టెహ్రాన్: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆచూకీని రక్షణ బలగాలు గుర్తించాయి. ట్రాఫిజ్ నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండ ప్రాంతంలో హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైన స్థలాన్ని డ్రోన్ ద్వారా గుర్తించారు అధికారులు. ప్రస్తుతం 73 రెస్క్యూ టీంలు అక్కడికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే కొండ ప్రాంతం కావడం, భారీ వర్షాలు పడుతుండడం, దట్టమైన పొగమంచుతో ఆ ప్రాంతానికి చేరుకోవడం ఇబ్బందిగా మారిందని అధికారులు చెబుతున్నారు.
టర్కిష్ టెక్నాలజీ ఆధారిత డ్రోన్‌తో సెర్చ్ ఆపరేషన్‌ను ఇరాన్ లైవ్ టెలికాస్ట్ చేసింది. కొండ ప్రాంతంలో హెలికాఫ్టర్ కూలి.. పేలిపోయి ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిన్నటి నుంచి సహాయక చర్యలు కొనసాగిస్తూనే ఉన్నాయి ఇరాన్ త్రివిధ దళాలు.
అయితే ప్రతికూల వాతావరణం కారణంగా సహాయక చర్యలు నెమ్మదిగా సాగుతున్నాయి. రాత్రి సైతం నైట్ విజన్ హెలికాఫ్టర్‌లతో సోదాలు జరిగాయి. వాతావరణం వర్షం కారణంగా సహకరించకపోవడంతో గగన తల సెర్చ్ ఆపరేషన్ నిలిపివేశారు. దీంతో బలగాలు గ్రౌండ్ లెవల్‌లో సెర్చ్ ఆపరేషన్‌ను ముమ్మరం చేశాయి.
AKINCI İHA, İran semalarında İran Cumhurbaşkanı Reisi ve heyetini arama kurtarma çalışmalarına destek veriyor https://t.co/ovXnx13UcY
— AA Canlı (@AACanli) May 19, 2024
ఇంకోవైపు.. రైసీ క్షేమంగా తిరిగొస్తారని ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా ఖమేనీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ అధ్యక్షుడి క్షేమ సమాచారం కోసం ప్రపంచదేశాలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి. హెలికాప్టర్ ప్రమాదంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. రైసీ సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. అయితే ప్రమాద తీవ్రతపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు రైసీ క్షేమంగా తిరిగిరావాలని యావద్దేశం చేస్తున్న ప్రార్థనలు ఫలించేలా కనిపించడం లేదు.
ఆదివారం ఓ అధికారిక కార్యక్రమంలో ఇబ్రహీం రైసీ పాల్గొన్నారు. ఇరాన్-అజర్‌బైజాన్ దేశాల సరిహద్దుల్లో కిజ్ కలాసీ, ఖొదావరిన్ అనే రెండు డ్యాంలను.. అజర్‌బైజాన్ అధ్యక్షుడు ఇల్హమ్ అలియేవ్‌తో కలిసి రైసీ ఆదివారం వాటిని ప్రారంభించారు. అనంతరం ఇరాన్ ఆర్థిక మంత్రి హొస్సేన్ అమీరబ్దొల్లహియన్, తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్సు గవర్నర్, తబ్రిజ్ ప్రావిన్సు ఇమామ్‌లతో కలిసి తబ్రిజ్ పట్టణానికి హెలికాప్టర్‌లో ప్రయాణమయ్యారు. మరో రెండు హెలికాప్టర్లూ వెంట బయలుదేరాయి.
జోల్ఫా నగర సమీపంలోకి రాగానే.. రైసీ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ప్రతికూల వాతావరణం కారణంగా ప్రమాదానికి గురైంది. హెలికాప్టర్ కూలిపోయిందని ఎక్కువ వార్తాసంస్థలు పేర్కొన్నాయి. ఇరాన్ ప్రభుత్వరంగ మీడియా మాత్రం ప్రమాదాన్ని ధృవీకరించకుండా వస్తోంది. ఆయన వెంట బయలుదేరిన మిగతా రెండు హెలికాఫ్టర్లు మాత్రం సురక్షితంగా ల్యాండయ్యాయి. ప్రతికూల వాతావరణం కారణంగానే ప్రమాదం జరిగిందనే ప్రాథమిక అంచనాలు ఉన్నప్పటికీ.. మరోవైపు ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న ఈ హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకోవడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment