
ప్రతిష్టాత్మక జాతీయ సంస్థలకు మార్కెట్ ధర..
బినామీలకు కారుచౌకగా బాబు భూ పందేరం
ఊరూపేరు లేని ఉర్సాకు విశాఖలో అత్యంత కారుచౌకగా ఎకరం 99 పైసలకే..
రూ.3,000 కోట్లకుపైగా విలువైన భూములను అనామక సంస్థకు కట్టబెడుతూ క్యాబినెట్ ఆమోదం
తన సన్నిహితులకు కారుచౌకగా భూములు.. ప్రతిష్టాత్మక కేంద్ర సంస్థల నుంచి రూ.కోట్లు వసూలు చేస్తున్న బాబు సర్కారు
అమరావతిలో ఆర్బీఐ, హడ్కో, ఎల్‌ఐసీ, గెయిల్, ఎఫ్‌సీఐతోపాటు పలు జాతీయ బ్యాంకులకు గతంలో ఎకరం రూ.4 కోట్ల చొప్పున భూముల కేటాయింపు
భారత ఆర్మీకి సైతం ఎకరా రూ.కోటి చొప్పున కేటాయించిన వైనం
బాలకృష్ణ వియ్యంకుడు, లోకేశ్ తోడల్లుడి సంస్థకు మాత్రం ఎకరం రూ.లక్షకే.. ఏకంగా 498.93 ఎకరాల అప్పగింత
తన బృందానికి సీఆర్‌డీఏ పరిధిలో కారుచౌకగా అత్యంత విలువైన భూములు కట్టబెట్టిన వైనం
ఉమ్మడి రాష్ట్రంలో ఆపద్ధర్మ సీఎంగా ఉన్నప్పుడూ అదే తీరు..
బిల్లీ రావు బోగస్ కంపెనీ ఐఎంజీ భారత్‌కు గచ్చిబౌలిలో 400 ఎకరాలు.. శంషాబాద్‌లో 450 ఎకరాలను కేటాయించిన బాబు
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: కేంద్ర సంస్థలకైతే ఎకరా రూ.4 కోట్లు.. ఆర్మీకైనా సరే కోటికి తగ్గేది లేదు..! ఉర్సాకైతే ఊరికే! ఒక్క రూపాయికి కనీసం ఓ ఇడ్లీ కూడా రాదు..! మరి 99 పైసలకు రూ.3,000 కోట్ల భూములు ఎలా..? ఊరూ పేరు లేని కంపెనీపై ఔదార్యం వెనుక గుట్టు ఏమిటి?
ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, జాతీయ సంస్థలు ఏర్పాటవుతుంటే ఏ ప్రభుత్వమైనా స్వాగతించి వీలైనన్ని వెసులుబాట్లు కల్పించి భూముల కేటాయింపులో ఉదారంగా వ్యవహరిస్తుంది! కానీ.. ప్రముఖ కేంద్ర సంస్థల నుంచి ఎకరా రూ.నాలుగు కోట్ల చొప్పున వసూలు చేస్తూ.. ఊరూ పేరు లేని ఓ డొల్ల కంపెనీకి మాత్రం రూ.3,000 కోట్లకుపైగా విలువ చేసే అత్యంత విలువైన దాదాపు 60 ఎకరాలను ఎకరా 99 పైసలకే కట్టబెట్టడం నాకింత.. నీకింత లాంటి లాలూచీ వ్యవహారాలకు పరాకాష్ట! పలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, జాతీయ సంస్థలకు గతంలో చంద్రబాబు సర్కారు అమరావతిలో ఎకరా రూ.4 కోట్లు చొప్పున భూములను కేటాయించింది.
హడ్కో, ఎల్‌ఐసీ, గెయిల్, ఎఫ్‌సీఐ, ఆర్బీఐ, ఎస్‌బీఐ, విజయా బ్యాంకు, కెనరా బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, రైల్ ఇండియా టెక్నికల్ ఎకనమిక్ సర్వీస్ లాంటి ప్రతిష్టాత్మక జాతీయ సంస్థలకు ఎకరా రూ.నాలుగు కోట్లు చొప్పున భూ కేటాయింపులు చేశారు. చివరకు దేశ రక్షణ వ్యవహారాల్లో అత్యంత కీలకమైన ఇండియన్ ఆర్మీకి సైతం ఎకరా రూ.కోటి చొప్పున భూమిని కేటాయించడం గమనార్హం.
ఇలా కేంద్ర, జాతీయ సంస్థలకు భూములిచ్చినందుకు భారీగా వసూలు చేస్తూ ఊరూ పేరు లేని అనామక ఉర్సా కంపెనీకి మాత్రం రూ.3,000 కోట్ల విలువైన 59.86 ఎకరాల ఖరీదైన భూమిని అత్యంత కారు చౌకగా కట్టబెడుతూ తన బంధువులు, బినామీలు, సన్నిహితులకు ప్రభుత్వ భూములను ధారాదత్తం చేయడంలో చేతికి ఎముకే లేదని చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారు. ప్రతిష్టాత్మక జాతీయ సంస్థలకు భూములు కేటాయించేటప్పుడు మాత్రం మార్కెట్ ధరను తెరపైకి తేవడం.. బంధుగణం, బినామీలకు మాత్రం కారుచౌకగా ప్రభుత్వ భూములను రాసిచ్చేయడం సీఎం చంద్రబాబుకు రివాజు అని పారిశ్రామికవేత్తలు, అధికార వర్గాలే స్పష్టం చేస్తుండటం గమనార్హం.
ఉమ్మడి రాష్ట్రంలోనూ చంద్రబాబు 1995 నుంచి 2004 వరకూ అధికారంలో ఉన్నప్పుడు ఇదే తరహాలో వ్యవహరించారని గుర్తు చేస్తున్నారు. 2004లో ఆపద్ధర్మ సీఎంగా ఉంటూ తనకు అత్యంత సన్నిహితుడైన బిల్లీ రావుకు చెందిన బోగస్ కంపెనీ ఐఎంజీ భారత్‌కు గచ్చిబౌలిలో 400 ఎకరాలు.. శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో 450 ఎకరాల భూమిని కేటాయించడం చంద్రబాబు భూ సంతర్పణకు పరాకాష్టగా పేర్కొంటున్నారు. విభజన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చాక కూడా అదే పంథాను కొనసాగించారని ప్రస్తావిస్తున్నారు.
భూ పందేరానికి ఆధారాలివిగో..
నారా లోకేశ్ తోడల్లుడు, విశాఖ ఎంపీ భరత్ తండ్రి ఎం.పట్టాభిరామారావుకు చెందిన వీబీసీ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్‌కు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో ఏపీఐఐసీకి చెందిన 498.93 ఎకరాల భూమిని ఎకరం రూ.లక్ష చొప్పున కేటాయిస్తూ 2015 జూలై 15న నాటి చంద్రబాబు సర్కార్ ఉత్తర్వులు (జీవో ఎంఎస్ నెంబరు 269) జారీ చేసింది. బహిరంగ మార్కెట్ ప్రకారం ఆ భూముల విలువ అప్పట్లోనే రూ.498 కోట్లు. ఆ తర్వాత ఆ భూములను రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్‌డీఏ) పరిధిలోకి తెస్తూ 2015 సెపె్టంబరు 22న ఉత్తర్వులు (జీవో ఎంస్ నెంబరు 207) జారీ చేయడం ద్వారా వాటి విలువను మరింతగా పెంచుకున్నారు.
సత్తా లేని సంస్థకు సంతర్పణ..!
జనసేన, బీజేపీతో జట్టుకట్టి 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తన బంధువులు, సన్నిహితులు, బినామీలకు ప్రభుత్వ భూములను ఇష్టారీతిన ధారాదత్తం చేస్తున్నారు. ఊరూ పేరూ లేని ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు విశాఖలోని ఐటీ పార్క్‌లో 3.5 ఎకరాలు, కాపులుప్పాడలో 56.36 ఎకరాలు.. ఎకరం కేవలం 99 పైసలకే కేటాయించడమే అందుకు నిదర్శనం. వాస్తవంగా ఆ భూముల విలువ రూ.3 వేల కోట్లకుపైగా ఉంటుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. కేవలం రెండు నెలల క్రితం ఏర్పాటైన కంపెనీకి రూ.5,278 కోట్ల పెట్టుబడి పెట్టి డేటా సెంటర్ ప్రాజెక్టును నెలకొల్పే సామర్థ్యం ఉందా.. లేదా? అన్నది పరిశీలించుకోకుండా భూ కేటాయింపులు చేశారంటే.. ఆ సంస్థ ఎవరి బినామీలదో అర్థం చేసుకోవచ్చని అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.
కేంద్ర సంస్థలకు మార్కెట్ ధరకే..
విశాఖలో గతంలో టీడీపీ హయాంలోనే కేంద్ర ప్రభుత్వ సంస్థలకు మార్కెట్ ధరకే భూమిని కేటాయించారు. కీలకమైన నావికాదళ స్థావరం ఏర్పాటుకు ఇండియన్ నేవీతో పాటు ఎన్‌టీపీసీ విద్యుత్ ప్లాంటుకు కూడా మార్కెట్ ధరకే భూమి ఇచ్చారు. దీనికి భిన్నంగా ఉర్సాకు విశాఖలో అత్యంత ఖరీదైన ఐటీ పార్కులో 3.5 ఎకరాలతో పాటు కాపులుప్పాడలో ఏకంగా 56.36 ఎకరాలను కేటాయించేందుకు టీడీపీ కూటమి సర్కారు నిర్ణయం తీసుకుంది. ఉర్సా కంపెనీ గత ఫిబ్రవరిలో హైదరాబాద్‌లోని నివాస ప్రాంతంలో ఓ అపార్టుమెంట్‌లోని ఫ్లాటు అడ్రస్‌తో ఏర్పాటు కాగా ‘ఎక్స్’ ఖాతాలో ఇప్పటివరకూ కేవలం ఒకే ఒక పోస్టు పెట్టింది.
అది కూడా భూ కేటాయింపులపై విమర్శల నేపథ్యంలో వివరణ ఇస్తూ చేసిన పోస్టు మాత్రమే. ఇక ఈ ఖాతాను కేవలం ఒకే ఒక్కరు ఫాలో అవుతుండటం గమనార్హం. దేశాభివృద్ధిలో కీలకంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు రక్షణ వ్యవస్థలో భాగస్వామిగా ఉన్న ఇండియన్ నేవీకి కూడా మార్కెట్ ధరకే భూమిని కేటాయించిన టీడీపీ ప్రభుత్వం.. ఉర్సాకు మాత్రం నామమాత్ర ధరకే సంతర్పణ చేయడం వెనుక భారీ వ్యవహారమే ఉందనే ఆరోపణలున్నాయి. విశాఖలోని కీలకమైన ఏపీ సెజ్‌లో ఎకరా ధర లీజు రూ.35 లక్షల మేర పలుకుతోంది.
ఏ సంస్థకు భూమి కావాలన్నా ఇదే ధర చెల్లించి భూమిని లీజుకు తీసుకోవాల్సి ఉంటుంది. కమిషనర్ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ సంస్థ కార్యాలయం నిర్మాణం కోసం అనకాపల్లిలోని రాజుపాలెం వద్ద మార్కెట్ ధర మేరకు ఎకరా రూ.80 లక్షల చొప్పున సర్వే నెంబరు 75/3లో రెండు ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ 25 జనవరి 2016న టీడీపీ సర్కారు 326/2016 జీవోను జారీ చేసింది.
నిబంధనలు ఏం చెబుతున్నాయి?
2012లో రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులు (జీవో నెంబరు 571– 14–9–2012) ప్రకారం ప్రభుత్వ భూములను ప్రైవేటు సంస్థలకు ఇచ్చే సమయంలో.. మార్కెట్ విలువ మీద వార్షిక లీజు రెంటల్ పది శాతం కంటే తక్కువ ఉండకూడదు. లీజును ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి మార్కెట్æ ధర ఆధారంగా సవరించాలి.
విశాఖలో టీసీఎస్‌తో పాటు ఉర్సాకు ఇవ్వనున్న భూమి రిజిస్ట్రేషన్ ధరల మేరకే చదరపు గజం రూ. 30 వేల వరకు ఉంది. ఇక మార్కెట్ ధరను గనుక తీసుకుంటే రూ.లక్ష వరకూ పలుకుతోంది. ఇంత విలువైన భూమిని ఊరూ పేరు లేని ఉర్సాకు ఎకరం 99 పైసలకే ఇచ్చేందుకు టీసీఎస్‌ను వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చి కథ నడిపినట్లు స్పష్టమవుతోంది.