దేశీయ హాకీకి... ‘విదేశీ చీడ’ | ABK Prasad Article On ntional Games Affected With Foreign Games | Sakshi
Sakshi News home page

దేశీయ హాకీకి... ‘విదేశీ చీడ’

Published Tue, Aug 10 2021 12:34 AM | Last Updated on Tue, Aug 10 2021 12:34 AM

ABK Prasad Article On ntional Games Affected With Foreign Games - Sakshi

స్వతంత్ర భారత రిపబ్లిక్‌లో ఆదినుంచీ దేశీయ క్రీడలకు పట్టిన చీడ, పీడ ఏమిటంటే.. ప్రధానంగా వలస భారతంలో సంపన్న రాచరిక ప్రభువులు తమ కొడుకుల కోసమని ఇంగ్లాండ్‌ నుంచి దేశంలోకి దిగుమతి చేసిన క్రికెట్‌ క్రీడే! అదిమొదలు ఈ ‘జీడి’ అంటుకుపోయి దేశీయ, గ్రామీణ, పట్టణ జాతీయక్రీడలను ధ్వంసం చేస్తూ వచ్చింది. ఈ విదేశీ క్రీడా బానిసత్వం ఫలితంగానే అనేక దేశీయ క్రీడలకు ముఖ్యంగా గొప్ప జాతీయ క్రీడా శిఖరం ‘హాకీ’కి ప్రోత్సాహం కరువై కుంటుపడిపోతూ వచ్చింది. చెడుగుడు, కోకో, కర్రా–బిళ్ల  ఆట, వగైరా దేశీయ క్రీడలకు ఖర్మకాలి మన దేశంలో గిరాకీ లేదు. ఎందుకని? విదేశీ క్రికెట్‌లాగా రెండుచేతులా అవినీతికి పాల్పడి వందలాది కోట్లు దోచుకోవడానికి వీలైన వ్యాపారానికి వీలులేని సామాన్య ప్రజల దేశవాళీ క్రీడలివి. బహుశా అందుకనే విదేశీ క్రికెట్‌ పట్ల అంత గిరాకీ.. దేశీయ క్రీడలపట్ల అంత పరాకు, చిరాకూ!!

సుమారుగా గత యాభై ఏళ్లుగా దేశవాళీ ‘హాకీ’ లాంటి జాతీయ క్రీడలకు, గ్రామీణ క్రీడలకు పట్టిన విదేశీ వలస పాలనావశేషంగా భారతదేశానికి అంటుకున్న వ్యాధులలో ఒకటి ‘అంటూ సొంటూ’ లేని క్రికెట్‌ క్రీడ! అలాంటి క్రికెట్‌ను భారత జాతీయ క్రీడ అయిన ‘హాకీ’ అర్ధ శతాబ్ది తరువాత మొన్ననే ముగిసిన ప్రపంచస్థాయి టోక్యో ఒలింపిక్స్‌లో ‘బ్రహ్మభేద్యం’గా తన పూర్వ ప్రతిష్టను నిలబెట్టుకోవడమేగాక తిరిగి జాతీయ క్రీడలకే తల మానికంగా నిలవడం జాతీయ క్రీడాభిమానులందరి హర్షోద్రేకాలకు కారణమైంది. అంతేగాదు, సుమారు గత వందేళ్ల వ్యవధిలో నాటి పారిస్‌ ఒలింపిక్స్‌ నుంచి నిన్నమొన్నటి టోక్యో ప్రపంచ ఒలింపిక్స్‌ దాకా మన జాతీయ హాకీ పలుసార్లు స్వర్ణాలు కైవసం చేసుకోవడమే కాకుండా తాజాగా అథ్లెటిక్స్‌లో స్వర్ణ పతకం, హాకీలో కాంస్యం సాధించి, ప్రపంచ ఒలింపిక్స్‌ చరిత్రలో భారత్‌ ఇంతవరకు పొందిన మొత్తం 47 స్థానాల హోదాను మరొక మెట్టుకు నెట్టి 48వ స్థానానికి చేర్చడం మరొక ఘనవిజయం.

రైతు బిడ్డకు స్వర్ణ పతకం
ఇందుకు సూత్రధారిగా నిలిచిన భారత సైనిక సుబేదార్‌ టోక్యో విశ్వక్రీడల్లో ‘ఈటె’ (జావెలిన్‌త్రో)ను అనితరసాధ్యమైన దూరానికి (87.58 మీటర్లు) విసిరి మన ఒలింపిక్స్‌ పతకాల జాబితానే సువర్ణ ఖచితం చేసిన రైతుబిడ్డ నీరజ్‌ చోప్రా! అయితే, ఈసారైనా పట్టుమని పది పతకాలైనా వస్తాయని ఆశించిన ఇండియాకు గతంలో కన్నా ఒకే ఒక్క పతకం కలిసొచ్చి ఆరునుంచి ఏడు మెడల్స్‌కు పాకింది. (ఒక స్వర్ణం, 2 రజతం, 4 కాంస్య, ఎటు తిరగేసినా మొత్తం ఏడు పత కాలు) ! ఇలా వలస భారతం నేటి స్వతంత్ర భారత రిపబ్లిక్‌ వరకూ 10 బంగారు పతకాలతో సహా ఇండియా దక్కించుకున్న మొత్తం 35 పతకాలలో ఎనిమిది పతకాలు దేశీయ ‘హాకీ’ క్రీడవల్ల 8 పతకాలు, షూటింగ్, తదితర క్రీడల్లో ఒక్కొక్క పతకం చొప్పున జమకూడినవే నని మరచిపోరాదు! షరా మామూలుగానే టోక్యో ఒలింపిక్స్‌లో అమెరికా చివరిరోజున తృటిలో ఎగబాకి 39 స్వర్ణాలు, 41 రజతాలు, 33 కాంస్యాలతో మొత్తం 113 పతకాలతో ప్రథమ స్థానంలో నిల బడగా, చివరివరకు స్వర్ణపతకాలతో ఆధిక్యం కొనసాగించిన చైనా 38 స్వర్ణాలు, 32 రజతాలు, 18 కాంస్యాలతో మొత్తం 88 పతకాలతో ద్వితీయ స్థానంలో నిలిచి అబ్బురపరిచింది.

దేశీయ క్రీడలకు క్రికెట్‌ చీడ
స్వతంత్ర భారత్‌ రిపబ్లిక్‌లో ఆదినుంచీ దేశీయ క్రీడలకు పట్టిన చీడ, పీడలు ఏమిటంటే.. ప్రధానంగా వలస భారతంలో సంపన్న రాచరిక ప్రభువులు తమ కొడుకుల కోసమని ఇంగ్లాండ్‌ నుంచి దేశంలోకి దిగుమతి చేసిన క్రికెట్‌ క్రీడే! బ్రిటన్‌ పాలనలో పాటియాలా సంస్థానం మహారాజాగా ఉన్న భూపేంద్ర సింగ్‌ (భూప్పా) తన కొడుకు, నవానగర్‌ జామ్‌ సాహిబ్‌ అయిన కుమార్‌ రంజిత్‌ సింగ్‌కి క్రికెట్‌ను ప్రత్యేక శిక్షణ ఇప్పించి నేర్పించాడు. 1932 నుంచీ ఈ క్రికెట్‌ సంరంభాలు ప్రారంభం కాగా, రాజా కొడుకు అనారోగ్యం వల్ల ఈ ఆటకు అనంతరం పోర్‌బందర్‌ మహారాజా వారసుడయ్యాడు. దేశ స్వాతంత్య్రానికి ముందు 1932లో ఇంగ్లాండులో జరుగుతున్న టెస్ట్‌ క్రికెట్‌లో ఇండియా తరపున ఆడడానికి మన స్వాతంత్య్రానికి ముందు అప్పటికే ప్రసిద్ధుడుగా ఉన్న సి.కె. నాయుడి నాయకత్వంలో భారత దేశం తరపున టెస్ట్‌ క్రికెట్‌లో పాల్గొనడానికి ఒక టీమును పంపిం చారు. నాయుడి క్రీడాబృందం ఇంగ్లండుపై గెలుపొందడంతో ఇండియాకు ‘టెస్ట్‌ క్రికెట్‌ ఆడే జాతి’గా పేరుపడింది. ఆ తర్వాత స్వతంత్రదేశంగా ఇండియా 1948లో ఆస్ట్రేలియాపై టెస్ట్‌మాచ్‌లో ఆస్ట్రేలియాతో పోటీపడి ఓడిపోయింది. ఒక్క 1952లో మాత్రమే మొట్టమొదటిసారిగా ఇంగ్లాండ్‌పై ఆడిన తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో ఇండియా విజయం సాధించింది. అదిమొదలు ఈ ‘జీడి’ అంటుకు పోయి దేశీయ, గ్రామీణ, పట్టణ జాతీయక్రీడలను ధ్వంసం చేస్తూ వచ్చింది. 

విదేశీ క్రీడా బానిసత్వం తొలగేదెన్నడు?
ఈ విదేశీ క్రీడా బానిసత్వం ఫలితంగానే అనేక దేశీయ క్రీడలకు ముఖ్యంగా గొప్ప జాతీయ క్రీడా శిఖరం ‘హాకీ’కి ప్రోత్సాహం కరువై కుంటుపడిపోతూ వచ్చింది. టోక్యోలో జరిగిన తాజా ప్రపంచ ఒలింపిక్స్‌లో మన్‌ప్రీత్‌ సింగ్‌ నేతృత్వంలోని హాకీ టీమ్‌ 41 ఏళ్ల నిరీక్షణ అనంతరం కాంస్యపతకంతో తొలి అడ్డంకిని అధిగమించి పురుషుల హాకీని నిలబెట్టగల్గింది! అదే మోతాదులో మహిళా హాMీ  టీమ్‌ కూడా తొలిసారిగా పురుషులకు పోటీగా రంగప్రవేశం చేసి మన్ననలు పొందగలిగింది. అయితే మనదేశం ఇంకా కులగోత్రాల కంపులో కూరుకుపోయి బయటపడలేక పోతున్నందున ఆ ‘సెగ’ నుంచి ప్రతిభావంతులైన హాకీ మహిళా క్రీడాకారులకు రక్షణ కరువు కావడం ఒక దుర్మార్గపు పరిణామం! తాజా ఒలింపిక్స్‌లో హాకీలో వందనా కటారియా నేతృత్వంలోని భారత్‌ హాకీ జట్టు అర్జెంటీనా జట్టుపై నాలుగు గోల్స్‌ స్కోర్‌ చేసినందుకు ఆనందించవలసిన సమయంలో దళిత మహిళగా ఆమెకు హరిద్వార్‌లో కుల కంపు ఎదురుకావడం సర్వత్రా ఖండనార్హం! విలువిద్యా రహస్యం తెలిసిన వాళ్లే బాణం విసిరినా, ఈటె విసిరినా గురితప్పనిది ద్రోణాచార్య విద్య! 88.07 మీటర్ల దూరానికి గురిపెట్టి నీరజ్‌ చోప్రా విసిరిన ‘జావెలిన్‌త్రో’ గురిపెట్టి మరీ విసిరే ఈటెతో సమానమే! అందుకే అంత బలిష్టంగా నీరజ్‌‘జావెలిన్‌’ విసిరిన తరువాత అదాటున నేలకొరిగే  పరిస్థితిలో తమాయించుకుని తేరుకుని లేచాడు! 

విలువిద్యలో వింటినారిని (బలంగా గురిపెట్టి) లాగి కొట్టినపుడు భుజంపైన ‘బొప్పి’ కడుతూ ఉంటుంది. అందుకే ‘ఈ వింటినారే కదా నా భుజాన్ని రక్షిస్తోంద’ని ప్రాచీనుడు (జ్యాకిణాంకమీభుజమెగా రక్షించునదియని తనర గలవు) వాపోవలసివచ్చింది! (ఆ భుజాన్ని రక్షించిన ఆ కాయలే గదా నాకు రక్ష అని తృప్తి చెందుతారట)! ఆ పరిస్థితికి ప్రతిబింబమే నేటి అభినవ నీరజ్‌ చోప్రా! ఇలా మన గ్రామ సీమల్లో దేశమంతటా ఎన్నిరకాల చిత్ర, విచిత్రమైన ప్రాచీన క్రీడలు (కనుమరుగైన వాటితో సహా) ఉన్నాయో, చెడుగుడు, కోకో, కర్రా– బిళ్ల (నేటి క్రికెట్‌కు సమానమైన) ఆట, వగైరా, వగైరా! 

అవినీతికి తావులేనందుకే దేశీ ఆటలకు తగ్గిన గిరాకీ
ఖర్మకాలి వీటికి గిరాకీ లేదు. ఎందుకని? విదేశీ క్రికెట్‌లాగా రెండు చేతులా అవినీతికి పాల్పడి వందలాది కోట్ల రూపాయలు దోచు కోడానికి వీలైన వ్యాపారానికి వీలులేని సామాన్య ప్రజల ఆటలు దేశవాళీ క్రీడలు. గతంలో ఆంగ్ల మహారచయిత కథకుడైన జార్జి బెర్నార్డ్‌ షా ఇంగ్లిష్‌వాడైనా, అక్కడ పుట్టి ప్రపంచానికి ఇంగ్లిష్‌వాడే పాకించిన (క్రికెట్‌ను పట్కార్‌తో కూడా ముట్టుకోని అమెరికాను మినహాయించి) క్రికెట్‌ ‘వ్యాధి’ని ఏమన్నాడో తెలుసా? పదకొండు మంది ఫూల్స్‌ ఆడతారు, మరో పదకొండువేలమంది పనిలేని దద్దమ్మలు చూస్తూండే క్రీడ క్రికెట్‌ అని చురక అంటించాడు! రాను రాను క్రికెట్‌ కొంతమంది అవినీతిపరుల చేతి ఎత్తుబిడ్డగా మారి పచ్చిదోపిడీ క్రీడగా మారిపోయింది. చివరికి క్రికెట్‌ క్రీడాకారులు కొందరు ప్రతి ఆటకీ సంపాదించే కోట్లు చాలక వారిలో అగ్ర గాములుగా ముద్రపడిన కొందరికి బహుమతిగా పొందిన కోట్ల రూపాయల విలువైన కార్లకు చెల్లించాల్సిన దేశీయ పన్నులను ఎగ్గొట్టి, పట్టుబడిన ఉదంతాలూ ఉన్నాయి. దోపిడీకి ఇలాంటి అవకాశం మన దేశీయ క్రీడలకు లేదు! బహుశా అందుకనే విదేశీ క్రికెట్‌ పట్ల అంత గిరాకీ దేశీయ క్రీడలపట్ల అంత పరాకు చిరాకూ!!


ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement