rendomata
-
విన్నారా? ‘మెదడే’ ప్రమాదకరమట!
న్యాయస్థానాల తీర్పుల్ని తప్పుపట్టకూడదని ఎక్కడా శాసనం లేదని బ్రిటిష్ రాణి న్యాయశాస్త్ర సలహాదారు డేవిడ్ పానిక్ అంటారు. న్యాయస్థానాలను గురించి ప్రస్తావించడం తగదని కొందరు ఇచ్చే సలహాలను వీళ్లు కొట్టేస్తారు. న్యాయవ్యవస్థ నడవడికలోని లోపాలను తొలగించుకోవడానికి విధిగా ప్రయత్నించాలని చెబుతారు. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో జరిగే పనుల తీరు గురించిన వాస్తవాలను ప్రజలకు తెలియజెప్పకపోవడం తెలివి తక్కువ పని. వ్యవస్థల పనితీరులో లోటుపాట్లను గమనించలేనంత అమాయకులుగా ప్రజాబాహుళ్యాన్ని భావించడం అప్రజాస్వామికం. ఏ వ్యవస్థ అయినా విమర్శకు అతీతం కాదు. ముఖ్యంగా ఆలోచించే మెదడుంటే ప్రమాదకరమైన తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడతారని భావించేవాళ్లు ఉన్నప్పుడు! ‘‘మావోయిస్టు కుట్ర కేసు పేరిట వికలాం గుడైన ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబాను, ఆయనతోపాటు నిందితులైన ఇతరులను జైలు నుంచి విడుదల చేస్తూ, వారిపై మోపిన కుట్ర కేసును కొట్టివేస్తూ బొంబాయి హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు కాకుండా సుప్రీంకోర్టు నిల్పివేసిన పద్ధతి చాలా అసాధారణం. పరస్పర విరుద్ధంగా వెలువడిన ఈ రెండు కోర్టుల తీర్పులు కీలకమైన ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. సాయిబాబా ప్రభృతులపైన మోపిన కేసును బొంబాయి హైకోర్టు– కేసు సామర్థ్యాన్ని బట్టి కాక, సాంకేతిక కారణాలపైన కొట్టివేసి ఉండ వచ్చు. కానీ ఆ తీర్పుకు వ్యతిరేకంగా వచ్చిన అప్పీలును అనుమ తించేప్పుడు సుప్రీంకోర్టు కొంత సంయమనం పాటించి ఉండాల్సింది. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం బొంబాయి హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా తన అప్పీలును తక్షణమే పరిశీలించాలన్న కోర్కెను తీర్చడానికే సుప్రీం కోర్టు అసాధారణమైన ఉత్సాహాన్ని కనబరిచింది. ఫలితంగా సుప్రీం కోర్టు... ధర్మాసనం ఏర్పాటు చేసింది. కానీ, సాయిబాబా ప్రభృతులను విడుదల చేయడానికి గల కారణాలను ఎంతో వివరంగా పేర్కొన్న బొంబాయి హైకోర్టు తీర్పును కేవలం సమర్థించడానికి సుప్రీం బెంచ్ అంత వేగంగా ఉత్సాహం కనబరిచి ఉండగలిగేదా అన్నది అనుమానిం చాల్సిన విషయం.’’ – ‘ది హిందూ’ సంపాదకీయం (17 అక్టోబర్ 2022) మన పాలకులుగానీ, కొందరు న్యాయమూర్తులుగానీ ఎలా వ్యవహ రిస్తున్నారంటే– ‘మనిషికి మెదడు ఉండటమే ప్రమాదకరం’ అన్న నిర్ణయానికి వచ్చేస్తున్నారు. ఆలోచించే మెదడుంటే ప్రమాదకరమైన తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడతారని కొందరు న్యాయ మూర్తులు నిర్ణయించినట్టు కనబడుతోంది. మెదడు ఎందుకు, ఎలా ప్రమాదకరమైనదో బ్రిటిష్ రాణి క్యాబినెట్‌కు ప్రత్యేక న్యాయశాస్త్ర సలహాదారుడిగా వ్యవహరించిన డేవిడ్ పానిక్ కోర్టుల గురించి వ్యంగ్యంగా ఓ కథ చెప్పాడు: దారిన పోయే ఒక దానయ్య దారిన పోయేవాళ్లంతా కంగారు పడేంతగా, పెద్దగా భయంకరంగా తుమ్ము తుమ్మాడట. దానిపైన కొందరు దగ్గర్లో ఉన్న కోర్టులో ఫిర్యాదు చేస్తే, ఆ కోర్టు వారు ఆ వ్యక్తి రెండు ముక్కుల్లో ఏ వైపు నుంచి తుమ్మాడో తేల్చమన్నారట! అలా ఉంటాయి కొన్ని కోర్టు తీర్పులని చెప్పడానికే డేవిడ్ పానిక్ ఈ స్టోరీ చెప్పాడు. అలాగే కొన్ని సందర్భాల్లో కోర్టు తీర్పుల్ని తప్పుపట్టకూడ దని ఎక్కడా శాసనం లేదని చెబుతూ డేవిడ్ పానిక్, జడ్జి జెరోమి ఫ్రాంక్ ఇలా స్పష్టం చేశారు: ‘‘న్యాయస్థానం వ్యవహరించే తీరు తెన్నుల్ని గురించిన వాస్తవాలను వెల్లడించడం తగదనీ, పైగా ప్రమాదకరం కాబట్టి న్యాయస్థానాలను గురించి ప్రస్తావించడం తగదనీ కొందరు రాజకీయవేత్తలు, కొందరు న్యాయశాస్త్రవేత్తలు సలహాలిస్తుంటారు. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థల్లో, ప్రభుత్వ శాఖల్లో జరిగే పనుల తీరు గురించిన వాస్తవాలను ప్రజలకు తెలియజెప్పక పోవడం తెలివి తక్కువ పని. మనిషి రూపొందించి నిర్మించిన వ్యవస్థల పనితీరులో లోటుపాట్లను గమనించలేనంత అమాయకు లుగా, చిన్నపిల్లలుగా ప్రజాబాహుళ్యాన్ని భావించడం అప్రజాస్వా మికం. మన న్యాయవ్యవస్థ నడవడికలోని లోపాలను తొలగించుకోవ డానికి విధిగా ప్రయత్నించాలి. అందుకనే న్యాయస్థానంలో కూర్చొన దగిన సుశిక్షితులైన జడ్జీలను మాత్రమే అనుమతించాలి. వారి ప్రవ ర్తనను స్వేచ్ఛగా విమర్శించే హక్కు ప్రజలకుండాలి. వారి ప్రవర్తన జ్యుడీషియల్ పర్ఫామెన్స్ కమిషన్ విచారణకు సిద్ధమై ఉండాలి.’’ అందుకే స్వతంత్ర భారత న్యాయవ్యవస్థలో ఉద్దండపిండాలైన ఉన్నత న్యాయశాస్త్ర కోవిదుల్లో, ఉత్తమ న్యాయమూర్తులలో ఒకరైన జస్టిస్ కృష్ణయ్యర్ న్యాయమూర్తి స్థానంలో ఉన్నవాడికి సామాజిక న్యాయంపట్ల అవగాహన, అనురక్తి, ప్రేమానురాగాలు విధిగా ఉండా లనీ... ఈ విషయంలో ఏ కోర్టు బెంచ్గానీ, బార్ అసోసియేషన్ గానీ నా ఆదర్శం నుంచి, లక్ష్యం నుంచి నన్ను మరల్చజాలవనీ పదేపదే స్పష్టం చేస్తూ వచ్చారు. ఈ సత్యానికి ప్రతిబింబంగానే ఫ్రెంచి తాత్త్వికులలో, వామపక్ష ప్రతినిధుల్లో ఒకరైన థోరే ఒక సందర్భంలో మాట్లాడుతూ– వ్యక్తుల్ని అన్యాయంగా, అక్రమంగా జైళ్లలో నిర్బంధించగల ప్రభుత్వం ఉన్న చోట న్యాయంగా వ్యవహరించే వ్యక్తి స్థానం కూడా జైల్లోనే అని వ్యంగ్యంగా పేర్కొన్నాడు. ఆయనను ఫ్రెంచి ప్రభుత్వం అరెస్టు చేసి జైల్లో నిర్బంధించే నాటికే ప్రపంచ ప్రసిద్ధ తాత్త్వికుడైన ఎమర్సన్ కూడా జైల్లో మగ్గుతున్నాడు. థోరేను అకస్మాత్తుగా చూసి, ‘అదేమి టయ్యా, నువ్వు కూడా జైల్లోనే ఉన్నావా?’ అని ఆశ్చర్యం వెలిబు చ్చాడు ఎమర్సన్. ‘అవును, ఎవరినైనా ప్రభుత్వం అక్రమంగా జైల్లోకి నెట్టే కాలంలో న్యాయం పలికే ఏ మనిషి స్థానమైనా జైలే సుమా’ అన్నాడు థోరే! అందుకే జస్టిస్ కృష్ణయ్యర్ ‘అన్యాయంగా జైళ్లలో నిర్బంధితులైన వారిని ప్రస్తావిస్తూ... ఉద్రేకంగా అక్రమ కేసులలో నిర్బంధితులైనవారికీ, వారి హక్కుల రక్షణకు పూచీ పడుతున్న రాజ్యాంగానికీ మధ్య ఇనుప తెర అనేది లేదనీ, ఉండదనీ గమనిం చా’లని పదేపదే చెప్పేవారు. కానీ, ఇప్పటికొచ్చేసరికి అసలు ‘మనిషి (పౌరుడి) మెదడు’ మీదనే కత్తి ఎక్కుపెట్టడం జరుగుతోంది. అందుకే మహాకవి శ్రీశ్రీ అదే ‘మెదడు’ గురించిన విశ్వజనీనమైన సత్యాన్ని ఎలా మానవాళి ముందు ఆవిష్కరించాడో చూడండి: ‘‘మెదడన్నది మనకున్నది అది కాస్తా పనిచేస్తే విశ్వరహఃపేటికావిపాటనం జరగక తప్పదు.’’ ‘మెదడు’ను పనిచెయ్యనివ్వాలి గదా? మరి దాని ఉనికినే ప్రమాదకరంగా భావించి ప్రజల ‘మెదళ్ల’నే కట్టడి చేయాలన్న తపనకు కొందరు తెరలేపడం ప్రమాదకరం. న్యాయస్థానాల గౌరవం మసకబారకుండా జాగ్రత్తపడటం కోసం జస్టిస్ లోకూర్ లాంటి వారు తమకు తాత్కాలిక పాలక శక్తులు ఎర చూపిన ప్రమోషన్లకు లొంగి పోలేదు. తమ ఉనికి కోసం అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ పాలకులు ప్రవేశపెట్టిన తప్పుడు చట్టాలు యువకుల జీవశక్తిని నులిమివేస్తు న్నాయి. ఇటీవలి కాలంలో సుప్రీంకోర్టులో వీస్తున్న ఆహ్వా నించదగిన నిర్ణయాలు, పరిణామాల వాతావరణంలోనైనా అలాం టివి వైదొలగి పోవాలని ప్రజాస్వామ్యవాదులంతా కోరుకుంటారు. ఈ తప్పుడు కేసుల తతంగం అంతా జరుగుతూన్న సందర్భం గానే– ప్రపంచంలో ఆకలిదప్పులతో కునారిల్లిపోతున్న 121 దేశాలతో కూడిన జాబితాలో భారతదేశం 107వ స్థానంలో నమోదు కావటం మనకు సిగ్గుచేటుగా లేదా? అయినా దేశ పాలకులకు ‘చీమ కుట్టి నట్టు’గా కూడా లేదు. ఈ సందర్భంగా కవి కంచాన భుజంగరావు అమృతోత్సవాల సందర్భంగా వినిపిస్తున్న సందేశాన్ని విందాం: ‘‘అర్ధరాత్రి సంకెళ్లు తెగిన జాతికి సూర్యోదయం ఒక సహజమైన ఆశ తెల్లవారడం ఒక అనంతమైన భరోసా కాకపోతే 27,375 ఉదయాలు ఎదురుచూపులుగా కరిగిపోవడమేమిటన్నదే ఇప్పుడు తాజా ప్రశ్న. దొరల బూట్లలో కాలుపెట్టినప్పుడే అభివృద్ధి నడక ఎక్కడో తప్పటడుగులు వేసింది ఇప్పుడు కేవలం రెండొందల మర్రి చెట్ల (మహాకోటీశ్వరులు) నీడ దేశాన్ని కమ్మేసింది. పెట్టుబడి ఒక్కటే ఇప్పుడు వీసా లేకుండా దేశాలు తిరిగేస్తుంది ఈ గడ్డమీద పెట్టుబడికి ఉన్నంత స్వేచ్ఛ వేరెవరికైనా ఉందా? ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
జడ్జి ప్రశ్నలకు జవాబులున్నాయా?
ఆరోగ్యవంతమైన పత్రికలకు జాతీయ, సామాజిక బాధ్యత అనివార్యం. ప్రజలకు చేదోడు వాదోడుగా ఉండటంలో పాలనాశక్తుల కన్నా ముందుగా జాగరూకులవడంలో మీడియా స్వతంత్ర హోదాలో వ్యవహరించాలి. ప్రజల పట్ల కడు గౌరవంతో, అణకువతో ప్రవర్తించాలి. కానీ ఒకనాటి విశిష్ట పాత్రికేయ ప్రమాణాలన్నీ క్రమంగా పతనమవడం చూస్తున్నాం. అందుకే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలలో సామాజిక, నైతిక ప్రమాణాల గురించి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి నిశితమైన విమర్శలు చేశారు. నిజాయితీ గల పాత్రికేయులందరూ వీటికి జవాబులు వెతకాలి. అయితే పత్రికా విలేకర్లు, ఎడిటర్లు అంటే నేడు చులకన భావన ప్రజల మనసుల్లో నాటుకుపోవడానికి దోహదపడినవి స్వార్థపర రాజకీయాలేనని మరవరాదు. ‘‘వార్తా పత్రికలు అనేవి సమాజంలో అంతర్భాగం. అంతమాత్రాన్నే తాము మొత్తం సమాజానికే ‘శిష్టాది గురువు’లమనీ, లోకంలోని జ్ఞానమంతా తమ సొత్తనీ భావించి విర్రవీగరాదు. బుద్ధిగల ఏ వార్తాపత్రికైనా చారిత్రక పరిణామంలో తనవంతు కీలకమైన పాత్ర నిర్వహిం చాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే బాధ్యత గల ఏ పత్రికైనా సమాజం కోసం, తాను సేవలందించే ప్రజల కోసం వారి పట్ల కడు గౌరవంతో, అణ కువతో ప్రవర్తించాలి. ఆరోగ్యవంతమైన పత్రికలకు జాతీయ, సామాజిక బాధ్యత అనివార్యం. ఈ క్రమంలోనే సమాజం పట్ల పత్రికల బాధ్యతను ఏరోజుకారోజు తాత్కాలిక రాజకీయ పార్టీలు లేదా ఆనాటి ప్రభుత్వాల బాధ్యతతో పోల్చుకోరాదు. ప్రజల అవసరాలను గుర్తించి వారికి చేదోడు వాదోడు కావడంలో పత్రికలు పాలనాశక్తుల కన్నా ముందుగా జాగరూకులవడంలో స్వతంత్ర హోదాలో వ్యవహరించాలి.’’ – సుప్రసిద్ధ జాతీయ దినపత్రిక ‘ది హిందూ’ 1978 సెప్టెంబరు 5న తన నూరు సంవత్సరాల చరిత్రను (1878–1978) సమీక్షిస్తూ రాసిన సంపాదకీయం. ఒకనాటి ఇలాంటి విశిష్ట పత్రికా (పాత్రికేయ) ప్రమాణాలన్నీ కొలది సంవత్సరాలుగా ఎలా పతనమవుతూ వస్తున్నాయో చూస్తూనేవున్నాం. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, తెలుగు న్యాయ మూర్తులలో విశిష్టమైన జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి ఈ విషయంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్వతంత్ర భావాలతో న్యాయస్థానాల ద్వారా, సభల ద్వారా ప్రజా బాహుళ్యంలో ఆధునిక వైజ్ఞా నిక దృష్టిని పెంపొందించడానికి కృషి చేస్తూ వచ్చిన వ్యక్తి సుదర్శన్ రెడ్డి. తెలంగాణా వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో నేటి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలలో సామాజిక, నైతిక ప్రమాణాల గురించి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ప్రస్తావించి, నిశితమైన విమర్శలు చేశారు. ఈనాటి కొందరు జర్నలిస్టులు పత్రికా యాజమాన్యాల సాయంతో పాలకుల్ని ఒప్పించడం సబబైన మార్గమని భావిస్తూండడాన్ని జస్టిస్ సుదర్శన్ విమర్శించారు. ఈ ధోరణి నేటి మీడియాలో పెరిగి పోతుండడాన్ని ఆయన నిరసించారు. వేలాది వార్తా పత్రికలు, వెయ్యి ఉపగ్రహాల సహాయంతో నడుస్తున్న న్యూస్ చానల్స్, 600 ఎఫ్.ఎం. స్టేషన్స్‌తో దేశంలోని బహు కొలదిమంది సంçపన్నులు లాభాల వేటలో పడి సొమ్ము చేసు కుంటున్నారు. ఇలాంటి వాతావరణంలోనే ఒక నటుడు ఆత్మహత్య చేసుకుంటే దాన్ని మీడియా ఓ పెద్ద ఘటనగా చూపింది. అందుకు దోహదం చేసినవాళ్లు వెంటనే దాన్ని రాజకీయ పోరాటంగా మలిచేశారు. కానీ అదే సమయంలో ఏడుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్న ఘటనకు కేవలం ఏడు నిమిషాల ప్రాధాన్యం కల్పించారు. ఎందు కని? వార్తలు పత్రికా ఆఫీసుల నుంచి కాకుండా ఎక్కడో బయట ‘అల్లి’ పత్రికలకు చేరుతున్నాయి! అయినా నిజాయితీ గల జర్నలిస్టులు, ప్రజా సమస్యల పట్ల ఆవేదన చెందగల పాత్రికేయులు కూడా మనకు లేకపోలేదని జస్టిస్ సుదర్శన్ రెడ్డి గుర్తించగలిగారు. అంతేగాదు, మరొక వాస్తవాన్ని కూడా జస్టిస్ సుదర్శన్ బహిర్గతం చేశారు. వార్తా పత్రికలు నిర్వహించే యాజమాన్య సంస్థల్లో పెక్కింటికి ఇతర వ్యాపారాలు కూడా ఉన్నందున నిర్ణయాలు త్వరగా తీసుకోలేని దుఃస్థితిని కూడా ఆయన వివరించారు. అందుకే దేశంలో ప్రజాస్వామ్యాన్ని, దాని విలువల్ని కాపాడేందుకుగానూ పూర్తిగా ప్రయివేట్ పత్రికా యాజమాన్యాల మీడియా సంస్థలపై సరైన అదుపాజ్ఞలు విధించడం అవసర మన్న సుప్రీంకోర్టు ప్రకటనను కూడా జస్టిస్ సుద ర్శన్ గుర్తు చేయవలసి వచ్చింది. ఇక ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్ట్ ప్రొఫెసర్ పద్మజా షా మాట్లాడుతూ – ప్రతీ పాత్రి కేయ విలువనూ, గత ప్రమాణాలనూ ధ్వంసం చేసి నేరస్థ రాజకీయ విలువల్ని చొప్పించేశారనీ, అదే జర్నలిజంగా ప్రమోట్ అవుతోందనీ ఆవేదన చెందారు. ధనార్జనలో భాగంగా అమెరికన్ కోటీశ్వరుడు రూపర్ట్ మర్డోక్ ‘ఫాక్స్’ న్యూస్ చానల్ పెట్టి ఎలా అనైతిక ప్రమాణాలను ప్రవేశపెట్టాడో లోకానికి తెలుసు. ఎక్కడో అమెరికా, ఇతర దేశాల సంగతి కాదు... ఆ మాటకొస్తే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నట్టింటనే ఇలాంటివి జరిగాయి. ‘‘సీనియర్ జర్నలిస్టుల’’ పేరిట చలామణీ అవు తున్న ఇద్దరు ముగ్గురు వ్యక్తుల్ని ఒక ముఖ్యమంత్రి సాకడం జరిగింది. వారికి ఇంటర్– స్టేట్ వాహనాల లైసెన్సులు ఇప్పించడమే గాకుండా హౌసింగ్ బోర్డు యాజమాన్యంలో కూడా చోటు కల్పించారు. దాన్ని స్వప్రయోజనాలకు వినియో గించుకుని బ్యాంకుల్ని దివాళా తీయించిన ఉదా హరణలూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయని మరవరాదు! అంతేగాదు, అనైతిక మీడియా సోదరుడే ‘‘ముందు వాడి (ఎన్.టి.ఆర్.) ఫొటోను తీసి అవ తల పారేస్తావా, లేదా?’’ అని స్వయంగా చంద్ర బాబు ముఖం మీదనే ‘ఉరిమాడా,’ లేదా? ఎన్టీఆర్ ఫొటో తీసేస్తే కథ అడ్డం తిరుగుతుందని తెలిసిన చంద్రబాబు ‘అలాగే తీసేద్దాంలే, ఇప్పుడు కాదు’ అని చెప్పి... ‘ఫొటో నాటకం’ కోసం కొన్నాళ్లు ఎన్టీఆర్ అవసరమని తెలిసి తన తైనాతీ జర్న లిస్టును కాపాడుకున్నాడా, లేదా? ఇప్పటికీ ఆ నాటకం ఎన్టీఆర్ బొమ్మతోనే కొనసాగిస్తున్నారా, లేదా? చివరికి అమరావతి రైతాంగాన్ని మోస గించిన వైనాన్ని గురించి సీనియర్ జర్నలిస్టుగా హైకోర్టులో నేను రిట్ వేసినా, దాన్ని కనీసం చర్చకు కూడా రానివ్వకుండా తొక్కిపెట్టించిన ఖ్యాతిని మూటగట్టుకున్నవాడు చంద్రబాబే! అంతే గాదు, అమరావతి రైతాంగానికి జరిగిన అన్యాయం గురించి సుప్రీంకోర్టులో నేను రిట్ వేసినప్పుడు, ఆగమేఘాల మీద ఢిల్లీ చేరుకుని, ఆ కేసును కూడా తొక్కిపట్టేట్టు చేసినవాడూ చంద్ర బాబే కదా? ఆ కేసు అప్పటికీ ఇప్పటికీ అక్కడే ఉండిపోయింది. ముక్కారు పంటలు పండే అమ రావతి ప్రాంత భూములను తన రాజకీయ ప్రయోజనాల కోసం, తన మంత్రివర్గంలోని ధనాఢ్యుడైన విద్యాశాఖామంత్రికి ధారాదత్తం చేయడమే కాక... ఎదురు తిరిగిన రైతుల భూముల్ని తగలబెట్టించి, ఆ దుర్మార్గాన్ని దళితు డైన నందిగం సురేష్‌పై (నేటి పార్లమెంట్ సభ్యుడు) నెట్టి, వేధింపులకు గురిచేసిన వాళ్లెవరు? కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుంది. పత్రికా విలేకర్లు, ఎడిటర్లు అంటే నేడు చులకన భావన ప్రజల మనసుల్లో నాటుకుపోవడానికి దోహదపడినవి పాలకుల స్వార్థపర రాజకీయా లేనని మరవరాదు. కనుకనే గౌరవ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి మన మీడియా నిర్వాహకులకు (కోట్లకు పడగలెత్తిన యాజమాన్యాలకు, బతుకు బాటలో లొంగిపోయే కొందరు మీడియా మిత్రు లకు) చురకలు వేయడం సకాలంలో సబబైన స్పందనగా నేను భావిస్తున్నాను. అమెరికాలో వాల్టర్ లిప్మన్, ప్రొఫెసర్ నోమ్ చామ్స్కీ నిర్వ హించిన పాత్రను ఇక్కడ మన కాలంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోషిస్తున్నారని చెప్పడం అతిశయోక్తి కాజాలదు! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
వినదగిన ‘తక్కెళ్ల జగ్గడి’ వాదన
సమాజంలోని ఆలోచనాశీలికి తక్కెళ్ల జగ్గడు ప్రతీక. ‘మాలపల్లి’ నవలలోని పాత్ర అయితేనేమి, ఈ కాలాన కూడా అలాంటి ముక్కుసూటి మనిషి ఉండాలి. ఒక స్థానిక కోర్టులో ఏ మొహమాటమూ లేకుండా న్యాయమూర్తి ముందు సమాజ పరిస్థితులను ఏకరువు పెడతాడు. నిరుపేదలు మరింత నిరుపేదలు కావడానికి కారణాలను అప్పుడే విశ్లేషించాడు. అయినా సమాజం ఏమైనా మారిందా? వ్యవస్థ మెరుగు పడిందా? జగ్గడి నీతిని ఇప్పుడు వర్తింపజేసినా భూమి బద్దలవుతుందేమో అన్నట్టుగానే ఉంది మన ధోరణి. దాని కోసమైనా మరింతమంది జగ్గళ్లు కావాలి. వ్యవస్థను నిద్ర లేపాలి. నేడు దేశంలో గానీ, పలు రాష్ట్రాలలో గానీ అమలవుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను గమనిస్తున్న వారికి ఉన్నవ లక్ష్మీనారాయణ ‘మాలపల్లి’ నవలలో ‘తక్కెళ్ల జగ్గడు’ గుర్తుకొస్తాడు. ఒక స్థానిక కోర్టులో ఎలాంటి నదురూ బెదురూ లేకుండా న్యాయమూర్తి ముందు సమాజ పరిస్థితులను, పేదల దారుణాతి దారుణ పరిస్థితులను జగ్గడు ఏకరువు పెడతాడు. ధనవంతులు తాము ధనవంతులయింది తమ ప్రయోజకత్వం వల్ల కాదు. అందుకు ఎందరో పేదల శ్రమ దోపిడీయే కారణం. దాని ఫలితమే కోట్లాదిమంది నిరుపేదల వుతున్నారు. ఈ దోపిడీ ఏ రూపంలో, ఏ మిష పైన కొనసాగుతుందో కూడా జగ్గడు వందేళ్ళ నాడే సిద్ధాంతీకరించాడు! ‘‘కలియుగంలో రాక్షసులు లేరంటారు గానీ ధనికులే కలియుగ రాక్షసుల’’న్నాడు. ఎలా అన్న ప్రశ్నకు, అప్పటికే దోపిడీ సమాజ వ్యవస్థ అనుసరించే చిట్కాలు, మాయోపాయాలూ ఎలా ఉంటాయో వివరిస్తాడు. ‘‘భాగ్యవంతులు బీదల్ని దోచుకుంటే దానిపేరు వ్యవహారం, బీదలు తమ హక్కును తీసుకుంటే అది చౌర్యం. బీదల దగ్గర నుంచి మోసం చేసి కొంటే ఆకర్షించిన ధనాన్ని మరల బీదలు లాక్కుంటే మాత్రం అది ఎట్లా తప్పయిందో కోర్టువారు నిర్ధారణ చేయగోరు తున్నాను. ఇలాంటి అక్రమ చట్టాల వారస సంతానంగా వచ్చినవే బీదల నేరాలు. అంటే, భాగ్యవంతులకు ఉపయోగించే నేరం చట్ట సమ్మతమై, వారికి ఉపయోగించనిది నేరమా? అంటే భాగ్య వంతుల ప్రాణానికి విలువ ఎక్కువ! బీదవాని కంటే భాగ్యవంతుడి కుక్క గొప్పది కాబోలు. బీదలోడ్చిన చెమటా, రక్తమూ కరుడు కట్టి ధనికుని భాగ్యం అవుతుంది’’ అని చాటిన వాడు జగ్గడు! తక్కెళ్ల జగ్గడి నీతిని వందేళ్ళ తర్వాత అయినా వర్తింపజేస్తే భూమి బద్దలవకుండా ఉంటుందా? బద్దలయ్యే దశలో ఉంది కాబట్టే, కనీసం గత నలభై ఏళ్ళుగా అనేక సాధికార విచారణ సంస్థలు దేశ వ్యాప్తంగా జరిపిన సర్వే ఫలితాల దృష్ట్యా కూడా ఎవరిలోనూ జ్ఞానోదయం ఈ క్షణం దాకా కలగడం లేదు. కనుకనే జగ్గడి నీతి పాఠాన్ని మరొక్కసారి జ్ఞాపకం చేసుకోవలసి వస్తోంది! చివరికి ప్రతిపక్షాల్ని వేధించడానికి క్రమంగా 2024 నాటికల్లా ‘ఒక దేశం ఒకే ఎన్నిక’... ఆ ఒకే ఎన్నిక ద్వారా క్రమంగా ఏక వ్యక్తి పాలనకు మార్గాన్ని సుగమం చేయడం తిరుగులేని కర్తవ్యంగా పాలకులు నిర్ణయించుకున్నట్టున్నారు. అందుకే బహుశా ‘పెగసస్’ కూపీ ‘స్పైవేర్’ అవసరమైంది! ఇక్కడ విచిత్రమేమంటే ఇలాంటి ‘కూపీ’ పద్ధతులు, కూట రాజకీయాలు, కుట్ర కోణాలకు కేంద్ర పాలకుల కన్నా ముందు జాగ్రత్తల్లో ఉన్నవాడు చంద్రబాబు నాయుడు! వర్ధమాన దేశాలపై అమెరికా ఎక్కు పెట్టి ఉంచిన కుట్రలనూ, అనుసరిస్తున్న తప్పుడు విధానాలనూ ప్రాణాలకు తెగించి ఎండ గట్టినవాడు ఎడ్వర్డ్ స్నోడెన్! రెండేళ్ళ ముందే స్నోడెన్ అమెరికా ఎత్తుగడలను గమనించి అమెరికన్ పౌరులకే గాక, వర్ధమాన దేశాల ప్రభుత్వాలను ‘‘మీ డబ్బు, మీ జీవితాలు జాగ్రత్త’’ అని హెచ్చరిం చాడు. రానున్న రోజుల్లో కేంద్రీయ బ్యాంకులు, డిజిటల్ కరెన్సీలు ప్రజల భవిష్యత్తును ‘అతలాకుతలం’ చేస్తాయని ప్రకటించాడు. ఈ పరిణామాల దృష్ట్యా ఇజ్రాయిల్ ‘పెగసస్’ స్పైవేర్ ద్వారా భారత ప్రతిపక్షాలపైనా, పలు సామాజిక కార్యకర్తల పైనా, పౌర హక్కుల నాయకుల పైనా జాతీయ స్థాయిలో కానరాని నిర్బంధ విధా నాలకు గురి చేయడాన్ని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ ఒకటికి రెండుసార్లు ప్రశ్నించాల్సి వచ్చింది. ‘కొరివితో తల గోక్కు’న్నట్టుగా ‘పెగసస్’ కుంభకోణం ద్వారా పశ్చిమాసియాలో ఆఫ్రికన్ల ప్రయోజనాలను దెబ్బతీయజూస్తున్న ఆంగ్లో–అమెరికన్ సామ్రాజ్యవాదుల చేతిలో కీలుబొమ్మగా మారిన ఇజ్రాయిల్‌తో మనం జట్టు కట్టడం... భారతదేశం పట్ల ఆఫ్రికన్లలో వ్యతిరేక భావాలు ప్రబలడానికి చోటిచ్చినట్లయింది. ‘కోవిడ్–19’ వైరస్ వ్యాప్తి కేవలం సాధారణ ‘ఫ్లూ’ లాంటిదనీ, దాని నివారణ పేరిట రకరకాల వ్యాక్సిన్ల ఎగుమతుల వ్యాపార లావాదేవీల్లో ఉన్న దాదాపు 40–80 మందుల కంపెనీల పట్టులో ఉన్న అమెరికా ప్రభుత్వం ఆ కంపెనీల ప్రయోజనాల రక్షణకు అనుమతించడంతో ‘కోవిడ్–19’కు ఇంతవరకూ ఉపశమనం కలగక పోగా రోజుకొక తీరున కొత్త వేరియంట్లు తామరతంపరగా పుట్టుకు రావడం... ప్రైవేట్ మందుల వ్యాపార కంపెనీల ఉనికినే ప్రశ్నించే స్థితి ఏర్పడటం జరుగుతోంది. ఇందుకు బ్రెజిల్లో భారత ప్రభుత్వం అమ్మజూపిన స్థానిక ప్రైవేట్ మందుల వ్యాపార కంపెనీతో పాటు మన పాలకులు కూడా ఇరుక్కుపోవలసి వచ్చింది. ఇలా, మన దేశంలో ఇలాంటి పాలకులు ఎన్ని రకాలుగా 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవాల సమయంలో కూడా పుట్టుకొచ్చి మన మధ్య మసలు తున్నారంటే– ‘తక్కెళ్ల జగ్గడి’ బోధల అవసరం ఇక ముందు కూడా ఉంటుందనీ విశ్వసించవచ్చు! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
అన్ని గొంతులూ విన్నప్పుడే...
మంచిమాట ఎవరు చెప్పినా ముందు వినాలన్నాడు సుమతీ శతకకర్త. విని, తొందరపడకుండా ఆలోచించి, నిజానిజాలు తెలుసుకోగలిగినవారే నీతిపరులని చెప్పాడు. కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ప్రజలను అల్లాడించింది. ఆర్థిక వ్యవస్థలను తలకిందులు చేసింది. వీటన్నింటికీ నిజంగా కారణం కరోనాయేనా అని ప్రశ్నించే గొంతులూ ఉన్నాయి. కోవిడ్‌ను సీజనల్‌గా వచ్చే ఇన్ఫ్లుయెంజాగానే పరిగణించి వైద్యం చేసివుంటే అనవసర లాక్డౌన్స్ తప్పేవని ప్రొఫెసర్ చోసుడొవస్కీ లాంటివాళ్లు చెబుతున్నారు. కరోనా వల్ల ప్రపంచ సంపదను మహాశ్రీమంతులు మరింతగా పంచుకున్నారని కూడా అన్నారు. ఇందులోని నిజానిజాలు తేల్చుకోవాలన్నా ముందు ఇలాంటివాళ్ల మాటలు తొందరపడకుండా వినాలి. సత్యం దిశగా యోచించాలి. సుమతీ శతకకారుడు బద్దెన భవిష్యత్తును ఊహించి వందల సంవత్సరాల క్రితమే బోధించిన నీతి సూత్రం ఈ క్షణానికీ ఎంత విలువైనదో మరోసారి రుజువైంది. ‘నీతి తెలిసిన వాడెవడు?’ అన్న ప్రశ్నకు ఆయన చెప్పిన సమాధానం... మానవేతర ప్రకృతిలోని పశుపక్ష్యాదులకు కూడా వర్తిస్తుంది. మంచిమాట ఎవరు చెప్పినా ముందు వినాలని చెబుతూ ఇలా హెచ్చరించిపోయాడు. ‘‘విన్న తరువాత తొందరపడకుండా బాగా ఆలోచించాలి. ఆ తరువాత నిజానిజాలు తెలుసుకోగలిగినవారే లోకంలో నీతిపరులు’’ అని బోధించాడు. ఇప్పుడా బోధించే వంతు తెలివిగల రెండు ఎలుకలపై పడిందనిపిస్తుంది. ఇంతకూ ఆ ఎలుకల సంభాషణను ఒక సుప్రసిద్ధ కళాకారుడు (క్యారికేచరిస్టు) ఇలా అక్షరబద్ధం చేశాడు: ఒక ఎలుక రెండో ఎలుకను ‘‘నీవు కూడా వ్యాక్సినేషన్ వేయించుకోవడానికి పోతున్నావా?’’ అని అడిగితే, ఆ రెండో ఎలుక ‘‘ఎందుకా తొందరపాటు? మనుషుల మీద ప్రయోగ ఫలితాలు తేలనీ’’ అని సరిపెడుతుంది, తెలివిగా! ప్రపంచమంతటా 2020–21 నుంచి విస్తరించిన కరోనా వైరస్ పౌర సమాజాన్ని నాశనం చేసింది. అది విస్తరించిన దేశాలన్నిటా ఆర్థిక సంక్షోభాలు సృష్టించింది. ఈ నేపథ్యంలో ప్రపంచ బడుగు దేశాలకు, ప్రజలకు అత్యంత ఆశాజనకంగా తన విశిష్ట విశ్లేషణలను, సకాలంలో హెచ్చరికలను అందిస్తూ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేశారు కెనడాకు చెందిన ఆర్థికవేత్త ప్రొఫెసర్ మైఖేల్ చోసుడొవస్కీ (కాట్లిన్ జాన్స్టోన్ ప్రత్యేక వ్యాసం 14 ఫిబ్రవరి 2022). చోసుడొవస్కీ విశ్లేషణల వల్ల ప్రపంచ వైద్య నిపుణులు సహితం పలు వ్యాపార కంపెనీల మందుల నాణ్యత గురించి ప్రశ్నించే స్థితి ఉత్పన్నమైంది. దీనికితోడు కరోనా వైరస్‌కు దాని విభిన్న రూపాల (వేరియంట్స్) నిర్ధారణకు వాడుతున్న ఆర్టీ – పీసీఆర్ పరీక్షలు కూడా నిరర్థకంగా తయారైనాయని తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రకటించడంతో పెద్ద గందరగోళం సర్వత్రా వ్యాపించింది. పైగా ‘సార్స్ – కోవిడ్ 2’ సాధారణంగా సీజనల్‌గా వచ్చే ఫ్లూ, ఇన్ఫ్లుయెంజాలకు మించింది కాదనీ, వాటికి వాడే సాధారణ ఇంజెక్షన్లకు భిన్నంగా వ్యాపార ప్రయోజనాల దృష్ట్యా మార్కెట్‌కు వదులుతున్న ఇంజక్షన్లు ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదనీ కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులే నిర్ధరిస్తూ ఉండడంతో ప్రొఫెసర్ చోసుడొవస్కీ హెచ్చరికలకు విలువ పెరగడం మరొక విశేషం! ఈ గందరగోళం మధ్య దేశదేశాల్లో నిరంతరం జరుగుతున్న పని – లాక్డౌన్లు, ప్రజల నిత్య వర్తక వ్యాపారాలు స్తంభించి, సర్వవ్యాప్త ఆర్థిక సంక్షోభాల్లోకి దేశాల్ని నెట్టడమూ! అంతేగాదు, ఏ ‘కోవిడ్ – 19’ వైరస్ నిర్మూలనకు ఉద్దేశించిన ‘ఎం–ఆర్ఎన్ఏ’ వ్యాక్సిన్స్ ఉన్నాయో, ఆ ప్రత్యేక వ్యాక్సిన్ల వల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రతికూల ఫలితాలు రావడంతో ప్రపంచ వైద్యరంగంలో భారీ గందరగోళ పరిస్థితులు ఏర్పడటాన్ని నిపుణులు గుర్తించారు. అంతేగాదు, ఈలోగా ‘సమాచార స్వేచ్ఛ’ చట్టం కింద సేకరించిన సమాచారం ప్రకారం, ‘కోవిడ్–19’ వ్యాక్సిన్ రక్షణ కవచమేనా అన్న సందేహం రేకెత్తడం మరొక విషమ పరిణామంగా ప్రసిద్ధ వైద్య నిపుణులు పేర్కొనడం జరిగింది. ఇన్నిరకాల పరిణామాల ఫలితంగానే ప్రొఫెసర్ చోసుడొవస్కీ ఈ కింది నిర్ణయానికి వచ్చి ఉంటారు. ‘‘ప్రపంచ చరిత్రలోనే అత్యంత విషాదకర సంక్షోభపు చౌరస్తాలో మనం నిలబడాల్సి వచ్చింది. మనది నడుస్తున్న చరిత్ర. అయినా 2020 సంవత్సరం జనవరి నుంచీ అనుభవిస్తున్న ఘటనల పరంపర గురించిన మన అవగాహన మాత్రం మసకబారిపోయింది. కోవిడ్–19 మహమ్మారి వైరస్ కారణాల గురించీ, దాని వ్యాప్తివల్ల కలిగే దారుణ ఫలితాల గురించీ ప్రజల్ని తప్పుదోవ పట్టించారు. అంతేగాదు, బయటకు చెప్పని అసలు వాస్తవం – ప్రపంచ దేశాల్ని భారీ ఎత్తున నిరుద్యోగంలోకీ, ఆర్థిక దివాళా పరిస్థితుల్లోకీ, దారుణ దారిద్య్ర పరిస్థితుల్లోకీ, నిరాశా నిస్పృహల్లోకీ నెట్టి ప్రజల్ని సుడిగుండంలోకి దించగల బడాబడా గుత్తాధిపతుల ప్రయోజనాల రక్షణకు ఈ కరోనా వైరస్ ఒక పెద్ద ముసుగని మరిచిపోరాదు. దీని ఫలితానికే ప్రపంచవ్యాప్తంగా 700 కోట్ల మంది ప్రజలు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ గురయ్యారు’’. కోవిడ్‌ను సీజనల్‌గా వచ్చే సాధారణ ఇన్ఫ్లుయెంజాగానే పరిగణించి వైద్యం చేస్తే మహమ్మారిని నివారించగలిగేవాళ్లమనీ, అప్పుడు అనవసర ఆర్థిక కార్యకలాపాల దిగ్బంధనలు (లాక్డౌన్స్) తప్పేవనీ, జాతీయ ఆర్థిక వ్యవస్థ కునారిల్లకుండా భద్రంగా ఉండగలిగేదనీ చోసుడొవస్కీ తన డాక్యుమెంట్లో స్పష్టం చేశారు (ద 2020 వరల్డ్‌వైడ్ కరోనా క్రైసిస్: డిస్ట్రాయింగ్ సివిల్ సొసైటీ, ఇంజనీర్డ్ ఎకనామిక్ డిప్రెషన్, గ్లోబల్ కూ డెటట్ అండ్ ద ‘‘గ్రేట్ రీసెట్’’). ఈ సానుకూల నిర్ణయానికి దూరమైనందుననే కరోనా మరో సద్దు మరో సద్దుగా (సెకండ్ వేవ్, థర్డ్ వేవ్) వస్తోందన్న ప్రచారంతో చిన్న, మధ్యతరహా పరిశ్రమలన్నింటినీ దివాళా ఎత్తించారనీ ఆ డాక్యుమెంట్ స్పష్టం చేసింది! ఎక్కడికో అక్కర్లేదు, ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారమే కనీసం అభివృద్ధి దశలోని పాతిక, ముప్ఫయ్ వర్ధమాన దేశాలలో ఈ దశలోనే కరువుకాటకాలు చుట్టుముట్టిన ఫలితంగా విలవిలలాడాయి. ఈ దశలో అనేక కంపెనీలూ, సంస్థలూ దివాళా ఎత్తడానికి, నిరుద్యోగం పెచ్చరిల్లిపోవడానికి ‘వైరస్’ కారణమన్నది కేవలం సాకు మాత్రమేనని కూడా ఆ డాక్యుమెంట్ స్పష్టం చేసింది! అంతేకాదు, ఆర్థిక వ్యవస్థలు ఈ దశలో – అంటే కరోనా కాలంలో చితికిపోతున్న సమయంలోనే 2020 ఫిబ్రవరి నుంచీ బిలియన్ల కొలదీ డాలర్లను మహాకోటీశ్వరులు ఎలా పోగుచేసుకుని బలిసిపోయారో డాక్యుమెంట్ ప్రస్తావించింది. కానీ, అసలు వాస్తవం ఏమంటే – ప్రపంచ చరిత్రలో కనీవినీ ఎరుగనంత స్థాయిలో ప్రపంచ సంపదను భారీఎత్తున బడా సంపన్న వర్గాలు తమ మధ్యన పునఃపంపిణీ చేసుకోవడం (రీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్) జరిగిందని ఆ డాక్యుమెంట్ వివరించింది! బహుశా అందుకే ‘టెంపెస్ట్’ (పెను ఉప్పెన) అన్న రచనలో ‘‘నరకలోకం ఖాళీ అయిపోగా, దయ్యాలన్నీ ఇక్కడ చేరా’’యని మహాకవి, నాటకకర్త షేక్స్పియర్ అన్నాడు! మరొక రహస్యం ఈ సందర్భంగా మరచిపోరానిది – ప్రజలలో విశ్వాస వారధులు నిర్మించి, కష్టాలను కడు ధైర్యంతో ఎదుర్కోగల చేవను ఎక్కించవలసినవాళ్లు కూడా కోవిడ్–19 గురించిన రకరకాల తప్పుడు సమాచారాన్ని భుజాన వేసుకోవడం! వాస్తవాల్ని తెలుసుకోగోరే ప్రాథమిక మానవ హక్కుల్ని పౌరులు చలాయించగల ధైర్యస్థయిర్యాలను అందించాల్సిన అవసరాన్ని ఆ డాక్యుమెంట్ ఎత్తిచూపింది. దీనికితోడు, కోవిడ్–19 చాటున మరో పెను పరిణామం ముంచుకొస్తోందనీ, పైస్థాయిలో ప్రపంచ ద్రవ్య వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకుని మరీ నిర్ణయాలను రుద్దే సరికొత్త విధాన వ్యవస్థ బ్రహ్మప్రళయంగా రూపుదిద్దుకుంటోందనీ, ఇది ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తుందనీ చెప్పింది. ఇలాంటి ఆదేశాలను అనేక దేశాలలోని అవినీతిపరులైన రాజకీయవేత్తలకు ఏకకాలంలో బట్వాడా చేసే విధానం రూపొందించడం జరుగుతుందని చోసుడొవస్కీ హెచ్చరించారు. మొత్తం ఐక్యరాజ్యసమితి ఈ వినాశకర ఎత్తుగడల పట్ల మూగనోము పట్టగల ప్రమాదం ఉందని కూడా హెచ్చరించారు. అందుకే, తత్త్వవేత్తలు ఒక సత్యాన్ని వెల్లడించాల్సి వచ్చింది– ‘‘అబద్ధం ఒకసారి నిజమైతే, ఇక వెనక్కి మళ్లే సమస్య ఉండదు’’. పిచ్చి తలకెక్కింది. రోకలిచుట్టమన్నట్టుగా, ఆ పని జరిగితే ప్రపంచం తలకిందులు కాక తప్పదు. కనుకనే మానవాళి ఇప్పుడు సమస్యల చౌరస్తాలో కొట్టుమిట్టాడుతోందని విజ్ఞుల భావనగా అర్థం చేసుకోవాలి! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు వ్యాసకర్త సీనియర్ సంపాదకులు -
మహిళలే నవ భారత నిర్మాతలు
ఎన్ని అవరోధాలు, సవాళ్లు ఉన్నప్పటికీ భారతీయ మహిళలు తాము శక్తిమంతులమని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటున్నారు. అసమానతలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. విజయం సాధించాలనే నిబద్ధతతో ఉత్సాహంగా దూసుకుపోతున్నారు. నైపుణ్యం, గుర్తింపు, గౌరవం సాధించడానికి మహిళలు తాము చేసే ప్రయత్నాలలో ఎప్పటికీ నిరుత్సాహం చెందకుండా ఉండటమే వారిని మనకు నిజమైన ఆదర్శప్రాయులుగా చేస్తోంది. ‘నేటి లింగ సమానత్వమే రేపటి సుస్థిర సమాజం’... ఈ ఏడాది మన మహిళా దినోత్సవ నేపథ్యాంశం. మహిళలే మన నవ భారత నిర్మాతలు. కొన్ని దశాబ్దాల క్రితమే చిలకమర్తి లక్ష్మీ నరసింహం ‘ముదితల్ నేర్వగరాని విద్యగలదే ముద్దార నేర్పించినన్’ అన్నాడు. స్త్రీ–పురుష విభ జన జీవశాస్త్ర సంబంధమైనదే తప్ప పురుష ఆధి క్యతా ధోరణికి ఆమోద ముద్ర కాదని ప్రకటిం చాడు. ఆస్తిని విభజించినట్టే... స్త్రీ–పురుషుల్ని ఒక యూనిట్‌గా కాకుండా రెండు ‘వర్గా’లుగా చీల్చి తమ ఆధిక్యతా సామ్రాజ్యాన్ని స్త్రీమూర్తిపై స్థాపిం చుకోవడం కోసం పురుషులు తహతహలాడి నందునే మహిళా ఉద్యమాల ఆవశ్యకత వచ్చింది. ‘సెక్స్’ అనే పదం చాటున జరిగే ఈ కృత్రిమ విభజనకు 20వ శతాబ్దపు ఫ్రెంచి మహిళా ఉద్యమ నాయకురాలైన సిమన్ దిబోవర్ అడ్డుకట్ట వేసింది. ఆదిమ మానవుల్లో స్త్రీ–పురుషులు ఎదురు బొదురుగా నిల్చిన రెండు మానవా కృతులనీ, ఈ ఏకత్వాన్ని చెదర గొట్టింది స్త్రీమూర్తి కాదనీ దిబోవర్ ప్రకటిం చింది. యాజ్ఞవల్క్య ముని సహితం ‘రెండుగా చీలిన వెదురు బొంగే – సతి, పతి’ అన్నాడు! దిబోవర్ కన్నా పాతికేళ్లముందే గుడి పాటి వెంకటచలం... ‘స్త్రీకి కూడా శరీరం ఉంది, దానికి వ్యాయామం ఇవ్వాలి. ఆమెకు మెదడు ఉంది, దానికి జ్ఞానం ఇవ్వాలి. ఆమెకు హృదయం ఉంది, దానికి అనుభవం ఇవ్వాలి’ అన్నాడు! దిబోవర్ ఈ సమరంలో ‘పురుషులను తుడిచిపెట్టి ముందుకు సాగిపోవాలన్న దుష్ట తలంపు స్త్రీకి కలలో కూడా రా’దని చెబుతూ... కేవలం ఉద్య మాల వల్లనే, ఆచరణలో వినియోగంలోకి రాని కొన్ని అరకొర చట్టాలను సాధించుకున్నంత మాత్రాన్నే నిజమైన విమోచన కాదని చెప్పింది. స్త్రీలోని అంతర్ శక్తి ప్రబుద్ధమై తానూ జీవితానికి సాధికార వ్యాఖ్యాత కావాలన్నది ఆమె ప్రబోధం. అందుకే పితృస్వామిక వ్యవస్థలో అణగారుతూ వచ్చిన ‘మాధవి’కి తగిన ‘మాధ వుడు’ దొరికేదాకా ఈ పోరాటం ఆగబోదని చెప్పింది. స్త్రీ–పురుషుల మధ్య ఉన్న సంబంధం కేవలం మానవుల మధ్య అనుబంధం తప్ప మరొ కటి కాదన్న మార్క్స్ వాక్యాలతో దిబోవర్ తన ‘సెకండ్ సెక్స్’ ఉద్గ్రంథాన్ని ముగించడం విశేషం. అసలు ఫ్రెంచి విప్లవానికి మహిళలే పూర్తిగా నాయకత్వం వహించి ఉంటే ప్రపంచ చరిత్ర ఎలాంటి మలుపులు తిరిగి ఉండేదోనని సోవియెట్ సోషలిస్టు నేత వ్లాదిమిర్ లెనిన్ నిబిడాశ్చర్యం ప్రకటించాడు. ఎందు కంటే, అరకొర మార్పు లతో, పురుషాధిక్యతా రాజ కీయ పాలకవర్గాలు చేసే స్వార్థపూరిత చట్టాలు ఆచ రణలో ఉన్నంతకాలం, అవి ‘ఉనికి’లో ఉంటాయే గానీ, వాటి ‘ఉసురు’కు విలువ లేదు, రాదు. ఈ దుఃస్థితిలో ‘మహిళల అభ్యున్నతి కోసమే చట్టా లున్నా’యన్న పాలకవర్గాల మాటకు విలువ లేకుండా పోయింది. కారణం, చెప్పిన మాటకు, చేస్తున్న చట్టాలకు ఆచరణలో పొంతన లేకపోవ డమే. విలువ ఉన్న పక్షంలో శాసన వేదికల్లో వారి ప్రాతి నిధ్య శాతాన్ని ఎందుకు కుదిస్తున్నారు? 50 శాతం మహిళలకు ప్రాతినిధ్యం కల్పించవలసిన ప్పుడు కనీసం దాన్ని వారు రాజీపడి సర్దుకుం టున్న 30 శాతానికి కూడా ఎందుకు పెంచలేకపోతు న్నారు? విశ్వకవి టాగోర్ మాటలకు నేటికీ విలువ తగ్గ లేదు. ‘మన శత్రువు మన సంకెళ్లను ఎంత గట్టిగా బిగిస్తే, అంత బలంగానూ మన సంకెళ్లు తెగి పోతాయి. శత్రువు కళ్లు ఎంతగా చింత నిప్పులైతే, అంతగానూ మన కళ్లూ నిప్పులు చెరగగలవు’. ఇవాళ కాదు, 1950 నుంచీ అవినీతికి వ్యతి రేకంగా గళమెత్తిన ఉద్దండులైన దేశ ఉన్నతాధి కారులు – కౌల్దార్, వాంఛూ, సంతానం, దగ్లీ, కాల్కర్, వోహ్రా కమిటీల సిఫారసులన్నీ ఏ గంగలో కలిశాయి? చివరికి లోక్‌పాల్ గతి ఏమైంది? 75 సంవత్సరాల భారత స్వాతంత్య్రోద్యమం తర్వాత కూడా గాంధీజీ సంధించిన ప్రశ్నకు ఈ రోజుదాకా మనం సూటైన సమాధానం చెప్పలేని దుర్గతిలో ఉన్నాం. మన దేశంలో అర్ధరాత్రి వేళ స్త్రీ ఒంటరిగా, నిర్భయంగా బజారులో వెళ్లగల పరిస్థితి ఉందా? ‘పది గంటల పనిదినం’ యూరప్‌లో మొదటి సారిగా ప్రవేశపెట్టిన రోజున కారల్‌మార్క్స్ ఆ చట్టం గురించి చిత్రంగా వ్యాఖ్యానించాడు: ‘ఇది కష్టజీవులైన శ్రామిక వర్గానికి సూత్రబద్ధమైన విజయం. ఎందుకంటే, చరిత్రలో మొదటిసారిగా మధ్యతరగతి రాజకీయ అర్థశాస్త్రం కార్మికవర్గ రాజ కీయ అర్థశాస్త్రానికి పట్టపగలే లొంగిపోయింది. ధనస్వామ్య వ్యవస్థలో ‘విశ్రాంతి’ కూడా కొలది మందికి మాత్రమే అందుబాటులో గల ‘విలువైన వస్తువే’గానీ, రెక్కాడితేగానీ డొక్కాడని అసంఖ్యాక శ్రమజీవులైన స్త్రీ–పురుషుల బతుక్కి మాత్రం శాంతీ లేదు, విశ్రాంతీ లేదు’ అన్నాడు. ‘భారత ప్రజలమైన మేముగా రచించుకుని అంకితమిచ్చుకున్న’ రాజ్యాంగాన్ని ప్రజలకు వ్యతి రేకంగా స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకొనే హక్కు దేశ పాలక వర్గాలకూ, పార్టీలకూ లేదని చాటి చెప్పిన రాజ్యాంగం మనది. అయినా, మహిళా హక్కులకు సంబంధించి మహిళా ప్రతి నిధులు ప్రవేశపెడుతూ వచ్చిన పెక్కు ప్రతిపాదన లను ఏదో ఒక మిష పైన అమలులోకి రాకుండా శతధా అడ్డుకుంటూనే వచ్చారని మరవరాదు. ఫ్రెంచ్ మహిళల చొరవ వల్లనే బానిస దుర్గంగా పేరొందిన బాస్టిల్లీ స్థావరం కుప్పకూలింది. అదే యావత్తు ఫ్రెంచ్ ప్రజలకు ప్రజాస్వామ్య రక్షణ దుర్గంగా చరిత్రలో కీర్తికెక్కింది. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు -
చట్టాలలో అస్పష్టత ఎవరి పుణ్యం?!
న్యాయస్థానాలు జారీ చేసే ఉత్తర్వులు ఆచరణకు నోచుకున్నప్పుడే వాటికి విలువా, గౌరవమూ ఉంటాయి. పాలకవర్గం ఆ ఉత్తర్వులను సైతం ఖాతరు చేయకపోతే దేశంలో గందరగోళం నెలకొని ఉన్నట్టే! ఆ గందరగోళమే చట్టాలు చేయడంలోనూ ప్రతిఫలిస్తోంది. ఎన్నో చట్టాలు సరైన చర్చలు లేకుండానే ఆమోదం పొందుతున్నాయి. ఫలితంగా చట్టాల లక్ష్యమేమిటో జనానికి తెలియకుండా పోతోంది. స్వాతంత్య్రోద్యమ కాలం నాటి స్ఫూర్తి, పారదర్శకత అడుగంటడమే ఈ విలువల పతనానికి కారణం. వలస పాలనావశేషాలు తొలగిపోనంతవరకూ వ్యవస్థలో మార్పు రాదు. అందుకే భారత న్యాయవ్యవస్థను పేద ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా, వలస పాలనావశేషాలకు దూరంగా పునర్నిర్మించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ‘‘కోర్టులు జారీచేసే ఉత్తర్వులు ఆచర ణలో అమలు జరిగినప్పుడే వాటికి విలువా, గౌరవమూ... క్రమంగా కార్యనిర్వాహక వర్గమైన దేశ పాలకవర్గం కోర్టు ఉత్తర్వులను ‘బేఖాతరు’ చేసే ధోరణిలో ఉంది. అంతేగాదు, చట్టాలు చేయడంలోనూ, దేశంలో పార్లమెంటరీ చర్చల నిర్వహణలోనూ అనుసరిస్తున్న తీరుతెన్నులు సక్రమంగా లేవు. ఇందువల్ల దేశంలో తగాదాలు (లిటిగేషన్) పెరిగి, దేశ పౌరులకు, కోర్టులకు, తదితర సంబంధిత వర్గాలకు అసౌకర్యం కలుగుతోంది. చట్టాలు ఎందుకు చేస్తున్నామో స్పష్టత లేనందునే ఈ గందరగోళమంతా. దేశ చట్టాలను చట్ట సభలలో క్షుణ్ణంగా చర్చించిన, ఆమోదించిన రోజులున్నాయి. కానీ దురదృష్టవశాత్తూ కొంతకాలంగా చట్ట సభల్లో జరుగుతున్నదేమిటో మీకు తెలుసు, గుణాత్మకమైన చర్చలు జరగడం లేదు. ఫలితంగా రూపొందుతున్న కొత్త చట్టాల ఉద్దేశంగానీ, లక్ష్యంగానీ బొత్తిగా బోధపడటం లేదు.’’ – 16 ఆగస్టు 2021 – 27 డిసెంబర్ 2021 తేదీలలో గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి. రమణ వెలిబుచ్చిన అభిప్రాయాలు ఇవి. ఆ మాటకొస్తే, చట్టాలు రూపొందిస్తున్న తీరు, పార్లమెంటులో చర్చ లేకుండానే ‘తూతూ మంత్రం’గా ఆమోద ముద్ర వేస్తున్న తీరు గురించి ఒక్క ప్రధాన న్యాయమూర్తి రమణే కాదు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా నిరసన తెలపక తప్పలేదు. చట్టసభలలో చర్చలన్నవి ఎంతో పేలవంగా తయారయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘చట్ట సభలలో నేడు పేరుకు జరుగుతున్న చర్చలు ఇంతగా పతనమవడాన్ని నేడు కళ్లారా చూడవలసి వస్తోంది. సమగ్రమైన చర్చలు జరక్కుండానే చట్టాలు రూపొందిస్తున్నారు. ప్రజాస్వామ్యా నికి ఆధారమే చర్చలూ, సరైన వాదనలూ. అయినా సభలో చర్చలు నిరాటంకంగా జరక్కుండా అడ్డుకోవడం తీవ్ర అభ్యంతరకరం. ఈ ధోరణి ప్రజాస్వామ్య వ్యవస్థల హుందాతనాన్ని, గౌరవ ప్రతిష్ఠలను దెబ్బతీయడమే’’ అని స్పీకర్ ఓం బిర్లా హెచ్చరించడం గమనార్హం! వీటన్నింటికంటే ప్రధానమైనది, ఒకనాటి పత్రికలు సమాజంలో నెలకొల్పిన పాత్రికేయ ప్రమాణాలుగానీ, వాస్తవాలపై ఆధారపడిన పరిశోధనాత్మక జర్నలిజంగానీ ఈ రోజున మనకు మృగ్యమని పేర్కొంటూ గౌరవ ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి. రమణ నేడు సమాజంలో వాస్తవిక సంచలనం కలిగించగల ఒక్క వ్యాసమన్నా మీడియాలో చోటు చేసుకుందా అని ప్రశ్నించారు. ఒకనాడు భారీ కుంభకోణాలకు సంబంధించిన కథనాలు చదవడానికి పాఠకులు ఉవ్విళ్లూరేవారనీ, కానీ ప్రస్తుత కాలంలో ఏది నిజమో, ఏది కట్టుకథో తెలుసుకోవడం గగనమై పోతోందనీ కూడా జస్టిస్ రమణ ఎత్తి పొడిచారు. అంతేగాదు, ఇటీవలనే ‘మాధవన్ కుట్టి అవార్డుల’ ప్రదానోత్సవం సందర్భంగా గౌరవ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ (18 డిసెంబర్ 2021), నేడు దేశంలో వాస్తవాల కోసం ఒక పత్రికపైనో, ఒక చానల్పైనో పాఠకుడు ఆధారపడే పరిస్థితి లేదనీ, పాత్రికేయ విలువలు, ప్రమాణాలూ పడిపోతున్నాయనీ, కనీసం ఒక ఘటనపై వాస్తవాలు తెలుసుకోవాలంటే కనీసం నాలు గైదు పత్రికలు చదవాల్సి వస్తోందనీ వ్యాఖ్యానించారు. కానీ, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లలోనే జాతీయోద్యమ కాలంనాటి సామాజిక విలువలు, స్ఫూర్తి మనం ఎందుకు, ఎవరి వలన కోల్పోవలసి వచ్చిందన్న ప్రశ్నకు నేటి తరం స్వార్థపరులైన రాజకీయ పాలకులు ఎవరూ సూటిగా సమాధానం చెప్పగల పరిస్థితుల్లో లేరు. చివరికి అనేకమంది ప్రజాస్వామిక, సామాజిక కార్యకర్తల చొరవ ఫలితంగా, పౌర హక్కుల ఉద్యమకారుల నిరంతర పోరాటాల ఫలితంగా అమలులోకి వచ్చిన ‘సమాచార హక్కు చట్టాన్ని’ సహితం నీరుగార్చి పాలకులు జీవచ్ఛవంగా మార్చిన విషయం మరిచిపోరాదు. చివరికి ఒక విదేశీ గూఢచారి వ్యవస్థ సలహా సంప్రదింపులపై ఆధారపడి దేశీయ పౌరహక్కుల ఉద్యమాలనూ, పౌరహక్కులనూ అణగదొక్కేందుకు, అరబ్ ప్రజలను అణచడంలో అమెరికాకు ‘తైనాతీ’గా పనిచేస్తున్న ఇజ్రాయెల్‌ను మన పాలకులు ఆశ్రయించడం... మన దేశంలోనే కాదు, ప్రపంచ సభ్యదేశాలలో ‘పెగసస్’ కుంభకోణం ద్వారా వెల్లడయిందని మరచిపోరాదు. చివరికి మన సుప్రీంకోర్టు చేతిలో దేశ పాలకులు చిక్కుపడిపోయి ‘పెగసస్’ కుంభకోణం నుంచి బయటపడగల పరిస్థితులు దాదాపు శూన్యంగా కన్పిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లోనే ఇద్దరు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయ మూర్తులైన ఎన్.వి. రమణ, జస్టిస్ అబ్దుల్ నజీర్ భారత న్యాయ వ్యవస్థను బడుగు వర్గాలయిన పేద ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా, వలస పాలనావశేషాలకు దూరంగా పునర్నిర్మించు కోవలసిన అవసరం ఉందనీ, మన సమాజ వాస్తవాలకు సన్ని హితంగా మలచుకోవలసిన సమయం వచ్చిందనీ హెచ్చరించడం విశేషం. కనీసం 75 సంవత్సరాల స్వాతంత్య్ర ముహూర్తం కూడా గడిచిపోతున్న సందర్భంలోనైనా మనం కళ్లు తెరవవలసి ఉంది. ప్రజాబాహుళ్య విశాల ప్రయోజనాలకు అనుగుణంగా విదేశీ న్యాయ శాస్త్ర అనుభవాల నుంచి మంచిని గ్రహిస్తూనే, ఒక స్వతంత్ర దేశంగా భారతదేశ న్యాయ వ్యవస్థను వలస పాలనావశేషాలకు కడు దూరంగా పునర్నిర్మించుకోవలసిన అవసరం గురించి 1986 నాటి ఎం.సి. మెహతా కేసులో ఆనాటి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి పి.ఎన్. భార్గవ గుర్తు చేసిన వాస్తవాన్ని మనం మరవకూడదు. ఈ అనుభవాల నుంచి భారత న్యాయ వ్యవస్థకు రాజ్యాంగంలోని 141వ అధికరణ కింద ఒనగూడిన ప్రత్యేక సదుపాయమే ‘ప్రజా ప్రయో జనాల వ్యాజ్యం’ పౌర హక్కు అని మరచిపోరాదు. ఇలా ఎన్ని రకాల హక్కులు దేశ పౌరులకు సమకూడినా– ఈ పెట్టుబడిదారీ భూస్వామ్య జమిలి వ్యవస్థ... ఆచరణలో రద్దు కానంత వరకూ... రాజకీయ పార్టీలు ఎన్ని ముసుగుల్లో అధికార పెరపెరతో ఎన్నికల్లో పాల్గొన్నా, వలస పాలనా చట్ట అవశేషాలు– దేశాధికారం ఎవరి చేతుల్లో ఉన్నా... ప్రజా బాహుళ్యానికి ఒరిగేది ఏమీ ఉండదు. ఎందుకంటారా? ప్రసిద్ధ ఆంగ్ల కవయిత్రి మౌమిత ఆలం ‘లైవ్ వైర్’కు రాసిన ‘పొరపాటు’ కవితకు ‘ఉదయమిత్ర’ అనువాదంలోని ఆవేదనను పరిశీలించండి: ‘‘ఔను, వాళ్లెవరినైనా చంపగలరు రాజ్యం వాళ్లకు హామీపడింది! ఎవరినైనా, ఎప్పుడైనా, ఎందుకైనా చంపగలరు చావడానికి మనకు కారణాలుంటాయేమోగానీ చంపడానికి వాళ్లకు ఏ కారణమూ ఉండనక్కర్లేదు ఇంట్లో పనిచేసుకుంటున్న అఖ్లాన్నీ రైల్లో ప్రయాణిస్తున్న పెహ్లూన్ని చంపగలరు లక్షలాదిమంది పేర్లూ, చరిత్రనూ తుడిచేసి నిలువెత్తు జీవితాల్ని నంబర్ల కిందకు కుదించేసి అనేకానేకుల్ని అనాధ శవాలుగా మార్చేయగలరు... ఇంతకూ ఎవరువాళ్లు? వాళ్లు దేశ ప్రేమికులండోయ్! ఏ శిక్షా పడకుండా సొంత ప్రజలనే చంపగలరు! గుర్తించడానికి నిరాకరించో ‘పొరపాటు’ గుర్తింపు పేరుమీదనో ఎవరినైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా చంపగలరు! సర్వకాల సర్వావస్థలకు అతీతులు వాళ్లు సుమా! అవును, వాళ్లెవరినైనా చంపగలరు రాజ్యం వాళ్లకు హామీపడింది!’’ ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
పౌరస్వేచ్ఛ భద్రతలో న్యాయమూర్తులు
కాలం చెల్లిపోయిన వలస పాలనా వ్యవస్థలో రూపొందించిన చట్టాలు భారతదేశ ప్రజాస్వామ్య రక్షణకు, పౌర హక్కుల రక్షణకు పనికిరావని, నవభారత నిర్వహణకు కూడా అవి ఉపయోగపడవని, ఇందుకోసం న్యాయవ్యవస్థ చట్రంలోనే మౌలికమైన మార్పులు అనివార్యమని, పౌరుల భద్రతకు ఇవి తప్పనిసరని సుప్రీంకోర్టు ధర్మాసనం గత కొద్ది రోజులుగా విస్పష్టంగా ప్రకటనలు జారీచేయడం ప్రశంసనీయమైన పరిణామం. ముఖ్యంగా మన దేశ పాలకుల ఆశీస్సులు పొందిన విదేశీ కూపీ సంస్థ ‘పెగసస్’ కారణంగా దేశ పౌరహక్కులకు ఎదురైన పెనుముప్పు సందర్భంగా, న్యాయమూర్తుల తాజా ప్రకటనల ప్రతిపత్తికి మరింత విలువ పెరిగింది. జాతీయ భద్రత అంటే ఏమిటో, దాన్ని పిడుక్కీ బియ్యానికీ వాడుకుని అన్ని రకాల ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి ఏయే చిట్కాలను ఆశ్రయిం చాలో ప్రధాని నరేంద్రమోదీకే తెలుసునని సుప్రసిద్ధ ‘ది హిందు’ దిన పత్రిక కార్టూనిస్టు సాత్విక్ అత్యంత వ్యంగ్య వైభవంతో వివరించారు. (16–09–2021). అందులో దేశ భద్రతా లక్ష్యం కింద ఏయే కేసుల్ని నమోదు చేయవచ్చునో కార్టూనిస్టు సాత్విక్ పేర్కొన్నారు. దేశద్రోహం కేసులు, ఆరోగ్య సమస్యలతో తీసుకుంటున్న సీనియర్ పౌరులను జైల్లో నిర్బంధించడం, ఇంకో వైపునుంచి జాతీయ పౌర చట్ట సవరణ, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నవారి ఆచూకీ తెలిపే పెగ సస్ ‘సాక్ష్యం’, నిరసనకారులపై నిర్బంధ చర్యలు... వెరసి ఇవన్నీ జాతీయ భద్రత కోసమే సుమా! ఇదీ ఆ వ్యంగ్య చిత్రం వరుస. ఇజ్రాయెల్ కేంద్రంగా వివిధ దేశాల్లో ఆయా ప్రభుత్వాల తరఫున పౌరులపై రహస్యంగా గూఢచర్యం జరపడానికి ఇజ్రాయెల్ అనుమతి స్తోంది. ఇతర దేశాల పాలకవర్గ ప్రయోజనాల కోసం ఆయా దేశా ల్లోని ప్రభుత్వాల అనుమతితోనే, ప్రజాసమస్యలపై ఆందోళన జరిపే స్థానిక పౌరులపైన కూడా గూఢ చర్యం పెగసస్ జరుపుతోంది. కానీ ఈ క్రమంలో జర్మనీ చేతికి చిక్కిన పెగసస్ జుట్టు మన పాలకుల చేతికి ఎందుకు చిక్కలేదు? భారతదేశంలో కూడా పెగసస్ గూఢ చర్యం గుట్టు కాస్తా రట్టయింది కదా. ప్రభుత్వం భావించే ఫలానా ఆందోళనకారులపైనేగాక, జన జీవితంలో హృదయమున్న ఉన్నతాధి కారులపైన, మేధావులపైన, మాజీ విదేశాంగ మంత్రుల పైన, మాజీ పోలీసు అధికారులపైన సహితం పాలకవర్గం నిగూఢంగా కన్నేసి నిఘా పెట్టడానికి కారణం... ఈ పెగసస్ గూఢచర్యమే. ఈ బాగోతం కాస్తా పాలకుల మెడకు చుట్టుకున్నాక, అలాంటిదేమీ లేదని, అది ప్రతిపక్షాల ఆరోపణ మాత్రమేనని బీజేపీబుకాయిస్తూ వస్తోంది. చివరకు ప్రతిపక్షాలు, దేశంలోని సుప్రసిద్ధ హిందూ సీనియర్ జర్నలిస్టు ఎన్. రామ్, ఇండియన్ ఎడిటర్స్ గిల్డ్... పెగసస్ గూఢచారి సంస్థ సాయంతో బీజేపీ పాలకులు దేశీయ పౌర సమాజంపైనే ఎక్కుపెట్టిన పెను రహస్య గూఢచర్య కార్యకలాపాలను బహిర్గతం చేసి, నిరసన తెలిపి నిలదీశారు. ఇది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును కదిలించివేసింది. కోర్టు రంగంలోకి ప్రత్యక్షంగా దిగి, మొత్తం పెగసస్ గూఢచర్యంపై వివరమైన సాక్ష్యాధారాలతో ప్రకట నను ప్రభుత్వం సమర్పించాల్సిందేనని ఆదేశించింది. అప్పుడు అసలు రహస్యం కోర్టుకే కాదు. యావత్తు దేశానికే వెల్లడవక తప్ప లేదు. ప్రభుత్వంపై ఎక్కుపెట్టిన ఆరోపణలు తీవ్రమైనవి కాబట్టి అసలు నిజానిజాలు విధిగా ప్రభుత్వం బయట పెట్టాల్సిందేనని కోర్టు హెచ్చరించింది. ఆరోపణలు ఎక్కుపెట్టిన ఎన్. రామ్ ప్రభృతులు, తమ పిటిషన్ల కాపీలను ప్రభుత్వానికి కూడా అందజేయాలని ఆశించ డంతో పాలకులకు గొంతులో వెలక్కాయ పడినట్టు భావించి ఇక తప్పించుకోలేమన్న భయంతో తమ రూటు మార్చారు. ఈ కేసు మొదలై రెండేళ్ళయింది. ‘పెగసస్’ భారతప్రభుత్వం అనుమతితోనే ఇండియాలో ‘హల్చల్’ చేస్తోందని అందరూ భావించిన దరిమిలా 2019లోనే ఈ భాగోతం బయటపడిందని కూడా నాటి సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ దేశానికి వెల్లడించింది. పైగా పెగసస్ గూఢచారి స్పైవేర్‌ను... మోదీ దేశప్రజలపైన ప్రయోగిస్తున్నారనే ఆరో పణలను కోర్టు కూడా విశ్వసించింది, ప్రభుత్వ సంస్థలు ప్రత్యర్థులపై నిఘా పెట్టినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నప్పుడు, కేంద్ర ప్రభుత్వం ఇజ్రాయెల్ పాలక సంస్థ సాయంతో దేశంలోని ప్రత్యర్థులపై కూపీలు లాగడానికే ఈ విదేశీ స్పైవేర్‌ను ప్రయోగిస్తోందన్న మీడియా వార్తలు నమ్మశక్యం కానివని తామూ భావించడంలేదని కూడా సుప్రీం బెంచ్ భావించింది. ఇది వ్యక్తుల గోప్యత, గౌరవాలపై దాడిచేసినట్టే అవు తుందని ధర్మాసనం చెప్పింది. ఇక పాలకులు ఠలాయించలేమనే పరి స్థితుల్లో పడి, గొంతు మార్చి దేశ అత్యున్నత న్యాయస్థానం ముందు, పెగసస్‌తో ఒప్పందం జరిగిందని ఒప్పుకునే పక్షంలో జాతీయ భద్రతను కాపాడటంలో ప్రభుత్వం రాజీపడినట్టు అవుతుందని కోర్టు ముందు పేర్కొన్నారు. దీంతో ‘పెగసస్’తో కుదుర్చుకున్న ఒప్పం దాన్ని పాలకులు ఒప్పుకున్నట్టయింది. పైగా, పెగసస్ బాగోతం గురించి జర్మన్ ప్రభుత్వం వెల్లడించిన అసలు వాస్తవాలు విస్మయం కలిగిస్తున్నాయి. జర్మనీలోని 50,000 మంది స్థానిక పౌరులపైన ఈ పెగసస్ గూఢచర్యానికి ఎలా దిగిందీ, మాజీ సీనియర్ దౌత్యవేత్తలపైన ‘పెగసస్’ రహస్య గూఢచర్యానికి ఎలా పాల్పడిందీ, స్థానిక ప్రైవసీ చట్టాలు అనుమతించిన పరిమితు లను కూడా మించి ఎలా జర్మనీ ప్రయోజనాలకు, స్వతంత్ర విధానా లకూ, హానికరంగా ‘పెగసస్’ తయారయిందీ కూడా జర్మన్ లాయర్లు ప్రకటించాల్సి వచ్చింది. మన పాలకుల్లాగానే జర్మనీ పాలకులు కూడా స్థానిక ప్రజల పౌర అవసరాలను తీర్చడంలో విఫలమై, ఆందోళన లను తట్టుకోలేక వాటిని అణచివేయడం కోసం పెగసస్ అనే ప్రపంచ రాక్షస కూపీ సంస్థను అరువు తెచ్చుకుని చేతులు కాల్చుకున్నారు. ఈ సంగతి తెలిసొచ్చిన తరువాతనే జర్మన్ పాలకులు పెగసస్ వల్ల దేశ సార్వభౌమాధికారానికి వచ్చిన పెనుప్రమాదాన్ని గుర్తించి ‘లెంపలు’ వాయించుకుని దారికి రావలసి వచ్చింది. దాంతో స్వతంత్రదేశాలు జాగ్రత్త పడవలసి వచ్చిందన్నది ఆలస్యంగానైనా వచ్చిన గుర్తింపు. కానీ మన పాలకులకు మాత్రం ఆ గ్రహింపు ఇప్పటికీ లేదు. మన సుప్రీంకోర్టు ఈ సందర్భంగా సంధించిన ప్రశ్నల పరంపరను తప్పిం చుకునే క్రమంలో మన పాలకులు మరికొంత లోతుగా దిగబడి పోయారు. అత్యున్నత న్యాయస్థానంలో ప్రభుత్వం కోర్టు కోరినట్టుగా తన వాంగ్మూలాన్ని దాఖలు చేయడమంటే అది బహిరంగమైపోయి జాతీయ భద్రతకు వ్యతిరేకంగా రాజీపడటమే అవుతుందని అసలు విచారణ నుంచి జారుకునే ప్రయత్నం చేశారు. కమిటీల మీద కమి టీల పేరిట కాలయాపన చేసే ప్రయత్నంలోనే ఉన్నారు. అంతే తప్ప దేశసార్వభౌమాధికారానికి, దేశ ప్రజల పౌర హక్కులకు, ప్రజా స్వామ్య హక్కులకోసం ఆందోళన చెందుతున్న జర్నలిస్టులు, పలు వురు మేధావులు, చివరికి వందలాదిమంది మాజీ న్యాయమూర్తులు, కేంద్ర మాజీ అధికారులు, మాజీ పోలీసు అధికారులు తదితర ప్రజా తంత్ర శక్తులపై కూపీ కోసం పెగసస్‌తో రహస్య ఒప్పందం చేసుకున్న పాలకులు మాత్రం జర్మనీ పాలకుల బాట పట్టలేకపోయారు. కనీసం నెల రోజుల క్రితమే సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్ ఇలా స్పష్టం చేశారు. ‘దేశంలో ప్రజాస్వామ్యమూ, సత్యమూ చెట్టపట్టాలు కట్టుకుని ముందుగా సాగాల్సిన అవసరం ఉంది. పాలకులకు నిజాన్ని బల్లగుద్దినట్టు చెప్పితీరాలి. దేశంలో అధి కారంలో ఉన్నవాళ్లు ఎవరన్నా కానివ్వండి... చివరికి అది రాచరిక మైనా లేదా సర్వశక్తిమంతమైన ప్రభుత్వమైనా సరే ప్రజాస్వామ్యం బతికి బట్టకట్టాలంటే సత్యమన్నదీ, వాస్తవమన్నదీ బహిరంగం కావా ల్సిందే. సత్య ప్రకటన అన్నది ప్రజాస్వామ్య వ్యవస్థ చేతిలో బలమైన కత్తీ, రక్షణాయుధమూ. అందుకే ప్రజాస్వామ్య జీవనం మన హక్కు. సత్యం పలకడమంటే అధికార శక్తిని నిలువరించడమే. నియంతృత్వ పోకడలను తలెత్తనివ్వకుండా ముందస్తుగానే జాగ్రత్తపడడం. కొన్ని ప్రభుత్వాలు నిరంతరం అబద్ధాల మీదనే బతకడానికి కారణం– ప్రజ లపైన తన పెత్తనాన్ని కొనసాగించుకోవడానికే సుమా!’ అని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. దేశంలో ‘పెగసస్’ ప్రమాదకర గూఢచర్యం... అందునా పాలకుల రహస్య ఒప్పందంతో కొనసాగుతున్న తరు ణంలో జస్టిస్ చంద్రచూడ్ ప్రకటన వెలువడడం వల్ల అది సమకాలీన వాస్తవ పరిస్థితులకు పట్టిన నిలువుటద్దం! క్రమంగా ఒక దేశం, ఒకే ఎన్నిక నినాదం క్రమంగా ఒక దేశం, శాశ్వతంగా ఒక ప్రధానమంత్రి ఉండాలన్న ఆలోచన వైపునకు ఆచరణాత్మకం కాకూడదన్న హెచ్చరి కకు సుప్రీం సీనియర్ జస్టిస్ చంద్రచూడ్ తాజా ప్రకటనే నిదర్శనం. అందుకే నిజాన్ని పాతిపెట్టి అబద్ధమాడితే, ఆ నోటికి అరవీసెడు సున్నం పెట్టమన్న సామెత పుట్టుకొచ్చిందా? ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
పచ్చి అబద్ధాలతో ముగిసిన చర్చలు!
అంతర్జాతీయ సైబర్ నిఘా సాఫ్ట్వేర్ సంస్థ ఎన్ఎస్ఓ రూపొందించిన ‘పెగసస్’ సాఫ్ట్వేర్ భారతదేశంలో యథేచ్ఛగా సాగిస్తున్న ‘కూపీ’లతో తమకు సంబంధం ఉన్నదా లేదా అనే విషయాన్ని తేల్చి చెప్పడానికి బీజేపీ పాలకులకు ఏళ్ళూపూళ్లూ పట్టవలసిన అవసరం లేదు. ‘పెగసస్’తో లోపాయికారీ ఒప్పందం ఏదో ప్రభుత్వానికి ఉందన్న ప్రతిపక్షాలు, పలు ప్రజాసంస్థల ఆరోపణలను ఖండించడానికి రెండు మాసాలకు పైగా కాలక్షేపం చేయవలసిన అవసరం లేదు! దేశంలోని రాజకీయ ప్రత్యర్థులపైన. జర్నలిస్ట్‌లపైన, కొందరు జడ్జీల ఫోన్లపైన ఎన్ఎస్ఓ రూపొందించిన ‘పెగసస్’ సాఫ్ట్‌వేర్‌ని భారత పాలకులు ఉపయోగిస్తున్నారని పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. గోవిందాచార్య సుప్రీంకోర్టులో 2019లోనే ‘పెగసస్’ బాగోతం నిగ్గుతేల్చాలని దాఖలు చేసుకున్న పిటిషన్ సుప్రీంలో ఇంకా అలాగే ఉండిపోయి ఉసురు నిలుపుకోవడమే అసలుసిసలు కొసమెరుపు! ‘‘చట్టాలు చేయడంలోనూ, పార్లమెంట్లో చర్చలు నిర్వహించడంలోనూ, చేసే చట్టాలలో కొట్టొచ్చే అస్పష్టత చోటు చేసుకున్నందువల్ల దేశంలో తగాదాలు పెరుగుతున్నాయి. ఈ పరిణామం దేశ పౌరులకు, న్యాయస్థానాలకు, తదితర కక్షిదారులకు చిరాకు కల్గిస్తోంది. ఫలితంగా చట్టాలను రూపొందించే ప్రమాణాలు పడిపోతున్నాయి. చట్ట సభలు చేస్తున్న చట్టాలు ఏ ప్రయోజనం కోసం రూపొందుతున్నాయో మనకు తెలియడం లేదు. న్యాయ వ్యవస్థ స్వతంత్య్ర ప్రతిపత్తిని కాస్తా ఇలాంటి చట్టాలు దిగజార్చివేస్తున్నాయి. ఫలితంగా చట్ట సభలు చేస్తున్న కొత్త చట్టాల లక్ష్యం ఏమిటో న్యాయస్థానాలకు బొత్తిగా అంతుచిక్కకుండా పోతున్నాయి.’’ – సుప్రీంకోర్టు చీఫ్ జడ్జి ఎన్.వి. రమణ ‘‘పెగసస్ సృష్టికర్త ఇజ్రాయెల్ సైబర్ గూఢచారి సంస్థ ఎన్.ఎస్.ఓ కార్యకలాపాలపైన, అలాంటి చట్టవిరుద్ధ గూఢచర్య కార్యకలాపాల్లో ఉన్న ఫేస్బుక్, వాట్సాప్ తదితర సంస్థలపైన తక్షణమే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో విచారణ జరగాలని 2019లోనే నేను దాఖలు చేసుకున్న పిటిషన్‌ను తిరిగి పునరుద్ధరించగోరుతున్నాను. మన దేశంలో ఈ ‘పెగసస్’ గూఢచర్యం ఆధునిక సాంకేతిక సైబర్ టెర్రరిజంలో భాగం, దీన్ని సమాచార టెక్నాలజీ చట్టం కింద శిక్షించాలి. ‘పెగసస్’ గూఢచర్యం సహా యంతో ఈ దేశ పౌరుల గోప్యత, వ్యక్తిగత స్వేచ్ఛను ఉల్లంఘించే వారందరినీ శిక్షించాల్సిందే. కోట్లాది మంది భారతీయుల ప్రాథమిక హక్కుల రక్షణ అనేది చట్ట నిబంధన (రూల్ ఆఫ్ లా)పైన ఆధారపడి ఉంది. ఇది రాజ్యాంగ బద్ధం. కనుక ‘పెగసస్’ వినియోగంపై విచారణ జరిపి తీరాలన్న నా 2019 నాటి పిటిషన్‌ను సుప్రీం తిరిగి చేపట్టాలి’’ – ఆర్ఎస్ఎస్ మాజీ సిద్ధాంతకర్త కె.ఎన్. గోవిందాచార్య పిటిషన్ (2019లోనే సుప్రీంకోర్టులో) పచ్చి అబద్ధాలతో ఈసారి పార్లమెంటు చర్చలు ముగియడానికి దారితీసిన పరిణామాలలో ప్రధానమైన అంశం... దేశాన్ని కుదిపేసిన అంతర్జాతీయ స్థాయి సైబర్ గూఢచార సమాచార వ్యవస్థ ఎన్.ఎస్.ఓ. నెలకొల్పిన ‘పెగసస్’ భారతదేశంలో యథేచ్ఛగా సాగిస్తున్న ‘కూపీ’ లతో బీజేపీ పాలకులకు సంబంధ బాంధవ్యాలలో నిజానిజాలకు సంబంధించినదే! ఈ విషయాన్ని తేల్చి చెప్పడానికి బీజేపీ పాలకులకు ఏళ్ళూపూళ్లూ పట్టవలసిన అవసరం లేదు. కానీ పాలనా విధానాలను విమర్శిస్తున్న పౌరులపైన మాజీ అధికారులు, పౌరహక్కుల సంఘాల నాయకులపైన, చివరికి కేంద్రపాలక వర్గంలోని కొందరు మంత్రుల అభ్యంతరాల పైన, విద్యార్థి, ఉద్యోగ వర్గాలపైన పాలకులు కన్నెర్ర చేయవలసిన అవసరం లేదు. ‘పెగసస్’తో లోపాయికారీ ఒప్పందం ఏదో ప్రభుత్వానికి ఉందన్న ప్రతిపక్షాలు, పలు ప్రజాసంస్థల ఆరోపణలను ఖండించడానికి రెండు మాసాలకు పైగా కాలక్షేపం చేయవలసిన అవసరం లేదు! నాటి ఆర్ఎస్ఎస్ నాయకుడు గోవిందాచార్య 2019లోనే ‘పెగసస్’ సైబర్ గూఢచర్య కార్యకలాపాలపైన విచారణ కోరడం, 2021లో దేశంలోని ప్రజాసంస్థలు, పార్లమెంట్ సభ్యులు, ప్రతిపక్షాలు అదే విచారణను డిమాండ్ చేయవలసి రావడం ప్రహసనంగా మారవలసి వచ్చింది! కానీ దాదాపుగా రెండునెలలు గడిచిపోయిన తరువాత, దేశం లోని రాజకీయ ప్రత్యర్థులపైన. జర్నలిస్ట్‌లపైన, కొందరు జడ్జీల ఫోన్లపైన ఇజ్రాయెల్ సైబర్ గూఢచారి సంస్థ ఎన్.ఎస్.ఓ. రూపొందించిన ‘పెగసస్’ సాఫ్ట్‌వేర్‌ని భారత పాలకులు ఉపయోగిస్తున్నారని, అందుకోసమే ఆధునిక టెక్నాలజీకి కూడా దొరకని సాంకేతిక వ్యవస్థని ప్రభుత్వం తరపున కొనుగోలు చేశారని పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ తీవ్ర ఆరోపణను ఖండించడానికి మన పాలకులకు తీరికలేకనో ఏమోగాని, రెండు నెలల కాలయాపన తర్వాత తాపీగా 9–8–2021వ తేదీన అందునా ఏ సమాచార శాఖో, విదేశాంగ వ్యవహా రాల మంత్రిత్వ శాఖో కాకుండా భారత రక్షణ శాఖ... పెగసస్‌కి స్పైవేర్ నిర్వాహణా సంస్థ ఎన్ఎస్ఓతో ఎలాంటి లావాదేవీల్లేవు అని పార్లమెంటులో ప్రకటించాల్సి వచ్చింది! అయితే ఇదే సమయంలో, రాజ్యసభ అధ్యక్షులు, దేశ ఉపాధ్యక్షులు వెంకయ్యనాయుడు, ‘పార్లమెంటు ఉన్నది సమస్యల్ని చర్చించడానికే గానీ, రాజకీయ కొట్లాటలకు కాదు’ అని ప్రకటించారు తప్పితే, అంతవరకూ ‘పెగసస్’ బాగోతం గురించి రెండునెలలుగా ప్రతిపక్షాలు కోరుతూ వచ్చింది, ఆ ‘చర్చ కోసమే’ నన్న వాస్తవాన్ని మరచిపోవటం! ఒకవేళ ‘పెగసస్’ గూఢచర్యంతో మనకు రహస్య సంబంధాలు లేవనుకున్నా అనేక మాసాలుగా న్యాయం కోసం జరుగుతున్న వేలాదిమంది రైతుల ఆందోళన ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన సుమారు ఆరు వందలమంది రైతుల కుటుంబాలకు కనీస సానుభూతి కూడా ప్రకటించని పాలక వ్యవస్థ.. ‘పెగసస్’ ఆధునిక గూఢచర్యాన్ని బాహాటంగా ఖండిం చకపోవడాన్ని ప్రజలు ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నారు! ఇది ఇలా ఉండగానే, ఒక వైపునుంచి గౌరవ ప్రధాని నరేంద్రమోదీ దేశంలోని ప్రభుత్వ రంగ వ్యవస్థల్ని ఒక్కొక్కటిగా ‘చాపచుట్టి’ దేశీయ, విదేశీయ ప్రైవేటు రంగానికి ధారాదత్తం చేస్తున్న సమయంలోనే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఒక ప్రకటనలో భారత పారిశ్రామిక వేత్తలు అనుసరిస్తున్న వర్తక, వ్యాపార లావాదేవీలు జాతీయ ప్రయోజనాలకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయని, వినియోగదార్ల ప్రయోజనాల రక్షణకు ఉద్దేశించిన నిబంధనలకు (రూల్స్) ప్రైవేట్ పారి శ్రామికవేత్తలు బాహాటంగా కాలరాస్తున్నారని విమర్శించాల్సి వచ్చింది! దేశంలోకి అనుమతిం చిన కొన్ని విదేశీ గుత్త కంపెనీలకు నేడు మన జాతీయ ప్రయోజనాలకన్నా వాటి ప్రయోజనాలకే ప్రాధాన్యం పెరిగిపోవడం విచారకరమని కూడా గోయల్ ప్రకటించవలసి వచ్చింది. (13–8–2021 ప్రకటన) అన్నట్టు ఇంతకూ మనం ‘పెగసస్’ గూఢచర్య సాఫ్ట్‌వేర్‌ని కొనుగోలు చేశామా, లేదా? అబద్ధమాడితే గోడను ఎంతగా అడ్డుపెట్టుకున్నా ఎన్నాళ్ళు ఆగుతుంది? అబద్ధం అంటేనే అతుకుల మూట! అబద్ధం చెబితే నిజం చెప్పేవాడి కంట్లో మిరప్పొడి కొట్టినట్లు ఉండాలన్న సామెత ఊరకనే పుట్టలేదు! ఇంతకూ ఏతావాతా ధనికవర్గ పాలనా వ్యవస్థలో దాగిఉన్న అసలు సత్యం ఏమిటో వెనకటికో పెద్దమనిషి బయటపెట్టేశాడు. ధనం మాట్లాడుతూంటే, సత్యం అలా గుడ్లప్పగించి ఊరకుండిపోతుందట!! అయినా గోవిందాచార్య సుప్రీం కోర్టులో 2019లోనే ‘పెగసస్’ బాగోతం నిగ్గుతేల్చాలని దాఖలు చేసుకున్న పిటిషన్ సుప్రీంలో ఇంకా అలాగే ఉండిపోయి ఉసురు నిలుపుకోవడమే అసలుసిసలు కొసమెరుపు! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు -
దేశీయ హాకీకి... ‘విదేశీ చీడ’
స్వతంత్ర భారత రిపబ్లిక్లో ఆదినుంచీ దేశీయ క్రీడలకు పట్టిన చీడ, పీడ ఏమిటంటే.. ప్రధానంగా వలస భారతంలో సంపన్న రాచరిక ప్రభువులు తమ కొడుకుల కోసమని ఇంగ్లాండ్ నుంచి దేశంలోకి దిగుమతి చేసిన క్రికెట్ క్రీడే! అదిమొదలు ఈ ‘జీడి’ అంటుకుపోయి దేశీయ, గ్రామీణ, పట్టణ జాతీయక్రీడలను ధ్వంసం చేస్తూ వచ్చింది. ఈ విదేశీ క్రీడా బానిసత్వం ఫలితంగానే అనేక దేశీయ క్రీడలకు ముఖ్యంగా గొప్ప జాతీయ క్రీడా శిఖరం ‘హాకీ’కి ప్రోత్సాహం కరువై కుంటుపడిపోతూ వచ్చింది. చెడుగుడు, కోకో, కర్రా–బిళ్ల ఆట, వగైరా దేశీయ క్రీడలకు ఖర్మకాలి మన దేశంలో గిరాకీ లేదు. ఎందుకని? విదేశీ క్రికెట్‌లాగా రెండుచేతులా అవినీతికి పాల్పడి వందలాది కోట్లు దోచుకోవడానికి వీలైన వ్యాపారానికి వీలులేని సామాన్య ప్రజల దేశవాళీ క్రీడలివి. బహుశా అందుకనే విదేశీ క్రికెట్ పట్ల అంత గిరాకీ.. దేశీయ క్రీడలపట్ల అంత పరాకు, చిరాకూ!! సుమారుగా గత యాభై ఏళ్లుగా దేశవాళీ ‘హాకీ’ లాంటి జాతీయ క్రీడలకు, గ్రామీణ క్రీడలకు పట్టిన విదేశీ వలస పాలనావశేషంగా భారతదేశానికి అంటుకున్న వ్యాధులలో ఒకటి ‘అంటూ సొంటూ’ లేని క్రికెట్ క్రీడ! అలాంటి క్రికెట్‌ను భారత జాతీయ క్రీడ అయిన ‘హాకీ’ అర్ధ శతాబ్ది తరువాత మొన్ననే ముగిసిన ప్రపంచస్థాయి టోక్యో ఒలింపిక్స్‌లో ‘బ్రహ్మభేద్యం’గా తన పూర్వ ప్రతిష్టను నిలబెట్టుకోవడమేగాక తిరిగి జాతీయ క్రీడలకే తల మానికంగా నిలవడం జాతీయ క్రీడాభిమానులందరి హర్షోద్రేకాలకు కారణమైంది. అంతేగాదు, సుమారు గత వందేళ్ల వ్యవధిలో నాటి పారిస్ ఒలింపిక్స్ నుంచి నిన్నమొన్నటి టోక్యో ప్రపంచ ఒలింపిక్స్ దాకా మన జాతీయ హాకీ పలుసార్లు స్వర్ణాలు కైవసం చేసుకోవడమే కాకుండా తాజాగా అథ్లెటిక్స్‌లో స్వర్ణ పతకం, హాకీలో కాంస్యం సాధించి, ప్రపంచ ఒలింపిక్స్ చరిత్రలో భారత్ ఇంతవరకు పొందిన మొత్తం 47 స్థానాల హోదాను మరొక మెట్టుకు నెట్టి 48వ స్థానానికి చేర్చడం మరొక ఘనవిజయం. రైతు బిడ్డకు స్వర్ణ పతకం ఇందుకు సూత్రధారిగా నిలిచిన భారత సైనిక సుబేదార్ టోక్యో విశ్వక్రీడల్లో ‘ఈటె’ (జావెలిన్‌త్రో)ను అనితరసాధ్యమైన దూరానికి (87.58 మీటర్లు) విసిరి మన ఒలింపిక్స్ పతకాల జాబితానే సువర్ణ ఖచితం చేసిన రైతుబిడ్డ నీరజ్ చోప్రా! అయితే, ఈసారైనా పట్టుమని పది పతకాలైనా వస్తాయని ఆశించిన ఇండియాకు గతంలో కన్నా ఒకే ఒక్క పతకం కలిసొచ్చి ఆరునుంచి ఏడు మెడల్స్‌కు పాకింది. (ఒక స్వర్ణం, 2 రజతం, 4 కాంస్య, ఎటు తిరగేసినా మొత్తం ఏడు పత కాలు) ! ఇలా వలస భారతం నేటి స్వతంత్ర భారత రిపబ్లిక్ వరకూ 10 బంగారు పతకాలతో సహా ఇండియా దక్కించుకున్న మొత్తం 35 పతకాలలో ఎనిమిది పతకాలు దేశీయ ‘హాకీ’ క్రీడవల్ల 8 పతకాలు, షూటింగ్, తదితర క్రీడల్లో ఒక్కొక్క పతకం చొప్పున జమకూడినవే నని మరచిపోరాదు! షరా మామూలుగానే టోక్యో ఒలింపిక్స్‌లో అమెరికా చివరిరోజున తృటిలో ఎగబాకి 39 స్వర్ణాలు, 41 రజతాలు, 33 కాంస్యాలతో మొత్తం 113 పతకాలతో ప్రథమ స్థానంలో నిల బడగా, చివరివరకు స్వర్ణపతకాలతో ఆధిక్యం కొనసాగించిన చైనా 38 స్వర్ణాలు, 32 రజతాలు, 18 కాంస్యాలతో మొత్తం 88 పతకాలతో ద్వితీయ స్థానంలో నిలిచి అబ్బురపరిచింది. దేశీయ క్రీడలకు క్రికెట్ చీడ స్వతంత్ర భారత్ రిపబ్లిక్లో ఆదినుంచీ దేశీయ క్రీడలకు పట్టిన చీడ, పీడలు ఏమిటంటే.. ప్రధానంగా వలస భారతంలో సంపన్న రాచరిక ప్రభువులు తమ కొడుకుల కోసమని ఇంగ్లాండ్ నుంచి దేశంలోకి దిగుమతి చేసిన క్రికెట్ క్రీడే! బ్రిటన్ పాలనలో పాటియాలా సంస్థానం మహారాజాగా ఉన్న భూపేంద్ర సింగ్ (భూప్పా) తన కొడుకు, నవానగర్ జామ్ సాహిబ్ అయిన కుమార్ రంజిత్ సింగ్‌కి క్రికెట్‌ను ప్రత్యేక శిక్షణ ఇప్పించి నేర్పించాడు. 1932 నుంచీ ఈ క్రికెట్ సంరంభాలు ప్రారంభం కాగా, రాజా కొడుకు అనారోగ్యం వల్ల ఈ ఆటకు అనంతరం పోర్బందర్ మహారాజా వారసుడయ్యాడు. దేశ స్వాతంత్య్రానికి ముందు 1932లో ఇంగ్లాండులో జరుగుతున్న టెస్ట్ క్రికెట్లో ఇండియా తరపున ఆడడానికి మన స్వాతంత్య్రానికి ముందు అప్పటికే ప్రసిద్ధుడుగా ఉన్న సి.కె. నాయుడి నాయకత్వంలో భారత దేశం తరపున టెస్ట్ క్రికెట్లో పాల్గొనడానికి ఒక టీమును పంపిం చారు. నాయుడి క్రీడాబృందం ఇంగ్లండుపై గెలుపొందడంతో ఇండియాకు ‘టెస్ట్ క్రికెట్ ఆడే జాతి’గా పేరుపడింది. ఆ తర్వాత స్వతంత్రదేశంగా ఇండియా 1948లో ఆస్ట్రేలియాపై టెస్ట్‌మాచ్‌లో ఆస్ట్రేలియాతో పోటీపడి ఓడిపోయింది. ఒక్క 1952లో మాత్రమే మొట్టమొదటిసారిగా ఇంగ్లాండ్‌పై ఆడిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఇండియా విజయం సాధించింది. అదిమొదలు ఈ ‘జీడి’ అంటుకు పోయి దేశీయ, గ్రామీణ, పట్టణ జాతీయక్రీడలను ధ్వంసం చేస్తూ వచ్చింది. విదేశీ క్రీడా బానిసత్వం తొలగేదెన్నడు? ఈ విదేశీ క్రీడా బానిసత్వం ఫలితంగానే అనేక దేశీయ క్రీడలకు ముఖ్యంగా గొప్ప జాతీయ క్రీడా శిఖరం ‘హాకీ’కి ప్రోత్సాహం కరువై కుంటుపడిపోతూ వచ్చింది. టోక్యోలో జరిగిన తాజా ప్రపంచ ఒలింపిక్స్‌లో మన్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలోని హాకీ టీమ్ 41 ఏళ్ల నిరీక్షణ అనంతరం కాంస్యపతకంతో తొలి అడ్డంకిని అధిగమించి పురుషుల హాకీని నిలబెట్టగల్గింది! అదే మోతాదులో మహిళా హాMీ టీమ్ కూడా తొలిసారిగా పురుషులకు పోటీగా రంగప్రవేశం చేసి మన్ననలు పొందగలిగింది. అయితే మనదేశం ఇంకా కులగోత్రాల కంపులో కూరుకుపోయి బయటపడలేక పోతున్నందున ఆ ‘సెగ’ నుంచి ప్రతిభావంతులైన హాకీ మహిళా క్రీడాకారులకు రక్షణ కరువు కావడం ఒక దుర్మార్గపు పరిణామం! తాజా ఒలింపిక్స్‌లో హాకీలో వందనా కటారియా నేతృత్వంలోని భారత్ హాకీ జట్టు అర్జెంటీనా జట్టుపై నాలుగు గోల్స్ స్కోర్ చేసినందుకు ఆనందించవలసిన సమయంలో దళిత మహిళగా ఆమెకు హరిద్వార్‌లో కుల కంపు ఎదురుకావడం సర్వత్రా ఖండనార్హం! విలువిద్యా రహస్యం తెలిసిన వాళ్లే బాణం విసిరినా, ఈటె విసిరినా గురితప్పనిది ద్రోణాచార్య విద్య! 88.07 మీటర్ల దూరానికి గురిపెట్టి నీరజ్ చోప్రా విసిరిన ‘జావెలిన్‌త్రో’ గురిపెట్టి మరీ విసిరే ఈటెతో సమానమే! అందుకే అంత బలిష్టంగా నీరజ్‘జావెలిన్’ విసిరిన తరువాత అదాటున నేలకొరిగే పరిస్థితిలో తమాయించుకుని తేరుకుని లేచాడు! విలువిద్యలో వింటినారిని (బలంగా గురిపెట్టి) లాగి కొట్టినపుడు భుజంపైన ‘బొప్పి’ కడుతూ ఉంటుంది. అందుకే ‘ఈ వింటినారే కదా నా భుజాన్ని రక్షిస్తోంద’ని ప్రాచీనుడు (జ్యాకిణాంకమీభుజమెగా రక్షించునదియని తనర గలవు) వాపోవలసివచ్చింది! (ఆ భుజాన్ని రక్షించిన ఆ కాయలే గదా నాకు రక్ష అని తృప్తి చెందుతారట)! ఆ పరిస్థితికి ప్రతిబింబమే నేటి అభినవ నీరజ్ చోప్రా! ఇలా మన గ్రామ సీమల్లో దేశమంతటా ఎన్నిరకాల చిత్ర, విచిత్రమైన ప్రాచీన క్రీడలు (కనుమరుగైన వాటితో సహా) ఉన్నాయో, చెడుగుడు, కోకో, కర్రా– బిళ్ల (నేటి క్రికెట్‌కు సమానమైన) ఆట, వగైరా, వగైరా! అవినీతికి తావులేనందుకే దేశీ ఆటలకు తగ్గిన గిరాకీ ఖర్మకాలి వీటికి గిరాకీ లేదు. ఎందుకని? విదేశీ క్రికెట్‌లాగా రెండు చేతులా అవినీతికి పాల్పడి వందలాది కోట్ల రూపాయలు దోచు కోడానికి వీలైన వ్యాపారానికి వీలులేని సామాన్య ప్రజల ఆటలు దేశవాళీ క్రీడలు. గతంలో ఆంగ్ల మహారచయిత కథకుడైన జార్జి బెర్నార్డ్ షా ఇంగ్లిష్వాడైనా, అక్కడ పుట్టి ప్రపంచానికి ఇంగ్లిష్‌వాడే పాకించిన (క్రికెట్‌ను పట్కార్‌తో కూడా ముట్టుకోని అమెరికాను మినహాయించి) క్రికెట్ ‘వ్యాధి’ని ఏమన్నాడో తెలుసా? పదకొండు మంది ఫూల్స్ ఆడతారు, మరో పదకొండువేలమంది పనిలేని దద్దమ్మలు చూస్తూండే క్రీడ క్రికెట్ అని చురక అంటించాడు! రాను రాను క్రికెట్ కొంతమంది అవినీతిపరుల చేతి ఎత్తుబిడ్డగా మారి పచ్చిదోపిడీ క్రీడగా మారిపోయింది. చివరికి క్రికెట్ క్రీడాకారులు కొందరు ప్రతి ఆటకీ సంపాదించే కోట్లు చాలక వారిలో అగ్ర గాములుగా ముద్రపడిన కొందరికి బహుమతిగా పొందిన కోట్ల రూపాయల విలువైన కార్లకు చెల్లించాల్సిన దేశీయ పన్నులను ఎగ్గొట్టి, పట్టుబడిన ఉదంతాలూ ఉన్నాయి. దోపిడీకి ఇలాంటి అవకాశం మన దేశీయ క్రీడలకు లేదు! బహుశా అందుకనే విదేశీ క్రికెట్ పట్ల అంత గిరాకీ దేశీయ క్రీడలపట్ల అంత పరాకు చిరాకూ!! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు -
‘ఉరికంబంపై’ ప్రభుత్వరంగం?!
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు కావస్తున్న శుభ సమయంలో ప్రభుత్వ (పబ్లిక్) రంగ పరిశ్రమలను పాలకులు ఒక్కటొక్కటిగా ప్రైవేట్ గుత్త పరిశ్రమాధిపతులకు కుదువ పెట్టాలని విధాన నిర్ణయంగానే ప్రకటించడం హాస్యాస్పదమే గాదు, పారిశ్రామికంగా, వ్యవసాయికంగా రానున్న పెను అనర్థాలకు, మార్పులకు నిదర్శనంగా నిలవబోతోంది! ఏ ప్రపంచ బ్యాంక్ విషమ షరతుల్ని వర్ధమాన దేశాల తరఫున నైరేరి కమిషన్ తన నివేదికలో ఎండగట్టిందో ఆ షరతులనే ఆ తరువాత భారత ఆర్థికమంత్రి హోదాలో మన్మోహన్ తలదాల్చవలసి రావడం ఒక విషాదం. విదేశీ పాలనను పారదోలిన నాటి ‘క్విట్ ఇండియా’ ఉద్యమస్ఫూర్తి... రేపటి భారత స్వాతంత్య్ర సందేశం కావాలి. అమ్మా నాకు చలివేస్తోందే, మంట వేయవూ? / నాయనా బొగ్గులు లేవురా! / అమ్మా బొగ్గులెందుకు లేవే?! / మీ నాన్నకు పని పోయింది, బొగ్గులు కొనడానికి డబ్బు లేదురా బాబూ / నాన్నకు పనెందుకు పోయిం దమ్మా / బొగ్గు ఎక్కువగా ఉందిటరా బాబూ! – రాషే స్డల్ (‘కార్మికులు – రాక్షసి బొగ్గు’ నవల) నిత్య దోపిడీపై ఆధారపడిన పెట్టుబడిదారీ – ధనిక వర్గ వ్యవస్థల్లో పారిశ్రామిక, వ్యవసాయక, తదితర వస్తూత్పత్తి రంగాల్లో పని చేసే శ్రమజీవులందరూ దఫదఫాలుగా నిత్యం ఎదుర్కునే సమస్య ఇదే. శ్రామిక తల్లీబిడ్డల మధ్య పరిష్కారం కనబడని ఈ దుస్థితిని ఒక నవలాకారుడు వర్ణించిన తీరు లోతుపాతుల్ని మరింతగా అర్థం చేసు కోవాలంటే– నేటి భారత దేశంలో నడుస్తున్న చరిత్రకు దాఖలాగా దేశ పాలకులు ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా చాపచుట్టేయడానికి ఎలాంటి ఆలోచనా వెరపూ లేకుండా ఆగమేఘాలపై కొన్ని రోజులుగా తీసు కుంటున్న నిర్ణయాలే నిదర్శనం. ఈ క్రమ పరిణామానికి, ఆకస్మిక నిర్ణయాలకూ కాంగ్రెస్– బీజేపీ పాలకులు, పాలనాయంత్రాంగాలూ గడిచిన 75 ఏళ్లలో తొలి పదిహేనేళ్లలో తప్ప మిగిలిన సంవత్సరాలలో నేటి వరకూ అమలు జరుపుతున్న విధానాలే కారణం అంటే బాధ పడాల్సిన పని లేదు! ఈ పరిణామానికి పరాకాష్టగా లాభాల బాటలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు తలమానికంగా ఎదుగుతూ, దేశ ఉక్కు పారి శ్రామిక రంగానికే గర్వకారణంగా రూపొందిన విశాఖ ఉక్కు పరి శ్రమను ప్రైవేట్ రంగానికి ధారాదత్తం చేయాలని నేటి కేంద్ర ప్రభుత్వం తిరుగులేని నిర్ణయం తీసుకుంది. ఎవరెంత గింజుకున్నా తన నిర్ణయానికి తిరుగులేదని కేంద్ర పాలకులు ప్రకటించడంతో యావదాంధ్ర అట్టుడుకి పోతున్న సమయం ఇది! కొద్దిరోజుల్లోనే దేశ స్వాతంత్య్రానికి 75 ఏళ్లు కావస్తున్న శుభ సమయంలో ప్రభుత్వరంగ పరిశ్రమలను పాలకులు ఒక్కటొక్కటిగా ప్రైవేట్ గుత్త పరిశ్రమాధి పతులకు కుదువపెట్టాలని విధాన నిర్ణయంగానే ప్రకటించడం హాస్యాస్పదమేగాదు, పారిశ్రామికంగా, వ్యవసాయికంగా పెను అన ర్థాలకు, మార్పులకు నిదర్శనంగా నిలవబోతోంది! ఇది ఒక్క విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణతోనే ఆగబోదనీ, ఇప్పటికే ప్రారంభమై కొనసాగుతున్న ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణతో పాటు ప్రభుత్వరంగంలోని ఆయిల్, గ్యాస్ కంపె నీల్లో నూరు శాతం విదేశీ గుత్త సంస్థల ప్రత్యక్ష పెట్టుబడులకు బీజేపీ పాలకులు పూర్తి అనుమతిస్తూ ఈ సంస్థల్లోని ప్రభుత్వ మెజారిటీ వాటాలను అమ్మేసేందుకు నిర్ణయించారు! అదే మోతాదులో ప్రజా బాహుళ్యం జనరల్ బీమా సౌకర్యార్థం ఏర్పడిన వ్యవస్థను చట్ట సవ రణ ద్వారా పక్కదారులు పట్టిస్తోంది. ప్రభుత్వం ఈ చర్యలన్నింటికీ ఒక ‘ముద్దుపేరు’ తగిలించి, తనవన్నీ ‘వ్యూహాత్మక విక్రయా’లని చాటుకుంది’ ఇలా ఒక్కటొక్కటిగా ప్రజలందించిన అనేక ప్రభుత్వ రంగ సంస్థలలో ప్రభుత్వ వాటాను 2008 నాటికే విదేశీ ప్రయివేట్ గుత్త కంపెనీలకు అనుగుణంగా తగ్గించేసి, విదేశీ కంపెనీల ప్రత్యక్ష పెట్టుబడులను 26 నుంచి 49 శాతానికి పెంచింది! ఇక ఐడీబీఐ ప్రభుత్వ బ్యాంకులో తన మిగిలిన వాటాలనూ అమ్మేసుకోవడానికి ప్రభుత్వం వెరవలేదు! ఈ విక్రయ దస్తావేజులకు పాలకులకు ఆది గురువు– ఆంగ్లో–అమెరికన్ వలస సామ్రాజ్య పాలకులు కాగా, వారి కనుసన్నల్లో ఎదిగి ఇండియాలాంటి బడుగు వర్ధమాన దేశాల ఆర్థిక వ్యవస్థలను నమిలి మింగడానికి అవతరించిన సంస్థలు ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ. అన్నింటి కన్నా అవమాన కరమైన అంశం–భారత ఆర్థికమంత్రిగా డాక్టర్ మన్మోహన్సింగ్, ప్రధానిగా పీవీ నరసింహారావులు పదవుల్ని అధిష్టించడానికి ముందు వర్ధమాన దేశాలు స్వతంత్ర ఆర్థిక విధానాలు అనుసరించడానికి ఏర్పడ్డ సౌత్ కమిషన్ నిర్ణయాలను పక్కదారులు పట్టించడం! టాంజానియా రిపబ్లిక్ పాలకుడు జూలియస్ నైరేరి అధ్యక్షతన ఆసియా, ఆఫ్రికా, లాటిన్, అమెరికా వర్ధమాన దేశాల ఆర్థిక పరిస్థి తుల్ని క్షుణ్ణంగా పరిశీలించడానికి ఏర్పడిన విశిష్ట సంస్థ ‘సౌత్ కమి షన్’ ఈ కమిషన్‌కు ప్రధాన కార్యదర్శిగా భారత ఆర్థికమంత్రిగా మన్మోహన్ ఉండేవారు! కానీ, ఏ ప్రపంచబ్యాంక్ విషమ షరతుల్ని వర్ధమాన దేశాల తరఫున నైరేరి కమిషన్ తన నివేదికలో ఎండ గట్టిందో ఆ షరతులనే ఆ తరువాత భారత ఆర్థికమంత్రి హోదాలో మన్మోహన్ తలదాల్చవలసి రావడం ఒక విషాదం. ఏ పరిస్థితుల్లో ఈ పరిణామం జరిగింది? ప్రపంచంలో పెట్టుబడిదారీ వ్యవస్థ ఇబ్బం దులపాలైనా ఫర్వాలేదుగానీ సోషలిజం మాత్రం మళ్లీ తలెత్తకూడ దనీ, ఆ వైపుగా జనం మళ్లకూడదని, ఏమాత్రం వ్యవధి దొరికినా అలా మళ్లిపోయే ప్రమాదం వుందని అమెరికా బాహుటంగానే ప్రకటి స్తున్న సమయం అది. ఆ పరిస్థితుల్లో ఇండియాలాంటి వర్ధమాన దేశాల స్వతంత్ర ఆర్థికాభ్యున్నతికి ఏ మార్గం శ్రేయస్కరమైనదో ‘సౌత్ కమిషన్’ ఆనాడే చేసిన హెచ్చరిక ఈ నాటికీ శ్రేయస్కరం. ఆ నివేది కలో ఇలా స్పష్టమైన ముందుచూపుతో చేసిన హెచ్చరికలున్నాయి. వలస విధానాన్ని వలస దేశాల ప్రజలు తిరస్కరించారు కాబట్టే ఆ విధానాన్ని వారు పాతిపెట్టించగలిగారు. తమకున్న వనరుల సహాయంతోనే వలస దేశాల ప్రజలు విదేశీ పెత్తనానికి వ్యతిరేకంగా స్వాతంత్య్ర సమరానికి సమాయత్తం కాగలిగారు. తమకు నచ్చిన, తృప్తికరమైన షరతులపైన మాత్రమే బయటివారి సహాయాన్ని ఆమో దించారు. అందువల్ల నేటి వర్ధమాన దేశాలలో విదేశీ ఆర్థిక పెత్తనాన్ని వివిధ రూపాల్లో అనుభవిస్తున్న దేశాలు కూడా దృఢచిత్తంతో, స్వావ లంబనపైన ఆధారపడిన కార్యాచరణ ద్వారా విదేశీ ఆర్థిక పెత్తనాన్ని వదిలించుకోవచ్చు. దేశ నిరంతరాభివృద్ధి అనేది దిగుమతి చేసుకోగలి గిన వస్తువు కాదు సుమా! ఉత్పత్తి అయ్యే సంపద పంపిణీ న్యాయ బద్ధంగా జరగడం ద్వారానే ఆర్థికాభ్యుదయం సాధించగలగాలి. వర్ధ మాన దేశాల శీఘ్రపురోభివృద్ధికి సైన్స్ టెక్నాలజీ రంగాలు పునాది కావాలి. ఈ ప్రగతి సొంతంగానే జరగాలి. న్యాయం, సమానత్వం, ప్రజాస్వామ్యం అన్న ఆదర్శాలను తమ తమ దేశాలకు, తమ సమా జాలకు వర్ధమాన దేశాలు వర్తింపజేయాలి. అప్పుడే వాటికి విలువ. ప్రజాస్వామ్య విలువలను ప్రాథమిక హక్కులను గౌరవించి, అచ రించడం, భిన్నాభిప్రాయ ప్రకటన హక్కును గౌరవించడం, మైనారిటీ లకు న్యాయం చేకూర్చడం, పేదసాదల పట్ల ఆర్ద్రత, ఆచరణలో వారి ఉన్నతికి కృషి చేయడం, పబ్లిక్‌లో నిలబడిన వారి జీవితాలను విచార ణకు అనుమతించడం, యుద్ధాలకు పోకుండా వివాదాలను పరిష్క రించుకోవటం– వర్ధమాన దేశాల ప్రభుత్వాలకు కనీస ప్రణాళికగా ఉండాలి. 21 శతాబ్దంలోకి అడుగిడబోతున్న వర్ధమాన దేశాలు, పరి వర్తనా దశలో చేతులు ముడుచుకుని కూర్చోరాదు. తాము కలలు కంటున్న నూతన ప్రపంచ వ్యవస్థ ఇందుకు వాటిని ప్రోత్సహించాలి. ప్రజల దీర్ఘకాల ప్రయోజనాలే ఈ దేశాల ప్రాపంచిక దృష్టికి వెలుగు దివ్వెలు కావాలి. మానవ జాతిలో నాల్గింట మూడొంతుల జనాభా వర్ధమాన దేశాలలోనే ఉన్నందున ప్రపంచ పరిణామాలను ప్రభా వితం చేయగల హక్కు ఈ దేశాలకు ఉంది. ఈ చారిత్రక మహోద యాన్ని తగిన రూపురేఖలిచ్చి ఆవిష్కరించడానికి రాజకీయంగానూ, ఆర్థికంగానూ, మేథో సంపత్తిలోనూ వర్ధమాన దేశాలకు తగినన్ని శక్తియుక్తులున్నాయి’’! ఇదే ‘క్విట్ ఇండియా’ ఉద్యమస్ఫూర్తి, రేపటి భారత స్వాతంత్య్ర సందేశమూ కావాలి. అందుకే మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఇలా ‘సందేశించి’ ఉంటాడు: ‘‘జీవితం ఆశతో కాదు. కసితో, కోపంతో బత కాలి. మరి బతకాలంటే పోరాడాలి. యుద్ధం చేయాలి. భయపడినా, బాధపడినా మన జీవితం మనల్ని ఈ ప్రపంచం నుండి దూరంగా విసిరిపారేస్తుంది’’!! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
కాకో, కీకీ, టూకీ = ‘పెగసస్’
ఇజ్రాయెల్ సైనికావసరాలకు ఉద్దేశించిన ‘పెగసస్’ నిఘా సాఫ్ట్‌వేర్‌ని ఆ దేశ సైబర్ నిఘా సంస్థ ‘ఎన్.ఎస్.ఓ.’ గ్రూప్ ఇండియా లాంటి వర్ధమాన దేశాల ప్రభుత్వాలకు, పాలకవర్గాలకు అమ్మి సొమ్ము చేసుకుంటోంది. అలా పెగసస్ రహస్యంగా ఆయాదేశాల్లోని మొబైల్ ఫోన్స్‌లోకి సరికొత్త సాంకేతిక మార్గాల ద్వారా చొరబడుతోంది. సాగుభూముల రక్షణ కోసం సత్యాగ్రహంలో ఉన్న రైతులలో 300 మంది చనిపోతే కనీస సానుభూతి కూడా చూపని పాషాణ ప్రభువర్గం ఉన్న చోట ‘పెగసస్’ నిఘా సాఫ్ట్‌వేర్‌దే పెత్తనమవుతున్న రోజులివి! మొత్తంమీద చూస్తే ఇజ్రాయెల్ సైబర్ నిఘా సంస్థ (ఎన్.ఎస్.ఓ.) నడుస్తున్నది ప్రపంచ ప్రజా ప్రయోజనాల భక్షణకే గానీ రక్షణకు మాత్రం కాదు. ఈ హెడ్లైన్కి ప్రేరణ ప్రసిద్ధ కార్టూనిస్టు, అంతర్జాతీయ పురస్కారాలు పొందిన సాక్షి వ్యంగ్య చిత్రకారుడు శంకర్ కుంచెపోటు! ప్రపంచంలో నేడు ప్రభు త్వాల స్థాయిలోనూ, పాలకవర్గాల స్థాయిలోనూ తమ ఉనికికోసం, తమ నీడ చూసుకుని అనుక్షణం పీడకలల్లో జీవిస్తున్న రాజకీయులు ఆధారపడేది కూపీ లేదా నిఘా సంస్థల మీదనే. ఇప్పుడు ప్రపంచ స్థాయిలోనే ఇజ్రాయెల్ కేంద్రంగా ప్రభుత్వ ఆశీర్వాదాలతో వ్యవస్థాపిత మైన ఎన్.ఎస్.ఓ అనే సంస్థ ఆధ్వర్యంలో ఏర్పడి పనిచేస్తున్న సరికొత్త నిఘా సాఫ్ట్వేర్ ‘పెగసస్’. ఇది అంతర్జాతీయ గూఢచారి చేతికి అంది వచ్చిన ప్రమాదకరమైన వినూత్న సాంకేతిక పరికరం. ఇతర దేశాలపై అమెరికా తలపెట్టిన అనేక దుర్మార్గపు చర్యలను ఎంతమాత్రం సహిం చలేని అమెరికా సైనికాధికారులలో ఒకరైన ఎడ్వర్డ్ స్నోడెన్ తెగించి ప్రపంచదేశాలకు, ప్రజలకు హెచ్చరికగా ప్రస్తుత ఇజ్రాయెల్ నిఘా సాఫ్ట్వేర్ గురించి కూడా ఈ కింది సందేశం అందించారు. ‘‘ఈ దుర్మార్గపు ఇజ్రాయెల్ కూపీ(నిఘా) స్పైవేర్ సాంకేతిక వ్యవస్థ క్రయ విక్రయాలను తక్షణమే ఆపించివేయడానికి మనం ప్రయత్నించకపోతే అది 50,000 మంది జీవితాల్ని కాదు, కోట్లాది పౌరుల జీవితాలకే ఎసరు పెడుతుంది. రహస్యంగా ఎక్కడికక్కడ ప్రపంచంలోని బలహీన మైన స్థానిక ప్రభుత్వాల, అధికారుల అండతో ప్రజలపై సాగించే ఈ నిఘా వ్యాపారంపైన ప్రపంచవ్యాపితంగానే మారటోరియం ప్రకటిం చడం అనివార్యం’’ – అఖిల యూరప్ మండలి ఫ్రాన్స్‌లో నిర్వహించిన సమావేశానికి స్నోడెన్ పంపిన వీడియో సందేశం ఇజ్రాయెల్ సైనికావసరాలకు ప్రత్యేకించి ఉద్దేశించిన ‘పెగసస్’ నిఘా సాఫ్ట్‌వేర్‌ని ‘ఎన్.ఎస్.ఓ.’ అనే సైబర్ నిఘా సంస్థ.. ఇండియా లాంటి వర్ధమాన దేశాల ప్రభుత్వాలకు, పాలక వర్గాలకు అమ్మి సొమ్ము చేసుకుంటూ ఉంటుంది. అలా పెగసస్ రహస్యంగా ఆయా దేశాల్లోని మొబైల్ ఫోన్స్‌లోకి సరికొత్త సాంకేతిక మార్గాల ద్వారా చొరబడుతోంది. ఫోన్స్లోకే కాదు, ఈ–మెయిల్స్‌లోకి.. వివిధ ప్రాంతాల్లోని స్థానిక సమాచార కేంద్రాల్లోకి రహస్య సాంకేతిక మార్గాల ద్వారా వీడియోలలోకి మైక్రోఫోన్స్ చివరికి కెమెరాల్లోకి కూడా దూరి వాటిని వాడే వాడకందార్ల సంభాషణల్ని రహస్యంగా రికార్డు చేస్తుంది. ఇక పెగసస్ కూపీ వ్యవస్థను వాటంగా వాడుకునే వారిలో ప్రజల, ఆందోళనకారుల నోరు నొక్కేసే ప్రభుత్వాలున్నాయి. అందుకే పెగసస్ అత్యాధునిక నిఘా సాఫ్ట్వేర్ గురించి ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల పరిరక్షణా సంస్థ అధిపతి ప్రస్తావిస్తూ ‘‘ప్రజాస్వామ్య వ్యవస్థల్లో జర్నలిస్టులు, మానవహక్కుల పరిరక్షకులు మన సమాజాల్లో అనుపమానమైన సేవలందిస్తున్నారు. అలాంటి వారిని గొంతెత్తకుండా అణచివేయడంవల్ల మనందరం బాధలకు గురవుతా’’మని హెచ్చరించారు. ఈ సందర్భంగా, 2017లో ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన పూర్వరంగాన్ని గుర్తు చేసేవిధంగా మహారాష్ట్ర బీజేపీ మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ విడుదల చేసిన ఒక ప్రకటన ఆశ్చర్యం గొల్పేదిగా ఉంది. ‘‘2019 నవంబర్‌లో మహారాష్ట్ర ప్రభుత్వ సమాచార, ప్రచార సంబంధాల శాఖ డైరెక్టర్ జనరల్ ఆధ్వర్యంలో అయిదుగురు సభ్యు లతో కూడిన బృందం ఇజ్రాయెల్ వెళ్లింది. ఇజ్రాయెల్‌లో ప్రభుత్వ ప్రజాసంబంధాలలో కొత్త పోకడలను గురించి, సోషల్ మీడియాను ఉపయోగించుకునే నూతన పద్ధతులను అధ్య యనం చేయడం ఈ పర్యటన లక్ష్యం అని ఉంది. అయితే ఈ పర్యటన మహారాష్ట్రలో రాజ కీయ దుమారానికి తెర లేపింది’’. ఎందుకని అన్న ప్రశ్నకు ఫడ్నవీస్ ప్రకటనలో సమాధానం లేదు. కానీ సుప్రసిద్ధ పత్రిక ‘ది హిందూ’ ఆ రహస్యాన్ని బయటపెట్టింది. ఇజ్రాయెల్‌లోకి ప్రయాణం కట్టిన ఆ మహారాష్ట్ర ప్రభుత్వ బృందంలో ఉన్న ఐదుగురు అధికారుల పేర్లు బయటపెడుతూ, వీరిలో ఒక అధికారి... ఈ బృందం ఇజ్రాయెల్ పర్యటనకు కేవలం రాష్ట్ర ప్రభుత్వమే కాక కేంద్ర ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా అనుమతి ఇచ్చిందని, ఇజ్రాయెల్ ప్రభుత్వం నుంచి అధికారికంగా వచ్చిన ఆహ్వానంపైనే తమ బృందం ఇజ్రాయెల్‌కి వెళుతోందని వెల్లడించారని ‘ది హిందూ’ పేర్కొంది. ప్రస్తుతం రిటైర్ అయిపోయిన అజయ్ అంబేడ్కర్ 2019 నవం బర్ 17 నుంచి 22వ తేదీవరకు ఈ బృందం జరిపిన ఇజ్రాయెల్ సందర్శన గురించిన నివేదిక సమర్పించారని తెలిపారు. అంతేకాదు, ఈ బృందం ఇజ్రాయెల్ పర్యటన లక్ష్యం ‘ఇజ్రాయెల్‌లో వ్యవసాయ సమస్యలను అధ్యయనం చేయడానికి ఉద్దేశించిందని ముందు ప్రక టించారు గానీ పర్యటన ఎజెండాలో అసలు వ్యవసాయం బాగోగుల గురించి తెలుసుకునే విషయమై ఎలాంటి ప్రస్తావనే లేదని, ఇజ్రాయెల్‌లో ప్రచార పద్ధతులు, అక్కడి ప్రభుత్వ ప్రజా సంబంధాల శాఖలు ఎలా పని చేస్తున్నాయి, ప్రచార వ్యూహాల్ని ఎలా అభివృద్ధి చేసు కోవాలన్న సమస్యల్ని అవగాహన చేసుకోవడం ఈ పర్యటన ఉద్దేశ మనీ అజయ్ అంబేడ్కర్ తెలిపారని ‘హిందూ’ వెల్లడించింది. అసలు ఇంతకీ ఈ బృందం ఇజ్రాయెల్ పర్యటనను ఎవరు ఆర్గనైజ్ చేశారన్న విషయం ఇంతవరకూ ఎవరికీ తెలియదని ‘హిందూ’ విలేకరి అలోక్ దేశ్ పాండే కథనం! కొన్ని రోజుల క్రితం ఆవు పేడ కోవిడ్ వ్యాధికి నివారణోపాయం కాదని ప్రకటించిన ఓ పాత్రికేయుడ్ని మణిపూర్ జైలులో రెండు నెలల పాటు ప్రభుత్వం నిర్బంధించింది. ఇలా ఎన్నో రకాలుగా వందలు వేలాదిమంది పౌరుల స్వేచ్ఛకు భంగం వాటిల్లుతోంది. ‘పెగసస్’ నిఘా సాఫ్ట్వేర్ సహాయంతో సీబీఐ అధిపతి అలోక్ వర్మను 2018లో ఆ పదవి నుంచి ఉద్వాసన చెప్పించారు. ఆయననే కాదు, మరో ఇద్దరు సీబీఐ అధికారులు రాకేష్ ఆస్థాన, ఎ.కె. శర్మలనూ పదవుల నుంచి తప్పించేశారు. అలాగే 2017– 2019 మధ్యనే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో సీనియర్ రీసెర్చర్ అయిన కన్హయ్యకుమార్ సహా అంబేడ్కర్ అనుయాయులైన ఖలీద్, అనిర్భన్ భట్టాచార్య, వాణిజ్యోత్స్న లహరి, కార్మిక హక్కుల సంఘ నాయకులు శివ గోపాల్ మిశ్రా, అంజనీకుమార్, ప్రొఫెసర్ సరోజ్గిరి, శాంతి ఉద్యమ నాయ కుడు సుబ్రాంశు చౌదరి, మాజీ బీబీసీ జర్నలిస్ట్ సందీప్ కుమార్ రాయ్ శౌజీ వగైరాలను, మొన్న పౌర హక్కుల నాయకులు అనేక మందిని నిష్కారణ అభియోగాలు మోపి జైళ్ల పాల్జేశారు. చివరికి ప్రొఫెసర్ కల్బుర్గి, గోవింద పన్సారే, గౌరీలంకేష్ హత్యలకు కారకు లైన వారి ఆచూకీని మభ్యపెట్టారు. నిన్నగాక మొన్ననే ఆదివాసీల సేవలో తల నెరసిన ఫాదరీ స్టెయిన్ స్వామిని జైళ్లకు, కోర్టులకూ తిప్పి తిప్పి పరమ దురవస్థలో దివంగతుడు కావలసి వచ్చినందుకు ఏ పాలకుడ్ని నమ్మాలి, ఏ న్యాయ వ్యవస్థను విశ్వసించాలి? సాగు భూముల రక్షణ కోసం సత్యాగ్రహంలో ఉన్న రైతులలో 300 మంది చనిపోతే కనీస సానుభూతి కూడా చూపని పాషాణ ప్రభువర్గం ఉన్న చోట ‘పెగసస్’ నిఘా సాఫ్ట్‌వేర్‌దే పెత్తనమవుతున్న రోజులివి! ఈ పరి స్థితుల్లోనే చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) పేరిట 2015–2019 మధ్య అరెస్టు చేసిన వారి సంఖ్య 72 శాతం పెరిగినా పాలకులకు చీమ కుట్టినట్టు కూడా లేదు. విచారణా లేదు! ఏతావాతా ఇజ్రాయెల్ సైబర్ నిఘా సంస్థ ఎన్.ఎస్.ఓ. నడుస్తున్నది ప్రపంచ ప్రజాప్రయోజనాల భక్షణకేగానీ రక్షణకు మాత్రం కాదు. అదే సమ యంలో భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు జోగీందర్ సింగ్ ఉగ్రహాన్ ఒక ప్రకటనలో రైతాంగ సమస్యల పరిష్కారం ప్రధాని మోదీ చేతిలో లేదని, అదానీ, అంబానీ చేతుల్లో ఉందని స్వయంగా వ్యవ సాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటించారని చెప్పడం– మన స్థితిగతులకు ఒక అద్దం! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
చట్టాలకు దారిదీపాలు సంస్కర్తలే!
టెక్నాలజీ తనతోనే పుట్టిందనుకునే భ్రమలో జీవిస్తూ, టెక్నాలజీని రాజకీయ ప్రత్యర్థులపై ప్రయోగించడం ద్వారా లబ్ధి పొందజూసే చంద్రబాబుకి ఓ పెద్ద ధర్మసందేహం వచ్చి –‘‘అసలు దిశ చట్టమే లేదు, మొబైల్ ‘యాప్’ను ఎలా అప్లై చేస్తారని’’ ఓ కొంటె ప్రశ్న వేశాడు! దారుణమైన వివక్ష ఫలితంగా అసంఖ్యాక దళిత బహుజనులు సాంఘిక, ఆర్థిక దోపిడీని ఎదిరించి గుండె ధైర్యంతో జీవనాన్ని సాగించడానికి వీలు కల్పించిన సంస్కర్తల కృషి లేకుండా చట్టాలు... చట్టాలు వచ్చేదాకా సంస్కర్తలు, సంస్కరణాభిలాషులూ ఆగరు. రాష్ట్ర పురాచరిత్రలో ప్రజా జీవనాన్ని మెరుగుపర్చడానికి చట్టాలకు దారి దీపాలుగా ఉన్నవారు సంఘ సంస్కర్తలేనని వారి కృషి ఫలితంగానే ఆ మాత్రం చట్టాలైనా చూడగల్గుతున్నామని మరచిపోరాదు. ‘ఉలిపికట్టె (మూర్ఖుడు) కేలరా ఊళ్లో పెత్త నాలు’ అని మన పల్లెటూళ్లలో ఒక ముతక సామెత! వెనకటికొకడు చెడి చెన్నపట్నం చేరుకున్నట్టుగానే చంద్ర బాబు కూడా పదవీభ్రష్టుడై అమరావతిలో నిలవలేక హైదరాబాద్‌లో తలదాచుకుంటున్నది చాలక– ఆంధ్రప్రదేశ్ విభజనకు తేలు కుట్టిన దొంగలా రహస్యంగా సంతకాలు చేసి వచ్చిన తరువాత ఆడుతున్న నాటకాలను తెలుగు ప్రజలు మరిచిపోలేదు, మరిచిపోరు! అఖండ మెజారిటీతో వైఎస్సార్ కాంగ్రెస్‌ను, దాని యువ నాయకుడు జగన్ మోహన్‌రెడ్డిని 2019 జనరల్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలిపించింది మొదలు చంద్రబాబు, మిగిలిన అతని ‘డూడూ బస వన్నలూ’ ఆడుతున్న అబద్ధాలు అన్నీ ఇన్నీ కావు. పైగా సామాజిక రంగంలో సంస్కరణలకు, చట్టాలకు మధ్య తేడా కూడా తెలియకుండా మాట్లాడుతున్నాడు బాబు! ఈ మధ్య ఆంధ్రప్రదేశ్‌లో మహిళల భద్రతకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ‘దిశ’ పేరిటనే ప్రత్యేక బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టి రాష్ట్ర పరిధిలోనే చట్టం రూపొందించి అమలు జరపడానికి సర్వప్రయత్నాలు చేస్తు న్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర సచివాలయ, గ్రామ సచివాలయాలు కేంద్రంగా అధికారుల స్థాయిలోనూ, వలంటీర్ల వ్యవస్థ కేంద్ర బిందు వుగానూ మహిళలకు అవగాహనా సదస్సులు నిర్వహించడమే గాక ఆధునిక టెక్నాలజీ ఆసరాగా ‘యాప్’ ఆధారంగా తమకు ఇబ్బంది ఎదురైనప్పుడు నిమిషాల మీద పోలీసు యంత్రాంగాన్ని కదిలించి రంగంలోకి దించడం ద్వారా మహిళలు తక్షణ రక్షణ పొందేందుకు సకల ఏర్పాట్లు జరిగాయి, ఇంకా జరుగుతున్నాయి. మహిళా లోకం నిర్భయంగా ఉండగల పరిస్థితుల్ని కల్పిస్తున్నారు. కానీ టెక్నాలజీ తనతోనే పుట్టిందనుకునే భ్రమలో జీవిస్తూ టెక్నా లజీని రాజకీయ ప్రత్యర్థులపై ప్రయోగించడం ద్వారా లబ్ధి పొంద జూసే చంద్రబాబుకి ఓ పెద్ద ధర్మసందేహం వచ్చి–‘‘అసలు చట్టమే లేదు, మొబైల్ ‘యాప్’ను ఎలా అప్లై చేస్తారని’’ ఓ కొంటె ప్రశ్న వేశాడు! అతని ఉద్దేశంలో రాష్ట్రపతి సంతకం, కేంద్రం అనుమతి ఉంటే కదా రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని అమలు పర్చగలిగేది, అందుకే రాష్ట్ర చట్టం ‘నాలుక గీసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది, కాబట్టి అమలు జరగదు’ అని మహిళల్లో ఒక అనుమాన బీజం నాట డానికి ప్రయత్నించాడు బాబు! అంతేగాదు, ఇటీవల ముమ్మరించిన ‘కోవిడ్–19’ (కరోనా) వైరస్ ప్రభావానికి ఆంధ్రప్రదేశ్‌లో ఎంత మంది మరణిస్తే టీడీపీ నాయకుల ‘కడుపు చల్లబడుతుందో’ చంద్ర బాబుకు ఊరట కలుగుతుందో మనకు తెలియదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో ‘కరోనా’ వల్ల చనిపోయిన వారు కనీసం ‘లక్షా 30 వేల మంది ఉండాలి’ అని టీడీపీ ‘గణాంక అధికారి’ హోదాలో బాబు ఓ ప్రకటనే విడుదల చేయడం మరీ ఆశ్చర్యకరం! ‘పిట్ట’కు అసూయ ఉంటుందని భావించలేం గానీ, అశుభంగా వినిపించే గొంతుకు మారుపేరుగా మనవాళ్లు ‘తీతువు’ (ఊడూ) పిట్టను పేర్కొంటూం టారు. అలాంటి గొంతు, చూపూ బాబుది! ఇదంతా ఎందుకు చెప్పవలిసి వస్తోందంటే సామాజిక రుగ్మత లను, వాటి వల్ల వచ్చే అనర్థాలను ఎదుర్కోడానికి, సమాజంలో దారుణమైన వివక్ష ఫలితంగా అసంఖ్యాక దళిత బహుజనులను సాంఘిక, ఆర్థిక దోపిడీని ఎదిరించి గుండె ధైర్యంతో జీవనాన్ని సాగించడానికి వీలు కల్పించిన సంస్కర్తల కృషి లేకుండా చట్టాలు రాలేదు! మరో మాటలో చెప్పాలంటే... అల్లుడు వచ్చేదాకా అమా వాస్య ఆగదు, చట్టాలు వచ్చేదాకా సంస్కర్తలు, సంస్కరణాభిలా షులూ ఆగరు. ఇంతవరకూ మన రాష్ట్ర పురాచరిత్రలో ప్రజా జీవ నాన్ని మెరుగుపర్చడానికి చట్టాలకు దారి దీపాలుగా ఉన్నవారు సంఘ సంస్కర్తలేనని వారి ఆటుపోట్ల ఫలితంగానే ఆ మాత్రమే అర కొర చట్టాలైనా చూడగల్గుతున్నామని మరచిపోరాదు. అంతే గాదు, ఏపీ ‘దిశ’ చట్టం వెలుగుచూసిన తరువాత సీఎం హోదాలో జగన్ అనేకసార్లు కేంద్రంలోని బీజేపీ పాలకులకు లేఖలు రాస్తూ ‘దిశ’ చట్టా నికి తక్షణం ఆమోదముద్ర వేయాలని విజ్ఞప్తులు చేసినా, బీజేపీతో బాహాటంగానూ, లోపాయికారీగానూ ఈ క్షణం దాకా సన్నిహిత సంబంధాలున్న టీడీపీ నాయకత్వం ఇంతవరకూ ‘దిశ’ చట్టానికి ఆమోదం తెలపాలని కేంద్రాన్ని ఒక్కసారైనా కోరిన దాఖలాలు లేవు. 19వ శతాబ్దంలో సంస్కర్తల విశిష్ట లక్షణం– హిందూ సంఘ సంస్కర్తలలో ఎక్కువమంది సర్వజనులు సుఖంగా ఉండాలని కోరు కున్నవారు కాబట్టే సనాతన దృక్పథంగల వారికి నచ్చకపోవడమో, ఎదురుదాడులు చేయడమో చేస్తూ వచ్చారు. జాతీయోద్యమ దశలో సమాజ సంస్కరణల కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాద పాలనలో గళ మెత్తి పోరాడిన మహా సంస్కర్తలందరూ సంస్కరణల కోసం పడి గాపులు పడి, చట్టాలు మారేవరకు వేచి ఉండలేదు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ 19వ శతాబ్ది పరిణామాలే. సంఘ సంస్కరణల కోసం, విద్య, ఆర్థిక సంస్కరణల కోసం, సతీసహగమనం లాంటి సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా, దళిత బహుజనుల జీవితాలలో పెను మార్పుల కోసం ఉద్యమించి మంచి ఫలితాలు సాధించినవారు ఒకరు, ఇద్దరా– సతీసహగమన ఆచారం నిర్మూలనకు, వివక్షారహిత మైన సమాజం కోసం, విద్యా రంగ సంస్కరణల కోసం– రాజా రామ్మోహన్రాయ్, వీరేశలింగం, చిలకమర్తి, ఈశ్వర చంద్ర విద్యా సాగర్, జ్యోతిరావ్ ఫూలే, సావిత్రి ఫూలే, నారాయణగురు, బసవేశ్వ రుడు, త్రిపురనేని, అంబేడ్కర్, సాహూ మహరాజ్ (సత్యశోధక ఉద్యమం)లు ఒక చట్టం కోసం ఎదురుచూడకుండానే సాగించిన ఉద్యమాలు, మహాప్రారంభాలు ఎన్నెన్నో. వేదకాలంలోని సర్వ చాద స్తాలకు కారకులు కొలదిమందే. కానీ, తొలి వేదకాలంలో సతీసహగ మనం లేదు, బాల్య వివాహాలు లేవు, కులవ్యవస్థ, నాలుగు వర్ణాల కృత్రిమ విభజనా లేదన్నది పండితుల అభిప్రాయం. ఆ మాటకొస్తే– అశ్వఘోష్ ‘వజ్రశుచి’ ఉపనిషత్ ఈనాటిది కాదు, 9వ శతాబ్ది నాటిది. చివరికి భక్త తుకారామ్, అతని శిష్యుడు బహినాబాయ్, కలిగోపీనాథ్ వగైరా 18వ శతాబ్ది భక్త కవుల రచనలపైనా ‘వజ్రశుచి’ ప్రభావం ఉందంటారు పరిశోధకులు. దళిత వర్గానికి చెందిన ‘గురవ’ (మహారాష్ట్ర)ను కూడా బౌద్ధుడైన అశ్వ ఘోషుని ‘వజ్రశుచి’ హేతువాదం ప్రభావితం చేసింది. కానీ ఈ ప్రస్తా వనలు, పాఠాలు చంద్రబాబుకి అనవసరం. ఎందుకంటే– చరిత్ర అంటే ఆయనకి ‘ఎలర్జీ’ కనుకనే పాఠ్యగ్రంథాల నుంచి చరిత్ర పాఠాల్ని తీసి పారేయమని, తన తొలి హయాంలోనే అధికారుల్ని ఆదే శించాడు. ఎందుకంటే, మన వికృత చేష్టలన్నింటికీ ప్రాతినిధ్యం వహించిన దేశదేశాల దుష్ట పాలకులు చరిత్ర పాఠాలలో తరచుగా తారసిల్లుతూ ఉంటారు కాబట్టి. అర్ధంతరంగా కోటీశ్వరుడైన తన ఆత్మీయ పత్రిక అధినేత ఫలానా ‘ఎన్టీఆర్ ఫొటో ఇంక మన కెందుకు. దాన్ని పార్టీ బ్యానర్ నుంచి తొలగించి పారేయమని సలహా ఇస్తున్న వీడియో దృశ్యం వైరల్ అయి తెలుగులోకమంతా ‘గుప్’ మనడం అందుకు బాబు ‘గప్ చిప్’ కావడం దాచలేని బహిరంగ రహస్యం అయిపోయింది. బాబు అంత తెలివి తక్కువవాడా, ‘ఎన్టీఆర్ బొమ్మను అలా ఉంచే... నాటకం ఆడాల’న్నది అతని వ్యూహం. మరోవైపున రాష్ట్ర ప్రజల సమ్మతితో అఖండ మెజారిటీతో ఎన్నికై ఆ ప్రజల సంక్షేమం కోసం రెండేళ్ల క్రితం ప్రారంభించిన సంక్షేమ పథ కాలను తు.చ. తప్పకుండా–ఇచ్చిన హామీలనే కాదు, ప్రకటించని పెక్కు సంస్కరణలను సహితం అమలుచేస్తున్న వైఎస్ జగన్ ముందుకుదూసుకు పోగలరన్న భరోసా ప్రజలకూ ఉండటం సహజం. ఆయన ఆసాంతం జయప్రదం కావాలని కోరుకుందాం. ఎదుటివాడి అసూయకు కావలసింది బలం కాదు, దౌర్బల్యం. ఎలా గంటే, అసూయ పొరుగింటి గుర్రాన్ని గాడిద అనిపిస్తుందట! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
సార్వత్రిక టీకాకు ‘మేధోహక్కు’లే ముప్పు
రోగ నిర్థారణ చేయగల పలువురు క్రిమి శాస్త్రవేత్తల అంచనాలను బట్టి, ప్రపంచంలో ఇంతవరకూ కనిపెట్టిన 300 పైగా వైరస్లలో నికార్సయిన పరిపూర్ణ ‘టీకా’ (ఇంజక్షన్) అంటూ వచ్చింది ఒక్క మశూచికి (స్మాల్ ఫాక్స్) మాత్రమేనని తెలుస్తోంది! ఫ్లూ వ్యాధి మూలాలకు ఇప్పటికీ శాశ్వత పరిష్కారం దొరక్కపొయినా, దాని మూలాలను తాత్కాలికంగా అదుపు చేయగల తాత్కాలిక ఉపశమనాలను వైద్యశాస్త్రవేత్తలు ప్రపంచానికి అందించి ప్రజాబాహుళ్యం ఆధరాభిమానాలకు పాత్రులవుతున్నారు.టీకాలు జరూరుగా ప్రపంచమంతా సరఫరా కావాలంటే ప్రపంచంలో మేధో హక్కుల చట్టం అడ్డు రాకూడదన్న బ్రిటిష్ సోషలిస్టు నాయకుడు బెర్నీ శాండర్స్ అన్నమాట అక్షరసత్యం! ప్రకృతి వినాశాన్ని కొని తెచ్చుకునే ప్రపంచీకరణ (గ్లోబలైజేషన్) పేరిట ప్రవేశపెట్టిన నూతన ఆర్థిక సంస్కరణలు అనేక అనర్థాలకు కారణమవుతున్నాయి. ఫలితంగా మాంసకృత్తులను పెంచే జంతు ప్రొటీన్ల కోసం ఆరాటం పెరిగిపోయిన ఫలితంగా మానవ జాతి ప్రపంచ వ్యాపితంగానే తెలిసిన రోగాలతో పాటు తెలియని అనేక అజ్ఞాత వ్యాధులకు గురవుతూ వస్తోంది. ఈ దుస్థితి గతంలో అంతగా లేదు. ఈ అజ్ఞాత వ్యాధుల్లో భాగమే ‘సార్స్’ వ్యాధి వ్యాప్తి. దాంతో ప్రపంచం ఎంతగా పడుగు పేకలా అల్లుకుపోయిన భూమో మనకు తెలిసొచ్చింది. అంతేగాదు, రకరకాల మహమ్మారి వ్యాధి కారక వైరస్ క్రిములకు రకరకాల గబ్బిలాలు, రిషి పిట్టలూ ఆలవాలంగా మారాయో వెల్లడైంది’’. ►ప్రపంచ వైద్య పరిశోధనా సంస్థ ప్రపంచాన్ని ముమ్మరించనున్న అంటువ్యాధుల (ఇన్ఫెక్షన్)పై హెచ్చరిస్తూ 1992లోనే ప్రచురించిన సాధికార నివేదిక. ►అంతేగాదు, ‘‘ సుమారు 25 వేల సంవత్సరాలకు ముందే నేటి కరోనా (కోవిడ్ 19)ను పోలిన వైరస్ వ్యాధి మనుషులకు సోకింది, ప్రపంచంలోని మానవాళి ఆది నుంచీ ప్రమాదకరమైన విషవ్యాధుల్ని ఎదుర్కుంటూనే ఉన్నారు. అయితే అలాంటి వైరస్‌లను ప్రతిఘటించి బట్టకట్టిన మానవ జీవకణాలలోని సానుకూల శక్తుల సాయంతోనే వైరస్లు దఫదఫాలుగా వచ్చినా తట్టుకుని మానవులు ఉనికిని చాటుకున్నారు! ►అరిజోనా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త ప్రొఫెసర్ డేవిడ్ ఎనార్డ్ ఆధ్వర్యంలో పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తల తాజా అధికార నివేదిక. అంటే ‘‘సార్స్’’ వైరస్ తర్వాత ‘జికా’, ఎబోలా’ వగైరా సరికొత్త వైరస్లు పుట్టగొడుగుల్లా వివిధ ఖండాలలో పెల్లుబుక్కుతూ వస్తున్న దశలోనే తాజా కోవిడ్–19 (కరోనా) వైరస్ కూడా మానవాళిపై విరుచుకుపడి అన్ని ఖండాలను చుట్టుముడుతూ లక్షలు, కోట్లమంది ప్రజల ప్రాణాలు తోడుకుంటోంది. ఈసారి ఈ వైరస్ వ్యాప్తికి ఖండాలు, దేశాలు, పలానా ప్రాంత ప్రజలు, జాతి, కుల, మత వివక్షలు వంటివి లేవు! ఎందుకంటే ‘రోగానికి మందుగాని మనిషి ఆయుర్దాయానికి మందు ఉండదన్నది సామెత. ప్రపంచ శాస్త్రవేత్తలు, రోగ నిర్థారణ చేయగల పలువురు క్రిమి శాస్త్రవేత్తల అంచనాలను బట్టి, ప్రపంచంలో ఇంతవరకూ కనిపెట్టిన 300 పైగా వైరస్లలో నికార్సయిన పరిపూర్ణ ‘టీకా’ (ఇంజక్షన్) అంటూ వచ్చింది ఒక్క మశూచికి (స్మాల్ ఫాక్స్) మాత్రమేనని తెలుస్తోంది! 19వ శతాబ్దంలో వచ్చిన ‘‘స్పానిష్ ఫ్లూ’’ ప్రపంచాన్ని గడగడలాడించి కోట్లాది ప్రజల ప్రాణాలు హరించివేసింది. అయినా ఫ్లూ వ్యాధి మూలాలకు ఇప్పటికీ శాశ్వత పరిష్కారం దొరక్కపొయినా, దాని మూలాలను తాత్కాలికంగా అదుపు చేయగల తాత్కాలిక ఉపశమనాలను వైద్యశాస్త్రవేత్తలు ప్రపంచానికి అందించి ప్రజాబాహుళ్యం ఆధరాభిమానాలకు పాత్రులవుతున్నారు. ఈ లెక్కన నిన్న, మొన్ననే ‘ఉషోదయం’ చూడగలిగిన ‘‘2–డీజీ’’ (రక్షణ శాఖ శాస్త్ర పరిశోధన సంస్థ) సహితం కరోనా వ్యాధి సోకిన వారికి కొంత ఉపశమనం ఇవ్వగల్గిందే గాని, రాక్షస వ్యాధి రాకుండా పూర్తిగా నిరోధించగల శక్తి గలది కాదని డీఆర్డీవో అధినేత సతీష్‌రెడ్డి కూడా భావిస్తున్నారు! అయినా ఆ మేరకైనా కరోనా వ్యాధిగ్రస్తులకు భారీ ఉపశమనం కల్గించబోవడం ఆహ్వానించదగిన పరిణామం. ఎందుకంటే ప్రపంచ ప్రసిద్ధ వైరాలజిస్టులు, జీవశాస్త్రవేత్తలయిన లూయీపాశ్చర్, కోచీలు (18–19 శతాబ్ద) చాలా దూరదృష్టితో ఒక మహా సత్యాన్ని ప్రకటించి, మానవాళిని విజ్ఞానవంతుల్ని చేయడానికి, మూఢవిశ్వాసాలను పటాపంచలు చేయడానికి ప్రయత్నించారు. జీవితం అంటేనే క్రిముల సముదాయం, క్రిములంటేనే జీవితం సుమా! మానవ జీవితాన్ని శాసించే ఆఖరి శక్తులు కూడా క్రిములేనని మరచిపోరాదు’’! అలాగే భారత తొలితరం ప్రముఖ క్రిమి శాస్త్రవేత్త శ్రీమతి గగన్‌దీప్ కాంగ్ సహితం వైరస్ క్రిమి బతికేది కూడా మరో పరాశ్రయ క్రిమి మీదనే, ఇది సృష్టి పరిణామ క్రమంలో అంతర్భాగమని’’ గుర్తించాలని స్పష్టం చేశారు! మానవజాతి పరిణామ క్రమంలో గుహలనే స్వగృహాలుగా మలుచుకుని గడిపిన ఆ అజ్ఞాత ఆదిమ గుçహాంతర జీవులకూ నేటి మానవుల ఉనికి బాధలకూ సంబంధం ఉందని బయోటెక్నాలజీ ప్రొఫెసర్ వినయపాండ్యే తాజా పరిశోధనల్లో తేల్చారు. పరిణామ క్రమంలో భాగంగానే నెదర్లాండ్స్ వైరస్ జీవకణాల్లోని కొన్ని కణాలు వైరస్‌ను ఎదిరించి మరీ మనగలగడం రుజువైందని అలా చెడును ఎదిరించి బతకడాన్ని ఆ ప్రయోజనకర కణాల నుంచే మానవులకు సంక్రమించిన గుణపాఠమనీ పాండ్యే నిర్ధారణ! అదే, జన్యు కణాలలో ప్రయోజనకరమైన వాటిని కాపాడే డీఎన్ఏకూ ఆ కణాలలోని ప్రతికూల శక్తి అయిన ఆర్ఎన్ఏకూ మధ్య నిరంతరం సాగే సంకుల సమర దుందుభులకు అసలు కారణం! బహుశా ఈ వాస్తవం దృష్ట్యానే క్రిమి శాస్త్రవేత్త గగన్‌దీప్ కాంగ్ ప్రస్తుత కరోనా వైరస్ విలయతాండవానికి బహుశా మే ఆఖరు, లేదా ఆ ప్రాంతాలకల్లా సాధ్యమైనంత వరకు ఆటవిడుపు ఉంటుందని అనేక ఉదాహరణలు ఆధారంగా ప్రకటించగలిగి ఉంటారు! అందుకనే సుప్రసిద్ధ పరిణామవాద జీవశాస్త్రవేత్త థియోడోసియస్ డోబ్ ఝాన్సీకి ‘‘సార్స్– కోవిడ్ –2 వైరస్ వ్యాధి పుట్టుక, దాని వ్యాప్తిని పరిశోధించి ఆ వ్యాధి కారణాన్ని నిగ్గుదేల్చిన తరువాత చేసిన కీలకమైన వ్యాఖ్యను మనం మరిచిపోరాదు. ‘‘పరిణామవాద దీపకాంతిలో తప్ప జీవశాస్త్రం విశిష్టత మరో విధంగా తెలియరాదు’’ అని చాటిచెప్పారు! అలాగే సామ్రాజ్యవాద, వలస దోపిడీ విధానాల ఫలితంగా పాత, కొత్త వర్ధమాన దేశాల ఉనికిని, ప్రజాబాహుళ్యం జీవన విధానాలను చెల్లాచెదర చేసిన దారుణ యుద్ధాలు, దోపిడీల ఫలితంగా లెక్కకు మకుటంగా వైరస్లు వ్యాపించి ఆర్ధిక వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేసిన చరిత్రను మరచిపోలేం. కనీవినీ ఎరుగని విపత్తుల నుంచి ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని వర్ధమాన దేశాలు ఈ రోజుకీ కోలుకోలేక పోవడానికి అపరిష్కారంగా మిగిలిపోయిన సామాజిక, రాజకీయ, మతపరమైన దారుణ వివక్షలను పాలకులు కొనసాగించడమే కారణం! ప్రసిద్ధ శాస్త్రవేత్తలు, పరిశోధకులు పెక్కుమంది ఉద్దేశం ఈ రోజుకీ కోవిడ్–19(కరోనా సహా) ‘‘ఫ్లూ’’ కు రకరకాల నకళ్లే. కాకపోతే వ్యాధి తీవ్రతలో, ఉధృతిలో తేడాపాడాలు! అందుకే కోవిడ్–19 భారతదేశంలో ‘ఆశ్రయం’ పొంది పెరుగుతున్న వాలకం గమనించిన వైద్యశాస్త్రంలో నిపుణులైన డాక్టర్లు పెక్కుమంది ‘కరోనా’ దాడి ప్రారంభమైనప్పటి నుంచీ కనబడిన రోగులు పెక్కుమందికి ముందు జాగ్రత్తగా ఇన్ఫ్లూయొంజా/ న్యూమోనియా ఇంజక్షన్లని వేయించుకోమని సలహా ఇచ్చారని మరచిపోరాదు. కోళ్లు, కుక్కలకు ఇతర జంతువులకు కూడా కరోనా వ్యాపిస్తున్న ఈ రోజుల్లో చిలకలకూ ‘‘పారెట్ ఫీవర్’’ మొదలైందని వార్తలు వింటున్నాం! ఆధునిక వైద్య పితామహులలో ఒకరుగా పేరొందిన సర్ విలియం ఆస్లర్. ‘ఫ్లూ’ సంబంధిత వ్యాధి న్యూమోనియాను మృత్యువాత పడిన రోగులకు ‘సార్స్’ అని నామకరణం చేశారు! మన దేశం నేడున్న అత్యంత విపత్కర పరిస్థితులలో కూడా ముందు చూపు కరువైన పాలక రాజకీయ నాయకత్వం కనుసన్నలలోనే, వారి ఆధ్వర్యంలోనే వందలు, వేలల్లో లాభాల వేటకు మోసులెత్తగా, ఇంకొక వైపున అసంఖ్యాక పేద మధ్య తరగతి వర్గాలు, వ్యవసాయ, పారిశ్రామిక కార్మికులూ పరాయి పంచల్లో బతుకులీడుస్తూ రోడ్లపాలై బతుకులు వెల్లబుచ్చుకుంటున్నారు. అందుకే టీకాలు జరూరుగా ప్రపంచమంతా సరఫరా కావాలంటే ప్రపంచంలో మేధో హక్కుల చట్టం అడ్డు రాకూడదన్న బ్రిటిష్ సోషలిస్టు నాయకుడు బెర్నీ శాండర్స్ అన్నమాట అక్షరసత్యం! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
యువత రక్షణే తక్షణ బాధ్యత!
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తివల్ల కలిగే ఉపద్రవంకన్నా కంగారు పర్చే వార్తలను నిత్యం ప్రచారంలో పెట్టడం ప్రజలలో తీవ్ర ఆందోళనలకు కారణ మవుతోంది. ఈ భయాందోళనలు ఏ స్థాయికి చేరాయంటే నిజమైన రోగులు మరణించిన వార్త విన్న వెంటనే కుప్పకూలి అక్కడికక్కడ చనిపోయిన ఉదంతాలు కోకొల్లలు. పైగా కోవిడ్–19 రెండవసారి ఉధృతితో వైరస్‌కి యువకులు ఎక్కువగా గురవుతున్నారు. నేడు ఆసుపత్రుల్లో ఊపిరి కోసం వెంటి లేటర్స్‌పై ఉన్నవాళ్లలో 30 శాతం యువకులే, వీరు 30–45 ఏళ్లవాళ్లే. ఆరోగ్య సమస్యల కారణంగా తలెత్తిన ప్రాణవాయువు పుష్కలంగా అందించలేని దుస్థితికి దేశం చేరిందంటే– నిస్సందేహంగా పాలకుల అలసత్వమే కారణం, ఈ దశలో జాతి కుసుమాలుగా ఉన్న యువత రక్షణ మన తక్షణ బాధ్యత! ‘‘నేడు ఆసుపత్రుల్లో ఊపిరి కోసం వెంటి లేటర్స్‌పై ఉన్నవాళ్లలో 30 శాతం యువకులే, వీరు 30–45 ఏళ్లవాళ్లే. కోవిడ్–19 రెండవసారి ఉధృతితో విషక్రిమి (వైరస్)కి యువకులు ఎక్కువగా గురవుతున్నారు. మూడు వారాల్లో వైరస్ తగ్గుముఖం పడుతుందని ఆశిస్తున్నాం’’. – డాక్టర్ రాజారావు, గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ‘‘కోవిడ్–19 నీరెండలాంటి సాత్వికమైన రోగం. దానికి ఎవరూ కంగారుపడాల్సిన పనిలేదు. ఈ కంగారులో ఇంజెక్షన్లను, మందుల్ని, ఆక్సిజన్ సిలిండర్లను ఇళ్లలో దాచేసుకుంటున్నారు. ఇది అనవసర భయం. ఎందుకంటే కోవిడ్ అనేది సాధారణ రోగం. ఇది తాకితే లేదా స్పర్శ తగిలితే వచ్చేది కాదు. ఇది సాధారణ రోగం. ఇది వచ్చిన వారిలో 85–90 శాతానికి జ్వరం, జలుబు, ఒంటినొప్పులు, దగ్గు, తలనొప్పి ఉండటం సహజం. సాధారణ మందుల తోనే మీరు యోగా తదితర శారీరక ఎక్సర్సైజెస్ ద్వారా వారం పదిరోజుల్లోనే మామూలు స్వస్థతకు చేరుకుంటారు. ఈ మాత్రానికే మీరు ఇళ్లలో రెమిడెసివిర్‌లు, ఆక్సిజన్ సిలెండర్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు’’. – డాక్టర్ రణదీప్ గులేరియా, ఎయిమ్స్ డైరెక్టర్ ప్రకటన ప్రజా బాహుళ్యాన్ని సర్వత్రా కంగారుపరిచే విధంగా రకరకాల ప్రచా రాలతో ప్రసార మాధ్యమాలు సహా రకరకాల వార్తలను ఒక మేరకు అదుపు తప్పి మరీ ప్రచారంలో పెట్టడంవల్ల కూడా దేశంలో వ్యాధి వ్యాప్తివల్ల కలిగే ఉపద్రవంకన్నా ప్రజలలో తీవ్ర భయాందోళనలకు కారణమవుతోంది. దీనికితోడు కేంద్ర ప్రభుత్వపరంగా కనీసం ప్రాణ రక్షణకు అవసరమైన కనీస ఆక్సిజన్ సిలిండర్ల ఉత్పత్తి పంపిణీలపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోనందువల్ల కోవిడ్–19కి సంబంధించి ప్రజల్లో భయాందోళనలు మరింతగా పెచ్చరిల్లుతున్నాయి. ఇవి ఏ స్థాయికి చేరాయంటే నిజమైన రోగులైన తమవాళ్లు మరణించిన వార్త విన్న మరుక్షణంలోనే కుప్పకూలి అక్కడికక్కడనే చనిపోయిన ఉదం తాలు, కరోనాని అంటురోగంగా భావించినందున కుటుంబంలోని ఎవరైనా సాధారణంగా మరణించినా వారి దగ్గరకు వెళ్లలేక భీతావ హులైపోయి రోగగ్రస్థులవుతున్న దశలో ఇప్పుడు మనం ఉన్నాం. వైద్య నిపుణులు, రోగ నిరోధక శాస్త్ర నిపుణులు, క్రిమి శాస్త్ర ఆచా ర్యులు తదితర ఉద్దండులు భరోసా ఇస్తూ పాటించవలసిన జాగ్రత్త లను పదే పదే సూచించి చైతన్యవంతుల్ని చేయడానికి విశ్వప్రయత్నం చేస్తున్నా– మన రాజకీయ నాయకులు కోవిడ్‌పై శాస్త్రీయ పద్ధతుల్లో సరైన అవగాహన కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యారు. ఈ ప్రస్తుత దుస్థితిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, యువ నాయ కుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, తెలంగాణ ఆరోగ్య శాఖామంత్రి ఈటల రాజేందర్ పలుసార్లు వివరించారు. ప్రజా బాహుళ్యాన్ని చైత న్యవంతం చేయడంలో కోవిడ్ రోగాన్ని ‘వస్తుంది, పోతుంది’ మన జాగ్రత్తతో మనం ఉండటమే పరిష్కారంగా వర్ణించి భయాందోళ నలు తొలగించడానికి ప్రయత్నిస్తూ వచ్చారు. కాగా, దేశంలో రాజ కీయ పాలకుల, నాయకుల పనితీరు, ప్రవర్తన గురించి తెలంగాణ ఆరోగ్యమంత్రి ఈటల ఇలా ఎండగట్టవలసి వచ్చింది: ‘‘గతంలో రాజ కీయ నాయకులు అంటే సమాజంలో గొప్ప గౌరవ భావముండేది, విలువలు, విశ్వాసం ఉండేవి. కానీ రాన్రానూ నాయకుల మీద, రాజ కీయ నాయకులమీద ఎలాంటి భావన వస్తూందో చెప్పాల్సిన అవసరం లేదు’! ఈ భావన జనంలో పెరగడానికి తాజా ఉదాహరణ. ఇనుము, ఉక్కు పరిశ్రమలకు, సంబంధిత ఖనిజ సంపదకు ప్రపం చంలోనే శతాబ్దాల నాడే కీర్తి ప్రతిష్టలు పొందిన భారతదేశానికి నేడు దేశ ప్రజలకు ఆరోగ్య సమస్యల కారణంగా తలెత్తిన ప్రాణ వాయువు పుష్కలంగా అందించ లేని దుస్థితికి చేరిందంటే– నిస్సందేహంగా పాలకుల అలసత్వం, విధాన నిర్ణయాలలో దేశ పాలనా నిర్వహణలో ప్రజాబాహుళ్య ప్రయోజనాలపట్ల పాటించి తీరాల్సిన ప్రాధాన్యతల క్రమానికి అంతరాయం ఏర్పడటమే కారణం. దేశ రాజ్యాంగ లక్ష్యాలతో, ప్రకటిత ప్రాధాన్యతలతో నిమిత్తం లేకుండా, పేద, దళిత, మధ్యతరగతి ప్రజా బాహుళ్యం బాగోగులకే ప్రాధాన్యం ఇవ్వాలన్న రాజ్యాంగ ఆదేశిక సూత్రాల విస్పష్ట ప్రకట నను విరుద్ధంగా నేటి బీజేపీ పాలనా వ్యవస్థ ముందుకు సాగుతోంది. దాని ఫలితమే వరుసగా రాజ్యాంగ లక్ష్యాలకు పరమ విరుద్ధంగా, బాహాటంగా– దేశంలోని ప్రభుత్వరంగ పరిశ్రమలను, బ్యాంకులను ఒక్కొటొక్కటిగా ‘రద్దుల పద్దు’లోకి నెట్టేశారు పాలకులు. ఈ స్థితిలో ప్రజారోగ్య రక్షణకు కనీస అవసరమైన ఆక్సిజన్ ఉత్పత్తి చేసుకోగల అవకాశాలు దేశంలో పుష్కలంగా ఉన్నా ‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ లాగా పాలనా వ్యవస్థ వ్యవహరిస్తోంది. ఫలితంగానే నేడు దేశ దేశాలవద్ద స్వతంత్ర భారతం అస్వతంత్ర శిశువుగా అంగలార్చవలసి వస్తోంది. ఇప్పుడుగాదు, నేటికి అయిదు మాసాలనాడే పార్లమెంటరీ ఉపసంఘం కోవిడ్ ఉధృతి దృష్ట్యా దేశ ఆక్సిజన్ అవసరాల గురించి ప్రస్తావించి, తక్షణ ఆక్సిజన్ ఉత్పత్తికి యూనిట్లను నిర్మించాలని కేంద్ర పాలకులకు సూచించింది. కానీ ఆ ప్రతిపాదనను విస్మరించిన కేంద్రం నేడు విదేశాలవైపు అంగలార్చవలసి వస్తోంది. ఈ దుస్థితి చివరికి ఏ స్థాయికి చేరిందంటే ఇంజెక్షన్ల ఉత్పత్తికి అవసరమైన ఫార్మా కంపె నీల ముడిసరుకు కోసం కూడా విదేశాలపై ఆధారపడి రావలసి రావడం. ఈ ముడి సరుకును భారత్–చైనాల మధ్య సరిహద్దు వివా దాల వల్ల అంతకుముందు ఇరుగుపొరుగు చైనా నుంచి దిగుమతి చేసుకునేవాళ్లం. అదీ ఆగిపోయింది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఒకప్పుడు ఫ్రాన్స్‌లో నెపోలియన్ అనుసరించిన ప్రత్యేక ప్రజా వ్యతిరేక, వినాశకర నిబంధనావళి (నెపోలియన్ కోడ్) గుర్తుకు వస్తోంది: ఫ్రాన్స్‌లోని పేద రైతాంగ, సన్నకారు, చిన్నవ్యాపారుల అధీనంలో సువిశాలమైన సుక్షేత్రాలుగా ఉన్న భూములన్నిటినీ గుంజేసి, ఫ్రాన్స్‌లోని మోతుబరులైన భూస్వా ములకు, సంపన్న పారిశ్రామికవేత్తలకు వాటిని ధారాదత్తం చేశాడు. ఇలాంటి పరిణామాన్నే భారత జాతీయోద్యమ తొలితరం విశిష్ట నాయకుడైన దాదాభాయి నౌరోజీ భారత సంపదను బ్రిటిష్ వలస పాలకులు ఎలా దోచుకుపోతూ దేశీయ రైతు, వ్యవసాయ కార్మికుల్ని బికారులుగా చేస్తున్నారని గొంతెత్తి నిరసించాడు. అలాగే, ఇంగ్లండ్‌లో పారిశ్రామిక విప్లవం తర్వాత టెక్నాలజీ పేరిట పరిశ్రమలకు హంగులు ఏర్పరిచే పేరిట భారీ ఎత్తున నిరుద్యోగ పర్వానికి తెరతీసిన పరిస్థితుల్లో ఇంగ్లండ్ మహాకవి షెల్లీ చిక్కుబడిపోయిన శ్రామిక వర్గాన్ని ఉద్బోధిస్తూ ‘ఇంగ్లండ్ ప్రజలకు’ (టు ది మెన్ ఆఫ్ ఇంగ్లండ్) ఒక పాటను సందేశంగా విడుదల చేశాడు. అది విశ్వవ్యాపిత కావ్యంగా ప్రఖ్యాతిగాంచింది. చదవండి! ‘విత్తనం నాటింది నువ్వు, దోచుకుపోయేది మరొకడు సంపద సృష్టి నీవంతు, దాన్ని అనుభవించేది మరొకడు బట్టలు నేయడం నీవంతు, తేరగా అనుభవించేది ఇంకొకడు ఆయుధాల తయారీ నీవంతు, వాటిని ఉపయోగించేది మరొకడు కానీ.. ఒక్క మాట సుమా! విత్తనం నీవే నాటు–ఏ నిరంకుశుడికీ దాన్ని దక్కనివ్వకు సంపద సృష్టించు–కానీ మరొకడికి పంట దక్కనివ్వొద్దు బట్టలు నేస్తూనే ఉండు–కానీ సోమరిపోతులకు అందనివ్వకు ఆయుధాలు తయారుచేస్తూ – వాటిని నీ రక్షణకు మాత్రమే ఉపయోగించు’! ఇంతకూ ‘కోవిడ్’ చాటున రకరకాల ‘వ్యాక్సిన్’ల పేరిట బడా ఫార్మా కంపెనీలు ఎన్ని రూ. లక్షల కోట్లకు మోసులెత్తి ఉంటారో సామాన్యుల ఊహకి అందని అంచనా. ఈ దశలో కంగారులో ఉన్న మన జాతి కుసుమాలుగా ఉన్న యువత రక్షణ మన తక్షణ బాధ్యత! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
న్యాయమూర్తులు... ఆదర్శాలు
దేశంలో న్యాయమూర్తులు ఎందరో ఉండవచ్చు. కానీ అత్యున్నత న్యాయస్థానపు అత్యున్నత పదవి ఎవరినోగానీ వరించదు. తెలుగువాళ్లలోనైతే అంత స్థాయికి వెళ్లినవాళ్లు ఎందరో చెప్పడానికి వేళ్లు కూడా అక్కర్లేదు. రెండు చేతులు చాలు. డెబ్బై యేళ్ల స్వతంత్ర భారతంలో సర్వోన్నత న్యాయ స్థానపు ప్రధాన న్యాయమూర్తి అవుతున్న రెండవ తెలుగువాడు జస్టిస్ ఎన్.వి. రమణ మాత్రమే. అయితే పదవులు అందరూ చేపడతారు. కానీ కొందరే ఆ పదవులకు వన్నె తెస్తారు. సుప్రీం మహోన్నత పీఠంపై ముమ్మూర్తులా న్యాయదేవతను తలపించిన కొందరు న్యాయమూర్తులు చరిత్రలో భాగమైనారు. వాళ్లు నెలకొల్పిన ఆదర్శాలే అందరికీ అనుసరణీయం కావాలి. ‘‘దేశంలోని పేదలు, నిరక్షరాస్యులు తమ హక్కులను విధిగా ఆచరణలో అనుభవించ లేని దశలో, భారత ప్రజలందరికీ సమాన హక్కులను అమలు జరుపు తామని చెప్పే హామీకి అర్థం లేదు. భారతదేశం స్వాతంత్య్రం పొందిన ప్పటినుంచీ దారిద్య్ర సమస్యతోనూ, న్యాయం పొందడం కోసమూ నిరంతరం పోరు సల్పుతూనే ఉంది. అయినా, 74 సంవత్సరాల స్వాతంత్య్రం తర్వాత కూడా అవే సమస్యలను ఇంకా చర్చించు కోవలసి వస్తోంది’’. – సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ: ఢిల్లీలో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కార్యాలయ ప్రారంభోత్సవ సభలో ప్రసంగం (23 మార్చ్ 2021) ‘‘న్యాయమూర్తుల పైన, న్యాయవ్యవస్థ పైన ప్రజలకు నమ్మకం తగ్గిపోతోంది. దానిని పెంచేందుకు న్యాయవాదులు కృషి చేయాలి’’. – ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి హోదాలో ఎన్.వి.రమణ (3 మార్చ్ 2013) తెలుగువారి చరిత్రలో ఎందరో న్యాయమూర్తులు రాష్ట్ర హైకోర్టుకు సేవలందించి ఉన్నారు. కానీ తెలుగువారి నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నికై సేవలందించిన విశిష్ట వ్యక్తి కోకా సుబ్బారావు కాగా, అనేక సంవత్సరాల తర్వాత ప్రధాన న్యాయమూర్తి పదవిని అలంకరించబోతున్న రెండవ తెలుగు న్యాయమూర్తి జస్టిస్ నూతల పాటి వెంకటరమణ కావడం హర్షించదగిన విషయం. ఈ సమ యంలో భారత న్యాయవ్యవస్థలో అనేక ఒడిదుడుకుల మధ్యనే సుసంప్రదాయాలను, ఎప్పటికీ ఆదర్శవంతంగా నిలిచిపోగల విశిష్ట తీర్పులను మనకు అందించిపోయిన ఆదర్శ న్యాయమూర్తులను తలచుకోకుండా ఉండలేము. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి హోదాలో జస్టిస్ రమణే ఎనిమిదేళ్ల క్రితం ‘న్యాయమూర్తుల పైన, న్యాయ వ్యవస్థ పైన ప్రజలకు నమ్మకం తగ్గిపోతోం’దని ఎందుకు ప్రకటించవలసి వచ్చిందో పూర్వాపరాలను ఆయనతో పాటు మనం కూడా తరచి చూసుకోవలసి ఉంది. ముఖ్యంగా గడిచిన రెండు దశా బ్దాలలోనూ మూడు రాజ్యాంగ వ్యవస్థలకు (ప్రభుత్వం/శాసన వ్యవస్థ/న్యాయవ్యవస్థలు) నిర్దేశించిన నియమిత అధికారాలను, బాధ్యతలను నిస్సిగ్గుగా ఉల్లంఘించడం జరిగింది. అయినా ఆత్మ విమర్శ జరగనందువల్ల మూడు రాజ్యాంగ వ్యవస్థలు పరస్పరం తమతమ స్వార్థ ప్రయోజనాల కోసం ఒక శాఖలో మరొక శాఖ దూరి తలా ఒక దారిగా ప్రవర్తించినందువల్ల దేశ న్యాయ వ్యవస్థ సహా అన్ని వ్యవస్థలూ కుప్పకూలిపోయే దశ వచ్చేసింది. ఒక్కముక్కలో చెప్పా లంటే ఏ దశకు పాలకులు చేరుకున్నారంటే– తాము ఆశించిన ప్రజా వ్యతిరేక విధానాలకు ‘తాతాచార్యుల ముద్ర’ మాదిరిగా పార్ల మెంటులో బ్రూట్ మెజారిటీ సాయంతో కొన్నాళ్లు, ‘కరోనా’ లాంటి వ్యాధుల వ్యాప్తి పేరిట ఇంకొన్నాళ్లు, సమావేశాలను, చర్చలనే పక్కనపెట్టారు. సుప్రీం మెడలువంచి లేదా కొందరు జడ్జీలకు అనంతర పదవుల ఆశ చూపి వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు. ఒక సీబీఐ స్పెషల్ కోర్టు న్యాయమూర్తినే భౌతికంగా తప్పించేశారన్న అపవాదు గత కొన్నేళ్లుగా బలంగా వినిపిస్తున్న సంగతి మరచి పోరాదు. న్యాయవ్యవస్థలో మనం ఒక అబ్రహాం లింకన్‌నూ, ఒక మహాత్మాగాంధీనీ ఆశించడం ‘కుందేటి కొమ్ము’ను సాధించడానికి ప్రయత్నించడమే అవుతోంది. అందుకే బహుశా భారత న్యాయ మూర్తులలో అగ్రశ్రేణి విలువలకు పట్టంకట్టిన పలువురు ఉద్దండ పిండాలలో ఒకరైన సుప్రీం న్యాయమూర్తి వి.ఆర్. కృష్ణయ్యర్ తన స్వీయచరిత్ర ‘జీవిత చరమాంకం’ (ది ఈవెనింగ్ ఆఫ్ లైఫ్) గ్రంథంలో ఇలా రాయవలసి వచ్చింది: ‘‘నిజాయితీకి బద్ధ విరోధి అవినీతి. కానీ ఈ అవినీతి రానురానూ మన న్యాయవ్యవస్థను క్రమంగా ‘కుమ్మరి పురుగు’లా తొల్చుకుంటూ పోతోంది. మనల్ని ప్రశ్నించేవాళ్లు లేరన్న ధీమాతో ముందుకు సాగుతోంది. నేను బార్లో ఉన్నప్పుడు చివరికి మున్సిఫ్ ప్రవర్తనను సహితం అనుమానించే వాడిని. కానీ ఈ రోజున అత్యున్నత న్యాయస్థానం సహితం తప్పుడు పనులకు, నిజాయితీకి విరుద్ధమైన చర్యలకు పాల్పడుతుండటం విచారకరం. ప్రభుత్వం లేదా పాలనాధికార వర్గం తప్పుడుగా వ్యవ హరిస్తే ఆ తప్పును న్యాయవ్యవస్థ అధికారికంగా సరిదిద్దవచ్చు. శాసన వ్యవస్థే రాజ్యాంగ చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఆ నేరానికి కోర్టువారు శిక్షించవచ్చు. కానీ తీర్పరిగా ఉండాల్సిన న్యాయమూర్తే నేరానికి ఒడిగడితే అతడిని సరైన బాటలో పెట్టేవారుండరు. కనుకనే అలాంటి న్యాయమూర్తులు తమ నిర్ణయానికి తిరుగులేదన్న భ్రమలో ఉండిపోతారు’’.అందుకే, బ్రిటిష్ కామన్వెల్తులో అత్యంత నిజాయితీపరుడైన జస్టిస్ మైఖేల్ కిర్బీ ఒక సందర్భంలో రాస్తూ– జస్టిస్ కృష్ణయ్యర్కి జైలు జీవిత సత్యాలు ఎలా ఉంటాయో తెలుసుననీ, అందుకే భారత దేశ జైళ్లలోని ఖైదీలకూ, భారత రాజ్యాంగాన్ని నమ్మేవారికీ మధ్య ఇనుప తెర అంటూ ఉండదనీ పేర్కొన్నారు. ‘సునిల్ బాత్రా వర్సెస్ ఢిల్లీ పాలక వ్యవస్థ’ కేసుకు సంబంధించిన తీర్పులో కృష్ణయ్యర్ ఎంత సాధికారతతో న్యాయసూత్రాలను రూపొందించారో, ఆ సూత్రాలను చివరికి బ్రిటన్ ప్రీవీ కౌన్సిల్, ఇతర కోర్టులలోనూ ఎలా ఆదర్శంగా అనుసరించాల్సి వచ్చిందో కిర్బీ పేర్కొన్నారు. ‘‘జస్టిస్ కృష్ణయ్యర్లా పెక్కుమంది న్యాయమూర్తులు జైలులో స్వయంగా ఒక రాత్రి గడిపి ఉండరు. నా మాదిరిగానే మహా అయితే జైళ్లు పరిశీలించి ఉండవచ్చు, జైళ్లలోని ఖైదీల పరిస్థితుల్ని గమనించి ఉండొచ్చు. కానీ ఈ పైపై క్షణికానుభవాలు ప్రభుత్వ తాఖీదుపైన అరెస్టయి జైలు జీవితం స్వయంగా అనుభవించడం లాంటి అనుభవం మరీ ముఖ్యంగా ప్రభుత్వ అన్యాయపు ఉత్తర్వుపై అరెస్టయి జైల్లో గడపటం లాంటి అనుభవం ముందు దిగదుడుపే. కృష్ణయ్యర్ లాంటి అనుభవం తక్కువమందికి ఉంటుంది.’’ ఒక న్యాయవాదిగా కృష్ణయ్యర్ (ఈనాటి ప్రసిద్ధ పౌరహక్కుల న్యాయవాది ప్రశాంత్‌భూషణ్, కీ.శే. కన్నాబిరాన్ లాగా) ‘కోర్టు ధిక్కారం’ అన్న అభియోగంపైన రెండుసార్లు ప్రాసిక్యూషన్ ఎదు ర్కొన్నవారే. అలాంటి సందర్భాలలోనే ఆయన భారత లీగల్ వ్యవస్థలోని బలహీనతల్ని, వైఫల్యాలను ఎండగడుతూ వచ్చారని మరచిపోరాదు. అలాంటి ఉద్దండ న్యాయమూర్తుల్లో ‘నా ముందుకు ఫలానా కేసు వద్దు’ (నాట్ బిఫోర్ మి) అంటూ ఇప్పటికీ తప్పు కుంటున్న జస్టిస్ లోకూర్, జస్టిస్ భండారీ లాంటి నిజాయితీపరులు ఉన్నారు. పతంజలి శాస్త్రి నుంచి జె.ఎస్.వర్మ, బరూచా, వి.ఎన్.ఖారే, సదాశివమ్, జీవన్‌రెడ్డి, శివరాజ్ పాటిల్, రామస్వామి, పి.ఎ.చౌదరి లాంటి ప్రసిద్ధులు జన హృదయాల్లో ఆదర్శమూర్తులుగా ఉండి పోయారు. అందుకనే కబుర్లు కాదు, ఉన్నత స్థాయికి చేరుకున్న న్యాయమూర్తులు అందరికీ ఆచరణ ముఖ్యం. కృష్ణయ్యర్ ఒక సూక్తిని ఉదహరించేవారు– ‘‘ప్రజా వ్యతిరేక దుష్ట చట్టాల గురించి మనలో చాలామంది మాట్లాడుకుంటుంటారు. కానీ, అలాంటి చట్టాలను ఉల్లంఘించడానికి ఎవరూ సాహసించరు. అందుకే ఫ్రెంచి మేధావి థోరే అన్నాడు: ఒక వ్యక్తిని పరమ అన్యా యంగా జైలుకు పంపించే ప్రభుత్వం ఉన్నచోట, న్యాయంగా బతికే వ్యక్తి ఉండాల్సిన స్థానం కూడా జైలే అవుతుంది సుమా!’’ రేపటి ఆదర్శమూర్తులు ఎలా ఉండాలో 2018 జనవరి 12న న్యాయవ్యవస్థ చరిత్రలో తొలిసారిగా జస్టిస్ చలమేశ్వర్ ఆధ్వర్యంలో అయిదుగురు జడ్జీలు నిర్వహించిన చారిత్రక పత్రికా సమావేశం నిర్ణయించింది. abkprasad2006@yahoo.co.in ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు -
జగన్ జైత్రయాత్రకు ఫలసిద్ధి!
ప్రజా సంకల్ప యాత్ర ద్వారా వేల కిలోమీటర్లు నడిచాడు జగన్. కోట్లాదిమంది ప్రజల్ని కలుసుకుని, వారి బాధలు తెలుసుకొని, తను చలించిపోయి, ప్రజాబాహుళ్యాన్ని చలింపజేశాడు. కనీవినీ ఎరుగని రీతిలో అసెంబ్లీ స్థానాలను గెలుచుకుని చరిత్ర సృష్టించాడు. తిరిగి అంతే చరిత్రను వినూత్న సంక్షేమ పథకాల ద్వారా తన సుపరిపాలనను మూలమూలకూ అందిస్తూ సృష్టిస్తున్నాడు. జగన్ విజయాన్ని చూడలేని, జగన్‌కు వస్తున్న ప్రజాదర ణకు ఓర్వలేని ప్రతిపక్ష నేత ఆయన ప్రభుత్వానికి ఎన్నో అడ్డంకులను కల్పించాడు. తప్పుడు ప్రచారాలు చేయించాడు. రాజధానుల విషయంలో అడ్డుపడ్డాడు. అయినా ప్రజాతీర్పు మరోసారి జగన్‌కు జైకొట్టింది. అసెంబ్లీ ఎన్నికలకు మించిన ఘన విజయాన్ని స్థానిక ఎన్నికలలో వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. ఇది వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన ధ్రువపత్రం. ఇది జగన్ పాలనకు జనం పెట్టిన కిరీటం. ‘ఒకే దెబ్బకు రెండు పిట్టలు రాలాయ’న్న సామెత ఎందుకు పుట్టిందోగానీ సరిగ్గా అదే పరిస్థితి నేడు ఆంధ్రప్రదేశ్‌లో సర్వత్రా నెలకొన్నది. ఈ పరిణామం రెండు విధా లుగా ఆవిష్కారమైంది. రాష్ట్రంలో యువకిశోరంగా అవతరించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ‘అవినీతి చక్రవర్తి’గా పేరు స్థిరపడిపోయిన ‘తెలుగుదేశం’ పార్టీ అధినేత చంద్రబాబునాయుడును తిరిగి తలెత్తు కోకుండా చేసింది. ఆ పార్టీని 23 స్థానాలకు కుదించివేసి 151 స్థానా లతో అప్రతిహతమైన మెజారిటీతో చరిత్రలో నిలిచిపోయింది. కాగా, ఆ దరిమిలా ఇటీవల కాలంలో ఇంకా జగన్ తొలి పాలనకు పట్టుమని రెండేళ్లు కూడా ముగియకముందే స్థానిక సంస్థల (పంచాయతీ, ముని సిపల్, కార్పొరేషన్) ఎన్నికలు ముమ్మరించాయి. ఫలించని జిత్తులు 2019 ఎన్నికల్లో మట్టికరిసిన తెదేపా నాయకుడు అంతకు ముందు ‘జక్కాయి బుక్కాయి’ని కలుపుకుని తెదేపా ప్రభుత్వాన్ని రాష్ట్రంలో వెలగబెట్టిన ‘తీరు’ దాచినా దాగని సత్యం. తన ప్రభుత్వం అస్తుబిస్తు మెజారిటీతో నడుస్తోందని బెంగపడిన బాబు తలపెట్టిన దుర్మార్గం– అసెంబ్లీ ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైఎస్సార్సీపీలోని 23 మంది ఎమ్మెల్యేలను సంతలోని పశువుల్లా కొనేసి తన ‘వాపును బలుపు’గా చూపేందుకు నానా తంటాలు పడటం! అయినా తీరా 2019 ఎన్ని కలు వచ్చేసరికి సరిగ్గా ఆ 23 మంది ‘సత్తరకాయలే’ సంఖ్యాపరంగా సరికొత్త అసెంబ్లీలో టీడీపీకి మిగిలిన మొత్తం సంఖ్యాబలం అయింది. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో తాజా స్థానిక ఎన్నికలను అవకాశంగా చూసుకుని తన హయాంలో బ్యూరోక్రాట్‌గా సేవలందించిన నిమ్మ గడ్డ రమేష్ కుమార్ అండదండలతో స్థానిక ఎన్నికల్లో ఫలితాలను తారుమారు చేయడానికి బాబు వినియోగించని తప్పుడు పద్ధతులు లేవు. ఆ బ్యూరోక్రాట్ ఆధారంగా ఎన్నో తప్పుడు మార్గాల ద్వారా న్యాయవ్యవస్థను కూడా పక్కదారులు పట్టించడానికి సవాలక్ష ‘చిట్కాలు’ బాబు పన్నాడు. నిజానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనే అధికారి, కేవలం అధికారేగానీ రాజకీయ పార్టీలకు లేదా పూర్వా శ్రమంలో పాలకులనుంచి లబ్ధి పొందినందుకు ‘ముదరాగా’ ప్రజా క్షేత్రంలో అఖండ విజయం సాధించిన పార్టీ ప్రభుత్వ నిర్వహణకు, దాని నిర్ణయాలకు అడుగడుగునా ఏదో ఒక మిషపై ‘మోకాలడ్డి’ ప్రతిపక్ష నాయకుడి ప్రయోజనాలకు లబ్ధి చేకూర్చడం ఆయన విధి కాదు. ఎన్నికల కమిషనర్లు స్వతంత్రంగా వ్యవహరించాలి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, గోవాలలో జరిగిన పరిణామాల దృష్ట్యా జస్టిస్ రోహిన్టన్ ఎఫ్ నారిమన్ అధ్యక్షతన ఉన్న త్రిసభ్య ధర్మాసనం, పక్కదారులు తొక్కే రాష్ట్రాల ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించి ‘మాడు పగిలిపోయే’ తీర్పుచెప్పింది (10–3–21). ‘రాజ్యాంగ ఆదేశం ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ పని నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోరాదని’ చెబుతూనే, అసలు రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లుగా నిరంకుశాధికారులను గాక, స్వతంత్రంగా వ్యవహరించే శక్తిగల వ్యక్తులను మాత్రమే నియమించాలని గోవా ప్రభుత్వ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశిం చవలసి వచ్చింది. ఇది పాలకులకు, బ్యూరోక్రాట్లకు మరవరాని హెచ్చరికే. ప్రభుత్వ బ్యూరో క్రాట్లను (ఉద్యోగులు) రాష్ట్రాల ఎలక్షన్ కమిషనర్లుగా నియమించడ మంటే అది ‘రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు చేయడమే’నని సుప్రీం ఘాటుగా అభివర్ణించింది. దేశవ్యాప్తంగానేగాక రాష్ట్రాలలో కూడా నియమించే ఎలక్షన్ కమిషనర్లు స్వతంత్ర వ్యక్తులుగా మాత్రమే ఉండాలని సుప్రీం ఆదేశించవలసి వచ్చింది. ఎవరైతే, ఎక్కడైతే ప్రభుత్వ అధికారులు (ఉద్యోగులు) ఎన్నికల కమిషనర్లుగా అదనపు చార్జీలో ఉంటున్నారో వారంతా ఆ పదవుల నుంచి తప్పుకోవాలని ధర్మాసనం ఆదేశించింది. ప్రభు త్వంలో బ్యూరోక్రాట్లుగా పనిచేస్తున్న వారు అదనపు చార్జ్‌గా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా వ్యవహరించడం ‘చిరాకెత్తించే’ వ్యవహారమని కూడా వ్యాఖ్యానించింది. ఈ సుప్రీం ఆదేశం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో బాబు హయాంలో బ్యూరోక్రాట్‌గా పనిచేసిన నిమ్మగడ్డ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా వ్యవహరించడానికి అనర్హుడని స్పష్టమవుతోంది. జీర్ణంకాని ఓటమి పరంపర అయినా, 2021 మార్చి 31తో ముగియనున్న నిమ్మగడ్డ పదవీ కాలా నికంటే ఎనిమిది మాసాల ముందునుంచీ చంద్రబాబు రహస్య మంతనాల ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు అఖండ మెజారిటీతో ఎన్నుకుని బాధ్యతలు అప్పగించిన జగన్ ప్రభుత్వానికి అడుగడు గునా అడ్డంకులు కలిగిస్తూ తప్పుడు నిర్ణయాలకు తెరలేపుతూ వచ్చారు. అయినా ప్రజా సంకల్ప పాదయాత్ర ద్వారా వేల కిలో మీటర్ల పర్యంతం శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా కోట్లాదిమంది ప్రజల్ని కలుసుకుని, వారి బాధలు, బాదరబందీలు, వారి ఇక్కట్లు, అవసరాలను స్వయంగా తెలుసుకుని, తను చలించిపోయి, ప్రజా బాహుళ్యాన్ని చలింపజేసిన జగన్ అసెంబ్లీ ఎన్నికలకు మించిన ఘన విజయాన్ని స్థానిక ఎన్నికలలో వ్యవస్థాపించగలిగారు. ఈ సంద ర్భంగా, రాష్ట్రంలోని మూడు ప్రాంతాల అభివృద్ధి మధ్య వివక్ష లేకుండా చేయడానికి పరిపాలనా వ్యవస్థను మూడు ప్రాంతాల మధ్య వికేంద్రీకరించడానికి జగన్ ఏ నాయకునికన్నా అత్యంత దూరదృష్టితో తీసుకున్న నిర్ణయానికి, ఆలస్యమైనా మూడు ప్రాంతాల ప్రజా బాహుళ్యం హర్షించి స్థానిక ఎన్నికల ద్వారా తిరుగులేని తీర్పు ప్రక టించారని మరవరాదు. ఇది ప్రతిపక్షాలకు ముఖ్యంగా ‘తెలుగు దేశం పార్టీ’కి, తమ ఉనికిని కాపాడుకో ప్రయత్నించిన బీజేపీ, జనసేన పార్టీలకు అసెంబ్లీ ఎన్నికల్లో పొందిన అవమానకర ఓటమికి మించి మరపురాని, మరవలేని ఓటమి పరంపర! సంస్కరణవాద ప్రభుత్వం ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి తన పాదయాత్రలో ప్రజాస్పం దనకు దీటుగా ‘నవరత్నాల’తో 90 వంతులు సంస్కరణలు ఆచరణ సాధ్యంచేసి ప్రజల మన్ననలు పొందుతున్నా బాబుకు చెవులు మూసుకుపోయాయి. ‘పీటీ మన్ను’ అంటి నేలకరచుకున్నా ప్రజా తీర్పును మన్నించలేకపోతున్నాడు. ఇప్పటికీ ఓటమిని భరించలేక పోతున్నాడు. తన పార్టీకి స్థానిక ఎన్నికల్లో కొమ్ములు విరిగి చెల్లాచెదు రైనా– ఏం చూసుకునోగానీ ‘మనం ఇదే స్ఫూర్తితో పనిచేస్తే విజయం మనదే’ననీ ముఖాముఖి ముచ్చటమాని టెక్నాలజీ ముసుగులో ‘ట్వీట్లు’ కొట్టుకుంటున్నాడు. ‘సమరం అంతా అయిపోయిన తర్వాత ఇక కొందరు వామపక్ష సోదరులు ఆచరణలో అమలులో ఉన్న సంక్షేమ పథకాల్ని ఎద్దేవా చేసినా ఎన్నికల అనంతరం మాత్రం ‘సంక్షేమ పథకాలే వైఎస్సార్సీపీని గెలిపించాయని కితాబివ్వడం విశేషం. ఎటుతిరిగీ టీడీపీ/బీజేపీ/జనసేనలు– ‘ఉన్న మద్దెల ఒకటే అయినా’ చేసేది లేక మూడు పార్టీలు సీట్లు మార్చుకుంటూ ‘చెరి కాసేపు వాయించుకోవడాని’కి అలవాటుపడ్డాయి. ఇక బాబు అంటారా, ‘ఓ’కు ఎన్ని వంకరలో అతని బుద్ధికీ అన్ని వంకరలు! కుక్క తోకను ఎవరైనా వంకర తీయగలరా? భూస్వామ్య–పెట్టుబడిదారీ కార్పొరేట్ వ్యవస్థల్లో కొన్ని పరిమితుల్లో పనిచేయవలసి వచ్చే ప్రజాస్వామ్య పక్షాలను, సంస్కరణవాద పక్షాలను కాపాడుకోక తప్పదు! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
వలసలు నిజం... వాదనలు అబద్ధం
మనుగడ కోసం పక్షులే వేల కిలోమీటర్లు ఎగురుతూ వెళ్లిపోతాయి. మరి మనుషులు మాత్రం ఉన్నచోటే ఎందుకుంటారు? స్వావలంబన కోసం ఉన్న ప్రాంతాన్ని వదిలి, కొండలు, కోనలు, పర్వతాలు, సముద్రాలు దాటి కొత్త ఖండాలకు వెళ్లి నివాసాలు ఏర్పరుచుకున్నారు. చారిత్రక పరిణామ క్రమంలో వలసలు అనివార్యం. ఈ క్రమంలో జాతులు సంపర్కం చెందాయి. సమాజాలు కలగలిసిపోయాయి. ఈ రోజు ఆర్య రక్తం, అనార్య రక్తం అనేది వేరుచేయగలిగేది కాదు. అయినా కొన్ని రాజకీయ శక్తులు కులాలను, మతాలను, జాతులను తమ స్వార్థం కోసం, అధికారం కోసం విడదీసే ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. వాటిని తిప్పికొట్టడానికి శాస్త్రీయమైన పరిశోధనలు, ఆ పరిశోధనల ఆధారంగా రాసిన పుస్తకాలే ఆయుధాలు. ‘‘చారిత్రక విభాత సంధ్యల మానవ కథ వికాసమెట్టిది?’’ ఈ ప్రశ్నలో సంధించిన మానవకథ- ప్రకృతి కథే! పశుపక్ష్యాదులు, శిల్పం, సాహిత్యం, శాస్త్రం, వైజ్ఞానిక శాస్త్రం, కవిత్వం, నాట్యం, అన్నీ ప్రకృతి జననంతో ముడిపడి ఉన్నవే. అవి మానవుడి ద్వారా వివిధ రూపాలలో వ్యక్తమవుతూ ఉంటాయి. విశ్రాంత సాంకేతిక నిపుణులు, భౌతికవాది, పరిణామవాద, వైజ్ఞానిక శాస్త్రాంశాల పరిశోధనలో తలమునకలుగా ఉన్న మర్ల విజయకుమార్ తాజాగా వెలువరించిన ‘భారతీయుల (చారిత్రక, సాంస్కృతిక, జన్యు) మూలాలు’ అన్న గ్రంథం (పీకాక్ క్లాసిక్స్) నేటి తరాలకు ఒక అమూల్య రచన. ‘ఓల్గా నుంచి గంగా’ నదీ తీరందాకా మధ్యాసియా ఇరానియన్ సాంస్కృతిక పూర్వ రంగం నుంచి ఆసియా ఖండంలో సాగిన మానవ వలసల గురించి అత్యంత విలువైన సమాచారంతో కూడిన వైజ్ఞానిక పరిశోధనా గ్రంథాన్ని కథల రూపంలో మహాపండితుడు, బౌద్ధ దార్శనికుడు, ముప్పయ్ భాషలు తెలిసిన విజ్ఞానవేత్త రాహుల్ సాంకృత్యా యన్ అందించారు. ఆ తర్వాత తొలి తరం సుప్రసిద్ధ భారతీయ చరిత్రకారులలో అగ్రగణ్యులైన ప్రొఫెసర్ డీడీ కోశాంబి, దేవీప్రసాద్ ఛటోపాధ్యాయ, ఆ తరువాతి తరం చరిత్రకారులలో సుప్రసిద్ధులైన డీఎన్ ఝూ, ఇర్ఫాన్ హబీబ్‌లు కూడా దక్షిణాసియా నుంచి మన దేశం లోకి ఉధృతంగా సాగిన మానవ వలసల గురించి, విభిన్న జాతులు, తెగల గురించి విస్తారంగా ప్రస్తావించడం జరిగింది. రాహుల్జీ ఒక సందర్భంలో పేర్కొన్నట్టు ‘పక్షి సంతానం కంటే, మానవ సంతానానికి ఈ ప్రపంచంలో బతకడానికి సాధనాలు, అవకాశాలు కూడా ఎక్కు వన్న విషయాన్ని చాలామంది మరిచిపోతారు’’. సరిహద్దులు ఎరుగని జగజ్జనులు మనకు తెలుసు, ఆంధ్రలో కొల్లేరు సరస్సుకు, పులికాట్ సరస్సుకు వచ్చే పక్షులన్నీ సైబీరియా (రష్యా) నుంచి వచ్చి రుతువును బట్టి సేద తీర్చుకుంటుంటాయి. లాల్సర్ పక్షులు అలా చలికాలంలో వచ్చి వేసవి వస్తుందనగానే ఏప్రిల్‌లో హిమాలయాలవైపు వెళ్లి పోతాయి. ఇలా తమకు బొత్తిగా తెలియని దూర తీర ప్రాంతాలకు పక్షులు, వాటి పిల్లలకు ఎగిరివెళ్లి, వాలి తమ జీవనాన్ని గడుపుకోగల శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అది స్వావలంబన వల్లనే అనివార్యమవుతుంది. ఇలా పశుపక్ష్యాదులే స్వావలంబన ద్వారా తమ జీవితాలకు మెరుగు పెట్టుకుంటుండగా మానవ సంతానం ఇంకెలా ఉండాలి? అని మహా పండిత రాహుల్ సాంకృత్యాయన్ తన ‘లోక సంచారి’ గ్రంథంలో ప్రస్తావించాడు. అలాంటివే సప్తఖండాలలోనూ జరిగాయి. ఒక చోటు నుంచి, ప్రాంతం నుంచి, దేశాల నుంచి, ఖండాంతరాల నుంచి ‘సరిహద్దులు ఎరుగని జగజ్జనులు’ చారిత్రక పరిణామ క్రమంలో కొండలు, కోనలు, పర్వతాలు, సముద్రాలు దాటి తమ అవసరాల కొద్దీ కొత్త ప్రాంతాలకు వెళ్లి స్థిర నివాసాలు ఏర్పర్చుకున్నారు. వలసలు వచ్చి స్థిరపడిన జనాల మధ్య పనిగట్టుకుని కుల, మత వివక్షలు రేపుకోవడం కన్నా భుక్తి గడుపుకోవడానికి, ఉనికిని కాపాడుకోవడానికే సమయమంతా సరిపోయింది. జనపదాల కదలికలు మారాయి, అలవాట్లకు పెట్టే పేర్లూ మారాయి. సమాజం పరిణామం చెందుతున్నకొద్దీ భక్ష్య పదార్థమైన ‘సూపా’న్ని ప్రాచీనులు మాంసానికి వాడితే, దాన్నే తరువాతి కాలాల్లో శ్రోత్రియ కుటుంబాలు ‘కందిపప్పు’ని సూపంగా చెప్పసాగాయి. నేటికి రెండులక్షల సంవత్సరాల నాటికే పాత తరాల యుగపు మాన వుడు అడవుల్లో నివసిస్తూ వేట, ఆహారసేకరణ ఆధారంగా జీవించ సాగారు. మానవ జాతికి పుట్టిల్లు తూర్పు ఆఫ్రికా అని అనేక మానవ జన్యుకణాల పరిశోధనల ద్వారా శాస్త్రవేత్తలు నిరూపించారని మర్ల విజయకుమార్ పేర్కొన్నారు. మానవ నివాసానికి అనుకూలం గాని ప్రాంతాల నుంచి అను కూలమైన ప్రాంతాలకు మానవ వలసలు ఎందుకు సాగాయో సోదాహరణంగా వివరించారు. ఈ మానవ వలసల్లో భాగంగానే చరిత్రలో ఆదిమ జాతులుగా పేర్కొన్న మానవులు లక్ష ఏళ్ల నాటికే ఆఫ్రికా నుంచి వచ్చి వాతా వరణం కాస్త వేడిగా ఉన్న హిమాలయ పర్వతాలకు చేరుకున్నారు. వాతావరణం ప్రభావం రంగును, ముఖ కవలికల్ని కూడా మార్చేశాయి. సింధు అయ్యింది హిందూ... అలాగే భారతదేశంలో కొందరు మతాభిమానులు దేశ నాగరికతను మత ప్రాతిపదికపై విభజించి చూపేందుకుగాను సింధు నాగరికతను ‘హిందూ’ నాగరికతగా చిత్రించడానికి చేస్తూ వచ్చిన ప్రయత్నాన్ని ఈ గ్రంథకర్త తిప్పికొట్టారు. ఎందుకంటే భారతదేశంతో సంపర్కం కల్గిన పర్షియన్లకు చారిత్రక మొహెంజదారో–హరప్పా నాగరికతలకు ఆల వాలంగా ఉన్న సింధు నదీలోయ ప్రాంతాన్ని... ‘స’కారాన్ని అదే అక్షరంతో పలకడం రానందున, దాన్ని ‘హ’కారంగా మార్చుకుని ‘సింధు’ను ‘హిందు’గా ఉచ్చరించుతూ రావడంవల్ల ఈ గందరగోళం ఏర్పడిందని గుర్తించాలి. ఉచ్చారణలో ఒక్క ‘అక్షరం’ మార్పిడివల్ల భారతదేశంలోని ఛాందస వర్గాలు కొందరు మొత్తం దేశ ఐక్యతకు, మత సామరస్యానికి, లౌకిక వ్యవస్థకు ఎంత చేటు కల్గిస్తూ వచ్చారో చరిత్ర చెబుతోంది. వాడికి ‘స’ అక్షరం నోరు తిరగలేదు కాబట్టి మన ఛాందసులు ‘వికార’ పోకడలు ఎందుకు పోవాలి? మూలాలను నిర్ధారించే పరిశోధన జన్యు విజ్ఞాన పరిశోధనలకు చరిత్ర పఠనంలో ఎంత విలువుందో తెలుసుకోవాలంటే ఇటీవల కాలంలో వెలుగు చూసిన ఒక గొప్ప సత్య నిరూపణను పాఠకుల ప్రయోజనార్థం ఇక్కడ ఉదహరించదలిచాను. ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ మాజీ డైరెక్టర్ జనరల్, బౌద్ధ పరిశోధకులు ఆంజనేయ రెడ్డి కుటుంబం తాలూకు జన్యు లక్షణాల పుట్టుపూర్వాలు, వారి కుటుంబ పూర్వీకులు ఎక్కడి నుంచి తెలుగుదేశానికి ఊడిపడి స్థిరపడ్డారన్న యావత్తు తబిశీళ్లు ఒక ‘జినోగ్రాఫిక్’ ప్రాజెక్టు ద్వారా బయటపడ్డాయి. ఈ ప్రాజెక్టును ప్రపంచ ప్రఖ్యాత పత్రిక ‘నేషనల్ జాగ్రఫిక్’ (ఐబీఎం) నిర్వహించింది. ఆంజనేయరెడ్డి ‘పుట్టెంట్రుకల’ తబిశీళ్లు బయటికి లాగిన ఈ ప్రాజెక్టు ఆ కుటుంబ జన్యుకణాల పూర్వాపరాలను డీఎన్ఏ పరీక్ష ద్వారా వెల్లడించింది. అంజనేయరెడ్డి క్రోమోజోమ్ ‘వై’గా నిర్ధారణ చేసి, దాన్ని హాప్లోగ్రూప్–ఎల్గా గుర్తించింది. 60,000 సంవత్సరాల క్రితం వీరంతా ఆఫ్రికనేతరులుగా నిర్ధారించారు. ఈరోజున దక్షిణ భారతంలో నివసించే వారిలో నూటికి 50 మందికి పైగా ఈ ‘హాప్లో’ గ్రూపుకు చెందినవారేనని తేల్చారు. ఆంజనేయులు పూర్వీకులలో తొలితరం పూర్వీకుడు 50 వేల ఏళ్ల క్రితంవాడని కూడా నిర్ధారించారు. ఆ పూర్వీకుడికి సంకేతం ‘ఎం– 168’గా నిర్ణయించారు. వీరంతా ఒకప్పటి ఆఫ్రికా వాసులుగా, వీరికి సంబంధించిన నిర్దిష్టమైన గుర్తులుగా రాతి పనిముట్లను గుర్తించడం విశేషం. ఈశాన్య ఆఫ్రికాలోని రిఫ్ట్ లోయలో (ఈనాటి ఇథియో పియా/కెన్యా/టాంజానియా ప్రాంతం) 31,000 నుంచి 79,000 సంవత్సరాల క్రితం ఆంజనేయులు పూర్వీకులు ఉండి ఉండవచ్చునని నిర్ధారించారు. వేదాలలో సర్వజ్ఞానం పొందుపర్చబడి ఉందని, ఈ ‘అపార విజ్ఞానాన్ని’ పాశ్చాత్యులు దొంగలించి తమ శాస్త్ర పరిజ్ఞానాన్ని పెంచుకున్నారని కొందరు పండితులనుకునేవారు ప్రకటనలు చేశారు. విజయకుమార్ అన్నట్టు కుల చట్రంలో ప్రజలను బందీలు చేసి వారిని దోపిడీకి గురి చేసినందున, దానికి మతం రంగు పూసి, తమ ఆర్థిక సామాజిక దోపిడీని కొనసాగించడమే దీనికి కారణం. నేడు కల్తీలేని ఆర్యజాతిగానీ, అనార్య జాతులు గానీ లేవు. కాల క్రమంలో జాతుల మధ్యన జన్యు మిశ్రమం జరిగిపోయింది గనుక. ఆ మాటకొస్తే చరిత్ర, సంస్కృతి విషయంలో భారత ప్రజల్లో అత్యధికులు అనార్య మూలాలు కలిగినవారే సుమా! కనుకనే భావ విప్లవానికి మతం, మూఢ విశ్వాసాలు ప్రధాన అడ్డంకి అని రాహుల్జీ హెచ్చరించి ఉంటాడు. మరి ఈ అడ్డంకిని తొలగించాలంటే ఏం కావాలన్నాడు శ్రీశ్రీ? ‘‘కదిలేదీ కదిలించేదీ/మారేదీ మార్పించేదీ/పాడేదీ పాడిం చేదీ/మునుముందుకు సాగించేది/పరిపూర్ణపు బ్రతుకిచ్చేదీ...’’! ఏబీకే ప్రసాద్ abkprasad2006@yahoo.co.in -
బలిపీఠంపై ‘విశాఖ ఉక్కు’!
క్రీస్తుపూర్వం 1800 నాటికే మధ్య గంగానదీ లోయలో ముడి ఇనుము నిల్వలు ఉన్నాయి. వాటి సాయంతోనే లోహాల ఉత్పత్తికి భారతదేశంలో అంకురార్పణ జరిగింది. అత్యంత నాణ్యమైన ఉక్కు దక్షిణ భారతం నుంచే ప్రాచీన యూరప్, చైనా, అరబ్, మధ్య ఆసియాలకు ఎగుమతి కావడం చరిత్ర. పరిశ్రమ సాధనలో, ఆంధ్రులంతా ఒక్కటై సాగడంలో మళ్లీ అంతటి చరిత్ర కలిగిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్‌పరం చేయడానికి కేంద్రం సిద్ధమైంది. పబ్లిక్‌రంగ పరిశ్రమల్లో తలమానికమైన ‘విశాఖ ఉక్కు’ను ప్రైవేట్ వ్యక్తుల లాభాల పెరపెరకు బలిపెట్టడం దారుణం. ఒకవైపు ఆత్మ నిర్భర భారత్ నినాదం ఇస్తూనే, ఆంధ్రుల ఆత్మాభిమానానికి ప్రతీకగా నిలిచిన విశాఖ స్టీలును ప్రైవేట్‌పరం చేయబూనుకోవడం శోచనీయం. ‘‘1750 నాటికి ప్రపంచ ఉత్పత్తుల రంగంలో మూడింట ఒక వంతు స్థానం చైనాది కాగా, ఇండియాది నాల్గింట ఒక వంతు స్థానం. మొత్తం పశ్చిమ దేశాలన్నీ కలిపి చేసిన ఉత్పత్తులు అయిదోవంతు కన్నా మించలేదు. ఆ తరువాత దశాబ్దాలలో పశ్చిమ దేశాల పారిశ్రామికీకరణ విధానంవల్ల మాత్రమే మిగతా ప్రపంచ దేశాలను పారిశ్రామికీకరణలో వెనక్కి నెట్ట గలిగాయి. అంతవరకూ ప్రపంచంలో మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో అగ్రస్థానం చైనా, ఇండియాలదేనని మరవరాదు’’. – శామ్యూల్ హటింగ్టన్: ‘క్లాష్ ఆఫ్ సివిలైజేషన్స్’ ప్రాచీన చరిత్రలు గల భారత్, చైనా వేల ఏళ్ల చరిత్ర కలిగిన మొహం జదారో, హరప్పా నాగరికతల కాలంలోనే ముడి ఇనుము, ఉక్కు ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందాయని పలువురు పాశ్చాత్య, భారత చరిత్ర కారులు, శాస్త్రీయ నాగరికతల సుప్రసిద్ధ చరిత్రకారుడైన ప్రొఫెసర్ నీడ్‌హామ్ పేర్కొన్నాడు. ఈ కోణం నుంచి పరిశీలించినప్పుడు, ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’గా చాటి, పట్టువీడని అభినవ ‘భట్టిమార్కులు’గా ప్రభుత్వ రంగంలో ఆంధ్రులు సాధించుకున్న ప్రసిద్ధ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్రంలోని బీజేపీ పాలకులు ఒక్క కలంపోటుతో ప్రైవేటీకరించడానికి చడీచప్పుడు లేకుండా సిద్ధమ య్యారు. పైగా కేంద్రం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ (2021–22) ప్రతి పాదనల్లోగానీ, అంతకుముందు ఆర్థిక సర్వేక్షణ సమీక్షలోగానీ సూచన మాత్రంగా కూడా దీని ప్రస్తావన లేకుండా ‘కూబీ’తనంతో అకస్మా త్తుగా ప్రభుత్వ రంగ ‘విశాఖ స్టీల్’ను ప్రైవేట్ కంపెనీకి ధారాదత్తం చేస్తూ కేంద్రం ప్రకటన చేసింది. వేలాదిమంది ప్రత్యక్ష ఉపాధికి, మరి కొన్ని వేలమంది పరోక్ష ఉపాధి కల్పనకు చేయూతనందివ్వడమేగాక పబ్లిక్‌రంగ పరిశ్రమల్లో మధ్యలో కొన్ని సమస్యలు ఎదురైనా 2019 దాకా తలమానికంగా ఎదుగుతూ వచ్చిన ‘విశాఖ ఉక్కు’ను ప్రైవేట్ వ్యక్తుల లాభాల పెరపెరకు బలిపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. ఉక్కు కర్మాగార సాధనకు వైశాఖీయులు సహా యావదాంధ్ర ప్రజలు ఉద్యమించారు. కర్మాగార సాధన యాత్రలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలకు 32 మంది నిండు ప్రాణాలు బల య్యాయి. పరిశ్రమ సాధనకు సారథ్యం వహించినవారిలో హేమా హేమీ రాజకీయవేత్తలు, ప్రజోద్యమాలలో తలపండిన తెన్నేటి విశ్వ నాథం, గౌతు లచ్చన్న, కాళోజీ నారాయణరావు, పరకాల శేషావ తారం, చాగంటి రామకృష్ణ, ముప్పవరపు వెంకయ్యనాయుడు వగైరా రాష్ట్ర, స్థానిక నాయకులెందరో ఉన్నారు. అది రక్తతర్పణతో కూడిన చరిత్ర. ప్రజల మనోభావాలను కుల, మతాల పేరుతో రెచ్చగొట్టి, పబ్బం గడుపుకునే సంస్థలు, రాజకీయ పక్షాలకు భిన్నంగా ఉపాధి అన్వేషణ కోసం సాగిన మహోద్యమం అది. ప్రజల మనోభావాలతో నిమిత్తంలేని స్వార్థపూరిత ఎన్నికల ప్రయోజనాల కోసం రూపొందించే రాజకీయ బడ్జెట్లు కేవలం ప్రైవేట్ రంగ ప్రయోజనాలకే ఉపయోగపడతాయి. ఒకవైపున కేంద్రం వద్ద స్టీల్ అథారిటీ ఆధ్వర్యంలో 200 ఏళ్లకు సరిపడా ముడి ఇనుము నిల్వలు మూలుగుతున్న సమయంలో అదే ముడి ఇనుము అవసర మున్న విశాఖ ఉక్కు కర్మాగారానికి ఆ నిల్వలనుంచి ముడి ఖనిజాన్ని తరలించి ఆదుకోవచ్చుగదా? ఆ ధర్మాన్ని నిర్వర్తించకుండా కేంద్రం, ప్రపంచబ్యాంక్ ప్రపంచీకరణ విధానంలో భాగంగా ప్రైవేట్ రంగ ప్రయోజనాల రక్షణ పథకాన్ని తు.చ. తప్పకుండా అనుసరిస్తోంది. అంతా మళ్లీ ప్రధాని మోదీ భాషలో ‘స్వయంపోషక ఆర్థిక వ్యవస్థ’ (ఆత్మ నిర్భర భారత్) నిర్మాణ నినాదం ముసుగులోనే చాపకింద నీరులా ప్రభుత్వరంగ సంస్థలు కనుమరుగవుతున్న దశ ఇది. ఈ విషయంలో తెలుగువారి తొలి ‘నష్టజాతకుడు’ చంద్రబాబు నాయుడు పాలనలోనే 2015లో విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేట్‌పరం చేయడానికి కుట్ర జరిగిందని మరచిపోరాదు. అయినా బైలదిల్లా గనుల నుంచి ఎక్కువ ధర పెట్టి వైశాఖీయులు ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఆ అకుంఠిత దీక్ష కారణంగానే ఉక్కు ఫ్యాక్టరీ నిలబడుతూ, నిలబడుతూ 2019 నాటికి లాభాలలోకి కూడా వెళ్లినట్లు దాఖలాలున్నాయి. చంద్రబాబు తలపెట్టిన ప్రైవేటీకరణ మైకంలోకి ‘విశాఖ స్టీల్’ కన్నా ముందు హైదరాబాద్‌లోని ఆల్విన్ కర్మాగారం, నిజామాబాద్‌లోని ప్రసిద్ధ చక్కెర ఫ్యాక్టరీలను కూడా నెట్టాడు. బాబులోని ఈ ‘ఆత్రం’, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్... విశాఖ స్టీల్‌పై కేంద్రవైఖరితో విభేదిస్తూ కర్మాగార రక్షణకు, ఉద్యోగుల ఉపాధి రక్షణకు వీలైన క్రియాశీల ఆచరణాత్మక పథకాన్ని ప్రత్యామ్నా యంగా చూపేదాకా ఆగలేదు. నేడు మనదేశంలో రెండు రకాల ఉక్కు కర్మాగారాలున్నాయి– చిన్న ఫ్యాక్టరీలు, సంఘటిత(ఇంటిగ్రేటెడ్) కర్మాగారాలు. దేశంలో మొత్తం 50 ఇనుము, ఉక్కు ఉత్పత్తి పరిశ్రమలున్నాయి. ఇక కేంద్ర స్టీల్ అథారిటీ ఆధ్వర్యంలో ఉన్న ఉక్కు కర్మాగారాలు: దుర్గాపూర్, ఛత్తీస్ గఢ్, బొకారో, చంద్రాపూర్, హజీరా, నిప్పాన్, ఛత్రపతి, విశాఖ, హోస్పేట్, తారాపూర్, ధరంతార్, కళింగనగర్. ఇంతకూ అసలు విచిత్రం– 2005లో ప్రపంచస్థాయి స్టీల్ స్థాయి నాణ్యత, సామర్థ్యాన్ని పాటించే ప్రమాణంలో ఉక్కు ఉత్పత్తి చేయాలని ప్రకటించడం; 2019–20 నాటికి ఏడాదికి 3 కోట్ల 80 లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తి చేయాలని నిర్ణయించడం. అయితే 2017లో బీజేపీ పాలకులు జాతీయ స్థాయిలో ఉక్కు ఉత్పత్తికి విధాన నిర్ణయం తీసుకున్నారు. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరంగానే స్టీల్ ప్రొడక్షన్ పాలసీ ఉండాలని నిర్ణయించారు. దీనికి చెప్పిన కారణం ఏమిటి? ఉక్కు పరిశ్రమలు భారీ అప్పుల్లో ఉన్నాయి; ఉక్కు గిరాకీ తగ్గిపోయింది; లోహ పరిశ్రమ లకు ఉపయోగించే కోల్ నాణ్యత పడిపోయింది; ఉత్పత్తి ఖర్చులు పెరిగాయి; చైనా, కొరియాల నుంచి చౌకరకం దిగుమతులు వస్తు న్నాయి; ఇవి భారతదేశానికీ ఉక్కు ఉత్పత్తిదార్లకూ సంతృప్తిగా లేవు. నిజానికి ఉక్కు ఉత్పత్తిలో స్వయం పోషకంగా ఉండాలని; ప్రపంచస్థాయిలో గట్టి పోటీ యివ్వాలని; ఇందుకోసం ఉక్కు కర్మా గారాలకి అవసరమైన కోకింగ్ బొగ్గు లాంటి ముడిపదార్థాల్ని తక్కువ రేటుకి దిగుమతి చేసుకోవాలని; ఎక్కువ ఉత్పత్తి ఖర్చుల భారం పడకుండా ఉండాలంటే– ‘సాగరమాల’ పేరుతో సముద్రతీరం వెంట ఉక్కు పరిశ్రమలను నెలకొల్పాలని కూడా ఓ విధాన నిర్ణయం చేసింది ప్రభుత్వం. మరి ఇందుకు విరుద్ధంగా ప్రభుత్వ రంగ ఉక్కు ఫ్యాక్టరీ లను ప్రభుత్వరంగం నుంచి తప్పించి ప్రైవేట్ రంగానికి ఎందుకు ధారాదత్తం చేయాల్సి వస్తోంది? ఈ రోజున పాలకులు తమవద్ద 200 ఏళ్లకు సరిపడా ముడి ఇనుము నిధులున్నాయని గొప్పలు చెప్పుకొం టున్నా, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు అక్కరకు రాని ఆ నిధులు దేనికి? ప్రైవేట్‌కు కుదువపెట్టడానికా? అంటే, ఉక్కు ఉత్పత్తులకు కావలసిన ముడి ఇనుము నిధులయితే ఉన్నాయిగానీ అవి ప్రభుత్వరంగ కర్మగా రాలకు మాత్రం మళ్లించరా? పరిశ్రమ నడవడానికి యిచ్చే ప్రభుత్వ రుణాలను పరిశ్రమలో పెట్టిన ఈక్విటీగా మళ్లించి ప్రభుత్వం ఎందుకు రక్షణగా నిలబడకూడదు? క్రీస్తుపూర్వం 1800 నాటికే మధ్య గంగానదీ లోయలో ముడి ఇనుము నిల్వలు ఉన్నట్టు, వాటి సాయంతోనే లోహాల ఉత్పత్తికి భారతదేశంలో అంకురార్పణ జరిగినట్టు ప్రసిద్ధ భారత పురాతత్వ శాస్త్రవేత్తలు రాకేష్ రెడ్డి, అదితి వేణుగోపాల్ వెల్లడించారు. ఆమాట కొస్తే అత్యంత నాణ్యమైన ఉక్కు (ఊజ్ స్టీల్) దక్షిణ భారతం నుంచే ప్రాచీన యూరప్, చైనా, అరబ్, మధ్య ఆసియాలకు ఎగుమతి కావడం ఒక చారిత్రక సత్యం! ఇంతకూ ఆంధ్రోద్యమ కార్యకర్తల్లో ఒకరుగా ఉన్న మన భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ‘ఆంధ్రుల హక్కు’ కోసం తన పదవీ త్యాగానికైనా సిద్ధపడగలరా? ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
సమానత్వ సాధన మరిచిన బడ్జెట్
ఆదాయాల్లో అసమానతలను కనిష్ట స్థాయికి తగ్గించి వేయాలని, హోదాలో అసమానతలు తొలగించి, ప్రతిపత్తిలో తగిన సానుకూల సౌకర్యాలు, అవకాశాలు కల్పించాలని, ఇవి వ్యక్తుల స్థాయిలోనే కాక వివిధ ప్రాంతాల్లో నివసించే ప్రజలమధ్య, వివిధ వ్యాపకాల్లో ఉన్న ప్రజల మధ్య ప్రోత్సహించాలని ఆదేశిక సూత్రాల స్పష్టమైన ఆదేశం. అంతేగాదు, స్త్రీపురుషుల మధ్య వివక్ష లేకుండా జీవించడానికి తగిన అవకాశాలను, భృతిని కల్పించి తీరాలని, కొద్దిమంది వ్యక్తుల వద్ద సంపద కేంద్రీకరణ జరగకూడదని, ప్రజలందరి ప్రయోజనాలకు విరుద్ధంగా ఉత్పత్తి సాధనాలు కొద్దిమంది వద్ద పోగుపడరాదనీ భారత రాజ్యాంగంలోని 39వ అధికరణ హెచ్చరించింది. ఈ దృష్ట్యా చూసినపుడు మోదీ ఎనిమిదవ వార్షిక బడ్జెట్ ఈ ప్రకటిత రాజ్యాంగ చట్ట నిబంధనలకు క్రమేణా విరుద్ధ స్వభావంతో అవతరించినట్టు భావించవలసి వస్తోంది. ‘‘భారత ద్రవ్య వ్యవస్థలోని వైఫల్యాల ప్రమాదం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించాలంటే భారత బ్యాంకులు, తదితర పబ్లిక్ రంగ సంస్థలపైన ప్రభుత్వ నిత్య నియంత్రణను పెందలాడే తొలగించేయాలి. అసమా నతలను తొలగించడంపై కేంద్రీకరణకన్నా ఆర్థికాభివృద్ధి సాధనపైనే కేంద్రీకరిం చాలి. ప్రభుత్వ నియంత్రణ వల్ల ద్రవ్య వ్యవస్థా రంగం పలు వైఫల్యాలకు గుర వుతూ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తోంది’’. – 2021 ఆర్థిక సర్వేక్షణ (30–01–2021) ఇంతకూ అసలు విశేషమేమంటే.. కోవిడ్–19 మహమ్మారి రాకముందు నుంచి పాలకులు ఊదరబెట్టి అదరగొడుతున్న ‘స్వయంపోషక ఆర్థిక వ్యవస్థ’ (ఆత్మనిర్భర్ భారత్), ‘అందరికోసం అందరి వికాసం’ (సబ్ కీ సాత్, సబ్ కీ వికాస్) అన్న పాలకుల నినాదాల వెనుక అసలు రహస్యం ఏమిటో తేటతెల్లమై పోయింది. పబ్లిక్‌రంగ సంస్థల్ని ప్రభుత్వ నియంత్రణ వ్యవస్థ నుంచి పెందలాడే తప్పించి ప్రైవేట్‌రంగ బడా గుత్త పెట్టుబడి వర్గాలకే ధారాదత్తం చేయాలన్న పాలకవర్గాల నిశ్చితాభిప్రాయాన్ని ప్రభుత్వ తాజా ఆర్థిక సర్వేక్షణ బాహాటంగానే ప్రకటించింది. భారత ప్రజలమైన మేము మాకు మేముగా ఈ రాజ్యాంగాన్ని అంకితం చేసుకుంటున్నామన్న ప్రకటిత లక్ష్యానికి, ఆ ప్రకటన ఆధారంగానే రూపొందించుకున్న గణతంత్ర రాజ్యాంగం నిర్దేశించిన పౌరుల జీవించే ప్రాథ మిక హక్కులకూ కట్టుబడే బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఆచరణలో వారి ఆర్థిక స్వాతంత్య్రానికి భరోసా ఇస్తూ అక్షర సత్యంగా దేశంలోని బడుగు, బలహీన వర్గాల, పేద ప్రజా బాహుళ్యానికి వర్తించే ఆదేశిక సూత్రాలను 37, 25, 39వ రాజ్యాంగ అధికరణలుగా స్పష్టంగా పేర్కొంది. ఈ ఆదేశిక సూత్రాలు, పౌరులు హుందాగా బతికే, ఆర్థిక స్వాతంత్య్రంపై హామీపడ్డాయని మరచిపోరాదు. ఈ ప్రకటిత సూత్రాల లక్ష్యమే సంక్షేమ రాజ్య స్థాపన. ఆ సంక్షే మాన్ని పేదసాదలకు ఆచరణలో దక్కేలా చూసే బాధ్యతను రాజ్యాంగ అధికర ణలు స్పష్టం చేశాయి. వీటి ప్రకారం పౌరులు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం విధిగా పొంద డానికి అర్హులని ఆదేశిక సూత్రాలు విస్పష్టంగానే పేర్కొన్నాయి. ఆదాయాల్లో అసమానతలను కనిష్ట స్థాయికి తగ్గించి వేయాలని, హోదాలో అసమానతలు తొలగించి, ప్రతిపత్తిలో తగిన సానుకూల సౌకర్యాలు, అవకాశాలు కల్పించాలని, ఇవి వ్యక్తుల స్థాయిలోనే కాక, వివిధ ప్రాంతాల్లో నివసించే ప్రజలమధ్య, వివిధ వ్యాపకాల్లో ఉన్న ప్రజలమధ్యా ప్రోత్సహించాలని ఆదేశిక సూత్రాల స్పష్టమైన ఆదేశం. అంతేగాదు, స్త్రీ పురుషుల మధ్య వివక్షత లేకుండా జీవించడానికి తగిన అవకాశాలను, భృతిని కల్పించి తీరాలని ప్రజలం దరి ప్రయోజనాలకు విరుద్ధంగా ఉత్పత్తి సాధనాలు కొద్దిమంది వద్ద పోగుపడ రాదనీ 39వ అధికరణ హెచ్చరించింది. ఈ దృష్ట్యా చూసినపుడు మోదీ 8వ వార్షిక బడ్జెట్ ఈ ప్రకటిత రాజ్యాంగ చట్ట నిబంధనలకు క్రమేణా విరుద్ధ స్వభావంతో అవతరించినట్టు భావించవలసి వస్తోంది. అధికారానికి వచ్చినప్పటినుంచీ మోదీ ప్రభుత్వం, ‘మేకిన్ ఇండియా’ నినాదం ద్వారా హోరెత్తిస్తున్న ‘భారతదేశంలోనే తయారీ’ అంటే, ఆ ఉత్పత్తుల్ని మన దేశీయులే తయారు చేయాలనా లేక మన తరఫున విదేశీ పెట్టుబడిదారులు ఇండియాలో ప్రవేశించి తయారు చేయాలనా? ఆ స్లోగన్‌లో ఉన్న ‘అస్పష్టత’ ఇప్పటికీ తొలగలేదు కాబట్టే బ్యాంకులు సహా మొత్తం దేశీయ ప్రభుత్వరంగ పరిశ్రమలే ఒక్కటొక్కటిగా విదేశీ గుత్త పెట్టుబడులకు జీహుకుం అనవలసిన స్థితికి పాలక విధానాలు చేరుకున్నాయి. ఒకవైపున కోవిడ్–19 వల్ల గత ఏడాదిగా పారిశ్రామిక, వ్యావసాయిక తదితర ఉపాధి రంగాలలో ఏర్పడిన మాంద్యం నేపథ్యంలో జీఎస్టీ పేరిట రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని కొల్లగొట్టి ఫెడరల్ వ్యవస్థ లక్ష్యానికి కేంద్ర పాలకులు చేటు తెచ్చారు. గత ఏడాది ప్రభుత్వ ఆర్థిక సర్వేక్షణ అభివృద్ధి శాతం ఈ ఏడాది 6 శాతం ఉంటుందని అంచనా వేస్తే అది కాస్తా మైనస్ 7.7 శాతానికి దిగజారిపోయింది. వరల్డ్ బ్యాంక్ ప్రజా వ్యతిరేక ఆర్థిక సంస్కరణల్ని ముందుకు తీసుకెళ్లడంలో ఉద్దండపిండంగా సేవలందించిన ఆర్థిక నిపుణుడు అరవింద్ పనగారియా అడ్డూ అదుపూ లేని స్వేచ్ఛావాణిజ్య ప్రచారకుడు. ఆయన్ని తీసు కొచ్చి మోదీ మొట్ట మొదటి నీతిఆయోగ్ వ్యవస్థకు అధిపతిని చేశారు. కొద్ది కాలం ఉండి ఆయన అక్కడి నుంచి ఉడాయించారు. అలాగే ఆయన తర్వాత అదే ఆయోగ్ నుంచి మరి ఇద్దరు కూడా తప్పుకున్నారు. ఇక అంతకుముందే రిజర్వ్ బ్యాంక్ అధిపతిగా పనిచేసిన సుప్రసిద్ధ ఆర్థికవేత్త రఘురామరాజన్ మోదీ ప్రభుత్వంతో వేగలేక అమెరికా యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా వెళ్లారు. ఇక ఇప్పుడు ఆఖరి అంకుశంగా మోదీ ప్రయోగించిన ఆయుధం ఏమిటంటే.. ఉరుమురిమి మంగళం మీద పడినట్లు మూడు నిరంకుశ రైతాంగ వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా గత 70 రోజులుగా భారత రైతాంగం చేస్తున్న భారీ నిరసనో ద్యమంపై ఉక్కుపాదం మోపి కార్పొరేట్ వ్యవసాయానికి తెరలేపేందుకు నిర్ణయించుకోవడమే. అసమ సమాజంలో ఎన్నికల్లో దళితులకు ప్రత్యేత నియోజక వర్గాలు అవసరమని భావించినందున అందుకు వ్యతిరేకంగా వచ్చిన పూనా సంధి సందర్భంగా సత్యాగ్రహంలో ఉన్న గాంధీజీ ప్రాణాల్ని కాపాడినవారు డాక్టర్ అంబేడ్కర్ నాయకత్వాన దళిత వర్గాలేనని మరిచిపోరాదు. దళితులు గాంధీ ప్రాణ రక్షణ కోసం ఉమ్మడి నియోజకవర్గాల నుంచి పోటీ చేయడానికి నిర్ణయిం చుకున్నందున గాంధీ సత్యాగ్రహం నిలిపేశారు. దళితుల త్యాగం వల్ల గాంధీ తేరుకోవచ్చు గానీ, దళిత బహుజనుల స్థితిగతులు వారి త్యాగానికి తగిన దామా షాలో ఈనాటికీ మెరుగపడలేదు. రాజకీయ పక్షాలు ఈ రోజుకీ గ్రామసీమల్లో ప్రజల మధ్య చిచ్చుపెడుతూనే ఉన్నాయి. ఏకగ్రీవ ఎన్నిక ప్రక్రియకు మోకాలడ్డు పెడుతూనే ఉన్నాయి!! అందుకే అంబేడ్కర్ అన్నారు. ‘పార్లమెంటరీ ప్రజా స్వామ్యం స్వేచ్ఛను గుర్తించిందే కానీ, సమానత్వ సాధనను మరిచిపోయింది. ఈ వైఫల్యం అరాచకత్వానికి, తిరుగుబాటుకు దారితీస్తుంది’. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
కరోనా పీడలో ఎన్నికల పంచాయతీ!
ఇంట్లోనో, ఆఫీసులోనో స్థిరంగా పొట్టలో నీళ్లు కదలకుండా కూర్చున్న వాడికి ఉన్న సుఖం.. కరోనా బాధల మధ్య నిత్యం పనిచేయాల్సిన సిబ్బందికి, సేవలందించే క్యాడర్‌కు, గ్రామీణ కార్యకర్తలకు ఉండదు. 2018లోనే జరగాల్సిన స్థానిక ఎన్నికలను వాయిదా వేసి 2019 నాటికి 18 ఏళ్ల వయస్సు వచ్చిన 3 లక్షల 60 వేలమంది యువతీయువకులకు రానున్న ఎన్నికల్లో పాల్గొనే అవకాశం లేకుండా చేసిన దుర్మార్గపు పాలకులు మిగిల్చిన తప్పుడు వారసత్వానికి కొనసాగింపే– నిమ్మగడ్డ మొండితనం. బహుశా ఈ రహస్యాన్ని గౌరవ సుప్రీం ధర్మాసనం కూడా కనిపెట్టబట్టే ‘తాము తలదూర్చలేం’ అని సరిపెట్టుకుంది. సమన్వయంతో పనిచేయమని కోరింది. అంటే ప్రభుత్వంతో కలిసి, ప్రభుత్వంతో సంప్రదించి మరీ ముందుకు సాగాలనీ ‘పెద్దమనిషి సలహా’గా చెప్పింది. ‘‘ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల నిర్వ హణ విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయంలో మేం జోక్యం చేసుకోలేము, ఆ విషయంలో మేం తలదూర్చలేం. సమన్వయంతో పని చేసుకోవాలి’’. – సుప్రీంకోర్టు, ద్విసభ్య ధర్మాసనం ఉవాచ ‘‘గోవాలో ప్రజలు, ప్రభుత్వ సిబ్బంది భారీ సంఖ్యలో వ్యాక్సినేషన్ వేసే, వేయించుకునే దశలో ఉన్నందున ఎన్నికలు ఏప్రిల్ దాకా వాయిదా వేస్తూ ఎన్నికల కమిషనర్ సి. గార్గ్ ప్రకటించారు. రాను రాను ‘ప్రజాస్వామ్యం’ పేరిట మన వ్యవస్థ ఏ దశకు చేరు కుందంటే ‘గొడ్డలి ఎక్కడ పెట్టావురా అంటే, కొట్టేసే చెట్టు దగ్గర, ఇంతకీ కొట్టే చెట్టెక్కడుందిరా అంటే, గొడ్డలి దగ్గర’ అనే వరకూ వచ్చింది. యావత్తు దేశంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా కరోనా భీకర వ్యాధికి సుమారు ఏడువేలమందికి పైగా ప్రజలు బలైపోయారు. రకరకాల వ్యాక్సిన్లు ఇంకా ప్రయోగ దశల్లోనే ఉండి, ఒక కొలిక్కి రాలేదు. వచ్చిన కోవాగ్జిన్లు, కోవిషీల్డ్‌లు వేయించుకున్న వారంతా పూర్తిగా స్వస్థతలోనే ఉన్నారని చెప్పగల ధీమా పూర్తిగా ఏర్పడలేదు. ఈ దశలో పదిలక్షలమంది ప్రజలకు వ్యాక్సిన్లు దశలవారీగా వేసే స్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమూ, దానికి సహకరిస్తున్న వేలాదిమంది వైద్య, అగ్రగామి దళ సిబ్బంది విసుగూ విరామం లేకుండా రెండు మాసాలుగా నిద్రాహారాలకు నోచుకోకుండా తలమునకలై పనిచేస్తు న్నారు. ప్రభుత్వ సేవల్లో ఉంటూ కరోనా బారినపడి చనిపోయిన వారిలో పోలీసులు వందకుమించిన సంఖ్యలోనే ఉన్నారు. నర్సులు, ఇతర మహిళా సేవకులూ రాత్రింబ వళ్లు ప్రజా సేవలో మగ్గిపోతున్న దశ. ఈ బాధలు, బాదరబందీలూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు కనపడవు. తనూ, తన ఉద్యోగం పదిలంగా ఉంటే చాలనుకున్నారు. అది కూడా మార్చిదాకా. అదైనా చంద్రబాబు పతనం కాకముందు ఆయన వెలగబెట్టిన హయాం నుంచి అప్పనంగా అబ్బిన ఎలక్షన్ కమిషనర్ పదవి. అయినా రాష్ట్రంలో ప్రజలు, వివిధ దశల్లో కరోనాతో భయం భయంగా గడుపుతూ వ్యాక్సినేషన్ల ఫలితాలు ఎలా ఉంటాయో తెలి యక భీతిల్లుతున్న సమయంలో, యావన్మంది సిబ్బంది, గ్రామ సేవకులు కరోనా నివారణ ప్రక్రియల్లో చేదోడు వాదోడు అవుతున్న సమయంలో– పంచాయతీ ఎన్నికలు నిర్వహించ డానికి కమిషనర్‌కు చేతులొచ్చాయంటే ఆ ‘బుర్ర’ ఎంత గొప్పదై ఉండాలో అర్థమవుతోంది. ఎందుకంటే, పట్టుమని అరడజను కరోనా కేసులు కూడా లేని లేదా నిర్ధారణ కాని దశలో ముందుగా నిర్వహిం చవలసిన జిల్లా పరిషత్, మండల స్థాయి ఎన్నికలను జరపకుండా ‘ఎగనామం’ పెట్టి (ప్రోద్బలం చంద్రబాబుదని అనకండి), ముమ్మ రంగా కరోనా ముంచుకొచ్చిన దశలో పంచాయతీ ఎన్నికలంటూ ‘సందట్లో సడే మియా’గా వచ్చి, ‘నాలుగు పరిగెల్ని’ బాబుకి ఏరిపెడ దామన్న భ్రమలో పడిపోయి నిమ్మగడ్డ పంచాయతీ కుంపటి తెరవాలనుకుని ఎన్నికల నోటిఫికేషన్‌ను ఏకపక్షంగా జారీ చేశారు. ప్రభుత్వంతోగానీ, చీఫ్ సెక్రటరీతోగానీ విధిగా సంప్రదించి చేయవల సిన నిర్ణయాన్ని ఒక్క కలంపోటుతో జారీచేసి కూర్చున్నారు. బ్యూరాక్రసీ అంటే నిరంకుశాధికార వర్గమని పేరుంది, అలాగని బ్యూరాక్రాట్లే గర్వంగా చెప్పుకున్న రోజులూ, వ్యవహరించిన, వ్యవహ రిస్తున్న రోజులూ మనం చూశాం. బహుశా అందుకే కేంద్ర స్థాయిలో సీబీఐ అత్యున్నతాధికారిగా, ఇంటెలిజెన్స్ విభాగం అధిపతిగా పేరొం దిన ‘కా’ (కెఏడబ్ల్యూ) ఆమధ్య కాలంలో బ్యూరోక్రసీని ఆ పేరుతో పిలవడం మానేస్తే మంచిదని భావించి సరికొత్త పేరు– ‘బ్యూరోక్రేజీ’ అని పేరుపెట్టి ఆ పేరుతోనే ఓ విమర్శనాత్మక పుస్తకం రాసి ప్రచురిం చారు. ఆ ‘మోజు’లో (క్రేజ్) పడిన తర్వాత ప్రజలపట్ల నిర్వహించా ల్సిన బాధ్యతాయుత ధర్మాల్ని మానేసి, రాజకీయ నాయకులకు, పాలకులకు కాకాలుపట్టి బాకాలు పట్టడం నిరంకుశాధికార వర్గం పనిగా మారిందని ‘కా’ నిర్వచించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హోదాలో ఉన్న ఈ ఉన్నతాధికారి బాబు హయాం నుంచీ నిర్వహిస్తూ వచ్చిన అనంతర కర్మకాండంతా ఇదే మరి. ఈ బాదరబందీని బహుశా తాము పరిష్కరించడం ఇప్పట్లో సాధ్యమయ్యే పనిగా కనబడటం లేదని ధర్మాసనం భావించిందో ఏమో మరి. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా ఉన్న దశలో, మరి అరవై రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా సాగే టీకాల కార్యక్రమంలో యావన్మంది రాష్ట్ర, జిల్లా స్థాయి సిబ్బంది పాల్గొనాల్సి ఉన్న సమయం చూసుకుని స్థానిక ఎన్నికల సంఘం కమిషనర్ నిరం కుశ నిర్ణయం చేశారు. అయితే ప్రభుత్వ సిబ్బంది తమ ప్రాణాలను ఒక ఉన్నతాధికారి మొండితనానికి బలిపెట్టుకోలేరు. అందుకనే జాతీ యోద్యమం రోజుల్లో వలస పాలనకు వ్యతిరేకంగా సాగించిన సహాయ నిరాకరణ ఉద్యమానికి ప్రభుత్వ సిబ్బంది సిద్ధమయ్యారు. ఇంట్లోనో, ఆఫీసులోనో స్థిరంగా పొట్టలో నీళ్లు కదలకుండా కూర్చున్న వాడికి ఉన్న సుఖం.. కరోనా బాధల మధ్య నిత్యం పనిచేయాల్సిన సిబ్బందిని, సేవలందించే క్యాడర్‌కు, గ్రామీణ కార్యకర్తలకు ఉండదు. 2018లోనే జరగాల్సిన స్థానిక ఎన్నికలను వాయిదా వేసి 2019 నాటికి 18 ఏళ్ల వయస్సు వచ్చిన 3 లక్షల 60 వేల మంది యువతీయువ కులకు రానున్న ఎన్నికల్లో పాల్గొనే అవకాశం లేకుండా చేసిన దుర్మా ర్గపు పాలకులు మిగిల్చిన తప్పుడు వారసత్వానికి కొనసాగింపే– నిమ్మగడ్డ మొండితనం. బహుశా ఈ రహస్యాన్ని గౌరవ సుప్రీం ధర్మాసనం కూడా కనిపెట్టబట్టే ‘తాము తలదూర్చలేం’ అని సరిపెట్టుకుంది. సమన్వ యంతో పనిచేయమని కోరింది. అంటే ప్రభుత్వంతో కలిసి, ప్రభు త్వంతో సంప్రదించి మరీ ముందుకు సాగాలని ‘పెద్దమనిషి సల హా’గా చెప్పింది. ఎందుకంటే, ప్రభుత్వంతో ప్రత్యక్షంగా సంప్రదించే సంప్ర దాయాన్నే పూర్తిగా వదులుకున్నారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్. ఇంతకు ముందు దేశ అత్యున్నత న్యాయస్థానం హెచ్చరించింది కూడా ఈ ప్రవర్తన గురించేనని మరవరాదు. అంతేగాదు, అంతకన్నా అత్యంత కీలకమైన, విలువైన సలహాను, ఆదేశాన్ని కరోనా వ్యాప్తి అయిన తరు వాత సుప్రీంకోర్టు (18.12.2020) తీర్పు రూపంలో ప్రకటించిందని మనం మరచిపోరాదు. ఎందుకంటే, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సుభాష్‌రెడ్డి, జస్టిస్ ఎం.ఆర్.షాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ‘కరోనా విలయతాండవంతో ప్రపంచంలో ప్రతిఒక్కరూ భీతిల్లి బాధపడుతున్నారు. నేడు జరుగుతున్నది కోవిడ్–19పై సాగు తున్న ప్రపంచ యుద్ధం. ప్రభుత్వ–ప్రైవేట్ రంగాల భాగస్వామ్యంతో దీన్ని నివారించాలి. ప్రజారోగ్య రక్షణ పౌరుల ప్రాథమిక హక్కు. రాజ్యాంగంలోని 21వ అధికరణ ఆ హక్కును ప్రజలకు కల్పించింది. ప్రజలకు అందుబాటులో ఉండే వైద్యం ఆ మేరకు వారికి దక్కాలి. ఎందుకంటే, కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి కూడా సామాన్య స్థితిలో ఆర్థికంగా అనేక విధాల కుంగిపోయి ఉంటాడు కాబట్టి. ప్రైవేట్ ఆస్పత్రులు వసూలు చేసే ఫీజులపైన విధిగా నియంత్రణ ఉండాలి. పౌరుల రక్షణ, ఆరోగ్య బాధ్యతలకు ఏ ఇతర విషయాలకన్నా అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ పౌరులు తీసు కోకుండా ఉంటే, ఆ పరిస్థితి ఇతర సామాజికులకు కూడా హాని కల్గించడమే అవుతుంది. తద్వారా ఇతరుల హక్కులను హరించడమే అవుతుంది. అంతేగాదు, గత ఎనిమిది నెలలకు పైగా ఆరోగ్య రక్షణలో అగ్రగామి దళంగా పనిచేసిన డాక్టర్లు, నర్సులు, ఇతర కార్మిక సిబ్బంది శారీరకంగా, మానసికంగా డస్సిపోయారు. వారికి మధ్యమధ్యలో అవ సరమైన విశ్రాంతి కల్పించగల మార్గం విధిగా చూడాల్సి ఉంటుంది. అంతేగాదు, దేశవ్యాప్తంగా కరోనా వల్ల బాధలు అనుభవిస్తున్న రోగుల సంఖ్య ప్రతి రోజూ పెరగడం వింటున్నాం. అందుకే పరీక్షలు ఉధృతంగా నిర్వహించాలి’ అని పేర్కొంది. అదీ బాధ్యత అంటే, వ్యక్తికైనా, వ్యవస్థకైనా! ఇంతకూ అసలు సమస్య–పంచాయతీ ఎన్నికల్లో సుప్రీం జోక్యం చేసుకుంటుందా లేదా అన్నది కాదు. గత డిసెంబర్లో త్రిసభ్య ధర్మా సనం చేసిన విలువైన హెచ్చరికల్ని మనం పరిగణనలోకి తీసుకోవా ల్సిన అవసరం ఉందా లేదా అన్నది మాత్రమే. మనం సమస్యల్ని మర చిపోతున్నట్టే, మన బుద్ధుల్ని వంచాల్సిన సామెతలనూ మరుస్తు న్నాం: ‘కోర్టుకెక్కినవాళ్లు ఒకరు ఆవుకొమ్మును, ఇంకొకళ్లు తోకను పట్టుకుంటే, మధ్యలో లాయరు పొదుగు దగ్గర కూర్చుంటాడ’ట! కావలసిన ఇంగితం కోర్టులకెక్కినంత మాత్రాన కలగదు సుమా! ‘ఎలాగూ మేం తలదూర్చలేమ’ని సుప్రీంకోర్టు తేల్చేసింది కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం తలదూర్చి కాగల కార్యాన్ని కాస్త సానుకూలం చేసు కోవచ్చు. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
‘ఢోకా’లేని ‘టీకా’ ఇదే అయితే..?!
‘‘రానున్న 28 రోజులు కీలకం. ఎందు కంటే, ఇంకా అంకెకు రాని కరోనా హంతక క్రిమి వ్యాధి (వైరస్) నివారణకు మొదలైన కొత్త టీకాల (వ్యాక్సిన్లు) వల్ల వాటిని వేయించుకునే వారి శరీరంలో అనేక మార్పులు రావొచ్చు. అందుకే తొలి టీకావల్ల (కోవిషీల్డ్ లేదా కోవా గ్జిన్) నాలుగు రోజులపాటు ఈ ప్రయోగానికి గురైనవారు జాగ్రత్తగా ఉండాలి. మద్యం తీసు కోరాదు, బీడీలు, సిగరెట్లు తాగకూడదు. పోషకాహారం తప్పనిసరి. వైద్య, ఆరోగ్యశాఖ మార్గదర్శకాలనుబట్టి, టీకా వేయించుకున్న వారికి 12 రోజుల్లో శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే యాంటీబాడీలు వృద్ధి కావడం ప్రారంభమవుతుంది. రెండో డోసు ఇంజెక్షన్ తర్వాత రెండు వారాల్లో పూర్తి రక్షణ కలగొచ్చు. అయితే మొదటి డోసుతో వికటించి ఎలర్జీ వచ్చే పక్షంలో ఇక రెండో డోసు ప్రారంభించరు’’. – వైద్య, ఆరోగ్య శాఖల మార్గదర్శకాలు, పత్రికా వార్తలు అంటే ఈ కార్యక్రమం అంతా ఒక కొలిక్కి వచ్చి శరీరంలో పూర్తి స్థాయిలో రోగ నిరోధకశక్తిని పెంచే యాంటీబాడీలు తయారు కావడా నికి పట్టే మొత్తం కాలపరిమితిని నిపుణులు 42 రోజులుగా పేర్కొంటు న్నారు. మనకు కేంద్ర పాలకులు ప్రతిఒక్కరూ కోవిడ్–19 (కరోనా) రాక్షసిని మట్టుపెట్టాలంటే వాడవలసిన టీకాలు, అధికారికంగా అను మతించిన వ్యాక్సిన్లు రెండింటిలో (కోవిషీల్డ్, కోవాగ్జిన్) ఏ కంపెనీది వాడాలి, ఏది వాడకూడదన్న వివక్షను కేంద్ర పాలకులు సూచించక పోవడంవల్ల టీకాల కోసం ఎదురుతెన్నులు కాస్తున్న ప్రజా బాహు ళ్యంలో తీవ్రమైన గందరగోళం నెలకొంది. ఫలితంగా కేంద్ర పాలకుల ప్రకటనల్ని నమ్ముకుని రంగంలో దిగాలనుకున్న రాష్ట్రాలలో జాతీయ స్థాయిలో 3 లక్షలమందికి తొలి రోజు టీకాలు ఇవ్వాలని నిర్ణయిస్తే ఆ సంఖ్య 2 లక్షలమందికి కుదించుకుపోయింది. ఆరోగ్య సంరక్షణ సేవలో అగ్రభాగాన ఉండే పెద్ద, చిన్న సిబ్బందికి ముందు ఈ రెండు వ్యాక్సిన్లలో ఏదో ఒకదాన్ని ఆసాంతం వాడాలిగానీ, మధ్యలో రెండో వ్యాక్సిన్ వాడరాదన్నది అధికారిక నిర్ణయం. కాగా, పూటకొక విరుద్ధమైన రకరకాల వార్తలు వెలువడుతున్న సమయంలో, టీకా తీసుకునే వారెవరూ ‘మద్యంగానీ, బీడీలు, సిగ రెట్లుగానీ ముట్టరాదన్న’ అధికారిక నిర్ణయానికి భిన్నంగా మన దేశం లోనే విస్తృత స్థాయిలో ‘భారత శాస్త్ర, పారిశ్రామిక మండలి’ సంస్థ 10,000 మంది ఉద్యోగులపై నిర్వహించిన తొలి సర్వేక్షణ ‘కోవిడ్–19’ ప్రభావంపై జరిపిన సర్వే ప్రకారం ఈ ఉద్యోగుల్లో 10 శాతం మంది కరోనా వైరస్ సోకిన వారే. అయితే శరీరంలో వైరస్ ప్రభావాన్ని ఎదు ర్కొని నిలబడగల రోగ నిరోధక శక్తి ఆ వ్యక్తుల్లో ఆరు నెలలకు పైగా గణనీయంగా నిలబడే ఉందని రుజువైంది. అయితే అలాంటి వ్యాధి గల ఉద్యోగుల్లో నిలదొక్కుకోవడానికి అసలు కారణం– వారు మందు ‘భాయీ’లు కావడం, పొగత్రాగేవారు కావడమేనని, ఈ రెండు లక్షణాలు వారికి ‘రక్షణ’గా నిలవడమే కారణంగా కనపడిందని ఆ సర్వే ధ్రువపరిచింది. పాన్–ఇండియా స్థాయిలో సాగిన ఈ సాధికార సర్వే ఫలితాలు.. కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలకు సాధికారికంగానే నిర్వ హించి, ప్రకటించిన ప్రమాణాలకు (చుట్ట, బీడీ, సిగరెట్టు తాగరాదు) విరుద్ధంగా ఉండటం చూస్తే రోగ నిర్ధారణ ప్రమాణాలకే నిర్దిష్టమైన సాధికారత ఇంకా సిద్ధించలేదని రుజువవుతోంది. ఇదిలా ఉండగా, కరోనా తలెత్తి కాటువేయడం మొదలైన క్షణం నుంచి, వేలు, లక్షల సంఖ్యలో ప్రపంచవ్యాపితంగానే దేశాల ఎల్లలు దాటి మరీ మహాబీభత్సం సృష్టిస్తున్న సమయంలోనే.. పెట్టుబడిదారీ సమాజ వ్యవస్థల్లో చావుబతుకుల్లో ఉన్న రోగ పీడితులను మరింత పీడించుకు తినడానికి అనేక మందుల కంపెనీలు, బడాబడా ఔషధ కంపెనీలు వందలాదిగా రకరకాల ఔషధాలతో పోటీలు పడసాగాయి. అలాంటి పోటీల్లో భాగంగానే తమ ప్రయోగాలు ఇంకా సునిశితమై, నిగ్గు తేలకముందే ఇండియాపై కరోనా పేరిట ఈ కంపెనీలు రెక్కలు చాచుకుని వాలాయి. ఈ లాభాల వేటలో భాగంగానే ‘కోవిషీల్డ్’ వ్యాక్సిన్‌తో విదేశీ కంపెనీ ఆస్ట్రా జెనెకా, భారతదేశంలోని సీరం ఇనిస్టిట్యూట్‌తో కలిసి రంగంలోకి దిగితే, ప్రాథమిక ప్రయోగ దశలన్నీ (మూడు దశలు) పూర్తి కాకుండానే పోటీ కోసం రంగంలోకి దిగిన భారత కంపెనీ– భారత బయోటెక్ రూపొందించిన అసంపూర్ణ ‘కోవా గ్జిన్’ టీకా. ఆ మాటకొస్తే సీరమ్ ఇన్స్టిట్యూట్ ప్రయోగానికి మూలం విదేశీ కంపెనీయే. అది తయారు చేసిన ‘కోవిషీల్డ్’ ప్రయోగం తర్వాత ఆ ఇంజెక్షన్ తీసుకున్న వ్యక్తి ఒకరు కంపెనీపై రూ. 5 కోట్లకు నష్ట పరిహార దావా వేసిన సంగతి తెలిసిందే. ఇక భారత బయోటెక్ పూర్తిగా ‘దేశవాళీ’ సంస్థే కాబట్టి దాని ‘కోవాగ్జిన్’ టీకాను పూర్తిగా విశ్వసిద్దామా అంటే, అది మూడోదశ పరీక్షల్ని పక్కకునెట్టి మధ్యలోనే ‘లాభలబ్ధి’ సూత్రాన్ని నమ్ముకుని రంగంలోకి దిగింది. ఇక మన పాలకులంటారూ, ‘ఆత్మనిర్భర భారత్’ (స్వయం పోషక) ఆర్థిక వ్యవస్థ నిర్మాణం నినాదంతో ప్రారంభమై విదేశీ పెట్టుబడి సంస్థలన్నీ ‘వాస్కోడీగామాలై’ భారతదేశంలో వాలి, పరిశ్రమలు పెట్టమని తొలి అయిదేళ్ల పాలనలోనే ఆహ్వానించి, తివా చీలు పరిచారు. ఈ ధోరణిలోనే భారత బయోటెక్ (దేశీయ) మందుల కంపెనీకి పెద్దపీట వేసింది కేంద్రం. కాస్త ఒక దశాబ్దం వెనక్కి వెళ్లిచూస్తే, ఒకప్పుడు ‘శాంతా బయోటెక్’ ఔషధ తయారీ సంస్థ కాలేయ (లివర్) వ్యాధి నివారణకు ‘హెపటైటిస్–29’ అనే వ్యాక్సిన్‌ను జయప్రదంగా ఆవిష్కరిస్తున్న ఘడియలలో దానిపై పోటీగా అదే వ్యాక్సిన్‌ను రూపొందించడానికి ప్రయత్నించి ‘భారత బయోటెక్’ విఫలమైన ఉదాహరణ మరవరానిది. ‘దేశవాళీ, దేశవాళీ’ అని మన కోసం ‘హోరెత్తే’ ప్రకటనలు గుప్పించే పాలకులు ప్రయోగ దశలు పూర్తి చేయడంలో విఫలమైన కంపెనీని రంగంలోకి ఎందుకు, ఏ ప్రయోజనం ఆశించి దించారో తెలియదు. ఒకవేళ భారత బయోటెక్ దేశీయ కంపెనీయే అని ముచ్చటపడినా, విదేశీ కంపెనీలు ‘ఆక్స్ఫర్డ్– ఆస్ట్రాజెనెకా’లు రూపొందించిన ‘కోవిషీల్డ్’కన్నా, ప్రయోగ దశను పూర్తి చేయడంలోనే విఫలమైన భారత బయోటెక్వారి ‘కోవాగ్జిన్’కు ఎక్కువ రేటు పెట్టడంలో పాలకుల ఆంతర్యం బోధపడకుండా ఉంది. పైగా, విదేశీ వ్యాక్సిన్ కంపెనీ ఆక్స్ఫర్డ్, తమ ‘కోవిషీల్డ్’ టీకా వేయిం చుకోదలచిన వారి నుంచి స్వచ్ఛందంగా అంగీకారపత్రాన్ని కోరలేదు. కానీ, ప్రయోగ దశలన్నీ పూర్తి చేయలేని భారత బయోటెక్ ‘కోవాగ్జిన్’ తీసుకునేవారు అందుకు విధిగా తమ ‘అంగీకార పత్రం’ రాసివ్వాలని పట్టుపట్టడంలో ఆంతర్యం మాత్రం ఇట్టే తెలిసిపోతుంది. ఈ సంద ర్భంగా ఒక బలమైన అనుమానం ‘టీకా’ వాడదలచుకున్న వారిలో వచ్చే అవకాశం ఉంది. ఈరోజు దాకా, ‘ఈ క్షణం దాకా విదేశాల నుంచి మన దేశం వరకూ ‘కరోనా’ వైరస్ రూపరూపాలు అనుక్షణం మార్చుకుంటున్న దశలో మారుతున్న రూపాలను ఇంకా అర్థం చేసుకొని వ్యవహరిం చాల్సిన సంక్షోభ దశలో మన శాస్త్రవేత్తలు, నిబంధనలను పాటించా ల్సిన అధికారులు చాలా జాగరూకులై మెలగాల్సి ఉంటుందని భారత మెడికల్ రీసెర్చి కౌన్సిల్లో అంటురోగాల శాస్త్ర విభాగం అధిపతి డాక్టర్ సమీరన్ పాండే (16.1.2021) పదేపదే హెచ్చరించారు. అంతే గాదు, ఇన్‌ఫ్లూయెంజా రూపంలో ఉన్న వైరస్ క్రిమి తన జన్యు కణా లలోని ఒక జన్యువు స్థానంలో రూపం మారిన మరొక జన్యువుకు స్థానమిస్తోంది. దీన్నే శాస్త్ర పరిభాషలో నాటకంలో మాదిరి దృశ్యాన్ని మార్చుకోవడం అంటారు. ఇప్పుడు సరిగ్గా ఆ పద్ధతిలోనే పూర్తిగా భిన్నమైన ఇన్‌ఫ్లూయెంజా వైరస్లు ‘నేడు ప్రపంచమంతటా వ్యాపిస్తూ, భారీ స్థాయిలో వ్యాధి వ్యాప్తికి కారణమవుతున్నాయ’ని కూడా సమీరన్ పాండే మొత్తుకుంటున్నారు. బహుశా ఇకమీదట భవి ష్యత్తులో కరోనా వైరస్ అందరికీ సాధారణంగా ఎదురయ్యే జలుబు ‘సర్ది’ రూపంలో ఉండవచ్చునని శాస్త్ర విజ్ఞాన విశేషాలపై సాధికార పత్రిక ‘సైన్స్’ (జనవరి 13) తాజా సంచిక వెల్లడించింది. అన్నింటికన్నా మించి ప్రస్తుత దశలో కరోనా నివారణకు వివిధ పరీక్షలు, ప్రయోగాలు నిర్వహిస్తున్న వేళ– మరొక అపవాదును లేదా విషమ పరిణామాన్ని పాలకులతో సహా మనమందరం మోయక తప్పదు. అదేమిటంటే.. వ్యాక్సిన్ ప్రయోగం సామర్థ్యాన్ని నిరూపిం చడం కోసం చేసిన తొలి ప్రయోగాలు మూడూ నిరుపేదలపైనే జరిగాయి. వీరిలో ఒకరు పారిశుద్ధ్య కార్మికుడు, మరొకరు సెక్యూరిటీ గార్డు. భోపాల్ గ్యాస్ కంపెనీలో జరిగిన ఘోరమైన ప్రమాదంలో చనిపోయినవారు చనిపోగా, గత 30 ఏళ్లుగా కోలుకోలేని స్థితిలో ఉన్న కొందరు క్షతగాత్రులపైనా వ్యాక్సిన్ ప్రయోగాలు జరపడం. ఇంత టితో ప్రస్తుత ‘డ్రామా’ ముగియలేదు. కోవిడ్ వ్యాక్సినేషన్ విన్యాసం పూర్తయిన వెంటనే వ్యాక్సినేషన్ వివరాలకు చెందిన ‘డేటా’ను కాస్తా వెంటనే తొలగించేయాలని ప్రభుత్వానికి భారత ఎన్నికల కమిషన్ ఎందుకు సూచించవలసి వచ్చిందో (15.1.21) తెలియడం లేదు. ఈ డేటాను తొలగించాలని ఆరోగ్య శాఖాధికారులనూ కోరిందట. ఎందుకంటే, కొత్త వ్యాక్సిన్లవల్ల సైడ్ ఎఫెక్ట్స్ బయటపడుతున్న కేసులు తొలుత డజన్ల సంఖ్యలో ఉండగా, ఇప్పుడవి వందల సంఖ్యలో బయటపడుతున్నాయని వార్తలు. బహుశా అందుకే 19వ శతాబ్ది మహోన్నత జీవ శాస్త్రవేత్త, వైరస్ల పుట్టుపూర్వాలు బయటపెట్టిన విజ్ఞానవేత్త లూయీ పాశ్చర్ అన్నట్టు ‘జీవితం అంటే క్రిమి, క్రిమి అంటేనే జీవితం. మరోమాటలో చెప్పాలంటే మానవ జీవితాన్ని శాసించే ఆఖరిమాట క్రిములదే సుమా! అవి వస్తాయి, పోతాయి. ఎలాగంటే పచ్చపచ్చని పైరుపంటల్ని తుపానులు ఊడ్చేసినట్టే పచ్చని జీవితాల్ని కూడా వైరస్లు అప్పుడప్పుడూ దెబ్బతీస్తుంటాయి.’ అయితే, ఆధునిక సమకాలీన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ధిక్కరించి వైరస్లు శాశ్వతంగా బతికి బట్టకట్టలేవు’ అని అట్లాంటా డైరెక్టర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ డాక్టర్ డేవిడ్ సెన్సర్, (1976 నవంబర్ 24), భరోసా కల్పించాడు. అందుకే శ్వాస ఉన్నంతవరకే జీవితంపై ఆశ ఉంటుం దన్న సామెత పుట్టింది! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
భారత రైతుకు అమెరికా పాఠం
నూతన సాగు చట్టాలపై రైతులు పోరాడుతున్న పరిణామానికి దోహదం చేసిన పాలకులు ప్రధాని నరేంద్రమోదీ ఒక్కరే కాదు, ప్రపంచబ్యాంక్ సంస్కరణలను తలకెత్తుకుని ఊరేగుతూ వచ్చిన కాంగ్రెస్, బీజేపీ, చంద్రబాబు టీడీపీ దీనికి ప్రధాన సూత్రధారులని మరువరాదు. 1991లో పి.వి. నరసింహారావు, మన్మోహన్సింగ్ ప్రవేశపెట్టిన ప్రపంచ బ్యాంక్ ప్రజా వ్యతిరేక సంస్కరణలను పోటా పోటీలమీద భుజాన వేసుకొని ఆ మార్గంలోనే ముందుకు సాగిన వాళ్ళు బీజేపీ, తెలుగుదేశం నాయకులు, వాజ్‌పేయ్, చంద్రబాబు. వీరి వారసత్వాన్ని తాను కూడా పాటించాలని నరేంద్రమోదీ కూడా భావించి ప్రపంచ బ్యాంక్ సంస్కరణలకు పరిపూర్ణ రూపం ఇవ్వాలని నిర్ణయించుకుని ఎక్కడా రాజీపడకుండా మూడు రైతాంగ వ్యతిరేక చట్టాలను ఒక్క కలంపోటుతో ముందుకు నెట్టి కూర్చున్నారు! ప్రపంచ బ్యాంకు, అమెరికా పాలకుల నాయకత్వాన ప్రవేశపెట్టించిన ఆర్థిక విధానాలకు మూలం టెక్నాలజీ, ప్రపంచీకరణ (గ్లోబలైజేషన్), కాని ఇందువల్ల జరిగిన ఫలితం– కార్పొరేట్ రంగ బడా బడా మోతుబరి ధనిక రైతులు లాభించారే గాని, పేద, మధ్యతరగతి రైతులు మాత్రం ఉన్న చిన్న కమతాలను కాస్తా అమ్మేసుకోవాల్సి వచ్చింది. ఇందువల్ల 1948–2015 సంవత్సరాల మధ్య పేద, మధ్యతరగతి రైతులు 40లక్షల వ్యవసాయ క్షేత్రాల్ని కోల్పోయారు. ఫలితంగా, అధిక లాభాల ద్వారా ప్రపంచ జనాభాను ఆదుకుంటున్నామన్న తృప్తి మోతు బరులకు ఉండొచ్చు గాని ఆచరణలో వ్యవసాయోత్పత్తులను తమ కాయకష్టం ద్వారా పండించే సన్నకారు పేద రైతాంగం భరించే ఉత్పత్తి ఖర్చులు మాత్రం తగ్గిపోలేదు. మా ప్రెసిడెంట్స్ మా వ్యవసాయ మార్కెట్లను అస్థిరం చేయడానికి పాపం చాలా కష్టపడ్డారు. – జాన్ న్యూటన్, అమెరికా వ్యవసాయ సమాఖ్య ప్రధాన ఆర్థికవేత్త ‘‘భారతదేశ రాజ్యాంగం ప్రకారం వ్యవసాయం రాష్ట్రాల పరిధి లోనిది. రాజ్యాంగంలోని అధికరణ 246 (3వ సెక్షన్) వ్యవసాయ సంబంధిత చట్టాలను చేసే పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. కానీ దేశ రైతాంగ ప్రజల విశాల ప్రయోజనాలకు విరుద్ధంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు చట్టాలను ‘కోవిడ్’ నీడలో పార్లమెంటులో చర్చించకుండానే ఆర్డినెన్స్‌గా ప్రకటించేసింది’’. – అఖిల భారత స్థాయిలో స్వతంత్ర సంస్థగా ‘కిసాన్ సమాఖ్య 30వ రోజు జాతీయ స్థాయి సత్యాగ్రహం సందర్భంగా చేసిన ప్రకటనస్వతంత్ర భారతంలో ఇంతవరకూ కనీవినీ ఎరుగని స్థాయిలో 30 రోజులనాడు ప్రారంభమై నేటిదాకా కొనసాగుతున్న ఈ అపర సత్యా గ్రహ దీక్షను విరమింపచేయడానికి ఎన్డీఏ (మోదీ) ప్రభుత్వం ఈ రోజున (డిసెంబర్ 29) ఒక ప్రయత్నం చేస్తోంది. ఇంతకూ అసలు విషయమేమంటే తమ జీవితాల సెక్యూరిటీ కోసం తమ పంటలకు కనీస మద్దతు రేటును నోటిమాటగా కాకుండా చట్టం రూపంలో ఖాయపరచమన్న రైతాంగ కోర్కెను కాస్తా ‘అది మినహా’ అని ప్రధాన మంత్రి భీష్మించి కూర్చున్నారు! ‘ఆర్డినెన్స్ 2020’ పేరిట విడుదలైన మూడు చట్టాలు– రైతులు పండించే వ్యవసాయోత్పత్తులకు వ్యాపార, వాణిజ్య. ప్రోత్సాహక సదుపాయాల కల్పనకు ఉద్దేశించినవని పాల కులు చెప్పడమే గాని మూడు చట్టాల అసలు లక్ష్యం బట్టబయలై పోయింది. అబద్ధాల్ని.. మరీ పచ్చి అబద్ధాలను దాచలేరు! ఎందు కంటే 1966 సంవత్సరం నాటి వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ చట్టాన్ని మార్కెట్ కమిటీలను నిర్వీర్యపరచడం ద్వారా ఫెడరల్ వ్యవస్థలో రాజ్యాంగం ప్రకారం అధికరణ 246, అధికరణ 23, అధి కరణ 14 లకు వ్యతిరేకంగా బీజేపీ పాలకులు తెచ్చిన మూడు చట్టాల ‘ఆర్డినెన్సు 2020’ చెల్లనేరవని ‘కిసాన్ కాంగ్రెస్’ దాఖలు చేసిన పిటి షన్పైన ఛత్తీస్‌గఢ్ హైకోర్టు నోటీస్ జారీచేయడం ఓ కొసమెరుపు! అన్నింటికన్నా దుర్మార్గం– రైతులు, వ్యవసాయ కార్మికులు శ్రమ జీవులుగా సమష్టిగా పండించే పంటలకు గిట్టుబాటు ధరల గురించి మాటమాత్రంగానైనా స్పష్టంగా ఆర్డినెన్సులో పేర్కొనక పోవడం! కనీస గిట్టుబాటు ధరను అమలు చేయడమేగాక పంటల ఉత్పత్తికయ్యే ఖర్చుకు అదనంగా 50 శాతం జోడించి గిట్టుబాటు ధరల్ని నిర్ణయించి విధిగా అమలు జరపాలన్న డా. స్వామినాథన్ కమిషన్ సాధికార సూచనల ప్రస్తావన కూడా ఎక్కడా ఈ ఆర్డినెన్స్‌లో లేదు. ఎందుకని? ఈ ప్రశ్నలకు కేంద్రంలో నడుస్తున్న ప్రభుత్వాలు ఎవరి ప్రయోజనా లకు కొమ్ముకాస్తున్నాయని ఎదురయ్యే ప్రశ్నకు జవాబుకోసం రైతాంగం ఎదురు చూస్తోంది. ఎందుకంటే దేశంలో పాలకులు పెంచిన బడా బడా కార్పొరేట్ సంస్థలకు వ్యవసాయాన్ని కాస్తా అప్పగించి, ఆహార ఉత్పత్తుల ధరలను నిర్ణయించే సర్వాధికారాన్ని బీజేపీ పాలకుల ఆర్డినెన్సు కల్పిస్తోంది. అందుకే రాజకీయ పక్షాలతో నిమిత్తం లేకుండా కేవలం కిసాన్ సమాఖ్య రైతాంగం సుదీర్ఘ సత్యాగ్రహం తలపెట్టవలసి వచ్చింది. ఈ పరిణామానికి దోహదం చేసిన పాలకులు ప్రధాని మోదీ ఒక్కరే కాదు, భారత çసన్నకారు, మధ్యతరగతి రైతాంగ, వ్యవసాయ కార్మికుల నడ్డి విరగకొట్టే ప్రపంచబ్యాంక్ సంస్కరణలను తలకెత్తుకుని ఊరేగుతూ వచ్చిన కాంగ్రెస్, బీజేపీ, బాబు దేశంగానీ ‘దేశం’ ప్రధాన సూత్రధారులని మరువరాదు. ఈ మూడు పార్టీల (కాంగ్రెస్/ బీజేపీ/ తెలుగుదేశం) నాయకులూ 1991లో పి.వి. నరసింహారావు, మన్మోహన్సింగ్ ఆగమేఘాల మీద ఆహ్వానించి భుజాన వేసుకొని ప్రవేశపెట్టిన ప్రపంచ బ్యాంక్ ప్రజా వ్యతిరేక సంస్కరణలను పోటా పోటీలమీద ఆహ్వానించి భుజాన వేసుకొని ఆ మార్గంలోనే ముందుకు సాగిన వాళ్ళు బీజేపీ, తెలుగుదేశం నాయకులు, వాజ్‌పేయ్, చంద్రబాబు. ఈ ప్రజా వ్యతి రేకపోటీలో వెనకబడిపోవడం సహించలేని దేశంగాని ‘దేశం’ నాయ కుడు చంద్రన్న! 1991లో వరల్డ్ బ్యాంకు సంస్కరణలను వెంటనే అమలులోకి తీసుకురాకుండా జంకుతో పి.వి. అయినా కొంత తాత్సారం చేశాడు. ఇక మన్మోహన్ సింగ్ పూర్వాశ్రమం వరల్డ్ బ్యాంకే కాబట్టి, బయటకు ఏం మాట్లాడినా ఆంతరంగికంగా బ్యాంక్ సంస్క రణలను తలకెత్తుకున్నవాడే. ఇకపోతే, అమ్ముడుపోవడంలో ముందు పీఠిలో నిలబడగల ‘సాహసవంతుడు’ బాబు! కాంగ్రెస్‌తో ప్రపంచ బ్యాంకు అధికారులు ఇంకా చర్చల్లో ఉండగానే అనంతరం ఏపీ సీఎం హోదాలో చంద్రన్న ఢిల్లీవెళ్లి ప్రపంచబ్యాంకు అధినేతలలో ఒకరైన ఉల్ఫోన్సన్తో ఏకాంతంగా సమావేశమై మంతనాలాడి వచ్చాడు. దీంతో పి.వి.కన్నా తన వలలో అతి జరూరుగా వలలో పడిన పిట్ట చంద్రన్న అని ఉల్ఫోన్సన్ నిర్ణయానికి వచ్చాడు. ఇక ఆపైన కథంతా మనకి తెలిసిందే! పైకి బింకంగా ‘నేను ఏ షరతులకూ అంగీకరిం చలేదని మేకపోతు గాంభీర్యంతో చంద్రన్న ప్రకటించినా బ్యాంకు మాత్రం తన ప్రతిష్టను కాపాడుకుంటూ ‘చంద్రబాబు బ్యాంకు పెట్టిన షరతున్నింటినీ అంగీకరించాడ’ని ఆ మరుసటిరోజే ప్రకటించి తన పరువుని నిలబెట్టుకోక తప్పలేదు. ఆ తరువాత బ్రిటన్ నుంచి నాటి ప్రధాని మాక్మిలన్ నోట బ్యాంక్ ‘సంస్కరణల’ నినాదం వెలువడిన వెంటనే భారతదేశంలో అదేబాటలో నాటి బీజేపీ ప్రధాని వాజ్‌పేయ్ కూడా ‘అంతాబాగానే ఉంద’న్న స్లోగన్ ఎత్తుకుని బ్యాంక్ సంస్కరణ లను అమలు చేయడాన్ని వ్యతిరేకించలేదు! అలా తనకు ముందున్న పెద్దలను అనుసరించడమే ఆర్య సంస్కృతో, హిందూత్వ సంస్కా రమో అనుకుని ప్రధాని హోదాలో నరేంద్రమోదీ కూడా భావించి ప్రపంచ బ్యాంక్ సంస్కరణలకు పరిపూర్ణ రూపం ఇవ్వాలని నిర్ణయిం చుకుని ఎక్కడా రాజీపడకుండా మూడు రైతాంగ వ్యతిరేక చట్టాలను ఒక్క కలంపోటుతో ముందుకు నెట్టి కూర్చున్నారు! ప్రపంచబ్యాంకు అమెరికా చేతి ‘ఎత్తుబిడ్డ’ కాబట్టి చెల్లుబాటవు తోంది! అలాగే ‘మన బంగారం (పాలకుడు) మంచిదైతే ఎవరేం చేయగలరన్న’ సామెత అన్ని రంగుల భారత పాలకులకూ వర్తిస్తుంది. పాలకులకు మొండితనం అలంకారం కాకూడదు. కనుకనే బీజేపీ పాలకులు భారత పేద, మధ్యతరగతి రైతాంగ ప్రయోజనాలకు వ్యతి రేకంగా, కార్పొరేట్ మోతుబరుల ప్రయోజనాలకు రక్షణ కవచాలుగా ముందుకు నెడుతున్న చట్టాల మూలంగా రానున్న రోజుల్లో మన గ్రామీణ ప్రజల జీవనశైలినే వినాశకర పరిణామాల వైపు నెట్టకుండా ఉండాలని మనం ఆశిద్దాం! ఎందుకీ మాట అనవలసి వస్తోందంటే– మనకన్నా ఎక్కువ ముందడుగులో ఉందని భ్రమిస్తున్న అమెరికాలో సహజ వ్యవసాయోత్పత్తులను దెబ్బతీసి కేవలం లాభాపేక్షతో నడిచే కార్పొరేట్, కాంట్రాక్టు వ్యవసాయ పద్ధతుల మూలంగా చిన్నకారు, మధ్యతరగతి సాధారణ రైతు కుటుంబాలు రెండు మూడు దశాబ్దాల లోనే ఎలా చితికిపోయి, నామరూపాలు లేకుండా పోవలసివస్తోందో నెబ్రస్కా రాష్ట్ర రైతు, మాజీ సెనేటర్ అయిన ఆల్డేవిడ్ ఆవేదన వినండి. ‘ఆ గ్రామీణ జీవనశైలిని ఒక్కసారి కోల్పోయామా, ఇంతటి గొప్పదేశంగా తీర్చిదిద్దుకున్న దేశంలో మెట్టభాగమంతా మనం చేజే తులా నాశనం చేసుకోవడమే అవుతుంది’ బహుశా అందుకే అమెరికా ప్రపంచబ్యాంకు సంస్థల ద్వారా నడిపే ‘కాబూలీవాలా’ రుణాల ఉచ్చుల గురించి ఏకరువు పెడుతూ శ్రీశ్రీ ఇలా హెచ్చరించాడు. ‘‘అరువులిచ్చి కరువు తెచ్చి / రుణం పెట్టి రణం తెచ్చి ధనం జనం ఇంధనమై/ చరణకరాబంధనమై జనన జరామరణ / దురాక్రమణల సంగ్రంధనమై’’ వినాశానికి కారణమవుతుందన్నాడు. అందుకే ‘‘అన్నం మెతుకునీ / ఆగర్భ శ్రీమంతుణ్ణీ వేరుచేస్తే / శ్రమ విలువేదో ఇట్టే తేలిపోదూ?!’’ అని అన్నాడు నడివయసుకు చేరకముందు పేదరికం మధ్య నలిగిపోయి తనువు చాలించవలసి వచ్చిన యువకవి అలిసెట్టి ప్రభాకర్! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
పేదల చెమటచుక్కల ‘రహస్యం’
కష్టజీవులైన పేదసాదల గురించి. వారి రెక్కల కష్టం గురించి ఇంతగా పలవరించి, కలవరించిన పాలకుడు, నాయకుడు శ్రీకృష్ణదేవరాయలు తప్ప మరొకరు లేరు. తన విశిష్ట కావ్యం ‘ఆముక్తమాల్యద’లో సమాజంలోని శూద్రజాతులైన అట్టడుగు పేదసాదల శ్రమజీవనానికి స్వయంగా రాయలు మనసారా నివాళులర్పిం చాడు..రాజుల, పాలకుల పాదాలలోని ‘భాగ్యచక్రాల సుడికి’ భుజాలపై కాయలుకాసేట్టు కాడి, మేడి పట్టి పొలాలు దున్ని కోటానుకోట్లుగా పంటల్ని పండించే సుజనులే పూజించదగిన సిసలైన ‘శూద్రజాతి’ అన్నాడు రాయలు. అలాంటి రాయల చరిత్రకు మరొక విశిష్ట కోణంగా మనముందున్న సమీక్షా గ్రంథం హంపీ విజయనగర శ్రీకృష్ణదేవరాయ చరిత్ర ‘రాయ’. విభిన్న జాతుల, భాషల మధ్య స్నేహపూర్వకమైన సాంస్కృతిక సంసర్గత ఎలా ‘పుచ్చపువ్వుల్లా’ రాయలకాలంలో విరియబూచిందో ‘రాయ’ గ్రంథకర్త శ్రీనివాసరెడ్డి అత్యద్భుతంగా ఈ రచనలో కళ్లముందు కట్టి చూపించాడు. ‘నృపుల పదహల రేఖల కెల్ల మాభు జాగ్రహల రేఖలే మూలమనుచు కోటి కొండలుగ ధాన్యరాసులు పండువీట సుజన భజనైక విఖ్యాతి శూద్రజాతి’ కష్టజీవులైన పేదసాదల గురించి, వారి రెక్కల కష్టం గురించి ఇంతగా పలవరించి, కలవరించిన పాలకుడు, నాయకుడు ఎవరై ఉంటారు? అంతేగాదు, ఒక మహాసామ్రాజ్య విస్తరణకు పథకం వేసుకునే పాలకుడి లక్ష్యం సంపదను సమకూర్చుకోవడమే తప్ప మరొక లక్ష్యం వైపు మనసు మళ్లదు. కానీ ఆ మహాసామ్రాజ్య నిర్మాణం ఎంత గొప్ప దైనా, మరింత పెద్దదైనా సామ్రాజ్య ప్రజల బాగోగులు పట్టించుకోని రాజ్య మెందుకు, ఆ పాలకుడెందుకు? సామ్రాజ్యపు ఒడ్డుపొడుగులు కాదు చూడవలసింది, ఆ రాజ్యంలోని సంపద సృష్టికర్తలైన రైతన్నల పేదసాదల సౌకర్యార్థం పాలకుడు ఎన్ని చెరువులు కట్టించాడు, మరెన్ని పంటకాల్వలు తవ్వించాడన్నదే ముఖ్యం. అలాగే రైతాంగ ప్రజలపైన వారు పండించే పంటలపైన విధించే పన్నుల భారాన్ని పాలకుడు తగ్గించి, ఫలసాయాన్ని పెంచేందుకు తోడ్పడాలి. కనుకనే అతడు పదునుగా వ్యవహరించే ధర్మార్థాలు రెండూ వృద్ధి చెందు తాయని పాలకుడి ‘పాలసీ’గా సుమారు 400 ఏళ్లనాడు (16వ శతాబ్దం) ప్రవచించి ఎలుగెత్తి చాటిన ఆ పాలకుడెవరు? ఇంకెవరు, తెలుగు–కన్నడ రాజ్యాధినేతగా దక్షిణభారతం లోనే గాక యావ ద్భారతంలోనే మహోన్నత ప్రజారహిత పాలకునిగా కీర్తి ప్రతిష్టలందుకున్న హంపీ (బళ్ళారి) విజయనగర పాలక చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు. తన విశిష్ట కావ్యం ‘ఆముక్త మాల్యద’లో సమా జంలోని శూద్రజాతులైన అట్టడుగు పేదసాదల శ్రమజీవనానికి స్వయంగా రాయలు మనసారా నివాళులర్పించాడు. అంటే ఈరోజుకీ తగిన గుర్తింపునకు నోచుకోని శూద్రజాతి శ్రమ విలువను, పాలకుల భోగభాగ్యాలకు ఆదరవుగానే ఉన్న ఆ దళిత జీవుల చెమటచుక్కల విలువను కీర్తించినవాడు రాయలు. రాజుల, పాలకుల పాదాలలోని ‘భాగ్యచక్రాల సుడికి’ భుజాలపై కాయలు కాసేట్టు కాడి, మేడి పట్టి పొలాలు దున్ని కోటానుకోట్లుగా పంటల్ని పండించే సుజనులే పూజిం చదగిన సిసలైన ‘శూద్రజాతి’ అన్నాడు రాయలు. ఈ శూద్రజాతి వెనుక కులపిచ్చితో మనువు తన ధర్మశాస్త్రంలో చాలా కథ అల్లి ముఖం నుంచి, చేతులనుంచి, బాహువులనుంచి, చివరికి పాదాలనుంచి ఒకరిని పుట్టించి, నాలుగు వర్ణాలలో పాదా లనుంచి పుట్టిన వారికి ‘శూద్రులు’ అని పేరుపెట్టి న్యూనపరిచాడు. కులపిచ్చికొద్దీ అయిదవ కులం ఇకలేనట్టే నని (నాస్తితు పంచమ) శాసించేశాడు. ఈ తప్పుడు వర్ణ విభజనను ఈసడించుకున్న రాయలు కష్టజీవులైన దళిత శూద్రులనే సమాజశ్రేయస్సుకు మూలకందాలుగా కీర్తించాల్సిన సుజనులగా దండోరా వేశాడు. అలాంటి ప్రజల మని షిగా ఎదిగి సుమారు తన 30 ఏళ్ల రాజ్య పాలనలో భారతదేశంలోని కొందరు మహాచక్రవర్తులలోనే గాక ప్రపం చంలోని నలుగురే నలు గురు అత్యున్నత స్థాయి పాలకులు జూలియస్ సీజర్, అలెగ్జాండర్, నెపోలియన్ల సరసన శ్రీకృష్ణదేవ రాయలను అధిష్టించారు. అలాంటి రాయల చరిత్రకు మరొక విశిష్ట కోణంగా మనముం దున్న సమీక్షా గ్రంథం హంపీ విజయనగర శ్రీకృష్ణదేవరాయ చరిత్ర ‘రాయ’. ఈ గ్రంథకర్త శ్రీనివాసరెడ్డి. రాయల ఆముక్తమాల్యదనే గాక, కాళిదాసు ‘మేఘదూతం’ ‘మాళవికాగ్ని మిత్రం’ కావ్యరాజాలను కూడా ఆంగ్లంలోకి అనువదించిన పండితుడు, ప్రసిద్ధ అనువాదకుడు, సంగీత కళాకారుడూ బెర్కిలీ యూనివర్సిటీలో దక్షిణాసియా భాష లలోనూ, ప్రాచీన సాహిత్యాలనూ పుక్కిట పట్టిన ఉద్దండుడు. ప్రస్తుతం ఈయన బ్రౌన్ విశ్వవిద్యాలయంలో ఐఐటీ గాంధీనగర్‌లో అధ్యాపకునిగా పనిచేస్తున్నారు. తన తాజా విశిష్ట రచన ‘రాయ’ బయటికి వెలువడే దాకా ఈ గ్రంథ రచయిత శ్రీనివాసరెడ్డి దాదాపుగా ఒక అజ్ఞాత విశిష్ట రచయితగానే ఉండిపోయారన్న ప్రసిద్ధ రచయిత, విశ్లేషకుడైన రాజమోహన్ గాంధీ అంచనా అత్యుక్తి కాదు. అటు తన సామ్రాజ్య రక్షణలోనూ, సమకాలీన శత్రురాజులు కవ్విస్తే తప్ప యుద్ధాలకు దిగని పాలనా దక్షునిగా సాహితీ సమ రాంగణ చక్రవర్తిగా ‘దేశభాషలందు తెలుగు భాష’గా నిలిపి ప్రోత్స హించిన భాషా తాత్విక సమన్వయకర్తగా తన ఇరవయ్యే ళ్లపైబడిన పాలనాదక్షతతో పాలించి కీర్తిశిఖరాలకు చేరినవాడు రాయలు. ఆయన కాలం నాటి దక్కను పీఠభూమి ఉత్తర, దక్షిణ భారతాలకు చెందిన పలురకాల మతాల వారికి, అనేక భాషలకు, హిందూ–ముస్లింలకు, పోర్చుగీస్, పర్షియన్ దేశీయులకు కేంద్ర స్థానంగా వర్ధిల్లిన దశ. ఈ పరస్పర వైవిధ్యపూరితమైన విభిన్న జాతుల, భాషల మధ్య స్నేహ పూర్వకమైన సాంస్కృతిక సంసర్గత ఎలా ‘పుచ్చపువ్వుల్లా’ రాయల కాలంలో విరియబూచిందో ‘రాయ’ గ్రంథకర్త అత్యద్భుతంగా ఈ రచ నలో కళ్లముందు కట్టి చూపించాడు. గ్రంథకర్త కేవలం పోర్చుగీస్, పర్షియన్, చారిత్రక, సాహిత్య ఆధారాల పరిశీలనతోనే సరిపెట్టుకోకుండా ఇంతవరకూ పెక్కుమంది చరిత్రకారుల పురాతత్వవేత్తల దృష్టికి రాని పలు తెలుగు సాహిత్య ఆధారాలను కూడా తవ్వి పరిశోధించి, పరిశీలించిన దాని ఫలితమే ఈ తాజాగ్రం«థ రచన. ఈ తవ్వకంలో ఈ గ్రంథకర్త, ఎస్. కృష్ణస్వామి అయ్యంగార్, కె.ఎ.నీలకంఠశాస్త్రి, నేలటూరి వెంకట రమ ణయ్య లాంటి పురాతత్వవేత్తలు, ప్రసిద్ధ చరిత్రకారులు తవ్వి తీయగా, ప్రసిద్ధ చారిత్రక సాహిత్య గ్రంథాలకు తిరిగి ప్రాణంపోస్తున్న ఎమెస్కో ప్రచురణకర్తలు సంకలనకర్తలయిన విజయకుమార్, డి.చంద్రశేఖర్‌లు అభినందనీయులైనారు. ఒక్క ఊపుతో అపురూపంగా ఇటీవలనే వెలు వడిన (ఆలస్యంగానైనా) ఇంతకాలం ఆసక్తిగల చదువరులకు అలవి కాని ‘విజయనగర చరిత్ర– ఆధారాలు’ అనే చరిత్రకు సంబంధించిన మరిన్ని ఆధారాల పేరిట రెండు విశిష్ట గ్రంథాలను పునర్నిర్మించడం ప్రశంసనీయం. సుమారు 5 శతాబ్దాల దాకా విస్తరించిన 20 మంది విజయనగర వంశీకుల చరిత్రకు అనుపమానమైన నివాళిగా శ్రీనివాస రెడ్డి సరికొత్త రచన ‘రాయ’ను పేర్కొనడం అతిశయోక్తి కాబోదు. ఈ గ్రంథం విశిష్టత అంతా ఒక్క మాటలో– ‘ఉండంతలోనే కొండంత’గా చూపడంలోనే ఉంది. రాజ్య విస్తరణలో ఉన్న పాల కులకు ఎదుటివారిని జయించాలన్న తహతహ ఒక విజిగీష. కానీ రాయలు సమకాలీన యుద్ధాలలో అనివార్యంగా పాల్గొనవలసి వచ్చినా ఎదుటివారి కవ్వింపులకు ముగింపు తేవడానికే గాని పర రాజుల భూభాగాలను ఆక్రమించడానికి కాదు. ఇందుకు పక్కా ఉదా హరణలు హిందూరాజైన ఒరిస్సా పాలకుడు ప్రతాపరుద్ర గజపతిని, ముస్లింరాజైన బహమనీ ఆదిల్‌షాలను యుద్ధంలో ఓడించి, స్వాధీనం చేసుకున్న వారివారి భూభాగాలను తిరిగి వారికే వాపసు చేసి యుద్ధా లలో పట్టుబడిన వారి సంతానానికో, బంధుగణానికో విద్యాబుద్ధులు గరిపించిన ఘనత ఒక్క రాయలదేనని గుర్తించాలి. శ్రీశ్రీ అన్నట్టు వ్యక్తి పూజను మానగలం గాని, వీరపూజను మానలేం. కటకం, బస్తర్, నాగపూర్, గోల్కొండ, తెలంగాణ (నిజాం పాలనలో), చెన్నపురి, చంగల్పట్టు, తంజావూరు, బెంగళూరు, దేవర కోట, పురుక్కోట, కటకం (ఒరిస్సా) ఒక్కమాటలో దక్షిణ భారతంలో రాయలు సాధించిన విజయాలకు సామాన్యుడైన ఒక రజకుడి నోట ‘కాదని వాదుకు వస్తే కటకందాకా మనదేరా’ అన్న పాట నాటినుంచి నేటిదాకా ఖ్యాతిలోనే ఉండిపోయింది. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
భారత్ – చైనాలే ఆశాదూతలు!
ఆచరణ యోగ్యమైన వాస్తవికతతో చైనా పట్ల మన విధానాన్ని రూపుదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. భారత దేశ భవిష్యత్ అవసరాల దృష్ట్యా పాత సంప్రదాయ ధోరణులకు అతీతంగా మనం అడుగులు వేయవలసి ఉంది. పునరుజ్జీవం పొంది ముందుకు సాగుతున్న చైనా పట్ల సంప్రదాయంగా పేరుకుపోయిన భావాలను, ఊహలను మనం అధిగమించాలి. మన దేశ భవిష్యదవకాశాలను బేరీజు వేసుకుని విమర్శనా దృష్టితో విధాన రూపకల్పన చేసుకోవాలి. అదే సందర్భంలో– గత మూడు దశాబ్దాలలో ఉభయ దేశాల సంబంధాలలో మెరుగైన అభివృద్ధిని చెడగొట్టుకోకుండా ఉండాలంటే భారత–చైనా సరిహద్దులలో శాంతి, సామరస్య వాతావరణం విధిగా ఏర్పడి తీరాలి. రెండు దేశాల మధ్య శాంతి అనివార్యం. – భారత విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్ సెప్టెంబర్ 7న విడుదల కానున్న ఇండియా వే అన్న గ్రంథంలో. ఇటీవల భారత–చైనా సరిహద్దులలో సాగుతూ వచ్చిన సైనిక ఘర్షణలు ఇరుదేశాల్లోని 270 కోట్ల మందిని ప్రభావితం చేశాయి. ఆసియా ఖండంలోనేగాక, ప్రపంచంలోనే అత్యధిక జనాభాతో జీవిస్తూ సుదీర్ఘ చారిత్రక, సంప్రదాయాలకు నిలయంగా ఉన్న భారత–చైనాల మధ్య సుస్థిర శాంతి ఇటు ఆసియా ఖండానికేగాక, అటు యావత్ ప్రపంచానికే అవశ్యమని జయశంకర్ నిశ్చితాభిప్రాయం. అటూ ఇటూ పరమ నిర్జన ప్రాంతంలో సైనికుల మోహరింపు వల్ల ఉభయ దేశాలలోనూ, ఇరుగు పొరుగు దేశాలలోనూ ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన ఒక ప్రకటన సంచలనాత్మకంగా మారింది. ‘ఉభయ దేశాల మధ్య సరిహద్దుల్లో ఎలాంటి ఘర్షణా లేదు; ఎవరూ చనిపోలేదు’ అని ఆ ప్రకటన సారాంశం. ఇది మన దేశంలో చాలా ఆశ్చర్యమూ, ఆందోళనా కల్గించింది. వాస్తవాలను మభ్యపరిచి మోదీ ఈ ప్రకటన చేయడం అభ్యంతరకరమని కొన్ని ప్రతిపక్షాలు దండోరా వేయటం మనకు తెలిసిందే. బహుశా మోదీ అభిప్రాయంలో చైనా అంటే సైద్ధాంతికంగా పడకపోవచ్చుగానీ– జయశంకర్ వర్ణించినట్టు భారత–చైనాల మధ్య బ్రిటిష్ వలస పాలకులు, నయావలస సామ్రాజ్యవాద అమెరికా పాలకులు అనుసరిస్తూ వచ్చిన సామ్రాజ్య విస్తరణ విధానాల మూలంగా భారత–చైనాల దేశాల సరిహద్దులు ఏనాడూ శాశ్వతంగా గుర్తించబడలేదన్నది పచ్చి నిజం. ఆ విషయం భారత విదేశాంగ మంత్రులందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. సరిహద్దులు శాశ్వతంగా పరిష్కారం కావాలంటే రెండు దేశాలు సంప్రదింపులకు కూర్చుని పరిష్కరించుకొనక తప్పదుగాక తప్పదు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రధానులు, విదేశాంగ మంత్రులు, ఆ తర్వాత బీజేపీ(ఎన్డీయే) పాలకులు చైనా నాయకులతో సంప్రదిస్తూనే వచ్చారు. కాని ఇప్పటిదాకా ఎన్నిసార్లు ఇరు దేశాల నాయకులు, విదేశాంగ మంత్రులు సమావేశమైనా–1962 నాటి సరిహద్దు ఘర్షణలను నివారించే పేరిట, సామ్రాజ్యవాద పాలకులు ఆసియాలో తమ విస్తరణవాదానికి అనుకూలంగా భారత–చైనాల మధ్య సరిహద్దులను భూమ్మీద గుర్తించకుండా గాలిలో తేల్చిన గాలి గీతలని చరిత్ర తెలిసిన వారందరికీ తెలుసు. కాని స్వతంత్ర దేశాలుగా అనేక త్యాగాల ద్వారా తమ చారిత్రక నేపథ్యాలను రుజువు చేసుకున్న భారత్–చైనాలు పరస్పర ఉమ్మడి ప్రయోజనాల దృష్ట్యా వివాద ప్రాంతాల విషయంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవలంబించాలి. భౌగోళిక వాస్తవాలకు అనుగుణంగా సర్దుబాట్లు చేసుకోవాలంటే ముఖాముఖి ప్రత్యక్ష సంప్రదింపుల కన్నా మరో గత్యంతరం లేదు. ఎందుకంటే జయశంకర్ గుర్తించినట్టు, ఇన్నాళ్లూ ఘర్షణల మధ్యే, పొరపొచ్చాల మధ్యే ఇరు దేశాల సంబంధాలు సాగాయి. కొన్నాళ్లు మెరుగవుతున్నట్టూ, మరి కొన్నాళ్లు బెడిసికొడుతున్నట్టూ కనిపించినా– మొత్తం మీద కనీసం వర్తక వాణిజ్య సంబంధాలలోనూ, దౌత్యపరంగానూ ఉభయత్రా సానుకూలత చాలావరకు స్థిరపడింది. చైనాతో వివిధ రాష్ట్రాలలో కూడా మంచి వర్తక, వాణిజ్యాలకు సానుకూల వాతావరణం ఏర్పడి, కొనసాగుతూనే వచ్చాయి. ఆ మాటకొస్తే మోదీ ఏలుబడిలోని గుజరాత్ ప్రభుత్వంలో చైనీస్ పెద్ద కంపెనీ రూ,12,000 కోట్ల విలువగల భారీ నిర్మాణాన్ని చేపట్టి కొనసాగిస్తోందని మరిచిపోరాదు. అలాగే దేశ వ్యాపితంగానూ పెక్కు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకూ చైనా కంపెనీలతో ఎన్నో ‘పీట ముడు’లున్నాయి. అయినా తాజా సరిహద్దు ఘర్షణల ఫలితంగా, ఆంగ్లో–అమెరికన్, ఇజ్రాయిల్ గుత్త పెట్టుబడులకుగానూ కూపీ సంస్థలు ఇండియాపై ఒత్తిళ్లు పెంచి, సరిహద్దు ఘర్షణల్ని మరింత పెంచడానికి చైనా వ్యతిరేకతను ఎగదోస్తున్నాయి. చైనాలో ప్రబలిన ‘కరోనా’ మహమ్మారి పేరిట ఇరు దేశాల వర్తక ప్రయోజనాల్ని దెబ్బతీసేలా భారత ప్రయోజనాలకు విరుద్ధంగా మన మీద ఒత్తిడి తెస్తున్నాయి. ఇరు దేశాల స్నేహ సంబంధాలకు గండికొట్టి ఆసియా పసిఫిక్ ప్రాంతంలో, ముఖ్యంగా దక్షిణాసియాలో ఇదే అదునుగా సైనిక జోక్యాన్ని తీవ్రతరం చేయడానికి అమెరికా ప్రయత్నిస్తోంది. అప్పుడే ఈ మేరకు ఆసియాలో తన యుద్ధ సన్నాహాలను బ్రిటన్, మలేసియా, ఫిలిప్పైన్స్ ‘చెవులు కొరికి’ తీవ్రతరం చేస్తోంది. ఈ విషయాన్ని కూడా జయశంకర్ ప్రస్తావించారు. ఈ విషమ ఘడియల్లో మన భారత ప్రభుత్వం ఒక వైపున దేశ పురోగతికి భరోసా కల్పిస్తూనే, మన బలమైన పొరుగు దేశం చైనా విసిరే సవాళ్లను అందుకోగలిగేలా ఉండాలని ఆయన ప్రతిపాదిస్తున్నారు. ఇందుకుగానూ అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు చైనా పేరిట మన ప్రజల పైన, దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పన్నే కుట్రలకు లోనై మన వర్తక, వాణిజ్యాలను దెబ్బతీసుకోకూడదు. ఈ దృష్ట్యా భారత, చైనాలు ఒకరి ప్రయోజనాలను మరొకరు గౌరవించుకునే పద్ధతుల్లో మెలగాల్సిన అవసరం ఉందని ఆయన భావిస్తున్నారు. ఈ విషయంలో రెండు లక్ష్యాలు నెరవేరాల్సి ఉంటుందని ఆయన భావన. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత దేశానికి శాశ్వత సభ్యత్వాన్ని చైనా వ్యతిరేకించకూడదు. అలాగే అణుశక్తి సరఫరా దేశాల కూటమిలో ఒక ఎదిగిన సాంకేతిక పరిజ్ఞాన శక్తిగా ఇండియా సభ్యత్వాన్ని చైనా వ్యతిరేకించకుండా ఉంటే బాగుంటుందన్నది ఆయన ఉద్దేశం. ఆయుధాలు అమ్ముకొని దేశాల మధ్య ఘర్షణలు సృష్టించి, దేశాలను, ప్రజలను అస్వతంత్రత వైపు, బానిసత్వం వైపు నెట్టే ధోరణి అమెరికన్ సామ్రాజ్య పాలకులది. భారతదేశ సైనిక స్థావరాలను తాము స్వేచ్ఛగా వాడుకోవాలన్నది అమెరికా లక్ష్యం. ఇలా ఏర్పడిన బంధమే ఇండో–అమెరికా సైనిక సంబంధాలని మరిచిపోరాదు. ఆసియా ఖండం మధ్యలో, భారతదేశ వ్యూహ రీత్యా అత్యంత కీలకమైన ప్రాంతంలో ఉన్న భారత సైనిక స్థావరాలను వాడుకోవాలన్నది అమెరికా అధ్యక్షుడు, కజ్జాకోరైన డోనాల్డ్ ట్రంప్ వ్యూహం. ఇందుకోసం ఆసియా భద్రతకు ముఖ్యమైన భారత, చైనా, రష్యాలు ప్రధాన సభ్య దేశాలుగా ఉన్న షాంగై మిత్ర దేశాల ఐక్య సంఘటనను బద్దలుకొట్టి ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో ఎలా తిష్ట వేయాలా అని అమెరికా చూస్తోంది. దీనివల్ల కూడా భారతదేశం కడు జాగరూకతతో మెలగవలసి ఉంటుంది. సరిహద్దుల్ని సంప్రదింపుల ద్వారా నేలపై నిక్కచ్చిగా గుర్తించకుండా ఉన్నంతకాలం ఉభయ దేశాల సంబంధాలు మెరుగుపడవు సరికదా, మెరుగైన సంబంధాలకు కూడా గండి కొట్టుకోవడమే అవుతుంది. అందుకనే మన రాటుతేలిన మన ఆశాదూతలు మన ఇరుగు పొరుగు మంచి మైత్రి కోసం ఎదురుతెన్నులు చూస్తున్న దేశాలకు తక్షణం కాళ్లకు బలపాలు కట్టుకుని మరీ తలోదిక్కూ ప్రయాణం కట్టాలి. భారత–చైనాలను చుట్టుముట్టి దెబ్బతీయజూస్తున్న ఆంగ్లో, అమెరికన్, యూరోపియన్ సావ్రాజ్యవాదుల వ్యూహానికి ప్రతివ్యూహాన్ని రచించగల శక్తి భారత–చైనాలకు మాత్రమే ఉంది. ఈ రెండు దేశాలు ఒకటిగాకుండా చూడటమే సామ్రాజ్యవాదుల లక్ష్యం. ఇందుకు గిల్లికజ్జాలకు బదులు, జయశంకర్ అన్నట్టు ఇరు దేశాల మైత్రికి ప్రాపంచిక ప్రాధాన్యత ఉన్నందున మైత్రీ బంధం బలపడాల్సిన అవసరం ఉంది. ఇందుకుగానూ ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు ‘జీ’ సంయుక్తంగా నిర్వహించిన మల్లాపురం(తమిళనాడు) సమావేశం ఆదర్శం కావాలి. దీనికోసం ఉభయ దేశాల మధ్య ఆశాదూతలు అవసరం. మహాకవి ఆశించినట్టు, ఈ ఆశాదూతలు నాల్గు దిక్కులకు మానవకోటి సామ్రాజ్యదూతలూ, కళాయజ్ఞాశ్వాలుగా సాగి గాలులై, తరగలై, తావులై పుప్పొళ్లుగా కుంకుమలై పొగలై ముందుకు సాగిపోవాలి. పాలకులు బుద్ధిజీవులుగా ప్రవర్తించాలి. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
బాబు కుట్ర పర్యవసానం ‘నాట్ బిఫోర్’
‘‘న్యాయమూర్తులు సైతం తమ ఇతర సమకాలీనుల మాదిరే కోరికలకు, భావావేశా లకు, ఉద్రిక్తతలకు, భయాందోళనలకు లోన వుతూ ఉంటారు. మీరు మరీ గట్టిగా విమర్శిస్తే వారు బాధపడతారు. వారి వృత్తిలో వారి ప్రతిభాప్రమాణాలు ఎంత ఉన్నతమైనవైనా, వారిలో కూడా మానవ బలహీనతలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి’’ – డేవిడ్ పానిక్, బ్రిటన్ క్వీన్స్ కౌన్సిల్ సభ్యుడు, సుప్రసిద్ధ బారిస్టర్, పులిట్జర్ గ్రహీత, ‘జడ్జిస్’ గ్రంథకర్త (ఆక్స్ఫర్డ్ ప్రచురణ –1987) పేజీ. 172. న్యాయమూర్తుల ఫోన్లను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రహస్యంగా ట్రాప్ చేస్తోందంటూ ఒక దినపత్రికలో వచ్చిన తప్పుడు కథనం ఆధా రంగా దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారించడంపై రాష్ట్రప్రభుత్వం అభ్యంతరం తెలిపింది... తప్పుడు ఆరో పణలతో ప్రభుత్వంపై బురద జల్లుతున్న ఆ పత్రికను ఈ వ్యాజ్యంలో ప్రతివాదిగా చేర్చి తీరాలని ప్రభుత్వం పట్టుబట్టింది. అయితే ఆ పత్రికను ఈ వ్యాజ్యంలో ప్రతివాదిగా చేయబోమని తొలుత చెప్పిన హైకోర్టు ఆ తర్వాత సందర్భాన్ని బట్టి దీనిపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. – పత్రికా వార్త (19–08–2020) రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల ట్యాపింగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం పాల్పడిందన్న తీవ్ర ఆరోపణను నిస్సందేహంగా నిగ్గుదేల్చాల్సిందే. కానీ ఈ కథనం వెనుక నడిచిన అసలు రాజకీయ కథ ఏమిటంటే ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి సంబంధించి పరి పాలన వికేంద్రీకరణపై వైఎస్ జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అప్పీలు విచారణ నుంచి సుప్రీంకోర్టు ప్రసిద్ధ న్యాయ మూర్తి జస్టిస్ రోహింటన్ నారిమన్ తప్పుకున్నారు. అయితే నారిమన్ కన్నా ముందు ఈ వ్యాజ్యాల విచారణ నుంచి అత్యున్నత న్యాయ స్థానం గౌరవ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.ఎ. బాబ్డే తప్పు కున్నారు. ఈ తాజా పరిణామానికి లోతైన కారణాలను పరిశీలించ డానికి ముందు, చంద్రబాబు ప్రోద్బలంతో ఏర్పడిన రాజధాని రైతుల పరిరక్షణ సమితి తాలూకు ప్రతివాదుల తరపున అడ్వొకేట్ ఆన్ ది రికార్డ్ పేరిట పరమాత్మ సింగ్ సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌కు లేఖ రాశారు. ఈ పిటిషన్ తాలూకు అంశాలను ప్రస్తుత న్యాయమూర్తి నారిమన్ తండ్రి అయిన సీనియర్ న్యాయవాది ఫాలీ ఎస్. నారిమన్‌కు వినిపించి వచ్చామని, కాబట్టి ఎలాంటి అసౌకర్యం కోర్టువారికి కలగకుండా ఉండేందుకు ఇప్పుడీ లేఖను అందజేస్తున్నామని ప్రతివాదుల న్యాయ వాది పరమాత్మ సింగ్ తెలిపారు. ఇందులో ఏం మతలబు దాగి ఉందోనని బహుశా గౌరవ న్యాయమూర్తి జస్టిస్ నారిమన్ గ్రహించ బట్టే ‘నేను సభ్యుడిగా లేని ధర్మాసనానికి ఈ కేసును బదిలీ చేయాల’ని కోర్టు రిజిస్ట్రీని ఆదేశించి, ఉత్తర్వులు చూపి ఉంటారు. ఇలా ప్రసి ద్ధులైన ప్రధాన న్యాయమూర్తులు, మరికొందరు ఇతర న్యాయ మూర్తులు కేసు విచారణ నుంచి తప్పుకోవడం సర్వసాధారణంగా కాకుండా బహు అరుదుగా మాత్రమే జరిగింది. కానీ ఆ అరుదైన దృశ్యం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు అఖండ మెజారిటీతో ముఖ్యమంత్రిగా ఎన్నికైన మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి దొడ్డిదారిన ముఖ్య మంత్రి స్థానంలో కూర్చున్న చంద్రబాబుతోనే ఆవిష్కృతమైంది. ఈ వెన్నుపోటు దృశ్యం అంతటితోనే అదృశ్యం కాకుండా వెన్నుపోటుకు ఆసరాగా కొందరు న్యాయవాదులను ‘సాకుతూ’ వారి ద్వారా కొందరు న్యాయమూర్తులనూ ఇబ్బందులలోకి నెట్టారని ప్రతీతి. ఈ ప్రహసనాల్లో భాగంగానే ‘నాట్ బిఫోర్ మి’ అన్న ‘తెర’ను న్యాయ మూర్తులు కొందరు ప్రయోగించాల్సి వచ్చింది. అలా నేరుగా ఉండ వలసిన న్యాయమూర్తులు కొందరిని, తన న్యాయవాదులు కొందరి ద్వారా ఇబ్బందులలోకి నెట్టడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బాబు ఆవి ష్కరించిన సరికొత్త ‘సంస్కృతి’! ఇప్పుడు కూడా ఈ విలక్షణ ప్రవ ర్తనకు ఆటవిడుపు లేదు. ఈసారి మరో విశేషం– సుప్రీంకోర్టు గౌరవ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే కుమార్తె జస్టిస్ రుక్మిణీ బాబ్డే పేరును బాబు వర్గీయులు దుర్వినియోగం చేయబూనటం. ఎలాంటి దుర్వినియోగానికి బాబు వర్గీయులు పాల్పడ్డారు? నిజానికి రుక్మిణీ బాబ్డే రాజధాని రైతుల తరఫున హాజరైనట్టు ఎక్కడా రికార్డులో నమోదే కాలేదు. అలాగే హైకోర్టు విచారణను ఈనెల 27కి వాయిదా వేస్తూ జారీ అయిన ఉత్తర్వులో కూడా రుక్మిణీ బాబ్డే హాజరైనట్టు పేర్కొననే లేదు. అయినా సుప్రీం ముందు ప్రధాన న్యాయమూర్తి బాబ్డే కూతురు హోదాలో రుక్మిణీ బాబ్డే రైతుల తరఫున వాదనలు వినిపించినట్టు బాబు వర్గం బొంకేశారు. ఈ కుట్ర తెలియని జస్టిస్ బాబ్డే తన కూతురు రుక్మిణి హాజరైన కేసును తాను ‘విచారించడం నైతిక విలువలకు విరుద్ధమని’ రాష్ట్ర ప్రభుత్వం(జగన్) పిటిషన్‌ను జస్టిస్ నారిమన్ బెంచికి పంపగా, తన తండ్రి ఫాలీ నారిమాన్కు ఈ కేసు గురించి ముందుగానే వివరించామన్న ‘హింట్’ బాబు వర్గీ యులు చెప్పడంతో జస్టిస్ నారిమన్ తాను విచారణ నుంచి తప్పు కున్నారు. అంటే నైతిక విలువలు గల జస్టిస్‌గా రోహింటన్ నారి మన్ను ఈ రూపేణా విచారణ నుంచి తప్పించే కుట్రకు పాల్పడ్డారని దాచినా దాగని సత్యంగా బయటపడింది. ఇలా ‘నాట్ బిఫోర్ మి’ (ఈ కేసును నా ముందుకు తీసుకు రావద్దు) అని పలువురు రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయ మూర్తులు కేసుల విచారణ నుంచి తప్పుకొనే ప్రక్రియ ప్రధానంగా బాబు ముఖ్యమంత్రిగా వెలగబెట్టిన హయాంనుంచే తరచుగా మొద లైందని మరవరాదు. వైఎస్సార్ సీపీ యువనేత జగన్మోహన్రెడ్డిపై బాబు నాడు పెట్టిన కేసు విచారణ నుంచి కూడా నాటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లోకుర్ పక్కకు తప్పుకోవలసి వచ్చింది. తమ వ్యాపార ప్రయోజనాల కోసం అంబానీలు పూర్వ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ‘చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్’ (సీఈఓ) అని ‘మెచ్చి మేకతోలు’ కప్పడంతో రెచ్చిపోయిన బాబు రాష్ట్రాన్ని ఉమ్మడిగా దోచు కోవడానికి ప్లాను వేశారు. ఈ ప్రహసనంలో భాగమే కృష్ణా–గోదావరి బేసిన్ చమురు సంపదను గుజరాత్‌కు దోచుకు పోవడానికి అంబానీ లకు రాయితీలిచ్చి ఆంధ్రప్రదేశ్ అవసరాలను తుంగలో తొక్కడం. అంతేగాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను చీల్చడానికి కేంద్ర కాంగ్రెస్ నాయకత్వం సంతకం పెట్టమన్న కాగితంపైన రహస్యంగా సంతకం చేసివచ్చి తెలుగు జాతిని చీల్చడంలో భాగస్తుడైన చంద్రబాబు– అదే కాంగ్రెస్‌తో మిలాఖత్ అయి రుజువులు, పత్రాలు లేని కేసులలో జగన్‌ను 16 మాసాలపాటు జైలులో నిర్బంధించడానికి తప్పుడు ఆరో పణలకు తెరతీశాడు. అంతేగాదు, నేడు అమరావతి భూముల గురించి, రైతాంగం గురించి గగ్గోలు పెడుతున్న ఇదే బాబు వర్గం, రాజధాని అభివృద్ధికి ఏర్పాటు చేసిన ప్రాధికార సంస్థ సీఆర్డీఏ ఉనికిని హైకోర్టులో అమరావతి రైతాంగమే నిలదీసి ప్రశ్నించినప్పుడు నోరెత్తలేదు. చిన్న, మధ్యతరగతి రైతుల భూముల్ని రాజధాని పేరిట బాబు బలవంతంగా సేకరించినప్పుడు వందలాదిమంది రైతులు ఉమ్మడి హైకోర్టులో ఎన్నో రిట్లు వేశారు. కానీ గత ఆరేళ్లకు పైగా ఆ భూముల అతీగతీ తేలలేదు, రిట్లు అలాగే ఉండిపోయాయి. కానీ అవి పరిష్కారం కాకుండానే రాజధాని నాటకాన్ని రక్తి కట్టించుకోవాలని బాబు చూశాడు గాని ‘అట్టర్ ఫ్లాప్’ అయింది. కానీ అభాసుపాలైన రాజధాని ప్రహసనానికి జగన్ ప్రభుత్వం శాశ్వత ముగింపు పలకడానికి, శాసన రాజధానిగా అమరావతిని స్థిరపరుస్తూనే మిగతా రెండు ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి విశాఖను, కర్నూలును కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థా రాజధాను లుగా వృద్ధి చేయాలని తలపెట్టింది. అమరావతి సమగ్రాభివృద్ధి కోసం ప్రాధికార సంస్థను ఏర్పాటు చేస్తే దానికి బాబు వర్గం మోకాలడ్డుపెట్టింది. అంతేగాదు.. నేనూ, మరి ఇద్దరు పాత్రి కేయ మిత్రులు (శ్రావణ్ కుమార్, రమణమూర్తి) అమరావతి రైతాంగం తరఫున సుప్రీంలో రిట్ దాఖలు చేయగా, ఆ రిట్‌ను చూడకుండానే చాకచక్యంగా ఆనాటి ప్రధాన న్యాయమూర్తి ఠాకూర్ పక్కన పడేయడానికి కారణం–రిట్ విషయం తెలిసి ఠాకూర్‌పై అన్య మార్గంలో బాబు ఒత్తిడి తేవడమే. అంతేగాదు, తొమ్మిదేళ్ల పాలనలో బాబు రకరకాల క్రీడల అభివృద్ధికి స్టేడియంలు నిర్మిస్తామన్న పేరిట ‘ఐ.ఎం.జి. భారత అకడమిక్స్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే బోగస్ కంపెనీకి వెయ్యి ఎకరాల స్థలాన్నిచ్చి ‘క్విడ్‌ప్రోకో’ కింద ప్రయోజనం పొందాడే గానీ, ఆ సంస్థ ఏ గంగలో కలిసిందో ఇంతవరకూ పత్తాలేదు. దీనిపై సీబీఐ విచారణ కోసం అడుగుతూ విజయమ్మ, విజయసాయిరెడ్డి, నేనూ హైకోర్టును ఆశ్రయిస్తే (రిట్ నం. 28951/2011) ఏదీ తేల్చకుం డానే ‘నానబెడుతూ’ వచ్చారు. అదేమంటే బాబు కుంభకోణాల్ని విచారించాల్సి వచ్చేసరికి సీబీఐకి ‘సిబ్బంది కొరత’ ఏర్పడుతుంది. ఇక అమరావతి రైతాంగానికి జరిగిన నష్టం గురించి, అన్యాయాల గురించి రైతాంగం తరఫున హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణరెడ్డి (ప్రస్తుతం లోకాయుక్త), మరో మాజీ న్యాయమూర్తి జస్టిస్ గోపాల్‌రావు, నేను, సీనియర్ న్యాయవాది సదాశివరెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (2015 సంవత్సరం ఏప్రిల్) గత ఆరేళ్లు గానూ విచారణకు రాకుండానే పోయింది. ఇందుకు కారణం– అన్ని వ్యవస్థల్ని నర్మగర్భంగా బాబు వర్గం సాకుతూండటమేనన్నది ప్రజా వాక్కుగా మారిపోయింది. అతని ఇలాకాలో హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు దాకా కొందరు తైనాతీ న్యాయవాదుల్ని సాకుతూ అభియోగా లను, తీర్పులనూ తారుమారు చేయించే ‘తాంత్రిక’ విద్యకు బాబు అలవాటుపడ్డాడు. ఈ సత్యాన్ని బాబు హయాంలో వరల్డ్ బ్యాంక్ అనుబంధ çఫండింగ్ సంస్థ డీఎఫ్ఐడీ (2002–2003) నివేదికలో ఇతను న్యాయ వ్యవస్థను ఏ పద్ధతుల్లో సాకుతున్నాడో పూసగుచ్చినట్టు వివరించింది. అంతేగాదు, హైకోర్టులో ఒకరిద్దరు ‘బ్రోకర్’లను బాబు ఎలా ఏ స్థానాల్లో ఉంచి సాకుతూ వచ్చాడో ఎవరో కాదు– స్వయానా సీనియర్ జస్టిస్ బీఎస్ఏ స్వామి న్యాయమూర్తులకు, బార్ సభ్యులకూ బహిరంగ లేఖ రాశారు. అన్నింటికంటే పరాకాష్ట– రాష్ట్రంలో దీపం పెట్టలేక మూలుగుతున్న దేవాలయాలకు నిధులు ఇవ్వలేని స్థితిలో ఉన్నప్పుడు, కోర్టులలో తన స్వార్థ ప్రయోజనాల కోసం లోగడ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ లక్ష్మణన్‌కు తమిళ నాడులోని తన స్వగ్రామమైన దేవకొట్టయ్లోని శ్రీరంగనాథ పెరు మాళ్ దేవళానికి రెండు కిస్తీలలో, ప్రభుత్వం నిషేధించిన ‘కామన్ గుడ్ ఫండ్’ నిబంధనలను రహ స్యంగా సడలించి మరీ దానంగా విడుదల చేశారు (ఆర్సీఎం పీ1/ 18763/2002 ముఖ్యమంత్రి ఉత్తర్వు 2002 ఏప్రిల్ 27) లాభ లబ్ధి అన్నా, నాట్ బిఫోర్ మి అనిపించినా వీటి వెనుక మతలబు ఇదే! ఇప్పటికైనా న్యాయవ్యవస్థలు అప్రమత్తం కావడం ప్రజలకు, సమాజా నికి శ్రేయస్కరం. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
వైరస్ ‘కర్త’లపై తెగని జగడం
కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తి మూలంగా ప్రజలు సహజంగానే కలత చెందడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ మనం అజాగ్రత్తగా ఉండే పక్షంలో ఇంతకన్నా పెద్ద ప్రమాదమే మన ముందున్నది. అదే.. కరోనా సంక్షోభాన్ని అవ కాశంగా తీసుకుని ఆ సాకు మీదే మన అమె రికన్ రాజకీయ జీవితంలోని దుష్టశక్తులు చైనాతో యుద్ధాన్ని రెచ్చగొట్టడానికి, చైనా ప్రజల పట్ల ద్వేష భావాల్ని పెంచడానికి ప్రయ త్నిస్తున్నాయి. నిజానికి చైనా ప్రజలు వీరోచిత చరిత్ర గల ప్రజలు. వాళ్లు మన అమెరికా ప్రజలకు మిత్రులే కానీ మన శత్రువులు కారు. అందుకే మనం జాగరూకులమై ఉండాలి. – అమెరికా ప్రసిద్ధ మేధావి, పరిశోధకులు, లివెలిన్ హెచ్. రాక్వెల్ మనకు పేరుమోసిన సామెతలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒకటి ‘వస్తువొకచోట, అనుమానం వేరొకచోట’ అని. అలాగే ‘నిజం నిలకడ మీద గానీ తేలదు’ అనే సామెత కూడా. కరోనా వైరస్ మహమ్మారి గురించి మనం వింటున్న అనేక గాథలలో ఒకటి.. ఇవి క్రిముల సహాయంతో మానవాళిపై వినాశానికి తలపెట్టే యుద్ధానికి ఉదాహ రణ అని. కాబట్టి చైనా సోషలిస్టు దేశం కాబట్టి పెట్టుబడిదారీ కూటమికి నాయకత్వం వహిస్తున్న అమెరికాను నాశనం చేయడం కోసమే చైనా కరోనా వైరస్‌ను వూహాన్ బయో పరిశోధనాగారంలో సృష్టించి ప్రపంచం మీదికి వదిలిందని అమెరికా అధ్యక్షుడు, అమెరికా రాజకీయ రంగంలో తీవ్ర అవిశ్వాసానికి గురవుతున్న ట్రంప్ ఒక ప్రకటన విడుదల చేయడంతో.. నిజమే కాబోలునని అనేక దేశాలు భావించాయి. చైనాను అనుమానించాయి. ఈ అనుమానం చివరికి ఇంత తొందరలో పెనుభూతంగా మారి తిరిగి అమెరికానే కరోనా దోషిగా నిలబెట్టే వార్తలు నింపాదిగా వెలువడుతున్నాయి. ఆ వచ్చే వార్తలకు, విశ్లేషణలకు, నిరూపణలకు కేంద్రం కూడా అమెరికాయే కావడం విశేషం. ఈ వార్తలలో ఒకటి– 2019 అక్టోబరులోనే అంటే 2019 నవంబరులో ఇది కరోనా వైరస్ అని చైనాలో నిర్ధారణ కావడానికి నెలరోజుల ముందే కృత్రిమంగా భారీస్థాయిలో మొదట ఒక ల్యాబ్‌లో అమెరికా కరోనా వైరస్‌పై ప్రయోగం నిర్వహించింది. ఈ కృత్రిమ ప్రయోగానికి అతి గోప్యంగా భారీగా నిధులు సమకూర్చి జాన్స్ హాప్కిన్స్ ఆరోగ్య భద్రతా కేంద్రీయ సంస్థతో కలిసి ప్రయో గాన్ని నిర్వహించిన వారు ప్రపంచ మహా కోటీశ్వరులైన బిల్ గేట్స్– మెలిందా ఫౌండేషన్. బహురహస్యంగా జరిగిన ఈ వైరస్ సృష్టి ప్రయోగానికి ఈవెంట్ 201 అని నామకరణం చేసి ఎంపిక చేసిన బహుకొద్దిమంది రాజకీయులు, మేధావులు, మాజీ విదేశాంగ శాఖ, మాజీ సైనికాధికారుల సెలెక్టెడ్ బృందానికి గోప్యంగా చూపారు. సరిగ్గా 2019 అక్టోబర్‌లో జరిగిన ఈ ప్రయోగం సందర్భంగానే అంటే అక్టోబర్ 18–27 మధ్య చైనాలోని వూహాన్ నగరంలో ప్రపంచ దేశాల సైనిక విన్యాసాలు జరిగాయి. ఆ విన్యాసాలలో అమెరికా నుంచి వచ్చి చేరిన 300 మంది అమెరికా సైనికులూ పాల్గొన్నారు. ఆ తర్వాత రెండు వారాలకే వూహాన్లో మొట్టమొదటి కోవిడ్–19 కరోనా మహమ్మారి వ్యాధి బయటపడింది. సరిగ్గా తనపై అమెరికా అప్పటికే ప్రారంభిం చిన ప్రచారాన్ని చైనా విమర్శిస్తూ మీ సైనికులు ఇక్కడికి వచ్చి అంటిం చిన వ్యాధి ఫలితమే ఈ సరికొత్త కరోనా అని ప్రకటించింది. నిజానికి, ఇంతకన్నా ఒక పెద్ద రహస్యాన్ని లివెలిన్ రాక్వెల్ వెల్లడిస్తూ ఇలా పేర్కొన్నారు: ‘కరోనా కొత్త వైరస్ వ్యాధి వూహాన్లో ప్రారంభమైనా నిజానికి ఈ వైరస్ అమెరికా నుంచే చైనాకు చేరిందన డానికి సాక్ష్యం ఉంది. ఎందుకంటే, ఇతరులెవరూ ప్రచురించని వార్త లను అమెరికాలోని ‘గ్లోబల్ రీసెర్చి’ అనే ప్రత్యేక శీర్షికలో లారీ రోమ నాఫ్ (పరిశోధకుడు) వెల్లడిస్తాడు. అందుకు గల మౌలికమైన కారణా లను ఆయన ఇలా పేర్కొన్నాడు: ‘అన్ని రకాల క్రిమి సముదాయాలకు అమెరికా తల్లివేరు. కోవిడ్–19 మహమ్మారికి మూలం అంతా అమె రికాలోని ఫోర్ట్ డెట్రిక్ వద్ద ఉన్న క్రిమి ఆయుధోత్పత్తి సైనిక ప్రయోగ శాల! కరోనా వైరస్ వార్త బహిర్గతమైన మరుక్షణమే జీవాయుధాలు ప్రయోగించి చేసే యుద్ధ ప్రయోగశాలను (ఫోర్ట్ డెట్రిక్) కాస్తా మూసే శారు. ఇంతకుముందు నేను మరొక విశ్లేషణలో ప్రస్తావించినట్టు, 2005–2012 సంవత్సరాల మధ్య కాలంలో అమెరికా 1,059 ఘట నలు చూసింది. ప్రయోగశాలలోని రోగక్రిముల్ని దొంగిలించడమో లేదా అమెరికా జీవశాస్త్ర ప్రయోగశాలలనుంచి తప్పించడమో అంతకు ముందు పదేళ్లుగా (ప్రతి మూడు రోజులకి సగటున ఒక్కో లాబ్ నుంచి) సాగుతోంది’ (వార్ ఆఫ్ చైనా: లివెలిన్ రాక్వెల్: 17–3–20) అంతేగాదు, మరొక ప్రసిద్ధ అమెరికన్ మీడియా నిపుణుడు, పరిశోధకుడు డాక్టర్ క్రీగ్ రాబర్ట్స్ మరికొన్ని విశేషాలను ఇలా వివరిస్తున్నారు: ‘అమె రికా యుద్ధతంత్ర వ్యవస్థ అయిన ‘పెంటగాన్’ డీఏఆర్‌పీఏ సంస్థలు, జీవాయుధాలు, జీవ సాంకేతిక శాస్త్ర రంగాలలోనేగాక సూక్షా్మతిసూక్ష్మ సాంకేతిక విజ్ఞానంలోనూ, రోబోల నిర్మాణ శాస్త్రంలోను తదితర అనేక సాంకేతిక రంగాలలో కూడా చేస్తున్న ప్రయోగాలు ప్రజలలో అలజడి కారణమవుతున్నాయి. డీఏఆర్‌పీఏ సంస్థ తలపెట్టిన అనేక పరిశోధ నలలో మైక్రోచిప్స్ సాయంతో మానవ మెదడులో జ్ఞాపకాలను నిక్షిప్తం చేయడంతోపాటు ఆ జ్ఞాపకాలను నామరూపాలు లేకుండా మెదడునుంచి తొలగించనూవచ్చు. అలాగే ఎన్నికల్లో ఉపయోగించే ఓటింగ్ యంత్రాల సాఫ్ట్‌వేర్‌లో జటిల సమస్యలను సృష్టించవచ్చు, తొలగించనూవచ్చు.. అంతేగాదు, అమెరికన్ డీఏఆర్‌పీఏ సంస్థ, పెంటగన్ గత చరిత్ర అంతా జీవాయుధాల సృష్టితో నిండినదే. ఇక ఈ సంస్థలే తాజాగా మానవుల జన్యువులను, వాటి లక్షణాల్నే పూర్తిగా తారుమారు చేసే ప్రయోగాలలో ఉన్నాయి. అంతేగాదు, చివరికి మాన వులలోని జీవకణాలను చంపి జన్యువుల విధ్వంసాన్ని జాతీయ భద్రత పేరిట యుద్ధ ప్రయోజనాల కోసం వినియోగించడానికి వీలుగా పరిశోధనలు జరుగుతున్నాయని మరవరాదు. ఈ సందర్భంగా డాక్టర్ పాల్ క్రీగ్ రాబర్ట్స్ మరొక హెచ్చరికను కూడా (2.2.2020) విడుదల చేశారు: వూహాన్ నగరంలోని క్రిమి శాస్త్రాధ్యయన మెడికల్ వైరాలజీ కేంద్రంతో అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న అమెరికన్ సైనిక, వైద్య సంస్థ లకు ప్రత్యక్ష సంబంధాలున్న విషయాన్ని కూడా డాక్టర్ రాబర్ట్స్ ప్రస్తా వించాడు. అమెరికాలోని పరిశోధనా సంస్థలతో అమెరికా సైనిక వ్యవ స్థకు ప్రత్యక్ష సంబంధాలున్నాయి. అయితే డాక్టర్ రాబర్ట్స్ మరొక విశేషాన్ని కూడా జాగరూకత కోసం ప్రస్తావనకు తెచ్చాడు: ‘కరోనా వైరస్ అమెరికా సృష్టించిందే అయితే చైనా కూడా అమెరికా మాదిరే వైరస్ సృష్టికి తామే కారకురాలన్న వాస్తవాన్ని కప్పిపుచ్చగల అవకాశం ఉంటుంది. ఎందుకంటే అలా కాని పక్షంలో యుద్ధం బద్ధలవుతుంది కాబట్టి. కానీ అలాంటి యుద్ధానికి చైనా సిద్ధంగా లేదని రాబర్ట్స్ అంచనా. అయితే ఒక్కటి మాత్రం నిజంలా తోస్తుంది. ఎందుకంటే, నేటి ప్రభుత్వాల నైతికతను, నిజాయితీని మనం నమ్మలేం కాబట్టి, ఆ విలువలు వాటికి లేవు కాబట్టి. అందుకనే డాక్టర్ రాబర్ట్స్ ఇంతవరకూ జరిగిన ప్రపంచ పరిణాల అనుభవాల దృష్ట్యా కొన్ని పచ్చి తాజా వాస్తవాలను పేర్కొన్నాడు: గత 20 ఏళ్లలోనే అమెరికా, దానికి లొంగిపోయిన యూరోపియన్ పాలకులూ ఏడు దేశాలపైన పచ్చి అబద్ధాలమీద ఆధారపడి దారు ణంగా దండయాత్రలు చేసి, బాంబులువేసి ప్రజలను కకావికలు చేశారు, కొల్లగొట్టారు. వీటిలో కొన్నింటిని మొత్తంగా నాశనం చేశారు, మరికొన్నింటిని సగం దాకా ధ్వంసం చేశారు. ఈ విధ్వంసం అంతా పచ్చి అబద్ధాలపైన ఆధారపడి సాగించారని మరచి పోరాదు. అబ ద్ధాలమీద ఆధారపడే ప్రెసిడెంట్ బుష్, ప్రెసిడెంట్ ఒబామా (ఇప్పుడయితే ట్రంప్) అమెరికా రాజ్యాంగాన్ని ఉల్లంఘిం చారు. అమెరికా ప్రజల్ని కేవల అనుమానాలపైన ఆధారపడి వేధింపు లకు గురి చేస్తున్నారు. అయినా సరే ఏ ప్రెసిడెంట్‌నూ ఇంతవరకూ అభిశంసనకు గురిచేయలేదు, కొరత వేయలేదు. ఈ పరిస్థితుల్లో అమె రికా ప్రజల్ని కాపాడ్డానికి నిజాయితీకి కట్టుబడగల ఏ ప్రసార మాధ్య మాలూ (మీడియా) ముందుకు రాలేదనీ, దీంతో ప్రభుత్వ పారదర్శ కత మరింతగా ప్రశ్నార్థకమైందనీ రాబర్ట్ రాశాడు. అంతేగాదు, 2009 నుంచీ అమెరికా పాలకులు హోండూరాస్, ఉక్రైన్, బొలీవియా, బ్రెజిల్, అర్జెంటీనా ప్రభుత్వాల్ని కూలదోశారు. ఈక్వెడార్‌లోని సామా జిక సంస్కరణల ప్రక్రియను కాస్తా వెనక్కి నెట్టేశారు. వెనిజులాలో చావెజ్‌ను కూలదోసి, మదురో ప్రభుత్వాన్ని కూడా సాగనంపే కుట్ర లకు తెరలేపారు. ప్రపంచంలోని అతి చిన్న దేశాలలో సామ్రాజ్యవాద కృత్రిమ యుద్ధాలు, విభజన రాజకీయాల ఫలితంగా కొరియాను బద్ధలుకొట్టి రెండు కొరియాల, రెండు వియత్నాంల సృష్టికి అమెరికా సామ్రాజ్యవాద పాలకులు కారకులయ్యారన్నది తెలిసిందే. కానీ తన స్వయం ప్రతిభతో అణ్వస్త్ర శక్తిగా తయారైన ఉత్తర కొరియాను బుజ్జగించడానికి, సఖ్యత కోసం వాషింగ్టన్ నుంచి పాంగ్యాంగ్కు ట్రంప్ హుటాహుటిన రెండుసార్లు దిగిరావలసి వచ్చింది. తాజాగా అమెరికా పాలకుల బలహీనపు విస్తరణవాద సామ్రాజ్యశక్తి ఆలోచ నతో, కూల్చవలసిన దేశాలుగా జాబితాతో సిద్ధంగా ఉన్నవి– క్యూబా, ఉత్తర అమెరికా, సిరియా, ఇరాన్, చైనా, రష్యా! అమెరికా సామ్రాజ్య పాలకులకు ఎప్పుడూ ఒక దేశం ‘ఎర’గా తన కంట్లో కదులుతూ ఉండాల్సిందే; అందుకే అన్నాడు మహాకవి– ‘రుణం పెట్టి రణంతెచ్చి/ జనం ధనం ఇంధనమై/ చరణ కరాబంధనమై/జనన జరా దురాక్ర మణల సంగ్రంథనమై’ తనకు ఊడిగం చేస్తూ తన దోపిడీ వ్యవస్థను కాపాడే దేశాలను, ప్రజలనే అమెరికా పాలకులు సహిస్తారు. అయితే చరిత్ర పాఠం మరోలా ఉంటుంది. ‘నూరు గొడ్లను తిన్న రాబందు కూడా గాలి వానకు కొట్టుకుపోయినట్టు’ అమెరికా పాలనాశక్తుల ‘చేవ’ కూడా ‘జావ’గారిపోవడం అనివార్యం. ఇందుకు నిదర్శనం– నిన్నటి వరకూ తెలియని అతిసామాన్య అమెరికన్ నీగ్రో జార్జిలాయిడ్ ఈ రోజు అమెరికా హీరోగా అవతరించడమే! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ఆనాటి స్ఫూర్తి ఎక్కడ.. నేడెక్కడ?
ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు? జగద్గురువులు, చక్రవర్తులు సత్కవీశులు, సైన్యనాథులు మానవతులగు మహారాజ్ఞులు కానరారేమీ? పసిడిరెక్కలు విసిరి కాలం పారిపోయిన జాడలేవీ, ఏవి తల్లీ...? కవి వాక్కులో, ఆ ప్రశ్నపరంపరలో ఎంతటి చారిత్రక పరిణామ క్రమం దాగి ఉందో అర్థం అవుతుంది. వర్తమాన ప్రపంచంలో, ముఖ్యంగా భూస్వామ్య వ్యవస్థ అవశేషాలు తొలగకుండానే పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రవేశించి ఆవహించిన మనలాంటి సామాజిక రాజకీయ వ్యవస్థల్లో అనేక ఆటంకాల మధ్యనే సాధ్యం కాగల ప్రజాహిత సంస్కరణలకు నడుం కట్టగల యువనేతలు, యువ రాజ కీయవేత్తలు తలెత్తడం చరిత్రకు కొత్తేమీకాదు. అలాంటి వారు మనం ఊహించేంత విప్లవకారులో, రాడికల్సో కాకపోయినా పేద, మధ్య తరగతి ప్రజల ఈతిబాధల్ని అర్థం చేసుకుని తమ శక్తియుక్తులను ప్రజాహిత సంస్కరణలను అమలుపర్చడానికి నడుం కట్టినవారై ఉండొచ్చు. చీకటి ఉన్న చోట చిరుదీపాల్ని వెలిగించి మార్గనిర్దేశం చేసే వాళ్లు విప్లవకారులే కానక్కర్లేదు. సంస్కరణవాదులే కావచ్చు. గత ఔన్నత్యాన్ని మర్చిపోయారా? ఈ గుర్తింపునకు దూరమైనందువల్లనే ఎన్నో ఏళ్లుగా పోరాటాల అను భవంలో తలపండిన ఎంతోమంది వామపక్ష నాయకులున్నా, డెబ్బై, ఎనభైఏళ్ల త్యాగాల చరిత్ర ఉన్నా – నేటి ఆంధ్రప్రదేశ్‌లో ఈనాటి కొన్ని వామపక్షాలు, అందులోని కొందరు నాయకుల ప్రవర్తన మాత్రం ప్రజ లకు నిరాశ కలిగిస్తోందని చెప్పక తప్పదు. ఆ పక్షాలకు చెందిన కొందరి ప్రవర్తన, వైఖరి చివరికి ప్రజాహిత సంస్కరణలకు కూడా వ్యతిరేకించినవిగా ప్రజల మనస్సుల్లో రిజిస్టర్ కావటం వామపక్షాల గత ఔన్నత్యానికి మంచిది కాదు. ఈమాట ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే–గతంలో ఆంధ్రరాష్ట్రంలో 1940వ దశకంలో కరువు పరి స్థితులు తాండవిస్తున్న రోజుల్లో కరువు కోరలనుంచి రైతాంగాన్ని, వ్యవసాయ కార్మికులను కాపాడుకోవడానికి కమ్యూనిస్టు పార్టీ చీలి కలు లేకుండా ఉమ్మడిగా ఒక్క త్రాటిపైన నడుస్తున్న శుభ ఘడియలో బందరు కాల్వలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరి ఆహ్వానం లేకుండానే భారీస్థాయిలో పూడికలు తీసిన మహోన్నత చరిత్రను మరవలేము. ఈ ప్రజాహిత కార్యక్రమానికి ప్రత్యక్షంగా నడుం బిగించి, నిర్మాణ కార్యక్రమానికి నాయకత్వం వహించిన అగ్రనాయకులు పుచ్చలపల్లి సుందరయ్య, చండ్రరాజేశ్వరరావు ప్రభృతులు. ఆనాడు కాంగ్రెస్ వారు ఆ కాల్వల పూడికలు తీయడంలో పాలుపంచుకోవడా నికి నిరాకరించారని మరిచిపోరాదు. ఆ పూడికల కార్యక్రమంలో కమ్యూనిస్టు పార్టీతో సంబంధం లేనివారు కూడా ఆ ఉమ్మడి ప్రజా హిత కృషిలో పాలుపంచుకున్నారు. చివరికి నాటి కమ్యూనిస్టు పార్టీలో కూడా ఈ ప్రజాహిత కార్యక్రమంలో పాల్గొనే విషయంలో కొన్ని రకాల గొణుగుళ్లు, సణుగుళ్లు కూడా వినిపించాయి. ఈ విషయాన్ని సుందరయ్య తన ఆత్మ కథలో కూడా రాసుకున్నారు. ఆ చరిత్రలో కరువు కాలంలో బందరు కాల్వలకు పూడికలు తీసి పేద రైతు, వ్యవసాయ కార్మికుల ఉసురు నిలిపేటట్టు చేయడానికి కమ్యూనిస్టు పార్టీ చేసిన కృషిని సుందరయ్య ఇలా వివరించారు. వలంటీర్ల సమీకరణ కోణంలో అతిపెద్ద విజయం ‘‘ఈ మధ్యకాలంలోనే (కరువుకాలం) మేము చేపట్టిన మరో కార్య క్రమం బందరు కాల్వ పూడికలు తీయడం.. కాలువ లోతట్టు పూడు కుపోయి లోతు తగ్గిపోయి, పొలాలకు నీళ్లుసరిగా పారని స్థితి ఏర్ప డింది. ఇంజనీర్లకు తగినంత మంది కూలీలు దొరక్క బందరు కాల్వ పూడిక తీత చేపట్టలేకపోయారు. ఆ పరిస్థితిలో మేము ముందు కొచ్చి, నామమాత్రపు వేతనాలకు ఆ పూడిక బాధ్యతను నిర్వర్తిస్తామని ఇంజ నీర్లకు చెప్పాం. ఆ మేరకు పనిచేయాలని పార్టీ సభ్యులకు పిలు పిచ్చాం. వాలంటీర్లకు భోజన వసతి సౌకర్యాలకు మాత్రమే మేము ఏర్పాటు కల్పించాం. ఇతరులకు వసతి సౌకర్యం కల్పించాం. అలా బందరు కాల్వ తూర్పు గట్టు కాల్వ తవ్వే పని నెలరోజుల్లోపు పూర్త యింది. శ్రామికుల పార్టీగా వలంటీర్ల సమీకరణ కోణం నుంచి చూస్తే అప్పటికిది చాలా పెద్ద విజయమే. ఈ కృషి రైతాంగంపై గొప్ప ప్రభావాన్ని కలగచేసింది. ఈ విషయంలో మనం మరీ సంస్కరణ వాదులుగా మారిపోతున్నా మని విమర్శ కూడా కొంతమంది నుంచి వచ్చింది. ఇవన్నీ ప్రభుత్వం నిర్వహించవలసిన పనులని వారన్నారు. మనం అంత పెద్ద బరువును మీద వేసుకుని ఉండాల్సిందా లేదా అన్నదానిపై ఆంధ్రకమ్యూనిస్టు పార్టీ కమిటీలో కూడా విభేదాలొచ్చాయి. ఏమైనప్పటికీ అత్యధికులు మాత్రం ఈ కార్యక్రమం (కాల్వ పూడికలు తీయడం) మంచిదని భావించారు. ఆ విధంగా నా వాదన సరైందని రుజువైంది. పార్టీ, కేంద్రకమిటీ కూడా కాల్వ పూడి కల తీత కార్యక్రమాన్ని కొనియాడింది. నిజానికి ఆ తర్వాత జరిగిన నేత్రకోన మహాసభలో ప్రతినిధులు తమ తమ ప్రాంతాల్లో అమలు చేయదగిన ఉదాహరణగా అందరి కార్యకర్తల అనుభవాన్ని పేర్కొన్నది. ఆ తర్వాతి కాలంలో ఆంధ్రలోని గ్రామాల్లో సాగునీటి కాల్వల తవ్వకం చెరువుల పూడిక తీతను చాలా విస్తృత స్థాయిలో చేప ట్టాము.’’ బాబు నీడలో కొందరు వామపక్ష నేతలు ఇంతకూ చెప్పొచ్చేదేమంటే, నాయకుల బాధ్యత, ప్రవర్తన ఎలా ఉండాలో, దానిపై ఆధారపడే కార్యకర్తల కార్యాచరణ కూడా ఉంటుం దని తమ జీవిత కాలంలో నిరూపించిన వారు సుందరయ్య, రాజేశ్వర రావులు. ఆనాడు ఎవరో బొట్టుపెట్టి పిలిస్తేనే పార్టీ కార్యకర్తలు నాయకులతో పాటు కదిలి వచ్చినవారు కారు. ఆ నిర్మాణ కార్య క్రమంలో గాంధీజీ స్ఫూర్తి కూడా నాటి ఆంధ్రా కాంగ్రెస్‌కు లేదు. కాగా, అందుకు భిన్నంగా వైఎస్సార్ కాంగ్రెస్ వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఏర్పడిన ప్రభుత్వం, పదవీ స్వీకార సభ లగాయతు ఈరోజు దాకా, అతని దీర్ఘ పాదయాత్ర స్ఫూర్తి ద్వారా కదిలివచ్చిన తెలుగు ప్రజా బాహుళ్యం, ‘నవరత్నాల’ హామీని ఆచరణలో అక్షరాల అనుభవిస్తున్నారన్నది నగ్న సత్యం, పచ్చి నిజం! గోపీచంద్ నవలలోని ‘అసమర్థుడి జీవయాత్ర’ కొనసాగించ వలసి వచ్చి, అవినీతి మినహా మరొక యావత్తు లేకుండా పరిపాలన చేసి రాష్ట్రాన్ని అధోగతి పాల్జేసి అభాసుపాలైన నేటి ప్రతిపక్ష నాయ కుడు చంద్రబాబు నీడలోనే రకరకాల వేషాలలో వామపక్షాలలోని కొందరు నాయకులు కాలక్షేపం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర విభజనకు, ఆ సాకు చాటున పదవిని ఆంధ్రలో కాపాడుకోవడానికి తనకు తానై రహస్యంగా కేంద్ర కాంగ్రెస్ నాయకత్వం ముందు విభ జనపై సంతకంచేసి ముక్కుముఖంలేని రాజధానిని ఎంపిక చేశాడు. అదీ, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం కాదు, ఆ పేరిట తనకూ, వంది మాగధులకు ఆస్తులు కూడబెట్టుకోవడానికి, కాబోయే రాజధాని భూములపై స్పెక్యులేషన్ వ్యాపారానికి గజ్జెకట్టినవాడు బాబు. అమరావతి పేద రైతుల్ని మభ్యపెట్టి, వారి భూముల సరిహద్దులు చెరిపి, వారిని బికారులు చేయడానికి సన్నద్ధమయ్యాడు, వంది మాగధులందరికీ ‘తిలా పాపం తలా పిడికెడు’ వంతున భూముల్ని దోచిబెట్టి అందులో ఒక వామపక్షంలో తనకు కొమ్ముకాస్తున్న ఒక రిద్దరు మిత్రులకు కూడా అవినీతిలో భాగం చేశాడని, అందుకే బాబు అక్రమ ధర్మాలన్నింటికి ‘తలూపి’నట్టు లోకం కోడై కూస్తోంది. ఆ అపవాదు నుంచి కొందరు వామపక్షీయులు తక్షణం బయటపడాల్సి ఉంటుంది. నెగటివ్ ధోరణి ప్రజావ్యతిరేకం! అలాగే రాష్ట్రాధికారానికి వచ్చిన నాటి నుంచి యువనేత జగన్‌ను ముప్పెరగొన్న సమస్యలు అసాధారణమైనవి. ప్రధానంగా సామాన్య మధ్యతరగతి రైతు, వ్యవసాయ కార్మిక, విద్యార్థి, మహిళాభ్యుదయా నికి అనేక కనీస ప్రజాహిత సంస్కరణలను దేశంలో ఒక్క కేరళ మినహా అనితరసాధ్యంగా అమలు జరుపుతున్న రాష్ట్రం ఒక్క ఆంధ్ర ప్రదేశ్ అన్న పేరు వచ్చింది. దానికితోడు కరోనా వైరస్ మహమ్మారి ఎదురైనా, దాన్ని తట్టుకుని ఒకవైపున ప్రజల ఆరోగ్య భాగ్యాన్ని రక్షించి కాపాడుకొనే ప్రయత్నంలో వైఎస్ జగన్ తీసుకున్న ప్రజా వైద్య రక్షణ చర్యలూ దేశ ప్రజల, వివిధ రాష్ట్రాల ప్రశంసలూ అందు కుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో జగన్‌కు అంతో ఇంతో అండగా, చేదోడు వాదో డుగా వామపక్షాలు ఆచరణలో పూర్తిగా నిలవకపోయినా– ‘దీవులు’ మాదిరిగా అనంతపూర్‌లో రాంభూపాల్ సీపీఎం జిల్లా కార్యదర్శి, కడపలో ఈశ్వరయ్య (సీపీఐ) ప్రభృతులు మాత్రం క్రియాశీల పాత్ర నిర్వహిస్తున్నారు. ఎందుకంటే, ఏ పార్టీ అయినా, సంక్లిష్ట సమయాల్లో తమ క్యాడర్‌ను కాపాడుకోవాలన్నా, కష్టకాలంలో ప్రజలకు ఆచ రణలో అండగా నిలవాలన్నా ‘నెగెటివ్ ధోరణులు’ మానుకోవాలి. ఈ ఇరువురు స్థానిక వామపక్ష నాయకులు మినహా ప్రస్తుత కాలంలో ఆచరణలో క్రియాశీల పాత్ర నిర్వహిస్తున్న వామపక్షీయులు ‘కలికాని కైనా’ కనిపించకపోవడం విచారకరం. కనీసం ఆనాటి ‘బందరు కాల్వల పూడికతీత’ పనుల్లో పాల్గొన్న కార్యకర్తల కృషినుంచైనా స్ఫూర్తిని చేరుకోవాలి. తెలంగాణలో కూర్చుని ఆంధ్ర రాజకీయాలు నడపగోరే చంద్రబాబుని ఆదర్శంగా తీసుకోకండి. జోగి, జోగి రాసు కుంటే రాలేది బూడిదే! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
కరోనాకి ముందే ‘ఈవెంట్ 201’?!
‘‘సార్స్ అంటువ్యాధి సార్స్–కోవిడ్‌గా కరోనా వైరస్ రూపంలో చైనాలోని వూహాన్ వైరాలజీ పరిశోధనా సంస్థ నుంచే పుట్టుకొచ్చిన చైనీస్ వైరస్సేననీ, ఇది జీవాయుధమేననీ, దానిని యుద్ధ ప్రయోజనాల కోసమే చైనా సృష్టించిందనీ సాగుతున్న ప్రచారం పచ్చి అబద్ధపు ప్రచారం. 2020 జనవరి 26న అమె రికా పత్రిక ‘వాషింగ్టన్ టైమ్స్’లో ప్రచురించిన ఈ ప్రచార వ్యాసానికి ఆధారం ఇజ్రాయెల్ మాజీ సైనికాధికారి ఒకడు చేసిన ఈ ఆరోపణయే. కానీ ఆ వెనువెంటనే మార్చి 17న కొలంబియా యూనివర్సిటీకి చెందిన స్క్రిప్స్ పరిశోధనా సంస్థకు చెందిన శాస్త్రవేత్త క్రిస్తియన్ ఆండర్సన్, ప్రొఫెసర్ లాన్ లిప్కిన్ రెండవ సార్స్ వ్యాధి రూపంలో వచ్చిన కరోనా వైరస్ చైనా పరిశోధనా గారం సృష్టి ఎంతమాత్రం కాదని స్పష్టం చేశారు. ఏ వ్యాధి అయినా జంతుజాలం నుంచి బయటకు బదిలీ అయ్యేముందు ఆ జంతువు అంతకుముందు ఏ పరాశ్రయ జీవిపై ఆధారపడిందో దాని ఫలితంగా బదిలీ అవుతుంది కాగా, సదరు జంతు జాలం నుంచే స్వభావసిద్ధంగా (నేచురల్ సెలక్షన్) మానవులకు వ్యాధి సంక్రమిస్తూంటుంది’’. – అనంత కృష్ణన్ (ది హిందూ: 27–04–2020) అబద్ధాల అంకయ్యకు అరవైనాలుగు అసత్య ప్రమాణాలన్న సామెత ఉబుసుపోకకు పుట్టింది కాదు, ఆ సామెత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లాంటి వాళ్లను చూసే ప్రచారంలోకి వచ్చి ఉంటుంది. కరోనా వైరస్ మహమ్మారి సుమారు గత ఎనిమిది శతాబ్దాలుగా ప్రపంచాన్ని కకావికలు చేసి కోట్లాది మంది ప్రజల్ని పొట్టన పెట్టుకున్న ఫ్లూ, ప్లేగు, క్షయ, న్యూమోనియా, సార్స్, ఎబోలా ఇత్యాది వైరస్ల మాదిరే పుట్టుకొచ్చిన ఉగ్రవ్యాధి. అయినా ట్రంప్ అంటువ్యాధుల వ్యాప్తికి ఒక జాతినో, ఒక దేశాన్నో, మానవాళిలో ఒక భాగాన్నో, ఒక ప్రభుత్వాన్నో కారణంగా వివక్ష చూపడానికి ప్రత్యేక కారణం ఉంది. అది– నేటి ప్రపంచంలో రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య రాజకీయం గానూ, నైతికంగానూ హోరాహోరీగా పోటీ కొనసాగుతోంది. ఒక వ్యవ స్థకు అంటే నయావలస సామ్రాజ్య పాలనా వ్యవస్థకు అమెరికా నాయకత్వం వహిస్తుండగా, మరొక వ్యవస్థకు ఆ వలసపాలనా దోపిడీ వ్యవస్థలపై ఎదురు తిరిగి విప్లవం ద్వారా, త్యాగాల ద్వారా ప్రజా బాహుళ్యం అండతో సోషలిస్టు వ్యవస్థను స్థాపించుకుని రక్షించుకుం టున్న నవచైనా నాయకత్వం వహిస్తోంది. ఈ సంకుల సమరం ఇప్ప టితో ఆగేది కాదు. ప్రజాహిత వ్యవస్థను కంటికి రెప్పలా కాపాడుకోదలిచిన సోషలిస్టు వ్యవస్థకు తన ప్రజల్ని తానే చంపుకునేందుకు శాస్త్ర పరిశోధ నాగారాల్లో చేజేతులా ఒక వైరస్‌ను పనిగట్టుకుని సృష్టించుకోదు. కానీ జాతుల్ని, వ్యవస్థల్ని ధ్వంసం చేయడం ద్వారా, పీడన ద్వారా వలస పాలనా దోపిడీ వ్యవస్థను, దురాక్రమణల ద్వారా దేశాల సంపదను కొల్లగొట్టే సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ వ్యవస్థను రక్షించుకోజూసే పాలక వర్గాలకు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఒక కూసువిద్య. కరోనా వ్యాప్తి సందర్భంగా ఆ వ్యాధి వెనక దాగి అలాంటి వ్యాధుల్ని జీవాయుధాలుగా లేబొరేటరీల్లో సృష్టించుకోవచ్చుననీ, ఒక రహస్య కృత్రిమ ప్రయోగం ద్వారా ఇటీవలనే ప్రపంచం కళ్లు కప్పి అమెరికా సామ్రాజ్యపాలక యుద్ధోన్మాదులు ప్రయత్నించారనీ సుప్రసిద్ధ అమెరి కన్ మేధావి, ప్రసిద్ధ భాషా శాస్త్రవేత్త, సామాజిక వ్యవహారాల నిశిత పరిశీలకుడైన ప్రొఫెసర్ నోమ్ చామ్స్కీ కొద్దిరోజుల నాడే బయట పెట్టారు. కొన్ని రోజులపాటు ప్రపంచ వెబ్సైట్లలో వైరల్‌గా మారిన ఆ వార్తను కొలది రోజులనాడు అమెరికా ఒత్తిడి పెట్టి తొలగింప చేసుకు న్నట్లు తాజా వార్తలు. ఇంతకూ ఆ రహస్య ప్రయోగానికి తగిలించిన ముద్దుపేరు ‘ఈవెంట్ 201’ (‘ఘటన 201’) చైనాలో కరోనా వ్యాధి గురించిన వార్త వ్యాప్తి కావడానికి 2020వ సంవత్సరానికి ముందర, అంటే 2019 అక్టోబర్‌లోనే, కరోనా లాంటి మహమ్మారి వ్యాధి అలు ముకోవడానికి అనువైన అంతే లక్షణాలను కృత్రిమంగా భారీ ఎత్తున సృష్టించడం గురించిన కృత్రిమ శాస్త్ర ప్రయోగాన్ని లేబొరేటరీలో అమె రికా నిర్వహించింది. ఆ ప్రయోగానికే ఈవెంట్ 201 అని పేరు పెట్టారు. దీన్ని నిర్వ హించినవారు ప్రపంచ మహా కోటీశ్వరుడైన అమెరికన్ బిల్‌గేట్స్ (బిల్ అండ్ మెలిండా) ఫౌండేషన్‌తో చేతులు కలిపిన జాన్స్ హాస్కిన్స్ ఆరోగ్య భద్రతా కేంద్రీయ సంస్థ! నిజానికి కరోనా వైరస్ మహ మ్మారిని తలెత్తకుండా నివారించవచ్చని, నివారించగల్గినంత సమా చారం లేకపోలేదనీ ప్రొఫెసర్ చామ్స్కీ చెబుతూ ఇలా వ్యాఖ్యానిం చారు: ‘అయినా, ఎలాంటి ప్రయత్నమూ అందుకు జరగలేదు. పైగా కరోనా సంక్షోభం రాజకీయ వ్యవస్థల విద్రోహంవల్ల మరింత తీవ్రరూపం దాల్చింది. తమకు తెలిసిన, అందుబాటులోనే ఉన్న వ్యాధి వ్యాప్తి నిరోధక సమాచారంపైన రాజకీయ వ్యవస్థలు శ్రద్ధ పెట్టలేదు’. కాగా, చైనాలో న్యుమోనియా వ్యాధి లక్షణాలుగా కనిపి స్తున్నా, దాని పుట్టుపూర్వోత్తరాలు మాత్రం తెలవడం లేదని చైనా ప్రభుత్వం 2019 డిసెంబర్ 31న ప్రపంచ ఆరోగ్య సంస్థకు సమా చారం అందించింది. ఆ తర్వాత వారం రోజులకు చైనా శాస్త్ర వేత్తలు ఈ అజ్ఞాత వ్యాధిని కరోనా వైరస్‌గా గుర్తించగలిగి, వెంటనే దాని లక్షణాలను వడపోసి మరీ ప్రపంచానికి సంబంధిత సమాచా రాన్ని అందించారు. సరిగ్గా ఈ దశలోనే ట్రంప్ రోజుకో మాట వదులుతూ వచ్చారు. ‘అబ్బే’ సంక్షోభం ఏమీ లేదు, కరోనా, ఫ్లూ లాంటిదే అని ఒకరోజు, ఆ మరునాడే ‘ఇది పెద్ద సంక్షోభమే సుమా, నాకెప్పటినుంచో తెలుసు’ అనీ, ‘మన వ్యాపకాలు మనం చూసుకుందాం, నేను ఏమైనా సరే రేపటి ఎన్నికలు గెలవాలి’ అనీ ట్రంప్ పేలుతూ వచ్చాడు. అందుకే చామ్స్కీ ‘ఇలాంటి బాపతు నాయకుల చేతుల్లో ప్రపంచం మనగల గడం చాలా దిగ్భ్రాంతి కలిగిస్తోంది’ అని వ్యాఖ్యానించవలసి వచ్చింది. అంతేగాదు ఆయన ట్రంప్‌ని ‘బుద్ధిజాడ్య జనితోన్మాది, సంఘవిదూషకుడు’ (సైకోపతిక్ బఫూన్) అని విమర్శించాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో మానవాళిని ట్రంప్, అతని ‘ఛోటా’లూ ప్రపంచాన్ని ప్రమాదపుటంచుల్లోకి నెడుతున్నారనిపిస్తోందనీ, నేడు మనల్ని రెండు రకాల భీకర ప్రమాదాలు–అణ్వస్త్ర యుద్ధ ఛాయలు, అదుపుతప్పిన వాతావరణ కాలుష్యంతో మంటల కుంపటిగా మారు తున్న భూతలమూ వెంటాడుతున్నాయని హెచ్చరించారు. కరోనా వల్ల ప్రమాదాలను ఇవాళ కాకపోతే రేపైనా అదుపు చేసుకోగల అవ కాశం ఉంది. కానీ, ఇతర ప్రమాదాలనుంచి కోలుకోవడం ఉండదు. 2019 అక్టోబర్ 18–27 మధ్య ఏం జరిగింది?! ఈ తేదీల్లోనే వూహాన్(చైనా) నగరంలో ప్రపంచ దేశాల సైనిక విన్యాసాలు జరిగాయి. ఆ ప్రదర్శనల్లో వంద దేశాల నుంచి వచ్చిన సైనికు లతోపాటు 300 మందికి పైగా అమెరికన్ సైనికులూ పాల్గొన్నారు. ఆ తర్వాత సరిగ్గా రెండు వారాలకే వూహాన్లో మొట్టమొదటి కోవిడ్–19 కరోనా మహమ్మారి వ్యాధి బయటపడింది. సరిగ్గా ఇది గమనించిన అమెరికా పోర్ట్ డెడ్రిక్ పట్టణంలోని తన సైనిక జీవాయుధ రక్షణ పరిశోధనశాలను కాస్తా అకస్మాత్తుగా మూసేసింది. 2019 అక్టోబర్ 18న జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ, బిల్‌గేట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో న్యూయార్క్‌లో ఒక రహస్య సమావేశ ప్రదేశంలో.. కరోనా లాంటి మహమ్మారి వస్తే తీసుకోవలసిన జాగ్రత్తల పేరిట అదే తరహా వ్యాధి నమూనాతో ‘ఈవెంట్ 201’ ప్రయోగం నిర్వహించారు. ఈ రహస్య సమావేశంలో ఆహ్వానితులకు మాత్రమే ప్రవేశం అని బోర్డు పెట్టారని ‘ఇన్స్టాగ్రామ్’ పోస్ట్ ద్వారా తెలిపారు. ఈ రహస్య సమావేశ ప్రయోగ విన్యాసానికి ఏం పేరు తగిలించారో తెలుసా– ‘ప్రపంచానికి తుది ఘడియలు’ (నౌ ది ఎండ్ బిగిన్స్)! బిల్‌గేట్స్ ఏర్పాటుచేసిన విలయ తాండవ రహస్య ప్రయోగంలో జిలుగు వెలుగుల కరోనా వైరస్ ఆటబొమ్మ సహాయంతో (ప్లష్ టాయ్) రాగల వినాశనాన్ని చూపాడు. అందులో కొద్ది మాసాల్లోనే ఎలా వేలకు వేలుగా ప్రజలు నేలకు ఒరిగిపోతారో చూపిస్తాడు. అందులో చెప్పిన భయకంపిత వాతావరణాన్ని ఇలా వర్ణిస్తాడు: రేపు మీరు చూడబోయే ‘నవ ప్రపంచ వ్యవస్థ’ ఎలాంటిదంటారు? సంతా నప్రాప్తి వైజ్ఞానిక శాస్త్రం ఆధారంగా సంతానం లేకుండా చేసి, వంధ్య త్వాన్ని కల్గించి జనాభాను తగ్గించేయడం మైక్రోసాఫ్ట్ అధిపతి కోరిక అని ‘ఎన్టీఈబీ’ వెబ్సైట్ ప్రచారం. ఇలాంటి ప్రయోగాలకు అవస రమైన ఇంజెక్షన్లు రూపొందించడానికి బడా ఫార్మా కంపెనీలు, బిల్ గేట్స్ చేతులు కలుపుతున్నారని వార్త. ఈ రహస్య ప్రయోగశాలకు (ఈవెంట్ 201) అమెరికా గూఢచారి శాఖ మాజీ అధికారులు, వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్, ఫార్మా, పీఆర్ఓ సంస్థ ప్రతినిధులూ హాజర య్యారు. ఈ అమెరికా రహస్య ప్రయోగం సఫలమైతే ఆచరణలోకి వస్తే ఏకధాటిన 6 కోట్ల 50 లక్షల మంది ప్రాణాలు గాలిలో కలిసి పోతాయని అంచనా. నిజానికి అమెరికా ‘లియోటాయిస్’ ఉన్మాదపు యుద్ధ పిపాసను పెంచే పరికరాలు, పిల్లలతో మతిభ్రమింపజేసే ఉన్మాదాన్ని పెంచే పరికరాలు ఇప్పటిదాకా ముక్కుపచ్చలారని పెక్కు మంది చిన్నారుల జీవితాలతో ఆటలాడుకుంటూ వస్తున్నవేనని మరవరాదు. అసలెందుకీ కరోనా వైరస్ సంక్షోభం తలెత్తవలసి వచ్చిందన్న ప్రశ్నకు ప్రొఫెసర్ చామ్స్కీ సమాధానం వేరు: ‘ఈ సంక్షోభం మార్కెట్ పరిస్థితుల వైఫల్యంవల్ల బిళ్లదీటుగా విరుచుకుపడిన ఫలితం. మార్కెట్ శక్తుల వైఫల్యం అనేది నయా ఉదారవాద ఆర్థిక సంస్కరణలవల్ల అపరిష్కృతంగా పోగుబడి పేరుకుపోయిన సాంఘిక, ఆర్థిక సమస్యల పర్యవసానమని మరచిపోరాదు. ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ప్రజా రోగ్య రక్షణకు మందులు, వ్యాక్సిన్లు అందవలసినచోట లాభార్జన ధ్యేయంగా ఎదిగే ప్రైవేట్ రంగం వైఫల్యం వల్ల సమస్యలు విశ్వరూపం దాల్చుతున్నాయి. ఉదారవాద ఆర్థిక వ్యవస్థవల్లనే నిరంకుశ పాలనా వ్యవస్థలు బతుకుతున్నాయని మరవరాదు’! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
కరోనా విజేత మానవుడే!
‘‘అంటువ్యాధులతో మానవుడి పందెం ఈ రోజుది కాదు సుమా! ఈ భూతలంపై కొండలు, కోనల పుట్టుకతోనే మానవుడి జీవితం ముడిపడి ఉందని మరచిపోరాదు. ఈ విషయం ఘనాపాటీల రచనల్లో, కవితల్లో నిక్షిప్తమై ఉన్నవే’’. – అర్ఘ్యకుమార్ బెనర్జీ, డీన్ ఆఫ్ ఆర్ట్స్, కోల్‌కతా ‘‘అంటు రోగాల వ్యాప్తి గురించిన ఉబు సుపోని, నిర్హేతుకమైన గుడ్డి నమ్మకాల నుంచి ప్రజల్ని విముక్తి చేయడం విజ్ఞాన శాస్త్రం ధర్మం. రోగాలు, రొష్టులు పనిగట్టుకుని ఫలానా జాతినో, ఫలానా ప్రాంతాన్నో, దేశాన్నో కావాలని వివక్షతో ఎంచుకోవు. అంటు వ్యాధులకు కావలసింది లేదా అవి ఆశ్రయించేది మానవ శరీరాన్ని– శీతోష్ణస్థితి గతులతో సంబంధం లేకుండా బలి ష్టమైన పోషకాలు లభించే మానవ శరీరాన్ని. దురదృష్టవశాత్తు వ్యాధి కారక పరాన్న జీవుల్ని గురించిన సశాస్త్రీయమైన వైజ్ఞానిక విజయాలకు సంబంధించిన అవగాహనను పక్కకు నెట్టేసి.. శాస్త్ర సాంకేతిక, వైద్య, వైజ్ఞానిక దృష్టిని కొందరు పక్కదారులు పట్టిస్తున్నారు’’. – అమితాంగ్షు ఆచార్య, పీఏడీ స్కాలర్, ఎడింబరో, ఇంగ్లండ్ కత్తిని కత్తి రద్దు చేస్తుంది, యుద్ధం యుద్ధాన్ని జయిస్తుంది, అమా నుష వ్యాధిని శరీరంలోని విరోధ వ్యాధి లక్షణాలు లేదా ప్రతికూల క్రిములు (యాంటీ బాడీస్)ను సృష్టించడం ద్వారా నిర్మూలమవు తాయి. ఈ అనుకూల, ప్రతికూల క్రిముల సృష్టి రహస్యాన్ని జీవశాస్త్ర వైజ్ఞానిక పరిశోధనల ఫలితమేనని మరచిపోరాదు. జన్యు లక్షణాల మార్పిడిగానీ, మానవ శరీరంలో అనుకూల ప్రతికూల జన్యువులను, వాటి లక్షణాలను కనిపెడుతూ అనుకూల జన్యువుల సంరక్షణ కోసం జీవశాస్త్ర పరిశోధకులు అనునిత్యం తమ కళ్లను, మెదళ్లను పదును పెట్టుకున్న దాని ఫలితమే– టీకాలు, ఇంజక్షన్ల సృష్టి. మానవాళిని చరిత్రలో ఆరోగ్యపరంగా శతాబ్దాల తరబడి కకావికలు చేసి వదిలిన చిన్నవి, పెద్దవి మహమ్మారులు ఎన్నో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో తాజాగా ప్రపంచ దేశాలను పీడిస్తున్న మహమ్మారి ‘కరోనా’ వ్యాధి... గత కాలంలో కోట్ల సంఖ్యలోనే ప్రజల ప్రాణాలు తీసిన అంటువ్యాధు లకన్నా పెద్దది కాకపోయినా ప్రతి వందేళ్లకు వచ్చే ప్రమాదకర వ్యాధుల్లో ఒకటి. వ్యాధుల కారణాలు అనేకం– ప్రకృతిని మచ్చిక చేసుకుని తన బతుకు తీర్చిదిద్దుకునే క్రమంలో పర్యావరణ స్పృహను కోల్పోయి, సంపదపై ఆబ కొద్దీ బడుగుజీవుల బతుకుదెరువును గాలికి వదిలి వేయడం, అందుకు పాలకవర్గాలు, ప్రభుత్వాలూ సహ కరించి, తమ ప్రలోభాల్ని ఈడేర్చుకోవడమూ చాపకింద నీరులా విధ్వంసకాండ జరిగి పోతూండటమూ. అయితే, ప్రతి నూరేళ్లకొకసారి తీవ్రస్థాయి అంటువ్యాధులు, కరోనాలాంటి మహమ్మారులు ‘దొంగ చాటు దూరబంధువుల్లా’ మానవాళిని కబళిస్తున్నాయి. యుద్ధాలు, క్రిమియుద్ధాలు, భారీ అణ్వస్త్ర ప్రయోగాలు వెదజల్లే ధూళిధూసరితా లవల్ల వాతావరణ కాలుష్యాల ద్వారాను ఇవి విస్తరిస్తున్నాయి. అయితే తిరిగి వీటిని అదుపుచేసి ప్రగతిరథాన్ని ముందుకు నడిపించుకోవ లసినవాడూ ఈ మానవుడేనని మరచిపోరాదు. తన ఉనికిని, మాన వాళి ప్రగతికి ఎదురయ్యే మహమ్మారులను తన అమోఘమైన శాస్త్ర పరిజ్ఞానంతోనే అదుపుచేసి తొలగించుకుంటూ ముందుకు దూసుకు పోతున్న ఈ మానవుడే తిరిగి మహనీయుడుగా అవతరిస్తున్నాడు. ఆ మహనీయతను చరిత్రలో తొలిసారిగా సాధించినవాడు క్రీస్తు పూర్వం 400 ఏళ్లనాడు హిప్పోక్రటీస్. ఈయన ప్లాటో, సోక్రటీస్, బుద్ధుని కాలంనాటివాడు. మనం చెప్పుకునే ఆధునిక వైద్య పితా మహుడు ఆనాటి హిప్పోక్రటిస్. గ్రీస్‌వాడైన ఆయన రచనల్ని, పరి శోధనల్ని కనుమరుగవకుండా కాపాడినవారు అరబ్బులేనని మరవ రాదు. అలా ఆయన గ్రీక్ వైద్య విధాన సూత్రాలను అరబ్బులు భద్ర పరచకపోతే ఆ రచనలు ఎప్పుడో కనుమరుగు అయ్యేవి. తన వైద్య విధానాన్ని హిప్పోక్రాటిస్ నాలుగు భాగాలు చేసి వాటికి ‘నాలుగు హాస్యాలు’ (హ్యూమర్స్) అని పేరుపెట్టాడు. అందరికీ బోధపడటం కోసం అవి: రక్తం, కాలేయంలో ఊరే పైత్య రసం, పచ్చరసం (కామెర్లు), కఫం లేదా శ్లేష్మం అని విభజించాడు. వ్యాధి తీరు తెన్నులనుబట్టి శరీరంలో సమతుల్యత నిర్ధారణ అవుతుందన్నాడు. వీటి సమతుల్యతమీదనే మనిషి చావు బతుకులు ఆధారపడి ఉంటాయిగానీ ఏ మంత్ర తంత్ర శక్తి వల్లనో నిర్ధారణ కావని తేల్చాడు. హిప్పోక్రాటిస్ వాడిన వైద్య పదాలన్నీ గ్రీసు పదాలే. వ్యాధుల గుణాల్ని క్రానిక్, ఎపెడిమిక్, ఎండెమిక్, గైనిక్, కార్డియా (గుండె), యుథనేసియా, ఆఫ్తాల్మస్, పిడియాట్రిక్స్.. ఈ పదసృష్టి అంతా హిప్పోక్రాటిస్ ధర్మమే సుమా! అంతేగాదు, వైద్యాన్ని, వైద్య శాస్త్రాన్ని మతం నుంచి వేరు చేసిన తొలి వైద్య శిఖామణి కూడా హిప్పోక్రాటిసే. ‘కరోనా’ మహమ్మారిని ఇంతకుముందు పలు చిన్న, పెద్ద అంటు వ్యాధుల్ని కట్టడి చేసిన పద్ధతుల్లోనే అణచివేసి మానవుడే మహనీయుడని నిరూపించుకునే ఘడియ లకు చాలా దగ్గరలోనే ఉన్నాడని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. కనుచూపు మేరల్లోనే కరోనాపై మానవుడు అంతిమ విజేత కాబోతు న్నాడు. ఇందుకు ప్రపంచంలో దాదాపు 280 కోట్ల జనాభాకు ప్రాతి నిధ్యం వహిస్తున్న భారత్–చైనా శాస్త్రవేత్తల, వైద్య పరిశోధకుల తొలి ప్రయత్నంగా ‘ప్లాస్మా థెరపీ’పై చేస్తున్న ప్రయోగాలు విజయవంత మయ్యే దశలో, కొద్ది మాసాల్లోనే ఫలప్రదమైన టీకాలు, ఇంజక్షన్ల రూపంలో బయ టపడే అవకాశాలు పెరిగాయి. దీనికి కారణమూ, ప్రేరణా కరోనా వ్యాధి వ్యాప్తి సందర్భంగా తొలి ప్రయోగ బాణంగా క్యూబా, చైనా, సోషలిస్టు దేశాలు వదిలిన ‘ప్లాస్మా చికిత్స’ విధానం. నిరూపిత మైనంతవరకు దీని వైశిష్ట్యం–కరోనా వ్యాధి నుంచి కోలుకునే రోగు లకు, ప్లాస్మా (రక్తం) ఎక్కించి రోగ నిరోధానికి తోడ్పడే యాంటీ బాడీస్ (ప్రతికూల జన్యు కణాలు)ను తయారు చేయడం. ఈ యాంటీ బాడీస్‌ను రూపొందించడానికి ముందుకొచ్చే ‘ఫార్మా’ సంస్థలకు లైసెన్స్ ఇవ్వడానికి భారత వైద్య పరిశోధనా కేంద్రం ముందు కొచ్చింది. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రీయ సంస్థ ప్రకటిస్తే.. యాంటీబాడీస్ కలిగిన ప్లాస్మాను ఎక్కించడం ద్వారా ముగ్గురు కరోనా రోగులు కోలుకోగా, మరో ఇద్దరి ఆరోగ్యం నిలకడగా ఉందనీ, ప్లాస్మాను ప్రయోగించిన మరో నలుగురు రోగులు పూర్తిగా కోలుకున్నారని కూడా కేంద్ర పరి శోధనా సంస్థ ఈ నెల 18న వెల్లడించింది. అందుకే సీసీఎంబీ డైరెక్టర్, శాస్త్రవేత్త రాకేశ్ మిశ్రా, నిర్వీర్యం చేసిన సూక్ష్మజీవితోనే టీకా (ప్లాస్మా చికిత్స) తయారీ సులువే అనే నిర్ణయానికి వచ్చి మూడునెలల్లోనే ప్రతికూల వైరస్‌ను ఉత్పత్తి చేస్తా మని భరోసా కల్పించారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ప్రజల ప్రాణాలు తీసిన వైరస్లు ఒకటీ, ఆరా కాదు. ప్రధాన వైరస్ల పెక్కింటి ‘పుట్టెంట్రుకలు’ లెక్కపెట్టాలంటే.. క్రీ.శ. 165 నుంచి 180 దాకా, ఆ పిమ్మట 1919–1920 నుంచి ఈరోజు, శతాబ్ది మహ మ్మారిగా మారిన కరోనా వరకు వస్తూ పోతూనే ఉన్నాయి. దాదాపు వీటిలో పెక్కు వైరస్లు ‘ఫ్లూ’కు చిన్నా, పెద్దా తోబుట్టువులే. ఫ్లూ, ఇన్ఫ్లుయెంజా, న్యుమోనియో, సార్స్–2, కోవిడ్– 19 వరకు ఏదో ఒక రూపంలో ఇది రాజకిరీటంలా నూతన మండ లాన్ని చుట్టిన కాంతి వలయంలా ఉన్నందున బ్రిటిష్ వైరాలజిస్టు డాక్టర్ డేవిడ్ టిర్రెల్ ఈ వైరస్‌లకు (1964–66) కరోనా వైరస్లు అని పేరు పెట్టాడు. ఇలా స్పానిష్ ఫ్లూ నుంచి ఏషియన్ ఫ్లూ (1957), ఎయిడ్స్ వ్యాధి కారక వ్యాధి మూలమైన హెచ్ఐవి, సార్స్ వైరస్ దాకా సామ్రాజ్య యుద్ధ కారణాల ఫలితంగా వాతావరణ కాలుష్యం ఆధారంగా పుట్టి పెరుగుతూ వచ్చిన వైరస్‌లే. ఎయిడ్స్ కారక మూలం హెచ్ఐవీ వైరస్ పుట్టి పెరిగింది ఆఫ్రికా ఖండంపై అమెరికా సామ్రాజ్యవాదం సాగిం చిన సైనికదాడి ఫలితం. అమెరికా సైనికులు సంసారాలకు దూరంగా సంవత్సరాల తరబడి ఆఫ్రికాలో గడపడం కారణంగా అక్కడి గొరి ల్లాలతో పెట్టుకున్న సంపర్కం వల్ల అంటించుకువచ్చిన వ్యాధికి మరోపేరే హెచ్ఐవి. దాని మరోపేరు ఎయిడ్స్. అయితే దాన్ని ఆఫ్రికా వ్యాధి అని పేరుపెట్టి ఆ దేశానికి అంటగట్టలేము. అలాగే చైనాలోని వూహాన్ మార్కెట్లో మాంసాహారం తిన్న వారి నుంచి పుట్టిన కరో నాను చైనీస్ వైరస్ అని ట్రంప్‌లాగా ఒక దేశానికి అంటగట్టలేము. ఇంతకూ ఒక ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకడం లేదు. అమెరికా సైనికులు ఆఫ్రికా చింపాంజీలతో సంపర్కంద్వారా పుట్టుకొచ్చిన హెచ్ఐవీ(ఎయిడ్స్) సంబంధిత వ్యాధుల వల్ల ప్రపంచంలో చని పోయిన వారి సంఖ్య 4 కోట్ల 48 లక్షలని అంచనా. ఇప్పటికి కరోనా వైరస్ విస్తృతిలో ప్రపంచ జనాభాలో సగంపైగా (450 కోట్లు) వ్యాధి గ్రస్తులు కాగా, మరణించిన వారి సంఖ్య 1,66,000కు చేరుకుంది. సరిగ్గా ఈ సందర్భంలోనే, భారతదేశంలో ప్రజారోగ్య రక్షణ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నందువల్లనే దేశంలోని వివిధ ప్రాంతాల్లో చికిత్స పొందుతున్న కరోనా రోగులు, క్వారంటైన్లో ఉన్న బాధితు లలో కొందరు ప్రభుత్వ ఆసుపత్రులలో ఉండలేక పారిపోతున్నారని అంతర్జాతీయ జర్నల్ లాన్స్‌ట్ తాజా నివేదికలో వెల్లడించింది. ఇందుకు కారణం దేశ జాతీయోత్పత్తుల విలువలో కేవలం 1.5 శాతం మాత్రమే ఆరోగ్యరంగంపై కేంద్రప్రభుత్వం ఖర్చు చేస్తోందని మిగతా జనాభా అంతా ప్రయివేట్ ఆస్పత్రులనే ఆశ్రయించాల్సి వస్తోందని రాసింది. పెట్టుబడిదారీ వ్యవస్థలో ఇలాంటి పరిస్థితిపై వ్యాఖ్యానిస్తూ జానన్ హికెల్ అనే ప్రపంచ ప్రసిద్ధ వ్యాఖ్యాత ఈ రకంగా వ్యంగీ కరించాడు. ‘పెట్టుబడిదారీ వ్యవస్థ 34 రకాల ఖరీదైన వెరైటీ డ్రెస్సులూ, 40 రకాల రోస్టులూ, టోస్టులనే కాకుండా.. యుద్ధాల కోసం 16,000 కిలోమీటర్ల దూరం వెళ్లి దాడి చేయగల ఖండాంతర క్షిపణుల్ని సిద్ధం చేయగలదు కానీ, ఏ కారణంవల్లో మౌలిక ప్రజారోగ్యానికి అవసరమైన మాస్క్‌లను, వెంటిలేటర్లను మాత్రం ఉత్పత్తి చేయలేకపోతోంది. అదీ అసలు రహస్యం.’ ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
నికార్సయిన చట్టం ‘దిశ’
ఏళ్లూ పూళ్లూగా తీర్పులు వాయిదా పడుతూ పోవడం వల్ల అత్యాచార బాధిత కుటుంబాల ఆవేదన చల్లారదు. అందుకే తీర్పు ఆలస్యమైన కొద్దీ న్యాయం ఆలస్యమైనట్టే కాదు, న్యాయాన్నే బాధితులకు దూరం చేసినట్లుగా భావించాలని రాజ్యాంగమూ, న్యాయ వ్యవస్థ సూత్రాలు కూడా నిర్ద్వంద్వంగా చెప్పడమూ జరిగింది. కనుకనే ఆలస్యమైన న్యాయం అక్కరకు రాని న్యాయంగా భావించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల దిశ దారుణ హత్యోదంతం పట్ల చలించి, దేశంలో అలాంటి ఘటనలు ఎక్కడా పునరావృతం కాకూడదని ప్రకటించారు. దానికి కొనసాగింపుగా అత్యాచార ఘటనల నివారణకు రెండు ప్రత్యేక బిల్లులను, కేంద్ర నేర నిరోధక చట్టాలకు రెండు సవరణ బిల్లులకు శాసనసభ ఆమోదం లభించింది. రాజకీయాలకు, నైతిక సూత్రాలకు, నైతికతకూ ఎలాంటి పొత్తూ పొంతనా కుదరదన్నది ఇటాలియన్ చాణక్యుడు మాకియవెల్లీ సూత్రం! కానీ ఆ సూత్రీకరణ అబద్ధమనీ, నైతిక సూత్రాలకు, నైతి కతకు బద్ధమై దేశ దిశాగతిని నిర్ణయించి ఆచరించే రాజకీయమే సిసలైన రాజకీయం. అలాంటి పాలకుడే నిజమైన ప్రజాసేవకుడని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరూపించారు. ప్రజా బాహుళ్యాన్ని వేధిస్తున్న అనేక సమస్యల సత్వర పరిష్కారం కోసం ఆగమేఘాలపై తీసుకుంటున్న నిర్ణయాలు, వాటిని ఆచరిస్తున్న తీరు ఇందుకు నిదర్శనం. దేశంలో రాజ్యాంగ బద్ధత పేరిట గడచిన డెబ్భైఏళ్లలో వివిధ ప్రభుత్వాలు క్రిమినల్, పౌర సమస్యలపై రకరకాల చట్టాలు తీసుకొచ్చాయి. వాటికి విలువైన భాష్యాలను సుప్రీంకోర్టు పొందుపర్చి, అమలుకు సిద్ధం కావడమూ మనకు తెలుసు. కానీ పెక్కు సందర్భాల్లో నాటి పెట్టుబడి దోపిడీ వ్యవస్థలో వివిధ స్థాయిల్లో అధికార పీఠాలు అలంకరించిన రాజకీయ పాలక శక్తులు తమ లేదా తమ అనుయాయుల, వందిమాగధుల స్వార్థపూ రిత ప్రయోజనాల దృష్ట్యా వేలు, లక్షలాది మంది బాధిత కుటుం బాలకు న్యాయం అనేది పెక్కు సందర్భాలలో ఆలస్యం కావడమో లేదా దూరం కావడమో జరుగుతోంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి బాబ్డే అన్యాయాలకు గురైనవారు, అత్యాచారాలకు, హత్య లకు బలైనవారి కుటుంబాలు సత్వర న్యాయాన్ని అప్పటికప్పుడు ఆశించలేరని న్యాయశాస్త్రపరిశీలనా పరిధుల దృష్ట్యా చెప్పి ఉండ వచ్చు. కానీ ఏళ్లూ పూళ్లూగా తీర్పులు వాయిదా పడుతూ పోవడం వల్ల బాధిత కుటుంబాల ఆవేదన చల్లారదు. అందుకే రాజ్యంగమూ, న్యాయ వ్యవస్థ సూత్రాలు కూడా తీర్పు ఆలస్యమైన కొద్దీ న్యాయం ఆలస్యమైనట్టే కాదు, న్యాయాన్నే బాధితులకు దూరం చేసినట్లుగా భావించాలని నిర్ద్వంద్వంగా చెప్పడమూ జరిగింది. అందుకే అత్యు న్నత న్యాయసూత్రాలు ఆధారంగా నిర్దేశించిన ఆలస్యమైన న్యాయం అక్కరకు రాని న్యాయంగా భావించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల దిశ దారుణ హత్యోదంతంపట్ల చలించి, ఇలాంటి ఘటనలు ఇకమీదట ఎక్కడా పునరావృతం కాకూడదని సంకల్పించారు. ఆ వెంటనే ఏపీ శాసనసభ ఆమోదానికి అత్యాచార ఘటనల నివారణకు రెండు ప్రత్యేక బిల్లులను ప్రవేశపెట్టారు. అలాగే కేంద్ర నేర నిరోధక చట్టాలకు రెండు సవరణ బిల్లులను చట్టాలుగా ప్రవేశపెట్టి ఆమోదించాల్సి వచ్చింది.ఈ బిల్లులకు దేశవ్యాపితంగా మద్దతు రావడానికి కారణం శిక్షా కాల పరిమితిని బాగా తగ్గించి, బాధితులకు తక్షణ న్యాయం సకాలంలో దక్కేలా చూడటం, అత్యాచారాలకు తలపడే వారిని నిరోధించగల న్యాయ యంత్రాంగాన్ని, పోలీసు యంత్రాంగాన్ని జిల్లా స్థాయి వరకు ఏర్పాటు చేసి సత్వర శిక్షలకు రంగాన్ని సిద్ధం చేయడం. ఇప్పటికే ఢిల్లీ, ఒడిశా ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ చొరవను హర్షించాయి. తెలంగాణలో దిశ హత్యోదంతం తర్వాత ఏపీతో సహా ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఘటనలు కొనసాగడంవల్ల దిశ చట్టానికి ప్రాంతీయ హద్దులు చెరిగిపోయాయి. ఈ విస్తృతికి ప్రధాన కారణం.. దిశ ఘటనకు ఏమాత్రం తీసిపోని ‘నిర్భయ’ దారుణో దంతం 2012లో జరిగి నేటికి ఏడేళ్లయినా.. విచారణ ముగిసి, మరణ శిక్షలు పడినా, ఈరోజుదాకా కోర్టు తీర్పు ఆచరణలో అమలులోకి రాకపోవడమే. కాగా, ఆంధ్రప్రదేశ్ తాజా చట్టం మహిళలు, చిన్నా రులపట్ల వేధింపులు, అత్యాచార ఘటనలను తక్షణం పరిగణనలోకి తీసుకుని, అంత వేగంగానూ వాటిని విచారించి, శిక్షలు విధించేం దుకు ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు జిల్లా స్థాయిలో ఎక్కడి కక్కడ తక్షణం ఏర్పాటు చేసి న్యాయం చేకూర్చడం ఆంధ్రప్రదేశ్ నూతన చట్టం ప్రత్యేకత. అయితే ఈ ప్రక్రియ అంతా రాజ్యాంగంలోని 21వ అధికరణ ప్రకారమే జరిగిందా అన్న ప్రశ్నకు ఆ అధికరణలో సమాధానం ఉంది: ‘ఏ పౌరుడిని జీవించే హక్కుకు, వ్యక్తిగత స్వేచ్ఛకు దూరం చేయకూడదు’ అని ఆ అధికరణం చెబుతున్నా ఆ వెంటనే అదే అధిక రణలో ‘చట్టం నిర్దేశించిన విధి విధానాలకు లోబడి మాత్రమే’ అని కూడా ఉన్నందున, జగన్ ప్రభుత్వం ఆ గేటు దాటకుండానే దేశ దిశా గతికి త్వరితగతిన ‘దిశ చట్టం’ రూపొందించింది. అలాగని ఆంధ్ర ప్రదేశ్ చట్టం, వలస పాలనావశేషంగా మిగిలిపోయిన చట్టబద్ధ విచారణతో నిమిత్తం లేకుండా పోలీసులు జరిపే బూటకపు ఎన్ కౌంటర్ల (ఫేక్)ను మాత్రం అనుమతించదు. ఎందుకంటే, ‘ప్రకాష్ కడం వర్సెస్ రాంప్రసాద్ విశ్వనాథ్ గుప్తా’ కేసులో సుప్రీంకోర్టు ‘ఎదురు కాల్పుల్లో చనిపోయారన్న పేరిట పోలీసులు జరిపే బూట కపు ఎన్కౌంటర్లు పచ్చి హత్యలు తప్ప మరొకటి కావ’ని అలాంటి బూటకపు హత్యలకు పాల్పడే పోలీసులకు మరణశిక్షలు విధించాలని, అలాంటి వాటిని ‘అసాధారణ కేసులలో అతి అసాధారణం’గా పేర్కొనాలని తీర్పు చెప్పింది. అంతేగాదు, గతంలో అలహాబాద్ హైకోర్టు విశిష్ట న్యాయమూర్తిగా పేరొందిన జస్టిస్ ఎ.ఎన్.ముల్లా భారతదేశంలోని పోలీసులంత అరాచక శక్తులు, నేరస్తులు మరెవరూ ఉండరని చెప్పారు. ఆ మాటకొస్తే హైదరాబాద్‌లో ‘దిశ ఘోర హత్యా ఘటన’ సందర్భంలో కూడా నలుగురు నిందితులను విచారణకు పంపకుండా పోలీసు కస్టడీలో ఉన్న నిందితుల్ని హతమార్చడం కూడా ‘ఫేక్ ఎన్కౌంటర్’గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూ భావించారు (8.12.2019). అంతేగాదు, వ్యవస్థ ఇంత అధ్వానమైన దశకు చేరుకోవడానికి కారణం ఇటు పోలీసు శాఖల్లోనూ, అటు న్యాయ వ్యవస్థలోనూ తగినంత సిబ్బంది లేకపోవడమేనని ఇదే అనేక అరాచకాలకు కారణమవుతోందని ‘ఇండియా జస్టిస్ రిపోర్ట్’ (2019) తాజా నివేదిక స్పష్టం చేస్తోంది. ఇక నేర న్యాయ వ్యవస్థపై వెచ్చించే బడ్జెట్ కేటాయింపులు హీనాతిహీనం. ఉదాహరణకు 2017 దాకా పోలీసింగ్ నిర్వహణకు అఖిల భారత స్థాయిలో తలసరి వెచ్చిస్తున్న ఖర్చు కేవలం రూ. 820. సరిగ్గా ఈ అస్తు బిస్తు పరిస్థితుల్లోనే నేర న్యాయ వ్యవస్థ క్రమంగా పోలీసు న్యాయ వ్యవస్థగా దిగజారుతోందని ‘సెంటర్ ఫర్ క్రిమి నాలజీ అండ్ జస్టిస్’ సంస్థకు చెందిన ‘ప్రయాస్’ ప్రాజెక్టు డైరెక్టర్ అయిన డాక్టర్ విజయ రాఘవన్ అభిప్రాయపడుతున్నారు. ఈ దారుణ పరిస్థితుల మధ్యనే.. దూసుకువచ్చిన జగన్ ప్రభుత్వ ‘దిశ చట్టం’ ‘నిర్భయ’ కేసు నిందితులపై శిక్ష ఖరారై అమలు జరపడంలో ఏడేళ్ల తర్వాతనైనా ఇప్పటికి సుప్రీంకోర్టు, ప్రభుత్వమూ వెంటనే కదలబారడానికి కారణమైందని మరవరాదు. అంతేగాదు, ఉత్తర ప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో జరిగిన యువతి దారుణ లైంగిక హత్యోదంతంలో కూడా బీజేపీ ఎమ్మెల్యేకి శిక్ష ఆగమేఘాలపై ఖరారు కావడానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ‘దిశ చట్టమే’ ఉద్దీపన శక్తిగా దివిటీ పట్టింది. ఈ సందర్భంగా మన వ్యవస్థలో ఉన్న మౌలిక సత్యాలను విజయ రాఘవన్ దాచుకోకుండా ఇలా వ్యక్తం చేశారు: ‘‘రానురానూ మన దేశంలోని సామాజిక వ్యవస్థా చట్రం కనుసన్నల్లో సామాన్య ప్రజలు సమాజంలో వర్గ, కుల, స్త్రీ పురుష వివక్ష, అసమానతల కారణంగా కునారిల్లిపోతున్నారు. ఇలా మన స్త్రీ–పురుషుల మధ్య వివక్ష చూపుతూ అసమ దృష్టితో వ్యవహరించినంత కాలం, స్త్రీలను భౌతికంగా కేవలం లైంగిక దృష్టితో చూసి, వేధించి వివక్షతో జరిపే హింసాకాండ ఒక అంటురోగంగా మనల్ని పీడిస్తూనే ఉంటుంది. కుల, వర్గ, అసమానతలు గొడ్డలి పెట్టుగా మారినందున హింసా ప్రవృత్తి మరింత పాశవిక రూపం దాల్చుతుంది. ఈ బెడదను తప్పించుకోవాలంటే శాశ్వత పరిష్కారంగా మరింత ఆదర్శవంత మైన సమ సమాజ వ్యవస్థను నిర్మించుకోగల సామాజిక సమీకరణ వైపుగా దృష్టి పెట్టాలి’’ అని హితవు పలుకుతున్నారు. అందుకే, అలాంటి ఉత్తమ సమాజ వ్యవస్థావతరణ వైపుగా పరిపూర్ణ బ్రతు కిచ్చే దిశగా కవి కుమారుడు సరికొత్త గీతా రచనను ఉద్దీపనగా అందించాడు: ‘‘ఓ! కూలీ, మాలీ, రైతూ గుడిసెలలో బతికేవాడా గంజినీళ్లతోనే కాలం గడిపేవాడా ఆకలికన్నూ! మానవుడా, తిరగబడేవాడా, ప్రశ్నించేవాడా అన్యాయాలకు ఆహుతి కావడానికైనా జంకనివాడా ఖైదీ, రౌడీ, ఖూనీకోర్, బేబీ– మానవుడా, ఓ మానవుడా!’’ వాడే! వాడే! ఆ ‘జగన్నా’ధ రథచక్రాల కోసం ఎదురుచూస్తున్న మానవుడు!! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
విదూషకుల విన్యాసాలు
ఏపీలో అధికారం కోల్పోతున్న తరుణంలో ఒక నాయకుడు చేయరాని పనులకు, దుర్మార్గాలకు చంద్రబాబు నాయకత్వం వహించడం దురదృష్టకరం. ఏ కాంగ్రెస్ నుంచి వచ్చి ఎన్టీఆర్ పంచనచేరి రాజ్యచక్రాన్ని తిప్పాడో, ఆ పార్టీ విధానానికే విరుద్ధంగా అదే కాంగ్రెస్‌లో చేరడానికి అన్ని మార్గాలూ వెతుక్కుంటున్నారు. ఈ ప్రహసన యాత్రలో అంతర్భాగమే ‘జగడపాటి’ విదూషక పాత్ర! ఇతని విద్య తిమ్మిని బమ్మిని చేయడం. గురుశిష్యులిద్దరిదీ ఒకటే మనస్తత్వం. ఎన్నికల కోడ్ అమలులో ఉండగానే చంద్రగిరిలోని ఏడు పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరగడానికి ముందురోజున ఓటర్లను ప్రభావితం చేసేలా ఊహాజనిత ఫలితాలను ప్రసారం చేసిన ఘనుడు లగడపాటి. ‘‘ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఇంత ఘోరంగా జరుగుతాయా? ఇది ప్రజాస్వామ్య మేనా? చంద్రగిరిలో రికార్డయిన పోలింగ్ వీడి యోలు పరిశీలిస్తే ఒళ్లు గగుర్పొడుస్తోంది’’. – కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది (17.05.2019) ప్రకటన ‘‘దేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లుతూ ఉండాలంటే.. నాయకుడు ఎంత గొప్పవాడైనా అతడి పాదాల కింద నలిగిపోయేలా ప్రజలు తమ స్వేచ్ఛా స్వాతంత్య్రాలను అప్పగించి కూర్చోరాదు. అలాగే తాము త్యాగాలతో నిర్మించుకున్న రాజ్యాంగ వ్యవస్థల్ని దారి తప్పించి కూల్చివేయగల అధికారాల్ని అతని చేతుల్లో పెట్టరాదు. రాజకీయాల్లో భక్తి భావన పతనానికి చివరికి వ్యక్తి నియంతృత్వానికి రాజమార్గం వేస్తుం దన్న సత్యాన్ని మరిచిపోరాదు’. – 1949 నవంబర్ 25న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ రాజ్యాంగ నిర్ణయ సభలో చేసిన ఆఖరు ప్రసంగంలో హెచ్చరిక! మేడిపండుగా భావించిన ‘పండు’ను కాస్తా పొట్టవిప్పి చూడగానే పురుగులమయంగా మన ప్రజాస్వామ్య వ్యవస్థ మారుతోందని ఎప్ప టికన్నా హెచ్చుస్థాయిలో గత 70 ఏళ్ల స్వాతంత్య్ర చరిత్రకు అపవాదుగా 2019 ఎన్నికల నిర్వహణ నిరూపించాయి. ఈ పతన దశకు ప్రస్తుత కేంద్ర, దేశంలోని వివిధ రాష్ట్రాల పాలకులు కారకులయ్యారు. ఆంధ్ర ప్రదేశ్‌లో పతనదశలో ప్రవేశించిన భ్రష్ట టీడీపీ నాయకుడు చంద్రబాబు అధికారం కోల్పోతున్న తరుణంలో ఒక నాయకుడు చేయరాని పను లకు, దుర్మార్గాలకు నాయకత్వం వహించడం దురదృష్టకరం. కాంగ్రెస్ కేంద్ర అధిష్టానవర్గం నిరంకుశ పాలనా వ్యవస్థకు అంకురార్పణ చేస్తున్న తరుణంలో ఆ పరిణామానికి అడ్డుకట్టడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ నెలకొల్పిన తెలుగుదేశం పార్టీని అష్టావక్రమార్గాల్లో నడిపించి భ్రష్టతవైపు మళ్ళించినవాడు చంద్రగిరి ప్రాంత చంద్రబాబు. అల్లుడిగా ఇంట్లో ప్రవేశించిన వ్యక్తి ‘నల్లి’ పోట్లు ద్వారా ఎన్టీఆర్‌ని సాగనంపి ముఖ్యమంత్రి పదవికి ఎగబాకిన వాడు అనంతరం తన పార్టీకి ఏకు మేకవడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ విభజనకు కారకుడు కావడం జగమె రిగిన సత్యం. తాజాగా ఏ కాంగ్రెస్ నుంచి వచ్చి ఎన్టీఆర్ పంచనచేరి రాజ్యచక్రాన్ని తిప్పాడో, ఆ పార్టీ విధానానికే విరుద్ధంగా అదే కాంగ్రెస్‌లో చేరడానికి ఈ కష్టకాలంలో అన్ని మార్గాలూ వెతుక్కుంటున్నారు. ఈ ప్రహసన యాత్రలో అంతర్భాగమే ‘జగడపాటి’ విదూషక పాత్ర! ఇతని విద్య తిమ్మిని బమ్మిని చేయడం. గురుశిష్యులిద్దరిదీ ఒకటే మనస్తత్వం. ఒకరు పార్లమెంటును స్తంభింపచేయడం కోసం మిరియాల కారం (పెప్పర్ స్ప్రే) సభ్యుల కళ్లలో కొట్టడంలో నేర్పరి. మరొకరు అవసాన పదవీదశలో ఉన్న ముఖ్యమంత్రి. నిజానికి చంద్రగిరిని వదిలేసి కుప్పం నియోజకవర్గానికి చంద్ర బాబు ఎందుకు వలసపోవలసి వచ్చింది? కాంగ్రెస్‌లో ఉండి చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి శాసనసభకు ఎన్నికైన∙వ్యక్తి.. ఎన్టీఆర్‌ను అంటకాగిన తర్వాత ఆ నియోజక వర్గాన్ని విడిచి ‘కుప్పం’ ఒడిలోకి ఎందుకు చేరవలసి వచ్చింది? పైగా, శిక్షా ప్రాంతంగా పేరు మోసిన కుప్పంకు బదిలీ కావడానికి అధికారులు ఎందుకు ఇష్టపడరు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఎడంగా, కడుకొసలో ఉన్న కుప్పం ఏనాడూ చంద్రగిరిలో అంతర్భాగమే కాదని చారిత్రికుల భావన. అందుకే, 1995 దాకా ఆంధ్ర ప్రదేశ్–కర్ణాటక–తమిళనాడు హద్దుల ముక్కోణం కూడలిలో ఉంది. ఏ అధికారినైనా శిక్షించాలంటే కుప్పానికి తోసి శిక్షిస్తారట. పైగా అమాయక తమిళనాడు పేదసాదలకు నిలయం కూడానట. ఈ ‘శిక్షాత్మక, సమ స్యాత్మక ప్రాంతాన్ని బాబు ఎంచుకుని తన రాజకీయ కార్యకలాపాలకు కేంద్రంగా మార్చుకున్నారు. రామకుప్పం, గూడుపల్లి, శాంతిపురం మండలాలతో కూడిన కుప్పాన్ని నియోజకవర్గంగా ఏర్పరచి, దానికి వ్యవసాయ క్షేత్రం అని పేరు జోడించారు. గతంలో తొలి ముఖ్యమంత్రి హోదాలో, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ పరిశోధకులు, శాస్త్ర వేత్తలు వద్దు వద్దన్నా మన వాతావరణానికి సానుకూలపడని ఏటవాలు ‘పోడు’ వ్యవసాయ పద్ధతుల్లో ఇజ్రాయెలీ సాగు పద్ధతుల్ని ప్రవేశపెట్టి చంద్రబాబు అభాసుపాలయ్యారు. ఇజ్రాయెలీ సాగుకు మన రైతుల్ని అలవాటు చేయడం కోసం సంప్రదాయ క్షేత్ర సరిహద్దుల్ని చెరిపేసి, రైతుల్ని ఇబ్బందుల పాల్జేసి, తమ భూముల్ని తామే గుర్తించలేని దుస్థి తిలోకి రైతుల్ని నెట్టి తీవ్ర విమర్శలకు గురైన బాబు కనీసం మర్యాద కోసమైనా, గౌరవ భావంతో రైతులకు పొరపాటు అయిందని కూడా క్షమాపణ చెప్పకుండా తప్పుకున్నారు. అలాంటి చంద్రబాబు, బీజేపీ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో మొన్నటిదాకా భాగస్వామ్య పక్షంగా ఉండి, ఇటీవలే విడాకులిచ్చి తిరిగి తన మాతృసంస్థ అయిన కాంగ్రెస్‌ను అంటకాగుతూ ఎన్టీఆర్ ‘తెలు గుదేశం’ పార్టీని భూస్థాపితం చేసే వైపుగా ప్రయాణిస్తున్నారు. ప్రజా వ్యతిరేక చర్య అయిన నోట్ల రద్దును మోదీ ప్రకటించకముందే మన రాష్ట్రంలో మొదట ప్రస్తావించి, ‘రద్దు’ పద్దుకు ప్రతిపాదించింది తానే నని గొప్ప కోసం ప్రకటించి, బీజేపీ సంకీర్ణానికి విడాకులిచ్చిన మరు క్షణం ఆ నెపాన్ని మోదీ మీదికి సునాయాసంగా నెట్టేశారు బాబు. ఇప్పుడు చంద్రగిరి నియోజకవర్గంలోని ఏడు పోలింగ్ కేంద్రాలలోనూ ఓట్ల రిగ్గింగ్‌కు భారీ స్థాయిలో పాల్పడిన ‘దేశం’ పార్టీ నాయకులు, కార్యకర్తల రక్షణ కోసం బాబు పడరానిపాట్లు పడుతున్నారు. పైగా, డబ్బుతో ఓట్ల కొనుగోళ్లకు తన చోటామోటా నాయకుల్ని, కార్యకర్తల్ని ప్రోత్సహించిన బాబు ఢిల్లీలో ‘ఎన్నికల విధానం: జవాబు దారీతనం’ అన్న అంశంపై సదస్సులో (18.5.2019) మాట్లాడుతూ ‘పెద్ద నోట్లు రద్దుచేసి కొత్తగా రూ. 500, రూ. 2,000 నోట్లను ప్రవేశ పెట్టడంవల్ల రాజకీయ నాయకులు ఓటర్లకు డబ్బులు పంచటం సులువైపోయింది. ప్రజలు కూడా రెండువేలు, అంతకుపైనే ఎక్కువగా ఆశిస్తున్నార’నీ చెప్ప టం ప్రజల మధ్య నవ్వులాటగా మారిందని అతను గుర్తించటం లేదు. ‘జవాబుదారీతనం’ గురించి ఊకదంపుడు కొట్టే బాబు రాష్ట్ర ఉన్నతాధికారుల క్రియాశీల నిర్ణయాలను, ఎన్నికల (కేంద్ర–రాష్ట్ర) కమి షన్ ఉన్నతాధికారుల్ని లెక్క చేయకుండా పోవటం– అంబేడ్కర్ శఠిం చిన రాజకీయ అహంకార ప్రదర్శన తప్ప మరొకటి కాదు. ఎన్నికల నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కిన వ్యక్తి అతను. ఈ అహంకారం తోనే చంద్రగిరి నియోజకవర్గంలోని కీలకమైన పోలింగ్ కేంద్రాల పరిధిలోని దళిత, మైనారిటీలను ఓటు హక్కును వినియోగించుకో కుండా సుమారు 30 ఏళ్లుగా నిర్బంధ విధానాన్ని బయటి ప్రపంచానికి తెలియనివ్వకుండా గుట్టుచప్పుడు కాకుండా చంద్రబాబు వర్గం జాగ్ర త్తపడింది. ఈ పరిణామాలను బయటకు పొక్కనివ్వకుండా ‘వదరు బోతు’గా చంద్రబాబు– ‘చిలకజోస్యాల’ ‘రగడ’ (లగడ)పాటి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఎన్నికల కోడ్ అమలులో ఉండగానే పార్టీల ఎన్నికల ప్రచారంపై ఆంక్షలు ఉండగానే తుది ఫలితాల ప్రకటన వెలువడక ముందే చంద్రగిరిలోని ఏడు పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ జరగడానికి ముందు రోజున ఓటర్లను ప్రభావితం చేసేలా ఊహాజనిత ఫలితాలను ప్రసారం చేశారు. అందుకు ఫలితాన్ని అనుభవించక తప్ప లేదు– అయిదు పోలింగ్ కేంద్రాలలో అధికార పార్టీకి అనుకూలంగా బాహాటంగా వ్యవహరించిన అధికారులపై ఎన్నిక సంఘం వేటు వేయవలసి వచ్చింది. ఇదిలా ఉండగా, ఫలితాల ప్రభావం ఎలా ఉండబోతోందో తెలిసి కూడా చంద్రబాబు ‘కాలుకాలిన పిల్లిలా’ దేశ ప్రతిపక్షాలన్నింటినీ ఒక్క తాటిపైకి తెచ్చే ప్రయత్నంలో విఫలమవుతున్నారని, పరువుకోసంగానూ ‘దేశం’ ఓటమిని ఆంధ్రప్రదేశ్‌లో హుందాగా ఒప్పుకోవడానికి మనస్సు బిక్క చచ్చిపోయినందున ఢిల్లీ, ఉత్తరాది రాష్ట్రాలు, బెంగాల్, ఒడిశా నాయకులను తనలాగే కాంగ్రెస్‌కు తాకట్టు పెట్టడానికి చేస్తున్న ప్రయ త్నాలు ఒక్కొక్కటిగా కూలిపోతున్నాయి. ఇందుకు కారణం– సొంత రాష్ట్రంలోనే తన అధికార పునాదులు బీటలు వారుతూండటమేనని మరువరాదు. పళ్ల బిగువుతోనే ఢిల్లీ, పంజాబ్, కోల్‌కతాల పంచల్లో తల దాచుకోచూడటం. దళిత ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రానివ్వకుండా, బెదిరింపుల ద్వారా దౌర్జన్య హింసల ద్వారా అడ్డుకుని వారి ఓట్లను వారి పేరిట తామే గుద్దుకున్న ‘దేశం’ నాయకత్వ చర్యలు వేనోళ్ల ఖండించి ఏవగించుకోవలసినవి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ‘రగడ పాటి’ జరిపిన సర్వే ఫలితాలు ఉభయ ప్రాంతాల తెలుగు ప్రజల మధ్య ఎంతగా నవ్వుల పాలయ్యాయో తెలిసిందే. 24 గంటలు గడవకముందే చంద్రబాబు మాజీ నియోజకవర్గమైన చంద్రగిరిలో భారీ బందోబస్తు మధ్య జరపవలసి వచ్చిన రీ–పోలింగ్ సందర్భంగా కూడా పరమ ‘బోకు’ జోస్యంగా, కాదు కాదు, పరమ అపహాస్యంగా మిగిలిపోను న్నది. పైగా ఇప్పటికే అడుగూడిన ప్రతిపక్ష నాయకులతో రేపు ఏపీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోతున్న చంద్రబాబు మంతనాలు చేస్తున్నారు. యావద్భారతంలో ఆసేతు హిమాచల పర్యంతం ‘ప్రజాస్వామ్యం’ విలువలు 2019 ఎన్నికలలో మరింతగా దిగజారిపోవటం విచారకరం! ఎన్టీఆర్, వైఎస్. రాజశేఖరరెడ్డి హయాంలు తెలుగు వారి కీర్తి పతాకలను నిలబెట్టగా, వాటిని దించేయడానికి సాహసించినవారుగా, రేపటి పదవీభ్రష్టులుగా చంద్రబాబు అతని పార్టీ మిగిలిపోతారు. కానీ, రేపటి ఉషోదయానికి, పరిణామశీలమైన మార్పుకు ఆహ్వానం! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ఖజానా ఖాళీ చేసిపోతున్న బాబు!
సాధికార సర్వేలు పేర్కొనని రాష్ట్ర ప్రగతిని సీఎం చంద్రబాబు సొంత ఊదర సర్వేల ‘జంతర పెట్టె’లో జనాలకి చూపడమే కాదు, ఎన్నికల కమిషన్‌ను సహితం మభ్యపెడు తున్నారు. రాష్ట్రం అప్పు రూ. రెండున్నర లక్షల కోట్లు అని తేలగా, దాన్ని ఎన్నికల తరుణంలో తట్టుకోడానికి చేసిన పని.. ప్రభుత్వంలోని వివిధ శాఖలలో సిబ్బంది జీతాలు మినహా మిగతా అలవెన్సులు, వైద్య బిల్లులు, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ వగైరా నిధులన్నింటినీ గత రెండు, మూడు మాసాలుగా నిలిపేసినట్లు అధికార వర్గాల భోగట్టా. ఎన్నికల కోసం ప్రభుత్వం చేస్తున్న వేలాది కోట్ల రూపాయల ఖర్చు వచ్చే ప్రభుత్వానికి అప్పులను బదలాయించే కార్యక్రమమని నిపుణుల ఉవాచ. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏటా ప్రకటించే కుటుంబ ఆస్తుల వివరాల ప్రకారం, 2014– 15లో వాటి విలువ రూ. 528.86 కోట్లు. కాగా ప్రతి ఏటా ఆస్తులను ప్రకటించే ఏకైక రాజకీయవేత్తను దేశంలో తానేనని చెబుతూ 2017–18 నవంబర్‌లో తన కుటుంబ ఆస్తుల విలువ రూ. 165.13 కోట్లు అన్నారు. కాగా తాజాగా ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన అఫి డవిట్‌లో 2018–19లో తన కుటుంబ ఆస్తుల విలువను రూ.1042.24 కోట్లుగా చూపించారు. అంటే దాదాపు 100 శాతం పెరిగినట్లు ఖరా రయింది. కాగా అయిదు నెలల కిందట ఆయన వెల్లడించిన ఆస్తుల విలువతో పోల్చితే నేటి ఆయన ఆస్తుల విలువ 531 శాతం పెరిగినట్లు తేలింది. – కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా చంద్రబాబు 22.03.2019న నామినేషన్ దాఖలు చేసిన అనంతరం అందులో పేర్కొన్న ఆస్తుల సారాంశం. ఎన్నికల కమిషన్‌ను సైతం మోసం చేయగల ‘చిత్రగుప్తుని’ లెక్కలు చూపటంలో చంద్రన్న హస్తకౌశలం (చేతివాటం) ఎలాంటిదో ఇప్పటి కైనా ప్రజలకు, పాఠకలోకానికి తెలిసిపోయి ఉంటుంది! అందుకే తాజా ఆలోచన. బాబు పోతూనే రాష్ట్ర ఖజానాను కూడా ఖాళీ చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ మాజీ ప్రధాన అధికారి నవీన్ చావ్లా పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ భారత రిపబ్లిక్ మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారి దేశంలోని పాలకులు పార్లమెంటు లాంటి రాజ్యాంగ శాసన వ్యవస్థల్ని అసమర్థతతో నిర్వహిస్తున్నారని, అందుకు పాలకులు బాధ్యత వహిం చాల్సిందేనని శఠించవలసి వచ్చింది. సరిగ్గా ఈ సందర్భంగానే ‘‘ఆంధ్రప్రదేశ్ రెండంకెల (డబుల్ డిజిట్) వృద్ధి రేటుతో దూసుకెళు తోంద’’ని ప్రజల్ని నమ్మింపచేయడానికి చేసిన ప్రయత్నం వెనక రహస్యం.. ఎన్టీఆర్‌తో సంబంధం ఏర్పడక ముందు తనకున్న రెండె కరాల ఆస్తిని కాస్తా రెండేసి, మూడేసి, నాలుగేసి డిజిట్లు విలువలో వేల కోట్లకు (2018–19కి రూ. 1042.24 కోట్లకు) పెంచుకున్న వైనం కనపడకుండా ప్రజల కళ్లు కప్పడానికే! లేకపోతే విభజనానంతరం తాడు బొంగరం లేని ఒక రాజధానిని నిర్మించే ప్రయత్నంలో భాగంగా పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌లో ఉండే సదవకాశాన్ని ‘‘ఓటుకు కోట్లు’’లో అడ్డంగా దొరికిపోయి అర్ధరాత్రి సచివాలయం నుంచి అకస్మాత్తుగా బిచాణా ఎత్తివేసుకుని అమరావతికి చేరిన బాబు ఆచరణలో చేసిన పని ఏ నిర్మాణాన్నీ పూర్తి చేయలేక ఏపీ ప్రజలముందు ‘అర్థనారీశ్వర’ రూపంలో నాటకమాడుతున్నారు! ఈ క్రమంలో సాధికార సర్వేలు పేర్కొనని రాష్ట్ర ప్రగతిని సొంత ఊదర సర్వేల ‘‘జంతర పెట్టె’’లో జనాలకి చూపడమే కాదు, ఎన్నికల కమిషన్‌ను సహితం మభ్య పెడుతున్నారు. బాబు నిరంకుశ నిర్ణయాల ఫలితంగా నేడు ఆంధ్రప్రదేశ్ ప్రతిపత్తి దెబ్బతిని, రాష్ట్రంలోని చిన్న, పెద్ద, మధ్యతరగతి వర్గాల ప్రజలు, రైతులు, సకల వృత్తిదారులూ బాధలలో ఉన్నారన్నది నగ్న సత్యం. ఈ క్రమంలోనే, తన ప్రజావ్యతిరేక పాలనా విధానాలను ఆత్మవిమర్శతో సవరించుకునే బదులు, రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీతో పొత్తు ద్వారా ఏర్పడిన కృత్రిమ స్వల్ప మెజారిటీని అంతే కృత్రిమంగా పెంచుకోవడానికి ప్రతిపక్షమైన వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయింపు దారులను ప్రోత్సహించడానికి గజ్జకట్టాడు బాబు. ఆ దుర్మార్గ ఫలితంగా వైఎస్సార్సీపీ నుంచి 23 మంది ఎంఎల్ఏలను, ముగ్గురు పార్లమెంటు సభ్యుల్ని వందల కోట్ల రూపాయల తోనూ, పదవుల ఎరతోనూ కొనే శాడు. ఇప్పుడిక ఆయన ఎత్తిన తాజా అవతారం పదవీరక్షణ కోసం జగన్ పార్టీ మినహా అన్ని పార్టీల నుంచి గీతదాటే విభీషణుల కోసం ఎదురుతెన్నులు చూడటం, బెదిరించడం, బాహాబాహీ ఘర్షణలను సృష్టించడం ద్వారా అశాంతి వాతావరణంలో తిరిగి అధికార కైవసం కోసం అత్యాచారాలకు తెరలేపటం! జగన్ చారిత్రాత్మక సుదీర్ఘపాద యాత్ర ద్వారా కోట్లాదిమంది ప్రజలను జరుగుతున్న అన్యాయాలపైన, అక్రమాల పైన, కబ్జాలపైన పంట పొలాల విధ్వంసం పైన చైతన్య వంతుల్ని చేస్తూ రావడంతో ప్రశాంత కిశోర్ అన్నట్లు నిజంగానే తన ‘ఓటమి తప్పద’న్న ఆలోచనకు బాబు వచ్చాడు. దానికితోడుగా ‘మునిగిపోయేవాడు గట్టి పోచ’ను పట్టుకున్నట్లుగా ‘పవన్’ అనే ఒక సినీ నటుడి ఆసరాతోనూ, శివాజీ అనే ఓ ‘గరుడపక్షి’ అండతోనూ, బాబు ఎన్నికల యాత్ర ప్రారంభించారు. తనపై పేరు కుపోయిన 17 కేసుల్ని గూర్చి ప్రజలకు వివరించకుండా, కేంద్ర కాంగ్రెస్ నాయకత్వంతో కుమ్మక్కైన చంద్రబాబు ఉమ్మడిగా జగన్‌పైన కృత్రిమ కేసులు బనాయించడం ద్వారా, వైఎస్సార్ మరణానంతరం జగన్ రాష్ట్ర రాజకీయాల్లో దూసుకు రాకుండా నిరోధించేందుకు విశ్వ ప్రయత్నం చేశారు, కాలక్రమంలో జగన్‌పై కేసుల విషయంలో భాగస్వాముల్ని చేసిన వారంతా దాదాపు విడుదలవగా, సీబీఐ స్పెషల్ కోర్టు, గౌరవ న్యాయమూర్తులు ‘ఎక్కడ మీ సాక్ష్యాలు, సాక్ష్యాధారాలు’ అని పలు మార్లు ప్రశ్నించడంతో సీబీఐ చప్పుడు కాకుండా ఉండిపోవలసి వచ్చింది. గత పదేళ్లుగా న్యాయస్థానాలను గౌరవిస్తూ, పాదయాత్రల మధ్యనే హాజరవుతూ, తన సుదీర్ఘ ప్రజా సమీకరణ యాత్రను జయప్రదం చేసుకుంటున్న సందర్భంలో– ప్రతిపక్ష నాయకుని సుడిగాలిని తట్టు కోలేని చంద్రబాబు జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్టులో తలపెట్టిన ‘కత్తి పోటు’ ఘటనలోనూ, అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్న జగన్ పినతండ్రి వివేకానందరెడ్డి హత్యాకాండ పూర్వాపరాల మధ్య– ‘ఓట్లు’ అనే పరిగలను ఏరుకోడానికి చంద్రబాబు వర్గం ప్రయత్నించడంతో కుట్రపూరిత రాజకీయం బట్టబయలయింది. ఇప్పుడు వేరే మరో కథ నడుస్తోంది, కథలో అంతర్నాటకం– దాని పేరు. రాష్ట్రం అప్పు రూ. రెండున్నర లక్షల కోట్లు అని తేలగా, దాన్ని ఎన్నికల తరుణంలో తట్టుకోడానికి చేసిన పని.. ప్రభుత్వంలోని వివిధ శాఖలలో సిబ్బంది జీతాలు మినహా మిగతా అలవెన్సులు, వైద్య బిల్లులు, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ వగైరా నిధులన్నింటినీ గత రెండు, మూడు మాసాలుగా నిలిపేసినట్లు అధికార వర్గాల భోగట్టా. బహుశా లోటు బడ్జెట్‌నూ, ఎన్నికల కోసం పాలకపక్షం చేస్తున్న అమాంబాపతు కోట్లాది రూపాయలనూ వచ్చే ప్రభుత్వానికి అప్పులను బదలాయించే కార్యక్రమంగా రాష్ట్ర ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఏపీకి సంబంధించి ఈ వరుసలో దొరికిపోయినవారు చంద్రబాబు అనుంగు మిత్రులు, మాజీ మంత్రులు– సుజనా చౌదరి, నామా నాగేశ్వ ర్రావు, సీఎం రమేష్ వగైరాలు. 98 కాలేజీల్లో విద్యార్థులకు ఇవ్వవలసిన రూ. 800 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్లు నిలిచిపోయాయి. ఆఫీసర్ల టీఏ బిల్లులు, వారి ప్రైవేటు వాహనాల బిల్లుల చెల్లింపులు ఆగి పోయాయి. మరి ఆ డబ్బులు ఎటు మళ్లాయి? పసుపు–కుంకుమకు, డ్వాక్రాలకు మళ్లాయి. అలాగే అన్నదాత సుఖీభవ. వీటిపై రిజర్వ్‌బ్యాంక్ వడ్డీ చెల్లించమంటే ప్రభుత్వం కట్టలేదు. అందుకే అది జీతాలు ఆపేసింది. మున్సిపాలిటీల బిల్లులు, డ్వాక్రా మహిళలకు చెల్లించాల్సిన బిల్లులు, వైద్య ఖర్చుల కింద రోగుల బిల్లులు, కేంద్ర పథకాల బిల్లులు వగైరాలు ఆగిపోయాయని సర్వత్రా ఆందోళనలు పెల్లుబుకుతున్నాయి. ‘తనను వెంటాడుతున్నప్పుడు సాధారణ నేరస్తుడు ఎప్పుడూ అపరాధ భావంతోనే చూస్తాడని, నేరస్తుల మనస్తత్వం అలాగే ఉంటుందని చెప్పిన పెద్దమనిషి’ కూడా చంద్రబాబే. ఆ భావనలోనే ఉన్న వ్యక్తులు ఎదుటివారిపై నిందలు వేస్తారట, పైగా తాను ఆశించిన ఫలితాలు రానప్పుడు ఎదుటివారిపైన నిందలను రక్షణ కవచంగా వాడుకుంటా రని చెప్పిందీ బాబే. బహుశా ఆ నేరస్త మనస్తత్వం మామ ఎన్టీఆర్‌ను కడతేర్చిన బాబుకన్నా హెచ్చు మోతాదులో మరి ఎవరికుంటుందో? ఆ ‘అపరాధ’ భావన నలుగురు పెళ్లికూతుళ్లను చూసి, సంబంధాలు ఒప్పుకుని మరీ మధ్యలో కాడి కింద పడవేసిన నీతిబాహ్యులకే తెలియాలి. ఆ మాటకు వస్తే ఎన్టీఆర్ (ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు) ఆయన స్పెషల్ సెక్ర టరీగా ఉన్న అత్యంత సౌమ్యజీవి రాఘవేంద్రరావు మరణం కూడా ఎలా సంభవించిందో ‘అపరాధ భావన’లో ఉన్నవారికే తెలిసి ఉండాలి. అలాగే ‘నోటుకు ఓటు’, జగన్‌పై ‘కోడికత్తి’ పోటు, వివేకానందపై గొడ్డలి వేటు ఏ ‘అపరాధ భావన’లో ఉన్న అంతరాత్మకు తోడూ, నీడై ఉండాలో? ‘బడి పిల్లలకు నా పేరు చెప్పి, మరిచిపోవద్ద’ని చెప్పమని పంతుళ్లను ప్రాధేయపడే ముఖ్యమంత్రినీ, మనం ‘అపరాధ భావన’తో తీసుకుంటున్న వారిలోనే చూస్తాం. ఇక మంగళగిరి నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్న తండ్రికి తగిన తనయుడిగా అధికారిక ఎన్నికల తేదీని ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 9కి స్వచ్ఛందంగా మార్చి చరిత్ర సృష్టించుకున్న ఘనుడు. అలాగే బందరు ఓడరేవు(పోర్ట్)ను సరాసరి మన లోకేశ్ హైదరాబాద్‌కి తరలించేస్తాడట. బహుశా ఇన్ని రకాలుగా అవతరించిన ‘దేశం’ ‘మేధావుల’ అనుభవం తర్వాతనే కాబోలు వేలాదిమంది కీలక నేతలు టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి క్యూలు కడుతున్నారు. వీరంతా అసెంబ్లీ, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులే. వీరిలో 69 మంది అసెంబ్లీ స్థానాలకు, 310 మంది మండలస్థాయికి, 752 మంది గ్రామ స్థాయికి చెందిన నాయకులు ఉన్నారు. ఇది ఈ కాలపు సునామీ! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
బాబును ఎక్కించాలి బోను
‘అత్తెసరు’ మెజారిటీతో 2014లో బతికి బట్టకట్టిన చంద్రబాబు ఎప్పటికైనా ఇది కొంపముంచుతుందని ఆ క్షణం నుంచే బెంబేలుపడుతూ అసెంబ్లీలో టీడీపీదే మెజారిటీ అనిపించుకునే రంధి కొద్దీ తొక్కని అడ్డదారులు లేవు. ఓటర్ల యావత్ సమాచారం తమ పార్టీ (టీడీపీ) కార్యకర్తలవద్ద ఉంటే తప్పేంటనీ, వారు ఎవరికి ఓటు వేస్తారు అనే వివరాలు సేకరిస్తే తప్పెలా అవుతుందనీ ప్రశ్నించే చంద్రబాబును ప్రజల ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకుగాను శిక్షార్హమైన పాలకుడిగా పరిగణించాల్సిన అవసరం లేదా? లక్షలాదిమంది దగాపడిన ఓటర్ల నుంచి, పలు పార్టీల నుంచీ అందిన సాధికార రుజుపత్రాల ఆధారంగా ఎన్నికల సంఘం/న్యాయస్థానం చంద్రబాబును ప్రశ్నించవద్దా?! ‘‘ఎన్నికల ప్రక్రియలో ఓట్ల కొనుగోలు, అమ్మకాలు అనే పద్ధతుల ప్రవేశంతో ప్రజా స్వామ్యం, ప్రజాతంత్ర వ్యవస్థల పతన దశ ప్రారంభమైంది. ఇదే రోమన్ రిపబ్లిక్ పతనానికి నాంది పలికింది’’ – రిపబ్లిక్ పతన చరిత్రలో 2000 ఏళ్ల క్రితం ప్లూటార్క్ స్వతంత్ర భారత రిపబ్లిక్లో ఎన్నికలు స్వేచ్ఛగానూ, నిష్పక్షపాతంగా జరగాలని నిర్దేశిస్తున్న భారత రాజ్యాంగం ఎన్నికల ప్రక్రియ యావత్తూ ఎన్నికల సంఘం అజమాయిషీలో, నిర్దేశంలో, దాని అదుపాజ్ఞల్లో జర గాలని ఆదేశిస్తూ రాజ్యాంగం 324వ అధికరణ ఇలా స్పష్టం చేసింది. ‘ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకోవడా నికి కుల, మత, వర్ణ, లింగ వివక్ష ప్రాతిపదికపై ఏ వ్యక్తినీ అనర్హుడిగా చేయరాదు’. – 324వ అధికరణ ఈ ఆదేశాలకు, హెచ్చరికలకు బద్ధవిరుద్ధంగా నేడు ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఆగడాలు పురిపిప్పుకుని బాహాటంగా సాగుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం 17వ లోక్‌సభ నియోజకవర్గాలతోపాటు ఆంధ్రప్రదేశ్ సహా దేశంలో శాసనసభల కాలపరిమితి ముగియనున్న రాష్ట్రాలతో సహా దేశ వ్యాప్తంగా (తెలంగాణ శాసనసభ ఎన్నికలు ఇటీవలే ముగిశాయి) సార్వ త్రిక షెడ్యూల్స్‌ను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఈ ఎన్ని కలు ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదలతో ప్రారంభమై, అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ, వాటి గడువు, ఉపసంహరణ ప్రక్రియ సహా 28తో ముగిసి, ఏప్రిల్ 14న పోలింగ్ అనంతరం మే 23న పార్టీల, అభ్యర్థుల జాతక ఫలితాలతో ముగుస్తుంది. బహుశా, ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ఇంత స్వల్పమైన వ్యవధిలో ఆగమేఘా లపై ఎన్నికలు నిర్వహించడం ఇదే మొదటిసారేమో! ఈ పరిస్థితుల్లో 2014లో తెలుగు ప్రజల కృత్రిమ విభజన ద్వారా ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి కాదలిచిన చంద్రబాబు అతుకుల బొంత మెజారిటీతో (వైఎ స్సార్సీపీపై మొత్తం ఓట్లలో కేవలం సుమారు ఒకటిన్నర శాతం ఓట్ల అత్తెసరుతో) బీజేపీ సత్తరగాయ చేయూతతో అధికారాన్ని చేపట్టారు. అది మొదలు ఈ ’అత్తెసరు’ మెజారిటీ ఎప్పటికైనా కొంపముంచుతుం దని బాబు ఆ క్షణం నుంచే బెంబేలుపడుతూ రాష్ట్ర శాసనసభలో టీడీ పీదే మెజారిటీ అనిపించుకునే రంధి కొద్దీ తొక్కని అడ్డదారులు లేవు. ఇటీవల ఆధునిక ఎలక్ట్రానిక్ టెక్నాలజీ మాధ్యమంగా, కృత్రిమ పద్ధతుల ద్వారా వోటర్ల జాబితాలలో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ సీపీ(వైఎస్ జగన్‌కి) అనుకూలంగా ఉండే ఓటర్లను పనిగట్టుకుని ఏరివేసి ఆ ఓటర్లే తమ పేరు తొలగించవలసిందిగా దరఖాస్తులు పెట్టుకున్నట్లుగా ‘చిత్ర గుప్తుడి’ చిట్టాలు తయారు చేయించారు! ఈ భారీ ప్రక్రియకు సిద్ధాంతపరంగానూ, ఆచరణరీత్యానూ ఐటీ గ్రిడ్స్ అనే కంపెనీని తన కనుసన్నల్లో ఉంచుకుని, ఓటర్ల జాబితాలను తారుమారు చేసే ప్రక్రియకు అతి రహస్యంగా ప్రయత్నాలు చేసినట్లు వార్తాసంస్థలు విశ్వసనీయ కథనాలు వెల్లడించాయి. ఈ ప్రక్రియకోసం చంద్రబాబు వాడుకుని ప్రస్తుతం ఇబ్బందుల్లోకి నెట్టేసిన వ్యక్తి అశోక్. ఐటీ గ్రిడ్స్ కేంద్ర కార్యాలయ స్థానం హైదరాబాద్‌లో ఉన్నందున, దాని ఆధారంగా ఓటర్ల జాబితాలలో టీడీపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తారని అనుమానించిన ప్రధాన ప్రతిపక్షం సహా ఇతర ప్రత్యర్థుల ఓట్లను కూడా జాబితా నుంచి తప్పించే పన్నుగడ పన్నడానికి విశాఖలో నెలకొల్పిన ‘బ్లూఫ్రాగ్’ (సాధికారిక అనుమతులు లేని) కంపెనీని వినియోగించు కోవడమే కాకుండా ఇంగ్లండ్‌లో ఉన్న ‘సాఫ్ట్‌ల్యాబ్స్’ అనే ఒక కృత్రిమ కంపెనీని కూడా వాడుకుని ఓటర్లకు చెందిన సమస్త వ్యక్తిగత సమా చారాన్ని సాఫ్ట్ వేర్లో నిక్షిప్తం చేసిన ఆధార్, పాన్, బ్యాంక్ అక్కౌంట్ నంబర్లు సహా ప్రయివేట్ కంపెనీ చేతికి ధారాదత్తం చేయడం ఒక ప్రహసనంగా మారింది. ఇలా తమ అధికార దాహంతో పరుల చేతుల్లోకి ప్రతిపక్ష ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని బదలాయించడం ఎంత ప్రమాదకరమో ‘ఫేస్ బుక్’ అధినేత జుకర్‌బెర్గ్ సాంకేతిక పరిజ్ఞానం చాటున సృష్టించిన టెక్నాలజీ మాయాజాలం బహిర్గతం చేసింది. ఫేస్బుక్, వాట్సప్, ఇన్ స్టాగ్రామ్ రకరకాల ‘యాప్స్’ ద్వారా దేశవ్యాప్తంగా ఎంతమంది సాధా రణ పౌరులు వర్తక, వ్యాపార వర్గాల, ఓటర్ల వ్యక్తిగత సమాచారానికి రక్షణ లేకుండా పోయిందో, ఆధార్వల్ల వ్యక్తిగత సమాచారానికి ‘గోప్యత’ దెబ్బతింటుందని, అందుకు తాము అంగీకరించబోమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన సంగతి మరచిపోరాదు. అయినప్పుడు చంద్రబాబుకు సాంకేతిక సమాచార గుప్త కేంద్రంగా మారిన ‘ఐటీ గ్రిడ్స్’, ‘బ్లూఫ్రాగ్’, ‘సాఫ్ట్ ల్యాబ్స్’ (బ్రిటన్) కార్యాలయాలను పోలీసు నిఘా వర్గాలు దాడిచేసి సోదాలు నిర్వహించాల్సి వచ్చింది. అంతేగాదు, జుకర్‌బర్గ్ ఫేస్బుక్ ద్వారా 20 కోట్ల మంది భారతీ యుల వ్యక్తిగత సమాచారాన్ని తాను దొంగిలించి అమెరికాలో నిక్షిప్తం చేసి అభాసుపాలైన తరువాత ఇప్పుడు మరో కొత్త నాటకానికి తెరలేపు తున్నాడు. ‘వ్యక్తిగత గోప్యతకు ఇబ్బంది లేకుండా ‘స్నేహపూర్వకమైన ఫేస్బుక్’ సిద్ధం చేస్తున్నానని, ఇది ఎన్నికలలో ఓట్లను తారుమారు చేసే ప్రక్రియకు ఇక దూరంగా ఉంటుందన్న దొంగ హామీలతో (6.3.19) ముందుకొస్తున్నాడు. ఈ విషయమై ఫేస్బుక్, వాట్సప్ టెక్నాలజీ పని చేసే పద్ధతుల గురించి సాంకేతిక సమాచారం వివరాలు రాబట్టేందుకు ఇటీవలనే భారత పార్లమెంట్ సభ్యులతో కూడిన బృందం (పానెల్ 6.3.19) ఏర్పడింది. అది ఫేస్బుక్, వాట్సప్, ఇన్స్టాగ్రామ్ మాధ్య మాలు దేశంలోని ఎన్నికల సందర్భంగా ఓటర్లలో అనుమానాలు రేకె త్తించి, ప్రజలలో అలజడిని హింసాకాండను ప్రజ్వరిల్ల చేయడానికి వేదికలు కారాదని హెచ్చరించవలసి వచ్చిందని మరవరాదు. పైన పేర్కొన్న మూడు టెక్నాలజీ నియోగిత మాధ్యమాలు మూడురకాల వ్యవస్థలుగా పనిచేస్తున్నాయి. ఫేస్బుక్ ఏకకాలంలో– అడ్వరై్టజింగ్ సంస్థగా, మీడియా సంస్థగా, మార్కెటింగ్ సంస్థగా ‘త్రిపాత్రాభినయం’ చేస్తోంది. కృత్రిమ వంగడాల ద్వారా వర్ధమాన దేశాల వ్యవసాయ పంట లను ఎలా దెబ్బతీస్తున్నారో అలాగే ఫేస్బుక్ సంస్థ కూడా ఓ కృత్రిమ (దొంగ) కంపెనీగానే పనిచేస్తున్నట్టు పార్లమెంటరీ పానెల్ సభ్యులు అభిప్రాయపడుతున్నారు. పానెల్ సమావేశానికి గ్లోబల్ పబ్లిక్ పాలసీ ఉపాధ్యక్షుడు జోయెల్ కప్లాన్, వైస్– ప్రెసిడెంట్, ఫేస్బుక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అజిత్‌మోహన్, ఇండియా పబ్లిక్ పాలసీ ప్రోగ్రామ్స్ డైరెక్టర్ అఖీదాస్ హాజరయ్యారు. అంతేగాదు, ఈ ఆన్లైన్ దుర్వినియోగం, డేటా చోరీలు నాయకుల నుంచి అన్ని స్థాయిల్లోనూ భారీగా ఎంత యథేచ్ఛగా సాగు తున్నాయో, భారత సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలు కనీసం 16 ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్ నుంచి ఎలా చోరీ అవుతున్నాయో వివరించాయని మరచి పోరాదు. ఫలితంగా భారత ప్రజల గోప్యతా ప్రయోజనాలకు ఏ మేరకు భారీ స్థాయిలో నష్టం వాటిల్లిందో జాతీయ స్థాయి కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ప్రపంచ స్థాయి సైబర్ నేరాల నిఘా ఏజెన్సీలతో కలిసి ఇప్పటిదాకా ఎంత నష్టం వాటిల్లిందీ అంచనా కడుతున్నారు. చంద్రబాబు నర్మగర్భంగా ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్సీపీ ప్రతి పక్షం సహా తమకు ఓటు వేయరనుకున్న ఆయా పార్టీల కార్యకర్తల ఓట్లను పక్కకు తప్పించగల పోర్టల్స్ వెనక దాక్కుంటున్నారని కొందరు నిపుణుల రీడింగ్! డేటా చోరీకి గురైన ఆప్స్‌లో డబ్స్మాచ్/ఆర్మోర్ గేమ్స్/కాఫీమీట్స్ బాజెల్ ఉన్నాయి (6.3.19). వీటి వినియోగదార్ల వ్యక్తిగత వివరాలన్నీ ‘హుష్‌కాకి’ అయిపోయాయి. సైబర్ సంగ్రామ్ చతుర్ల నీతికి బలైపోయాయి. ఇలా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశ వ్యాప్తంగా ఇంతటి భారీ స్థాయిలో సోషల్ మీడియా మాధ్యమాలను సైబర్ సెక్యూరిటీ సంస్థలు కూడా రక్షించలేని స్థితిలో కేంద్ర, రాష్ట్ర ఎన్ని కల సంఘాలు నిర్వహిస్తున్న అరక్షిత ఎన్నికలు దేశ ప్రజాస్వామ్యాన్ని ప్రజల ప్రజాస్వామ్య హక్కులను, వారి ఓటు ప్రాథమిక విలువల్ని ఏ మేరకు రక్షించగలవన్నది రాను రాను మరింత ప్రశ్నార్థకంగా మారి పోయింది. ప్రజల్ని ఎదురు ప్రశ్నించే పాలకులు ఉన్నంతకాలం ప్రశ్నించే ప్రాథమిక హక్కును కూడా ప్రజలు కోల్పోక తప్పదు. పైగా ఓటర్ల యావత్ సమాచారం తమ పార్టీ (టీడీపీ) కార్యకర్తలవద్ద ఉంటే తప్పేం టనీ, ఎవరికి ఓటు వేస్తారని వివరాలు సేకరిస్తే తప్పెలా అవు తుందనీ ప్రశ్నించే ముఖ్యమంత్రిని ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకుగాను శిక్షార్హ మైన పాలకుడిగా పరిగణించాల్సిన అవసరం లేదా అని లక్షలాదిమంది దగాపడిన ఓటర్లనుంచి, పలు పార్టీల నుంచీ అందిన సాధికార రుజుప త్రాల ఆధారంగా ఎన్నికల సంఘం/న్యాయస్థానం ప్రశ్నించవద్దా?! ఇవన్నీ ఒక ఎత్తయితే మన దేశంలో రాజ్యాంగ సంస్థల తీరుతెన్నులు మరొక ఎత్తు. న్యాయవ్యవస్థ మొదలుకొని వివిధ రాజ్యాంగ సంస్థలు కొన్ని సందర్భాల్లో ప్రజాస్వామ్య పరిరక్షణ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నా యన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఇందుకు ఆ సంస్థల బాధ్యత కూడా ఉంది. ప్రపంచంలో అత్యంత అధునాతమైన సాంకేతికతను వినియోగించే అమెరికా, జపాన్‌లు సైతం ఈవీఎంలు వాడనప్పుడు మన దేశంలో మాత్రం బ్యాలెట్ పత్రాలను తప్పించి, వాటిపైనే ఎందుకు ఆధారపడుతు న్నామన్న సంశయం చాలామందికి ఉంది. ఈ అంశంలో రాజ్యాంగ సంస్థలు తగినంతగా విచారణ జరిపాయా? ఇది ఆలోచించాల్సిన అంశమే. ప్రజాస్వామ్యం మనగలగాలంటే, కిందిస్థాయి వరకూ ప్రజాస్వామిక సంస్కృతి బలపడాలంటే అన్ని వ్యవస్థలూ సమష్టిగా కృషి చేయాలి. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
‘నేను సైతం’ అంటున్న షర్మిలమ్మ!
2014 నుంచీ జగన్‌కి ఆసరాగా అగ్రగామి శక్తిగా షర్మిల రాజకీయ ప్రచారాన్ని 3,000 కి.మీ. పర్యంతం అంతకుముందే ఘనంగా నిర్వహించిన సంగతి రాష్ట్ర ప్రజలకు కొత్త కాదు. తిరిగి ఆమెను తాజా ఎన్నికల ప్రచారంలోకి దిగి జగన్‌కు కొండగా అండగా నిలబడకుండా బెదరగొట్టజూడ్డమే ఓటమివైపు ప్రయాణిస్తున్న ‘తెదేపా’ గందరగోళపు శ్రేణుల లక్ష్యం. సమాజంలో అనేకవిధాల వంచనకు గురి అవుతున్న సామాన్య మహిళలపట్ల సామాజికులు సకాలంలో స్పందించని సందర్భాలనేకం. నేడొక విద్యా వంతురాలిగా, సామాజిక కార్యకర్తగా రాజకీయ చైతన్యంగల కుటుంబంనుంచి ప్రభవిల్లిన షర్మిల వ్యక్తిత్వాన్ని కించపరచడానికి ఎవరు ప్రయత్నించినా సహించరాదు. ‘‘మానవ జాతిలో స్త్రీ–పురుష విభజన అనేది కేవలం జీవశాస్త్ర సంబంధమైనదేగానీ అదొక చారిత్రక సంఘటనగా భావించరాదు. (The division of the sexes is a bilogical fact, not an event in history). ఈ రెండు శక్తులు కలిస్తేనే మానవులు (మానవ–మానవి) అవుతారు. మానవజాతి, ఆదాము, అవ్వ మానవాళికి అందివచ్చిన తొలి మానవులు. ఇందులో ‘సెక్స్’ పేరిట కృత్రిమ విభజనకు ఆస్కారం లేదు. ‘సెక్స్’ పదాన్ని తరచుగా స్త్రీతో సంబంధానికే స్త్రీ దృష్ట్యానే వర్తింపచేసిన వాడు మగవాడు. ఇది అతని దాష్టీకానికి, ఆధిక్యతా ధోరణికి నిదర్శనం. కేవలం జీవశాస్త్ర సంబంధమైన ప్రాకృతిక ఏర్పాటును (ప్రిమోర్టియల్ మట్స్న్) చెదరగొట్టడానికి ప్రయత్నించినవాడు పురుషుడేగానీ స్త్రీ మాత్రం కాదు!’’ – 20వ శతాబ్ది సుప్రసిద్ధ ఫ్రెంచి మేధావి, మహిళా ఉద్యమ నాయకురాలు సిమన్ ది బోవా (‘ది సెకండ్ సెక్స్’ గ్రంథకర్త) స్త్రీ–పురుష వివక్ష సమస్య కాల పరిస్థితులకు అతీతంగా నేటికీ సాగుతూ, మరిన్ని వెర్రితలలు వేస్తున్న దిశగా ప్రయాణిస్తోంది. సమస్త రంగాలనూ పీడిస్తున్న ఆ వివక్ష కొన్ని రాజకీయ పార్టీల ప్రమేయంతో మరింతగా పేట్రేగిపోతోంది. ధర్మవరం ‘తెదేపా’ నాయకుడు ఎకాఎకిని ‘మహిళ’ల్ని చెంపదెబ్బలు కొట్టండనే పిలుపిచ్చాడని వార్త! తెదేపా వాళ్లలో వికటించిన ఈ అన్య ‘జన్యు’ వ్యాధి లక్షణం వల్లనే బహుశా దివంగత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, వైఎస్సార్సీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన క్రియాశీల మహిళా కార్యకర్త షర్మిల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా సాగుతున్న అనాగరిక ప్రచారం. ఇందుకు 2014 ఎన్నికల లోనే తెరలేపారు. దానికి కొనసాగింపుగానే త్వరలో జరగబోయే సార్వ త్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మరొకసారి అదే బాపతు ప్రచార యుద్ధం మరొకసారి ప్రారంభించారు. ఇందుకు సోషల్ మీడియాను మాధ్యమం చేసుకుని తమ పేర్లు తెలిపే దమ్ములేక గాలివాటు ప్రచారా నికి దిగారు. మొదటినుంచీ జగన్‌కి ఆసరాగా, అగ్రగామి శక్తిగా ఉంటున్న షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ పేరిట పాదయాత్ర ప్రారం భించి 3,000 కిలోమీటర్ల పర్యంతం కొనసాగించిన సంగతి రాష్ట్ర ప్రజ లకు కొత్త కాదు. ఆమెపై ఏదో రకంగా బురదజల్లి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడమే లక్ష్యంగా తెదేపా శ్రేణులు తాజా దాడికి తెగిం చాయి. కానీ, షర్మిల మొదటిసారి చేసినట్టే, ఈసారి కూడా తన వ్యక్తి త్వాన్ని కించపరిచే ప్రచారానికి ఒడిగట్టిన వారిపై పోలీసు ఉన్నతాధికా రులకు, సైబర్ క్రైమ్ అధికార గణానికి ఫిర్యాదు చేయవలసి వచ్చింది. పర్యవసానంగా అధికారులు కొన్ని వెబ్సైట్లలో కొంతమంది ‘ఆవారా’ గాళ్లను గుర్తించినట్టు ప్రకటించారు. ఈ పరిణామం కాంగ్రెస్‌కు అమ్ముడు పోయిన ‘తెదేపా’లో గత్తరకు, గందరగోళానికి దారితీసింది. ఇప్పుడు ‘తెదేపా’ను అక్కున చేర్చుకున్న కాంగ్రెస్ పార్టీలోని మహిళల్నే ముంచే స్థితికి పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి, టీవీలలో బాహాటంగా ప్రసార మవుతున్నాయి. ఇప్పుడు అలాంటి శక్తులే షర్మిలను లక్ష్యంగా చేసుకుని దొంగదాడికి దిగాయి. నేడొక విద్యావంతురాలిగా, సామాజిక కార్యక ర్తగా రాజకీయ చైతన్యంగల కుటుంబంనుంచి ప్రభవిల్లిన షర్మిల వ్యక్తి త్వాన్ని కించపరచడానికి ఎవరు ప్రయత్నించినా కూడా పౌరశక్తి సహిం చరాదు. అందుకే ఒక చైతన్యం గల స్త్రీగా షర్మిల పోలీసు ఉన్నతా ధికారులవద్ద ఫిర్యాదు చేసిన సందర్భంగా ఒక ఆలోచనాత్మకమైన ప్రకటన కూడా విడుదల చేయవలసి వచ్చింది: ‘‘మహిళల సమానత్వం, స్వేచ్ఛ అన్న మాటలు కేవలం కాగితాలకు, చర్చలకే పరిమితం కారాదు. ఆచరణలో అవి ప్రతిఫలించాలి. నా వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ నాకు జరి గిన అవమానం నా ఒక్కదానికే జరిగినట్లు నేను భావించటం లేదు. ఇలాంటి తప్పుడు రాతలు ఇంకెంతోమంది మహిళలమీద కూడా రాస్తు న్నారు. స్త్రీలపట్ల శాడిజం (విద్వేషం), చులకన భావంతో ఈ రాతలు రాస్తున్నారు. ప్రజాస్వామ్యం, మానవహక్కులు, సమానత్వం, మహిళల స్వేచ్ఛ వంటి మాటలు వాస్తవరూపం దాల్చాలంటే మనం (మహిళలు) గొంతెత్తి వెబ్సైట్లు, సోషల్ మీడియాలో సాగుతున్న తప్పుడు ప్రచారా లను బయటపెట్టాలి. కారకులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న నా విజ్ఞాపనకు మద్దతు పలకాలని ప్రజాస్వామ్యవాదులు, పాత్రికే యులు, మహిళలు, రాజకీయ నాయకులను కోరుతున్నాను. నాపై దుష్ప్రచారం చేస్తున్నవారు, చేయిస్తున్న వారికి బదులుగా ఈ రోజున ఇలా దోషిగా నిలబడి నా వాదనను వినిపించుకోవాల్సిన దుస్థితి రావ టం ఒక్క నాకే కాదు, మహిళలందరికీ అవమానకరం. ఈ విష ప్రచారం వెనుక ‘తెలుగుదేశం’ పార్టీ పాత్ర ఉంది’’ అని బాహాటంగానే ఆమె ఆరో పించారని ఇక్కడ గమనించాలి. షర్మిల మాటల్నే మరొక రూపంలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కూడా వివరించారు. ‘మహిళల భద్రతకు పెద్ద పీట వేయాలన్న’ ఆయన మాటలకు విలువ రావాలంటే ఇప్పటి దాకా మహిళలపై సాగుతున్న వివక్షకు, హింసకు తక్షణం స్వస్తి చెప్పిం చగల్గాలి. ఎప్పుడో వైదిక యుగం నాటి గార్గి, మైత్రేయి లాంటి విద్వ న్మణులు చెలాయించిన పురాణ కాలంనాటి మహిళల సంగతి మనకు తెలియకపోవచ్చు, బహుశా మాతృస్వామిక యుగం చెలామణీలో ఉన్న దశలో మాత్రమే అలాంటి స్వేచ్ఛ, ప్రతిష్ట సాధ్యమై ఉండవచ్చు. కానీ సాధికారతకు స్త్రీ పురుష వివక్ష ఉండటానికి వీలులేదన్న గాంధీజీ... మహిళలు తమ స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను కాపాడుకోవడానికి, తమపై జరిగే అవమానాలను, హింసను ఎదుర్కొనడానికి ఏనాడో ఒక విలువైన చిట్కాను సూచించారు: ‘‘మహిళలు తమ ఆత్మరక్షణార్థం తమకు అందు బాటులో ఉన్న సహజ ఆయుధాల్ని– తమ నోటిపళ్లను, చేతిగోళ్లనూ యథేచ్ఛగా ఉపయోగించుకోవాలి. అర్ధరాత్రి స్త్రీ స్వేచ్ఛగా, నిర్భయంగా రోడ్లపై నడిచి వెళ్లగలిగినప్పుడే దేశ స్వాతంత్య్రానికి అర్థమూ, విలువా’’ నన్నాడు. ఈ రోజున ‘నేను సైతం’ (మీ–టూ) అంటూ మహిళా లోకం ఎందుకు తెగబడవలసి వస్తోంది? సామాజిక, ఆర్థిక, కుల, మత, వర్గ అసమానతలకు, సంఘర్షణలకు తావిచ్చే ధనికవర్గ పెట్టుబడి దోపిడీ దారీ వ్యవస్థ నరనరాన సామాజికుల్ని– ముఖ్యంగా అట్టడుగు వర్గాలను మరీ పీడిస్తున్నందున. అందుకే అడుగడుగునా రిపబ్లిక్ రాజ్యాంగం నిర్దే శించిన లౌకిక వ్యవస్థను తూట్లు పొడుస్తూ దేశ స్వార్థ రాజకీయ పాల కులు అసమ సామాజిక ఆర్థిక వ్యవస్థకు ‘చౌకీదార్లు’గా నిలబడినందునే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్–‘నేటి భారత దేశంలో దోపిడీ వ్యవస్థలో ‘దళిత మహిళలతోపాటు సంపన్న మహిళలు కూడా దళితులే (భర్తలచాటు భార్యలే)నన్నాడు. ఈ దృక్పథాన్ని అంతకుముందు 19వ శతాబ్దం నాటి శాస్త్రీయ సోషలిజం సిద్ధాంత కర్తలు కారల్ మార్క్స్, ఫ్రెడ రిక్ ఎంగెల్స్ మరికొంత వివరంగా స్పష్టంగా విస్తరించి వర్గ సమాజంలో ‘భర్త బూర్జువా(యజమాని), భార్య ప్రొలిటేరియట్ (శ్రమజీవి/పనిమనిషి)’ అని నిర్వచించారు. అందుచేతనే మార్క్స్ ‘స్త్రీ పురుషుల మ«ధ్య సంబంధం మనిషికీ మనిషికీ మధ్య అతి సహజమైన బంధం. మరో మాటలో చెప్పాలంటే, ఏమేరకు మనిషి తన వ్యక్తిగత ఉనికిని కాపాడుకుంటూనే సంఘజీవిగా నిరూపించుకోగలుతున్నాడన్నదే అసలు అగ్ని పరీక్ష’ అన్నాడు. కాలం చెల్లిన వలసపాలకుల చట్టాలను దుమ్ముదులిపి భావ ప్రకటన స్వేచ్ఛను ‘దేశ ద్రోహనేరంగా’పరిగణించి అరెస్ట్‌లు చేస్తున్నారు. కనుకనే పెక్కుమంది వీటికి నిరసనగా పద్మశ్రీలు, పద్మభూషణ్ బిరుద బీరాలను తృణప్రాయంగా భావించి పాలకుల ముఖాన తిప్పి కొడుతున్నారు. విశ్వవిద్యాలయాల యువతీ యువకులు చైతన్యమూ ర్తులై తిరగబడవలసిన దుస్థితిని పాలకులు కల్పించారు. గౌరీలంకేష్ లాంటి పత్రికా సంపాదకుల్ని, పన్సారే, దభోల్కర్, కల్బుర్గిలాంటి సుప్రసిద్ధ సామాజిక కార్యకర్తల్ని, ప్రొఫెసర్లను భిన్నాభిప్రాయ ప్రకటనకుగాను హత్యగావిస్తున్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల భిన్నాభిప్రాయ ప్రకటనలు, తీర్పులపై పాలకులు గుర్రు పెంచుకుంటున్నారు. ఈ సామాజిక సంకుల సమరంలో భాగమే షర్మిలమ్మ ఎదురీత కూడానని మరిచిపోరాదు. ఈ జీవన యాత్రలో షర్మిల ఒంటరికాదు. సంఘ దురాచారాలకు, అన్యాయాలకు, దోపిడీ స్వభావాలకు వ్యతిరేకంగా గతంలో ఉద్యమించిన వీరేశలింగం, గిడుగురామ్మూర్తి దంçపతు లను, చిలకమర్తి, భండారు అచ్చమాంబ, కొమర్రాజు, సూర్యదేవర రాజ్యలక్ష్మి, నందగిరి ఇందిరాదేవి లాంటి సంస్కర్తలను మహిళా స్వాతంత్య్ర యోధులను షర్మిల తలచుకుని తిరిగి రంగంలోకి దూకాలి. అంతేకాదు, ప్రపంచ వ్యాపితంగా మహిళల హక్కుల కోసం నిరంతరం పోరాడిన ఫ్రెంచి విప్లవ కాలంనాటి తొలి బ్రిటీష్ మహిళ, ప్రసిద్ధ మహిళా తత్వవేత్త, స్త్రీ పురుష సమానత్వం కోసం, ఆడపిల్లల విద్యా వ్యాప్తికి దోహదపడిన మేరీ ష్త్రల్స్టోన్ క్రాఫ్డ్, ప్రసిద్ధ అమెరికన్ స్త్రీవాద ఉద్యమ నాయకురాలు అమేలియ జంక్స్, సిమన్ దిబోవా (ఫ్రాన్స్), లూసీ స్టోన్ బెట్టీ ఫ్రీడన్, మహిళల ఓటు హక్కు కోసం ఉద్యమించి, సాధించి ప్రెసిడెంట్ అబ్రహం లింకన్‌కు వెన్నుదన్నుగా నిలిచిన ఉమెన్స్ లాయల్ నేషనల్ లీగ్ స్థాపకురాలు సుసన్ బ్రౌనెల్ ఆంథోనీ మహిళా యువతకు ఆదర్శప్రాయులు. అలాగే ఈ ప్రసిద్ధ మహిళా మణులతోపాటు మహిళా హక్కుల సాధనలో వెన్నుదన్నుగా నిలిచి లైంగిక వేధింపులకు మహిళల వ్యక్తిత్వాలను కించపరిచే హింసా ప్రవృత్తిని నిరోధించే సవరణ చట్టాలు రూపొందించడానికి దోహదపడిన పురుష సామాజిక కార్యకర్త ప్రసిద్ధ గాయకుడు మానవ హక్కుల పరిరక్షకుడు హారీ చెల్పాంచే, జాన్ లెజెంట్, మార్క్ రుఫాలో లాంటి ఉద్ధండులూ ఎందరో ఉన్నారు. బహుశా అన్ని ఖండాలలో అన్ని దేశాలలో ఇంతమంది కృషి ఫలితమే ఈనాటి మహిళా లోకపు ‘నేను (మేము) సైతం’ ఉద్యమాల ఉధృతి అని మరచిపోరాదు. అందుకే ఒకనాడు లెనిన్ ‘ఫ్రెంచి విప్లవానికి పురుషులు కాకుండా పూర్తిగా మహిళలే నాయకత్వం వహించి ఉంటే దాని ఫలితం మరెంత ఆశాజనకంగా ఉండేదో’నని భావించి ఉంటాడు. అలాగే షర్మిలా నీవు అభినవ కౌటిల్యుల కుట్రలను ఛేదిస్తావు, కుంగిపోవలసిన పనిలేదు. వికసించిన విద్యుత్తేజంలోకి మళ్లీ దూసుకురా, చెలరేగే జనసమ్మర్థంలోకి బిరాన రా. ‘కదిలేదీ కదిలించేదీ/ మారేదీ మార్పించేదీ/ పాడేదీ పాడించేదీ/మునుముందుకు సాగించేదీ/ పెను నిద్దుర వదిలించేదీ/పరిపూర్ణపు బతుకిచ్చేదీ’ ఏదో దాన్ని ఆశించు, దాన్ని ఆశ్రయించు, సదా సాహసించు. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు -
బాబు ‘ఫెడరల్ స్ఫూర్తి’ ఇదేనా?
ఉన్నట్లుండి చంద్రబాబుకి ఫెడరల్ వ్యవస్థ రక్షణ ఎందుకు గుర్తుకొచ్చింది? నాలుగున్నరేళ్లుగా మోదీతో స్నేహాన్ని కాపాడుకుంటూనే, ప్రత్యేకహోదా కంటే రాష్ట్రానికి ‘ప్యాకేజీ మూట’ చాలునని చెప్పి ఏపీ ప్రయోజనాలను స్వార్థ రాజకీయానికి బలిచేసినంతకాలం బాబుకు ఫెడరల్ స్ఫూర్తి గుర్తుకు రాలేదు. తన పాలనలో అడ్డంగా బలిసిన బినామీ అక్రమ వ్యాపారులపై కేంద్ర నిఘా సంస్థల దాడి సూచనలు రాగానే చంద్రబాబుకు దేశ, సమాఖ్య రక్షణ గుర్తుకొచ్చేశాయి. అవినీతి కేసుల్లో రాష్ట్రాలకు ప్రత్యేక సార్వభౌమాధికారం ఉండదనేది అందుకే. ఈ క్రమంలో టీడీపీని సైతం రద్దుచేసినంత పని చేసి కాంగ్రెస్‌తో అంటకాగడానికి బాబు స్వచర్మ రక్షణే అసలు కారణం. ‘చంద్రబాబునాయుడి టీడీపీ ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవినీతిలో నంబర్ వన్ స్థానంలో ఉంది, అభివృద్ధి పథంలో అట్టడుగు స్థానానికి చేరుకోబోతోంది. రాష్ట్రంలో 80 శాతం పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతున్నారు. రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో వర్షపాతం 30 శాతం లోటు తేలింది. కోట్లాది రూపాయల విలువైన వ్యవసాయ పనిముట్లను ఈ ప్రభుత్వం దిగుమతి చేస్తోంది. కాగా మరోవైపున అమరావతిలో ప్రభుత్వ సచివాలయం పేరిట చదరపు అడుగుకు ఒక్కంటికి రూ. 11,000 చెల్లించింది, గత నాలుగేళ్లలోనూ ఒకే ఒక్క మీడియా (ప్రచురణ) సంస్థకు రూ. 700 కోట్ల ప్రజాధనాన్ని ధారాదత్తం చేసింది. రాష్ట్రంలోని 13 జిల్లాలనుంచీ తెచ్చి మేట వేసుకున్న సంపదను గుజరాత్, కర్నాటక, తెలంగాణా ఎన్నికలలో ఇప్పుడు ఖర్చు చేస్తోంది. ఇక పుష్కరాల పేరిట, ప్రత్యేక విమాన ప్రయాణాల కోసం, క్యాంపు ఆఫీసుల నిర్వహణ కోసం వేలాది కోట్ల రూపాయలు మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేస్తోంది’. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లామ్ ప్రకటన (18–11–2018) చంద్రబాబు తన పాలనా నిర్వహణల భాగోతాన్ని కప్పిపెట్టుకోవడానికే భారత ఫెడరల్ (సమాఖ్య) వ్యవస్థ రక్షణ కోసమే కొత్తగా తాని ప్పుడు ఉద్యమిస్తున్నట్లు, ఆ భారాన్ని తన భుజస్కంధాలపై మోయవలసి వచ్చినందుకే కేంద్ర సీబీఐ లాంటి విచారణ సంస్థలూ, ఆదాయపన్ను నిఘా శాఖలూ ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశించడానికి వీల్లేదని సరికొత్త ఉత్తర్వును (నం. 176: 08–11–2018) జారీ చేశారు. ఈ ఆకస్మిక ఉత్తర్వును జారీ చేయడానికి ఏ పరిస్థితులూ, కేంద్రంలో ఏ పరిణామాలు బాబును ప్రోద్బలపరిచి ఉంటాయి? మోదీ (బీజేపీ) ప్రభుత్వ అతి జోక్యం ఫలితంగా, అన్ని రాజ్యాంగ సంస్థల ఉనికిని దెబ్బతీసే చొరవ మూలంగా, కేంద్ర నేర నిఘా సంస్థల్లో కూడా చిచ్చుపెట్టడానికి చేసిన ప్రయత్నంవల్ల సీబీఐ ఉనికే ప్రశ్నార్థకంలో పడింది. ఈ నేపథ్యంలోనే ఇటు చంద్రబాబుకు అన్నివిధాలా అండదండలందిస్తున్న పలువురు పార్టీ నేతల బినామీ అక్రమ వ్యావార లావాదేవీల బండారం బయటపడి విచారణ సంస్థలు రాష్ట్రంలో శరవేగంతో దూసుకువచ్చి దాడులు నిర్వహిస్తున్న విషయం కూడా మరచిపోరాదు! ఈ దాడులు గనుక లేకపోతే లేదా నాలుగున్నరేళ్లుగా మోదీతో స్నేహాన్ని కాపాడుకుంటూనే, ప్రత్యేకహోదా మిషపైన రాష్ట్రానికి ‘ప్యాకేజీ మూట’ చాలునని చెప్పి రాష్ట్ర ప్రయోజనాలను కాస్తా తన స్వార్థ రాజకీయానికి బలిచేసిన బాబు మరికొన్నాళ్లపాటు బీజేపీతో చెట్టపట్టాలు కట్టేవాడేనని మరవరాదు. ఈ రాజకీయ వ్యభిచారమే టీడీపీని చివరకు బాబు రద్దు చేసుకుని.. కాంగ్రెస్ నీడలో ఎదిగి, మధ్యలో మామ ఎన్టీఆర్‌ను నిలువునా ముంచేసి తిరిగి మళ్లీ కాంగ్రెస్‌తో చేతులు కలిపేలా చేసింది. బహుశా తెలుగుదేశం పార్టీని మరణశయ్య మీదికి బాబు చేర్చనున్న ఆఖరి దశ ఇది. ఎందుకంటే అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ పాలకులు పాక్షిక ప్రయోజనాలతో రాజ్యాంగ నిబంధనలకు, రాజ్యాంగానికి క్రమంగా తిలోదకాలు ఇచ్చి అన్ని రాజ్యాంగ వ్యవస్థల స్వరూప స్వభావాలనే తమ స్వార్థ ప్రయోజనాలకు, ప్రతిపక్షాలపై దమనకాండకు వినియోగిస్తూ వచ్చిన దాని ఫలితంగానే, సీబీఐ తదితర ఆర్థిక నేరాల విచారణ సంస్థలు అంతంతమాత్రంగా ఉన్న తమ ఉనికిని దిగజార్చుకుంటున్నాయి. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా నాలుగేళ్లు కాపురం వెలగబెట్టిన చంద్రబాబుకు కూడా తన చాపకిందికి నీళ్లు పారేదాక సీబీఐతో అంటకాగినవాడే. పైగా ఎన్టీఆర్‌ను సీఎం పదవినుంచి కుట్ర ద్వారా సాగనంపి అధికారంలోకి వచ్చిన బాబు ఆధారపడింది ఎవరిపైన? నాడు సీబీఐ డైరెక్టరుగా ఉండి రిటైర్ అవుతున్న దశలో విజయ రామారావును క్యాబినెట్ మంత్రిని చేసి, తనకింద సీబీఐ జాయింట్ డైరెక్టరుగా పనిచేస్తున్న లక్ష్మీనారాయణను రాష్ట్రంలోకి దించాడు బాబు. వైఎస్ రాజశేఖరరెడ్డి కనుమరుగు అయ్యాక, ఆయన హయాంలో అవినీతి జరిగిందని తప్పుడు ఆరోపణలకు దిగి, అందులో జగన్ పేరుకూడా ఇరికించి, సీబీఐ అధికారులను రాష్ట్రానికి రప్పించింది చంద్రబాబేనని జనం మరువరు. ఆ ‘క్విడ్ ప్రోకో’ సూత్రం ఆధారంగా జగన్‌ను అరెస్టు చేయించి, 16 మాసాలు జైల్లో నిర్బంధింపజేసి, విడుదలైన తర్వాత కూడా కేసుల పరంపరను సీబీఐ స్పెషల్ కోర్టుల్లో కొనసాగించింది కూడా బాబేనని మరవరాదు. కానీ ఎనిమిది–తొమ్మిదేళ్లుగా సాగిన కేసుల విచారణలో అనేకసార్లు సీబీఐ స్పెషల్ కోర్టు ‘ఏదీ మీ నిర్దిష్ట సాక్ష్యాలు, రోజులు గడుç స్తున్నా ఆ సాక్ష్యాలు ఎక్కడున్నాయి’ అంటూ ప్రశ్నిస్తూ వచ్చినా సీబీఐకి ఉలుకూ, పలుకూ లేదు. ఈ లోగా ఏ కంపెనీలు జగన్ కంపెనీల్లో ‘క్విడ్ ప్రోకో’ అజ్ఞాత సూత్రం కింద పెట్టుబడులు పెట్టాయని బాబు ఆరోపించి అరెస్టులు చేయించాక, దాదాపుగా వాళ్లందరికీ కోర్టు బెయిల్ ఇచ్చి విడుదల చేసిందో– వారి ఊసుగానీ, విచారణ కొనసాగింపుగానీ మనం ఇంతవరకూ ఎరగం. అయినా, ‘సిగ్గుకు సిగ్గులేదన్న’ట్టుగా నాడు సీబీఐని జగన్‌పైకి ఉసికొల్పిన చంద్రబాబు ఈ రోజున తన హయాంలో బలిసిపోయి కోటికి పడగలెత్తినవారి అక్రమ సంపాదనలను పసిగట్టి దాడులు నిర్వహిస్తున్న అదే సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టంరేట్లను ఆంధ్రప్రదేశ్‌లోకి రానివ్వనని హుకుం జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేకుం డానే కేంద్ర విచారణ సంస్థలు సరాసరి దర్యాప్తు జరపవచ్చునన్న, 1946 నాటి ఢిల్లీ పోలీసు చట్టం (సెక్షన్ 5) ఏపీలో ఇకమీదట చెల్లబోదని బాబు తాజా ఉత్తర్వు జారీ చేశాడు. విచిత్రమేమంటే ఈ ఉత్తర్వు వెలువడిన వెంటనే దానికి మద్దతుగానా అన్నట్టు హైదరాబాద్‌లోని సీబీఐ కౌన్సిల్ శ్రీనివాసరాజు కూడా ‘ప్రస్తుతం విచారణలో ఉన్న కేసుల్ని మాత్రం’ సీబీఐ విచారించడానికి అభ్యంతరం ఉండదని ఒక ముక్తాయింపు పలికారు. అంటే, ఏతావాతా జగన్‌పై కొలిక్కిరాని కేసులు సీబీఐ విచారణలోనే కొనసాగుతుంటాయని చెప్పక చెప్పటం. కాగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మాత్రం ‘దొంగ సంపాదనాపరులు, కోట్లాది సంపదను కూడబెట్టుకున్న’ పాలకులు, వాణిజ్యవేత్తలు మాత్రమే సీబీఐ అంటే బయపడతార’ని చెబుతూ బాబు ఉత్తర్వును అపహాస్యం చేశారు. ఇక బాబు ఉత్తర్వును బలపర్చింది ఎవరు? గతంలో బీజేపీతో జోడుకూడి బాబుతోపాటు తోడు రాగం పాడుతూ వచ్చిన మమత, కేజ్రీవాల్, కెప్టెన్ సింగ్ (పంజాబ్)లు. అయితే ఫెడరలిజాన్నీ, ఫెడరల్ వ్యవస్థనూ ఆపద్ధర్మంగా చాటు చేసుకుని, ఏపీని ముక్కలు చేసిన కాంగ్రెస్ నాయకురాలు సోనియాను, రాహుల్‌ను ‘ఇటలీ దెయ్యాలు’గా దూషించిన బాబు అదే కాంగ్రెస్‌తో ఇప్పుడు చేతులు కలపడం– మునిగిపోతున్న టీడీపీ పడవను కాపాడుకునే ఆఖ రియత్నం తప్ప మరొకటి కాదు. అంతగా ‘ఫెడరల్ స్ఫూర్తి’ కలిగిన బాబు, నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ పంచాయతీరాజ్ వ్యవస్థల్ని పటిష్టం చేయడానికి తెచ్చిన 74–75 రాజ్యాంగ సవరణలను గ్రామ స్థాయిలో ‘జన్మభూమి’ కమిటీలను ‘దేశం’ పార్టీ కార్యకర్తల్ని మేపడానికి తప్ప పంచాయతీ వ్యవస్థ పటిష్టతకు ఎందుకు ఉపయోగించరో చెప్పాలి. చివరికి, మన ‘ప్రజాస్వామ్య’ విలువలు ఏ స్థాయికి చేరాయో సుప్రీంకోర్టు ప్రసిద్ధ న్యాయమూర్తి (రిటైర్డ్) జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ఇలా మొత్తుకోవలసి వచ్చింది: ‘‘70 ఏళ్లుగా నిర్మించుకున్న వ్యవస్థలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా కుప్పకూలి భారత రాజ్యాంగమే అపహాస్యం పాలవుతోంది. వక్రబుద్ధితో ఆలోచించే నేతల చేతుల్లో చిక్కుబడిపోయిన వ్యవస్థలో సత్యం మాట్లాడలేని పరిస్థితి నెలకొంది. వ్యవస్థను ప్రజాస్వామ్య పద్ధతుల్లో నడపడం సాధ్యపడని నేతలు నిట్టనిలువునా చీల్చేస్తున్నారని’’ (18.11.2018) హెచ్చరించారు. తనపైన, తన అనుచరులపైన ముంచుకొస్తున్న అవినీతి కేసుల్ని పక్కతోవలు తొక్కించడానికి రాష్ట్రంలో సీబీఐ తాజా దాడుల్ని వ్యతిరేకించడానికి ఉత్తర్వు ఇస్తూనే, జగన్‌పై కేసుల కొనసాగింపునకు వీలుగా సీబీఐ లోగడ ప్రారంభించిన విచారణ మాత్రం కొనసాగడానికి బాబు వీలూ, వాలూ చూసుకున్నట్టు స్పష్టమవుతోంది. ఇది మునిగిపోతున్న బోటు మల్లయ్య ఆఖరి శ్వాస. అవి నీతి కేసుల్లో రాష్ట్రాలకు ప్రత్యేక సార్వభౌమాధికారం ఉండదనేది అందుకే. ఈ దోపిడీ వ్యవస్థ పెంచిన నాయకుల్లో ఒకరు చంద్రబాబు. ఇదెలాంటి వ్యవస్థ? సత్యవాదులైన న్యాయవాదుల్ని, న్యాయమూర్తుల్ని కూడా సత్యానికి దూరం చేయగల వ్యవస్థ. సానాబాబు, రమేష్ లేకుండా తీతువు పిట్టల్లాంటి శివాజీ ‘గరుడ పక్షులు’ పుట్టరు. వీళ్లు లేకుండా సీబీఐలో ‘ఆస్థానా’ లాంటి స్పెషల్ డైరెక్టర్లూ ఉండరు, లక్ష్మీనారాయణ లాంటి జేడీలు ఉండలేరు. జనాభాలో కేవలం ఒక్కశాతం వర్గమే– 1922లో ప్రారంభమైన నాటినుంచీ ఈనాటి దాకా నమోదైన పన్నుల రికార్డుల ప్రకారం భారత జాతీయాదాయాన్ని స్పష్టంగా అనుభవిస్తున్నారని సుప్రసిద్ధ ఫ్రెంచి ఆర్థికవేత్త ప్రపంచ ప్రజా బాహుళ్యం దారిద్య్రాన్ని అంచనా వేస్తూ చెప్పారు. ఇలా పరాన్నభుక్కు పెట్టుబడిదారీ వ్యవస్థే జాతీయ జీవనంలోని ప్రతి విభాగంలోకి చొరబడుతోందని మరచిపోరాదనీ ముంబై ‘ఫైనాన్షియల్ టైమ్స్’ ప్రసిద్ధ విలేకరి, అసోసియేట్ ప్రొఫెసర్ జేమ్స్ కాబ్ట్రీ సాధికారిక అంచనా (2018). ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ప్రకృతి ‘ప్రేమలేఖలు’ వ్యాసరేఖలైన వేళ!
మొదటి సంపుటిలో కళాసృష్టికి దోహదం చేసిన పలువురు ప్రాచ్య, పాశ్చాత్య చిత్ర కళా నిర్మాతల కృషి గురించే గాక, కొంతమంది దేశీయ కళాకారులైన రాజారవివర్మ, నందలాల్ బోస్, పట్నాయక్, రాజన్ బాబు, పూసపాటి పరమేశ్వర రాజు, కొండపల్లి శేషగిరిరావు, కథాకళాశిల్పి రావిశాస్త్రి, కేశవరెడ్డి, జనపదాల కాపు– కాపు రాజయ్యల గురించిన అందమైన లోతైన సమీక్షలు, వర్ణచిత్రాలు ఉన్నాయి. ప్రసిద్ధ చిత్రకారులు, ఛాయాగ్రాహకులు, నవలాకారులు, శిల్ప, నగ్న చిత్రకళల్లో పరసీమలు చూచిన ప్రముఖులను సాధికారికంగా సమీక్షించి మన్ననలందుకున్న కాండ్రేగుల నాగేశ్వరరావు–తన మనోమందిరమూ, నివాసగృహమైన ‘దుల్హన్’ను రసాత్మకంగానే తీర్చిదిద్దుకున్నాడు. ‘‘అమ్మ వేసే ముగ్గులు, అక్క పాడే శాస్త్రీయగీతాలు హరి విల్లును భూ మార్గం పట్టించే దసరా, దీపావళి పండుగ కోలాహలం, గణపతి చతుర్థి నాటి కోలాటాలు, నవరాత్రి పండుగల్లో వేడుక చేసే నాటి కళావంతులు మేళా, బుర్రకథలు, హరికథలు, నాటకాలు, నాట్యాలు, రికార్డింగ్ డ్యాన్స్‌లు, ఇంటిముందు జరిగే సుబ్రమణ్యేశ్వరస్వామి షష్ఠి తీర్ధం–చిన్నతనం నుంచి నన్ను రసమయ జగత్తులోకి నడిపించాయి.’’ అలా నడక ప్రారంభించిన ఓ కళాభిమాని ప్రకృతి సోయగంతో అమరధామంలా విలసిల్లిన అమలాపురం వాస్తవ్యుడు, కొలది రోజుల నాడు భౌతిక ప్రపంచాన్ని వీడి వెళ్లిన బహుముఖీన మేథావి కాండ్రేగుల నాగేశ్వరావు. ఉస్మానియా కళాశాల విద్యార్ధిగా విశ్వ విద్యాలయం నుంచి ‘లా’లో ఉత్తమ శ్రేణిలో నిలిచిన రెండవ పట్టభద్రుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీస్ గ్రూప్‌వన్ పరీక్షలో టాపర్, రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్‌గా ప్రసిద్ధుడైన ఆయన సాహిత్య, కళారంగాల అభిమానిగానేగాక, ఆ రెండింటా తలమున్కలుగా సైద్ధాంతిక అభినివేశం ఉన్న అరుదైన ఉన్నతోద్యోగుల్లో ఒక ప్రసిద్ధునిగా గణనలోకి వచ్చారు. ఆయన కళాశాల జీవితంలో ఒక సరికొత్త నేపధ్యంలో ఎదిగి వచ్చినవాడు. ఒక ఆకు కదిలినా, ఒక పువ్వు విచ్చినా ’’ అదంతా తనకోసమే నన్న ఒక మౌన స్పందన ఆయనలోని మనసును పలకరించి పులకరింతలు పెట్టించినవే. అందుకే ఆయనలో ప్రకృతి పరిసరాలు తనలో కలిగించిన గిలిగింతలనే ‘‘నాకు నేను రాసుకున్న ప్రేమలేఖ’’లని సారస్వత కళా సాంస్కృతిక పరమైన వర్ణరోచిస్సుల ‘‘సప్తపర్ణి’’ పేరిట ఈ రంగాలలోని పలుశాఖల్లో శతాబ్దాల, దశాబ్దాల తరబడిగా జాలువారిన దేశీయ, పాశ్చాత్య ఉద్దండులైన అగ్రగామి చిత్ర, వర్ణచిత్రా సినీరంగ శ్రేష్టుల జీవిత కాలపు మహోన్నత కృషికి ఎంతో శ్రమతో నాగేశ్వరావు సమర్పించిన సువర్ణకలశమే –రెండు ఉత్తమ సంపుటాలు. ఒక ప్రసిద్ధ ఫొటోగ్రాఫర్‌గా, కళా సంస్కృతుల ఆరాధకునిగా తన భావాలతోనే ప్రేక్షకుల మనస్సులను కొల్లగొట్టుకోగల విధంగా తన గ్రం«థానికి రూప (డిజైన్) కర్తగా పలువురి కళాభిమానాలు మనసుల్ని దోచుకున్నవాడాయన! అయన కలాన్ని ‘‘నర్మగర్భమైన లియోనార్డో డావించి కళాఖండమైన మోనాలిసా చిరునవ్వు నుంచి గగుర్పాటు కలిగించే పికాసో కళాఖండం గుయెర్నికా’’వరకు నడిపించడంలో తొలి స్ఫూర్తి ప్రసిద్ధ చిత్రకారుడు, సాహితీ కళారంగ సాధికార విమర్శకుడైన సూర్యదేవర సంజీవదేవ కాగా, మలి స్ఫూర్తి ప్రసిద్ధ బౌద్ధ వాంగ్మయ తాత్వికుడు, ప్రముఖ మాసపత్రిక ‘‘మిసిమి’’ గౌరవ సంపాదకుడైన అన్నపురెడ్డి వెంకటేశ్వర రెడ్డి అందించిన ఉత్సాహ, ప్రోత్సాహకాలే! అందుకే నాగేశ్వరరావు ఇలా చెప్పుకున్నాడు: ‘‘కళ యావత్తూ ఉత్తమ పురుషైక వచనం. ఒక కళాకారుని కృషి వెనుక చెవియొగ్గి వినగల్గితే అతని స్వీయ ఘోష వినపడుతుంది. కవి ‘నే’నంటే అర్థం ‘మేమ’ని అంటాడు. ఆ వాక్యం కళాకారులందరికీ వర్తిస్తుందని చెబుతూ తన ‘‘సప్తపర్ణి ’’ కళార్చన రెండు సంపుటాలలో పేర్కొన్న ఒక్కో కళాకారుడు ఒక హిమశిఖరం. అందుకే కళ అనేది అనుభవైక వేద్యం. భాష కందని మధుర భావనలవి. కళలో దాగి ఉన్న క్లిష్టతను సమీక్ష ద్వారా సరళీకరించగల్గితే ఆ మధురిమను మరింతగా ఆస్వాదించవచ్చన్నది నాగేశ్వరరావు భావన. ఒక్క చిత్ర కళారంగమే కాదు. ప్రజా కళలలో భాగమైన చలన చిత్ర ప్రపంచంలోని తెలుగు సహా పలు భాషా చిత్ర సమీక్షలు కూడా ఎన్నింటినో ఈయన çస్పృశించారు. ఈ సమీక్షలపైన వ్యాఖ్యానించిన ప్రముఖ పాత్రికేయుడు ‘‘నాగేశ్వర్రావుగారికొక విలక్షణమైన దృక్ప«థం ఉండటం’’ విశేషం అని ప్రశంసించాడు. ఇంకా వెలువడవలసి ఉన్నది ‘‘సప్తపర్ణి’’ రెండవ సంపుటి. మొదటి సంపుటిలో కళాసృష్టికి దోహదం చేసిన పలువురి ప్రాచ్య, పాశ్చాత్య చిత్ర కళా నిర్మాతాల కృషి గురించే గాక, కొంతమంది దేశీయ కళా కారులైన రాజారవివర్మ, నందలాల్‌బోస్, పట్నాయక్, రాజన్ బాబు, పూసపాటి పరమేశ్వర రాజు, కొండపల్లి శేషగిరిరావు, కథాకళాశిల్పి రావిశాస్త్రి, కేశవరెడ్డి, జనపదాల కాపు– కాపు రాజయ్యల గురించిన అందమైన లోతైన సమీక్షలు, వర్ణచిత్రాలు ఉన్నాయి. భావాల క్లుప్తీకరణ ఒక కళ అయితే, కొండంత భావానికి ఉండంత కళా రూపమిచ్చి చూపరిని ఆకట్టుకోవడమే కళా లక్ష్యం. కాదేది కవిత కనర్హం అయితే కాదేది కుంచెకు అనర్హం’’అయితే కళకు చిత్ర కళకు స్వకీయమైన భాష ఉంటుంది. అందుకే జార్జి బ్రాక్ అనే కళాకారుడు ‘‘చిత్రకళ ఒక నఖ (గోటితో గీసే) రేఖలాంటిది. ఆ గోటితో గీసే గీటును నా మనోభావాలకు తగినట్టుగా తీర్చిదిద్దడం నా కిష్టం అన్నాడు. చరిత్రకు అందని ప్రాచీన కాలం నుంచి బొమ్మగీయడం అనే కళలో ప్రాథమికంగా పెద్ద తేడాపాడాలు లేవు. మనిషిని ప్రపంచాన్ని దగ్గరగా చేర్చడమే బొమ్మకళామర్మం, అదే ‘గీత’ రహస్యమని సుప్రసిద్ధ కళాకారుడు కీత్ హారింగ్ అన్నాడు. ఎన్నివాదాలు ఈ లౌకిక ప్రపంచంలో ప్రబలితమవుతున్నాయో అన్ని నాదాలు, నాదస్వరాలు, అసంఖ్యాక కళారూపాలు, చిత్రకళా వైవిధ్యాలు ఉన్నాయి. అంతేకాదు, ఈ రూపా రూపాలకు, కళారంగ వైవిధ్యాలకు విభిన్న సిద్ధాంతాలు, సైద్ధాంతిక సిద్ధాంతులు పుట్టుకొచ్చారు! ఇంతవరకూ ప్రపంచ కళారంగ చరిత్రలో 30 రకాల కళా సిద్ధాంతాలు, 50 రకాల భావాలు ముప్పెర గొన్నాయని రసజ్ఞుల అభిప్రాయం! ఏది ఏమైనా సంక్లిష్ట భావాలను అర్థమయ్యే విధంగానే కళారూపం ఉండాలన్నది మార్క్ రాత్కో అభిప్రాయపడగా, కళాకారుడు గీసే బొమ్మలకు వ్యాఖ్యాత ప్రత్యేకంగా ఉండకూడదు, చిత్రమే తన ఉనికిని తాను చాటుకోగలగాలి కానీ మరొక వ్యాఖ్యాతంటూ ఉండకూడదన్నాడు బార్నెట్ న్యూమాన్ అనే కళావిమర్శకుడు. ఈ వాద ప్రతివాదాలకు నిదర్శనంగానే కళారంగ చరిత్రలో ఇంప్రెషనిజం, ఫాడిజం, క్యూబిజమ్, ఫ్యూచరిజం, ఎక్స్ప్రెషనిజం, సర్రియలిజం, అబ్‌స్ట్రాక్, డాడాయిజం వగైరా కళారూపాలు, సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. అయితే ఈ రూపారూపాలకు చెందిన సకలవాదాలు సమన్వయం చేసుకుంటూ మొత్తం కళా స్వరూపంలోని, ప్రధాన లక్షణాన్ని సుప్రసిద్ధత చిత్రకారుడూ, చారిత్రక నవలాకారుడు అయిన అడవి బాపిరాజు ‘‘ఆంధ్రశిల్పం’’ రచనలో ఇలా పేర్కొన్నాడు. ‘‘ఒక దృశ్యం, ఒక రూపం, ఒక జీవితం, ఒక భావం, కళాశక్తి కలిగిన రసజ్ఞులకి గోచరించినపుడు తనలో ఉండే కళాశక్తి పైకి ఒక స్వరూపంగా జన్మించాలని ఆవేదన పొందడం చేతనే కళా స్వరూపం ఉద్భవించటం, ఆ సృష్టి భాషా స్వరూపమైతే కవిత్వమూ, భవన స్వరూపమైతే ఆలయమూ, అవుతుంది’’. ఇన్ని రూపారూపాల ప్రాచ్య, పాశ్చాత్య (తెలుగు కళాకారుల, సినీ మహాకళాకారులు సహా) కళాకారుల, చిత్రకారుల వైభవోన్నతిని తీర్చిదిద్దిన కళానిలయమే ‘‘సప్తపర్ణి’’ అపురూప సంపుటాలు. రెండవ సంపుటి త్వరలో వెలువడనుంది. సూర్యుణ్ణి కుంచెగా మార్చి, సూర్య కిరణాలు ఏడు వర్ణాలుగా తనకు ఎలా కనిపించాయో, జగత్తు అనే చిత్రపటాన్ని తీర్చి దిద్దడానికి ‘‘సూర్యుడనే చిత్రకారుడు’’ సిద్ధమయ్యాడని శ్రీనాథ మహాకవి వర్ణించాడు, అలా చిత్రకారునిగా మారిన సూర్యుని చేతిలో ‘‘తూర్పు దిక్కు’’ అనే అందమైన అమ్మాయి మనకు చూపించిన చిత్రకారుడు సూర్యుడు! మొదటి సంపుటిలో మొత్తం 66 మంది ప్రపంచ తెలుగు కళారంగ ఉద్ధండుల గురించిన అంచనాలను నాగేశ్వరరావు అందించగా, రెండవ సంపుటిలో దామెర్ల రామారావు, బాపు, గిరిధర్ గౌడ్, శీలా వీర్రాజు ప్రభృతులు సహా మరికొంతమంది పాశ్చాత్య, ఆంధ్ర చిత్రకళా, సినీ ప్రపంచ ప్రముఖుల దాకా విమర్శనాత్మక, సమన్వయపూర్వక, విజ్ఞానదాయకమైన అంచనాలను నాగేశ్వరరావు పొందుపరచగలిగారు. సప్తస్వరాల విశ్వసమ్మేళనం, సప్తవర్ణాలతో నిండిన ‘‘పర్ణశాల’’గా ఈ సంపుటాలు రూపుదిద్దుకున్నాయి. అందుకే ప్రసిద్ధ ప్రకృతి దృశ్య చిత్రకారుడైన సంజీవ దేవ్ అని ఉంటాడు: ‘‘ప్రకృతి శోభనుచూస్తుంటే అనిపిస్తుంది–యీ రంగులు, యీ రూపాలు, యీ వెలుగులు, యీ నీడలు, యీ బింబాలు అన్నీ కూడా అన్నీ కూడా నాదమాధురి లోకి మారి ఆ దృశ్యమంతా శ్రవ్యంగా వినిపిస్తే, అహా! ఎంత ఆనందంగా ఉంటుందో, అని! ‘చూడటం’ అనేది ‘వినటం’ లోకి పరివర్తిస్తే, గ్రుడ్డితనం వచ్చినా కూడా భయపడాల్సిన అవసరం లేదు. చెవుడు మాత్రం రాకుండా కాపాడుకోవాలి’’! ఇంతమంది ప్రసిద్ధ చిత్రకారులు, ఛాయాగ్రాహకులు, నవలాకారులు, శిల్ప, నగ్న చిత్రకళల్లో పరసీమలు చూచిన ప్రముఖులనూ సాధికారికంగ సమీక్షించి మన్ననలందుకున్న కాండ్రేగుల నాగేశ్వరరావు– తన మనోమందిరమూ, తన నివాసగృహమైన ‘దుల్హన్’ను కూడా రసాత్మకంగానే తీర్చిదిద్దుకున్నాడు. లోలోపల ఎటు చూచినా, ప్రతి గదీ కుడ్యచిత్రాలతో లేదా అందమైన భారీప్యానెల్స్తో నిండి ఉంటాయి లేదా పురావస్తు సంచయం మౌనముద్రల్లో మనల్ని పలకరిస్తుంటాయి. మనల్ని సజీవ చిత్రాలుగా భ్రమింపజేసే, శయనించే పోజులో చలువరాతితో చెక్కిన స్త్రీ భారీ విగ్రహం ఒక చోట, దర్జాగా కాలు మీద కాలు వేసుకుని వచ్చిన ఆగంతుకుడ్ని ‘నీ వేమిటి, నీ కధేమిటీ’ అని ప్రశ్నిస్తున్న ఫోజులో దర్జాగా ఒక మగధీరుని విగ్రహం, మరొక తట్టున మనల్ని పలకరించబోతాయి. గులాబీ రేకు ఎక్కడికి చేరి, ఎక్కడ శాశ్వత నిద్రలో సేద తీర్చుకుంటున్నా దాని అజ్ఞాత గుబాళింపు మాత్రం కాలావధులకు అతీతం. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు -
అరికాళ్లకింద మంటలు చల్లారవా!
ఇప్పుడు ‘నేను సైతం’అని మహిళాలోకమే (మీ– టూ) ఉద్యమాన్ని నిర్మించి ముందుకు సాగవలసి వస్తోంది. ఇది హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు విస్తరించడం ఆహ్వానించదగిన పరిణామం. బాలీవుడ్ నుంచి రాధికా ఆప్టే, మరొక ఉషా జాధవ్ బీబీసీ డాక్యుమెంటరీలో తాము ఎదుర్కొంటున్న బాధను బాహాటంగానే చెప్పారు. స్వాతంత్య్ర భానూదయ వేళలోనే గాంధీజీ ఒక సందేశాన్ని ఇచ్చారు. ‘స్వతంత్ర భారతంలో అర్థరాత్రి పూట స్త్రీలు నిర్భయంగా నడిచి పోగల స్వేచ్ఛావర్తనులు కావాలి’అని అన్నారాయన. ‘అందముంటే మొగవాడిని భరించేందుకు, బలముంటే మొగవాడికి చాకిరీ చేసేందుకు, చదువుకుంటే మొగవాడికి పద్దులు రాసేందుకు, సంగీతమొస్తే మగవాణ్ణి సంతోషపెట్టేందుకు – ఇంత అన్యాయం లోకమెట్లా భరిస్తుందో, ఆచారమనే బురదలో కుళ్లిపోయి నశించాయి మనవాళ్ల హృదయాలు... ప్రేమలేక, సంతోషం లేక, జీవితంలో ఇంటరెస్టు లేక, తను బాధపడ్డా కరుణించేవారు లేక, ఇంక విధిలేక బండచాకిరితో తన శక్తినీ, ద్వేషంతో తన ప్రేమనీ, తిట్లతో తన ఆనందాన్నీ సార్థకం చేసుకోవాలని స్త్రీ ప్రయత్నించడం మనకు సిగ్గుచేటు కాదా?’ – చలం (శేషమ్మ కథలులో ‘భార్య’నుంచి) ‘స్త్రీల కన్నీటిగాథలకు కారణాలు నాకు తెలుసు. వారి తరఫున వకాల్తా పట్టడానికే నిర్ణయించుకున్నాను. నాది ప్రజల ఉద్యమం. దానిని ఎవరిని సంతోషపెట్టడానికైనా వదులుకోను. స్త్రీలు మేలుకోవాలి, ఎదిరించాలి, తిరగబడాలి. మానవత్వం స్త్రీలోనే అధికం. స్త్రీ శరీరసౌఖ్యం పొందడం గొప్పకాదు. ఆమె మేధాశక్తిని గ్రహించి రసానుభూతిని పొందడం గొప్ప.’ మహాకవి గురజాడ (‘లేఖలు’నుంచి) కనిపించే లోకం గురించి మనం ఎన్నో మాట్లాడుకుంటాం. మన కనుసన్నలలోనే కళ్లుకప్పి కోకొల్లలుగా జరిగే ఉదంతాలను గురించి మాత్రం పట్టనట్టే తప్పుకుంటూ ఉంటాం. ఆ అజ్ఞాత చీకటిగుయ్యారాలలో, పెట్టుబడిదారీ వ్యవస్థ రుద్దిన అసమ సమాజపు దోపిడీ చట్రంలో కుంగి కునారిల్లుతున్న స్త్రీల గాథలను ఏవగించుకుంటున్నాం. అంతేతప్ప ఒక సమష్టి శక్తిగా మానవ సమూహం పిడికిలి ఎత్తడానికి సిద్ధపడడం లేదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు కావస్తున్నది. అయినా ఇప్పటికీ ఆర్థిక అసమానతల నుంచి, దోపిడీ పద్ధతుల నుంచి, అత్యాచారాల నుంచి, వేధింపుల నుంచి బలహీనులను ఎందుకు విముక్తం చేయలేకపోతున్నాం? ప్రసార మాధ్యమాలు విస్తరించాయి కాబట్టి నేడు సమాజంలో జరుగుతున్న కొన్ని వికృతులు బయటపడుతున్నాయి. అవి విస్తరించని కాలంలో స్త్రీల మీద, బడుగుల మీద ఎన్ని రకాల అకృత్యాలు, అత్యాచారాలు జరిగాయో ఈ తరంవారికి తెలియదు. వందేళ్ల నాటి సామాజిక దృశ్యాన్ని గమనిస్తే ఇది అర్థమవుతుంది. బాల్య వివాహాలను అరికట్టడానికీ, విధవా పునర్ వివాహాలు జరిపించడానికీ ఆనాడు తెలుగునాట ఒక యుద్ధమే చేయవలసి వచ్చింది. వీరేశలింగం జీవితమే అందుకు ఉదాహరణ. ఇక సంఘాన్ని, భాషను, సంస్కృతిని సంస్కరించడానికి గురజాడ, గిడుగు, చిలకమర్తి వంటివారు ఎంతో మూల్యం చెల్లించవలసి వచ్చింది. తరువాతి కాలాలలో జాషువ, త్రిపురనేని వంటివారు ఇలాంటి సమరానికి తలపడ్డారు. సాంకేతిక పరిజ్ఞానం విస్తరిస్తున్నకొద్దీ పనిచేసే చోట్ల స్త్రీలపై వేధింపులు కూడా పెరిగిపోతున్నాయి. సమ సమాజం, ఆర్థిక సమానత్వాన్ని లక్ష్యంగా చాటుకున్న రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన నేతలు కూడా ఈ దుస్థితిని నిరోధించడం మీద శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. కారణం– రాజకీయ పార్టీలలో, పాలనా యంత్రాంగంలో, ఆఖరికి మంత్రుల స్థాయిలోను తప్పుడు మార్గం పట్టినవాళ్లు, అదే మార్గంలో వెళుతున్నవారు ఉన్నారు. ఇటీవల చలనచిత్ర రంగంలో చోటు చేసుకున్న పరిణామాలు స్త్రీలు ఎంతటి దురవస్థను ఎదుర్కొంటున్నారో చెప్పకనే చెప్పాయి. ఈ నేపథ్యంలోనే ఒక మహిళా మాజీ ఎంపీ పార్లమెంటులో కూడా స్త్రీలకు వేధింపులు ఉన్నాయని (24–4–18) ప్రకటించారు. ‘నూరు దోషాలలోని ఒక సుగుణం’దోపిడీ పద్ధతుల మీద ఆధారపడిన పెట్టుబడిదారీ సమాజ నైజం. ‘నూరు సుగుణాలలోని ఒక దోషం’ప్రగతిశీల సామ్యవాద ప్రజాస్వామ్య వ్యవస్థల స్వభావం. మన కుల వ్యవస్థ చట్రంలో అంటరానితనం వర్గ పోరాటానికి ప్రతిబింబమని అన్నారు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్. అంతేకాదు, ‘దోపిడీపై ఆధారపడి కొనసాగుతున్న స్వతంత్ర భారతంలోని ప్రజా బాహుళ్యం ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలంటే ప్రజలను దోచుకునే పెట్టుబడి వర్గాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్త ఐక్య సంఘటన అనివార్యం. అందుకు మరణభీతి ఉండరాదు’అని కూడా అంబేడ్కర్ (పంథార్పూర్, మహారాష్ట్రలో, 1954లో మహిళలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో) అన్నారు. ‘వివక్ష లేని సామూహిక సమాజం నుంచి, కలివిడిగా నివసించగల సామాజిక చట్రం నుంచి కుల వ్యవస్థ హిందువులను దూరం చేసింది. సమైక్య జీవన చైతన్య భావన నుంచి వేరు చేసింది. సామాజిక సద్వర్తనలో సమాజ సభ్యులందరు పాలు పంచుకునే సమష్టి కార్యాచరణ అవసరం. భావోద్రేకాలను సమష్టిగా పంచుకోవడం అనేది కుల వ్యవస్థను కూలగొట్టడంతోనే సాధ్యం’అన్నది ఆయన అభిప్రాయం. ఆడపిల్లలు భర్తలకు దీటుగా నిలబడాలని, భర్తను స్నేహితునిగా, సమాన హోదాలోనే భావించాలి గాని, అతడికి బానిసై పడి ఉండకూడదని కూడా చెప్పారాయన. నేటి పెక్కు సామాజిక, ఆర్థిక సమస్యలకు పరిష్కారం హిందూ కోడ్ బిల్లు అని అంబేడ్కర్ ఆనాడు చాటారు. కనుకనే సుప్రసిద్ధ కథకుడు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి ఒక కథలో స్త్రీల దుస్థితిని ప్రతిబింబింపచేస్తూ ఆ పాత్ర చేతనే, ‘దొడ్లో గేదె ఉంది, ఇంట్లో నేనున్నాను ఇంటిల్లిపాదికీ’అని గద్గగ స్వరంతో పలికించారు. ఇవాళ్టి చలనచిత్ర పరిశ్రమలో పొట్టపోసుకోవడానికి వచ్చిన ఒక కళాకారిణి వ్యథాభరితంగా గొంతెత్తితే కానీ అక్కడి ఎందరో ‘భద్ర పురుషుల’నిజజీవితాల గురించి వెల్లడయ్యే అవకాశమే రాలేదు. ఎవరు ఎన్ని మంటలు పెట్టినా సంసారాన్ని నెట్టుకొచ్చిన రుక్కమ్మ గాథ శ్రీపాద రాసిన ‘అరికాళ్ల కింద మంటలు’చదివితేనే అందరికీ తెలుస్తుంది. ప్రఖ్యాత కథకురాలు అబ్బూరి ఛాయాదేవి ఒక కథలో సృష్టించిన పాత్ర వనజ. పదోన్నత పత్రాలు తీసుకోవడానికి ఉత్సాహంగా వెళితే, ఆ పత్రాలను అందించే క్రమంలో వనజ చేతి వేళ్లను పట్టుకున్నాడు ఆమె పై అధికారి. దాంతో ఆ పత్రాలు అందుకోకుండానే, ‘యూ క్రూక్’అనుకుని వెనుదిరిగింది. అందరి మేలు కోరుకున్న గురజాడ ‘దేవుడు చేసిన మనుషుల్లారా! మనుషులు చేసిన దేవుళ్లారా? మీపేరేమిటి?’అని (మీపేరేమిటి? కథలో) ప్రశ్నించాడు. స్త్రీని బానిసగా చూసే ‘మెటిల్డా’భర్త (మెటిల్డా కథలో) ధోరణి, సరళ అనే యువతి పట్ల ప్రొఫెసర్ రంగనాథయ్యర్ (సంస్కర్త హృదయం కథలో) వ్యవహరించిన తీరులతో మహాకవి చాలా కోణాలను ప్రతిబింబింప చేశారు. వివాహం కాకుండా సంతానాన్ని కనకూడదా? అని ప్రశ్నించే యోధులను, నీకు శాశ్వతమైన భార్య ఇష్టం లేదని చాటే మృగాళ్లను కొడవటిగంటి ఉతికి ఆరేసింది ఎందుకు? దారి తప్పిన సమకాలీనుల ధోరణులు రేపటి తరాలకు పాఠాలుగా ఉండాలనే కదా! అందుకేనేమో ఇప్పుడు ‘నేను సైతం’అని మహిళాలోకమే (మీ– టూ) ఉద్యమాన్ని నిర్మించి ముందుకు సాగవలసి వస్తోంది. ఇది హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు విస్తరించడం ఆహ్వానించదగిన పరిణామం. బాలీవుడ్ నుంచి రాధికా ఆప్టే, మరొక ఉషా జాధవ్ బీబీసీ డాక్యుమెంటరీలో తాము ఎదుర్కొంటున్న బాధను బాహాటంగానే చెప్పారు. ఉన్నత స్థాయిలో ఉన్నవారి నుంచి లైంగిక వేధింపులు సర్వసాధారణమని చెప్పారు. స్వాతంత్య్ర భానూదయ వేళలోనే గాంధీజీ ఒక సందేశాన్ని ఇచ్చారు. ‘స్వతంత్ర భారతంలో అర్థరాత్రి పూట కూడా స్త్రీలు నిర్భయంగా నడిచి పోగల స్వేచ్ఛావర్తనులు కావాలి’అని అన్నారాయన. కానీ నిర్భయ చట్టం వచ్చినట్టే ఉన్నా ఆచరణలో యువతులు, మహిళలు పగటి పూట కూడా బిక్కుబిక్కుమంటూ సంచారించాల్సిన పరిస్థితి ఉంది. కుల వివక్షే కాదు, వర్ణ వ్యత్యాసం కూడా దేశంలో జడలు విప్పుకుంటున్నదా అన్న అనుమానం కూడా కలుగుతున్నది. త్రిపుర ముఖ్యమంత్రి విప్లవకుమార్ దేవ్ (బీజేపీ) ప్రకటనే ఇందుకు నిదర్శనం. ‘తెల్లగా ఉన్న ఐశ్వర్యారాయ్‌కు ప్రపంచ సుందరి బిరుదు ఇవ్వడం సబబే. కానీ చామనఛాయలో ఉన్న డయానా హెడెన్‌కు ఏం చూసి ప్రపంచ సుందరి టైటిల్ ఇచ్చారో అర్థం కావడం లేదని అనడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ‘భారత వనితనైన నేను నా శరీరం చామన ఛాయలో ఉన్నందుకు గర్వపడుతున్నాను. కానీ ఈ చర్మ వివక్ష కారణంగా నేను న్యూనతా భావానికి గురవుతూనే ఉన్నాను.’అని ఆమె నిరసన ప్రకటించక తప్పలేదు. నిజానికి పసిపిల్లలకు పాలివ్వకుండా తల్లులను నిరోధించే భర్తలు కూడా ఇక్కడ ఉన్నారు. ఇది సిగ్గుపడవలసిన విషయం కాదా! దోపిడీ వ్యవస్థకు దేవిడిమన్నా చెప్పవలసిన సమయం రాలేదా? ‘వర్గ, వర్ణ వ్యవస్థలో మహిళలు కూడా దళిత బహుజనులే’అన్నారు అంబేడ్కర్. అందుకే మార్క్స్, ఏంగెల్స్ ‘ధనిక వర్గ సమాజంలో భర్త బూర్జువా ప్రతినిధికాగా, భార్య శ్రామికవర్గ ప్రతినిధి’అని పేర్కొన్నారు. నాగరిక సమాజంలో కూడా దారిద్య్రం ఉంటుందా అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ, ‘ఆ దారిద్య్రం కొలదిమంది చేతులలో అపారమైన సంపద ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోయి ఉండడమే కారణం’అని చెప్పారు. అది ఎందుకంటే, ‘ఎప్పుడైతే అతి సంపద అందుబాటులో ఉండదో మగవాడికి తన జీవిత భాగస్వామి పైన దాష్టీకం చెలాయించే అవకాశం దొరకదు. స్త్రీ పైన పురుషుడి పెత్తనానికి రక్షణగా నిలిచేది ధనస్వామ్య చట్టాలే. ధనస్వామ్య రద్దుతోనే బహు భార్యత్వాలు, బహు భర్తృత్వ వ్యవస్థలు రద్దు కాక తప్పదు’అన్నారు మార్క్స్. అంతవరకు వర్గ సమాజంలో స్త్రీ పరిస్థితి ఎలా ఉంటుందో ‘స్త్రీస్త్రీ’ అనే శ్రీశ్రీ కవితలో చూద్దాం!‘కథానాయిక ఆహా ఆడుద్ది గరళ ద్రోణి/ తన ఆవేదనలో మన జనయిత్రి/ కథానాయిక శేషమ్మ మాతృత్వ వంచిత కథానాయిక మిస్ బేబీ స్క్రీన్ మీద గ్లిసరిన్/ బాష్పాలు – తెరవెనుక ఖరీదైన ప్రేమ/ కథానాయిక వాసనకి సంపెంగవనం అదిరా నీ/ నీ కథానాయిక సంగీతపు సౌందర్యం, సౌందర్యపు/ సంక్షోభం సౌందర్యపు సంక్షేమం మరిచిపోయిన చుక్కల/ మీదకి ఎగిరిపోయే రెక్కల చేప/ కథానాయిక కోపం వస్తే ‘నా మొగుడు’అని తిడుతుంది/ స్త్రీస్త్రీ నివేదిక అంతం!!’ స్త్రీ అనంత బాధలకు వ్యంగ్యార్థంలో అందించిన అశ్రు తర్పణం. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు -
మోదీ తంత్రం ‘వాకట్టు’ మంత్రం
రెండోమాట ‘సుప్రీం’ వ్యవస్థ అడ్డంకిగా ఉన్నదని భావిస్తున్న బీజేపీ పాలకులు జ్యుడీషియల్ నియామకాల కమిషన్ ఏర్పాటుకు నిర్ణయించారు. జడ్జీల నియామకాలను కోర్టుకు వదిలిపెట్టకుండా ప్రభుత్వమే ఆ పని నిర్వహించేందుకు ఈ కమిషన్ ఉపకరిస్తుంది. దీనిని ఉన్నత న్యాయస్థానం వ్యతిరేకిస్తున్నది. ఇందులో వెనుక నుంచి చేతులు మెలిపెట్టే మతలబు ఏదో ఉందని పసిగట్టి ఈ ప్రతిపాదన మీద కేంద్రం నుంచి సుప్రీంకోర్టు వివరణ కోరింది. పక్షం రోజులకు పైగా వాదోపవాదాలు జరిగాయి. సమస్య ఒక కొలిక్కి రాలేదు. జర్మనీలో హిట్లర్ పాలనతో వీమార్ రిపబ్లిక్ అవసానదశకు చేరుకుంది. భారత జాతీయ కాంగ్రెస్ ఏలుబడిలో, ఇందిర హయాంలో దేశ స్వాతం త్య్రానికి ఎమర్జెన్సీతో చేటుకాలం వచ్చింది. బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ జోస్యం చెబుతున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు మరోసారి దేశాన్ని ఎమర్జెన్సీ రోజులలోకి నడిపిస్తారా? ఏమైనా ఇటీవలి కొన్ని పరిణామాలూ, ఆలోచనలూ, సరికొత్త వ్యూహాలూ, ఎత్తగడలూ అలాంటి జోస్యం నిజం కాగలదనే అనుమానాలను కలిగిస్తున్నాయి. నిజానికి బీజేపీ పాలన ఆరంభం నుంచి అలాంటి శాసనాలు కొన్ని అమలు కాబోతున్నాయా అన్న అనుమా నాలు దేశవ్యాప్త చర్చలలో వ్యక్తమవుతున్నాయి. ఆ పార్టీ చేపట్టిన చర్యలే ఇందుకు కారణం. ఆ చర్యలలో ఒకటే, కొలది రోజుల నాడు (23-7-15) కేంద్ర హోంశాఖ జారీ చేసిన ‘వాకట్టు’ మంత్రం. దీనినే ముద్దుగా ఆంగ్లంలో ‘గాగ్ ఆర్డర్’. అంటే వాయి ముడుపు లేదా నోటికీ చేతికీ బంధనం అని విస్తృతార్థం. అత్యవసర పరిస్థితి వైపే అడుగులు తొలి ఎమర్జెన్సీ (1975-1977) కాలంలో పత్రికలు, ఇతర ప్రసార మాధ్య మాలు, న్యాయవాదులు, న్యాయమూర్తులు, న్యాయశాస్త్ర కోవిదులు, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసేవారు మౌనం వహించేటట్టు చేయడానికీ, వారిని కట్టడి చేయడానికీ వేసిన ‘చేతబడి’ మంత్రం వంటిదే ఈ కొత్త వాకట్టు మంత్రం కూడా. కొత్త ఉత్తర్వు ఆదేశించేదేమిటి? జర్నలిస్టులు వార్తా సేకరణ కోసం రాజకీయులైన పాలకులతోనే సరిపెట్టుకోకుండా, వివిధ పాలనా శాఖల సీనియర్ అధికారులను సహితం కలసి సమాచారం సేకరించ డానికి ఇక వీల్లేదు. వార్తలు, లేదా ఇతర సమాచారం ఏదైనా ప్రభుత్వం నుంచి ఆశిస్తే మీడియా గదికే అందచేస్తారనీ, ఇందుకు అధికారులను జర్న లిస్టులు ఎవరూ కలుసుకోవడానికి వీలు లేదనీ కొత్త ఉత్తర్వు శాసిస్తున్నది. వాస్తవం ఏమిటంటే, బీజేపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో మంత్రులు తరచూ ఎవరికి తోచిన రీతిలో వారు పత్రికలతో ముచ్చటిస్తూ ఉండేవారు. దీనితో దేశ ఆర్థిక, రాజకీయ, అంతర్జాతీయ, మతపరమైన విధానాల మీద పార్టీ స్వరూప స్వభావాలేమిటో వెల్లడయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ స్వేచ్ఛను పార్టీలో కూడా కొన్నాళ్లుగా కట్టడి చేస్తున్నారు. కేవలం ముగ్గురే- సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, రాజ్‌నాథ్ సింగ్- పార్టీ ప్రతినిధులుగా వ్యవ హరించారు. కానీ మనసులోని మాట ఏదో ఒక సమయంలో, ఏదో ఒక రూపంలో వెలువడక తప్పదు. పలు సందర్భాలలో అదే జరిగింది. పార్టీ సభ్యులను కట్టడి చేయడం కూడా కష్టమైపోయింది. ఫలితంగా సామాజిక, రాజకీయ వ్యవస్థలలో చీలుబాటలకు, అస్థిరత్వానికి కారణం కాగల పరిణా మాలు చోటు చేసుకున్నాయి. పాలనను మంచి మార్గం పట్టిద్దామన్న కోరిక పాలకులలో కొందరికి ఉన్నదని మనం అమాయకంగా నమ్మినా, దానిని కూడా ఏడాదిన్నర కాలంలోనే వమ్ము చేశారు. చివరికి మోదీ మంత్రివర్గంలో సహాయమంత్రి జితేంద్రసింగ్ కూడా ‘ఈ ఉత్తర్వు అనవసర వివాదం లేవదీసింది’ అని హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు తెలపాల్సి వచ్చింది. మరో పక్క పత్రికలను బుజ్జగించడం కోసం ఈ ఉత్తర్వును జారీ చేయడంలో హోం మంత్రి ఉద్దేశం అది కాదు, ఇది అంటూ సమర్థించవలసి వచ్చింది. ఈ ధోరణి, ఉత్తర్వు స్వభావం, అధికార పార్టీ సభ్యుల వ్యవహారసరళి ఎమర్జెన్సీ ప్రకటన వాతావరణానికి చాలా దగ్గరగానే ఉందని గ్రహించాలి. ఇదే కాకుండా ఇతర పరిణామాలను చూసైనా ప్రజాస్వామికవాదులు అప్రమ త్తంగా ఉండవలసిన అవసరం ఉంది. రైతుల ఆత్మహత్యలను భగ్నప్రేమికుల ఆత్మహత్యలుగా చిత్రించగలిగిన నాయకులు ఉన్న చోట మొలకెత్తేది పల్లేరు మాత్రమే. న్యాయదేవతకు మొదలవుతున్న ఆంక్షలు కాంగ్రెస్-యూపీఏ హయాంలో అనేక అవినీతి బాగోతాలు నమోదైనాయి. దేశ వనరులు, సహజ సంపదను దేశీయ కంపెనీల కన్నా విదేశీ గుత్త పెట్టు బడి సంస్థల దోపిడీ కోసం తలుపులు బార్లా తెరిచిన పాలన అది. ఆ కుంభ కోణాల పాలనను కట్టడి చేయడానికి చొరవతో ముందుకు వచ్చిన దేశ అత్యు న్నత న్యాయస్థానాన్ని సయితం ఇప్పుడు బీజేపీ-ఎన్డీఏ తన అదుపాజ్ఞల లోనికి తెచ్చుకోవాలని విశ్వప్రయత్నం చేస్తున్నది. ప్రజాస్వామిక వ్యవస్థకు ముఖ్యమైన మూడు వ్యవస్థల విధులను రాజ్యాంగం నిర్దేశించింది. శాసన వేదిక ద్వారా ప్రభుత్వం చేసే చట్టాలను సమీక్షించే, భాష్యం చెప్పే అధికారా లను న్యాయ వ్యవస్థకు అదనంగా రాజ్యాంగం ఇచ్చింది. ఆ మేరకు న్యాయ మూర్తుల నియామకాలు, బదిలీల బాధ్యతలు కూడా రాజ్యాంగంలోని షెడ్యూల్ -3 (1.ఎ. బి.) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పరమైనాయి. శాసనకర్తల చేత ‘దేశ సార్వభౌమాధికారాన్నీ, దేశ సమగ్రతనూ’ కాపాడు తామన్న ప్రతిజ్ఞ చేయించే అధికారం కూడా ప్రధాన న్యాయమూర్తి/ న్యాయ మూర్తులకే అప్పగించారు. ఈ బృహత్ బాధ్యతను నెరవేర్చే క్రమంలో కొన్ని కొన్ని సందర్భాలలో న్యాయమూర్తులు కూడా పరిధులకు మించి వ్యాఖ్యా నాలో, భాష్యాలో వెలువరించి ఉంటే ఉండవచ్చు. అంతమాత్రాన సుప్రీం కోర్టుకు రాజ్యాంగం ద్వారా దఖలు పడిన అధికారాన్నీ, హక్కునూ గుంజు కునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదు. అక్కడికీ ఒక్కొక్కప్పుడు ప్రభుత్వం న్యాయమూర్తిగా నియమించవలసిందని ఎవరిని సూచించినా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నాయకత్వంలో పనిచేసే కమిటీ/ కమిషన్ తన నిర్ణ యం మేరకే వ్యవహరిస్తున్నది. ఎమర్జెన్సీ కాలం నాటి అనుభవాల ప్రకారం చూస్తే దేశంలో పత్రికా, న్యాయ రంగాలు నాటి కేంద్ర ప్రభుత్వ నియంతృ త్వానికి లొంగిపోయాయి. నేర పరిశోధక సంస్థలు సీబీఐ, ప్రత్యేక దర్యాప్తు బృందాలు, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌లు సహితం నాడు దాసోహమన్నాయి. ఇదే తంతు రాజీవ్‌గాంధీ, పీవీ నరసింహారావు ఆ తరువాత కాలం వరకు కూడా కొనసాగింది. చివరికి కేంద్ర ఎన్నికల కమిషన్, నిఘా సంఘం (సెంట్రల్ విజిలెన్స్) వరకు కూడా ఈ నీడ కిందకు వచ్చాయి. నిజానికి ఇప్పటికీ మూస పద్ధతిలో మోసాలూ, పలుకుబళ్ల ద్వారా, పీఠాల కోసం అంగలార్చే రాజ కీయాల మూలంగా అదే పంథా కొనసాగుతున్నది. కాంగ్రెస్-యూపీఏ ఏలు బడిలో ప్రధాన మంత్రి కార్యాలయం చెప్పినట్టు నడచుకున్న సీబీఐ డెరైక్టర్ సిన్హా సుప్రీంకోర్టు జాగరూకతతో పట్టుబడ్డారు. దీనితో కేంద్ర విచారణ సంస్థల పారదర్శకతను ప్రజలు బాహాటంగా చర్చించుకునే దుస్థితికి పాల కులు పరిస్థితిని తెచ్చారు. న్యాయమూర్తుల నియామకంలో జోక్యం ఈ నేపథ్యంలోనే ‘సుప్రీం’ వ్యవస్థ అడ్డంకిగా ఉన్నదని భావిస్తున్న బీజేపీ పాలకులు జ్యుడీషియల్ నియామకాల కమిషన్ ఏర్పాటుకు నిర్ణయించారు. జడ్జీల నియామకాలను కోర్టుకు వదిలిపెట్టకుండా ప్రభుత్వమే ఆ పని నిర్వహించేందుకు ఈ కమిషన్ ఉపకరిస్తుంది. దీనిని ఉన్నత న్యాయస్థానం వ్యతిరేకిస్తున్నది. ఇందులో వెనుక నుంచి చేతులు మెలిపెట్టే మతలబు ఏదో ఉందని పసిగట్టి ఈ ప్రతిపాదన మీద కేంద్రం నుంచి సుప్రీంకోర్టు వివరణ కోరింది. పక్షం రోజులకు పైగా వాదోపవాదాలు జరిగాయి. సమస్య ఒక కొలిక్కి రాలేదు. అసలు ఈ శషభిషల మధ్య దాగి ఉన్న సమస్య-రాజ్యాంగం 124వ అధికరణం ప్రధాన న్యాయమూర్తిని ‘భారత ప్రధాన న్యాయమూర్తి’ అని పేర్కొనగా, రాజ్యాంగానికి అనుబంధంగా జోడించిన 3వ షెడ్యూల్ మాత్రం ఆయనను ‘భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి’ అని వ్యవహరిస్తున్నది. ఇప్పుడు కుస్తీ అంతా దీని మీదే- కేంద్ర అధికారాలూ, జ్యుడీషియరీల అధికారాల మీదనే కేంద్రీకృతమైంది. అనంతమైన అసమర్థత మిగిలిన విషయాలలో వలెనే, ఉమ్మడి జాబితాలో కేంద్రం చేతివాటం ప్రదర్శి స్తున్నది. రాష్ట్రాల పరిధిని నిర్ణయించి వాటిని అమలు చేయవలసిన కేంద్రం వాటి అధికారాలను మింగచూస్తోంది. పన్నులలో కూడా మెట్టు వాటాను కేంద్రమే హరించడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇదంతా చల్లకోసం వచ్చి ముంత దాచినట్టు మళ్లీ సహకార సమాఖ్య పేరుతో రాష్ట్రాల అధికారాలకే కత్తెర వేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఎవరో కొందరు అమాయకులను ఉగ్రవా దులుగా ముద్ర వేస్తున్నారు. కానీ వివిధ మతాల ప్రార్థనా మందిరాలు- చర్చిలు, గురుద్వారాలు, మసీదులపై తాము చేస్తున్న అరాచకాలను మాత్రం ఉగ్రవాదంగా గుర్తించలేకపోతున్నారు. ముంబై పేలుళ్ల మీద శ్రీకృష్ణ కమిషన్ ఇచ్చిన నివేదికను అమలులోకి తెచ్చి దుండగులను శిక్షించడానికి వెనుకాడిన, గుజరాత్ మైనారిటీల మీద జరిపిన మూకుమ్మడి హత్యాకాండకు బాధ్యులైన పాలకులను, అధికారులను శిక్షించడానికి వెనుకాడిన వ్యవస్థ మనది. ఆ అరా చక చర్యలకు బాధ్యులుగా ముద్రపడి, కేసుల నుంచి తప్పించుకోలేని వారిని కూడా అధికారంలోకి రాగానే అంతా మాఫీ చేసేసిన వ్యవస్థ మనది. ఆయా రామ్, గయారామ్‌ల నిరోధానికి చట్టం ఉన్నా వీటి నిరోధంలో పాలక వ్యవస్థ నపుంసకంగా వ్యవహరిస్తున్నది. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో. స్థలాభావం చేత వీటితో ఆపుతున్నాను. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు (వ్యాసకర్త మొబైల్: 9848318414).