- రూ.30 వేలు ఇవ్వాలని డిమాండ్
- బాధితుడి ఫిర్యాదుతో నిందితుడిపై కేసు
సైబర్ క్రైం పోలీస్ పేరుతో సింగరేణి ఉద్యోగికి బెదిరింపు'
Published Tue, Jul 19 2016 11:46 PM | Last Updated on Thu, Mar 28 2019 6:18 PM
కోల్‌సిటీ : తాను సైబర్ క్రైం పోలీసునంటూ గోదావరిఖనిలో ఓ పీఈటీ టీచర్ తప్పుడు ప్రచారం చేసుకుంటూ... ఓ సింగరేణి ఉద్యోగుడిని బెదిరించి రూ.30 వేలు డిమాండ్ చేశాడు. అనుమానంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చాకచక్యంగా నిందితుడిని పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. గోదావరిఖని వన్‌టౌన్ పోలీసులు, బాధితుడి తెలిపిన వివరాల ప్రకారం.. గోదావరిఖని తిరుమల్‌నగర్‌కు చెందిన ఎరుకల సంతోష్‌కుమార్ సింగరేణి ఆర్జీ–1 జీఎం కార్యాలయంలో కోఆర్డినేటర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. స్థానిక రమేశ్‌నగర్‌కు చెందిన ఎనగందుల రమేశ్ పట్టణంలోని పలు ప్రైవేట్ స్కూళ్ళల్లో పీఈటీగా పని చేస్తున్నాడు. మూడు రోజుల క్రితం సంతోష్‌కుమార్‌కు ఫోన్ చేసిన రమేశ్ తను సైబర్ క్రైం పోలీసునని పరిచయం చేసుకున్నాడు. ‘నీ మీద కేసయ్యింది... నీ కోసం తిరుగుతున్నాం... రూ.30 వేలు ఇస్తే పైఅధికారులకు చెప్పి కేసు లేకుండా చేస్తా... లేకుంటే నీకే నష్టం’ అంటూ బెదిరించాడు. అనుమానం వచ్చిన సంతోష్‌కుమార్ కరీంనగర్ స్పెషల్ బ్రాంచ్ పోలీస్ విభాగంలో పని చేస్తున్న తన బంధువుకు ఈ విషయం చెప్పాడు. డబ్బు కోసం ఆ వ్యక్తి ఇలా చేస్తున్నాడని తెలుసుకున్న సంతోష్ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మంగళవారం అడిగిన డబ్బులు ఇస్తానని రమేశ్‌ను, జీఎం ఆఫీస్ దగ్గరికి సంతోష్‌కుమార్ రప్పించాడు. రూ.30 వేలు లేవని, మూడు వేలు మాత్రం ఇస్తానని చెప్పడంతో రమేశ్ తీసుకున్నాడు. అదే సమయంలో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.
Advertisement
Advertisement