ఎవరెస్టంత గర్వంగా ఉంది | Malavath purna with sakshi | Sakshi
Sakshi News home page

ఎవరెస్టంత గర్వంగా ఉంది

Published Sun, Jun 15 2014 3:31 AM | Last Updated on Sat, Sep 2 2017 8:48 AM

ఎవరెస్టంత గర్వంగా ఉంది

ఎవరెస్టంత గర్వంగా ఉంది

 ‘సాక్షి’తో మాలావత్ పూర్ణ
- మొదట అమ్మ భయపడింది
- నాన్న వెన్నుతట్టారు
- ప్రవీణ్ సార్ ప్రోత్సాహాన్ని మరిచిపోలేను
- ఐపీఎస్ సాధించి ప్రజలకు సేవచేస్తా

‘‘చిన్న వయసులోనే పెద్ద శిఖరాన్ని అధిరోహించాను. ఎంత గర్వంగా ఉందం టే.. ఎవరెస్ట్ శిఖరమంత’’ అంటూ మాలావత్ పూర్ణ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘‘నా విజయం వెనుక ఐపీఎస్ ప్రవీణ్‌కుమార్ సార్ ప్రోత్సాహం ఎంతో ఉంది. జీవితాంతం సార్‌కు రుణపడి ఉంటా. ఆయనలా ఐపీఎస్ అయి సేవలందిస్తా’’ అని పేర్కొన్నారు. చిన్న వయసులో ఎవరెస్ట్‌ను అధిరోహించి ప్రపంచ రికార్డు నెలకొల్పిన పూర్ణ తన స్వగ్రామం సిరికొండ మండలంలోని పాకాలకు వెళ్తూ శనివారం రాత్రి కామారెడ్డిలోని బంధువుల ఇంట్లో బస చేశారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో తన యాత్ర అనుభవాలను పంచుకున్నారు. -కామారెడ్డి
 
సాక్షి : ఎవరెస్టు ఎక్కాలన్న ఆలోచన ఎలా వచ్చింది.
పూర్ణ :
ప్రవీణ్‌సార్ ప్రోత్సాహం వల్లే ఈ ఘనత సాధించగలిగాను. నేను తాడ్వాయి సోషల్ వెల్ఫేర్ స్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్నపుడు కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్ ఆడేదాన్ని. ఓసారి ప్రవీణ్‌కుమార్ సార్ వచ్చారు. ఆయన నాలోని ప్రతిభను గుర్తించారు. శిఖరారోహణకు ఎంపిక చేశారు. 2013 సెప్టెంబర్‌లో భువనగిరి ట్రైనింగ్ క్యాంపునకు తీసుకెళ్లారు. 110 మందికి ఐదు రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. అందులో ప్రతిభ చూపిన 20 మంది ఎంపిక చేసి నవంబర్‌లో డార్జిలింగ్ తీసుకెళ్లారు. అక్కడ 20 రోజులపాటు శిఖరారోహణలో శిక్షణ ఇచ్చారు.

17వేల అడుగుల ఎత్తున్న శిఖరాలను అధిరోహించాం. ప్రతిభ చూపిన తొమ్మిది మందిని ఎంపిక చేసి లద్దాహ్ తీసుకెళ్లారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి నన్ను, ఆనంద్‌ను ఎంపిక చేశారు. మాకు రెండు నెలలపాటు రంగారెడ్డి జిల్లాలోని గేలిదొడ్డి స్కూల్‌లో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. శారీరక, మానసిక దృఢత్వానికి శిక్షణ తోడ్పడింది. రోజూ 26 కిలో మీటర్లు జాగింగ్, అనంతరం మెడిటేషన్, యోగ సాధన చేసేవాళ్లం. వార్షిక పరీక్షల సమయంలో తాడ్వాయికి వచ్చి పరీక్షలు రాశాను. తర్వాత ఏప్రిల్ 6వ తేదీన హైదరాబాద్‌కు వెళ్లి అక్కడి నుంచి హియాలయాలకు బయలు దేరాం.
 
సాక్షి : ఎవరెస్టును ఎలా అధిరోహించారు.
పూర్ణ :
మొదట 5,400 మీటర్ల వద్ద ఉన్న బేస్ క్యాంపునకు చేరాం. అక్కడి నుంచి 6,400 మీటర్ల వద్ద ఉన్న అడ్వాన్స్ బేస్ క్యాంప్‌నకు, అక్కడినుంచి 7,100 మీటర్ల దగ్గర ఉన్న క్యాంప్ ఫాక్స్‌కు చేరుకున్నాం. అక్కడినుంచి బేస్ క్యాంప్‌నకు తిరిగివచ్చాం. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల అక్కడ 15 రోజులు ఉండాల్సి వచ్చింది. 19వ తేదీన మళ్లీ మొదలుపెట్టాం. 20న అడ్వాన్స్ క్యాంపునకు చేరాం. అక్కడ ఒకరోజు విశ్రాంతి తీసుకొన్న అనంతరం ముందుకు సాగాం.

22న క్యాంప్ వన్‌కు, 23న క్యాంప్ -2కు, 24న క్యాంప్ -3కి చేరాం. దీన్ని డెడ్ జోన్ అంటారు. 24న ఉదయం 9.30 గంటలకు లాస్ట్ ఈవెంట్ సమ్మిట్ హెడ్ క్యాంప్ వద్దకు చేరాం. 26న ఉదయం 6 గంటల ప్రాంతంలో శిఖరంపై జాతీయ పతాకాన్ని, తెలంగాణ జెండాను ఆవిష్కరించాం. బీఆర్ ఆంబేద్కర్, శంకరన్ చిత్రపటాలను ఉంచాం. 15 నిమిషాలు అక్కడ గడిపిన అనంతరం తిరుగు ప్రయాణమయ్యాం.
 చదువు సంగతి..

పూర్ణ : పదో తరగతి తాడ్వాయి హాస్టల్‌లోనే ఉండి చదువుకుంటా. ఐపీఎస్ సాధించాలన్నది నా లక్ష్యం. కష్టపడి చదివి లక్ష్యాన్ని చేరుకుంటా. సమాజానికి నావంతు సేవ చేస్తా.

రాష్ట్ర, జాతీయ నేతలు అభినందించినపుడు మీ ఫీలింగ్
పూర్ణ : ఎవరెస్టును అధిరోహించి దేశ ప్రతిష్టను పెంచావంటూ అందరూ అభినందించారు. వారి అభినందనలతో ఎంతో సంతోషించా. గర్వంగా ఫీలవుతున్నా. కొత్త రాష్ట్రంలో ఈ విజయం సాధించడం ఆనందంగా ఉంది.

ఈ ఘనత సాధిస్తానని ఎప్పుడైనా అనుకున్నావా?
పూర్ణ :
పేద కుటుంబానికి చెందిన తాను ఇలాంటి సాహస యాత్ర చేస్తానని ఏనాడూ ఊహించలేదు. ఎవరెస్టుకు వెళ్లేందుకు ఎదురయ్యే ఆటంకాల గురించిన ఫొటోలు, వీడియోలు చూపించినప్పుడు అమ్మ భయపడింది. కానీ నాన్న వెన్నుతట్టారు. ప్రవీణ్‌సార్ ప్రోత్సాహంతో అరుదైన ఘనత సాధించా. ఇప్పుడు అందరూ ఆనందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement