
సందర్భం
దండకారణ్యంలోని ఛత్తీస్‌గఢ్‌లో నరమేధం జరుగుతున్నది. బీజేపీ ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ పేరుతో అంతిమ యుద్ధం ప్రకటించింది. మూడు శాతం ఆదివాసీ ప్రజలు జీవించే అబూఝ్‌మడ్, దంతెవాడ, కాలేకర్, కిష్టారం ప్రాంతాలున్న కీకారణ్యాన్ని 70 వేల మంది మిలిటరీ బలగాలతో చుట్టుముట్టింది. 630కి పైగా పోలీస్ క్యాంపులను ఏర్పాటు చేసింది. అటు గడ్చిరోలి నుంచి ఇటు ఒరిస్సా మల్కాన్‌గిరి (Malkangiri) దాకా వివిధ రాష్ట్రాల పోలీసు బలగాలను సమన్వయం చేసుకుంటూ సెర్చింగ్, వేట కొనసాగిస్తున్నది. 2026 మార్చ్ నాటికి మావోయిస్టు రహిత ప్రాంతంగా ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) పదే పదే ప్రకటిస్తున్నారు. అందుకోసం మాజీలనూ, కోవర్టులనూ ఉపయోగించుకుంటున్నారు. ఈ ఆరు నెలల కాలంలోనే దాదాపు 350 మందిని ఎన్‌కౌంటర్ పేరుతో కాల్చి చంపారు.
అంతిమ యుద్ధం?
బస్తర్ ప్రాంతాన్ని, అందులో ముఖ్యంగా అబూఝ్‌మాడ్‌ను కేంద్రంగా చేసుకొని నాటి పీపుల్స్‌వార్ పార్టీ, అదే నేటి మావోయిస్టు పార్టీ సాయుధ దళాల కేంద్రంగా ఉద్యమ నిర్మాణానికి పూనుకున్నది. దళాల సంఖ్య పెంచుకోవడమేగాక, పీపుల్స్ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ (పీజీఎల్‌ఏ)ని ఏర్పాటు చేశామని ప్రకటించింది. ఈ ప్రాంతంలో జనతన్ సర్కార్ ఏర్పడిందని ప్రకటించింది. వ్యవసాయం, స్కూళ్ళు, ఆర్థిక విధానం తామే నియంత్రిస్తున్నామని చెప్పుకొన్నది. అరుంధతీ రాయ్ (Arundhati Roy) నుంచి అంతర్జాతీయ మేధావుల దాకా, జర్నలిస్టుల నుంచి రచయితల దాకా జనతన్ సర్కార్ ఏర్పాటు ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రజా గెరిల్లాలు ప్రభుత్వ బలగాలను ఎదుర్కొంటున్నాయని చెప్పారు.
4 వేల చదరపు కిలోమీటర్లకు పైగా వైశాల్యం, 233 ఆదివాసీ గ్రామాలు, 25 వేల ఆదివాసీ జనాభా గల, కొండలు, గుట్టలు, దట్టమైన అడవి ప్రాంతమది. క్లెమోర్‌మైన్స్‌తో అనేక మిలిటరీ బలగాల వాహనాలను పేల్చి, వందల సంఖ్యలో మిలిటరీ వారిని హతమార్చారు. ప్రజా కోర్టులు నిర్వహించి శిక్షలు వేశారు.
వందలాది మంది చైతన్య స్ఫూర్తితో ఆ ప్రాంతానికి తరలి వెళ్ళి విప్లవ జీవితం గడపటం అసాధారణ విషయమే. త్యాగాలకు సిద్ధపడటం గొప్ప విషయం. ఆ మేరకు వారి అంకిత భావాన్ని గౌరవించాలి. అణచివేతకు వ్యతిరేకంగా, మిలిటరీ క్యాంపులకు వ్యతిరేకంగా, రోడ్లను, టెలిఫోన్ తీగలను మావోయిస్టులు ధ్వంసం చేశారు. తమ విముక్తి జోన్ లోకి రాజ్యం జొరబడొద్దని ఈ చర్యలు చేపట్టారు. ఇది ప్రభుత్వానికి సవాల్‌గా, అవకాశంగా కూడా మారింది. దానితో ఒక దశలో పాలకులు సల్వాజుడుంను నెలకొల్పి, ఆదివాసీ తెగల మధ్య వైషమ్యాలు సృష్టించి బీభత్సకాండ కొనసాగించారు. వివిధ డెడ్‌లైన్లతో వివిధ ఆపరేషన్లు చేపట్టారు. మావోయిస్టు చర్యలను పెద్ద ఎత్తున ప్రచారం చేసి, వారి తరఫున మాట్లాడే సమూహాలకు మాట్లాడలేని పరిస్థితిని కల్పించారు. ఆ తరువాత అధునాతన ఆయుధాలు, టెక్నాలజీతో జాయింట్ ఆపరేషన్లకు తెరలేపారు. అదే ఆపరేషన్ కగార్. అంటే అంతిమ యుద్ధం!
