కోడ్‌ దాటితే వేటే | Cross The Rules Punish Seriously | Sakshi
Sakshi News home page

కోడ్‌ దాటితే వేటే

Published Wed, Mar 13 2019 10:58 AM | Last Updated on Sat, Mar 23 2019 8:59 PM

Cross The Rules Punish Seriously - Sakshi

సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది. నియోజకవర్గ కేంద్రాల్లో త్వరలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. బరిలో దిగనున్న పార్టీల అభ్యర్థులు పాటించాల్సిన నియమావళిని ఎన్నికల సంఘం విడుదల చేసింది. నిబంధనల మేరకే నడుచుకోవాలని, వాటిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.

సాక్షి, ఒంగోలు మెట్రో: ఎన్నికల కమిషన్‌ విడుదల చేసిన రూల్స్‌ ఇలా ఉన్నాయి. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే సమయంలో రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం నుంచి వందమీటర్ల పరిధిలో మూడు వాహనాలకు మాత్రమే అనుమతిస్తారు. అభ్యర్థితో పాటు ఐదుగురును మాత్రమే ఎన్నికల అధికారి గదిలోకి వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. ఏజెంట్‌ మరో వ్యక్తి లాయర్‌ను తీసుకెళ్లేందుకు అవకాశం ఇస్తారు. 
∙ప్రచార  వాహనానికి విధిగా రిట్నరింగ్‌ అధికారి నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. అనుమతి పత్రాన్ని వాహనానికి స్పష్టంగా కన్పించేలా(విండ్‌ స్క్రీన్‌పై) అతికించాలి. పర్మిట్‌ మీద వాహనం నంబరు అభ్యర్థి వివరాలు ఉండాలి. పర్మిట్‌ వాహనాన్ని అదే అభ్యర్థికోసం తప్ప మరో అభ్యర్థికోసం వాడకూడదు.
∙మత, కుల, వర్గ, ప్రాంత, జాతి భేదాల వంటి సున్నితమైన అంశాలతో ప్రచారం చేయరాదు. మతపరమైన ప్రార్ధనా మందిరాల్లో ప్రచారం చేయకూడదు
∙ప్రజా జీవితానికి ఇబ్బంది కలిగేలా ఊరేగింపులతో వెళ్లరాదు. లౌడ్‌స్పీకర్లను రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వినియోగించకూడదు. 
∙ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రచారం చేయకూడదు. ప్రభుత్వ మైదానాల్లో అనుమతి తీసుకోకుండా ప్రచారం చేయరాదు. 
∙ప్రైవేటు భవనాలు, మైదానాల్లో ప్రచారం చేసేందుకు ఇంటి, స్థల యజామానితో పాటు ఆర్‌ఓ అనుమతులు తీసుకోవాలి
∙అభ్యర్థి ప్రచారానికి టోపీలు, మాస్కులు తదితరాలు ఇవ్వవచ్చును. చీరలు, దోవతులు, టీవీలు, సెల్‌ఫోన్లు వంటివి పంచరాదు. అలా పంచితే లంచం కింద నేరం అవుతుంది దేవుళ్ల ఫొటోలు, అభ్యర్థి ఫొటోలతో డైరీలు, క్యాలెండర్లు ముద్రించరాదు.
∙ప్రచారంలో మద్యం తయారీ, పంపిణీ నిషేధం. పోలింగ్‌ ముగింపునకు ముందుగా ఒక గంట నుంచి 48 గంటలు ముందుగా అన్ని రకాల ప్రచారాలు ఆపివేయాలి.
∙సభలు, సమావేశాలు, ర్యాలీలకు పోలీసు/ఆర్‌ఓ అనుమతి తప్పనిసరి.
.పోలింగ్‌ రోజున ఓటర్ల రవాణా కొరకు ఎలాంటి వాహనాలు ఉపయోగించరాదు.
∙ఎన్నికల ఫలితాలపై సర్వేలు, ఎగ్జిట్‌ పోల్స్‌ వంటివి నిషేధించడమైంది.
పోలింగ్‌ స్టేషన్లలోకి అభ్యర్థికి, ఎన్నికల ఏజెంట్‌కు, పోలింగ్‌ ఏజెంట్లకు అనుమతి ఉంది. అయితే క్రమశిక్షణ లేకుండా ప్రవర్తించరాదు.
∙ఓటు కొరకు లంచం ఇవ్వడం, ప్రలోభ పెట్టడం, భయపెట్టడం చేయరాదు.
∙ఎన్నికల వ్యయం ఈసీఐ నిర్ణయించిన మొత్తం కంటే ఎక్కువ ఖర్చుచేయరాదు.
∙ప్రభుత్వ సేవలను బలవంతంగా పొందరాదు. పోలింగ్‌ స్టేషన్‌లలోని అక్రమంగా ప్రవేశించరాదు. ఈవీఎంఎస్‌ ఇతర రికార్డులను తొలగించడం చేయరాదు. 
∙ప్రభుత్వ అధికారుల సేవలను బలవంతంగా పొందరాదు. ప్రచారంలో ప్రజల మధ్య శత్రుత్వం పెరిగేలా చేయకూడదు.
∙ఇతరుల సభలు, సమావేశాలను భంగపరచరాదు. కరపత్రాలు, పోస్టర్లు మొదలైన వాటిపై నియంత్రణ ఉండాలి.
∙రహస్య ఓటింగ్‌ పద్ధతికి భంగం కల్పించకూడదు. ఎన్నికలకు సంబంధించి తప్పుడ సందేశాలు ఇవ్వరాదు.
∙సభలు, సమావేశాలు నిషేధిత  ప్రాంతాల్లో పెట్టరాదు. 
∙ప్రభుత్వ బంగ్లాలు, గెస్ట్‌హౌస్‌లు ప్రచారానికి ఉపయోగించకూడదు.
∙పెయిడ్‌ న్యూస్‌లకు అనుమతిలేదు.
∙మోడల్‌ కోడ్‌ అమలులో ఉన్నప్పుడు ఉద్యోగ నియామకాలు చేయరాదు. భవనాలకు శంకుస్థాపనలు చేయరాదు. ప్రభుత్వ కార్యక్రమాలకు, పథకాలకు ప్రజాప్రతినిధులు ఎవరూ నిధులు మంజూరు చేయరాదు. రుణాలు ప్రకటించరాదు. 
∙ప్రజాప్రతినిధులు అధికారులను సమీక్షలకు, సమావేశాలకు పిలువరాదు.
∙మంచి ప్రవర్తన కల్గిన వారిని కౌంటింగ్‌ ఏజెం ట్లుగా నియమించాలి.
పోలింగ్, కౌంటింగ్‌ రోజున రాజకీయ పార్టీ లు, అభ్యర్థులు, ఏజెం ట్లు పోలింగ్‌ సిబ్బందికి తప్పకుండా సహకరించాలి.

ఇవి చెయ్యొచ్చు...
∙ఈసీఐ అనుమతితో  కరువు నివారణ చర్యలు చేపట్టవచ్చు.
∙కరువు ప్రాంతాలకు ఆహారం, గడ్డి సరఫరా చేయవచ్చు.
∙కోర్టు ఆర్డరు గల ఉద్యోగ నియామకాలు చేపట్టవచ్చు.
∙తాగునీటిని సరఫరా చేయవచ్చు.
∙ప్రజాప్రతినిధులు తమ వాహనాలను ఇంటి నుంచి ఆఫీసు వరకు, ఆఫీసు నుంచి ఇంటి వరకు వాడుకొనవచ్చు.
∙ఈసీఐ అనుమతితో కవి సమ్మేళనాలు, ముసాయిదాలు వంటి కార్యక్రమాలు చేయవచ్చు.
∙ఇండిపెండెంట్, రిపబ్లిక్‌ డే, మేడే, ప్రముఖుల పుట్టిన రోజు కార్యక్రమాలను చేయవచ్చు. అయితే రాజకీయ ప్రసంగాలు ఉండరాదు
∙ఖైదీల విడుదల, గిట్టుబాటుధరల నిర్ణయం ఈసీఐ అనుమతితో చేయవచ్చు.
∙వ్యక్తుల తీవ్ర అనారోగ్యానికి సంబంధించి అవసరమైన నిధులను విడుదల చేయవచ్చు.
∙పబ్లిక్‌ మైదానాలను సభలకు, సమావేశాలకు ముందస్తు అనుమతితో ఉపయోగించుకోవచ్చు. 
∙ప్రత్యర్థిపార్టీ విధి, విధనాలను విమర్శించుకోవచ్చు.
∙శాంతియుతమైన ప్రజాజీవితానికి భంగం కల్గకుండా ప్రచారం చేసుకోవచ్చు.
∙ప్రచారావాహనాలకు లౌడ్‌స్పీకర్లు వాడటంపై పరిమితి లేదు. ప్రతి అంశానికి అనుమతి ఉండాలి.
∙సభలు, సమావేశాలను భంగం కల్గించే వ్యక్తులపై చర్యలకు పోలీసు సహాయం కోరవచ్చు.
క్రమశిక్షణతో ఉండి నిషేధిత ప్రాంతాల్లో పోకుండా, ట్రాఫిక్‌కు అంతరాయం కల్గకుండా ప్రదర్శనలు, ఊరేగింపులు చేసుకోవచ్చు.
∙ఎన్నికలు స్వేచ్ఛగా జరగడానికి అధికారులు సహకరించాలి.
∙పోలింగ్‌ రోజున క్రమశిక్షణతో ఉండి ఈసీఐ ఆర్డర్స్‌ను పాటించాలి
∙కౌంటింగ్‌ రోజున కౌంటింగ్‌ ఏజెంట్ల నియామకానికి అడ్వాన్స్‌గా అనుమతులు తీసుకోవచ్చు.

పార్టీ కార్యాలయాల ఏర్పాటుకు
∙పాఠశాలలు,  పోలింగ్‌స్టేషన్లు, ప్రార్థనా స్థలాలకు 200 మీటర్ల లోపు పార్టీ కార్యలయాలు ఏర్పాటు చేయరాదు.
∙ఎన్నికల ప్రచార తేదీ ముగిసన తర్వాత నియోజకవర్గంలో ఓటర్లు కానివారు ఉండరాదు.
∙రాత్రి 10గంటల తర్వాత పబ్లిక్‌మీటింగ్‌ ఏర్పాటు చేయరాదు.
∙పోలింగ్‌ ఏజెంట్‌ అదే పోలింగ్‌ కేంద్రంలో ఓటరు అయి ఉండాలి. ఫొటోతో కూడిన గుర్తింపు కార్డు ఉండాలి.
∙ఎస్‌ఎంఎస్‌ల ద్వారా అభ్యంతరకర ప్రచారం చేయరాదు. అభ్యంతరకర మెసేజ్‌లు చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు.
∙పోలింగ్‌స్టేషన్‌ నుంచి 200 మీటర్ల దూరంలో ఒక టేబుల్, రెండు కుర్చీలు, అభ్యర్థి బ్యానర్‌తో ఎన్నికల బూత్‌ ఏర్పాటు చేసుకోవచ్చు
∙పోలింగ్‌స్టేషన్‌ నుంచి 100 మీటర్లలోపు ప్రచారం నిషే«ధం. ఈ పరిధిలో మొబైల్‌ ఫోను వాడడం కాని ఆయుధాలు కల్గి ఉండటం నిషేధం.
∙ఎన్నికల రోజున అభ్యర్థి ఏజెంట్, పార్టీ వర్కర్లకోసం ఒక వాహనం ఉపయోగించవచ్చు. ఈ వాహనంలో ఐదుగురికి మాత్రమే అనుమతి ఇస్తారు.
∙ఓటరు స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకునేలా సహకరించాలి. 

జిల్లా స్థాయి ఎన్నికల అధికారుల విధులు ఇవీ..

∙డిస్ట్రిక్ట్‌ కంట్రోల్‌ సెల్‌
ఇది జిల్లా కేంద్రంలో ఉంటుంది.  జిల్లా ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యాలయంలో 24 గంటలూ సిబ్బంది అందుబాటులో ఉండాలి. ఇందులో ఒక అధికారి లేదా ముగ్గురు సిబ్బంది ఉండాలి. కార్యాలయానికి టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేయాలి. కార్యాలయ టోల్‌ ఫ్రీ నంబర్లకు వచ్చే ఫిర్యాదులను, సూచనలను రిజిస్టర్‌ చేసుకుని చర్యల కోసం సంబంధిత అధికారులకు  వెంటనే పంపించాల్సి ఉంటుంది. 
∙ఎన్నికల వ్యయ విభాగం
(ఎక్స్‌పెండిచర్‌ మేరిటరింగ్‌ సెల్‌)
ఇందులో కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా నియమించబడిన వ్యయ పరిశీలకులు( ఎక్స్‌పెండిచర్‌ అబ్జర్వర్‌) ఉంటారు.వీరితో పాటు ఒక అసిస్టెంట్‌ ఎక్స్‌పెండిచర్‌ అబ్జర్వర్, ఇతర సిబ్బంది ఉంటారు. 

స్టాటిస్టికల్‌ సర్వయిలెన్స్‌ టీమ్‌
స్టాటిక్‌ అనగా స్థిరమైనది అని అర్థం. స్టాటిక్‌ సర్వయిలెన్స్‌ అంటే చెక్‌ పోస్ట్‌ టీమ్‌ అని అనుకోవచ్చు. సరిహద్దులలోనూ, ఇతర ముఖ్య ప్రదేశాలలోనూ దీనిని ఏర్పాటు చేస్తారు. ఒక మేజిస్ట్రేట్‌ స్ధాయి అధికారి, పోలీసు సిబ్బంది, ఇతర సిబ్బందితో పాటు వీడియో కెమెరామెన్‌ను కలిగి ఉండాలి. 
∙ఫ్లయింగ్‌ స్క్వాడ్‌
ఒక మేజిస్ట్రేట్‌ స్థాయి అధికారి, పోలీసు అధికారులు, సిబ్బంది, వీడియో కెమెరా మెన్‌ ఈ ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందంలో ఉంటారు. 
∙వీడియో సర్వయిలెన్స్‌ టీమ్‌
ఈ బృందంలో వీడియో కెమెరా మెన్‌తో కలిసి ఇద్దరు సిబ్బంది ఉంటారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement