beating students
-
విద్యార్థులపై కళాశాల డైరెక్టర్ అరాచకం
విజయవాడ : హాస్టల్ విద్యార్థులపై కళాశాల డైరెక్టర్ దాడి చేసిన ఘటన పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కానూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కానూరులోని విశ్వ అకాడమీ హాస్టల్ విద్యార్థులు తాము ఉంటున్న హాస్టల్లో చోరీ జరగడంతో డైరెక్టర్‌ను నిలదీశారు. దీంతో కోపోద్రిక్తుడైన డైరెక్టర్ ఫణి కుమార్ ఐదుగురు విద్యార్థులపై పీవీసీ పైపులతో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో జానకి రాం, తిరుమల్ అనే ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారు రేపు జరిగే నీట్ పరీక్షకు హాజరవడంపై సందేహాలు నెలకొన్నాయి. మద్యం మత్తులో ఉన్న ఫణి కుమార్ తమపై దాడి చేశాడంటూ విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అతడిని అరెస్టు చేశారు. విద్యార్థులపై దాడి చేసిన కారణంగా అతడిపై 324, 341, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
కలిసి తిన్నారని కాలితో తన్నిన సారు..
సాక్షి, అర్ధవీడు: స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పీఈటీ ఇద్దరు విద్యార్థుల పట్ల శుక్రవారం కర్కోటకంగా మారాడు. చేయని నేరానికి వారిని చితక బాదడంతో పాటు కులం పేరుతో దూషించాడు. బాధిత విద్యార్థులు నేరుగా పోలీసుస్టేషన్‌కు వెళ్లి జరిగిన అవమానాన్ని పోలీసుల ఎదుట చెప్పుకుని భోరున విలపించారు. వ్యాయామోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత విద్యార్థుల కథనం ప్రకారం.. ఎనిబెర తేజస్సు (9వ తరగతి), పవన్ (8వ తరగతి)లు ఒకే ప్లేటులో భోజనం తింటున్నారు. పీఈటీ, వసతి గృహం కేర్‌టేకర్‌గా ఉన్న వినయ్‌కుమార్‌రెడ్డి విద్యార్థులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరూ ఒకే ప్లేటులో తింటున్నారు.. ప్లేట్లు ఏమయ్యాయంటూ కాలితో అన్నం ప్లేటును తన్నాడు. అంతటితో ఊరుకోకుండా కర్రతో చితకబాదాడు. చివరకు ఒక అడుగు ముందుకేసి కులం పేరుతో దూషించాడు. కర్రతో చితక బాదడంతో విద్యార్థుల పొట్ట, వీపుపై వాతలు పడ్డాయి. నేరుగా పోలీసుస్టేషన్‌కు వెళ్లిన విద్యార్థులు బాధిత విద్యార్థులు తమకు జరిగిన అన్యాయంపై నేరుగా పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. తమ పీఈటీ వినయ్‌కుమార్‌రెడ్డి అన్నం ప్లేటు తన్ని కర్రతో చితకబాది కులం పేరుతో దూషించాడని ఫిర్యాదు చేశారు. ఎస్ఐ సెలవులో ఉండటంతో విద్యార్థుల ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేదు. స్థానిక ఎస్హెచ్ఓపై బాధిత విద్యార్థుల బంధువులు పలు ఆరోపణలు చేస్తున్నారు. పాఠశాలలో వర్గపోరు గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయులు, సిబ్బంది మధ్య వర్గపోరు ఉంది. నిత్యం తమను వేధిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులను చితకబాదిన వ్యాయామోపాధ్యాయుడు గతంలో తన కారును విద్యార్థులతో కడిగించడం వివాదాస్పదమైంది. పలు కుల సంఘాల నాయకులు ఎస్సీ కమిషన్‌కు కూడా ఆయనపై ఫిర్యాదు చేశారు. గురుకుల పాఠశాలల జిల్లా కోఆర్డినేటర్ లక్ష్మీశ్వరి సైతం విచారించి పీఈటీపై చర్యలకు ఆదేశించారు. అయినా అతడిపై చర్యలు తీసుకోకపోవడంతో కక్ష సాధింపు చర్యల్లో భాగంగా నిత్యం విద్యార్థులను కులం పేరుతో దూషిస్తున్నాడని విద్యార్థుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ప్రిన్సిపాల్ వనపాల్‌రెడ్డిని వివరణ కోరగా పీఈటీ వినయ్‌కుమార్‌రెడ్డి విద్యార్థులను తీవ్రంగా కొట్టినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. విద్యార్థులు పోలీసుస్టేషన్‌కు వెళ్లడంతో సర్ది చెప్పి వారిని వెనక్కి పిలిపించామని వివరించారు. పోలీసుస్టేషన్ ఎస్హెచ్ఓ కొండల్‌రావును వివరణ కోరగా విద్యార్థులు ఫిర్యాదు చేసేందుకు వచ్చారని, చిన్న పిల్లలు కావడంతో వెనక్కు పంపించామని తెలిపారు. -
విద్యార్థులపై పైశాచికత్వం
టీ.నగర్: తోటలోని కర్బూజా పండును తిన్నారని పాఠశాల విద్యార్థులను చెట్టుకు కట్టి దాడి చేసిన డీఎండీకే నేతపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. వివరాలు.. తిరుపూర్ జిల్లా ధారాపురం కరుంగాలివలసు గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. ఆదివారం ఉదయం నల్లతంగాల్ కాలువలో స్నానం చేసేందుకు వెళ్లిన వీరు సాయంత్రం ఇళ్లకు రాలేదు. వారి తల్లిదండ్రులు, స్థానికులు ఊరంతా గాలించారు. ఇలా ఉండగా కాలువ పక్కన ఉన్న రామస్వామికి చెందిన తోటలో చెట్టుకు ఈ ముగ్గురిని తాళ్లతో బంధించారు. గమినంచిన స్థానికులు వారి తాళ్లను విప్పి విచారించారించగా తోటలో ఉన్న కర్బూజా పండును తిన్నామని ఆతోట యజమాని రామస్వామి(50) తమను తాళ్లతో చెట్టుకు బంధించినట్లు తెలిపారు. అంతేకాకుండా తమపై రబ్బర్ పైప్, పాదరక్షలతో దాడి చేసినట్లు చెప్పారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు అతని కోసం గాలించగా పరారైనట్లు తెలిసింది. రామస్వామి డీఎండీకే పట్ట ణపంచాయితీ కార్యదర్శిగా ఉన్నాడు. ఆకలిదప్పులతో ఉన్న ముగ్గురు విద్యార్థులను అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి రామస్వామి కోసం గాలిస్తున్నారు. -
విద్యార్థులను చితకబాదిన సిబ్బంది
గుంటూరు: ఓ కార్పొరేట్ కాలేజీలో సిబ్బంది ఇష్టరీతిన వ్యవహరించారు. పేరేచర్లలోని ప్రైవేట్ కాలేజీ విద్యార్థులు భోజనం బాగోలేదని ఫిర్యాదు చేసినందుకు సిబ్బంది వారిని చితకబాదారు. కాలేజీ సిబ్బంది దాడితో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. మేడికొండూరు పోలీసులను ఆశ్రయించి బాధిత విద్యార్థులు జరిగిన విషయంపై ఫిర్యాదుచేశారు.