
ఆక్వా రైతు విలవిల.. 10 నెలల్లో తలకిందులైన జీవితాలు
అమెరికా సుంకాల సాకుతో కౌంట్ ధరలు తగ్గించిన కంపెనీలు
ఆ సుంకాల అమలు 90 రోజులు వాయిదా పడ్డా ఆ మేరకు పెరగని రొయ్యల రేట్లు
గతేడాది కేంద్రం దిగుమతి సుంకం తగ్గించినా, ఆ స్థాయిలో తగ్గని ఫీడ్ రేట్లు
జోన్ విస్తీర్ణంతో సంబంధం లేకుండా ఆక్వా రైతులందరికీ సబ్సిడీ విద్యుత్ ఇస్తామని ఎన్నికల ముందు ‘కూటమి’ హామీ
సబ్సిడీపై ఏరియేటర్లు, ట్రాన్స్‌ఫార్మర్ల హామీ గాలికి.. గత ఐదేళ్లూ ఆక్వా రైతులకు అండగా నిలిచిన వైఎస్ జగన్ ప్రభుత్వం
కోవిడ్, ఈక్వెడార్ సంక్షోభ సమయంలో మద్దతు ధరలతో భరోసా.. 15 రోజులకోసారి ధరలపై సమీక్ష
మూడుసార్లు పెంచిన ఫీడ్ ధరలను ఉపసంహరింప చేసిన గత సర్కారు
నేడు ఆ భరోసా.. తోడ్పాటు కరువైందంటూ ఆక్వా రైతన్నల ఆవేదన
గతంలో బస్తా ఫీడ్ రూ.900 ఉండగా ఇప్పుడు రూ.2,700 అయిపోయింది. మేత ధర మూడు రెట్లు పెరగగా రొయ్యల ధరలు మాత్రం సగానికి సగం తగ్గాయి. గతంలో 60 కౌంట్ రూ.600 ఉండగా ఇప్పుడు రూ.300కి పడిపోయింది. 30 కౌంట్‌కు రూ.వంద, మిగిలిన కౌంట్‌లకు సగటున రూ.60 చొప్పున తగ్గించేశారు. ప్రభుత్వం వంద కౌంట్ రూ.220 చొప్పున కొనాలని చెబుతున్నా రూ.180కి మించి చెల్లించడం లేదు. వెంటనే స్పందించి ఆదుకోవాలి.
– మద్దాల గోపాలకృష్ణ, మేడపాడు, పశ్చిమగోదావరి జిల్లా
⇒ ‘30 ఏళ్లుగా ఆక్వా సాగు చేస్తున్నా. ఇప్పుడు ఆక్వా రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మార్కెట్‌ను ఎక్స్‌పోర్టర్స్, ప్రాసెసింగ్ కంపెనీలు శాసిస్తున్నాయి. రొయ్యల ధరలు ఇష్టమొచ్చినట్టుగా తగ్గించేస్తున్నారు. ఫీడ్ ధరలు మాత్రం పెంచేశారు. కంపెనీలపై ఒత్తిడి తెచ్చి రైతులకు అండగా నిలవాల్సింది పోయి ప్రభుత్వం వారికి వత్తాసు పలుకుతోంది. టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే జోన్‌తో సంబంధం లేకుండా యూనిట్ రూ.1.50కే విద్యుత్ ఇస్తామన్న హామీని ఎగ్గొట్టారు. నెలకు రూ.1.20 లక్షలు అదనంగా విద్యుత్ బిల్లులు కడుతున్నా. ప్రభుత్వం నిర్దేశించిన రూ.220 ఏమాత్రం గిట్టుబాటు కాదు’
– గుండు నరసింహం, వీరవాసరం, పశ్చిమ గోదావరి జిల్లా
⇒ ‘ఎకరాకు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు లీజులకే పోతోంది. ఆక్వా సాగుకు ఎకరాకు రూ. 4.5 లక్షలకుౖపైగా ఖర్చవుతోంది. గతంతో పోలిస్తే ఫీడ్ రేట్లు 3–4 రెట్లు పెరిగిపోయాయి. మాది నాన్ ఆక్వా జోన్ ప్రాంతం. యూనిట్ రూ.4 చొప్పున కరెంట్ చార్జీలు చెల్లిస్తున్నా. నాన్ ఆక్వా జోన్ పరిధిలో యూనిట్ రూ.1.50కే విద్యుత్ ఇస్తామని టీడీపీ హామీ ఇవ్వడంతో ఆశపడ్డాం. ఆర్నెల్లకు ఒకసారి ట్రూఅప్, లోడింగ్ చార్జీల పేరిట రూ.20 వేల నుంచి రూ.50 వేలు భారం వేస్తున్నారు. అదనపు వినియోగ సుంకం (ఏసీడీ) పేరిట మరో రూ.30వేల నుంచి రూ.40 వేలు బాదేస్తున్నారు. ట్రంప్ సుంకం వాయిదా పడినా కంపెనీలు కౌంట్ రేట్లను మాత్రం పెంచలేదు. సీఎం ప్రకటించిన 100 కౌంట్ రూ.220 కూడా అమలు కావడం లేదు. మొత్తంగా రూ.5–10 లక్షల మేర నష్టపోతున్నాం.
– మల్లిడి సందీప్‌రెడ్డి, గంటి, కొత్తపేట మండలం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
⇒ జాతీయ స్థాయిలో 2023–24లో రూ.60 వేల కోట్ల విలువైన 17.82 లక్షల టన్నుల మత్స్య ఉత్పత్తులు ఎగుమతి కాగా, దాంట్లో 35 శాతం (దాదాపు రూ. 20వేల కోట్లు) అమెరికాకే ఎగుమతి అయ్యాయి. ఆ తర్వాత 19 శాతం చైనాకు, మిగిలినవి ఇతర దేశాలకు ఎగుమతి అయ్యాయి. అమెరికాకు 20–50 కౌంట్ రొయ్యలు మాత్రమే ఎగుమతి అవుతాయి. అయినా సరే ఇప్పుడు 60–100 కౌంట్ ధరలను తగ్గించేశారు.
సాక్షి, అమరావతి: రొయ్య రైతులను కూటమి సర్కారు రోడ్డున పడేసింది! ఆక్వా సాగుదారులకు ఇచ్చిన ఎన్నికల హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయకపోవడం.. కాల్చుకు తింటున్న కరెంట్ చార్జీలు.. పతనమవుతున్న ధరలు.. ప్రభుత్వ భరోసా కరువవడంతో రైతులు అల్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం గతేడాది ఫీడ్ ముడి సరుకులపై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. ఆ మేరకు కిలోకు రూ.20–25 మేర అన్ని రకాల ఫీడ్ ధరలు తగ్గించాల్సి ఉంది. ఫీడ్ రేట్లు తగ్గకపోగా మూడు రెట్లు పెరిగాయి. దీనిపై ఆక్వా రైతులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు.
మరోవైపు గత పది నెలల్లో ట్రూ అప్ చార్జీలు, లోడింగ్, అదనపు వినియోగ సుంకం పేరిట విద్యుత్ చార్జీల బాదుడు మొదలైంది. ఆక్వా జోన్, నాన్ ఆక్వాజోన్, విస్తీర్ణంతో సంబంధం లేకుండా ఆక్వా సాగుదారులందరికీ యూనిట్ రూ.1.50 కే విద్యుత్ సరఫరా చేస్తామన్న హామీని టీడీపీ సర్కారు నెరవేర్చకపోవడంతో మోసపోయిన రైతులు నెలకు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు విద్యుత్ చార్జీలు చెల్లిస్తున్నారు. తాజాగా ట్రంప్ టారిఫ్‌ల సాకుతో కౌంట్‌కు రూ.30–80 మేర తగ్గించిన కంపెనీలు, అమెరికా విధించిన సుంకాల అమలు 90 రోజుల పాటు వాయిదా పడినా ఏ ఒక్క కంపెనీ కౌంట్ ధర ఆ మేరకు పెంచలేదు.
ఫీడ్ రేట్లు తగ్గించకుండా పది నెలల పాటు ఆక్వా రైతును దోపిడీ చేసిన కంపెనీలు కంటితుడుపు చర్యగా రూ.4 చొప్పున తగ్గించి చేతులు దులుపుకొన్నాయి. కంపెనీల ప్రయోజనాలే పరమావధిగా ప్రభుత్వం వ్యవహరించటాన్ని నిరసిస్తూ ఆక్వా రైతులు సాగు సమ్మెకు సన్నద్ధమవుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట, భీమవరం, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లో క్రాప్ హాలిడేకు సిద్ధం కావడం, మిగిలిన జిల్లాల్లోనూ ఇదే బాట పడుతున్న నేపథ్యంలో ఆక్వా రైతుల దుస్థితిపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్టు..
రూ.1.50కే విద్యుత్ హామీ గాలికి..
ఆక్వా జోన్, నాన్ ఆక్వాజోన్, విస్తీర్ణంతో సంబంధం లేకుండా ఆక్వా సాగు చేసే ప్రతి రైతుకు యూనిట్ రూ.1.50 కే విద్యుత్ సరఫరా చేస్తామని ఎన్నికల్లో కూటమి పార్టీల నేతలు హామీ ఇచ్చారు. సబ్సిడీపై ఏరియేటర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, 5 వేల టన్నుల సామర్థ్యంతో కోల్డ్ స్టోరేజ్‌ల నిర్మాణం.. ఇలా మెరెన్నో∙హామీలిచ్చారు.
అయితే వీటి అమలు కోసం రూ.1,099 కోట్లతో అధికార యంత్రాంగం పంపిన ప్రతిపాదనలను కూటమి సర్కారు పక్కన పెట్టేసింది. గతంలో 15 రోజులకోసారి రైతులు, ప్రాసెసింగ్ ఆపరేటర్లు, ఎక్స్ పోర్టర్స్‌తో సమావేశాలు నిర్వహించి అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా ధరలను స్థిరీకరిస్తూ మద్దతు ధర తగ్గకుండా పర్యవేక్షించగా గత 10 నెలలుగా ఒక్కటంటే ఒక్కసారి కూడా సమావేశమైన పాపాన పోలేదు.
కమిటీలో రైతులకు చోటే లేదు..
అమెరికా ప్రభుత్వం ప్రతీకార సుంకాలను విధించిన నేపథ్యంలో సంక్షోభం నుంచి రైతులను గట్టెక్కించాల్సిన కూటమి సర్కారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో ఆక్వా కంపెనీలు కౌంట్ రేట్లను దారుణంగా తగ్గించాయి. ఎక్స్‌పోర్టర్స్‌తో సమావేశమైన సీఎం చంద్రబాబు కంపెనీలకు వత్తాసు పలుకుతూ రైతుల గోడు పెడచెవిన పెట్టారు. తాజా సంక్షోభంపై ఆక్వారంగ భాగస్వామ్య సంస్థలతో ఏర్పాటు చేసిన కమిటీలో రైతులకు చోటు లేకుండా చేశారు. వంద కౌంట్ రూ.220గా నిర్ణయించారు.
ఇదే అదునుగా కంపెనీలు మిగిలిన కౌంట్ ధరలను రూ.20–60 వరకు తగ్గించేశాయి. 100 కౌంట్‌ను ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం కూడా కొనడం లేదు. కొందరు ట్రేడర్లు రూ.180కి మించి ఇవ్వడం లేదు. ట్రంప్ టారిఫ్‌ల వర్తింపు 90 రోజుల పాటు వాయిదా పడినా ఏ ఒక్క కంపెనీ కూడా కౌంట్‌పై రూపాయి కూడా పెంచిన పాపాన పోలేదు. ఇదేమిటని ప్రశ్నించే పరిస్థితి కరువైంది. మెజార్టీ కంపెనీలు 20–50 కౌంట్ రొయ్యలను కొనడమే నిలిపివేశాయి.
పొరుగు రాష్ట్రాల మాదిరిగా ఫీసుల (రొయ్య) మాదిరిగా ధరలు నిర్ణయించాలని రైతులు కోరుతున్నారు. సోయా ధర కిలో రూ.85 ఉన్నప్పుడు మేత ధర టన్ను రూ.15 వేలు ఉండేది. నేడు సోయా ధర కిలో రూ.23 కు తగ్గింది. అంతేకాదు మేతలో కలిపే కాంపోజిషన్, ప్రీమిక్స్ ఇతర ముడిసరుకులపై కూడా దిగుమతి సుంకం పూర్తిగా తగ్గిన నేపథ్యంలో మేత ధర కిలోకి రూ.25–రూ.30 తగ్గించాల్సి ఉన్నా కంటి తుడుపు చర్యగా కేవలం రూ.4 తగ్గించడం దారుణమని రైతులు మండిపడుతున్నారు.
ఆక్వాలో నంబర్ వన్ ఏపీ
రాష్ట్రంలో 5.75 లక్షల ఎకరాల్లో 1.69 లక్షల మంది ఆక్వా సాగు చేస్తున్నారు. మంచినీటి రొయ్యలు 9.56 లక్షల టన్నులు, ఉప్పునీటి రొయ్యలు 7.15 లక్షల టన్నులు ఉత్పత్తి అవుతున్నాయి. అత్యధికంగా ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో 1.20 లక్షల మంది 4.25 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగుదారులున్నారు. రాష్ట్రంలో 111 కోల్డ్ స్టోరేజ్‌లు, 1,104 ఆక్వా షాపులు, 106 ప్రాసెసింగ్ ప్లాంట్స్, 241 ఆక్వా ల్యాబ్స్ ఉన్నాయి.
2023–24లో 51.58 లక్షల టన్నుల దిగుబడులతో ఆక్వాలో దేశంలోనే ఏపీ నంబర్ వన్‌గా నిలవగా జాతీయ స్థాయిలో మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల్లో 32.09 శాతం ఏపీ నుంచే జరిగాయి. జాతీయ స్థాయిలో ఉత్పత్తి అయ్యే రొయ్యల్లో 76 శాతం, చేపల్లో 28 శాతం వాటా ఏపీదే. అలాంటి ఆక్వా రంగం నేడు కూటమి ప్రభుత్వ చర్యల ఫలితంగా సంక్షోభంలో చిక్కుకొని ఉక్కిరిబిక్కిరవుతోంది.
ఆక్వాకు అండగా వైఎస్ జగన్
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం గత ఐదేళ్లూ తమకు అండగా నిలిచిందని ఆక్వా రైతులు గుర్తు చేసుకుంటున్నారు. ఆక్వా కార్యకలాపాలన్నీ ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు అప్సడా చట్టంతో పాటు నాణ్యమైన ఫీడ్, సీడ్ సరఫరా కోసం ఏపీ ఫిష్ ఫీడ్, సీడ్ యాక్టులను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తెచ్చింది. నాణ్యమైన సీడ్, ఫీడ్ సరఫరా కోసం తీర ప్రాంత జిల్లాల్లో 35 ఇంటిగ్రేటెడ్ ఆక్వాల్యాబ్స్ ఏర్పాటుతో ఇన్‌పుట్ టెస్టింగ్, వ్యాధి నిర్థారణ సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చారు.
కరోనా వేళ 100 కౌంట్ రూ.150–180 మధ్య కంపెనీలు కొనుగోలు చేస్తున్న సమయంలో గత ప్రభుత్వం రూ.210గా నిర్ణయించి అంతకంటే తక్కువకు కొనుగోలు చేయకుండా కట్టడి చేసింది. ఈక్వెడార్ సంక్షోభ సమయంలో సీనియర్ మంత్రులతో ఆక్వా రైతు సాధికార కమిటీని నియమించి ప్రతి 15 రోజులకోసారి అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా సమీక్షించి 100 కౌంట్ రూ.245 కంటే తగ్గకుండా చర్యలు తీసుకుంది. 30 కౌంట్ రొయ్యకు రూ.380 చొప్పున నిర్ణయిస్తే రూ.470లకు కొనుగోలు చేసింది.
ఆ సమయంలో ఈ స్థాయి ధరలు దేశంలో మరే రాష్ట్రంలోనూ లేవని రైతులే చెబుతున్నారు. అంతేకాకుండా పెంచిన ఫీడ్ ధరలను మూడుసార్లు వెనక్కి తీసుకునేలా గత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఫలితంగా మేత ఖర్చుల భారం రైతులపై టన్నుకు రూ.860కి మించి పడకుండా అడ్డుకుందని గుర్తు చేసుకుంటున్నారు. ఆక్వా జోన్ పరిధిలో పదెకరాల లోపు అర్హత ఉన్న ప్రతీ రైతుకు యూనిట్ రూ.1.50కే విద్యుత్‌ను అందించింది. 2014–19 మధ్య నాడు చంద్రబాబు ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.340 కోట్ల విద్యుత్తు సబ్సిడీ బకాయిలు చెల్లించడంతోపాటు ఐదేళ్లలో ఏకంగా రూ.3,394 కోట్లు వెచ్చించి రైతులను ఆదుకుంది.
పంట విరామం మినహా మార్గం లేదు...
ట్రంప్ ట్యాక్స్‌ను సాకుగా చూపించి కౌంట్ ధరలు దారుణంగా తగ్గించేశారు. సుంకాల పెంపు అమలు 90 రోజులు పాటు వాయిదా వేసినా 100 కౌంట్ రూ.200–220కు మించి కొనడం లేదు. కిలోకి రూ.30 నష్టపోతున్నాం. మేత ధర కనీసం రూ.20 తగ్గించాలి. రొయ్యల పెంపకంలో 20% మందులకే ఖర్చవుతుంది. వాటి ధరలు కూడా తగ్గించాలి. ఆక్వా సాగులో 80 %రైతులు నష్టపోతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే పంట విరామం మినహా మరో మార్గం లేదు.
– భూపతిరాజు సుబ్రహ్మణ్యం రాజు (బుల్లిరాజు), ఎదుర్లంక, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
సబ్సిడీ విద్యుత్తు హామీని నెరవేర్చాలి..
12 ఎకరాల్లో రొయ్యలు, చేపల సాగు చేస్తున్నా. యూనిట్ విద్యుత్తు రూ.1.50కే అని ఇచ్చిన హామీని కూటమి పార్టీలు నెరవేర్చాలి. రూ.3.50 నుంచి రూ.4 వరకు యూనిట్‌పై భారం పడుతోంది. ఎగుమతి దారులు, ఫీడ్ ఫ్యాక్టరీ యజమానులు సిండికేట్‌గా మారటంతో చెప్పిన రేటుకే అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. 100 కౌంట్ రూ.260 నుంచి రూ.270 పలికితేనే రైతుకు గిట్టుబాటు అవుతుంది.
– బొల్లెంపల్లి శ్రీనివాస్, అండలూరు, పశ్చిమగోదావరి జిల్లా
పెట్టుబడి ఖర్చులు పెరిగాయి
గతంతో పోలిస్తే ఆక్వా సాగు పెట్టుబడి ఏకంగా 50 శాతం పెరిగింది. కంపెనీలు చెల్లిస్తున్న ధరలు ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదు.
– బిళ్లకుర్తి శ్రీనివాసరెడ్డి, తాళ్లరేవు, కాకినాడ జిల్లా
అన్యాయమైపోతున్నాం..
గతేడాది కేంద్ర బడ్జెట్‌లో ముడి సరుకులపై కస్టమ్స్ డ్యూటీ ఎత్తివేయడంతో ఇంపోర్టెడ్ మేతపై పన్నులు 15 శాతం నుంచి 5 శాతానికి తగ్గినప్పటికీ కంపెనీలు మేత ధర ఒక్క రూపాయి కూడా తగ్గించలేదు. ఇప్పుడు అమెరికాలో దిగుమతి సుంకం పెంచారనే సాకుతో ఆగమేఘాల మీద కౌంట్ రేట్లు తగ్గించడం దుర్మార్గం. ట్యాక్స్ పెంపు వాయిదా పడ్డా కౌంట్ ధర ఒక్క రూపాయి కూడా పెంచిన పాపాన పోలేదు. అండగా నిలవాల్సిన ప్రభుత్వం కంపెనీలకు వత్తాసు పలకడం బాధాకరం.
–టి.నాగభూషణం, ఏపీ ఆక్వా ఫెడరేషన్ సలహాదారుడు