ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అజర్‌బైజాన్ సరిహద్దు సమీపంలోని పర్వత ప్రాంతంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. ఈ వార్తలు వెలువడిన వెంటనే చమురు ఎక్కువ ఉత్పత్తి చేసే మధ్యప్రాచ్య ప్రాంతంలో రాజకీయ అనిశ్చితి మధ్య బంగారం ఆల్-టైమ్ హైని తాకింది. ముడి చమురు ధరలు పెరిగిపోయాయి.
బంగారం ధరలపై ప్రభావం
ఇరాన్ అధ్యక్షుడి మరణ వార్తల తర్వాత సోమవారం బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. గ్లోబల్ అనిశ్చితుల మధ్య సాధారణంగా బంగారం ధరలు పెరుగుతాయి. ఎందుకంటే ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడి మార్గంగా భావిస్తారు. 0811 జీఎంటీ అంటే భారతీయ కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 1:41 గంటల సమయానికి స్పాట్ బంగారం ఔన్సు ధర 1 శాతం పెరిగి 2,438.44 డాలర్లకు చేరుకుంది.
అంతకుముందు సెషన్‌లో రికార్డు గరిష్ట స్థాయి 2,449.89 డాలర్లను తాకింది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 1.1 శాతం పెరిగి 2,442.60 డాలర్లకు చేరుకుంది. వెండి కూడా 11 సంవత్సరాల కంటే ఎక్కువ గరిష్ట స్థాయికి చేరుకుంది.
ముడి చమురు ధరలు
ఇరాన్ అధ్యక్షుడు రైసీ హెలికాప్టర్ క్రాష్ నివేదికలు వచ్చిన వెంటనే ప్రధాన చమరు ఉత్పత్తి దేశాలలో రాజకీయ అనిశ్చితి మధ్య అంతర్జాతీయ ముడి చమురు ధరలు సోమవారం లాభాలను పొడిగించాయి. ఆరోగ్యంతో సమస్యల కారణంగా సౌదీ అరేబియా యువరాజు జపాన్ పర్యటనను రద్దు చేసుకోవడం కూడా చమురు ధరల పెరుగుదలకు కారణమైనట్లుగా తెలుస్తోంది.
భారత కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 12:02 గంటల సమయానికి బ్రెంట్ బ్యారెల్‌కు 41 సెంట్లు లేదా 0.5 శాతం పెరిగి 84.39 డాలర్లకు చేరుకుంది, అంతకుముందు 84.43 డాలర్లకి పెరిగింది. మే 10వ తేదీ తర్వాత ఇదే అత్యధికం.
Comments
Please login to add a commentAdd a comment