న్యాయస్థానాల తీర్పుల్ని తప్పుపట్టకూడదని ఎక్కడా శాసనం లేదని బ్రిటిష్ రాణి న్యాయశాస్త్ర సలహాదారు డేవిడ్ పానిక్ అంటారు. న్యాయస్థానాలను గురించి ప్రస్తావించడం తగదని కొందరు ఇచ్చే సలహాలను వీళ్లు కొట్టేస్తారు. న్యాయవ్యవస్థ నడవడికలోని లోపాలను తొలగించుకోవడానికి విధిగా ప్రయత్నించాలని చెబుతారు. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో జరిగే పనుల తీరు గురించిన వాస్తవాలను ప్రజలకు తెలియజెప్పకపోవడం తెలివి తక్కువ పని. వ్యవస్థల పనితీరులో లోటుపాట్లను గమనించలేనంత అమాయకులుగా ప్రజాబాహుళ్యాన్ని భావించడం అప్రజాస్వామికం. ఏ వ్యవస్థ అయినా విమర్శకు అతీతం కాదు. ముఖ్యంగా ఆలోచించే మెదడుంటే ప్రమాదకరమైన తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడతారని భావించేవాళ్లు ఉన్నప్పుడు!
‘‘మావోయిస్టు కుట్ర కేసు పేరిట వికలాం గుడైన ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబాను, ఆయనతోపాటు నిందితులైన ఇతరులను జైలు నుంచి విడుదల చేస్తూ, వారిపై మోపిన కుట్ర కేసును కొట్టివేస్తూ బొంబాయి హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు కాకుండా సుప్రీంకోర్టు నిల్పివేసిన పద్ధతి చాలా అసాధారణం. పరస్పర విరుద్ధంగా వెలువడిన ఈ రెండు కోర్టుల తీర్పులు కీలకమైన ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. సాయిబాబా ప్రభృతులపైన మోపిన కేసును బొంబాయి హైకోర్టు– కేసు సామర్థ్యాన్ని బట్టి కాక, సాంకేతిక కారణాలపైన కొట్టివేసి ఉండ వచ్చు. కానీ ఆ తీర్పుకు వ్యతిరేకంగా వచ్చిన అప్పీలును అనుమ తించేప్పుడు సుప్రీంకోర్టు కొంత సంయమనం పాటించి ఉండాల్సింది. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం బొంబాయి హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా తన అప్పీలును తక్షణమే పరిశీలించాలన్న కోర్కెను తీర్చడానికే సుప్రీం కోర్టు అసాధారణమైన ఉత్సాహాన్ని కనబరిచింది. ఫలితంగా సుప్రీం కోర్టు... ధర్మాసనం ఏర్పాటు చేసింది. కానీ, సాయిబాబా ప్రభృతులను విడుదల చేయడానికి గల కారణాలను ఎంతో వివరంగా పేర్కొన్న బొంబాయి హైకోర్టు తీర్పును కేవలం సమర్థించడానికి సుప్రీం బెంచ్ అంత వేగంగా ఉత్సాహం కనబరిచి ఉండగలిగేదా అన్నది అనుమానిం చాల్సిన విషయం.’’
– ‘ది హిందూ’ సంపాదకీయం (17 అక్టోబర్ 2022)
మన పాలకులుగానీ, కొందరు న్యాయమూర్తులుగానీ ఎలా వ్యవహ రిస్తున్నారంటే– ‘మనిషికి మెదడు ఉండటమే ప్రమాదకరం’ అన్న నిర్ణయానికి వచ్చేస్తున్నారు. ఆలోచించే మెదడుంటే ప్రమాదకరమైన తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడతారని కొందరు న్యాయ మూర్తులు నిర్ణయించినట్టు కనబడుతోంది. మెదడు ఎందుకు, ఎలా ప్రమాదకరమైనదో బ్రిటిష్ రాణి క్యాబినెట్‌కు ప్రత్యేక న్యాయశాస్త్ర సలహాదారుడిగా వ్యవహరించిన డేవిడ్ పానిక్ కోర్టుల గురించి వ్యంగ్యంగా ఓ కథ చెప్పాడు:
దారిన పోయే ఒక దానయ్య దారిన పోయేవాళ్లంతా కంగారు పడేంతగా, పెద్దగా భయంకరంగా తుమ్ము తుమ్మాడట. దానిపైన కొందరు దగ్గర్లో ఉన్న కోర్టులో ఫిర్యాదు చేస్తే, ఆ కోర్టు వారు ఆ వ్యక్తి రెండు ముక్కుల్లో ఏ వైపు నుంచి తుమ్మాడో తేల్చమన్నారట! అలా ఉంటాయి కొన్ని కోర్టు తీర్పులని చెప్పడానికే డేవిడ్ పానిక్ ఈ స్టోరీ చెప్పాడు. అలాగే కొన్ని సందర్భాల్లో కోర్టు తీర్పుల్ని తప్పుపట్టకూడ దని ఎక్కడా శాసనం లేదని చెబుతూ డేవిడ్ పానిక్, జడ్జి జెరోమి ఫ్రాంక్ ఇలా స్పష్టం చేశారు: ‘‘న్యాయస్థానం వ్యవహరించే తీరు తెన్నుల్ని గురించిన వాస్తవాలను వెల్లడించడం తగదనీ, పైగా ప్రమాదకరం కాబట్టి న్యాయస్థానాలను గురించి ప్రస్తావించడం తగదనీ కొందరు రాజకీయవేత్తలు, కొందరు న్యాయశాస్త్రవేత్తలు సలహాలిస్తుంటారు. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థల్లో, ప్రభుత్వ శాఖల్లో జరిగే పనుల తీరు గురించిన వాస్తవాలను ప్రజలకు తెలియజెప్పక పోవడం తెలివి తక్కువ పని. మనిషి రూపొందించి నిర్మించిన వ్యవస్థల పనితీరులో లోటుపాట్లను గమనించలేనంత అమాయకు లుగా, చిన్నపిల్లలుగా ప్రజాబాహుళ్యాన్ని భావించడం అప్రజాస్వా మికం. మన న్యాయవ్యవస్థ నడవడికలోని లోపాలను తొలగించుకోవ డానికి విధిగా ప్రయత్నించాలి. అందుకనే న్యాయస్థానంలో కూర్చొన దగిన సుశిక్షితులైన జడ్జీలను మాత్రమే అనుమతించాలి. వారి ప్రవ ర్తనను స్వేచ్ఛగా విమర్శించే హక్కు ప్రజలకుండాలి. వారి ప్రవర్తన జ్యుడీషియల్ పర్ఫామెన్స్ కమిషన్ విచారణకు సిద్ధమై ఉండాలి.’’
అందుకే స్వతంత్ర భారత న్యాయవ్యవస్థలో ఉద్దండపిండాలైన ఉన్నత న్యాయశాస్త్ర కోవిదుల్లో, ఉత్తమ న్యాయమూర్తులలో ఒకరైన జస్టిస్ కృష్ణయ్యర్ న్యాయమూర్తి స్థానంలో ఉన్నవాడికి సామాజిక న్యాయంపట్ల అవగాహన, అనురక్తి, ప్రేమానురాగాలు విధిగా ఉండా లనీ... ఈ విషయంలో ఏ కోర్టు బెంచ్‌గానీ, బార్ అసోసియేషన్ గానీ నా ఆదర్శం నుంచి, లక్ష్యం నుంచి నన్ను మరల్చజాలవనీ పదేపదే స్పష్టం చేస్తూ వచ్చారు.
ఈ సత్యానికి ప్రతిబింబంగానే ఫ్రెంచి తాత్త్వికులలో, వామపక్ష ప్రతినిధుల్లో ఒకరైన థోరే ఒక సందర్భంలో మాట్లాడుతూ– వ్యక్తుల్ని అన్యాయంగా, అక్రమంగా జైళ్లలో నిర్బంధించగల ప్రభుత్వం ఉన్న చోట న్యాయంగా వ్యవహరించే వ్యక్తి స్థానం కూడా జైల్లోనే అని వ్యంగ్యంగా పేర్కొన్నాడు. ఆయనను ఫ్రెంచి ప్రభుత్వం అరెస్టు చేసి జైల్లో నిర్బంధించే నాటికే ప్రపంచ ప్రసిద్ధ తాత్త్వికుడైన ఎమర్సన్ కూడా జైల్లో మగ్గుతున్నాడు. థోరేను అకస్మాత్తుగా చూసి, ‘అదేమి టయ్యా, నువ్వు కూడా జైల్లోనే ఉన్నావా?’ అని ఆశ్చర్యం వెలిబు చ్చాడు ఎమర్సన్. ‘అవును, ఎవరినైనా ప్రభుత్వం అక్రమంగా జైల్లోకి నెట్టే కాలంలో న్యాయం పలికే ఏ మనిషి స్థానమైనా జైలే సుమా’ అన్నాడు థోరే! అందుకే జస్టిస్ కృష్ణయ్యర్ ‘అన్యాయంగా జైళ్లలో నిర్బంధితులైన వారిని ప్రస్తావిస్తూ... ఉద్రేకంగా అక్రమ కేసులలో నిర్బంధితులైనవారికీ, వారి హక్కుల రక్షణకు పూచీ పడుతున్న రాజ్యాంగానికీ మధ్య ఇనుప తెర అనేది లేదనీ, ఉండదనీ గమనిం చా’లని పదేపదే చెప్పేవారు. కానీ, ఇప్పటికొచ్చేసరికి అసలు ‘మనిషి (పౌరుడి) మెదడు’ మీదనే కత్తి ఎక్కుపెట్టడం జరుగుతోంది. అందుకే మహాకవి శ్రీశ్రీ అదే ‘మెదడు’ గురించిన విశ్వజనీనమైన సత్యాన్ని ఎలా మానవాళి ముందు ఆవిష్కరించాడో చూడండి:
‘‘మెదడన్నది మనకున్నది
అది కాస్తా పనిచేస్తే
విశ్వరహఃపేటికావిపాటనం
జరగక తప్పదు.’’
‘మెదడు’ను పనిచెయ్యనివ్వాలి గదా? మరి దాని ఉనికినే ప్రమాదకరంగా భావించి ప్రజల ‘మెదళ్ల’నే కట్టడి చేయాలన్న తపనకు కొందరు తెరలేపడం ప్రమాదకరం. న్యాయస్థానాల గౌరవం మసకబారకుండా జాగ్రత్తపడటం కోసం జస్టిస్ లోకూర్ లాంటి వారు తమకు తాత్కాలిక పాలక శక్తులు ఎర చూపిన ప్రమోషన్లకు లొంగి పోలేదు. తమ ఉనికి కోసం అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ పాలకులు ప్రవేశపెట్టిన తప్పుడు చట్టాలు యువకుల జీవశక్తిని నులిమివేస్తు న్నాయి. ఇటీవలి కాలంలో సుప్రీంకోర్టులో వీస్తున్న ఆహ్వా నించదగిన నిర్ణయాలు, పరిణామాల వాతావరణంలోనైనా అలాం టివి వైదొలగి పోవాలని ప్రజాస్వామ్యవాదులంతా కోరుకుంటారు.
ఈ తప్పుడు కేసుల తతంగం అంతా జరుగుతూన్న సందర్భం గానే– ప్రపంచంలో ఆకలిదప్పులతో కునారిల్లిపోతున్న 121 దేశాలతో కూడిన జాబితాలో భారతదేశం 107వ స్థానంలో నమోదు కావటం మనకు సిగ్గుచేటుగా లేదా? అయినా దేశ పాలకులకు ‘చీమ కుట్టి నట్టు’గా కూడా లేదు. ఈ సందర్భంగా కవి కంచాన భుజంగరావు అమృతోత్సవాల సందర్భంగా వినిపిస్తున్న సందేశాన్ని విందాం:
‘‘అర్ధరాత్రి సంకెళ్లు తెగిన జాతికి
సూర్యోదయం ఒక సహజమైన ఆశ
తెల్లవారడం ఒక అనంతమైన భరోసా
కాకపోతే 27,375 ఉదయాలు
ఎదురుచూపులుగా కరిగిపోవడమేమిటన్నదే
ఇప్పుడు తాజా ప్రశ్న.
దొరల బూట్లలో కాలుపెట్టినప్పుడే
అభివృద్ధి నడక ఎక్కడో తప్పటడుగులు వేసింది
ఇప్పుడు కేవలం రెండొందల మర్రి చెట్ల (మహాకోటీశ్వరులు)
నీడ దేశాన్ని కమ్మేసింది.
పెట్టుబడి ఒక్కటే ఇప్పుడు
వీసా లేకుండా దేశాలు తిరిగేస్తుంది
ఈ గడ్డమీద పెట్టుబడికి ఉన్నంత స్వేచ్ఛ
వేరెవరికైనా ఉందా?
ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment