
విశాఖ సీపీ బాగ్చీ, సీఐడీ ఐజీ బ్రిజ్‌లాల్‌పై ప్రభుత్వ పెద్దల గుర్రు
త్వరలో సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీ
డీజీ బాలసుబ్రహ్మణ్యంకు కీలక పోస్టు
సాక్షి, అమరావతి: రెడ్‌బుక్ కుట్రలకు సహకరించని పోలీస్ అధికారులకు పొగబెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధపడుతోంది. విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ, సీఐడీ విభాగంలో ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్‌లను అప్రాధాన్య పోస్టులకు బదిలీ చేసేందుకు సిద్ధపడుతోంది. దీర్ఘకాలిక సెలవు నుంచి తిరిగొచ్చిన డీజీ ఎన్. బాలసుబ్రహ్మణ్యంను కీలక పోస్టులో నియమించాలని భావిస్తోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగియడంతో రాష్ట్రంలో సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీకి ప్రభుత్వం ఉపక్రమించింది. ఐజీ నుంచి డీజీ స్థాయి అధికారుల బదిలీ ప్రక్రియ చేపట్టనుంది. ఇందులో భాగంగా..
⇒ విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంఖబత్ర బాగ్చీని బదిలీచేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఆయనపట్ల టీడీపీ ప్రభుత్వ పెద్దలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. విశాఖపట్నం వంటి కీలక నగరంలో నిబంధనలకు విరుద్ధంగా పోలీస్ వ్యవస్థను రాజకీయ అవసరాలకు వాడుకోవాలని అమరావతిలోని ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేస్తున్నారు. కానీ, అందుకు శంఖబత్ర బాగ్చీ సహకరించడంలేదని ఆయనపై గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ని బదిలీ చేయాలని ప్రభుత్వ పెద్దలు సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం.
ఆయన స్థానంలో విశాఖపట్నం సీపీగా ప్రస్తుత గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమించాలని భావిస్తున్నారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ అక్రమాలకు ఆయన ఏకపక్షంగా కొమ్ముకాసిన విషయం తెలిసిందే. ఇక తిరుమల లడ్డూ ప్రసాదం పవిత్రతకు కళంకం ఆపాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సృష్టించిన వివాదంపై దర్యాప్తు కోసం నియమించిన సిట్‌లో ఆయన్నే సభ్యునిగా చేర్చారు. ఈ నేపథ్యంలో.. నిబంధనలతో నిమిత్తం లేకుండా టీడీపీ పెద్దల ఆదేశాలను అమలుచేస్తారనే నమ్మకంతోనే సర్వశ్రేష్ఠ త్రిపాఠిని విశాఖ పోలీస్ కమిషనర్‌గా నియమించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
⇒ అలాగే, నిబంధనల మేరకు మాత్రమే పనిచేసే అధికారిగా గుర్తింపు పొందిన సీఐడీ విభాగంలో ఐజీగా ఉన్న వినీత్ బ్రిజ్‌లాల్‌ను కూడా బదిలీచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రెడ్‌బుక్ కుట్రలో భాగంగా కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా అంటూ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసు దర్యాప్తు కోసం నియమించిన సిట్ ఇన్‌చార్జ్‌గా ఈయన ఉన్నారు.
దర్యాప్తుతో నిమిత్తం లేకుండా తాము చెప్పినట్లు నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ పెద్దలు, పోలీసు ఉన్నతాధికారుల ఒత్తిడికి ఆయన ఏమాత్రం లొంగలేదు. నిబంధనల మేరకు దర్యాప్తు చేస్తా.. లేదంటే రాజీనామా చేసి వెళ్లిపోతానని వినీత్ స్పష్టంచేసి సెలవు పెట్టి వెళ్లిపోయారు. దీంతో.. అప్పటికప్పుడు ఆయన్ను బదిలీచేస్తే అభాసుపాలవుతామని ప్రభుత్వ పెద్దలు వెనుకంజ వేశారు. అందుకే ప్రస్తుతం సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీ పేరుతో ఆయన్ని సీఐడీ విభాగం నుంచి తప్పించి అప్రాధాన్య పోస్టుకు పరిమితం చేయాలని చూస్తున్నారు.
⇒ ఇక దీర్ఘకాలిక సెలవు ముగించుకుని వచ్చిన డీజీ ఎన్. బాలసుబ్రహ్మణ్యంను ప్రభుత్వం కీలక పోస్టులో నియమించనుంది. ఆయనకు పోలీసు శాఖలో పోస్టు ఇస్తారా లేదా ఇతర శాఖలో ముఖ్య కార్యదర్శిగా నియమిస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఐటీ శాఖలో ఆయన్ను నియమించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
⇒ మరోవైపు.. తెలంగాణ కేడర్ నుంచి ఏపీకి కేటాయించిన డీజీ స్థాయి అధికారులు అంజనీకుమార్, అభిలాష్ బిస్త్ ఇంకా రాష్ట్రంలో రిపోర్టు చేయలేదు. మరో ఐపీఎస్ అభిషేక్ మహంతి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వారు ఏపీలో రిపోర్ట్ చేసిన అనంతరం వారిని ఏ పోస్టుల్లో నియమిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. పోలీసు శాఖలోని వివిధ విభాగాల్లో ఉన్న అదనపు డీజీ, ఐజీ స్థాయి అధికారులను కూడా బదిలీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సీనియర్ ఐపీఎస్ అధికారులను ఈ వారంలోనే బదిలీ చేసే అవకాశాలున్నాయని పోలీసుశాఖ వర్గాలు చెబుతున్నాయి.