2008 పేలుళ్ల కేసులో చార్జిషీట్లు
Published Fri, Apr 4 2014 12:22 AM | Last Updated on Sat, Sep 2 2017 5:32 AM
న్యూఢిల్లీ: రాజధాని నడిబొడ్డున 2008 సెప్టెంబర్ 13న జరిగిన పేలుళ్ల కేసులో ఢిల్లీ పోలీసులు గురువారం వేర్వేరుగా రెండు చార్జిషీట్లు దాఖలు చేశారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం)కు చెందిన యాసిన్ భత్కల్, రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ సహా 29 మంది ఈ ఘటనకు కారకులని ఆరోపించారు. స్పెషల్‌సెల్ పోలీసులు అడిషనల్ సెషన్స్ జడ్జి దయాప్రకాశ్‌కు వీటిని సమర్పించారు. ఈ రెంటినీ 19న పరిశీలిస్తామని ఆయన ప్రకటించారు. 2008లో కన్నాట్‌ప్లేస్, గ్రేటర్ కైలాష్, కరోల్‌బాగ్‌లో జరిగిన వరుస పేలుళ్లలో 21 మంది మరణించగా, 135 మందికి గాయాలయ్యాయి. యాసిన్, ఇతని ముఖ్య అనుచరుడు అసదుల్లా అఖ్తర్ ఈ ఘటనకు సూత్రదారులని పోలీసులు ఆరోపించారు. వీరి కథనం ప్రకారం.. యాసిన్, అఖ్తర్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు గత ఆగస్టులో ఇండో-నేపాల్ సరిహద్దులో అరెస్టు చేశారు.
పాక్‌లో ఉంటున్న రియాజ్ ఆదేశాల మేరకు నిందితులు ఈ దాడులకు పాల్పడ్డారు. రియాజ్, అతని అనుచరుల అనుపానుల గురించి ఐఎం సభ్యులు తెహసీన్ అఖ్తర్, వకాస్‌ను ప్రశ్నిస్తున్నారు. వీరితోపాటు మహ్మద్ షకీల్, మహ్మద్ సైఫ్, జీషన్ అహ్మద్, జియా ఉర్ రెహమాన్, ఆసిఫ్ బషీరుద్దీన్, సాకిబ్ నిసార్, మహ్మద్ సాదిక్, ఖయాముద్దీన్ కపాడియా, మహ్మద్ హకీమ్, మహ్మద్ మన్సూర్ అస్గర్ పీర్‌బాయ్, ముబిన్ అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, షెహజాద్ తదితరుల పేర్లను చార్జిషీట్లలో చేర్చారు. ఈ కేసుల్లో ఇప్పటికే ప్రాసిక్యూషన్ 200 మంది సాక్షులను హాజరుపర్చింది.
ఢిల్లీపై తాజా దాడులకు యత్నించిన ఐఎం
ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) అగ్రనాయకుడు తెహసీన్ అఖ్తర్ అలియాస్ మోనూ, అనుచరుల సాయంతో దేశరాజధానిపై బాంబుదాడులకు యత్నించాడని ఢిల్లీ పోలీసులు కోర్టుకు గతవారం తెలిపారు. పశ్చిమబెంగాల్ డార్జిలింగ్ జిల్లా సమీపంలోని నేపాల్ సరిహద్దుల్లో ఇతణ్ని ఈ నెల 25న అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మోనూ దాడులకు పాల్పడ్డాడని స్పెషల్‌సెల్ పోలీసులు పేర్కొన్నారు. ఢిల్లీపై దాడులకు యత్నిస్తున్న సమయంలోనే తమకు చిక్కాడని ప్రకటించారు. ఇండియన్ ముజాహిదీన్ దేశంలో మతసామరస్యాన్ని నిర్మూలించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పాక్ జాతీయుడు జియా ఉర్ రెహమాన్ అలియాస్ వకాస్, మోనూ ఒకేచోట ప్రశ్నించాల్సి ఉందని కూడా తెలియజేశారు. ఐఎం వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ అరెస్టు తరువాత, మోనూయే ఈ సంస్థకు నేతృత్వం వహిస్తున్నారని విశదీకరించారు. గత ఏడాది బుద్ధగయ, పాట్నాలో జరిగిన పేలుళ్ల కేసులోనూ ఇతను కీలక నిందితుడని జాతీయ దర్యాప్తు సంస్థ వ ర్గాలు తెలిపాయి.
Advertisement
Advertisement