పీఈటీ చేతిలో దెబ్బలు తిన్న విద్యార్థులు.. ఇన్‌సెట్లో విద్యార్థి పొట్టపై తేలినవాతలు
సాక్షి, అర్ధవీడు: స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పీఈటీ ఇద్దరు విద్యార్థుల పట్ల శుక్రవారం కర్కోటకంగా మారాడు. చేయని నేరానికి వారిని చితక బాదడంతో పాటు కులం పేరుతో దూషించాడు. బాధిత విద్యార్థులు నేరుగా పోలీసుస్టేషన్‌కు వెళ్లి జరిగిన అవమానాన్ని పోలీసుల ఎదుట చెప్పుకుని భోరున విలపించారు. వ్యాయామోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత విద్యార్థుల కథనం ప్రకారం.. ఎనిబెర తేజస్సు (9వ తరగతి), పవన్ (8వ తరగతి)లు ఒకే ప్లేటులో భోజనం తింటున్నారు.
పీఈటీ, వసతి గృహం కేర్‌టేకర్‌గా ఉన్న వినయ్‌కుమార్‌రెడ్డి విద్యార్థులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరూ ఒకే ప్లేటులో తింటున్నారు.. ప్లేట్లు ఏమయ్యాయంటూ కాలితో అన్నం ప్లేటును తన్నాడు. అంతటితో ఊరుకోకుండా కర్రతో చితకబాదాడు. చివరకు ఒక అడుగు ముందుకేసి కులం పేరుతో దూషించాడు. కర్రతో చితక బాదడంతో విద్యార్థుల పొట్ట, వీపుపై వాతలు పడ్డాయి.
నేరుగా పోలీసుస్టేషన్‌కు వెళ్లిన విద్యార్థులు
బాధిత విద్యార్థులు తమకు జరిగిన అన్యాయంపై నేరుగా పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. తమ పీఈటీ వినయ్‌కుమార్‌రెడ్డి అన్నం ప్లేటు తన్ని కర్రతో చితకబాది కులం పేరుతో దూషించాడని ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ సెలవులో ఉండటంతో విద్యార్థుల ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేదు. స్థానిక ఎస్‌హెచ్‌ఓపై బాధిత విద్యార్థుల బంధువులు పలు ఆరోపణలు చేస్తున్నారు.
పాఠశాలలో వర్గపోరు
గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయులు, సిబ్బంది మధ్య వర్గపోరు ఉంది. నిత్యం తమను వేధిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులను చితకబాదిన వ్యాయామోపాధ్యాయుడు గతంలో తన కారును విద్యార్థులతో కడిగించడం వివాదాస్పదమైంది. పలు కుల సంఘాల నాయకులు ఎస్సీ కమిషన్‌కు కూడా ఆయనపై ఫిర్యాదు చేశారు. గురుకుల పాఠశాలల జిల్లా కోఆర్డినేటర్ లక్ష్మీశ్వరి సైతం విచారించి పీఈటీపై చర్యలకు ఆదేశించారు. అయినా అతడిపై చర్యలు తీసుకోకపోవడంతో కక్ష సాధింపు చర్యల్లో భాగంగా నిత్యం విద్యార్థులను కులం పేరుతో దూషిస్తున్నాడని విద్యార్థుల బంధువులు ఆరోపిస్తున్నారు.
ఈ విషయంపై ప్రిన్సిపాల్ వనపాల్‌రెడ్డిని వివరణ కోరగా పీఈటీ వినయ్‌కుమార్‌రెడ్డి విద్యార్థులను తీవ్రంగా కొట్టినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. విద్యార్థులు పోలీసుస్టేషన్‌కు వెళ్లడంతో సర్ది చెప్పి వారిని వెనక్కి పిలిపించామని వివరించారు. పోలీసుస్టేషన్ ఎస్‌హెచ్‌ఓ కొండల్‌రావును వివరణ కోరగా విద్యార్థులు ఫిర్యాదు చేసేందుకు వచ్చారని, చిన్న పిల్లలు కావడంతో వెనక్కు పంపించామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment