ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుహక్కు అత్యంత కీలకం. నవ సమాజ నిర్మాణానికి పునాది. సమర్థ పాలనకు ఆయువు. తమను పాలించే పాలకులను నిర్ణయించడానికి, మంచివారిని ఎన్నుకోవడానికి, అవినీతిపరులను గద్దె దింపడానికి ఓటు సామాన్యుడి చేతిలో ఉన్న పాశుపతాస్త్రం లాంటిది. ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన అనూహ్య ఫలితాలు ఓటు విలువను చెప్పకనే చెబుతున్నాయి.
ఇంతటి పవిత్రమైన, విలువైన ఓటు పట్ల ప్రజలు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ముఖ్యంగా యువత ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఆసక్తి కనబర్చడం లేదు. దేశ భవిత తమ చేతుల్లోనే ఉందన్న వాస్తవాన్ని విస్మరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓటు విలువను వివరించి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చైతన్యవంతం చేసే ఉద్దేశంతో ఏటా జనవరి 25న జాతీయ ఓటరు దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘న్యూస్‌లైన్’ అందిస్తున్న ప్రత్యేక కథనం.
చదువు, భవిష్యత్తు నిరంతరం ఆలోచిస్తున్న యువత పౌరులుగా తమ బాధ్యతలను పూర్తి స్థాయిలో నెరవేర్చడం లేదు. చాలా మంది ఎవరికి ఓటేసినా తమకు ఒరిగేదేముందిలే అనే భావనతో ఓటు విలువను గుర్తించలేకపోతున్నారు. కనీసం ఓటరు గా నమోదు చేసుకోవడానికి కూడా ఆసక్తి చూపడం లేదు. యువతరం సంఖ్య గణనీ యంగా పెరుగుతున్నా ఆ స్థాయిలో ఓటర్ల సంఖ్య పెరగకపోవడమే ఇందుకు నిదర్శనం.
ఈ కారణంగానే ఓటు హక్కు విలువను తెలియజేసి ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఇటీవల ఎన్నికల కమిషన్ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించింది. స్పెషల్ క్యాంపెయిన్‌ల పేరుతో ఆయా గ్రామాలు, కళాశాలల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఓటరు నమోదు చే పట్టింది.
ఓటరు నమోదుకు అర్హత ఏమిటంటే..
2014 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండి దేశ పౌరసత్వం కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవడానికి అర్హులే. మానసిక వికలాంగులకు, ఎన్నికల నేరాల్లో పాల్పడి నిర్ణీత నేరాల్లో శిక్ష అనుభవించిన వారు మాత్రమే అనర్హులు.
ఓటు హక్కు పొందాలంటే..
ఏదైనా అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటరుగా నమోదు చేసుకోవాలంటే దరఖాస్తుదారుడు ఫార్మ్ 6 ఫారాన్ని నింపి నిర్ణీత ప్రదేశంలో ఫొటో అంటించి, వయసు, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాలతో కలిసి ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్‌కు అందజేయాల్సి ఉంటుంది. విదేశాల్లో నివసించే ప్రవాస భారతీయులు కూడా ఫార్మ్ 6ఏ ను నింపి సంబంధిత అధికారికి అందజేయాల్సి ఉంటుంది.
అభ్యంతరాలు తెలియజేయాలంటే..
ఓ పోలింగ్ బూత్ పరిధిలో ఓటరుగా నమోదైన వ్యక్తి ఏవైనా అభ్యంతరాలుంటే ఫార్మ్ 7ను నింపి ఈఆర్‌ఓకు అందజేయాల్సి ఉంటుంది. రెండు చోట్లా ఓటు హక్కు కలిగి ఉండడం, తప్పుడు వివరాల నమోదు వంటి విషయాలను పరిశీలించిన అనంతరం సంబంధిత అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటారు. ఇతర ప్రాంతాల్లో ఓటు హక్కు నమోదు చేయదలచుకుంటే ఫార్మ్ 7 ద్వారా ఇప్పటికే ఉన్న ఓటు హక్కును రద్దు చేసుకునే వీలుంటుంది.
సవరణల కోసం...
తమ వివరాలు ఎన్నికల జాబితాలో నమోదైన తర్వాత వాటిలో తప్పులు ఉన్నట్లు గమనిస్తే ఫార్మ్ 8 ద్వారా వాటిని సరిదిద్దుకోవచ చ్చు. పేరు, ఇంటి పేరు, తండ్రి పేరు, చిరునామా తదితర అంశాల్లో తప్పొప్పులను సరిదిదిద్దుకునే వీలుంది. చిరునామా మార్పు కోసం ఫార్‌మ 8ఏ పూరించి సంబంధిత అధికారులకు అందించాల్సి ఉంటుంది.
ప్రత్యామ్నాయ ఓటరు నియామకం...
పోలింగ్ స్టేషన్‌కు వచ్చి ఓటు వేసే వీలు లేని వారు ప్రోక్సీ ఓటరు (ప్రత్యామ్నాయ ఓటరు) ను ఫార్మ్ 13ఎఫ్ ద్వారా ఏర్పాటు చేసుకోవ చ్చు. అవసరం లేదనుకున్న సమయంలో ఫా ర్మ్ 13జి ద్వారా దానిని రద్దు చేసుకొని ఓటు వేసే అవకాశాన్ని పునరుద్ధరించుకోవచ్చు.
ఆన్‌లైన్‌లోనూ ఓటరు నమోదు...
ఓటరు నమోదుకు ఆన్‌లైన్‌లోనే సంబంధిత ఫారాలను నింపి అధికారులకు సమర్పించే వీలుంది. నెట్‌లోనే సంబంధిత వివరాలు అన్నీ పూర్తి చేసి ఫొటో, ఇతర డాక్యుమెంట్లను స్కాన్ చేసి పంపిస్తే అధికారులు నిర్ణీత వ్యవధిలో ఓటు హక్కును కల్పిస్తారు. ఈ సేవా కేంద్రానికి వెళ్లి అధికారులు ఇచ్చే ఎపిక్ నంబరును చెప్పి ఓటరు గుర్తింపు కార్డును పొందొచ్చు.
నేడు జాతీయ ఓటరు దినోత్సవం
Published Fri, Jan 24 2014 11:41 PM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement