
పది నెలల నుంచి పోస్టింగులు ఇవ్వకుండా వేధింపులు
వీరిలో నలుగురు ఐపీఎస్‌లు, నలుగురు నాన్‌క్యాడర్ ఎస్పీలు
అదనపు ఎస్పీల నుంచి సీఐల దాక మరో 191 మంది బాధితులే
మంచి అధికారులను పక్కనపెట్టి.. ఉన్నవారితో రెడ్ బుక్ కుట్రలు
దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా బరితెగింపు
నాలుగో సింహంను నానా ఇబ్బందులు పెడుతున్న సర్కారు
199 మంది పోలీసు అధికారులపై ప్రభుత్వం కక్షసాధింపు
అందరూ సర్కిల్ ఇన్‌స్పెక్టర్, ఆపై స్థాయి అధికారులే..!
జీతాలు ఇవ్వకుండా సతాయింపు.. కక్షపూరిత సస్పెన్షన్లు అదనం
కుట్రలు పన్ని అయిదుగురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్
టీడీపీ కూటమి పెద్దల పైశాచికత్వం.. శాంతిభద్రతలు అస్తవ్యస్తం
ఓవైపు వేటు వేసి.. మరోవైపు కొత్తవారు కావాలంటూ కేంద్రానికి లేఖలు
టీడీపీ కూటమి పెద్దల పైశాచికత్వం..శాంతిభద్రతలు అస్తవ్యస్తం
ఓవైపు వేటు వేసి.. మరోవైపు కొత్తవారు కావాలంటూ కేంద్రానికి లేఖలు ‘రెడ్‌బుక్ కుట్ర’కు సెల్యూట్ చేస్తేనే పోస్టింగ్... నిబంధనలు పాటిస్తాం అంటే మాత్రం నో పోస్టింగ్’ తాము చెప్పినవారిని వేటాడితేనే పోస్టింగ్.. విధులు నిక్కచ్చిగా నిర్వర్తిస్తాం అంటే మాత్రం నో పోస్టింగ్.. పచ్చ చొక్కాలు తొడుక్కొని టీడీపీ కార్యకర్తలుగా పనిచేస్తామంటేనే పోస్టింగ్.. ఖాకీ చొక్కా వేసుకున్నాం కదా .. చట్టం ముందు అందరూ సమానం అంటే మాత్రం నో పోస్టింగ్..ఇదీ పోలీసు శాఖపై చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారికంగా అమలు చేస్తున్న దుర్నీతి.
సాక్షి, అమరావతి: సీనియర్ అధికారులను.. వెంటాడి వేటాడి పోస్టింగ్‌లు ఇవ్వకుండా మనో వ్యథకు గురిచేస్తూ.. మంచి అధికారులను కుట్రలు చేసి పక్కనపెట్టి పాలన సాగిస్తూ.. ఉన్న అధికారులను రెడ్ బుక్ రూల్ కోసం వాడుకుంటోంది చంద్రబాబు ప్రభుత్వం. శాంతిభద్రతల పరిరక్షణకు ఉద్దేశించిన పోలీసు వ్యవస్థతో ఆడుకుంటోంది. రాజకీయ స్వార్థంతో భ్రషు్టపట్టిస్తోంది. ఏ పార్టీ అధికారంలో ఉందన్నదీ సంబంధం లేకుండా విధులు నిర్వర్తించే పోలీసులపై కక్ష కట్టి వేధిస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన 10 నెలల తర్వాత కూడా రాష్ట్రంలో ఏకంగా 199 మంది పోలీస్ అధికారులకు పోస్టింగులు లేవంటే రెడ్ బుక్ కుట్ర ఏస్థాయిలో ఉందో తెలుస్తోంది.
⇒ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అంటే పోలీస్ శాఖలో హోదా ఉన్న అధికారే. అయితే, చంద్రబాబు ప్రభుత్వ వేధింపులకు బలైనవారిలో అందరూ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆపై స్థాయి అధికారులే కావడం గమనార్హం. మొత్తంగా చూస్తే నలుగురు ఐపీఎస్‌లు, నలుగురు నాన్ క్యాడర్ ఎస్పీలు, 27 మంది అదనపు ఎస్పీలు, ఒక ఏపీఎస్పీ కమాండెంట్, 42 మంది డీఎస్పీలు (సివిల్), ఇద్దరు ఏపీఎస్పీ డీఎస్పీలు, 119 మంది సీఐలు ఉండడం గమనార్హం. వీరందరికీ పోస్టింగులు ఇవ్వలేదని సాక్షాత్తు రాష్ట్ర శాసనసభకు ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు ఇంతమంది పోలీసు అధికారులను వెయిటింగ్‌లో ఉంచడం దేశ చరిత్రలోనే లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక కక్షపూరితంగా ఐదుగురు ఐపీఎస్‌లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది కూడా.
వెయిటింగ్‌లో నలుగురు ఐపీఎస్‌లు
2024 జూన్‌లో అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు ప్రభుత్వం పోలీసు అధికారులపై కక్షసాధింపు చర్యలకు తెగించింది. 24 మంది ఐపీఎస్‌లకు పోస్టింగులు ఇవ్వకుండా పక్కనపెట్టింది. అధికారంలో ఉన్న పార్టీలతో నిమిత్తం లేకుండా ప్రభుత్వ విధానాలను అమలు చేసే ఐపీఎస్‌పై ప్రతాపం చూపించింది. ఐదు నెలల తరువాత దశలవారీగా కొందరు ఐపీఎస్‌లకు అదీ అప్రాధాన్యమైన పోస్టింగులు ఇచ్చింది. కానీ, నేటికీ నలుగురిని వెయిటింగ్‌లోనే ఉంచింది. సీనియర్ ఐపీఎస్‌లు కొల్లి రఘురామ్‌రెడ్డి, రిషాంత్‌రెడ్డి, రవిశంకర్‌రెడ్డి, జాషువాలు అందుబాటులో ఉన్నా సరే వారి సేవలను వినియోగించుకోవడం లేదన్నది సుస్పష్టం.
కుట్ర పన్ని.. కక్షకట్టి
రెడ్‌బుక్ కుట్రతో ఐదుగురు ఐపీఎస్‌లపై చంద్రబాబు ప్రభుత్వం కక్షకట్టింది. సీనియర్ ఐపీఎస్‌లు పీఎస్‌ఆర్ ఆంజనేయులు, పీవీ సునీల్‌కుమార్, ఎన్.సంజయ్, టి.కాంతిరాణా, విశాల్ గున్నీలను సస్పెండ్ చేసింది. వలపు వల విసిరి బడా బాబులను బ్లాక్‌మెయిలింగ్ చేయడమే పనిగా పెటు్టకున్న కాదంబరి జత్వానీ అనే ముంబై మోడల్‌తో తప్పుడు ఫిర్యాదు ఇప్పించి మరీ పీఎస్‌ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్నీలను సస్పెండ్ చేయడం అందర్నీ విస్మయపరిచింది.
⇒ చంద్రబాబు రాజగురువు రామోజీరావు కుటుంబానికి చెందిన మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలను వెలికితీశారనే కక్షతోనే ఎన్.సంజయ్‌పై అక్రమ కేసులు బనాయించి సస్పెండ్ చేశారు. కేవలం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కళ్లల్లో ఆనందం చూడడం కోసం డీజీ పీవీ సునీల్‌కుమార్‌ను వివరణ కూడా కోరకుండా ఏకపక్షంగా సస్పెండ్ చేసింది. సుప్రీంకోర్టు ఇప్పటికే తిరస్కరించిన అభియోగాలపై ఆయనను సస్పెండ్ చేయడం చంద్రబాబు ప్రభుత్వ బరితెగింపునకు నిదర్శనం.

తమ కుట్రల అమలు కోసం కేంద్రానికి లేఖలు
ఉన్న అధికారులనేమో వేధిస్తూ.. తమకు మరో ముగ్గురు ఐపీఎస్‌లు కావాలంటూ కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు ప్రభుత్వం లేఖ రాసింది. మరీ ముఖ్యంగా యూపీ కేడర్‌లో పనిచేస్తున్న అధికారి కోసం పట్టుబడుతోంది. ఆయనైతే తమ కుట్రల అమలుకు, ప్రత్యర్థులను వేటాడేందుకు సమర్థంగా ఉపయోగించుకోవచ్చని భావిస్తోంది. అయితే, డిప్యూటేషన్ నిబంధనలు అనుమతించకపోవడంతో కేంద్రం నుంచి స్పందన రాలేదు.
కీలకమైనప్పటికీ..
శాంతిభద్రతల పరిరక్షణలో కీలకంగా వ్యవహరించే క్షేత్రస్థాయి పోలీసులను కూడా చంద్రబాబు సర్కారు వేధిస్తోంది. నాన్ క్యాడర్ ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు కలిపి మొత్తం 195 మందికి కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి పోస్టింగులు ఇవ్వకపోవడమే దీనిని నిదర్శనం. పాలనాపరమైన అంశాలతో నలుగురైదుగురిని స్వల్ప కాలం వెయిటింగ్‌లో ఉంచడం సాధారణం. తర్వాత ఏదో ఒక పోస్టులో నియమించి వారి సేవలను సద్వినియోగం చేసుకోవడం రివాజు.
ఈ సంప్రదాయాలను చంద్రబాబు ప్రభుత్వం కాలరాసింది. ఇలా పక్కనపెట్టినవారిలో నాన్ క్యాడర్ ఎస్పీలు పి.సత్తిబాబు, పి.వెంకటరత్నం, బి.లక్ష్మీనారాయణ, ఎ.సురేశ్‌బాబు ఉన్నారు. 27 మంది అదనపు ఎస్పీలు, ఒక ఏపీఎస్పీ కమాండెంట్, 42 మంది డీఎస్పీలు (సివిల్), ఇద్దరు ఏపీఎస్పీ డీఎస్పీలు, 119 మంది సీఐలనూ వెయిటింగ్‌లో పెట్టింది.
జీతాలివ్వకుండా ‘పచ్చ’ పైశాచికత్వం
ఏకంగా 199 మంది పోలీసులకు పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తూ చంద్రబాబు ప్రభుత్వం పైశాచిక ఆనందాన్ని పొందుతోంది. వెయిటింగ్‌లో ఉన్నారని చెప్పి వీరికి 10 నెలలుగా జీతభత్యాలు ఇవ్వడం లేదు. ఆర్ధికంగా పోలీసు అధికారులు ఇబ్బందులు పడుతూ ఉంటే టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలు పైశాచిక ఆనందం పొందుతున్నారని ఉద్యోగ సంఘాలు విమర్శిస్తున్నాయి. రాష్ట్రంలో పోలీసు అధికారులు ఇంతటి దారుణ పరిస్థితులు గతంలో ఎప్పుడూ ఎదుర్కోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.