మార్కెట్లు జూమ్.. ఏసీసీ అదరహో
Published Mon, Apr 24 2017 4:17 PM | Last Updated on Tue, Sep 5 2017 9:35 AM
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం రయ్ మని దూసుకెళ్లాయి. యూరోపియన్ మార్కెట్లు స్ట్రాంగ్ గా ట్రేడవడంతో, మన దేశీయ మార్కెట్లు ర్యాలీ జరిపాయి. 300 పాయింట్లకు పైన ర్యాలీ జరిపిన సెన్సెక్స్ ఆఖరికి 290.54 పాయింట్ల లాభంలో 29,655.84 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం ఏప్రిల్ 12 తర్వాత మొదటిసారి తన కీలక మార్కు 9200 పైన నమోదైంది. 98.55 పాయింట్ల లాభంలో 9217.95 వద్ద క్లోజైంది.
ఫ్రాన్స్ ఎన్నికల తొలి రౌండ్ ఫలితాల్లో ఇమ్మాన్యూల్ మాక్రోన్ గెలిచినట్టు వెల్లడికాగానే, యూరోపియన్ మార్కెట్లు బలపడ్డాయి. యూరోజోన్‌లో రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన ఫ్రాన్స్‌లో రెండు రౌండ్లుగా జరిగే ఈ ఎన్నికల తుది ఫలితాలు మే 11న వస్తాయి. నేడు తొలి రౌండ్ ఫలితాలు వెలువడ్డాయి. ఈ సంకేతాలు మార్కెట్లకు మంచి ఊపునిచ్చాయి. హెచ్ డీఎఫ్సీ బ్యాంకు, హెచ్ డీఎఫ్సీ , రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్ అండ్ టీ కంపెనీల షేర్లు మార్కెట్లకు మద్దతుగా నిలిచాయి.
నిఫ్టీ స్టాక్స్ లో ఎక్కువగా లాభాలార్జించిన కంపెనీగా ఏసీసీ నిలిచింది. ఈ కంపెనీ స్టాక్ 7.5 శాతం మేర దూసుకెళ్లింది. ఆల్ట్రా టెక్ సిమెంట్, గ్రాసిమ్, గెయిల్, అంబుజా సిమెంట్స్, యాక్సిస్ బ్యాంకు, హెచ్ డీఎఫ్సీ బ్యాంకు, ఎల్ అండ్ టీ, మారుతీ సుజుకీలు కూడా లాభాలు పండించాయి. మరోవైపు ఫార్మా దిగ్గజం లుపిన్ స్టాక్ 3.33 శాతం మేర పడిపోయింది. ట్రేడింగ్ ప్రారంభంలో నష్టాలు పాలైన ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు, చివర్లో కొంతమేర కోలుకున్నాయి. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ 15 పైసలు బలపడి 64.46 వద్ద ముగిసింది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 379 రూపాయలు పడిపోయి 29,039గా నమోదయ్యాయి.
Advertisement