జడ్జి ప్రశ్నలకు జవాబులున్నాయా? | ABK Prasad Guest Column Justice B Sudarshan Reddy Media Journalsim | Sakshi
Sakshi News home page

జడ్జి ప్రశ్నలకు జవాబులున్నాయా?

Published Tue, Oct 11 2022 12:33 AM | Last Updated on Tue, Oct 11 2022 12:33 AM

ABK Prasad Guest Column Justice B Sudarshan Reddy Media Journalsim - Sakshi

ఆరోగ్యవంతమైన పత్రికలకు జాతీయ, సామాజిక బాధ్యత అనివార్యం. ప్రజలకు చేదోడు వాదోడుగా ఉండటంలో పాలనాశక్తుల కన్నా ముందుగా జాగరూకులవడంలో మీడియా స్వతంత్ర హోదాలో వ్యవహరించాలి. ప్రజల పట్ల కడు గౌరవంతో, అణకువతో ప్రవర్తించాలి. కానీ ఒకనాటి విశిష్ట పాత్రికేయ ప్రమాణాలన్నీ క్రమంగా పతనమవడం చూస్తున్నాం. అందుకే ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియాలలో సామాజిక, నైతిక ప్రమాణాల గురించి జస్టిస్‌ బి.సుదర్శన్‌ రెడ్డి నిశితమైన విమర్శలు చేశారు. నిజాయితీ గల పాత్రికేయులందరూ వీటికి జవాబులు వెతకాలి. అయితే పత్రికా విలేకర్లు, ఎడిటర్లు అంటే నేడు చులకన భావన ప్రజల మనసుల్లో నాటుకుపోవడానికి దోహదపడినవి స్వార్థపర రాజకీయాలేనని మరవరాదు.

‘‘వార్తా పత్రికలు అనేవి సమాజంలో అంతర్భాగం. అంతమాత్రాన్నే తాము మొత్తం సమాజానికే ‘శిష్టాది గురువు’లమనీ, లోకంలోని జ్ఞానమంతా తమ సొత్తనీ భావించి విర్రవీగరాదు. బుద్ధిగల ఏ వార్తాపత్రికైనా చారిత్రక పరిణామంలో తనవంతు కీలకమైన పాత్ర నిర్వహిం చాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే బాధ్యత గల ఏ పత్రికైనా సమాజం కోసం, తాను సేవలందించే ప్రజల కోసం వారి పట్ల కడు గౌరవంతో, అణ కువతో ప్రవర్తించాలి. ఆరోగ్యవంతమైన పత్రికలకు జాతీయ, సామాజిక బాధ్యత అనివార్యం. ఈ క్రమంలోనే సమాజం పట్ల పత్రికల బాధ్యతను ఏరోజుకారోజు తాత్కాలిక రాజకీయ పార్టీలు లేదా ఆనాటి ప్రభుత్వాల బాధ్యతతో పోల్చుకోరాదు. ప్రజల అవసరాలను గుర్తించి వారికి చేదోడు వాదోడు కావడంలో పత్రికలు పాలనాశక్తుల కన్నా ముందుగా జాగరూకులవడంలో స్వతంత్ర హోదాలో వ్యవహరించాలి.’’
– సుప్రసిద్ధ జాతీయ దినపత్రిక ‘ది హిందూ’ 1978 సెప్టెంబరు 5న తన నూరు సంవత్సరాల చరిత్రను (1878–1978) సమీక్షిస్తూ రాసిన సంపాదకీయం.

ఒకనాటి ఇలాంటి విశిష్ట పత్రికా (పాత్రికేయ) ప్రమాణాలన్నీ కొలది సంవత్సరాలుగా ఎలా పతనమవుతూ వస్తున్నాయో చూస్తూనేవున్నాం. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, తెలుగు న్యాయ మూర్తులలో విశిష్టమైన జస్టిస్‌ బి.సుదర్శన్‌ రెడ్డి ఈ విషయంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్వతంత్ర భావాలతో న్యాయస్థానాల ద్వారా, సభల ద్వారా ప్రజా బాహుళ్యంలో ఆధునిక వైజ్ఞా నిక దృష్టిని పెంపొందించడానికి కృషి చేస్తూ వచ్చిన వ్యక్తి సుదర్శన్‌ రెడ్డి. తెలంగాణా వర్కింగ్‌ జర్నలిస్టుల యూనియన్, హైదరాబాద్‌ ప్రెస్‌ క్లబ్‌ సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో నేటి ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియాలలో సామాజిక, నైతిక ప్రమాణాల గురించి జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి ప్రస్తావించి, నిశితమైన విమర్శలు చేశారు. ఈనాటి కొందరు జర్నలిస్టులు పత్రికా యాజమాన్యాల సాయంతో పాలకుల్ని ఒప్పించడం సబబైన మార్గమని భావిస్తూండడాన్ని జస్టిస్‌ సుదర్శన్‌ విమర్శించారు. ఈ ధోరణి నేటి మీడియాలో పెరిగి పోతుండడాన్ని ఆయన నిరసించారు. 

వేలాది వార్తా పత్రికలు, వెయ్యి ఉపగ్రహాల సహాయంతో నడుస్తున్న న్యూస్‌ చానల్స్, 600 ఎఫ్‌.ఎం. స్టేషన్స్‌తో దేశంలోని బహు కొలదిమంది సంçపన్నులు లాభాల వేటలో పడి సొమ్ము చేసు కుంటున్నారు. ఇలాంటి వాతావరణంలోనే ఒక నటుడు ఆత్మహత్య చేసుకుంటే దాన్ని మీడియా ఓ పెద్ద ఘటనగా చూపింది. అందుకు దోహదం చేసినవాళ్లు వెంటనే దాన్ని రాజకీయ పోరాటంగా మలిచేశారు. కానీ అదే సమయంలో ఏడుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్న ఘటనకు కేవలం ఏడు నిమిషాల ప్రాధాన్యం కల్పించారు. ఎందు కని? వార్తలు పత్రికా ఆఫీసుల నుంచి కాకుండా ఎక్కడో బయట ‘అల్లి’ పత్రికలకు చేరుతున్నాయి! అయినా నిజాయితీ గల జర్నలిస్టులు, ప్రజా సమస్యల పట్ల ఆవేదన చెందగల పాత్రికేయులు కూడా మనకు లేకపోలేదని జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి గుర్తించగలిగారు.

అంతేగాదు, మరొక వాస్తవాన్ని కూడా జస్టిస్‌ సుదర్శన్‌ బహిర్గతం చేశారు. వార్తా పత్రికలు నిర్వహించే యాజమాన్య సంస్థల్లో పెక్కింటికి ఇతర వ్యాపారాలు కూడా ఉన్నందున నిర్ణయాలు త్వరగా తీసుకోలేని దుఃస్థితిని కూడా ఆయన వివరించారు. అందుకే దేశంలో ప్రజాస్వామ్యాన్ని, దాని విలువల్ని కాపాడేందుకుగానూ పూర్తిగా ప్రయివేట్‌ పత్రికా యాజమాన్యాల మీడియా సంస్థలపై సరైన అదుపాజ్ఞలు విధించడం అవసర మన్న సుప్రీంకోర్టు ప్రకటనను కూడా జస్టిస్‌ సుద ర్శన్‌ గుర్తు చేయవలసి వచ్చింది. 

ఇక ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్ట్‌ ప్రొఫెసర్‌ పద్మజా షా మాట్లాడుతూ – ప్రతీ పాత్రి కేయ విలువనూ, గత ప్రమాణాలనూ ధ్వంసం చేసి నేరస్థ రాజకీయ విలువల్ని చొప్పించేశారనీ, అదే జర్నలిజంగా ప్రమోట్‌ అవుతోందనీ ఆవేదన చెందారు. ధనార్జనలో భాగంగా అమెరికన్‌ కోటీశ్వరుడు రూపర్ట్‌ మర్డోక్‌ ‘ఫాక్స్‌’ న్యూస్‌ చానల్‌ పెట్టి ఎలా అనైతిక ప్రమాణాలను ప్రవేశపెట్టాడో లోకానికి తెలుసు. ఎక్కడో అమెరికా, ఇతర దేశాల సంగతి కాదు... ఆ మాటకొస్తే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నట్టింటనే ఇలాంటివి జరిగాయి. ‘‘సీనియర్‌ జర్నలిస్టుల’’ పేరిట చలామణీ అవు తున్న ఇద్దరు ముగ్గురు వ్యక్తుల్ని ఒక ముఖ్యమంత్రి సాకడం జరిగింది. వారికి ఇంటర్‌– స్టేట్‌ వాహనాల లైసెన్సులు ఇప్పించడమే గాకుండా హౌసింగ్‌ బోర్డు యాజమాన్యంలో కూడా చోటు కల్పించారు. దాన్ని స్వప్రయోజనాలకు వినియో గించుకుని బ్యాంకుల్ని దివాళా తీయించిన ఉదా హరణలూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయని మరవరాదు! 

అంతేగాదు, అనైతిక మీడియా సోదరుడే ‘‘ముందు వాడి (ఎన్‌.టి.ఆర్‌.) ఫొటోను తీసి అవ తల పారేస్తావా, లేదా?’’ అని స్వయంగా చంద్ర బాబు ముఖం మీదనే ‘ఉరిమాడా,’ లేదా? ఎన్టీఆర్‌ ఫొటో తీసేస్తే కథ అడ్డం తిరుగుతుందని తెలిసిన చంద్రబాబు ‘అలాగే తీసేద్దాంలే, ఇప్పుడు కాదు’ అని చెప్పి... ‘ఫొటో నాటకం’ కోసం కొన్నాళ్లు ఎన్టీఆర్‌ అవసరమని తెలిసి తన తైనాతీ జర్న లిస్టును కాపాడుకున్నాడా, లేదా? ఇప్పటికీ ఆ నాటకం ఎన్టీఆర్‌ బొమ్మతోనే కొనసాగిస్తున్నారా, లేదా? చివరికి అమరావతి రైతాంగాన్ని మోస గించిన వైనాన్ని గురించి సీనియర్‌ జర్నలిస్టుగా హైకోర్టులో నేను రిట్‌ వేసినా, దాన్ని కనీసం చర్చకు కూడా రానివ్వకుండా తొక్కిపెట్టించిన ఖ్యాతిని మూటగట్టుకున్నవాడు చంద్రబాబే! అంతే గాదు, అమరావతి రైతాంగానికి జరిగిన అన్యాయం గురించి సుప్రీంకోర్టులో నేను రిట్‌ వేసినప్పుడు, ఆగమేఘాల మీద ఢిల్లీ చేరుకుని, ఆ కేసును కూడా తొక్కిపట్టేట్టు చేసినవాడూ చంద్ర బాబే కదా? ఆ కేసు అప్పటికీ ఇప్పటికీ అక్కడే ఉండిపోయింది. ముక్కారు పంటలు పండే అమ రావతి ప్రాంత భూములను తన రాజకీయ ప్రయోజనాల కోసం, తన మంత్రివర్గంలోని ధనాఢ్యుడైన విద్యాశాఖామంత్రికి ధారాదత్తం చేయడమే కాక... ఎదురు తిరిగిన రైతుల భూముల్ని తగలబెట్టించి, ఆ దుర్మార్గాన్ని దళితు డైన నందిగం సురేష్‌పై (నేటి పార్లమెంట్‌ సభ్యుడు) నెట్టి, వేధింపులకు గురిచేసిన వాళ్లెవరు?

కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుంది. పత్రికా విలేకర్లు, ఎడిటర్లు  అంటే నేడు చులకన భావన ప్రజల మనసుల్లో నాటుకుపోవడానికి దోహదపడినవి పాలకుల స్వార్థపర రాజకీయా లేనని మరవరాదు. కనుకనే గౌరవ న్యాయమూర్తి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి మన మీడియా నిర్వాహకులకు (కోట్లకు పడగలెత్తిన యాజమాన్యాలకు, బతుకు బాటలో లొంగిపోయే కొందరు మీడియా మిత్రు లకు) చురకలు వేయడం సకాలంలో సబబైన స్పందనగా నేను భావిస్తున్నాను. అమెరికాలో వాల్టర్‌ లిప్‌మన్, ప్రొఫెసర్‌ నోమ్‌ చామ్‌స్కీ నిర్వ హించిన పాత్రను ఇక్కడ మన కాలంలో జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి పోషిస్తున్నారని చెప్పడం అతిశయోక్తి కాజాలదు!

ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు 
abkprasad2006@yahoo.co.in 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement