కీవ్: మారియుపోల్‌లో కొత్తగా అనేక మట్టిగుట్టలు ఉపగ్రహ చిత్రాల్లో కనిపించాయి. ఇవి రష్యన్ల దమనకాండకు నిదర్శనాలని, వారు జరిపిన నరమేధానికి ఆనవాళ్లని ఉక్రెయిన్ ఆరోపించింది. మరోవైపు డోన్బాస్ ప్రాంత నగరాలపై రష్యా దాడులు ముమ్మరం చేసింది. దీంతో అక్కడ నుంచి పౌరులను తరలించే యత్నాలు సఫలం కాలేదని అధికారులు చెప్పారు. గురువారం మారియుపోల్ తమ స్వాధీనమైందని, స్టీల్‌ప్లాంట్ ప్రాంతాన్ని దిగ్భంధనం చేయాలని తన సేనలు ఆదేశించానని పుతిన్ ప్రకటించిన సంగతి తెలిసిందే!
తదనంతరం ఆ నగరం శాటిలైట్ ఫొటోలను మాక్సర్ టెక్ సంస్థ విడుదల చేసింది. ఈ ఫొటోల్లో నగరం సమీపంలో 200పైగా సమాధులు కనిపించాయి. ఇక్కడ దాదాపు 9వేలమంది పౌరులను రష్యన్లు సమాధి చేశారని ఉక్రెయిన్ స్థానిక అధికారులు ఆరోపించారు. ఈ చిత్రాలపై రష్యా ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. యుద్ధం రెండో దశకు చేరిందని మాత్రం శుక్రవారం ప్రకటించింది. గతంలో బుచాలో రష్యా మారణకాండ జరిపిందనేందుకు ఆధారాలు లభించిన నేపథ్యంలో మారియుపోల్‌లో కూడా అదే జరిగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తూర్పు వైపు ఫోకస్
పూర్తి స్థాయి యుద్ధానికి బదులు రష్యా ఈ దఫా తూర్పు వైపు నగరాలను ఎంచుకొని దాడులు చేస్తోంది. తమపై రాత్రంతా బాంబింగ్ జరిగిందని స్లోవ్యాన్స్‌క్ మేయర్ తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన బస్సుల్లో పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని కోరారు. రుబిజనె నగరంలో తరలింపునకు రష్యా దాడులు అడ్డంకిగా మారాయని లుహాన్స్‌క్ గవర్నర్ తెలిపారు. ఖార్కివ్ నగరంపై కూడా రాత్రంతా బాంబింగ్ జరిగింది. డోన్బాస్ ప్రాంతంపై పట్టు సాధించాలన్న రష్యా యత్నాలను ఉక్రెయిన్ సైన్యం ప్రతిఘటిస్తోందని యూఎస్ తెలిపింది.
కానీ తాము చాలావరకు తూర్పు, దక్షిణ ఉక్రెయిన్‌పై పట్టు సాధించామని రష్యా మిలటరీ తెలిపింది. మారియుపోల్ స్టీల్‌ప్లాంట్‌లో మిగిలిన ఉక్రెయిన్ సైనికులు లొంగిపోతే ప్రాణభిక్ష పెడతామని పుతిన్ మరోమారు ప్రకటించారు. అయితే నగరంలో రష్యా సేనలకు బాగా నష్టం వాటిల్లిందని, అందువల్ల తూర్పు వైపు మోహరింపులు అనుకున్నట్లు జరగలేదని పాశ్చాత్య దేశాలు భావిస్తున్నాయి.
భయానక చిత్రం
పౌరులపై రష్యా అకృత్యాలు హారర్ కథను తలపిస్తున్నాయని ఐరాస మానవహక్కుల కమిషనర్ మికేల్ బాలెట్ విమర్శించారు. యుద్ధంలో 5,264మంది పౌరులకు గాయాలయ్యాయని, వారిలో 2,345 మంది చనిపోయారని అన్నారు. అంతర్జాతీయ మానవీయ చట్టాలను రష్యా ఉల్లంఘించడమే గాక తుంగలో తొక్కిందని ఆరోపించారు. ఆస్పత్రులు, పాఠశాలలు, నివాస సముదాయాలపై రష్యా బాంబింగ్, ఫైరింగ్ చేసి పలువురిని పొట్టనబెట్టుకుంటోందన్నారు. ఇందుకు సంబంధించి తమ కార్యాలయం ఆధారాలు కూడా సమీకరించిందన్నారు. సరైన వైద్య సాయం అందక మరో 3వేల మంది మరణించారని చెప్పారు. రష్యా సైనికుల లైంగిక నేరాలపై 75కు పైగా ఆరోపణలు వచ్చాయని ఆమె తెలిపారు.
మరికొన్ని వివరాలు
► కొత్తగా 80 కోట్ల డాలర్ల మిలటరీ సాయాన్ని ప్రకటించినందుకు అమెరికాకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కృతజ్ఞతలు తెలిపారు. రష్యాపై పోరు కోసం పాశ్చాత్య దేశాలు ఆయుధ సాయాన్ని వేగవంతం చేయాలని కోరారు.
► యూఎస్ ఉపాధ్యక్షురాలు కమలాహారిస్, మెటా సీఈఓ జుకర్‌బర్గ్ సహా 27 మంది ప్రముఖ అమెరికన్లు తమ దేశంలోకి ప్రవేశించకుండా నిషేధం విధిస్తున్నట్లు రష్యా ప్రకటించింది. రష్యాపై ఆంక్షలకు ప్రతిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
► శాంతి చర్చలు ఆగేందుకు ఉక్రెయినే కారణమని రష్యా విమర్శించింది. తమ ప్రతిపాదనలకు బదులివ్వలేదని రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్ చెప్పారు. ‘‘చర్చలు అవసరం లేనట్లుంది. వారి కర్మకు వారే బాధ్యులు’’ అన్నారు. ఉక్రెయిన్ బృందం చీఫ్‌తో పలుమార్లు చర్చించానని రష్యా ప్రతినిధి మెడిన్‌స్కై శుక్రవారం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment