vote registration in online
-
సమయం లేదు మిత్రమా..! బీ అలర్ట్
సాక్షి ప్రతినిధి,ఒంగోలు: ఓటు వజ్రాయుధం. నచ్చిన నాయకులను పాలకులుగా ఎన్నుకొనే అవకాశం ఇచ్చేది ఓటే. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేవారిని, మంచి పాలన అందించే వారిని ఎంపిక చేసుకొనే అవకాశం ఓటు ద్వారానే వస్తోంది. అంటే మీరంతా తప్పకుండా ముందు ఓటర్లుగా నమోదై ఉండాలి. సమయం మించి పోతోంది. ఓటరుగా నమోదు కావడానికి ఇక నాలుగు రోజులే గడువుం మిగిలి ఉంది. ఈ నెల 15 ఓటరు నమోదుకు చివరి తేదీగా భారత ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. మార్చి 15 దాటితే ఓటు నమోదుకు అవకాశం ఉండదు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం కోల్పోకండి. ముందు ఓటరుగా మారండి. అందరూ ఓటర్ల జాబితాలో ఓటు చెక్ చేసుకోవాలి. లేనివారు వెంటనే అన్లైన్ లేదా నేరుగా ఓట్ల నమోదు కేంద్రానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. 18 సంవత్సరాలునిండిన వారితో పాటు గతంలో ఓటు ఉండి కోల్పోయిన వారూ ఓటు నమోదు చేసుకోవచ్చు. ఇక ఇతర ప్రాంతాల నుంచి తామున్న చోటుకు ఓటు బదిలీ సైతం చేసుకొనేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అన్నింటికీ చివరి తేదీ మార్చి 15 మాత్రమే. అందుకే అందరూ అప్రమత్తం కావాలి. సమయం తక్కువగా ఉన్నందున మీ ఓటు నమోదుకు ఫామ్–6 ద్వారా దరఖాస్తు చేసుకోంది. మీ ఓటే కాదు మీ కుటుంబ సభ్యుల ఓట్లూ చెక్ చేసుకోవడంతో పాటు లేకపోతే తక్షణమే వారి ద్వారా ఓటు కోసం దరఖాస్తు చేయించండి. ఎన్నారైలు ఓటు కోసం ఫామ్–6ఎ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఓటర్ల జాబితాలో తప్పొప్పులు ఫారం–8 ద్వారా సరిదిద్దు కోవచ్చు. ఇక నియోజకవర్గంలో ఒకచోటు నుంచి మరొక చోటు కు ఓటు మార్చుకోవాలంటే ఫామ్–8ఏ దరఖాస్తు చేసుకోవాలి. ఓటు నమోదు చేసుకోండిలా... ఎక్కువ మందికి ఎలా నమోదు చేసుకోవాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. ఓటరుగా నమోదు కావడానికి ఫామ్–6 దరఖాస్తుతో పాటు మిగిలిన విభాగాల దరఖాస్తులుసైతం ఆన్లైన్ ద్వారా లేదా నేరుగా కూడా చేసుకొనే వీలుంది. ఆన్లైన్లో గడువులోగా వచ్చిన దరఖాస్తులను డౌన్లోడు చేసి బీఎల్వోల ద్వారా విచారణ జరిపి అన్నీ సక్రమంగా ఉంటే ఓటు ఇస్తారు. కొత్త ఓటు కోసం ఈ– రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ‘హెచ్‌టీటీపీ://సిఇఓఎఎన్డిహెచ్ఆర్ఎ.ఎన్ఐసి.ఐఎన్, హెచ్‌టీటీపీ://డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎన్విఎస్పి.ఐఎన్ వెబ్ చిరునామాలను సంప్రదించి ఈ–రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే ఫామ్–6 దరఖాస్తులు కలెక్టర్ కార్యాలయంలోని హెచ్ విభాగంలో, తహశీల్దార్ కార్యాలయంలో లభిస్తాయి. దరఖాస్తు పూర్తి చేసి మ్యాన్యువల్‌గా కూడా సంబంధిత అధికారికి అందజేయవచ్చు. మొబైల్ ద్వారా కూడా పై వెబ్ చిరునామాను సంప్రదించి కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అందరూ అప్రమత్తంకండి. ఇప్పటికే ఓటు దరఖాస్తు చేసుకొన్నా.. ఇంకా ఓకే కానివారు మిన్నకుండి పోకుండా సంబంధిత తహశీల్దారు కార్యాలయం లేదా ఎన్నికల అధికారి కార్యాలయానికి వెళ్లి మీరు దరఖాస్తు చేసుకున్న ఓటు విషయంపై విచారించండి. అది ఏ స్టేజీలో ఉందో తెలుసుకోండి. సకాలంలో ఓటు వచ్చేలా అధికారులపై ఒత్తిడి తెండి. బీఎల్ఓలు స్పందించక పోతే తహశీల్దార్లు, వారూ స్పందించక పోతే ఎన్నికల ప్రత్యేక అధికారులు, ఆర్డీఓ, కలెక్టర్ స్థాయి వరకూ వెళ్లండి. ఓటు నమోదయ్యేలా చూసుకోండి. అధికారులు ఓటు నమోదుపై ఈ నాలుగు రోజులు విస్తృతమైన ప్రచారం నిర్వహించాలి. అందరూ ఓటు హక్కు పొందేలా చైతన్యం తీసుకురావాలి. -
ఓటరు నమోదుకు నాలుగు రోజులే!
సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో ఓటరుగా పేరు నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. రాష్ట్రంలో ఈ నెల 15లోగా ఓటరుగా నమోదు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్ కుమార్ తెలిపారు. గడువులోగా పేరు నమోదు చేసుకున్న వారు ఏప్రిల్ 11న జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు పొందొచ్చని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ గడువు ఈ నెల 25తో ముగియనుండగా దానికి 10 రోజుల ముందు వరకు దరఖాస్తు చేసుకున్న అందరికీ ఓటు హక్కు కల్పిస్తామని వివరించారు. ఆ తరువాత వారంపాటు దరఖాస్తులను పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. ఒకవేళ దరఖాస్తు తిరస్కరిస్తే ఈ నెల 25 వరకు కలెక్టర్‌కు అప్పీల్ చేసుకునే వెసులుబాటు ఉందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు మాత్రం ఈ నెల 25 వరకు ఓటరుగా నమోదు చేసుకోవచ్చన్నారు. లోక్‌సభ ఎన్నికల ఏర్పాట్లపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో రజత్ కుమార్ సోమవారం సచివాలయంలో సమావేశమయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 14న ఈవీఎంల పరిశీలనకు, 25న ఓటర్ల జాబితాల పరిశీలనకు కేంద్ర ఎన్నికల సంఘం బృందాలు రాష్ట్రానికి రానున్నాయన్నారు. ఎన్నికల కోడ్‌లో భాగంగా బహిరంగ మద్యపానం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రజత్ కుమార్ హెచ్చరించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబంధించిన కేసులు, వాటిపై తీసుకునే చర్యల వివరాలను ఎప్పటికప్పుడు ప్రకటిస్తామన్నారు. ప్రభుత్వ భవనాలు, ఇతరత్రా వాటిపై ఉన్న ప్రకటనలను తొలగించాలని ఇప్పటికే ఆదేశించామన్నారు. వెబ్సైట్లలోని ప్రభుత్వ ప్రకటనలపై ఐటీశాఖ నుంచి నివేదిక కోరామన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అవసరమైన సదుపాయాలతోపాటు అత్యవసర వైద్య సదుపాయం కల్పించాలని జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించామన్నారు. పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు ఏర్పాటు చేస్తామన్నారు. సీఈఓతో జరిగిన భేటీలో కాంగ్రెస్ నేతలు మర్రి శశిధర్‌రెడ్డి, నిరంజన్, బీజేపీ నేత గట్టు రామచంద్రరావు, ఎంఐఎం నేత సయ్యద్ ఎహెసాన్ జాఫ్రీ, బీఎస్పీ నేతలు పాల్గొన్నారు. 25 వరకు నామినేషన్ల స్వీకరణ... లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థుల నుంచి ఈ నెల 18 నుంచి 25 వరకు నామినేషన్లు స్వీకరించనున్నామని రజత్ కుమార్ తెలిపారు. ఈ వ్యవధిలో సెలవు రోజులైన హోలీ, ఆదివారం మాత్రం నామినేషన్లు స్వీకరించబోమని స్పష్టం చేశారు. కొందరు ఎన్నికల సిబ్బంది ఇంకా విధుల్లో చేరలేదని, వారు వెంటనే బాధ్యతలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. రాష్ట్ర సరిహద్దుల్లో భద్రతపై అన్ని రాష్ట్రాల అధికారులతో సమన్వయం ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుందని, సమస్యాత్మక నియోజకవర్గాల్లో మాత్రం 4 గంటల వరకే పోలింగ్ ఉండేలా ప్రతిపాదించినట్లు రజత్ తెలిపారు. సాధారణంగా ఒక వ్యక్తి రూ. 50 వేల కంటే ఎక్కువ నగదును పెట్టుకోరాదని, ఆధారాలు తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుందన్నారు. కాగా, ఎన్నికల సిబ్బందిపై సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషితో రజత్ కుమార్ సోమవారం సమావేశమయ్యారు. అన్ని జిలాల్లో రిటర్నింగ్ అధికారులు ఉన్నారని, అయితే కొన్ని ఏఆర్ఓ స్థానాలు భర్తీ చేయాల్సి ఉందన్నారు. అలాగే మిగతా రాష్ట్రాలకు పరిశీలకులుగా పంపాల్సిన ఐఎఎస్ అధికారుల జాబితాపైనా చర్చించారు. బీజేపీ జేబు సంస్థగా ఈసీ: కాంగ్రెస్ మొదటి విడతలోనే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించడం సరైంది కాదని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. కేంద్ర ఎన్నికల కమిషన్ బీజేపీ జేబు సంస్థగా మారిందని ఆరోపించారు. సీఈఓతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రంజాన్ మాసంలో పశ్చిమ బెంగాల్లో ఏడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనుండటంతో అక్కడ గణనీయ సంఖ్యలో ఉన్న ముస్లిం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడం కష్టం కానుందన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అనేక కోడ్ ఉల్లంఘన కేసులు నమోదు అయ్యాయని, అధికార టీఆర్ఎస్ నాయకులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. సుమోటోగా కేసులు నమోదు చేసే అధికారం ఉన్నప్పటికీ ఈసీ ఎందుకు దృష్టిసారించడం లేదన్నారు. ఎన్నో పోరాటాలు చేసిన తనకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ స్లిప్ రాలేదని, ఇది కుట్ర పూరితంగా జరిగిందన్నారు. రాష్ట్రంలో ఓట్ల నమోదు, తొలగింపు విషయంలో టీఆర్ఎస్, ఎంఐఎం కలసి కుట్ర చేస్తున్నాయన్నారు. -
ఉందో అవకాశం...!
ఓటు నమోదుకు ఎన్నికల సంఘం ఇచ్చిన గడువు గత నెలాఖరుతో ముగిసింది. అయినా ఓటు నమోదు చేసుకోలేదా? ఇప్పుడేమి చేయాలని ఆలోచిస్తున్నారా?... ఇందుకోసం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడైనా ఓటు నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. నేరుగా కార్యాలయాలకు వెళ్లి కాకుండా మీ ఇంట్లోనో... నెట్ సెంటరులోనో... కంప్యూటరు ముందు కూర్చొని నమోదు చేసుకోవచ్చు. విజయనగరం గంటస్తంభం: అర్హులంతా ఓటరుగా నమోదు చేసుకునేందుకు గడువు ముగిసినా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఇంకా గడువు ఉంది. దీన్ని గుర్తించి అర్హులైన యువత తమ ఓటు నమోదు చేసుకోవాలని ఎన్నికల సంఘం కోరుతుంది. ఆన్లైన్లో నమోదు ఇలా.. ఆన్లైన్లో ఓటరు నమోదుకు కంప్యూటరులో గూగుల్, ఇతర మెయిల్ ఒపెన్ చేయాలి. అందులో సీఈవో ఆంధ్రా. ఎన్ఐసి. ఇన్ వెబ్సైట్లోకి లాగిన్ కావాలి. అందులో ఎడమ వైపును ఎన్నికల సంఘానికి సంబంధించి అనేక వివరాలు ఉం టాయి. అందులో ఓటరు రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే ఓటు నమోదుకు సంబంధించిన ఫారం–6 దరఖాస్తు ఉం టుంది. అందులో పేరు, ఊరు, పోలింగు కేంద్రం నెంబరు, ఇతర వివరాలు నమోదు చేసి ఫొటో జత చేసి సబ్మిట్ కొట్టాలి. వెంటనే అది రిజిస్టరై ఎన్నికల సంఘం వెబ్సైట్లోకి వెళ్తుంది. అక్కడతో దరఖాస్తుదారుడు పని అయిపోయినట్లే. విచారణ తర్వాత... ఇలా ఆన్లైన్లో చేసుకున్న దరఖాస్తు ఎన్నికల సంఘం వెబ్సైట్ ద్వారా సంబంధిత తహసీల్దారుకు వస్తోంది. ఆ అధికారి దరఖాస్తు వివరాలు బూత్‌స్థాయి అధికారికి ఇచ్చి విచారణ చేయిస్తారు. అన్ని వివరాలు పరిశీలించి వాటిని తిరిగి బీఎల్వో తహసీల్దారుకు అప్పగిస్తారు. వెంటనే ఎన్నికల సంఘం వెబ్సైట్లోకి అప్లోడ్ చేస్తారు. అన్నీ సక్రమంగా ఉండి ఓటుకు అర్హత ఉంటే వివరాలు వెబ్సైట్లో పొందుపరుస్తారు. అర్హత లేకుండా, దరఖాస్తులో లోటుపాట్లు ఉంటే వెంటనే తిరస్కరిస్తారు. ఓటు వెంటనే వచ్చేస్తుందా... విచారణ తర్వాత అధికారులు అప్లోడ్ చేసి అర్హత ఉన్న వారికి ఓటు ఒక్కోసారి వెంటనే ఓటర్ల జాబితాలోకి వెళ్తుంది. లేకుంటే ఎన్నికల సంఘం వాటిని ఎప్పుడు పరగణణలోనికి తీసుకుంటే అప్పుడు జాబితాలోకి వెళ్తుంది. ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా దరఖాస్తులు స్వీకరణ గడువు ఆక్టోబరు 31వ తేదీతో ముగిసిన విషయం తెలిసిందే. కావున నవంబరు ఒకటో తేదీ నుంచి ఓటు నమోదుతో పాటు ఇతర అంశాలపైనా దరఖాస్తు నేరుగా తీసుకోరు. ఇచ్చినా వాటిని విచారించరు. అంటే ఆ విధంగా ఓటు జాబితాలోకి రాదు. కానీ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని అర్హత ఉన్న వారి ఓటు ప్రస్తుతం జరుగుతున్న దరఖాస్తులు విచారణ పూర్తి చేసి, వెబ్సైట్లో అప్లోడ్ చేసే వరకు జాబితాలోకి వెళ్తాయి. వారి ఓట్లు జనవరి 4న పోలింగు కేంద్రాల్లో ప్రచురించే జాబితాలో ఉంటాయి. అయితే విచారణ పూర్తయి అప్లోడ్ చేసిన తర్వాత ఎవరైనా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నా విచారణ జరిగి అర్హత తేల్చి, వెబ్సైట్లో పెడతారు. వాటిని జాబితాలోకి పెట్టాలని ఎన్నికల సంఘం ఎప్పుడు నిర్ణయిస్తే అప్పుడే వస్తోంది. అయితే ఏదైనా ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు అర్హత ఉన్న వారు ఎవరూ ఓటు వేయకుండా ఉండరాదన్న ఉద్దేశంతో ఎన్నికలకు ముందు మరో అవకాశం ఇస్తోంది. అలాంటప్పుడు వెబ్సైట్లో అప్పటికే ఉన్న ఓటర్ల వివరాలు జాబితాకు జతవుతాయి. కావున ఎన్నికల నాటికి ఓటు వస్తోంది. గత కొన్నేళ్లుగా ఎన్నో ఎన్నికల్లో ఇలా జరిగింది. ఇప్పుడు ఆన్లైన్లో వచ్చినవి ఎక్కువే... ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితాలో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణలో భాగంగా గత నెలాఖరు వరకు చేర్పుల కోసం 68,755 దరఖాస్తులు రాగా అందులో ఆన్లైన్లో 19,346 దరఖాస్తులు రావడం విశేషం. ఇందులో ఇప్పటికే 2941 స్వీకరించారు. సక్రమంగా లేకపోవడంతో 178 తిరస్కరించారు. ఇంకా 16,227 విచారణ చేస్తున్నారు. కావున ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. కావున యువత, ఇతర వయస్కులు దరఖాస్తు చేసుకోవచ్చు. అవకాశం ఉంది.. ఎన్నికల సంఘం వెబ్సైట్లో ఏడాదంతా ఓటు కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. వాటిని తమకు పంపిస్తే విచారించి అర్హత ఉంటే ఎన్నికల సంఘానికి ఆన్లైన్లో పంపిస్తాం. వాటిని పరగణణలోకి తీసుకుని ఎన్నికల సంఘం ఏదో ఒకరోజు నిర్ణయం తీసుకుని వాటిని ఓటర్ల జాబితాలో చేరుస్తుంది. యువత అవకాశం వినియోగించుకోవాలి. – జె.వెంకటరావు, డీఆర్వో -
నేడు జాతీయ ఓటరు దినోత్సవం
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుహక్కు అత్యంత కీలకం. నవ సమాజ నిర్మాణానికి పునాది. సమర్థ పాలనకు ఆయువు. తమను పాలించే పాలకులను నిర్ణయించడానికి, మంచివారిని ఎన్నుకోవడానికి, అవినీతిపరులను గద్దె దింపడానికి ఓటు సామాన్యుడి చేతిలో ఉన్న పాశుపతాస్త్రం లాంటిది. ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన అనూహ్య ఫలితాలు ఓటు విలువను చెప్పకనే చెబుతున్నాయి. ఇంతటి పవిత్రమైన, విలువైన ఓటు పట్ల ప్రజలు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ముఖ్యంగా యువత ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఆసక్తి కనబర్చడం లేదు. దేశ భవిత తమ చేతుల్లోనే ఉందన్న వాస్తవాన్ని విస్మరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓటు విలువను వివరించి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చైతన్యవంతం చేసే ఉద్దేశంతో ఏటా జనవరి 25న జాతీయ ఓటరు దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘న్యూస్‌లైన్’ అందిస్తున్న ప్రత్యేక కథనం. చదువు, భవిష్యత్తు నిరంతరం ఆలోచిస్తున్న యువత పౌరులుగా తమ బాధ్యతలను పూర్తి స్థాయిలో నెరవేర్చడం లేదు. చాలా మంది ఎవరికి ఓటేసినా తమకు ఒరిగేదేముందిలే అనే భావనతో ఓటు విలువను గుర్తించలేకపోతున్నారు. కనీసం ఓటరు గా నమోదు చేసుకోవడానికి కూడా ఆసక్తి చూపడం లేదు. యువతరం సంఖ్య గణనీ యంగా పెరుగుతున్నా ఆ స్థాయిలో ఓటర్ల సంఖ్య పెరగకపోవడమే ఇందుకు నిదర్శనం. ఈ కారణంగానే ఓటు హక్కు విలువను తెలియజేసి ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఇటీవల ఎన్నికల కమిషన్ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించింది. స్పెషల్ క్యాంపెయిన్ల పేరుతో ఆయా గ్రామాలు, కళాశాలల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఓటరు నమోదు చే పట్టింది. ఓటరు నమోదుకు అర్హత ఏమిటంటే.. 2014 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండి దేశ పౌరసత్వం కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవడానికి అర్హులే. మానసిక వికలాంగులకు, ఎన్నికల నేరాల్లో పాల్పడి నిర్ణీత నేరాల్లో శిక్ష అనుభవించిన వారు మాత్రమే అనర్హులు. ఓటు హక్కు పొందాలంటే.. ఏదైనా అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటరుగా నమోదు చేసుకోవాలంటే దరఖాస్తుదారుడు ఫార్మ్ 6 ఫారాన్ని నింపి నిర్ణీత ప్రదేశంలో ఫొటో అంటించి, వయసు, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాలతో కలిసి ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్‌కు అందజేయాల్సి ఉంటుంది. విదేశాల్లో నివసించే ప్రవాస భారతీయులు కూడా ఫార్మ్ 6ఏ ను నింపి సంబంధిత అధికారికి అందజేయాల్సి ఉంటుంది. అభ్యంతరాలు తెలియజేయాలంటే.. ఓ పోలింగ్ బూత్ పరిధిలో ఓటరుగా నమోదైన వ్యక్తి ఏవైనా అభ్యంతరాలుంటే ఫార్మ్ 7ను నింపి ఈఆర్ఓకు అందజేయాల్సి ఉంటుంది. రెండు చోట్లా ఓటు హక్కు కలిగి ఉండడం, తప్పుడు వివరాల నమోదు వంటి విషయాలను పరిశీలించిన అనంతరం సంబంధిత అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటారు. ఇతర ప్రాంతాల్లో ఓటు హక్కు నమోదు చేయదలచుకుంటే ఫార్మ్ 7 ద్వారా ఇప్పటికే ఉన్న ఓటు హక్కును రద్దు చేసుకునే వీలుంటుంది. సవరణల కోసం... తమ వివరాలు ఎన్నికల జాబితాలో నమోదైన తర్వాత వాటిలో తప్పులు ఉన్నట్లు గమనిస్తే ఫార్మ్ 8 ద్వారా వాటిని సరిదిద్దుకోవచ చ్చు. పేరు, ఇంటి పేరు, తండ్రి పేరు, చిరునామా తదితర అంశాల్లో తప్పొప్పులను సరిదిదిద్దుకునే వీలుంది. చిరునామా మార్పు కోసం ఫార్మ 8ఏ పూరించి సంబంధిత అధికారులకు అందించాల్సి ఉంటుంది. ప్రత్యామ్నాయ ఓటరు నియామకం... పోలింగ్ స్టేషన్‌కు వచ్చి ఓటు వేసే వీలు లేని వారు ప్రోక్సీ ఓటరు (ప్రత్యామ్నాయ ఓటరు) ను ఫార్మ్ 13ఎఫ్ ద్వారా ఏర్పాటు చేసుకోవ చ్చు. అవసరం లేదనుకున్న సమయంలో ఫా ర్మ్ 13జి ద్వారా దానిని రద్దు చేసుకొని ఓటు వేసే అవకాశాన్ని పునరుద్ధరించుకోవచ్చు. ఆన్‌లైన్‌లోనూ ఓటరు నమోదు... ఓటరు నమోదుకు ఆన్లైన్లోనే సంబంధిత ఫారాలను నింపి అధికారులకు సమర్పించే వీలుంది. నెట్లోనే సంబంధిత వివరాలు అన్నీ పూర్తి చేసి ఫొటో, ఇతర డాక్యుమెంట్లను స్కాన్ చేసి పంపిస్తే అధికారులు నిర్ణీత వ్యవధిలో ఓటు హక్కును కల్పిస్తారు. ఈ సేవా కేంద్రానికి వెళ్లి అధికారులు ఇచ్చే ఎపిక్ నంబరును చెప్పి ఓటరు గుర్తింపు కార్డును పొందొచ్చు.