బుల్‌డోజర్లు, భారీ సామగ్రితో నది ప్రవాహాన్ని ఆపేసిన దృశ్యం
న్యూఢిల్లీ: చైనా, భారత్ మధ్య సరిహద్దుల్లో గాల్వన్ నదీలోయ సమీపంలో చైనా చేసిన దురాగతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. చైనా భారీ సంఖ్యలో బుల్‌డోజర్లను తీసుకువచ్చి ఏకంగా గాల్వన్ నదీ ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నించింది. ఇందుకు సంబంధించిన ఉపగ్రహ ఛాయాచిత్రాలను ఒక జాతీయ మీడియా సంస్థ బయటపెట్టింది. భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణలు జరిగిన ప్రాంతానికి అర కిలో మీటరు దూరంలోని ఈశాన్య లద్దాఖ్‌లో గాల్వన్ ప్రాంతంలో బుల్‌డోజర్లతో నదీ ప్రవాహాన్ని తగ్గించేందుకు, మళ్లించేందుకు చైనా యత్నించింది. (చైనా, భారత్ వ్యూహాలు ఏమిటి?)
5 కి.మీ. పైగా క్యూ కట్టిన చైనా వాహనాలు
ఘర్షణలు జరిగిన ప్రాంతంలో చైనా తమ భూభాగం వైపు బుల్‌డోజర్లు, లారీలు, మిలటరీ రవాణా వాహనాలు 5 కి.మీ.ల పొడవునా నిలిపింది. కొందరు భారత్ సైనికులు గాల్వన్ నదిలో పడి కొట్టుకుపోవడం, పర్వతం నుంచి కింద పడడం వంటివి ఫొటోల ద్వారా వెలుగులోకి వచ్చాయి. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా రెండు ప్రాంతాల్లో తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేసుకుంది. అక్కడ్నుంచే పక్కాగా కుట్ర పన్ని మరీ ఇనుప రాడ్లతో భారతీయ సైనికులపై దాడి చేసినట్టు వెల్లడైంది. (భారత్‌పై మరోసారి విషం కక్కిన చైనా)
రష్యా, చైనాలతో భారత్ త్రైపాక్షిక చర్చలు
భారత్, చైనా, రష్యా విదేశాంగ మంత్రుల త్రైపాక్షిక వర్చువల్ చర్చలు 23న జరుగుతాయని విదేశాంగ శాఖ తెలిపింది. ఈ చర్చల్లో భారత్ తరఫున విదేశాంగ మంత్రి జై శంకర్ పాల్గొననుండగా, చైనా, రష్యా విదేశాంగ మంత్రులు వాంగ్ యి, సెర్గీ లావ్‌రోవ్ ప్రాతినిధ్యం వహిస్తారని విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ చెప్పారు. కరోనా, ప్రపంచ భద్రత, ఆర్థిక స్థిరత్వం వంటి అంశాలు వీరి మధ్య చర్చకు రానున్నాయి. త్రైపాక్షిక అవగాహన ప్రకారం.. భారత్, చైనా బలగాల ఘర్షణలు ద్వైపాక్షిక అంశం అయినందున ఇది చర్చకు వచ్చే అవకాశం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment