గుండె గు‘బిల్లు’ | Chandrababu TDP Govt Power Charges increased by more than 50 percent | Sakshi
Sakshi News home page

గుండె గు‘బిల్లు’

Published Thu, Apr 17 2025 4:38 AM | Last Updated on Thu, Apr 17 2025 7:19 AM

Chandrababu TDP Govt Power Charges increased by more than 50 percent

వినియోగదారులను బెంబేలెత్తిస్తున్న కరెంట్‌ చార్జీల భారం

2024 జనవరి, ఫిబ్రవరి, మార్చితో పోల్చితే..  ఈ ఏడాది దాదాపు 50 శాతానికిపైగా పెరిగిన చార్జీలు  

వినియోగానికి, వచ్చిన బిల్లులకు పొంతన లేక జనం షాక్‌ 

ఎన్నికల ముందు అసలు పెంచబోనని.. ఇంకా తగ్గిస్తామని చంద్రబాబు వాగ్దానం 

అధికారంలోకి వచ్చాక ప్రజలపై ఏకంగా రూ.15,485.36 కోట్ల చార్జీల భారం

‘ఓట్లేయ్యండి తమ్ముళ్లూ..! మేం  అధికారంలోకి వస్తే విద్యుత్‌ చార్జీలు పెంచం..! పైగా తగ్గిస్తాం..!  నేను గ్యారెంటీ..!’ అంటూ ఎన్నికల ముందు హామీలిచ్చిన సీఎం చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే విద్యుత్‌పై శ్వేతపత్రం విడుదల చేసి ‘చార్జీలు పెంచనని నేనెప్పుడు చెప్పా?’ అంటూ మాట మార్చేశారు. ఎడాపెడా విద్యుత్‌ షాక్‌లిస్తున్నారు.  

ఎండలకు తాళలేక ఇంట్లో ఫ్యాన్‌ కింద సేదతీరుదామనుకుంటున్నారా..?కూలర్‌ దగ్గర కాసేపు చల్లగా గడుపుదామనుకుంటున్నారా..? కరెంట్‌ కోతలు.. ఉక్కపోత భరించలేక చెట్టు కింద ప్రశాంతంగా కూర్చున్నారా? కానీ మీరు ఏం చేసినా కరెంట్‌ షాక్‌లు మాత్రం ఖాయం..!!ఎందుకంటే.. అసలు కరెంట్‌ వాడకున్నా.. ఇళ్లకు తాళాలు వేసినా సరే.. కరెంట్‌ చార్జీలు మాత్రం చుర్రుమంటున్నాయి! మండుతున్న ఎండలతోపాటే బిల్లులూ భగ్గుమంటున్నాయి! టీడీపీ కూటమి సర్కారు కరెంట్‌ చార్జీల బాదుడే బాదుడు కొనసాగుతోంది!!

సాక్షి, అమరావతి: ‘ఓట్లేయ్యండి తమ్ముళ్లూ..! మేం అధికారంలోకి వస్తే విద్యుత్‌ చార్జీలు పెంచం..! పైగా తగ్గిస్తాం..! నేను గ్యారెంటీ..!’ అంటూ ఎన్నికల ముందు హామీలిచ్చిన సీఎం చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే విద్యుత్‌పై శ్వేతపత్రం విడుదల చేసి ‘చార్జీలు పెంచనని నేనెప్పుడు చెప్పా?’ అంటూ మాట మార్చేశారు. ఎడాపెడా విద్యుత్‌ షాక్‌లిస్తు­న్నారు. ఏడాది వ్యవధిలో పెరిగిపోయి భగ్గుమంటు­న్న బిల్లులే ఇందుకు నిదర్శనం. సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఏకంగా రూ.15,485.36 కోట్ల విద్యుత్తు భారాన్ని ప్రజలపై మోపారు. 

గతే­డాది చివరి నుంచే రూ.6,072.86 కోట్ల చార్జీల భా­రాన్ని వసూలు చేస్తుండగా ఈ ఏడాది జనవరి బిల్లుల నుంచి మరో రూ.9,412.50 కోట్ల బాదుడు మొదలైంది. గతేడాదితో పోలిస్తే రెట్టింపు చార్జీలతో బిల్లులు జారీ అవుతున్నాయి. అసలే కూటమి ప్రభు­త్వం అధికారంలోకి వచ్చాక నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతుండగా దానికి తోడు విద్యుత్‌ చార్జీలు పెంచడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వాడుకున్న విద్యుత్తుకు, వస్తున్న బిల్లులకు ఏమాత్రం పొంతన లేకపోవడంతో ఇదెక్కడి దారుణమని మండిపడుతున్నారు. 

చార్జీల భారం మోపని గత ప్రభుత్వం..
వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉండగా ఐదేళ్ల పాటు విద్యుత్‌ చార్జీలు పెంచకుండా ప్రజలకు ఊరట కల్పించింది. వ్యవసాయ అవసరాలకు పెద్ద పీట వేస్తూ 9 గంటల పాటు పగటిపూట నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను సరఫరా చేసింది. 6,663 వ్యవసాయ విద్యుత్తు ఫీడర్ల సామర్థ్యాన్ని పెంచేందుకు రూ.1,700 కోట్లు వ్యయం చేసింది. 

గతంలో టీడీపీ సర్కారు రైతులకు ఎగ్గొట్టిన రూ.8,845 కోట్ల ఉచిత విద్యుత్‌ బకాయిలను సైతం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే చెల్లించింది. వివిధ వర్గాల పేదలకు ఉచితంగా, రాయితీతో విద్యుత్‌ను అందచేసింది. రాష్ట్రంలోని 2 కోట్ల మంది విద్యుత్‌ వినియోగదా­రులపై ఎలాంటి విద్యుత్‌ చార్జీల భారం లేకుండా టారిఫ్‌ ఆర్డర్‌ను ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఆమోదించేలా నాడు వైఎస్‌ జగన్‌ టారిఫ్‌ భారాలను సైతం భరించారు.

పొంతన లేని బిల్లులు
కర్నూలు జిల్లా కల్లూరు సెక్షన్‌ పరిధిలో నివసించే ఎస్‌.శిరీష ఈ ఏడాది ఫిబ్రవరిలో 125 యూనిట్ల విద్యుత్‌ను వినియోగించారు. ఈ లెక్కన ఆమెకు రావాల్సిన బిల్లు రూ.489.50 మాత్రమే. కానీ వచ్చిన బిల్లు మాత్రం ఏకంగా రూ.850. అంటే రూ.361 మేర కరెంట్‌ చార్జీ పెరిగింది.

చిత్తూరుకి చెందిన జేజులరెడ్డి (సర్వీసు నంబర్‌ 3457) ఇంట్లో రెండు ఫ్యాన్లు, మూడు ట్యూబ్‌లైట్లు, టీవీ, కూలర్‌ ఉన్నాయి. కరెంట్‌ బిల్లులను పరిశీలిస్తే గతేడాదికి, ఇప్పటికి భారీ వ్యత్యాసం ఉంది. గతేడాది మార్చిలో 177 యూనిట్లకుగానూ ఆయనకు రూ.1,015 బిల్లు వచ్చింది. యూనిట్‌కు రూ.5.74 చార్జీ పడింది. ఈ ఏడాది మార్చిలో 563 యూనిట్లకు రూ.4,584 బిల్లు వేశారు. యూనిట్‌కు ఏకంగా రూ.8.14 వసూలు చేశారు. రూ.1,335.49 
అదనంగా బిల్లు రావడంతో వినియోగదారుడు 39 శాతం అధిక భారం భరించాల్సి వచ్చింది.

‘ఈ ఏడాది కరెంటు బిల్లులు భారీగా పెరిగాయి. గతేడాది జనవరిలో 124 యూనిట్లు వాడినందుకు రూ.657 బిల్లు వచ్చింది. అంటే యూనిట్‌ రూ.5.29 పడింది. అదే ఈ ఏడాది జనవరిలో 165 యూనిట్లు వాడినందుకు ఏకంగా రూ.1,271 బిల్లు కట్టమంటున్నారు. యూనిట్‌కు రూ.7.70 వసూలు చేస్తున్నారు. కరెంట్‌ చార్జీ ఏకంగా రూ.614 పెరిగింది.’ – ఎం.సిలార్, మచిలీపట్నం

‘‘పదేళ్లుగా పిండి మిల్లు నిర్వహిస్తూ బతుకుతున్నాం. గత ఏడాది నవంబర్‌లో నెలకు రూ.4,881  మాత్రమే ఉన్న కరెంటు బిల్లు ఈ ఏడాది మార్చిలో ఒక్కసారిగా రూ.13,440 కు పెరిగింది. మేం అప్పుడు ఇప్పుడూ ఒకేలా వాడుతున్నాం. అయినా ఎందుకు అంతంత బిల్లు వస్తోందో అంతు­బట్టడం లేదు. ఇలాగైతే పిండి మిల్లు మూతపడి మా కుటుంబం రోడ్డు పాలవుతుంది’’     
–రేలంగి వెంకటలక్ష్మి, వికేరాయపురం, కాకినాడ జిల్లా.

వాడకం తగ్గినా.. బిల్లు పెరిగింది
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఉంటున్న సువ్వారి జగదీష్‌ ఇంటికి 2024 మార్చిలో 216 యూనిట్లకు గానూ రూ.1,108 బిల్లు వచ్చింది. అంటే యూనిట్‌కు రూ.5.12 పడింది. ఇదే వినియోగదారుడు ఈ ఏడాది మార్చిలో 171 యూనిట్లు వినియోగించారు. దాని ప్రకారం రూ.875.52 మాత్రమే బిల్లు రావాలి. వినియోగం తగ్గినప్పుడు సాధారణంగా బిల్లు కూడా తగ్గాలి. కానీ అందుకు భిన్నంగా బిల్లు పెరిగి రూ.1,286 వచ్చింది. గతేడాది ధర (టారిఫ్‌)ల్లో ఏ మార్పూ జరగలేదని, చార్జీలు పెంచలేదని కూటమి ప్రభుత్వం చెబుతున్నా కరెంటు బిల్లు మాత్రం భారీగా పెరిగింది.

వాడకున్నా వాతలే..!
‘‘ఈ చిత్రంలో కనిపిస్తున్న మసీదు జిలానీ గుంటూరు జిల్లా మేడికొండూరులోని ఇంటిలో కొద్ది నెలలుగా నివసించడం లేదు. కానీ 2 యూనిట్ల విద్యుత్‌ వినియోగా­నికి రూ.182 చార్జీ పడింది. తాను అసలు విద్యుత్‌ వాడనే లేదని జిలానీ మొత్తుకుంటున్నారు.

కొందరు సొంత ఇంటిని వదిలి కుటుంబంతో దూర ప్రాంతాల్లో గడుపుతుంటారు. ఖాళీగా ఉన్న ఇళ్లలో విద్యుత్‌ వినియోగం ఉండదు. అయినా సరే అలాంటి నివాసాలకు జీరో యూనిట్‌ కింద రూ.91 బిల్లు పంపుతున్నారు. విద్యుత్‌కు సైతం వడ్డన తప్పడం లేదు.

మాట మార్చారు.. మాట తప్పారు
విద్యుత్‌ చార్జీలపై ఎన్నికల ముందు ప్రతి చోటా మైకు పట్టుకుని చంద్రబాబు మాట్లాడిన మాటలకు, అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన చేస్తున్న పనులకు పొంతన లేదు. అధికారంలోకి వస్తే విద్యుత్‌ చార్జీలు పెంచేది లేదని,అవసరమైతే వినియోగదారులే విద్యుత్‌ను అమ్ముకునేలా చేస్తామని ప్రగల్భాలకు అర్ధమే లేదు. 


అధికారం చేపట్టి ఐదు నెలలు కాకుండానే విద్యుత్‌ చార్జీలపై ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలేసి చార్జీల బాదుడుకు శ్రీకారం చుట్టారు. విద్యుత్‌పై శ్వేతపత్రం విడుదల చేసిన రోజే ‘చార్జీలు పెంచమని నేనెప్పుడు చెప్పాను’ అంటూ మాట మార్చేశారు. తాజాగా దీపావళి కానుకగా రాష్ట్ర ప్రజలపై రూ.6072.86 కోట్ల భారం వేశారు. ఈ నేపధ్యంలో చంద్రబాబు గతంలో విద్యుత్‌ చార్జీలపై మాట్లాడిన మాటల్లో మచ్చుక్కి కొన్ని..

16 ఫిబ్రవరి 2023, పెద్దాపురం 
తమ్ముళ్లూ..ఏడు సార్లు కరెంటు చార్జీలు పెంచారా లేదా. ఏవమ్మా ఆడబిడ్డలూ మీరు చెప్పండి. నేనున్నప్పుడు కరెంటు చార్జీలు పెంచానా? లోటు బడ్జెట్‌ ఉన్నా కరెంటు చార్జీలు పెంచకుండా పరిపాలన సాగించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. 

27 మే 2020,టీడీపీ మహానాడు
కరెంటు చార్జీలు ఎవరూ కట్టే పరిస్థితి
లేకపోతే కరెంటు చార్జీలు పెంచమని చెప్పాం. ఐదు సంవత్సరాలు కరెంటు చార్జీలు పెంచలేదు.టెక్నాలజీ ఉపయోగించాం. సోలార్‌ ఎనర్జీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం.దానివల్ల రాబోయే రోజుల్లో రేట్లు తగ్గించే దిశగా మనం ముందకు వెళితే మీరు(జగన్‌) పవర్‌ రేట్లు పెంచారు. రైతులకు కూడా కరెంటు చార్జీలు పెంచే పరిస్థితికి వస్తున్నారు. ఇది క్షమించరాని నేరం.

19 మార్చి 2019, కడప
కరెంటు కొరత 2004లో లేదు. 2014లో అది 22.5 మిలియన్‌ యూనిట్లు. నేను గర్వంగా చెప్పగలను. రెండు నెలల్లో కరెంటు కొరత లేకుండా చేశాను. కరెంటు చార్జీలు పెంచమన్నాం. వ్యవసాయానికి 9 గంటలు కరెంటు ఇస్తున్నాం. ఇళ్లకు 24 గంటలు ఇస్తున్నాం. భవిష్యత్తులో ఎంత కావాలంటే అంత కరెంటు ఇచ్చి రేట్లు పెంచకుండా ముందుకు పోయే ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని మీకు తెలియజేస్తున్నా.  

2 ఆగష్ట్‌ 2023, పులివెందుల
కరెంటు పెంచను, తగ్గిస్తా. ఇప్పటికి ఎనిమిది సార్లు కరెంటు చార్జీలను జగన్‌ పెంచారు. రాబోయే ఐదు సంవత్సరాల్లో కరెంటు చార్జీలు పెంచను. మీరే కరెంటు ఉత్పత్తి చేసుకుని, మీరే వినియోగించుకునే పరిస్థితి తీసుకువస్తా. గ్రిడ్‌కు కనెక్ట్‌ చేసి మిగులు విద్యుత్‌ను 
వినియోగదారులే అమ్ముకునేలా చేస్తా.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement