రాజకీయ ప్రమేయం అవసరం
అధికార యంత్రాంగంపై ప్రధాని మోదీ
{పజాస్వామ్యంలో అది అనివార్యం
రాజకీయ జోక్యానికి, ప్రమేయానికి తేడా ఉంది
అధికారులు ఒక బృందంగా పనిచేయాలి
సివిల్ సర్వీస్ అధికారులకు ప్రధాని ఉద్బోధ
న్యూఢిల్లీ: ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార యంత్రాంగంలో రాజకీయ ప్రమేయం అవసరమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. రాజకీయ ప్రమేయాన్ని సుపరిపాలనకు ఆటంకాలుగా చూడరాదని అధికారులకు సూచించారు. రాజకీయ జోక్యానికి, ప్రమేయానికి తేడా ఉందని.. జోక్యం వల్ల వ్యవస్థ నాశనమయితే.. ప్రమేయం అవసరమూ, అనివార్యమూ అని ఆయన పేర్కొన్నారు. సివిల్ సర్వీసెస్ దినోత్సవం సందర్భంగా మంగళవారం ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో సివిల్ సర్వీస్ అధికారులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ‘‘ప్రజాస్వామ్యంలో అధికార యంత్రాంగం, రాజకీయ ప్రమేయం చేయీ చేయీ కలిపి ప్రయాణిస్తాయి. ఈ దేశాన్ని మనం నడపాలంటే మనకు రాజకీయ జోక్యం అవసరం లేదు. కానీ రాజకీయ ప్రమేయం అవసరం, అనివార్యం. లేదంటే ప్రజాస్వామ్యం పనిచేయదు’’ అని చెప్పారు. ‘‘చట్టసభల సభ్యులను ప్రజలు ఎన్నుకొంటారు కాబట్టి.. ప్రజాస్వామ్యంలో రాజకీయ ప్రమేయం అవసరం. అధికార వ్యవస్థ నుంచి అవరోధాలు, కష్టాలు అనే పదాలను తొలగించాల్సిన అవసరముంది’’ అన్నా రు. సుపరిపాలనకు అకౌంటబిలిటీ (జవాబుదారీతనం), రెస్పాన్సిబిలిటీ (బాధ్యత), ట్రాన్స్‌పరెన్సీ (పారదర్శకత) అనే ‘ఆర్ట్’ అవసరమన్నారు. ప్రతి సమస్యకూ ఒక పరిష్కారం ఉందని.. దానిని గుర్తించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రపంచంలో మొబైల్ పాలన చూసే రోజు ఎంతో దూరంలో లేదంటూ.. అధికార యంత్రాంగంలో సంస్కరణలు, సాంకేతిక పరిజ్ఞానాలకు ఊతమివ్వాల్సిన అవసరముందని చెప్పారు. దేశాన్ని ఏకీకరణ చేసిన తొలి హోంమంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్‌పటేల్ కృషిని గుర్తు చేస్తూ.. ఈనాడు సామాజిక, ఆర్థిక ఏకీకరణ అవసరమని పేర్కొన్నారు.
అధికారులు విడివిడిగా పనిచేసే పద్ధతిని విడనాడి.. ఒక బృందంలా పనిచేయాలని కోరారు. సివిల్ సర్వీసెస్ విభాగాలన్నీ సంస్థాగత సమాచారాన్ని అభివృద్ధి చేయాలన్నారు. సీనియర్ సివిల్ సర్వీస్ అధికారులు.. సివిల్ సర్వీసెస్‌లో చేరాలనుకుంటున్న యువతతో సమయం గడపాలని.. ప్రభుత్వానికి ఉత్తమ నైపుణ్యం గలవారు లభించేలా చూడాలని సూచించారు. ఏడాదికి ఒకసారైనా కాలేజీ విద్యార్థులతో ముచ్చటించాలని చెప్పారు. ఈ సందర్భంగా 2012-13, 2013-14 సంవత్సరాలకు ప్రభుత్వ పరిపాలనలో ఉత్తమ ప్రతిభా అవార్డులను ప్రధాని ఆయా అధికారులకు ప్రదానం చేశారు. వివిధ రంగాల్లో విలక్షణ సేవ చేసినందుకు గౌరవం పొందిన అధికారులకు అభినందనలు తెలుపుతూ.. అవార్డు పొందిన వారి నుంచి తెలుసుకోవాల్సింది, వారిని అనుకరించాల్సింది చాలా ఉందని పేర్కొన్నారు. ‘బెస్ట్ ప్రాక్టీసెస్ - టుమారో ఈజ్ హియర్’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
రోబోల్లా బతకొద్దు.. కుటుంబంతో గడపండి...
అధికారులు జీవిత ప్రాముఖ్యతకు విలువనివ్వాలని ప్రధాని మోదీ సూచించారు. లేదంటే ఏదో ఒక ఫైలులో ఒక పేజీ లాగా మారిపోతుందని వ్యాఖ్యానించారు. ‘‘ఆందోళనలతో నిండిపోయిన జీవితం ఏదీ సాధించలేదు.. ప్రత్యేకించి మీరు దేశాన్ని నడపాల్సి ఉన్నపుడు! మీరు చక్కగా సమయపాలన చేస్తారు. కానీ.. మీ కుటుంబంతో మీరు నాణ్యమైన సమయం గడుపుతున్నారా? దయచేసి దీని గురించి ఆలోచించండి. రోబోల లాగా జీవించవద్దు.. మీ కుటుంబాలతో నాణ్యమైన సమయం గడపండి. మన జీవితాలు రోబోలుగా మారితే.. అది మొత్తం ప్రభుత్వంపైనా, వ్యవస్థపైనా ప్రభావం చూపుతుంది. మీ జీవితాలు ఒక ఫైలు లాగా మారకూడదు. ఒక ప్రభుత్వం ఉంటే.. ఫైళ్లు ఉంటాయి. మరో ప్రత్యామ్నాయం లేదు. అది (ఫైలు) మీ రెండో అర్ధాంగి. మీరు జీవితం గురించి పట్టించుకోకపోతే.. అది ఫైళ్లలో చిక్కుకుపోతుంది’’ అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా అధికారులు ఉత్తేజంగా ఉండాలంటూ.. ‘‘మీరు అలా ఎందుకు కూర్చున్నారు? అంత సీరియస్‌గా ఉండాలా? ప్రపంచ భారాన్ని మోస్తున్నట్లు? నేను మిమ్మల్నేం కొత్త పని చేయమని అడగబోవట్లేదు...’’ అంటూ మోదీ చతురోక్తులు వేయటంతో అధికారులంతా నవ్వేశారు. అలాగే.. ‘‘మీరు బాగా చదువుతారు. ప్రపంచంలో ఉత్తములైన వారు రాసిన పుస్తకాలు చాలా చదివి ఉంటారు. ప్రాథమికంగా మీ స్వభావమే అది. అందుకే మీరు ఇక్కడ ఉన్నారు. కాలేజీలో ‘యూనియన్ బాజీ’లు (యూనియన్ పోటీలు) చేసే వారు ఇక్కడికి రారు. పుస్తకాల్లో కూరుకుపోయిన వాళ్లు ఇక్కడికి వస్తారు’’ అని వ్యాఖ్యానించటంతో అధికారులు ఘొల్లుమన్నారు.