అరుకు ఎంపీ గీత ఎస్టీ కాదు
విజయనగరం మున్సిపాలిటీ :అరుకు లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికైన కొత్తపల్లి గీత గిరిజన కులానికి చెందిన వ్యక్తి కారని, అమె ఎన్నికను రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర న్యాయ సలహదారుడు రేగు మహేశ్వరరావు డిమాండ్ చేశారు. కొత్లపల్లి గీత తప్పుడు కుల ధ్రువీకరణపత్రంతో ఎన్నికల్లో పోటీ చేశారని , ఈ విషయంపై పోరాటం చేస్తున్నామని చెప్పారు. ఈమేరకు హైకోర్టులో రిటిపిటీషన్ దాఖలు చేసినట్టు ఆయన తెలిపారు. రెండు, మూడు రోజుల్లో పిటీషన్ విచారణకు వస్తుందన్నారు. సోమవారం పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు . అరుకు ఎంపీగా ఎన్నికైన కొత్లపల్లి గీత... ఆదిఆంధ్రా మాల కులానికి చెందిన వ్యక్తి అని, ఆమె క్రిస్టియన్‌గా మారడంతో, బీసీ ‘సీ’ కేటగిరీలోకి వెళతారని చెప్పారు. ఈ ఏడాది మార్చిలో తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ జరిపిన విచారణలో ఈ విషయం తేటతెల్లమైందన్నారు. కొత్తపల్లి గీత గిరిజన తెగకు చెందిన వారు కాదని 2013 సంవత్సరంలో అడ్డతీగల తహశీల్దార్ ....
రంపచోడవరం సబ్‌కలెక్టర్‌కు నివేదించారని, తరువాత, అదే తహశీల్దార్ డబ్బులుకు లొంగిపోయి గిరిజన కుల ధ్రువీకరణ పత్రం జారీ చేశారని ఆరోపించారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించి, గిరిజనులకు అన్యాయం చేసిన గీత ఎంపీ పదవిని రద్దు చేసిన తక్షణమే ఎన్నికలు నిర్వహించాలన్నారు.