మారాల్సిన పంథా
మూడు దశాబ్దాలుగా అబూఝ్‌మాడ్ (Abujhmarh) మావోయిస్టు ఉద్యమానికి బలమైన స్థావరంగా నిలబడింది. ఆదివాసులు ఉద్యమాలలో, గెరిల్లా దళాలలో భాగమయ్యారు. 1969–70లలో వరంగల్, ఖమ్మం, గోదావరి జిల్లాలలో కమ్యూనిస్టు విప్లవకారులు పని చేసిన నాటి పరిస్థితి నేడు ఛత్తీస్‌గఢ్‌లో ఉంది. మావోయిస్టు పార్టీ అఫెన్సివ్ మిలిటరీ ఎత్తుగడల వలన సాయుధ శక్తిని సమకూర్చుకున్నది. ఆయుధాలు సేకరించడం, తయారు చేయడం, ప్రెషర్ బాంబులు, మందు పాతర్లతో పోలీసులు అడవికి రావాలంటేనే భయపడే రోజులు నడిచాయి. ఆదివాసులు తమ నిత్య జీవన సమరంలో మావోల హీరోయిక్ చైతన్యానికి ఆకర్షితులయ్యారు. కానీ ఒకవైపు పోలీసుల నిర్బంధం, మరోవైపు మావోయిస్టుల ప్రతి విధ్వంసాల మధ్య చాలామంది వలస పోయారు.
ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో వర్గ పోరాటం ఎవరి మీద చేయాలి? అక్కడ భూస్వాములు లేరు. అరా కొరా ధనిక రైతులు ఉన్నారు. మిగిలిన వారంతా పేద రైతులు, ఆదివాసీ జనాభా. కాబట్టి భూస్వామ్య వ్యతిరేక పోరాటంతో వర్గ వైరుద్ధ్యం తీవ్రమయ్యే పరిస్థితి లేదు. ప్రభుత్వ బలగాల మీద, యంత్రాంగం మీద, వారు కొమ్ముకాస్తున్న, ఖనిజాల కోసం కోరలు చాస్తున్న కార్పొరేట్ కంపెనీల మీదనే పోరాటం చేయాలి. ప్రజాస్వామిక స్పందనలు నామమాత్రంగా ఉన్న ఈ కాలంలో, ఒక చిన్న మారుమూల చోట, ఆదివాసీ కొండ ప్రాంతాల్లో జనతన సర్కార్ ఏర్పడటం, నిలవడం అసాధ్యమైన విషయం.
ఈ ప్రాంత ప్రజలు ఎన్నికలలో పాల్గొంటున్నారు. ప్రభుత్వ పథకాలు పొందుతున్నారు. ప్రభుత్వ విద్యాలయాల కోసం, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులు గెలవడం గమనార్హం. అలాంటప్పుడు ప్రత్యామ్నాయ ప్రజా ప్రభుత్వ విముక్తి ప్రాంతం సాధ్యమా? పాత అతివాదపు అఫెన్సివ్ ఎత్తుగడలతో కాకుండా, ప్రస్తుత స్థితికి తగిన విధంగా విధానాలను రూపొందించుకోవడం మావోయిస్టు (Maoist) ఉద్యమానికి అవసరం. యుద్ధం చేస్తున్నామనే భావనలో నుంచి మావోయిస్టు పార్టీ బయటపడి, తగిన ప్రజా ఉద్యమక్షేత్రాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది.
చదవండి: మావోయిస్టులపై మోదీ సర్కారు ద్విముఖ పోరు
అలాగే, నెత్తురుటేర్లతో విప్లవోద్యమాలను నిర్మూలించలేరు. ఆ భావజాలం మళ్ళీ మళ్ళీ పురుడు పోసుకుంటూనే ఉంటుంది. వ్యవస్థ మారేంత వరకు ఈ పోరాటపు నెగళ్ళు సమాజం నిండా అలుముకుంటూనే ఉంటాయి. వీటిని నిర్బంధం ద్వారా దెబ్బతీయవచ్చేమో కానీ, ఆ వర్గ పోరాటం అనివార్యంగా జరగాల్సిందే! ప్రభుత్వ దమననీతిపై పోరాటం చేస్తూనే, భౌతిక పరిస్థితులకు అనుగుణంగా పోరాటాలను ఎంచుకోవడం విప్లవశక్తుల కర్తవ్యం.
- పోటు రంగారావు
సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజా పంథా) కార్యదర్శి