ఓటు నమోదుకు ఎన్నికల సంఘం ఇచ్చిన గడువు గత నెలాఖరుతో ముగిసింది. అయినా ఓటు నమోదు చేసుకోలేదా? ఇప్పుడేమి చేయాలని ఆలోచిస్తున్నారా?... ఇందుకోసం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడైనా ఓటు నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. నేరుగా కార్యాలయాలకు వెళ్లి కాకుండా మీ ఇంట్లోనో... నెట్ సెంటరులోనో... కంప్యూటరు ముందు కూర్చొని నమోదు చేసుకోవచ్చు.
విజయనగరం గంటస్తంభం: అర్హులంతా ఓటరుగా నమోదు చేసుకునేందుకు గడువు ముగిసినా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఇంకా గడువు ఉంది. దీన్ని గుర్తించి అర్హులైన యువత తమ ఓటు నమోదు చేసుకోవాలని ఎన్నికల సంఘం కోరుతుంది.
ఆన్‌లైన్‌లో నమోదు ఇలా..
ఆన్‌లైన్‌లో ఓటరు నమోదుకు కంప్యూటరులో గూగుల్, ఇతర మెయిల్ ఒపెన్ చేయాలి. అందులో సీఈవో ఆంధ్రా. ఎన్‌ఐసి. ఇన్ వెబ్‌సైట్‌లోకి లాగిన్ కావాలి. అందులో ఎడమ వైపును ఎన్నికల సంఘానికి సంబంధించి అనేక వివరాలు ఉం టాయి. అందులో ఓటరు రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే ఓటు నమోదుకు సంబంధించిన ఫారం–6 దరఖాస్తు ఉం టుంది. అందులో పేరు, ఊరు, పోలింగు కేంద్రం నెంబరు, ఇతర వివరాలు నమోదు చేసి ఫొటో జత చేసి సబ్‌మిట్ కొట్టాలి. వెంటనే అది రిజిస్టరై ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లోకి వెళ్తుంది. అక్కడతో దరఖాస్తుదారుడు పని అయిపోయినట్లే.
విచారణ తర్వాత...
ఇలా ఆన్‌లైన్‌లో చేసుకున్న దరఖాస్తు ఎన్నికల సంఘం వెబ్‌సైట్ ద్వారా సంబంధిత తహసీల్దారుకు వస్తోంది. ఆ అధికారి దరఖాస్తు వివరాలు బూత్‌స్థాయి అధికారికి ఇచ్చి విచారణ చేయిస్తారు. అన్ని వివరాలు పరిశీలించి వాటిని తిరిగి బీఎల్‌వో తహసీల్దారుకు అప్పగిస్తారు. వెంటనే ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లోకి అప్‌లోడ్ చేస్తారు. అన్నీ సక్రమంగా ఉండి ఓటుకు అర్హత ఉంటే వివరాలు వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. అర్హత లేకుండా, దరఖాస్తులో లోటుపాట్లు ఉంటే వెంటనే తిరస్కరిస్తారు.
ఓటు వెంటనే వచ్చేస్తుందా...
విచారణ తర్వాత అధికారులు అప్‌లోడ్ చేసి అర్హత ఉన్న వారికి ఓటు ఒక్కోసారి వెంటనే ఓటర్ల జాబితాలోకి వెళ్తుంది. లేకుంటే ఎన్నికల సంఘం వాటిని ఎప్పుడు పరగణణలోనికి తీసుకుంటే అప్పుడు జాబితాలోకి వెళ్తుంది. ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా దరఖాస్తులు స్వీకరణ గడువు ఆక్టోబరు 31వ తేదీతో ముగిసిన విషయం తెలిసిందే. కావున నవంబరు ఒకటో తేదీ నుంచి ఓటు నమోదుతో పాటు ఇతర అంశాలపైనా దరఖాస్తు నేరుగా తీసుకోరు. ఇచ్చినా వాటిని విచారించరు. అంటే ఆ విధంగా ఓటు జాబితాలోకి రాదు. కానీ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని అర్హత ఉన్న వారి ఓటు ప్రస్తుతం జరుగుతున్న దరఖాస్తులు విచారణ పూర్తి చేసి, వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసే వరకు జాబితాలోకి వెళ్తాయి.
వారి ఓట్లు జనవరి 4న పోలింగు కేంద్రాల్లో ప్రచురించే జాబితాలో ఉంటాయి. అయితే విచారణ పూర్తయి అప్‌లోడ్ చేసిన తర్వాత ఎవరైనా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నా విచారణ జరిగి అర్హత తేల్చి, వెబ్‌సైట్లో పెడతారు. వాటిని జాబితాలోకి పెట్టాలని ఎన్నికల సంఘం ఎప్పుడు నిర్ణయిస్తే అప్పుడే వస్తోంది. అయితే ఏదైనా ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు అర్హత ఉన్న వారు ఎవరూ ఓటు వేయకుండా ఉండరాదన్న ఉద్దేశంతో ఎన్నికలకు ముందు మరో అవకాశం ఇస్తోంది. అలాంటప్పుడు వెబ్‌సైట్‌లో అప్పటికే ఉన్న ఓటర్ల వివరాలు జాబితాకు జతవుతాయి. కావున ఎన్నికల నాటికి ఓటు వస్తోంది. గత కొన్నేళ్లుగా ఎన్నో ఎన్నికల్లో ఇలా జరిగింది.
ఇప్పుడు ఆన్‌లైన్‌లో వచ్చినవి ఎక్కువే...
ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితాలో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణలో భాగంగా గత నెలాఖరు వరకు చేర్పుల కోసం 68,755 దరఖాస్తులు రాగా అందులో ఆన్‌లైన్‌లో 19,346 దరఖాస్తులు రావడం విశేషం. ఇందులో ఇప్పటికే 2941 స్వీకరించారు. సక్రమంగా లేకపోవడంతో 178 తిరస్కరించారు. ఇంకా 16,227 విచారణ చేస్తున్నారు. కావున ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. కావున యువత, ఇతర వయస్కులు దరఖాస్తు చేసుకోవచ్చు.
అవకాశం ఉంది..
ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ఏడాదంతా ఓటు కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. వాటిని తమకు పంపిస్తే విచారించి అర్హత ఉంటే ఎన్నికల సంఘానికి ఆన్‌లైన్‌లో పంపిస్తాం. వాటిని పరగణణలోకి తీసుకుని ఎన్నికల సంఘం ఏదో ఒకరోజు నిర్ణయం తీసుకుని వాటిని ఓటర్ల జాబితాలో చేరుస్తుంది. యువత అవకాశం వినియోగించుకోవాలి.
– జె.వెంకటరావు, డీఆర్వో
Comments
Please login to add a commentAdd a comment