
మాదాపూర్(హైదరాబాద్): అవకాశాలు కల్పిస్తే మహిళలు ఏదైనా సాధించగలరని, అందుకు తానే చక్కటి ఉదాహరణ అని మాలావత్ పూర్ణ అన్నారు. తాజాగా నార్త్ అమెరికాలోని మౌంట్ డెనాలి ఆరోహించి.. ఏడు శిఖరాలను అధిరోహించిన అతి చిన్న వయసు భారతీయ మహిళగా, తొలి దక్షిణ భారతీయురాలిగా పూర్ణ రికార్డులు సృష్టించారు.ఈ సందర్భంగా మాదాపూర్‌లోని హోటల్ ఆవాసాలో అమె మీడియాతో ముచ్చటించారు.
35–40 కేజీల బరువుతో...
‘‘ఏడు పర్వతాలు అధిరోహించడం ఆనందంగా ఉంది. నార్త్ అమెరికాలోని డెనాలి పర్వత (6,190 మీటర్ల ఎత్తు గల) శిఖరాన్ని చేరుకోవడానికి ఎంతో కసరత్తు చేయాల్సి వచ్చింది. మిగిలిన పర్వతాలకు సహాయకులు, గైడ్‌లు, పోర్టర్‌లు అందుబాటులో ఉంటారు. కానీ ఈపర్వతానికి అలాంటి అవకాశం లేదు. దాదాపు 35 నుంచి 40 కేజీల జరువుగల 25 రోజులకు సరిపడా ఆహారాన్ని, సామగ్రిని మేమే తీసుకెళ్లాం.
జూన్ 5వ తేదీన డెనాలి పర్వతాన్ని అధిరోహించాం. ‘ట్రాన్సెండ్ అడ్వెంచర్స్’ ద్వారా 7–సమ్మిట్స్ పూర్తి చేశాను. ఈ యాత్రకు ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ వాళ్లు స్పాన్సర్ చేశారు. కోచ్ శేఖర్‌బాబు, ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ చైర్మన్ వైవీ గోపాల కృష్ణమూర్తి, డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, బూక్యా శోభన్‌బాబుల ప్రోత్సాహం మరువలేనిది’’ అని పూర్ణ తెలిపారు.
7–సమ్మిట్స్ పూర్తి చేసి హైదరాబాద్ వచ్చిన పూర్ణను ఏస్ ఇంజనీరింగ్ అకాడమీవారు సన్మానించారు. అకాడమీ చైర్మన్ ప్రొఫెసర్ వైవీ గోపాలకృష్ణమూర్తి మాట్లాడుతూ పిల్లల విజయాలకు తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో అవసరమన్నారు. ఓయూలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న పూర్ణ మరిన్ని శిఖరాలను అధిరోహించాలని, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment