మహాసభలో మాట్లాడుతున్న జస్టిస్ సుదర్శన్‌రెడ్డి. చిత్రంలో జయధీర్ తిరుమలరావు తదితరులు
హైదరాబాద్ : ప్రశ్నించడంతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యపడుతుందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇందుకు కవులు,రచయితలు, కళాకారులు తమ కలాలను, గళాలను సంధించాలన్నారు. డెబ్బై ఏళ్లపాటు నిర్మించుకున్న వ్యవస్థలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా కుప్పకూలి భారత రాజ్యాంగం అపహాస్యం పాలవుతోందని సుదర్శన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర మహాసభల్లో ఆయన మాట్లా డారు. వక్రబుద్ధితో ఆలోచించేనేతల చేతుల్లో చిక్కుకున్న వ్యవస్థలో సత్యం మాట్లాడలేని పరిస్థితి నెలకొందన్నారు.
ఆత్మగౌరవం నినాదంతో పోరాటం చేసి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్న మనం అమరుల త్యాగాల మీద నడుస్తున్నామన్నారు. వ్యవస్థను తమ చెప్పుచేతల్లోకి తీసుకోవడం సాధ్యం కాకపోతే దాన్ని నిట్టనిలువునా చీల్చేస్తున్నారన్నారు. సభకు అధ్యక్షత వేదిక అధ్యక్షుడు జయధీర్ తిరుమలరావు మాట్లాడుతూ దారి తప్పిన పిల్లలున్నారు కానీ దారి తప్పిన కలాలు లేవన్నారు. సమాజం తనదని భావించినప్పుడే నిజమైన సాహిత్యం ప్రారంభం అవుతుందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, సుప్రసిద్ధ తమిళ రచయిత పి. శివకామి అన్నారు. ప్రముఖ రచయిత ప్రొఫెసర్ హెచ్‌ఎస్ శివప్రకాశ్, ప్రొఫెసర్ ఎం.ఎం.వినోదిని, తెలంగాణ ప్రజల పార్టీ అధ్యక్షుడు జస్టిస్ బి.చంద్రకుమార్, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె. శ్రీనివాస్ మాట్లాడారు.
సాహిత్యం, సాంస్కృతిక రంగాలపై పార్టీలు మాట్లాడటం లేదు : రామచంద్రమూర్తి
‘సాక్షి ’ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ సాహిత్య, సాంస్కృతిక రంగాల గురించి ఏ పార్టీ చర్చించడంలేదనీ, తమ మేనిఫెస్టో లో పెట్టడంలేదన్నారు. పుణె పోలీసులు విరసం నేత వరవరరావును అరెస్ట్ చేస్తుంటే ఏ పార్టీ నేతలూ మాట్లాడలేదని చెప్పారు. నాలుగేళ్లపాటు ఒక మహిళామంత్రి లేకుండా పాలించినా ఏ ఉద్యమమూ జరగలేదన్నారు. కార్యక్రమంలో వేదిక ప్రధాన కార్యదర్శి గాజోజు నాగభూషణం, పూర్వ అధ్యక్షుడు జూకంటి జగన్నాథం, సకల జనుల వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.వినాయకరెడ్డి పాల్గొన్నారు. ‘ఎన్నికలు, ప్రజల కర్తవ్యాలు– రచయితలు’అనే అంశంపై జరి గిన సభలో అన్నవరం దేవేందర్, అల్లం రాజయ్య, సీహెచ్ మధు, ‘మేనిఫెస్టోలు – భాషా సాహిత్య సాంస్కృతిక రంగాలు – వివిధ పార్టీలు’ అనే అం శంపై జరిగిన సెషన్‌లో మానవ హక్కుల వేదిక అధ్య క్షుడు ఎస్. జీవన్‌కుమార్, సీపీఎం నేత జి. నాగయ్య, పొట్లపల్లి రామారావు జయంతి ఉత్సవాల ముగింపు సమావేశంలో బూర్ల వెంకటేశ్వర్లు, ప్రముఖ కవి నిఖి లేశ్వర్, విమలక్క, పొట్లపల్లి వరప్రసాదరావు, డా.వి.ఆర్. శర్మ, పెద్దింటి అశోక్‌కుమార్ పాల్గొన్నారు.
పలు పుస్తకాల ఆవిష్కరణ
అలిశెట్టి ప్రభాకర్‌పై రాసిన వ్యాస సంకలనం నెత్తుటి పాలపుంత, తిరుమలరావు సంకలనం దళిత గీతాలు, నల్లేల రాజయ్య రచన సిరధమనులు, పెనుగొండ బసవేశ్వర్ ఆకాశమంతా పావురం, పెనుగొండ సరసిజ రచన ‘కాగితాన్ని ముద్దాడిన కళ’, నేరేళ్ల శ్రీనివాస్ రచన ‘దుళ్‌దుమ్మ’’, తోకల రాజేశం రచన ‘‘అడవి దీపాలు’’, బండి చంద్ర శేఖర్ రచన ‘‘ఆవాజ్’’, వడ్నాల కిషన్ రచన ‘‘వెన్నెల ముచ్చట్లు’’, జి.లచ్చయ్య రచన ‘‘కాలంబూ రాగానే’’ పుస్తకాలను అతిథులు ఆవిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment