justice sudarshan reddy
-
జడ్జి ప్రశ్నలకు జవాబులున్నాయా?
ఆరోగ్యవంతమైన పత్రికలకు జాతీయ, సామాజిక బాధ్యత అనివార్యం. ప్రజలకు చేదోడు వాదోడుగా ఉండటంలో పాలనాశక్తుల కన్నా ముందుగా జాగరూకులవడంలో మీడియా స్వతంత్ర హోదాలో వ్యవహరించాలి. ప్రజల పట్ల కడు గౌరవంతో, అణకువతో ప్రవర్తించాలి. కానీ ఒకనాటి విశిష్ట పాత్రికేయ ప్రమాణాలన్నీ క్రమంగా పతనమవడం చూస్తున్నాం. అందుకే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలలో సామాజిక, నైతిక ప్రమాణాల గురించి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి నిశితమైన విమర్శలు చేశారు. నిజాయితీ గల పాత్రికేయులందరూ వీటికి జవాబులు వెతకాలి. అయితే పత్రికా విలేకర్లు, ఎడిటర్లు అంటే నేడు చులకన భావన ప్రజల మనసుల్లో నాటుకుపోవడానికి దోహదపడినవి స్వార్థపర రాజకీయాలేనని మరవరాదు. ‘‘వార్తా పత్రికలు అనేవి సమాజంలో అంతర్భాగం. అంతమాత్రాన్నే తాము మొత్తం సమాజానికే ‘శిష్టాది గురువు’లమనీ, లోకంలోని జ్ఞానమంతా తమ సొత్తనీ భావించి విర్రవీగరాదు. బుద్ధిగల ఏ వార్తాపత్రికైనా చారిత్రక పరిణామంలో తనవంతు కీలకమైన పాత్ర నిర్వహిం చాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే బాధ్యత గల ఏ పత్రికైనా సమాజం కోసం, తాను సేవలందించే ప్రజల కోసం వారి పట్ల కడు గౌరవంతో, అణ కువతో ప్రవర్తించాలి. ఆరోగ్యవంతమైన పత్రికలకు జాతీయ, సామాజిక బాధ్యత అనివార్యం. ఈ క్రమంలోనే సమాజం పట్ల పత్రికల బాధ్యతను ఏరోజుకారోజు తాత్కాలిక రాజకీయ పార్టీలు లేదా ఆనాటి ప్రభుత్వాల బాధ్యతతో పోల్చుకోరాదు. ప్రజల అవసరాలను గుర్తించి వారికి చేదోడు వాదోడు కావడంలో పత్రికలు పాలనాశక్తుల కన్నా ముందుగా జాగరూకులవడంలో స్వతంత్ర హోదాలో వ్యవహరించాలి.’’ – సుప్రసిద్ధ జాతీయ దినపత్రిక ‘ది హిందూ’ 1978 సెప్టెంబరు 5న తన నూరు సంవత్సరాల చరిత్రను (1878–1978) సమీక్షిస్తూ రాసిన సంపాదకీయం. ఒకనాటి ఇలాంటి విశిష్ట పత్రికా (పాత్రికేయ) ప్రమాణాలన్నీ కొలది సంవత్సరాలుగా ఎలా పతనమవుతూ వస్తున్నాయో చూస్తూనేవున్నాం. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, తెలుగు న్యాయ మూర్తులలో విశిష్టమైన జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి ఈ విషయంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్వతంత్ర భావాలతో న్యాయస్థానాల ద్వారా, సభల ద్వారా ప్రజా బాహుళ్యంలో ఆధునిక వైజ్ఞా నిక దృష్టిని పెంపొందించడానికి కృషి చేస్తూ వచ్చిన వ్యక్తి సుదర్శన్ రెడ్డి. తెలంగాణా వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో నేటి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలలో సామాజిక, నైతిక ప్రమాణాల గురించి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ప్రస్తావించి, నిశితమైన విమర్శలు చేశారు. ఈనాటి కొందరు జర్నలిస్టులు పత్రికా యాజమాన్యాల సాయంతో పాలకుల్ని ఒప్పించడం సబబైన మార్గమని భావిస్తూండడాన్ని జస్టిస్ సుదర్శన్ విమర్శించారు. ఈ ధోరణి నేటి మీడియాలో పెరిగి పోతుండడాన్ని ఆయన నిరసించారు. వేలాది వార్తా పత్రికలు, వెయ్యి ఉపగ్రహాల సహాయంతో నడుస్తున్న న్యూస్ చానల్స్, 600 ఎఫ్.ఎం. స్టేషన్స్‌తో దేశంలోని బహు కొలదిమంది సంçపన్నులు లాభాల వేటలో పడి సొమ్ము చేసు కుంటున్నారు. ఇలాంటి వాతావరణంలోనే ఒక నటుడు ఆత్మహత్య చేసుకుంటే దాన్ని మీడియా ఓ పెద్ద ఘటనగా చూపింది. అందుకు దోహదం చేసినవాళ్లు వెంటనే దాన్ని రాజకీయ పోరాటంగా మలిచేశారు. కానీ అదే సమయంలో ఏడుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్న ఘటనకు కేవలం ఏడు నిమిషాల ప్రాధాన్యం కల్పించారు. ఎందు కని? వార్తలు పత్రికా ఆఫీసుల నుంచి కాకుండా ఎక్కడో బయట ‘అల్లి’ పత్రికలకు చేరుతున్నాయి! అయినా నిజాయితీ గల జర్నలిస్టులు, ప్రజా సమస్యల పట్ల ఆవేదన చెందగల పాత్రికేయులు కూడా మనకు లేకపోలేదని జస్టిస్ సుదర్శన్ రెడ్డి గుర్తించగలిగారు. అంతేగాదు, మరొక వాస్తవాన్ని కూడా జస్టిస్ సుదర్శన్ బహిర్గతం చేశారు. వార్తా పత్రికలు నిర్వహించే యాజమాన్య సంస్థల్లో పెక్కింటికి ఇతర వ్యాపారాలు కూడా ఉన్నందున నిర్ణయాలు త్వరగా తీసుకోలేని దుఃస్థితిని కూడా ఆయన వివరించారు. అందుకే దేశంలో ప్రజాస్వామ్యాన్ని, దాని విలువల్ని కాపాడేందుకుగానూ పూర్తిగా ప్రయివేట్ పత్రికా యాజమాన్యాల మీడియా సంస్థలపై సరైన అదుపాజ్ఞలు విధించడం అవసర మన్న సుప్రీంకోర్టు ప్రకటనను కూడా జస్టిస్ సుద ర్శన్ గుర్తు చేయవలసి వచ్చింది. ఇక ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్ట్ ప్రొఫెసర్ పద్మజా షా మాట్లాడుతూ – ప్రతీ పాత్రి కేయ విలువనూ, గత ప్రమాణాలనూ ధ్వంసం చేసి నేరస్థ రాజకీయ విలువల్ని చొప్పించేశారనీ, అదే జర్నలిజంగా ప్రమోట్ అవుతోందనీ ఆవేదన చెందారు. ధనార్జనలో భాగంగా అమెరికన్ కోటీశ్వరుడు రూపర్ట్ మర్డోక్ ‘ఫాక్స్’ న్యూస్ చానల్ పెట్టి ఎలా అనైతిక ప్రమాణాలను ప్రవేశపెట్టాడో లోకానికి తెలుసు. ఎక్కడో అమెరికా, ఇతర దేశాల సంగతి కాదు... ఆ మాటకొస్తే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నట్టింటనే ఇలాంటివి జరిగాయి. ‘‘సీనియర్ జర్నలిస్టుల’’ పేరిట చలామణీ అవు తున్న ఇద్దరు ముగ్గురు వ్యక్తుల్ని ఒక ముఖ్యమంత్రి సాకడం జరిగింది. వారికి ఇంటర్– స్టేట్ వాహనాల లైసెన్సులు ఇప్పించడమే గాకుండా హౌసింగ్ బోర్డు యాజమాన్యంలో కూడా చోటు కల్పించారు. దాన్ని స్వప్రయోజనాలకు వినియో గించుకుని బ్యాంకుల్ని దివాళా తీయించిన ఉదా హరణలూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయని మరవరాదు! అంతేగాదు, అనైతిక మీడియా సోదరుడే ‘‘ముందు వాడి (ఎన్.టి.ఆర్.) ఫొటోను తీసి అవ తల పారేస్తావా, లేదా?’’ అని స్వయంగా చంద్ర బాబు ముఖం మీదనే ‘ఉరిమాడా,’ లేదా? ఎన్టీఆర్ ఫొటో తీసేస్తే కథ అడ్డం తిరుగుతుందని తెలిసిన చంద్రబాబు ‘అలాగే తీసేద్దాంలే, ఇప్పుడు కాదు’ అని చెప్పి... ‘ఫొటో నాటకం’ కోసం కొన్నాళ్లు ఎన్టీఆర్ అవసరమని తెలిసి తన తైనాతీ జర్న లిస్టును కాపాడుకున్నాడా, లేదా? ఇప్పటికీ ఆ నాటకం ఎన్టీఆర్ బొమ్మతోనే కొనసాగిస్తున్నారా, లేదా? చివరికి అమరావతి రైతాంగాన్ని మోస గించిన వైనాన్ని గురించి సీనియర్ జర్నలిస్టుగా హైకోర్టులో నేను రిట్ వేసినా, దాన్ని కనీసం చర్చకు కూడా రానివ్వకుండా తొక్కిపెట్టించిన ఖ్యాతిని మూటగట్టుకున్నవాడు చంద్రబాబే! అంతే గాదు, అమరావతి రైతాంగానికి జరిగిన అన్యాయం గురించి సుప్రీంకోర్టులో నేను రిట్ వేసినప్పుడు, ఆగమేఘాల మీద ఢిల్లీ చేరుకుని, ఆ కేసును కూడా తొక్కిపట్టేట్టు చేసినవాడూ చంద్ర బాబే కదా? ఆ కేసు అప్పటికీ ఇప్పటికీ అక్కడే ఉండిపోయింది. ముక్కారు పంటలు పండే అమ రావతి ప్రాంత భూములను తన రాజకీయ ప్రయోజనాల కోసం, తన మంత్రివర్గంలోని ధనాఢ్యుడైన విద్యాశాఖామంత్రికి ధారాదత్తం చేయడమే కాక... ఎదురు తిరిగిన రైతుల భూముల్ని తగలబెట్టించి, ఆ దుర్మార్గాన్ని దళితు డైన నందిగం సురేష్‌పై (నేటి పార్లమెంట్ సభ్యుడు) నెట్టి, వేధింపులకు గురిచేసిన వాళ్లెవరు? కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుంది. పత్రికా విలేకర్లు, ఎడిటర్లు అంటే నేడు చులకన భావన ప్రజల మనసుల్లో నాటుకుపోవడానికి దోహదపడినవి పాలకుల స్వార్థపర రాజకీయా లేనని మరవరాదు. కనుకనే గౌరవ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి మన మీడియా నిర్వాహకులకు (కోట్లకు పడగలెత్తిన యాజమాన్యాలకు, బతుకు బాటలో లొంగిపోయే కొందరు మీడియా మిత్రు లకు) చురకలు వేయడం సకాలంలో సబబైన స్పందనగా నేను భావిస్తున్నాను. అమెరికాలో వాల్టర్ లిప్మన్, ప్రొఫెసర్ నోమ్ చామ్స్కీ నిర్వ హించిన పాత్రను ఇక్కడ మన కాలంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోషిస్తున్నారని చెప్పడం అతిశయోక్తి కాజాలదు! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి
హైదరాబాద్ : ప్రశ్నించడంతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యపడుతుందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇందుకు కవులు,రచయితలు, కళాకారులు తమ కలాలను, గళాలను సంధించాలన్నారు. డెబ్బై ఏళ్లపాటు నిర్మించుకున్న వ్యవస్థలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా కుప్పకూలి భారత రాజ్యాంగం అపహాస్యం పాలవుతోందని సుదర్శన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర మహాసభల్లో ఆయన మాట్లా డారు. వక్రబుద్ధితో ఆలోచించేనేతల చేతుల్లో చిక్కుకున్న వ్యవస్థలో సత్యం మాట్లాడలేని పరిస్థితి నెలకొందన్నారు. ఆత్మగౌరవం నినాదంతో పోరాటం చేసి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్న మనం అమరుల త్యాగాల మీద నడుస్తున్నామన్నారు. వ్యవస్థను తమ చెప్పుచేతల్లోకి తీసుకోవడం సాధ్యం కాకపోతే దాన్ని నిట్టనిలువునా చీల్చేస్తున్నారన్నారు. సభకు అధ్యక్షత వేదిక అధ్యక్షుడు జయధీర్ తిరుమలరావు మాట్లాడుతూ దారి తప్పిన పిల్లలున్నారు కానీ దారి తప్పిన కలాలు లేవన్నారు. సమాజం తనదని భావించినప్పుడే నిజమైన సాహిత్యం ప్రారంభం అవుతుందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, సుప్రసిద్ధ తమిళ రచయిత పి. శివకామి అన్నారు. ప్రముఖ రచయిత ప్రొఫెసర్ హెచ్ఎస్ శివప్రకాశ్, ప్రొఫెసర్ ఎం.ఎం.వినోదిని, తెలంగాణ ప్రజల పార్టీ అధ్యక్షుడు జస్టిస్ బి.చంద్రకుమార్, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె. శ్రీనివాస్ మాట్లాడారు. సాహిత్యం, సాంస్కృతిక రంగాలపై పార్టీలు మాట్లాడటం లేదు : రామచంద్రమూర్తి ‘సాక్షి ’ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ సాహిత్య, సాంస్కృతిక రంగాల గురించి ఏ పార్టీ చర్చించడంలేదనీ, తమ మేనిఫెస్టో లో పెట్టడంలేదన్నారు. పుణె పోలీసులు విరసం నేత వరవరరావును అరెస్ట్ చేస్తుంటే ఏ పార్టీ నేతలూ మాట్లాడలేదని చెప్పారు. నాలుగేళ్లపాటు ఒక మహిళామంత్రి లేకుండా పాలించినా ఏ ఉద్యమమూ జరగలేదన్నారు. కార్యక్రమంలో వేదిక ప్రధాన కార్యదర్శి గాజోజు నాగభూషణం, పూర్వ అధ్యక్షుడు జూకంటి జగన్నాథం, సకల జనుల వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.వినాయకరెడ్డి పాల్గొన్నారు. ‘ఎన్నికలు, ప్రజల కర్తవ్యాలు– రచయితలు’అనే అంశంపై జరి గిన సభలో అన్నవరం దేవేందర్, అల్లం రాజయ్య, సీహెచ్ మధు, ‘మేనిఫెస్టోలు – భాషా సాహిత్య సాంస్కృతిక రంగాలు – వివిధ పార్టీలు’ అనే అం శంపై జరిగిన సెషన్లో మానవ హక్కుల వేదిక అధ్య క్షుడు ఎస్. జీవన్‌కుమార్, సీపీఎం నేత జి. నాగయ్య, పొట్లపల్లి రామారావు జయంతి ఉత్సవాల ముగింపు సమావేశంలో బూర్ల వెంకటేశ్వర్లు, ప్రముఖ కవి నిఖి లేశ్వర్, విమలక్క, పొట్లపల్లి వరప్రసాదరావు, డా.వి.ఆర్. శర్మ, పెద్దింటి అశోక్‌కుమార్ పాల్గొన్నారు. పలు పుస్తకాల ఆవిష్కరణ అలిశెట్టి ప్రభాకర్‌పై రాసిన వ్యాస సంకలనం నెత్తుటి పాలపుంత, తిరుమలరావు సంకలనం దళిత గీతాలు, నల్లేల రాజయ్య రచన సిరధమనులు, పెనుగొండ బసవేశ్వర్ ఆకాశమంతా పావురం, పెనుగొండ సరసిజ రచన ‘కాగితాన్ని ముద్దాడిన కళ’, నేరేళ్ల శ్రీనివాస్ రచన ‘దుళ్దుమ్మ’’, తోకల రాజేశం రచన ‘‘అడవి దీపాలు’’, బండి చంద్ర శేఖర్ రచన ‘‘ఆవాజ్’’, వడ్నాల కిషన్ రచన ‘‘వెన్నెల ముచ్చట్లు’’, జి.లచ్చయ్య రచన ‘‘కాలంబూ రాగానే’’ పుస్తకాలను అతిథులు ఆవిష్కరించారు. -
ఆర్థిక విధానాలే గుత్తాధిపత్యానికి కారణం
హైదరాబాద్: నూతన ఆర్థిక విధానాలు గుత్తాధిపత్యానికి, ఆర్థిక అసమానతలకు కారణమయ్యాయని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన జనవిజ్ఞాన వేదిక తెలంగాణ 30వ వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. గుత్తాధిపత్య సంస్థల ఆకాంక్షలు ఎక్కడ మొదలై ఎక్కడ ఆగుతాయో చెప్పలేని పరిస్థితి నెలకొం దని, నేడు అత్యంత ఉన్నతమైన పరిజ్ఞానాన్ని గూగుల్, ఫేస్బుక్ లాంటి సంస్థలు తీసుకొస్తున్నాయన్నారు. వారు సృష్టించిన సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నపైన, జిజ్ఞాసపై దాడి జరుగుతోందన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ, రాజ్యాంగంలోని 39వ ఆర్టికల్ ఉత్పత్తి శక్తులు ఎవరి చేతుల్లో కేంద్రీకరించరాదని చెబుతోందని, దీనికి భిన్నంగా నేటి పరిణామాలు కనిపిస్తున్నాయన్నారు. జాతీయ ఆదాయంలో 73% ఆదా యం ఒక్క శాతం జనాభా వద్దనే ఉందని, దీని వల్ల ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయన్నా రు. వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ ఆదినారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రముఖ న్యూట్రిషన్ శాస్త్రవేత్త డాక్టర్ మెహ్తాబ్ ఎస్.బాంజీ, మాజీ ఎమ్మెల్సీ వి.బాలసుబ్రహ్మణ్యం, ప్రొఫెసర్ కె.లక్ష్మీనారాయణ, ప్రొఫెసర్ పి.అంబేడ్కర్, డాక్టర్ భీమేశ్వర్రెడ్డి, డాక్టర్ టి.సుందరరామన్, ప్రొఫెసర్ శీలాప్రసాద్ పాల్గొన్నారు. -
పౌర సమాజం మౌనం అణుబాంబు కంటే ప్రమాదకరం
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి హైదరాబాద్: పౌర సమాజం మౌనం అణుబాంబు కంటే ప్రమాదకరమని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి అన్నారు. నిరంతరం ప్రశ్నించేతత్వం ఉండాలని, ఈ క్రమంలో సంయమనం పాటించాలన్నారు. ప్రొఫెసర్ ఎం.కోదండరాం ఉద్యోగ విరమణ సందర్భంగా శనివారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘ప్రజా స్వామ్యం- పౌర సమాజం’ అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాంను ఘనంగా సత్కరించారు. కోదండరాంను అభినందిస్తే పౌర సమాజాన్ని గౌరవించినట్లేనని అభిప్రాయపడ్డారు. రైతుల ఆత్మహత్యలు పెరిగినా నకిలీ విత్తనాలపై నియంత్రణ, పర్యవేక్షణ కరువైంద న్నారు. ఏ దేశంలో కూడా అపరిమితమైన వనరులు ఉండవని, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ముఖ్యమైన అంశంపైనే దృష్టి సారించాలన్నారు. మన దేశంలో రాజకీయ నాయకులను సంస్కరించాల్సిన అవసరం ఉందన్నారు. కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి చెందాలని, ఆ ఫలితాలు అందరికీ దక్కాలనే భావనతో భవిష్యత్‌లో ప్రజల పక్షాన నిలబడి పని చేస్తానన్నారు. కార్యక్రమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షుడు గురజాల రవీందర్రావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ తిప్పర్తి యాదయ్య, నాయకులు మల్లేపల్లి లక్ష్మయ్య, స్వర్ణలత, పి.రమ పాల్గొన్నారు. -
హైకోర్టు ఏర్పాటు చేయకపోవడం రాజ్యాంగ విరుద్ధం
సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి వరంగల్ : తెలంగాణ రాష్ట్రానికి హైకోర్టును ఏర్పాటు చేయకపోవడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి అన్నారు. గురువారం హన్మకొండలోని వాగ్దేవి కళాశాలలో సురవరం ప్రతాప్‌రెడ్డి స్మారక ప్రథమ సభ కు ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. ‘ప్రత్యేక హైకోర్టు లేని తెలంగాణ రాష్టం రాజ్యంగ బద్ధమేనా?’ అం శంపై ఆయన మాట్లాడుతూ ‘నేను ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంటే విశాల ప్రజానీకానికి వ్యతిరేకమైన ఈ చర్యను తీవ్రంగా పరిగణించేవాడినని’ అన్నారు. 214వ అధికరణం ద్వారా ప్రతి రాష్ట్రానికి విధిగా హైకోర్టును ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. వైశాల్యంలో, జనాభాలో చిన్న రాష్ట్రాలు అయిన త్రిపుర, మణిపూర్, మేఘాలయాకు హైకోర్టును ఏర్పాటు చేశారని, 4కోట్లకు పైగా జనాభా, విశాలమైన విస్తీర్ణం ఉన్న తెలంగాణ రాష్ట్రానికి హైకోర్టును ఏర్పాటు చేయకపోవడం విచారకరమని పేర్కొన్నారు. -
మహాభారత యుద్ధాన్ని కోరకండి
సాక్షి, కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం కీలక దశకు చేరుకున్న దశలో అడ్డుకోవడం రాజ్యాంగ ద్రోహమని గోవా లోకాయుక్త జస్టిస్ సుదర్శన్‌రెడ్డి అన్నారు. ‘‘చర్చల ద్వారా పరిష్కారం కాని సమస్యలేవీ ఉండవు. అలా కాకుండా మరో మహాభారత యుద్ధాన్ని మాత్రం కోరుకోవద్దు. మరో యుద్ధమే జరిగితే దుర్యోధనుడి తొడలు విరుగుతాయి’’ అని తెలంగాణ వ్యతిరేకులనుద్దేశించి వ్యాఖ్యానించారు. కరీంనగర్లో ఆదివారం అఖిల భారత తెలంగాణ రచయితల వేదిక రెండో మహాసభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ పోరాటాన్ని అన్యాయానికి, దోపిడీకి, అసమానతలకు వ్యతిరేకంగా సాగుతున్న విముక్తి పోరాటంగా అభివర్ణించారు. జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా గమనించకపోతే మున్ముం దు ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. ‘‘ఆధిపత్యాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వ సహకారంతో సంపాదించుకున్న ఆస్తులను ప్రజలపరం చేసే దిశగా తెలంగాణ పునర్నిర్మాణం జరగాలి. లెక్కలన్నీ తేలాల్సిందే. నిజాం కాలం నాటి సర్ఫె ఖాస్ భూములు, 440 చెరువులు, కుంటలతో పాటు వక్ఫ్, దేవాలయ భూముల లెక్కలు వెలికితీయాలి. అయితే ఇది ప్రతీకార వాంఛ మాత్రం కాదు. పునర్నిర్మాణంలో భాగమంతే’’ అని తెలిపారు. తెలుగుజాతి, తెలుగుతల్లి అనే పదా లు ఎక్కడా లేవని, సురవరం ప్రతాపరెడ్డి రాసిన ఆంధ్రుల సాంఘిక చరిత్రలో ఎక్కడా ఈ తెలుగుజాతి ప్రస్తావన లేదని వివరించారు. తెలుగుదేశం, తెలుగునాడు అన్న మాటలు వాడారే తప్ప ఎక్కడా జాతి అని వాడలేదన్నారు. ‘‘తెలంగాణ ప్రాంతం విడిపోతే దక్షిణ పాకిస్థాన్ అవుతుందని 1969 ఉద్యమంలో ఎవరో విమర్శించారు. తెలుగుతల్లి పిల్లలం అనే మాటలోనే ముసలం ఉందని కాళోజీ అప్పుడే హెచ్చరించారు. రాజ్యాంగ పీఠికలో ఉన్న జాతి సమైక్యత, ప్రాదేశిక సమగ్రత అనే మాటల్లో జాతి అంటే భారతజాతి మాత్రమే. భారతదేశంలో ఉన్నవారంతా భారత పౌరులు. తెలుగు పౌరులూ, తమిళ పౌరులూ ఉండరు. భాషకో జాతి అన్న భావనే ప్రమాదకరమైనది. భాషాభిమానం దురభిమానంగా మారకూడదని సూచించారు. తమిళ భాషాభిమానం వెర్రితలలు వేసి, ద్రవిడ ఉద్యమ కాలంలో తాము ఈ దేశంలోనే ఉండబోమనే వరకు వెళ్లింది. దేశ పౌరులు సార్వభౌమాధికారాన్ని గౌరవించాల్సిందేనంటూ అప్పుడే ఏడో రాజ్యాంగ సవరణ వచ్చింది’’ అని గుర్తు చేశారు. తెలుగుజాతి అన్న పదం ఆధిపత్య భావజాలం నుంచి వచ్చిందని సుదర్శన్‌రెడ్డి చెప్పారు. తెలంగాణ రచయితలు సోక్రటీస్ వారసులని ప్రశంసించారు. తాము ప్రశ్నించడమేగాక, ప్రశ్నించే హక్కు మీకూ ఉందని ప్రజలకు నేర్పించారంటూ అభినందించారు. చివరివరకు దోపిడీని ప్రశ్నించిన కాళోజీ స్ఫూర్తిని కొనసాగిస్తున్నారన్నారు. అఖిల భారత తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు నలి మెల భాస్కర్, ప్రధాన కార్యదర్శి మచ్చ ప్రభాకర్, సాహిత్య అకాడమీ తెలుగు విభాగం కన్వీనర్ డాక్టర్ ఎన్.గోపీ, సూరెపల్లి సుజాత, జూకంటి జగన్నాథం, ఆహ్వాన సంఘం అధ్యక్షుడు ఎన్.శేఖర్ పాల్గొన్నారు. మధ్యాహ్నం ప్రవాస తెలంగాణ రచయితల సదస్సు జరిగింది. మైసూరు తెలుగు సమితి అధ్యక్షుడు సి.ఎన్.రెడ్డి అధ్యక్షత వహించారు. ముంబై, షోలాపూర్, భీవండి, సూరత్ నుంచి వచ్చిన రచయితలు పాల్గొన్నారు. 12 పుస్తకాలు, రెండు సీడీలను ఆవిష్కరించారు.