
విశాఖ నడిబొడ్డున అత్యంత విలువైన 13.43 ఎకరాల భూమి ధారాదత్తం
టెండర్లు, ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదన నోటిఫికేషన్ లేకుండానే కేటాయింపు
బహిరంగ మార్కెట్లో ఎకరం రూ.150 కోట్లకుపైనే
షాపింగ్ మాల్.. మల్టీప్లెక్స్ నిర్మాణానికి సిద్ధం
లూలూ చైర్మన్ లేఖ రాయగానే రూ.2 వేల కోట్ల భూమిని రాసిచ్చేసిన బాబు సర్కార్
అడ్డగోలుగా కేటాయింపు.. పారదర్శకతకు పాతర.. అంతా స్కామ్‌ల మయం
ఓ ప్రైవేటు సంస్థకు ప్రభుత్వ భూమిని 99 ఏళ్లకు కట్టబెట్టేశారు..
ఇవన్నీ కాక లూలూకు రూ.170 కోట్ల మేర ప్రత్యేక రాయితీలు
రాష్ట్ర చరిత్రలోనే ఇది అతి పెద్ద స్కామ్ అంటున్న పారిశ్రామిక వర్గాలు
సాక్షి, అమరావతి: ‘లూలూ’గ్రూపుపై చంద్రబాబు సర్కారు వల్లమాలిన ప్రేమ చూపింది. లూలూ గ్రూపు చైర్మన్ యూసుఫ్ అలీ జనవరి 17న సీఎం చంద్రబాబుకు రాసిన ఓ లేఖ ఆధారంగా విశాఖలో అత్యంత ఖరీదైన భూమిని నామమాత్రపు లీజుపై ఆ సంస్థకు ధారాదత్తం చేసింది. విశాఖలోని హార్బర్ పార్క్‌లో 13.43 ఎకరాల భూమిలో అభివృద్ధి ప్రాజెక్టుకు టెండర్.. ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదన (ఆర్‌ఎఫ్‌పీ) నోటిఫికేషన్ జారీ చేయకుండానే వ్యవహారాన్ని పూర్తి చేసింది.
హార్బర్ పార్క్‌లో ఎకరం భూమి బహిరంగ మార్కెట్లో రూ.150 కోట్లకుపైగా పలుకుతోందని విశాఖ వాసులు చెబుతున్నారు. అంటే.. ఏకంగా రూ.2 వేల కోట్లకుపైగా విలువైన ప్రభుత్వ భూమిని ‘లూలూ’కు రాసిచ్చేసినట్లు స్పష్టమవుతోంది. బీచ్ పక్కనే ఉన్న హార్బర్ పార్క్‌లో 13.43 ఎకరాల ఖరీదైన భూమి వీఎంఆర్‌డీఏ(విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ) అధీనంలో ఉంది.
అత్యంత విలువైన ఈ భూమిలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో అభివృద్ధి ప్రాజెక్టు చేపట్టాలంటే టెండర్ నోటిఫికేషన్ జారీ చేసి పారదర్శకంగా ప్రైవేటు సంస్థను ఎంపిక చేయాలి. నిబంధనల ప్రకారం ప్రభుత్వ భూమిని ప్రైవేటు సంస్థలకు 33 ఏళ్లకు మించి లీజుకు ఇవ్వడానికి వీల్లైదని అధికార వర్గాలు చెబుతున్నాయి.
కానీ.. “లూలూ’కు 99 ఏళ్లకు నామమాత్రపు అద్దెపై అప్పగిస్తూ.. ఆ సంస్థ ఛైర్మన్ విధించిన షరతులన్నింటికీ తలూపుతూ ఖరీదైన భూమిని ప్రభుత్వం కట్టబెట్టేసింది. ఈ వ్యవహారంలో రూ.వేల కోట్లు చేతులు మారడం వల్లే నిబంధనలు తుంగలో తొక్కి “లూలూ’పై వల్లమాలిన ప్రేమ చూపించినట్లు స్పష్టమవుతోంది.
18 ఏళ్ల అనుబంధం.. ఆగమేఘాలపై పచ్చజెండా
టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే లూలూ ప్రాజెక్టుకు చంద్రబాబు తిరిగి పచ్చ జండా ఊపారు. గతేడాది సెప్టెంబరు 28న సీఎం చంద్రబాబుతో సమావేశమైన లూలూ గ్రూపు ఛైర్మన్ యూసుఫ్ అలీ విశాఖలో షాపింగ్ మాల్, ఎనిమిది స్క్రీన్లతో ఐమ్యాక్స్ మల్టీప్లెక్స్ నిర్మాణంపై చర్చించారు. దీనిపై అదే రోజు “ఎక్స్’ వేదికగా సీఎం చంద్రబాబు ట్వీట్ చేయగా.. తనకు చంద్రబాబుతో 18 ఏళ్లుగా అనుబంధం ఉందంటూ లూలూ గ్రూప్ ఛైర్మన్ ప్రతిస్పందిస్తూ రీట్వీట్ చేశారు.
