మోసాల కూటమిని ప్రజలు క్షమించరు: వైఎస్‌ జగన్‌ | YS Jagan congratulates local government representatives of YSR Anantapur and Tirupati districts | Sakshi
Sakshi News home page

మోసాల కూటమిని ప్రజలు క్షమించరు: వైఎస్‌ జగన్‌

Published Fri, Apr 25 2025 4:34 AM | Last Updated on Fri, Apr 25 2025 6:07 AM

YS Jagan congratulates local government representatives of YSR Anantapur and Tirupati districts

మేనిఫెస్టో హామీలను నిలబెట్టుకోకుంటే తోలు తీస్తామని హెచ్చరించే సత్తా వైఎస్సార్‌సీపీకే ఉంది

చంద్రబాబు సర్కారుకు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ హెచ్చరిక

ప్రజలు నిలదీస్తారనే భయంతో ప్రతి రోజూ డైవర్షన్‌ రాజకీయాలే 

ఒక రోజు లడ్డూ.. మరోరోజు బోటు.. ఇంకోరోజు ఐపీఎస్‌ల అరెస్టులు 

షాక్‌ కొడుతున్న కరెంట్‌ బిల్లుల గురించి ప్రశ్నిస్తే.. బాబు చేసిన లిక్కర్‌ స్కాంను ఇంకొకరి మీద రుద్ది అరెస్టు చేస్తారు 

ఇవాళ గ్రామాల్లో ప్రజల ఇళ్లకు వెళ్లి పలకరించే ధైర్యం చంద్రబాబు పార్టీకి చెందిన ఏ కార్యకర్తకూ లేదు 

ఏడాదిలో కొత్త పెన్షన్‌ ఒక్కటీ ఇవ్వకపోగా.. ఉన్న వాటిలో 4 లక్షల పెన్షన్లు ఊడగొట్టారు 

ఉర్సా లాంటి ఊరూ పేరు లేని కంపెనీకి రూ.3 వేల కోట్ల విలువైన భూమి కట్టబెట్టి నీకింత.. నాకింత అని పంచుకుంటున్నారు 

స్టీలు, సిమెంటు రేట్లు తగ్గినా అమరావతిలో పనుల అంచనాలను అమాంతంగా పెంచారు 

వైఎస్సార్‌సీపీ హయాంలో పిల్లలు ప్రభుత్వ బడులలో చదువుతున్నారని గర్వంగా చెప్పుకున్న పరిస్థితి 

నాడు నో వేకెన్సీ బోర్డులు నుంచి.. నేడు పిల్లలను ప్రభుత్వ స్కూళ్లకు పంపేందుకు సందేహించే దుస్థితికి తెచ్చారు 

మా పార్టీ కార్యకర్తల తెగువ ఎలా ఉంటుందో చాటిచెప్పిన అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములకు సెల్యూట్‌ చేస్తున్నా  

వైఎస్సార్, అనంతపురం, తిరుపతి జిల్లాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను అభినందించిన వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ‘ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం, ప్రజల్లో వ్యతిరేకతను గొంతు పట్టుకుని నులమడం అసాధ్యం..! ఇచ్చిన మాట, మేనిఫెస్టోలో చెప్పిన హామీలను నిలబెట్టుకోకుంటే నీ తోలు తీస్తాం.. అని చెప్పగలిగిన సత్తా వైఎస్సార్‌ సీపీకి ఉంది..’ అని చంద్రబాబు సర్కారును వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరించారు. హామీల అమలు, ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, అక్రమాలపై గ్రామ గ్రామాన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు నిలదీస్తారని చెప్పామని గుర్తు చేశారు. 

‘వైఎస్సార్‌సీపీ కార్యకర్తల్లో తెగువ ఎలా ఉంటుందనేది రాష్ట్రానికి చాటి చెప్పిన నా అక్కచెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు సెల్యూట్‌ చేస్తున్నా’ అని పార్టీ శ్రేణులను అభినందించారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు, తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ, అనంతపురం జిల్లా కంబదూరు, తిరుపతి రూరల్‌ మండలం స్థానిక సంస్థల వైఎస్సార్‌సీపీ ప్రజా ప్రతినిధులతో వైఎస్‌ జగన్‌ సమావేశమయ్యారు. టీడీపీ కూటమి సర్కారు ప్రలోభాలు, బెదిరింపులకు లొంగకుండా స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ పక్షాన గట్టిగా నిలబడిన ప్రజాప్రతినిధులను అభినందించారు. 

ఆయా మున్సిపల్‌ ఛైర్‌పర్సన్లు, వైస్‌ ఛైర్‌పర్సన్లు, కౌన్సిలర్లతో పాటు ఎంపీపీలు, ఎంపీటీసీలు, జిల్లాల పార్టీ ముఖ్య నాయకులు ఈ సమా­వేశంలో పాల్గొన్నారు. తొలుత కశ్మీర్‌లోని పహ­ల్గాంలో ఉగ్ర­వాదుల దాడిలో అసువులు బాసిన వారికి వైఎస్‌ జగన్, నాయకులు నివాళులు అర్పించారు. సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం సమా­వేశంలో మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే..

మీ తెగువకు మరోసారి సెల్యూట్‌..
ఇవాళ రాష్ట్రంలో ప్రజలు యుద్ధ వాతావరణంలో బతుకుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి దుర్మార్గమైన, రెడ్‌ బుక్‌ పాలన రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ చూసి ఉండరు. ఇలాంటి పరిస్థితుల మధ్య కూటమి సర్కారు అన్యాయాలు, దౌర్జన్యా­లకు ఎదురొడ్డి నిలిచిన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు నుంచి వచ్చిన ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ, ఎంపీటీసీలు.. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ నుంచి వచ్చిన ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్లు, కౌన్సిలర్లు, గోపవరం పంచాయితీ నుంచి వచ్చిన సర్పంచి, వార్డు మెంబర్లకు, తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి వచ్చిన ఎంపీపీలు, వైస్‌ ఎంపీపీలు, ఎంపీటీసీలు, తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ నుంచి వచ్చిన ఛైర్‌పర్సన్లు, వైస్‌ ఛైర్‌పర్సన్లు, కౌన్సిలర్ల తెగువకు మరోసారి సెల్యూట్‌ చేస్తున్నా.

జీర్ణించుకోలేక అక్రమ కేసులు..
» ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఎక్కడా టీడీపీకి బలం లేదు. ప్రతి చోటా వైఎస్సార్‌సీపీ జెండా మీద, గుర్తు మీద గెలిచిన సభ్యులే ఉన్నారు. 
»   అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం కంబదూరులో 15కు 15 ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్‌సీపీ గెలిచింది. మరి అక్కడ టీడీపీ ఎందుకు పోటీ పెట్టింది? అక్కడ ఎన్ని ప్రలోభాలు పెట్టినా 13 మంది వైఎస్సార్‌సీపీ వెంట నిలబడ్డారు. అది మనమే గెల్చుకున్నాం.
» ప్రొద్దుటూరులో గోపవరం చిన్న పంచాయితీ. అక్కడ ఉప సర్పంచ్‌ ఎన్నికలో చంద్రబాబు తన బుద్ధి ప్రదర్శించారు. 20 మంది వార్డు మెంబర్లకుగానూ 19 మంది వైఎస్సార్‌సీపీకి చెందిన వారే ఉన్నా చంద్రబాబు ఎందుకు పోటీ పెట్టారు? అక్కడ ఎంత దారుణంగా భయ­పెట్టారో, దాడులు చేయించారో రాష్ట్రమంతా చూసింది. చివరికి గొడవల ద్వారా మొదటిసారి ఎన్నికలు వాయిదా వేశారు. రెండోసారి కారణం దొరక్క.. ఎన్నికల అధికారికి హఠాత్తుగా గుండెపోటు అని చెప్పి వాయిదా వేశారు.
»  తిరుపతి రూరల్‌ మండలానికి సంబంధించి చంద్రగిరి నియోజకవర్గంలోనే చంద్రబాబు ఇల్లు ఉంది. చంద్రబాబు మొదటిసారి గెలిచింది, మళ్లీ ఓడిపోయింది ఇక్కడే. సొంత నియోజకవర్గంలో ప్రజలు ఓడిస్తే.. ఇక్కడ ప్రజలు తంతే చంద్రబాబు కుప్పం వెళ్లారు.బీసీలు అత్యధికంగా ఉన్న ఈ ప్రాంతంలో వారికి ప్రాధాన్యతనిచ్చి పైకి తేవాలని ఎవరైనా ప్రయత్నిస్తారు. బీసీలు ఆర్థికంగా అంత బలంగా ఉండరు కాబట్టి వారిని తొక్కిపెట్టవచ్చని చంద్రబాబు అక్కడ పాగా వేశారు. 

చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి రూరల్‌ మండలంలో 40 మంది ఎంపీటీసీలకు గానూ 34 మంది వైఎస్సార్‌సీపీ తరపున గెలిచారు. అక్కడ నామినేషన్‌ వేయకుండా రకరకాలుగా భయపెట్టారు. 34 మందిలో 33 మందితో మోహిత్‌ ఓటేయించాడు. ఒక్కరే జారిపోయారు. మిగిలిన అందరూ ఒక్క తాటిమీద నిలబడి వైఎస్సార్‌సీపీ తెగువను చూపించారు. దాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేక ఎన్నికలు అయిపోయిన తర్వాత జై జగన్, జై వైఎస్సార్‌సీపీ అన్నారని వారి మీద కేసులు పెట్టించారు.
» వెంకటగిరి మున్సిపాలిటీకి సంబంధించి 25 మంది కౌన్సిలర్లు ఉంటే ఒక్కరూ టీడీపీ నుంచి గెలవలేదు. అక్కడ ఛైర్మన్‌ను దింపాలని చంద్రబాబు ఆరుగురిని భయపెట్టి, బెదిరించి కొనుగోలు చేయగలిగారు. మిగిలిన 19 మంది వైఎస్సార్‌సీపీ వెంట నిలబడ్డారు.
»  అంతకుముందు రాష్ట్రంలో 50 చోట్ల స్థానిక సంస్థలకు ఉప ఎన్నికలు జరిగితే 39 చోట్ల వైఎస్సార్‌సీపీ జెండా ఎగిరింది. చంద్రబాబుకి ఎక్కడా బలం లేదు. ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేదు. ఆయన ఎందుకు ఇంతలా దిగజారిపోయాడంటే సంవత్సరం పాటు చేసిన పాలనే నిదర్శనం. 

అన్నీ కోతలు.. అవకతవకలే
ఇవాళ వ్యవస్థలు పూర్తిగా అధ్వాన్నమైన పరిస్థితుల్లో నీరుగారిపోయాయి. అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఏ గ్రామంలో చూసినా బెల్టుషాపులు గుడి, బడి పక్కనే కనిపిస్తున్నాయి. ఏ బెల్టు దుకాణాన్ని చూసినా.. షాపుల్లో ధర కన్నా రూ.20 ఎక్కువకు అమ్ముతున్న పరిస్థితి కళ్లముందే కనిపిస్తోంది. మన హయాంలో కన్నా ఇసుక రెండింతలు ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు. 

మన హయాంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయం లేదు. మట్టి, మైనింగ్, నియోజకవర్గంలో ఏ పరిశ్రమ నడవాలన్నా ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి అంతో ఇంతో ముట్టజెప్పాల్సిందే. ఆయన ముఖ్యమంత్రికి ముట్టజెప్పాలి. నాకింత.. నీకింత అని దోచుకుని తింటున్న పరిస్థితి రాష్ట్రమంతా కనిపిస్తోంది. దీని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు రోజుకొక డైవర్షన్‌ టాపిక్‌ ఎంచుకుంటున్నారు. 

అడ్డగోలుగా భూ పందేరాలు..
విశాఖపట్నంలో ఊరూపేరు లేని ‘ఉర్సా’ లాంటి కంపెనీకి రూ.3 వేల కోట్ల విలువైన భూములిస్తున్నారు. ఒక చిన్న ఇంట్లో, రెసిడెన్షియల్‌ అపార్ట్‌మెంట్‌లో నివాస గృహాలకు చెల్లించే కరెంటు బిల్లును ఆ కంపెనీ కడుతోంది. ఇక అమెరికాలో వాళ్ల ఆఫీసు చూస్తే.. అది కూడా చిన్న ఇల్లే. ఊరూపేరు లేని కంపెనీకి రూ.3 వేల కోట్ల విలువ చేసే భూమి, అది కూడా కేవలం రూ.99 పైసలకే ఎకరా భూమి కట్టబెడుతున్నారు. 

మొబిలైజేషన్‌ అడ్వాన్సులు..
చంద్రబాబు వచ్చిన తర్వాత మొబిలైజేషన్‌ అడ్వాన్సులు ఇవ్వడం మొదలుపెట్టారు. 10 శాతం మొబిలైజేషన్‌ అడ్వాన్సు ముందే ఇస్తారు. వాళ్ల దగ్గర నుంచి 8 శాతం చంద్రబాబు తీసుకుంటారు! ఇలా రాష్ట్రాన్ని దోచేస్తున్నారు. 

అప్పు అంతా ఏమైపోతోంది..?
మరి చేసిన అప్పులన్నీ ఎక్కడికి పోతున్నాయి? సూపర్‌ సిక్స్‌లు, సూపర్‌ సెవెన్‌లు ఎందుకు లేవు? గతంలో జగన్‌ చేయగలిగాడు...మరి  చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడు? అంటే అందుకు కారణం ఎన్నికలప్పుడే చెప్పా. జగన్‌ నేరుగా బటన్‌ నొక్కుతాడు. అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా వెళుతుంది.

 అదే చంద్రబాబు ఉంటే బటన్లు ఉండవు. నేరుగా ఆయన జేబుల్లోకే పోతుందని ఆ రోజు ఎన్నికలప్పుడు నేను మొత్తుకుని చెప్పా. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని చెప్పా. ఆ రోజు నేను చెప్పింది మీరు మళ్లీ వింటే.. జగన్‌ కరెక్టుగా చెప్పాడు, మనమే మోసపో­యామని మీకే అర్ధం అవుతుంది. ఈరోజు ప్రతి ఇంట్లో ఇదే చర్చ జరుగుతోంది.

ఎప్పటికప్పుడు డైవర్షన్‌ పాలిటిక్స్‌
జరుగుతున్న వాటికన్నింటికీ సమాధానం చెప్పుకోలేకే ప్రతి రోజూ డైవర్షనే. ఒక రోజు లడ్డూ, మరోరోజు బోటు.. ఇంకోరోజు ఐపీఎస్‌ ఆధికారుల అరెస్టులు అంటాడు. షాక్‌ కొట్టేలా పెంచిన కరెంట్‌ బిల్లుల గురించి అడిగితే... ఆయన చేసిన లిక్కర్‌ స్కాంను ఇంకొకరి మీద రుద్ది అరెస్టు చేస్తాడు. ఇలా ప్రతి రోజూ ఏదో ఒకటి సృష్టించి టాపిక్‌ డైవర్షన్‌ చేయడం పరిపాటిగా మారింది.    

చరిత్రలో రోమన్‌ రాజులు మీద ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగా వస్తోందని గ్లాడియేటర్స్‌ అని గేమ్స్‌ నిర్వహించేవారు. మనుషులు చేతుల్లో కత్తులు పెట్టి, జంతువులను బరిలో దించి చనిపోయేవరకు యుద్ధాలు చేయించేవారు. వాటిని ప్రజలు చూసేలా చేసి మభ్యపెట్టి డైవర్ట్‌ చేసేవారు. దీంతో రాజు ఎలా పరిపాలన చేస్తున్నారో చర్చించడం మాని ప్రజలు వాటి గురించే చర్చించేవారు. మిగిలిన విషయాలు పక్కకు పోయేవి. ఇలా ప్రతి రోజూ ఒక డైవర్షన్‌ టాపిక్, డ్రామా. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో పాలన జరుగుతోంది.

హామీలకు దిక్కులేని పరిస్థితుల్లో పాలన..
చాలా మంది ఇళ్లల్లో చంద్రబాబు మేనిఫెస్టో ఉంది. అప్పట్లో భారీగా ప్రకటనలు ఇచ్చారు. మేనిఫెస్టోను ప్రతి ఇంటికి పంపి బాండ్లు కూడా రాసిచ్చారు. జగన్‌ ఇచ్చినవన్నీ చంద్రబాబు కూడా ఇస్తారని, అంతేకాదు అదనంగా కూడా ఇస్తారంటూ వాళ్ల కార్యకర్తలతో చెప్పించి బాండ్లు కూడా ఇచ్చారు. మేనిఫెస్టోలో ఇంకా 143 హామీలు ఇచ్చారు. మరి నా అక్కచెల్లెమ్మలు ప్రొద్దుటూరు, కడపలో నిరీక్షిస్తున్నారు. ఉచిత బస్సు ద్వారా విశాఖపట్నం వెళ్లి రావాలని ఎదురు చూస్తున్నారు. దానికి కూడా దిక్కులేని పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్రంలో పరిపాలన సాగుతోంది.

వ్యవస్థలన్నీ విధ్వంసం..  
»  మరోవైపు వ్యవస్థలన్నీ ఇప్పుడు పూర్తిగా విధ్వంసం అయ్యాయి. వైఎస్సార్‌సీపీ హయాంలో మా పిల్లలు ప్రభుత్వ బడులలో చదువుతున్నారని గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఉండేది. అప్పట్లో ప్రభుత్వ బడుల్లో నో వేకెన్సీ బోర్డులు ఉన్న పరిస్థితి నుంచి ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను పంపించడానికి తల్లిదండ్రులు సందేహిస్తున్న దుస్థితికి తీసుకొచ్చారు. ప్రభుత్వ స్కూళ్లు అంతలా నాశనం అయ్యాయి. ఇంగ్లిషమీడియం, మూడో తరగతి నుంచి సబ్జెక్ట్‌ టీచర్‌ కాన్సెప్ట్‌ తీసేశారు. 

మూడో తరగతి నుంచే టోఫెల్‌ని సైతం పీరియడ్‌గా పెట్టి చదివించే గొప్ప కార్యక్రమాన్ని రద్దు చేశారు. నాడు–నేడు ఆగిపోయింది. గోరుముద్ద నాసిరకంగా అయిపోయింది. పిల్లలను బడికి పంపిస్తే తల్లులను ప్రోత్సహిస్తూ ఇచ్చిన అమ్మ ఒడి గాలికెగిరిపోయింది. నాడు 8వ తరగతి పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు కనిపించే పరిస్ధితి ఉండేది. ఇప్పుడు వాటిని కూడా ఆపేశారు. బడికి పిల్లలు పోవటాన్ని ఇవాళ నరకంగా మార్చేశారు. 

పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఉచితంగా పూర్తి ఫీజులు కట్టి వారి వసతి ఖర్చుల సైతం ఇచ్చిన కార్య­క్రమాలు రద్దయ్యాయి. విద్యాదీవెన, వసతి దీవెన అందక ఇంజనీరింగ్‌ విద్యార్థులు చదువులు మానేస్తున్న పరిస్థితి నెలకొంది.

» వైద్య రంగం ఇంకా దారుణంగా తయారైంది. ఏ పేదవాడికైనా ఆరోగ్యం బాగా లేకపోతే ఉచితంగా పెద్దాసుపత్రిలో వైద్యం చేయించుకుని చిరునవ్వుతో ఇంటికి వెళ్లే పరిస్థితి గతంలో ఉండేది. రూ.25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా సుమారు 3,300 ప్రొసీజర్లు ఉచితంగా వైద్యం చేయించుకునే పరిస్థితి గతంలో ఉండేది. ఇవాళ ఆరోగ్యశ్రీకి నెలకు రూ.300 కోట్లు చొప్పున 12 నెలలకు రూ.3,600 కోట్లు బకాయిలు పెట్టారు. రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు బిల్లులు పెండింగ్‌లో పెట్టారు. దీంతో ఆరోగ్యశ్రీ రోగులకు వైద్యం చేయలేమని బోర్డు పెట్టాయి. ఇవాళ దురదృష్టవశాత్తూ ఎవరికైనా ఆరోగ్యం సరిగా లేకపోతే లక్షలకు లక్షలు ఖర్చు పెట్టుకుని అప్పులు పాలైతేగానీ పేదవాడు బతికి బట్ట కట్టే పరిస్థితి లేదు.

» ఇక వ్యవసాయం రంగం గురించి చూస్తే ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోయాయి. ఏ పంటకూ గిట్టుబాటు ధర రాని పరిస్థితి. ఉచిత పంటల బీమా గాలికెగిరిపోయింది. ఈ–క్రాప్‌ ఎక్కడుందో తెలియని దుస్థితి. రైతులు రోడ్డున పడి అల్లాడుతున్నారు. జగన్‌ ఇచ్చిన రూ.13,500 పెట్టుబడి సాయం ఆగిపోయింది. అన్నదాతా సుఖీభవ కింద చంద్రబాబు ఇస్తానన్న రూ.26 వేలు పెట్టుబడి సాయం కూడా గాలికెగిరిపోయిందని ఇవాళ ప్రతి రైతూ చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు.

వైఎస్సార్‌సీపీ అఖండ విజయంతో అధికారంలోకి రావడం తథ్యం..
నేను అందరికీ ఒక్కటే చెబుతున్నా. ఇంత మంచి చేసిన మనమే ప్రతిపక్షంలో కూర్చొన్నాం. ఇక ఏ మంచీ చేయని, మోసం చేసిన చంద్రబాబునాయుడు పరిస్ధితి ఎలా ఉంటుందో చెప్పక్కరలేదు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో పరిస్థితి ఒకేలా ఉంటుంది. ఇంత మోసం చేసిన మనిషిని ప్రజలు సింగిల్‌ డిజిట్‌ కూడా రాని పరిస్థితుల్లోకి పరిమితం చేస్తారు. తప్పకుండా ఆరోజు వస్తుంది. మరో మూడేళ్లు గడిచిన తర్వాత.. కచ్చితంగా వైఎస్సార్‌సీపీ అఖండ మెజార్టీతో అధికారంలోకి వస్తుంది. 

ఈసారి వచ్చిన తర్వాత ప్రతి కార్యకర్తకు.. మన ప్రభుత్వంలో మీ జగన్‌ 2.0లో తోడుగా ఉంటాడు అని హామీ ఇస్తున్నా. గతంలో మీరు అనుకున్నంత స్థాయిలో కార్యకర్తలకు తోడుగా ఉండి ఉండకపోవచ్చు. కారణం.. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే కోవిడ్‌ వచ్చింది. రెండేళ్లు కోవిడ్‌ వల్ల వేరే అంశాల మీద ధ్యాస పెట్టలేకపోయాం. పూర్తిగా ప్రజల బాగోగులు, వారి ఆరోగ్యం మీదనే ధ్యాస పెట్టాల్సిన పరిస్థితుల మధ్య పాలన సాగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement