Social Welfare School
-
గురుకుల విద్యార్థినుల ఘనత
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి చెందిన ఇద్దరు గురుకుల విద్యార్థులు జాతీయ స్థాయి గుర్తింపు సాధించారు. నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో అటల్ ఇన్నోవేషన్ మిషన్ మేలో నిర్వహించిన అటల్ కమ్యూనిటీ డే ఛాలెంజ్ – 2020లో ఈ విద్యార్థులు సమర్పించిన ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. ఈ ఫలితాలు శుక్రవారం ప్రకటించారు. దేశ వ్యాప్తంగా ఈ ప్రాజెక్ట్‌ల కోసం 1,100కు పైగా ఎంట్రీలు రాగా అందులో 30 ప్రాజెక్టు ఐడియాలను జడ్జిలు ఎంపిక చేశారు. ఈ 30 ప్రాజెక్టుల్లో రెండు ప్రాజెక్టు ఐడియాలు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలో చదివే విద్యార్థులు సమర్పించారు. ► విశాఖపట్నంలోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ గురుకుల విద్యాలయంలో తొమ్మిదో తరగతి చదువుతున్న కేఎల్‌ఎస్‌పీ వర్షిణి ‘పీఐసీఓ’ (పికో–ద కోవిడ్ చాట్‌బాట్)ను రూపొందించింది. ఇది వాయిస్ కమాండ్లు, టెక్టస్ మెజేస్‌లను లేదా రెండింటి ద్వారా మానవ సంభాషణలు అనుకరించే కంప్యూటర్ ప్రోగ్రామ్. ఇది ఏదైనా పెద్ద మేసేజింగ్ ఆవర్తనాల ద్వారా ఉపయోగించే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్. కోవిడ్–19 లాక్డౌన్, అన్‌లాక్ సమయంలో ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ సహాయం చేయడానికి, ముందస్తు జాగ్రత్తలు చెప్పటానికి, కోవిడ్‌పై పోరాటానికి ‘పికో’ను వర్షిణి పరిచయం చేసింది. వర్షిణి స్వస్థలం విశాఖ జిల్లా బక్కన్నపాలెం. ► విజయనగరం జిల్లా చీపురుపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న గర్భపు ప్రవల్లిక ‘వరదల్లో చిక్కుకున్న వారికి సహాయం అందించేందుకు డ్రోన్లు ఉపయోగించుట’ అనే అంశంపై ప్రాజెక్టును సమర్పించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్లు ఉపయోగించి మెడికల్ కిట్లతో పాటు ఇతర అత్యవసర సామగ్రిని సరఫరా చేయడం ద్వారా ప్రజల ప్రాణాలు రక్షించవచ్చు. వరద సమయంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు మెడికల్ కిట్స్ సరఫరా చేయడం, పరిస్థితిపై అవగాహన కల్పించడం ఈ ప్రోగ్రాం లక్ష్యం. ప్రవల్లిక స్వస్థలం విజయనగరం జిల్లా తెర్లాం మండలం కుసుమూరు. ► ఈ రెండు ప్రోగ్రామ్‌ల ద్వారా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు దేశవ్యాప్త గుర్తింపు పొందారు. కేంద్ర ప్రభుత్వ సాయంతో నిర్వహించే అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ద్వారా విద్యార్థుల్లోని కొత్తకొత్త ఆలోచనలకు పదును పెడుతున్నట్లు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి కల్నల్ వి రాములు తెలిపారు. (అందరూ ఉన్నా అనాథలయ్యారు..) -
కలిసి తిన్నారని కాలితో తన్నిన సారు..
సాక్షి, అర్ధవీడు: స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పీఈటీ ఇద్దరు విద్యార్థుల పట్ల శుక్రవారం కర్కోటకంగా మారాడు. చేయని నేరానికి వారిని చితక బాదడంతో పాటు కులం పేరుతో దూషించాడు. బాధిత విద్యార్థులు నేరుగా పోలీసుస్టేషన్‌కు వెళ్లి జరిగిన అవమానాన్ని పోలీసుల ఎదుట చెప్పుకుని భోరున విలపించారు. వ్యాయామోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత విద్యార్థుల కథనం ప్రకారం.. ఎనిబెర తేజస్సు (9వ తరగతి), పవన్ (8వ తరగతి)లు ఒకే ప్లేటులో భోజనం తింటున్నారు. పీఈటీ, వసతి గృహం కేర్‌టేకర్‌గా ఉన్న వినయ్‌కుమార్‌రెడ్డి విద్యార్థులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరూ ఒకే ప్లేటులో తింటున్నారు.. ప్లేట్లు ఏమయ్యాయంటూ కాలితో అన్నం ప్లేటును తన్నాడు. అంతటితో ఊరుకోకుండా కర్రతో చితకబాదాడు. చివరకు ఒక అడుగు ముందుకేసి కులం పేరుతో దూషించాడు. కర్రతో చితక బాదడంతో విద్యార్థుల పొట్ట, వీపుపై వాతలు పడ్డాయి. నేరుగా పోలీసుస్టేషన్‌కు వెళ్లిన విద్యార్థులు బాధిత విద్యార్థులు తమకు జరిగిన అన్యాయంపై నేరుగా పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. తమ పీఈటీ వినయ్‌కుమార్‌రెడ్డి అన్నం ప్లేటు తన్ని కర్రతో చితకబాది కులం పేరుతో దూషించాడని ఫిర్యాదు చేశారు. ఎస్ఐ సెలవులో ఉండటంతో విద్యార్థుల ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేదు. స్థానిక ఎస్హెచ్ఓపై బాధిత విద్యార్థుల బంధువులు పలు ఆరోపణలు చేస్తున్నారు. పాఠశాలలో వర్గపోరు గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయులు, సిబ్బంది మధ్య వర్గపోరు ఉంది. నిత్యం తమను వేధిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులను చితకబాదిన వ్యాయామోపాధ్యాయుడు గతంలో తన కారును విద్యార్థులతో కడిగించడం వివాదాస్పదమైంది. పలు కుల సంఘాల నాయకులు ఎస్సీ కమిషన్‌కు కూడా ఆయనపై ఫిర్యాదు చేశారు. గురుకుల పాఠశాలల జిల్లా కోఆర్డినేటర్ లక్ష్మీశ్వరి సైతం విచారించి పీఈటీపై చర్యలకు ఆదేశించారు. అయినా అతడిపై చర్యలు తీసుకోకపోవడంతో కక్ష సాధింపు చర్యల్లో భాగంగా నిత్యం విద్యార్థులను కులం పేరుతో దూషిస్తున్నాడని విద్యార్థుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ప్రిన్సిపాల్ వనపాల్‌రెడ్డిని వివరణ కోరగా పీఈటీ వినయ్‌కుమార్‌రెడ్డి విద్యార్థులను తీవ్రంగా కొట్టినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. విద్యార్థులు పోలీసుస్టేషన్‌కు వెళ్లడంతో సర్ది చెప్పి వారిని వెనక్కి పిలిపించామని వివరించారు. పోలీసుస్టేషన్ ఎస్హెచ్ఓ కొండల్‌రావును వివరణ కోరగా విద్యార్థులు ఫిర్యాదు చేసేందుకు వచ్చారని, చిన్న పిల్లలు కావడంతో వెనక్కు పంపించామని తెలిపారు. -
ఎవరెస్టంత గర్వంగా ఉంది
‘సాక్షి’తో మాలావత్ పూర్ణ - మొదట అమ్మ భయపడింది - నాన్న వెన్నుతట్టారు - ప్రవీణ్ సార్ ప్రోత్సాహాన్ని మరిచిపోలేను - ఐపీఎస్ సాధించి ప్రజలకు సేవచేస్తా ‘‘చిన్న వయసులోనే పెద్ద శిఖరాన్ని అధిరోహించాను. ఎంత గర్వంగా ఉందం టే.. ఎవరెస్ట్ శిఖరమంత’’ అంటూ మాలావత్ పూర్ణ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘‘నా విజయం వెనుక ఐపీఎస్ ప్రవీణ్‌కుమార్ సార్ ప్రోత్సాహం ఎంతో ఉంది. జీవితాంతం సార్‌కు రుణపడి ఉంటా. ఆయనలా ఐపీఎస్ అయి సేవలందిస్తా’’ అని పేర్కొన్నారు. చిన్న వయసులో ఎవరెస్ట్‌ను అధిరోహించి ప్రపంచ రికార్డు నెలకొల్పిన పూర్ణ తన స్వగ్రామం సిరికొండ మండలంలోని పాకాలకు వెళ్తూ శనివారం రాత్రి కామారెడ్డిలోని బంధువుల ఇంట్లో బస చేశారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో తన యాత్ర అనుభవాలను పంచుకున్నారు. -కామారెడ్డి సాక్షి : ఎవరెస్టు ఎక్కాలన్న ఆలోచన ఎలా వచ్చింది. పూర్ణ : ప్రవీణ్‌సార్ ప్రోత్సాహం వల్లే ఈ ఘనత సాధించగలిగాను. నేను తాడ్వాయి సోషల్ వెల్ఫేర్ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నపుడు కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్ ఆడేదాన్ని. ఓసారి ప్రవీణ్‌కుమార్ సార్ వచ్చారు. ఆయన నాలోని ప్రతిభను గుర్తించారు. శిఖరారోహణకు ఎంపిక చేశారు. 2013 సెప్టెంబర్‌లో భువనగిరి ట్రైనింగ్ క్యాంపునకు తీసుకెళ్లారు. 110 మందికి ఐదు రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. అందులో ప్రతిభ చూపిన 20 మంది ఎంపిక చేసి నవంబర్‌లో డార్జిలింగ్ తీసుకెళ్లారు. అక్కడ 20 రోజులపాటు శిఖరారోహణలో శిక్షణ ఇచ్చారు. 17వేల అడుగుల ఎత్తున్న శిఖరాలను అధిరోహించాం. ప్రతిభ చూపిన తొమ్మిది మందిని ఎంపిక చేసి లద్దాహ్ తీసుకెళ్లారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి నన్ను, ఆనంద్‌ను ఎంపిక చేశారు. మాకు రెండు నెలలపాటు రంగారెడ్డి జిల్లాలోని గేలిదొడ్డి స్కూల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. శారీరక, మానసిక దృఢత్వానికి శిక్షణ తోడ్పడింది. రోజూ 26 కిలో మీటర్లు జాగింగ్, అనంతరం మెడిటేషన్, యోగ సాధన చేసేవాళ్లం. వార్షిక పరీక్షల సమయంలో తాడ్వాయికి వచ్చి పరీక్షలు రాశాను. తర్వాత ఏప్రిల్ 6వ తేదీన హైదరాబాద్‌కు వెళ్లి అక్కడి నుంచి హియాలయాలకు బయలు దేరాం. సాక్షి : ఎవరెస్టును ఎలా అధిరోహించారు. పూర్ణ : మొదట 5,400 మీటర్ల వద్ద ఉన్న బేస్ క్యాంపునకు చేరాం. అక్కడి నుంచి 6,400 మీటర్ల వద్ద ఉన్న అడ్వాన్స్ బేస్ క్యాంప్‌నకు, అక్కడినుంచి 7,100 మీటర్ల దగ్గర ఉన్న క్యాంప్ ఫాక్స్‌కు చేరుకున్నాం. అక్కడినుంచి బేస్ క్యాంప్‌నకు తిరిగివచ్చాం. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల అక్కడ 15 రోజులు ఉండాల్సి వచ్చింది. 19వ తేదీన మళ్లీ మొదలుపెట్టాం. 20న అడ్వాన్స్ క్యాంపునకు చేరాం. అక్కడ ఒకరోజు విశ్రాంతి తీసుకొన్న అనంతరం ముందుకు సాగాం. 22న క్యాంప్ వన్‌కు, 23న క్యాంప్ -2కు, 24న క్యాంప్ -3కి చేరాం. దీన్ని డెడ్ జోన్ అంటారు. 24న ఉదయం 9.30 గంటలకు లాస్ట్ ఈవెంట్ సమ్మిట్ హెడ్ క్యాంప్ వద్దకు చేరాం. 26న ఉదయం 6 గంటల ప్రాంతంలో శిఖరంపై జాతీయ పతాకాన్ని, తెలంగాణ జెండాను ఆవిష్కరించాం. బీఆర్ ఆంబేద్కర్, శంకరన్ చిత్రపటాలను ఉంచాం. 15 నిమిషాలు అక్కడ గడిపిన అనంతరం తిరుగు ప్రయాణమయ్యాం. చదువు సంగతి.. పూర్ణ : పదో తరగతి తాడ్వాయి హాస్టల్లోనే ఉండి చదువుకుంటా. ఐపీఎస్ సాధించాలన్నది నా లక్ష్యం. కష్టపడి చదివి లక్ష్యాన్ని చేరుకుంటా. సమాజానికి నావంతు సేవ చేస్తా. రాష్ట్ర, జాతీయ నేతలు అభినందించినపుడు మీ ఫీలింగ్ పూర్ణ : ఎవరెస్టును అధిరోహించి దేశ ప్రతిష్టను పెంచావంటూ అందరూ అభినందించారు. వారి అభినందనలతో ఎంతో సంతోషించా. గర్వంగా ఫీలవుతున్నా. కొత్త రాష్ట్రంలో ఈ విజయం సాధించడం ఆనందంగా ఉంది. ఈ ఘనత సాధిస్తానని ఎప్పుడైనా అనుకున్నావా? పూర్ణ : పేద కుటుంబానికి చెందిన తాను ఇలాంటి సాహస యాత్ర చేస్తానని ఏనాడూ ఊహించలేదు. ఎవరెస్టుకు వెళ్లేందుకు ఎదురయ్యే ఆటంకాల గురించిన ఫొటోలు, వీడియోలు చూపించినప్పుడు అమ్మ భయపడింది. కానీ నాన్న వెన్నుతట్టారు. ప్రవీణ్‌సార్ ప్రోత్సాహంతో అరుదైన ఘనత సాధించా. ఇప్పుడు అందరూ ఆనందిస్తున్నారు.