో విపరీతంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. 3 లక్షల 50 వేలకు పైగా మొక్కలు నాటారు. ఓ కూతురుంటే తల్లిదండ్రులు ఎంత పచ్చగా ఉంటారో, ఇప్పుడా ఊరు కూడా పచ్చగా కళకళలాడుతోంది.
ఎవరెస్టంత ఎత్తుకు ఎదిగింది..
‘బిడ్డ పర్వతం ఎక్కుతానంటే నాకు భయమనిపించింది.. కానీ అమ్మాయే నాకు ధైర్యం చెప్పింది. రెండు రాష్ట్రాల్లో ఇద్దరికే అవకాశం వచ్చిందంటే నమ్మకం కుదిరింది. కశ్మీర్‌కు వెళ్లే ఒకరోజు ముందు క్షణాలు ఇప్పటికీ గుర్తున్నయ్’ అంటూ ఆ ఉద్వేగ క్షణాలను నెమరేసుకున్నారు ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మాలావత్ పూర్ణ తండ్రి దేవీదాస్. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం పాకాలకు చెందిన దేవీదాస్‌ది వ్యవసాయ కుటుంబం. కుమారుడు నరేశ్, కూతురు పూర్ణ. ‘ఐదో తరగతి వరకు పాకాల గవర్నమెంట్ స్కూళ్లోనే చదివింది. తర్వాత తాడ్వాయి గురుకులంలో చేర్చించా. పర్వతాధిరోహణ కోసం 110 మందిని సెలెక్ట్ చేసి అందులో 20 మందికి భువనగిరి కోట దగ్గర శిక్షణ ఇచ్చారు. ఇద్దరిని జమ్మూకశ్మీర్‌కు పంపించారు. పర్వతాధిరోహణకు అంతా రెడీ అయ్యాక పర్వతం ఎక్కేందుకు మాతో పంపిస్తావా అని అడిగిండ్రు. పూర్ణపై నమ్మకంతో ఓకే అని చెప్పినం.’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు దేవీదాస్. – సాక్షిప్రతినిధి/నిజామాబాద్
Comments
Please login to add a commentAdd a comment