న్యూఢిల్లీ: సరిహద్దు రాష్ట్రాల్లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్‌ఎస్) అధికార పరిధి పెంపును బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకించారు. బుధవారం ప్రధాని మోదీతో సమావేశం సందర్భంగా ఆమె ఈ విషయం ప్రస్తావించారు. అంతర్జాతీయ సరిహద్దు నుంచి 15 కిలోమీటర్లుగా ఉన్న బీఎస్‌ఎఫ్ పరిధిని 50 కి.మీ.లకు పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
బీఎస్‌ఎఫ్‌కు మరిన్ని అధికారాలు కట్టబెడితే రాష్ట్ర పరిధిలో ఉన్న శాంతిభద్రతల విషయంలో ఘర్షణలకు దారితీయవచ్చని ఆమె వ్యాఖ్యానించారు. అకారణంగా దేశ సమాఖ్య వ్యవస్థకు భంగం కలిగించేందుకు యత్నించడం సరికాదని ప్రధానిని కోరినట్లు చెప్పారు. వచ్చే ఏడాదిలో కోల్‌కతాలో జరగనున్న గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ ప్రారంభానికి ప్రధాని మోదీని ఆహ్వానించినట్లు ఆమె వెల్లడించారు. త్రిపురలో బీజేపీ శ్రేణులు టీఎంసీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నట్లు అంశాన్ని కూడా ప్రస్తావించినట్లు చెప్పారు.
సోనియాను కలవాలని నిబంధనేం లేదు
కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీతో సమావేశమయ్యారా అని మీడియా ప్రశ్నించగా ఆమె సుదీర్ఘ సమాధానమిచ్చారు. ‘ఈసారి ఢిల్లీ టూర్‌లో కేవలం ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ మాత్రమే తీసుకున్నా. పంజాబ్ ఎన్నికలపై పార్టీల నేతలంగా బిజీగా ఉన్నారు. పనికే మొదటి ప్రాధాన్యం. ఢిల్లీ వచ్చిన ప్రతిసారీ సోనియాను ఎందుకు కలవాలి? అదేమీ రాజ్యాంగ నిబంధన కాదు’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment