
రాజధాని విస్తరణ పేరుతో తీసుకునేందుకు సర్కారు సన్నాహాలు
ప్రభుత్వ భూమితో కలిపి ఇప్పటికే సర్కారు చేతిలో 53,749 ఎకరాలు
వెరసి దాదాపు లక్ష ఎకరాలు అమరావతి నిర్మాణం కోసం..
ఐఆర్‌ఆర్, ఓఆర్‌ఆర్‌కి అనుబంధంగా భూముల సేకరణ
అంతర్జాతీయ విమానాశ్రయం, స్టేడియాల పేరుతో తీసుకునేందుకు కసరత్తు
తుళ్లూరు, అమరావతి, తాడికొండ, మంగళగిరి మండలాల్లో మరిన్ని గ్రామాల్లోని భూములపై కన్ను
తమ జీవనోపాధికి ఎసరుపై రైతుల్లో ఆందోళన
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పెద్దల భూ దాహం తీరడం లేదు. రైతులు కాళ్లావేళ్లా పడుతున్నా హృదయం కరగడం లేదు! ఇప్పటికే రాజధాని పేరుతో అమరావతిలో ఏకంగా 53 వేలకుపైగా ఎకరాలను తీసుకోగా ఇప్పుడు మరో 44 వేల ఎకరాలకుపైగా భూమిని హస్తగతం చేసుకునేందుకు టీడీపీ కూటమి సర్కారు సన్నాహాలు చేస్తోంది. వెరసి దాదాపు లక్ష ఎకరాలను అమరావతి నిర్మాణం కోసం వినియోగించనున్నట్లు స్పష్టమవుతోంది.
నాలుగు మండలాల పరిధిలో...
రాజధాని పేరుతో ఏటా మూడు వాణిజ్య పంటలు పండే ఎంతో సారవంతమైన భూములను రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ ద్వారా గతంలోనే 34,568 ఎకరాలను టీడీపీ సర్కారు తీసుకుంది. ఇది కాకుండా ప్రభుత్వ భూములతో కలిపి మొత్తం 53,749 ఎకరాలను రాజధాని కోసం ఇప్పటికే సమీకరించారు. అయితే ఇది ఇంకా సరిపోదంటూ రాజధాని విస్తరణ పేరుతో మరో 44,676 ఎకరాలను సమీకరించేందుకు చంద్రబాబు ప్రభుత్వం తాజాగా కసరత్తు ప్రారంభించింది. తుళ్లూరు, అమరావతి, తాడికొండ, మంగళగిరి మండలాల్లోని పలు గ్రామాల పరిధిలో వేల ఎకరాలను సమీకరించే లక్ష్యంతో అడుగులు వేస్తోంది.
‘రియల్’ వ్యాపారిలా మారిపోయి...
రాష్ట్ర విభజన అనంతరం అధికారం చేపట్టిన చంద్రబాబు ల్యాండ్ పూలింగ్ పేరుతో రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి వేల ఎకరాలను తీసుకుని ఐదేళ్ల పాటు తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక హైకోర్టు పేరుతో కాలక్షేపం చేశారు. తమ నుంచి బలవంతంగా భూములు తీసుకోవద్దని పేద రైతులు వేడుకున్నా కనికరించలేదు. మూడు వాణిజ్య పంటలు పండే ప్రాంతంలో రాజధాని కోసం వేల ఎకరాలు తీసుకోవడాన్ని పర్యావరణ వేత్తలు తీవ్రంగా వ్యతిరేకించారు. రైతులు ఇచి్చన భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ హ్యాపీ నెస్ట్, తాత్కాలిక భవనాలంటూ కాలం గడిపారు.
వరద ముప్పు తప్పించే పనులు చేపట్టాలన్న ప్రపంచబ్యాంకు
రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయకపోగా విస్తరణ అవసరాల పేరుతో మరో 44,676 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ లేదా నెగోíÙయేటెడ్ సెటిల్‌మెంట్స్ లేదా భూసేకరణ చట్టం ద్వారా సమీకరించాలని టీడీపీ కూటమి సర్కారు భావిస్తోంది. భవిష్యత్తు అవసరాల పేరుతో మూడు పంటలు పండే సారవంతమైన వేలాది ఎకరాలను స్వా«దీనం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం, స్టేడియాలు, ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు, రైల్వే లైన్లు పేరుతో రాజధాని విస్తరణ అంటూ వేలాది ఎకరాలపై కన్నేసింది.

అసలు రాజధాని నిర్మాణమే ప్రారంభం కాకపోగా భవిష్యత్ విస్తరణ పేరుతో మళ్లీ వేల ఎకరాలను రైతుల నుంచి తీసుకునే యత్నాలపై అధికార వర్గాలు విస్తుపోతున్నాయి. ఇప్పటికే రాజధాని ప్రాంతానికి వరద ముప్పు పొంచి ఉందని, దాని నుంచి అమరావతిని కాపాడేందుకు ప్రాజెక్టులు చేపట్టాలని ప్రపంచ బ్యాంకు, ఏడీబీ షరతు విధించాయి. రాజధాని నిర్మాణ ప్రాంతంలో వరద ముప్పు తగ్గించేందుకు 1,995 ఎకరాల్లో రూ.2,750 కోట్లతో పనులు చేపట్టాల్సిందిగా ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది.
అలాంటి చోట రాజధాని విస్తరణ పేరుతో 44,676 ఎకరాలను సమీకరించడం అంటే ఏకంగా లక్ష ఎకరాలను రైతుల నుంచి లాక్కోవటమేననే అభిప్రాయం అధికార వర్గాల్లో బలంగా వ్యక్తం అవుతోంది. రాజధాని ప్రాంతంలో సారవంతమైన తమ భూములు ఇచ్చేందుకు రైతులు నిరాకరిస్తున్నారు. తమ జీవనోపాధి దెబ్బ తింటుందని, మూడు పంటలు పండే భూములను లాక్కోవడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం భూ దాహం తీరడం లేదు.