ఈ క్రమంలో విశాఖ హార్బర్ పార్క్‌లో 13.43 ఎకరాల భూమిని అప్పగిస్తే ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపడతామంటూ ఈ ఏడాది జనవరి 17న సీఎం చంద్రబాబుకు లూలూ గ్రూపు ఛైర్మన్ లేఖ రాశారు. ఈ ప్రతిపాదనలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈనెల 13న ఎస్‌ఐపీబీ(స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు) సమావేశంలో ఆమోదముద్ర వేశారు.
ఇలా కలిశారు.., అలా జీవో ఇచ్చేశారు
భారీ రాయితీలు.. అత్తెసరు అద్దె
తమకు భూమిని 99 ఏళ్ల లీజుకు ఇవ్వాలని.. మల్టీప్లెక్స్ ప్రారంభమయ్యే వరకూ లేదా మూడేళ్ల వరకూ.. ఈ రెండింటిలో ఏది ముందైతే అంతవరకూ అద్దె మినహాయింపు ఇవ్వాలని లాలూ గ్రూపు ఛైర్మన్ సీఎం చంద్రబాబుకు రాసిన లేఖలో కోరారు. పదేళ్లకు ఒకసారి పది శాతం అద్దె పెంచాలని, సాధ్యమైనన్ని అన్ని రకాల రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రతిపాదించారు.
వాటన్నింటికీ ప్రభుత్వం తలూపడంపై అధికార వర్గాలు విస్తుపోతున్నాయి. ఎకరానికి నామమాత్రంగా రూ.50 లక్షలు అద్దెగా నిర్ణయించినట్లు చెబుతున్నారు. స్టాంపు డ్యూటీ మినహాయింపు, జీఎస్టీ రాయితీలు తదితర ప్రోత్సాహకాల కింద లూలూ గ్రూప్‌నకు రూ.170 కోట్లకుపైగా ప్రయోజనం చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు చర్చ సాగుతోంది.
లాలూ గ్రూప్ కోరికల చిట్టాకు తలూపి అంత లబ్ధి చేకూరుస్తున్నా ఆ ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వానికి అద్దె రూపంలో అత్తెసరు ఆదాయం మాత్రమే రానుండటం గమనార్హం. దీన్నిబట్టి ఇందులో భారీ ఎత్తున ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలు బలంగా వ్యక్తమవుతున్నాయి.
2018 ఫిబ్రవరి 16న నాటి టీడీపీ సర్కార్ లూలూ సంస్థకు పీపీపీ పద్ధతిలో షాపింగ్ మాల్, ఎనిమిది స్క్రీన్లతో ఐమ్యాక్స్ మల్టీప్లెక్స్ నిర్మాణానికి భూమిని నామమాత్రపు లీజుపై కేటాయించి భారీ రాయితీలు కల్పిస్తూ ఏకపక్షంగా కట్టబెట్టింది. దీని వెనుక భారీ ఎత్తున ముడుపులు చేతులు మారినట్లు అప్పట్లో ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేసింది.

ఆదాయాన్ని ఆర్జించే వీలున్నా..
వాస్తవానికి లూలూ మాల్‌కు అప్పగిస్తున్న భూమిలో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్మాణాలను చేపట్టి వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించడం, అద్దెలకు ఇవ్వడం ద్వారా భారీగా ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉంది. అయితే దీన్ని కాదని.. ఓ ప్రైవేట్ సంస్థకు కారుచౌకగా ఏకంగా 99 ఏళ్లకు లీజుకు అత్యంత ఖరీదైన స్థలాన్ని కట్టబెడుతుండటంపై పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
దీని వెనుక గూడుపు ఠాణీ వ్యవహారాలే కారణమనే అనుమానాలు బలపడుతున్నాయి. అక్కడకు సమీపంలోనే రహేజా నిర్మిస్తున్న ఇన్ ఆర్బిట్ మాల్ కూడా ఉంది. నిజంగానే షాపింగ్ మాల్ కట్టాలనుకుంటే ప్రభుత్వమే నిర్మించవచ్చు. బ్యాంకు రుణం కూడా పొందే వీలుంది. అలాకాకుండా ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేట్ సంస్థలకు పప్పు బెల్లాల మాదిరిగా ధారాదత్తం చేయడం, రూ.వందల కోట్ల రాయితీలు కల్పించడం ఏమిటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆ భూమిని ఒకవేళ ప్రైవేట్ పరం చేయాలనుకుంటే టెండర్లు నిర్వహించి బహిరంగ ప్రకటన జారీ చేయాలి. రూ.2 వేల కోట్లకుపైగా ఆదాయాన్ని ఖజానాకు జమ చేసి పారదర్శకంగా వ్యవహరించాలి. దీనికి విరుద్ధంగా 99 ఏళ్ల పాటు లీజు.. పలు రాయితీలు కల్పించడం వెనుక గోల్ఙ్‌మాల్’ వ్యవహారాలు దాగి ఉన్నట్లు స్పష్టమవుతోంది.
⇒ ఎకరానికి చెల్లించే అద్దె: రూ.50 లక్షలు
⇒ లీజు గడువు: 99 ఏళ్లు
⇒ రాయితీల రూపంలో లూలూ పొందే లబ్ధి: రూ.170 కోట్లు
(స్టాంపు డ్యూటీ మినహాయింపు, జీఎస్టీ రాయితీలు తదితరాలు)