సాక్షి ప్రతినిధి,ఒంగోలు: ఓటు వజ్రాయుధం. నచ్చిన నాయకులను పాలకులుగా ఎన్నుకొనే అవకాశం ఇచ్చేది ఓటే. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేవారిని, మంచి పాలన అందించే వారిని ఎంపిక చేసుకొనే అవకాశం ఓటు ద్వారానే వస్తోంది. అంటే మీరంతా తప్పకుండా ముందు ఓటర్లుగా నమోదై ఉండాలి. సమయం మించి పోతోంది. ఓటరుగా నమోదు కావడానికి ఇక నాలుగు రోజులే గడువుం మిగిలి ఉంది. ఈ నెల 15 ఓటరు నమోదుకు చివరి తేదీగా భారత ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. మార్చి 15 దాటితే ఓటు నమోదుకు అవకాశం ఉండదు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం కోల్పోకండి. ముందు ఓటరుగా మారండి. అందరూ ఓటర్ల జాబితాలో ఓటు చెక్ చేసుకోవాలి. లేనివారు వెంటనే అన్‌లైన్ లేదా నేరుగా ఓట్ల నమోదు కేంద్రానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. 18 సంవత్సరాలునిండిన వారితో పాటు గతంలో ఓటు ఉండి కోల్పోయిన వారూ ఓటు నమోదు చేసుకోవచ్చు. ఇక ఇతర ప్రాంతాల నుంచి తామున్న చోటుకు ఓటు బదిలీ సైతం చేసుకొనేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అన్నింటికీ చివరి తేదీ మార్చి 15 మాత్రమే. అందుకే అందరూ అప్రమత్తం కావాలి. సమయం తక్కువగా ఉన్నందున మీ ఓటు నమోదుకు ఫామ్–6 ద్వారా దరఖాస్తు చేసుకోంది. మీ ఓటే కాదు మీ కుటుంబ సభ్యుల ఓట్లూ చెక్ చేసుకోవడంతో పాటు లేకపోతే తక్షణమే వారి ద్వారా ఓటు కోసం దరఖాస్తు చేయించండి. ఎన్నారైలు ఓటు కోసం ఫామ్–6ఎ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఓటర్ల జాబితాలో తప్పొప్పులు ఫారం–8 ద్వారా సరిదిద్దు కోవచ్చు. ఇక నియోజకవర్గంలో ఒకచోటు నుంచి మరొక చోటు కు ఓటు మార్చుకోవాలంటే ఫామ్–8ఏ దరఖాస్తు చేసుకోవాలి.
ఓటు నమోదు చేసుకోండిలా...
ఎక్కువ మందికి ఎలా నమోదు చేసుకోవాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. ఓటరుగా నమోదు కావడానికి ఫామ్–6 దరఖాస్తుతో పాటు మిగిలిన విభాగాల దరఖాస్తులుసైతం ఆన్‌లైన్ ద్వారా లేదా నేరుగా కూడా చేసుకొనే వీలుంది. ఆన్‌లైన్‌లో గడువులోగా వచ్చిన దరఖాస్తులను డౌన్‌లోడు చేసి బీఎల్వోల ద్వారా విచారణ జరిపి అన్నీ సక్రమంగా ఉంటే ఓటు ఇస్తారు. కొత్త ఓటు కోసం ఈ– రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ‘హెచ్‌టీటీపీ://సిఇఓఎఎన్‌డిహెచ్‌ఆర్‌ఎ.ఎన్‌ఐసి.ఐఎన్, హెచ్‌టీటీపీ://డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎన్‌విఎస్‌పి.ఐఎన్ వెబ్ చిరునామాలను సంప్రదించి ఈ–రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే ఫామ్–6 దరఖాస్తులు కలెక్టర్ కార్యాలయంలోని హెచ్ విభాగంలో, తహశీల్దార్ కార్యాలయంలో లభిస్తాయి. దరఖాస్తు పూర్తి చేసి మ్యాన్యువల్‌గా కూడా సంబంధిత అధికారికి అందజేయవచ్చు. మొబైల్ ద్వారా కూడా పై వెబ్ చిరునామాను సంప్రదించి కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అందరూ అప్రమత్తంకండి. ఇప్పటికే ఓటు దరఖాస్తు చేసుకొన్నా.. ఇంకా ఓకే కానివారు మిన్నకుండి పోకుండా సంబంధిత తహశీల్దారు కార్యాలయం లేదా ఎన్నికల అధికారి కార్యాలయానికి వెళ్లి మీరు దరఖాస్తు చేసుకున్న ఓటు విషయంపై విచారించండి. అది ఏ స్టేజీలో ఉందో తెలుసుకోండి. సకాలంలో ఓటు వచ్చేలా అధికారులపై ఒత్తిడి తెండి. బీఎల్‌ఓలు స్పందించక పోతే తహశీల్దార్లు, వారూ స్పందించక పోతే ఎన్నికల ప్రత్యేక అధికారులు, ఆర్డీఓ, కలెక్టర్ స్థాయి వరకూ వెళ్లండి. ఓటు నమోదయ్యేలా చూసుకోండి. అధికారులు ఓటు నమోదుపై ఈ నాలుగు రోజులు విస్తృతమైన ప్రచారం నిర్వహించాలి. అందరూ ఓటు హక్కు పొందేలా చైతన్యం తీసుకురావాలి.
Comments
Please login to add a commentAdd a comment