Satellite imagery
-
Russia-Ukraine war: మారియుపోల్‌లో మారణహోమం?
కీవ్: మారియుపోల్‌లో కొత్తగా అనేక మట్టిగుట్టలు ఉపగ్రహ చిత్రాల్లో కనిపించాయి. ఇవి రష్యన్ల దమనకాండకు నిదర్శనాలని, వారు జరిపిన నరమేధానికి ఆనవాళ్లని ఉక్రెయిన్ ఆరోపించింది. మరోవైపు డోన్బాస్ ప్రాంత నగరాలపై రష్యా దాడులు ముమ్మరం చేసింది. దీంతో అక్కడ నుంచి పౌరులను తరలించే యత్నాలు సఫలం కాలేదని అధికారులు చెప్పారు. గురువారం మారియుపోల్ తమ స్వాధీనమైందని, స్టీల్‌ప్లాంట్ ప్రాంతాన్ని దిగ్భంధనం చేయాలని తన సేనలు ఆదేశించానని పుతిన్ ప్రకటించిన సంగతి తెలిసిందే! తదనంతరం ఆ నగరం శాటిలైట్ ఫొటోలను మాక్సర్ టెక్ సంస్థ విడుదల చేసింది. ఈ ఫొటోల్లో నగరం సమీపంలో 200పైగా సమాధులు కనిపించాయి. ఇక్కడ దాదాపు 9వేలమంది పౌరులను రష్యన్లు సమాధి చేశారని ఉక్రెయిన్ స్థానిక అధికారులు ఆరోపించారు. ఈ చిత్రాలపై రష్యా ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. యుద్ధం రెండో దశకు చేరిందని మాత్రం శుక్రవారం ప్రకటించింది. గతంలో బుచాలో రష్యా మారణకాండ జరిపిందనేందుకు ఆధారాలు లభించిన నేపథ్యంలో మారియుపోల్‌లో కూడా అదే జరిగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తూర్పు వైపు ఫోకస్ పూర్తి స్థాయి యుద్ధానికి బదులు రష్యా ఈ దఫా తూర్పు వైపు నగరాలను ఎంచుకొని దాడులు చేస్తోంది. తమపై రాత్రంతా బాంబింగ్ జరిగిందని స్లోవ్యాన్స్క్ మేయర్ తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన బస్సుల్లో పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని కోరారు. రుబిజనె నగరంలో తరలింపునకు రష్యా దాడులు అడ్డంకిగా మారాయని లుహాన్స్క్ గవర్నర్ తెలిపారు. ఖార్కివ్ నగరంపై కూడా రాత్రంతా బాంబింగ్ జరిగింది. డోన్బాస్ ప్రాంతంపై పట్టు సాధించాలన్న రష్యా యత్నాలను ఉక్రెయిన్ సైన్యం ప్రతిఘటిస్తోందని యూఎస్ తెలిపింది. కానీ తాము చాలావరకు తూర్పు, దక్షిణ ఉక్రెయిన్‌పై పట్టు సాధించామని రష్యా మిలటరీ తెలిపింది. మారియుపోల్ స్టీల్‌ప్లాంట్‌లో మిగిలిన ఉక్రెయిన్ సైనికులు లొంగిపోతే ప్రాణభిక్ష పెడతామని పుతిన్ మరోమారు ప్రకటించారు. అయితే నగరంలో రష్యా సేనలకు బాగా నష్టం వాటిల్లిందని, అందువల్ల తూర్పు వైపు మోహరింపులు అనుకున్నట్లు జరగలేదని పాశ్చాత్య దేశాలు భావిస్తున్నాయి. భయానక చిత్రం పౌరులపై రష్యా అకృత్యాలు హారర్ కథను తలపిస్తున్నాయని ఐరాస మానవహక్కుల కమిషనర్ మికేల్ బాలెట్ విమర్శించారు. యుద్ధంలో 5,264మంది పౌరులకు గాయాలయ్యాయని, వారిలో 2,345 మంది చనిపోయారని అన్నారు. అంతర్జాతీయ మానవీయ చట్టాలను రష్యా ఉల్లంఘించడమే గాక తుంగలో తొక్కిందని ఆరోపించారు. ఆస్పత్రులు, పాఠశాలలు, నివాస సముదాయాలపై రష్యా బాంబింగ్, ఫైరింగ్ చేసి పలువురిని పొట్టనబెట్టుకుంటోందన్నారు. ఇందుకు సంబంధించి తమ కార్యాలయం ఆధారాలు కూడా సమీకరించిందన్నారు. సరైన వైద్య సాయం అందక మరో 3వేల మంది మరణించారని చెప్పారు. రష్యా సైనికుల లైంగిక నేరాలపై 75కు పైగా ఆరోపణలు వచ్చాయని ఆమె తెలిపారు. మరికొన్ని వివరాలు ► కొత్తగా 80 కోట్ల డాలర్ల మిలటరీ సాయాన్ని ప్రకటించినందుకు అమెరికాకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలిపారు. రష్యాపై పోరు కోసం పాశ్చాత్య దేశాలు ఆయుధ సాయాన్ని వేగవంతం చేయాలని కోరారు. ► యూఎస్ ఉపాధ్యక్షురాలు కమలాహారిస్, మెటా సీఈఓ జుకర్‌బర్గ్ సహా 27 మంది ప్రముఖ అమెరికన్లు తమ దేశంలోకి ప్రవేశించకుండా నిషేధం విధిస్తున్నట్లు రష్యా ప్రకటించింది. రష్యాపై ఆంక్షలకు ప్రతిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ► శాంతి చర్చలు ఆగేందుకు ఉక్రెయినే కారణమని రష్యా విమర్శించింది. తమ ప్రతిపాదనలకు బదులివ్వలేదని రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్ చెప్పారు. ‘‘చర్చలు అవసరం లేనట్లుంది. వారి కర్మకు వారే బాధ్యులు’’ అన్నారు. ఉక్రెయిన్ బృందం చీఫ్‌తో పలుమార్లు చర్చించానని రష్యా ప్రతినిధి మెడిన్‌స్కై శుక్రవారం తెలిపారు. -
చైనా దురాగతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి..
న్యూఢిల్లీ: చైనా, భారత్ మధ్య సరిహద్దుల్లో గాల్వన్ నదీలోయ సమీపంలో చైనా చేసిన దురాగతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. చైనా భారీ సంఖ్యలో బుల్డోజర్లను తీసుకువచ్చి ఏకంగా గాల్వన్ నదీ ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నించింది. ఇందుకు సంబంధించిన ఉపగ్రహ ఛాయాచిత్రాలను ఒక జాతీయ మీడియా సంస్థ బయటపెట్టింది. భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణలు జరిగిన ప్రాంతానికి అర కిలో మీటరు దూరంలోని ఈశాన్య లద్దాఖ్‌లో గాల్వన్ ప్రాంతంలో బుల్డోజర్లతో నదీ ప్రవాహాన్ని తగ్గించేందుకు, మళ్లించేందుకు చైనా యత్నించింది. (చైనా, భారత్ వ్యూహాలు ఏమిటి?) 5 కి.మీ. పైగా క్యూ కట్టిన చైనా వాహనాలు ఘర్షణలు జరిగిన ప్రాంతంలో చైనా తమ భూభాగం వైపు బుల్డోజర్లు, లారీలు, మిలటరీ రవాణా వాహనాలు 5 కి.మీ.ల పొడవునా నిలిపింది. కొందరు భారత్ సైనికులు గాల్వన్ నదిలో పడి కొట్టుకుపోవడం, పర్వతం నుంచి కింద పడడం వంటివి ఫొటోల ద్వారా వెలుగులోకి వచ్చాయి. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా రెండు ప్రాంతాల్లో తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేసుకుంది. అక్కడ్నుంచే పక్కాగా కుట్ర పన్ని మరీ ఇనుప రాడ్లతో భారతీయ సైనికులపై దాడి చేసినట్టు వెల్లడైంది. (భారత్‌పై మరోసారి విషం కక్కిన చైనా) రష్యా, చైనాలతో భారత్ త్రైపాక్షిక చర్చలు భారత్, చైనా, రష్యా విదేశాంగ మంత్రుల త్రైపాక్షిక వర్చువల్ చర్చలు 23న జరుగుతాయని విదేశాంగ శాఖ తెలిపింది. ఈ చర్చల్లో భారత్ తరఫున విదేశాంగ మంత్రి జై శంకర్ పాల్గొననుండగా, చైనా, రష్యా విదేశాంగ మంత్రులు వాంగ్ యి, సెర్గీ లావ్రోవ్ ప్రాతినిధ్యం వహిస్తారని విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ చెప్పారు. కరోనా, ప్రపంచ భద్రత, ఆర్థిక స్థిరత్వం వంటి అంశాలు వీరి మధ్య చర్చకు రానున్నాయి. త్రైపాక్షిక అవగాహన ప్రకారం.. భారత్, చైనా బలగాల ఘర్షణలు ద్వైపాక్షిక అంశం అయినందున ఇది చర్చకు వచ్చే అవకాశం లేదన్నారు. -
పంట లెక్కలకు శాటిలైట్ సాయం
సాక్షి, హైదరాబాద్: రైతుల పంటలను అంచనా వేసేందుకు ఉపగ్రహ చిత్రాలను ఉపయోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యవసాయశాఖను ఆదేశించింది. జిల్లా స్థాయిలో పంటల విస్తీర్ణం, వాటి పరిస్థితి, దిగుబడిని అంచనా వేయడానికి ఉపగ్రహ చిత్రాలను ఉపయోగించాలని పేర్కొంది. తద్వారా వ్యవసాయ ఉత్పాదకత, వాతావరణ పరిస్థితులను అంచనా వేయొచ్చని సూచించింది. జియో–ఇన్ఫర్మేటిక్స్ ద్వారా పప్పుధాన్యాలు, ఉద్యాన పంటలు పెరిగే అవకాశం ఉన్న ప్రాంతాన్ని అంచనా వేయాలని, కరువు అంచనా కోసం ఉపగ్రహ డేటాను ఉపయోగించాలని కేంద్రం నిర్ణయించింది. మరోవైపు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) కింద రైతులు పంట నష్టపరిహారం పొందడానికి అనేక సమస్యలు తలెత్తుతుతున్న నేపథ్యంలో ఆయా వివాదాలను పరిష్కరించడానికి కేవలం క్షేత్రస్థాయి పరిశీలనపైనే ఆధారపడుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో పరిహారం అందడంలో ఆలస్యమవుతోంది. పైగా నష్టం అంచనాలు సకాలంలో జరగడంలేదు. వాటిని ఉపగ్రహ చిత్రాల ద్వారా అంచనా వేయాలనేది ప్రధాన ఉద్దేశం. రైతుల వాదనల పరిష్కారానికి సమయ వ్యవధిని తగ్గించడానికి మెరుగైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని కేంద్ర వ్యవసాయశాఖ నిర్ణయించింది. ఇప్పటికే కేంద్ర వ్యవసాయశాఖ, పీఎంఎఫ్‌బీవై కింద వివిధ రాష్ట్రాల్లో పంట కోత ప్రయోగాలకు ప్రత్యామ్నాయంగా పరిజ్ఞానాన్ని ఉపయోగించేలా పైలట్ అధ్యయనాలు చేయడానికి 8 ఏజెన్సీలకు ఇప్పటికే బాధ్యత అప్పగించారు. పంటల దిగుబడి అంచనా కోసం బీమా యూనిట్ స్థాయికి అవసరమైన పంట కోత ప్రయోగాల సంఖ్యను తగ్గించడానికి శాటిలైట్ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మోడలింగ్ టూల్స్ మొదలైన సాంకేతిక పరిజ్ఞాన అధ్యయనాలను ఉపయోగించాలనేది సర్కారు ఉద్దేశం. ఆలస్యమైతే కంపెనీలకు జరిమానా.. మెరుగైన సేవలు, జవాబుదారీతనం, రైతులకు క్లెయిమ్‌లను సకాలంలో చెల్లించడం కోసం పీఎంఎఫ్‌బీవై పథకాన్ని కేంద్రం అనేక సవరణలు చేసింది. గత రబీ సీజన్ నుంచి క్లెయిమ్‌ల చెల్లింపు కోసం నిర్దేశించిన గడువు తేదీకి 10 రోజులకు మించి సెటిల్మెంట్ చేయకపోతే బీమా కంపెనీ రైతులకు ఏడాదికి 12 శాతం వడ్డీ చెల్లించాలని పేర్కొంది. అయితే ప్రస్తుతం రబీ సీజన్‌కు క్లెయిమ్‌ల పరిష్కారం జరుగుతున్నందున జరిమానా వ్యవహారాన్ని కంపెనీలు తోసిపుచ్చుతున్నట్లు కేంద్రం భావిస్తోంది. ఆ ప్రక్రియపై రాష్ట్రం దృష్టిసారించాలని సూచించింది. నెలలు, ఏళ్ల తరబడి పంటల బీమా క్లెయిమ్స్ సెటిల్మెంట్ చేయడంలో ఆలస్యం చేస్తే బీమా కంపెనీలతోపాటు సంబంధిత రాష్ట్రాలకు జరిమానా విధించాలని కూడా కేంద్రం స్పష్టం చేసింది. అలాగే కంపెనీల విన్నపం మేరకు తన వాటా సబ్సిడీ సొమ్ము చెల్లించడంలో మూడు నెలలకు మించితే రాష్ట్రాలు 12 శాతం వడ్డీ చెల్లించాలని స్పష్టం చేసింది. -
ఎం హెచ్ 370: చిమ్మ చీకట్లో నల్లపిల్లి కోసం వెతుకులాట
మలేషియా విమానం కోసం అన్వేషణ చిమ్మ చీకట్లో నల్లపిల్లిపి వెతకడం లాగా మారింది. ఆస్ట్రేలియా దగ్గర సముద్రంలో విమానం శిధిలాలున్నాయని సాటిలైట్లు చెప్పిన ఇరవై నాలుగు గంటల తరువాత కూడా విమానం ఎక్కడుందో తెలియడం లేదు. ఇవన్నీ చాలవన్నట్టు దక్షిణ హిందూ మహాసముద్రంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం కూడ ఇబ్బందులకు దారితీస్తోంది. ఇప్పటికే వెతుకులాటలో ఉన్న విమానాలు ఆస్ట్రేలియాలోని పెర్త్ కు తిరిగి వచ్చేస్తున్నాయి. ఈ సమయంలో ఆస్ట్రేలియా తీరంలో వాతావరణం అంత అనుకూలంగా ఉండదు. అమెరికా నేవీకి చెందిన పొసైడన్ ఎయిర్ క్రాఫ్ట్ లోనూ తగినంత ఇంధనం లేకపోవడంతో తిరిగి రాక తప్పలేదు. సాటిలైట్ కెమెరాలకు కనిపించిన శిథిలాలు ఏమిటన్న విషయంలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అవి బోయింగ్ విమానపు రెక్కలై ఉండవచ్చునని అంటున్నారు. రెక్కల్లో ఉండే ఫ్యూయల్ టాంకులు ఖాళీ అయిపోవడం వల్ల రెక్కలు పైకి తేలి ఉండవచ్చునని అంటున్నారు. నార్వే కి చెందిన కార్గో నౌక హోయె సెంట్ పీటర్బర్గ్ సెర్చి లైట్ల సాయంతో అన్వేషణ కొనసాగిస్తోంది. సౌత్ ఆఫ్రికా నుంచి ఆస్ట్రేలియాకి కార్లను తీసుకువెళ్తున్న ఈ నౌక శుక్రవారం కూడా తన వెతుకులాట కొనసాగిస్తుందని అధికారులు చెబుతున్నారు. బ్లాక్ బాక్స్ నుంచి వెలువడే సందేశాల ఆధారంగా విమాన శకలాలు ఎక్కడున్నాయో గుర్తించవచ్చునని, అయితే ఆ బ్యాటరీ 25 రోజుల వరకూ పనిచేస్తుందని, ఇప్పటికే దాదాపు రెండు వారాలైపోయాయని అధికారులు అంటున్నారు. మలేషియాకి చెందిన రెండు విమానాలు, మూడు హెలీకాప్టర్లు, ఆరు పడవలు, చైనాకి చెందిన మూడు విమానాలు, మూడు హెలికాప్టర్లు, అయిదు పడవలు, ఇండోనీషియాకి చెందిన నాలుగు విమానాలు, ఆరు నౌకలు, ఆస్ట్రేలియాకి చెందిన అయిదు విమానాలు, ఒక పడవ, జపాన్‌కి చెందిన నాలుగు విమానాలు, మన దేశానికి చెందిన రెండు విమానాలు, దక్షిణ కొరియాకి చెందిన రెండు విమానాలు, అమెరికా, న్యూజీలాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి చెందిన చెరొక్క విమానం, ఇంగ్లండ్ కి చెందిన ఒక నౌక అన్వేషణలో ఉన్నాయి. అదే ప్రాంతంలో ఉన్న నార్వే నౌక కూడా అదే పనిలో ఉంది.