L. Ramana
-
ఆశావహుల్లో ఉత్కంఠ.. గుత్తా, కడియంలకు మళ్లీ చాన్స్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనమండలిలో స్థానం కోసం ఆశావహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మండలికి ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన ఆరుగురు ఎమ్మెల్సీల పదవీకాలం ఈ నెల మొదటి వారంలో పూర్తయ్యింది. అలాగే గవర్నర్ కోటాలో నామినేట్ అయిన ప్రొఫెసర్ మాదిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి పదవీ కాలం కూడా ఈ నెల 17న పూర్తయ్యింది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన స్థానాలకు గత నెల మూడో వారంలోనే ఎన్నికలు జరగాల్సి ఉన్నా, కరోనా పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ఎన్నిక తేదీపై ఇప్పటివరకు స్పష్టత లేకున్నా ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్నవారు మాత్రం ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు. గుత్తా, కడియం ముందు వరుసలో ఎమ్మెల్యే కోటాలో ఎన్నికై పదవీ కాలం పూర్తి చేసుకున్న ఆరుగురిలో మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మాజీ చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రి ఫరీదుద్దీన్ ఇదే కోటాలో తిరిగి ఎన్నికవ్వాలని భావిస్తున్నారు. వీరిలో గుత్తా సుఖేందర్ రెడ్డికి మళ్లీ అవకాశం కల్పించి మరోసారి మండలి చైర్మన్‌గా అవకాశం కల్పిస్తారని లేదా మంత్రివర్గంలోకి తీసుకుంటారని తెలుస్తోంది. కడియం శ్రీహరికి కూడా ఎమ్మెల్సీగా తిరిగి అవకాశం లభిస్తుందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రెండు రోజుల క్రితం వరంగల్ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్.. కడియం ఇంట్లో భోజనం చేశారు. మరోవైపు రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కొంతకాలం స్తబ్దుగా ఉన్న కడియం ఇటీవలి కాలంలో తరచూ సీఎంను కలుస్తున్నారు. కడియంకు తిరిగి ప్రాధాన్యత దక్కుతుందనడానికి ఇవి సంకేతాలుగా చెబుతున్నారు. భారీగానే జాబితా మొత్తం ఏడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉండటంతో పదవులు ఆశిస్తున్న టీఆర్ఎస్ నేతల జాబితా భారీగానే ఉంది. పద్మశాలి, కుమ్మరి, విశ్వ బ్రాహ్మణ సామాజిక వర్గాలకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని గతంలో కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఆయా సామాజికవర్గ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. అసెంబ్లీ మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మేయర్ బొంతు రాంమ్మోహన్, తక్కల్లపల్లి రవీందర్రావు ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నారు. వీరితో పాటు ఎర్రోళ్ల శ్రీనివాస్, అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, పీఎల్ శ్రీనివాస్, ఎంసీ కోటిరెడ్డి, శుభప్రద పటేల్ వంటి వారు ఆశావహుల జాబితాలో ఉన్నారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ పార్టీలో చేరే పక్షంలో ఆయనకు తప్పనిసరిగా అవకాశం లభిస్తుందని సమాచారం. గవర్నర్ కోటాలో సీఎం కార్యాలయ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, బ్రూవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికపైనే ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ దృష్టి కేంద్రీకరించింది. చదవండి: ప్రజాసేవకు పదవులు అవసరం లేదు: కడియం శ్రీహరి Huzurabad: బిగ్‌ఫైట్‌కు టీఆర్ఎస్, బీజేపీ సై.. కానీ కాంగ్రెస్ ఎందుకిలా! -
పార్టీ మార్పుపై ఎల్.రమణ కీలక వ్యాఖ్యలు
సాక్షి, జగిత్యాల: పార్టీ మారాలని తానెప్పుడూ అనుకోలేదని, ఏదైనా ఉంటే అందరితో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. సోమవారం జగిత్యాల జిల్లాకేంద్రంలోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఇప్పటివరకు పార్టీ మారే విషయంలో ఎవరూ ఎటువంటి ప్రతిపాదనలు తీసుకురాలేదని చెప్పారు. తాను పార్టీ మారతానని ఎప్పుడూ చెప్పలేదన్నారు. సోషల్ మీడియాను నియంత్రించే పరిస్థితి లేకపోవడంతోనే రకరకాలుగా ప్రచారం జరుగుతోందని అన్నారు. ఇలాంటి చర్యలతో నిజాయితీ, నిబద్ధత ఉన్న వ్యక్తుల మనసు బాధపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎప్పుడూ పదవులు, పైరవీలు, ప్రాపర్టీల కోసం ఆలోచించలేదన్నారు. సాధారణ కార్యకర్తగా ఉన్న తనకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిగా అవకాశం ఇచ్చిందని చెప్పారు. 27 ఏళ్లుగా టీడీపీ కార్యకర్తల రెక్కలకష్టం మీద తాను ఎదిగానని, తనకు రాజకీయ జన్మనిచ్చిన పార్టీ, కార్యకర్తల మనోభావాలు తెలుసుకుని ముందుకుసాగుతానని స్పష్టం చేశారు. ఏ పార్టీలోకి వెళ్లినా, వెళ్లకపోయినా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా పనిచేస్తానని స్పష్టంచేశారు. తాను పార్టీ మారదల్చుకుంటే ముందుగా మీడియా ద్వారానే వెల్లడిస్తానని పేర్కొన్నారు. కాగా, మారుతున్న రాజకీయాలను గమనిస్తున్నానని రమణ అన్నారు. ఈ మార్పులను ఎప్పటికప్పుడు తమ అధినేతకు తెలియజేస్తున్నట్లు వివరించారు. పదవుల కోసం పాకులాడే వ్యక్తిత్వం తనది కాదని, అలాగే ఇంకొకరి పదవులకు అడ్డుపడే మనస్తత్వం కాదని స్పష్టంచేశారు. -
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి
హైదరాబాద్ : ప్రశ్నించడంతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యపడుతుందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇందుకు కవులు,రచయితలు, కళాకారులు తమ కలాలను, గళాలను సంధించాలన్నారు. డెబ్బై ఏళ్లపాటు నిర్మించుకున్న వ్యవస్థలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా కుప్పకూలి భారత రాజ్యాంగం అపహాస్యం పాలవుతోందని సుదర్శన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర మహాసభల్లో ఆయన మాట్లా డారు. వక్రబుద్ధితో ఆలోచించేనేతల చేతుల్లో చిక్కుకున్న వ్యవస్థలో సత్యం మాట్లాడలేని పరిస్థితి నెలకొందన్నారు. ఆత్మగౌరవం నినాదంతో పోరాటం చేసి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్న మనం అమరుల త్యాగాల మీద నడుస్తున్నామన్నారు. వ్యవస్థను తమ చెప్పుచేతల్లోకి తీసుకోవడం సాధ్యం కాకపోతే దాన్ని నిట్టనిలువునా చీల్చేస్తున్నారన్నారు. సభకు అధ్యక్షత వేదిక అధ్యక్షుడు జయధీర్ తిరుమలరావు మాట్లాడుతూ దారి తప్పిన పిల్లలున్నారు కానీ దారి తప్పిన కలాలు లేవన్నారు. సమాజం తనదని భావించినప్పుడే నిజమైన సాహిత్యం ప్రారంభం అవుతుందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, సుప్రసిద్ధ తమిళ రచయిత పి. శివకామి అన్నారు. ప్రముఖ రచయిత ప్రొఫెసర్ హెచ్ఎస్ శివప్రకాశ్, ప్రొఫెసర్ ఎం.ఎం.వినోదిని, తెలంగాణ ప్రజల పార్టీ అధ్యక్షుడు జస్టిస్ బి.చంద్రకుమార్, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె. శ్రీనివాస్ మాట్లాడారు. సాహిత్యం, సాంస్కృతిక రంగాలపై పార్టీలు మాట్లాడటం లేదు : రామచంద్రమూర్తి ‘సాక్షి ’ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ సాహిత్య, సాంస్కృతిక రంగాల గురించి ఏ పార్టీ చర్చించడంలేదనీ, తమ మేనిఫెస్టో లో పెట్టడంలేదన్నారు. పుణె పోలీసులు విరసం నేత వరవరరావును అరెస్ట్ చేస్తుంటే ఏ పార్టీ నేతలూ మాట్లాడలేదని చెప్పారు. నాలుగేళ్లపాటు ఒక మహిళామంత్రి లేకుండా పాలించినా ఏ ఉద్యమమూ జరగలేదన్నారు. కార్యక్రమంలో వేదిక ప్రధాన కార్యదర్శి గాజోజు నాగభూషణం, పూర్వ అధ్యక్షుడు జూకంటి జగన్నాథం, సకల జనుల వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.వినాయకరెడ్డి పాల్గొన్నారు. ‘ఎన్నికలు, ప్రజల కర్తవ్యాలు– రచయితలు’అనే అంశంపై జరి గిన సభలో అన్నవరం దేవేందర్, అల్లం రాజయ్య, సీహెచ్ మధు, ‘మేనిఫెస్టోలు – భాషా సాహిత్య సాంస్కృతిక రంగాలు – వివిధ పార్టీలు’ అనే అం శంపై జరిగిన సెషన్లో మానవ హక్కుల వేదిక అధ్య క్షుడు ఎస్. జీవన్‌కుమార్, సీపీఎం నేత జి. నాగయ్య, పొట్లపల్లి రామారావు జయంతి ఉత్సవాల ముగింపు సమావేశంలో బూర్ల వెంకటేశ్వర్లు, ప్రముఖ కవి నిఖి లేశ్వర్, విమలక్క, పొట్లపల్లి వరప్రసాదరావు, డా.వి.ఆర్. శర్మ, పెద్దింటి అశోక్‌కుమార్ పాల్గొన్నారు. పలు పుస్తకాల ఆవిష్కరణ అలిశెట్టి ప్రభాకర్‌పై రాసిన వ్యాస సంకలనం నెత్తుటి పాలపుంత, తిరుమలరావు సంకలనం దళిత గీతాలు, నల్లేల రాజయ్య రచన సిరధమనులు, పెనుగొండ బసవేశ్వర్ ఆకాశమంతా పావురం, పెనుగొండ సరసిజ రచన ‘కాగితాన్ని ముద్దాడిన కళ’, నేరేళ్ల శ్రీనివాస్ రచన ‘దుళ్దుమ్మ’’, తోకల రాజేశం రచన ‘‘అడవి దీపాలు’’, బండి చంద్ర శేఖర్ రచన ‘‘ఆవాజ్’’, వడ్నాల కిషన్ రచన ‘‘వెన్నెల ముచ్చట్లు’’, జి.లచ్చయ్య రచన ‘‘కాలంబూ రాగానే’’ పుస్తకాలను అతిథులు ఆవిష్కరించారు. -
భూ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు కోరండి
గవర్నర్‌కు టీటీడీపీ విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: మియాపూర్ భూ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్‌కు టీటీడీపీ బృందం విన్నవించింది. ఈ మేరకు మంగళవారం టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, పార్టీ నేతలు మోత్కుపల్లి నర్సింహులు, పెద్దిరెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, వేం నరేందర్‌రెడ్డి తదితరులు రాజ్‌భవన్‌లో గవర్నరును కలిసి విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎల్.రమణ, రేవంత్ విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు ఐఏఎస్ అధికారులూ ఈ కుంభకోణంలో ఉన్నారని ఆరోపించారు. మియాపూర్ భూములను పేదలు ఆక్రమించుకోవాలని, వారికి టీటీడీపీ అండగా ఉంటుందని రేవంత్ అన్నారు. కబ్జా భూములు ప్రభుత్వానివేనని బోర్డులెందుకు పెట్టడంలేదని ప్రశ్నించారు. కుంభకోణంలో కీలక పాత్రధారులపై ఇప్పటికీ కేసులు నమోదుకాలేదని విమర్శించారు. పాత్రధారుల కుటుంబీకులతో ప్రభుత్వ భూములపై సీఎం కేసీఆర్ సమీక్షిస్తున్నారని, దీంతో ఆయన చిత్తశుద్ధి ఏమిటో ఇట్టే అర్థమవుతోందన్నారు. కుంభకోణంపై సమీక్షించాలని గవర్నర్‌ను కోరామని.. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి, సీబీఐ డైరెక్టరును కలసి ఈ విషయమై ఫిర్యాదు చేస్తామని రేవంత్ చెప్పారు. -
భూకుంభకోణంపై ప్రధానికి ఫిర్యాదు: టీడీపీ
సాక్షి, హైదరాబాద్: మియాపూర్ భూ కుంభకోణంపై ప్రధాని మోదీకి ఫిర్యాదు చేస్తామని, అపాయింట్మెంట్ దొరికితే రాష్ట్రపతిని కూడా కలుçస్తామని టీటీడీపీ నేతలు ఎల్.రమణ, ఎ.రేవంత్‌రెడ్డి చెప్పారు. గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్‌కు మణిహారంగా ఉన్న రంగారెడ్డి జిల్లాలో భూముల విలువ పెరగడంతో పెద్ద ఎత్తున ఆక్రమణలు జరుగుతున్నాయని, మియాపూర్ భూ కుంభకోణం దానికి పరాకాష్ట అని పేర్కొన్నారు. -
‘మియాపూర్’ సూత్రధారులకు ప్రభుత్వం కొమ్ముకాస్తోంది
టీటీడీపీ నేతలు రేవంత్, ఎల్.రమణ సాక్షి, హైదరాబాద్: శేరిలింగంపల్లి మండలం మియాపూర్ భూ కుంభ కోణం సూత్రధారులకు రాష్ట్ర ప్రభు త్వం కొమ్ముకాస్తోందని టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. భూములు రిజిస్ట్రే షన్ చేసుకున్న సంస్థ యజమాని బంధువులు సీఎం కార్యాలయంలో ఉన్నారనే ప్రచారం జరుగుతోందని, అదేవిధంగా కొందరు ప్రముఖ నేతలు సైతం దీని వెనుక ఉన్నారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో కిందిస్థాయి అధికారులను సస్పెండ్ చేసి ప్రభుత్వం చేతులు దులుపు కుంటోందన్నారు. ఈ మేరకు సచివాలయంలోని సీ బ్లాక్ ఎదుట టీటీడీపీ నేతలు శనివారం నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అక్రమార్కు లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
నియంతలా కేసీఆర్ పాలన: ఎల్.రమణ
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ సొంత ఎజెండాతో నియంతలాగా వ్యవహరిస్తున్నారని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ విమర్శించారు. మంత్రులతో, ఎమ్మెల్యేలను కూడా ఆయన పట్టించుకోవడంలేదన్నారు. దొరల గడీలకు ప్రతిరూపంగా కోట్ల రూపాయలను దుర్వినియోగం చేస్తూ ప్రగతి భవన్ పేరిట పైరవీ భవన్ కట్టుకున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీకి ఉన్న కార్యకర్తల బలం రాష్ట్రంలో మరే పార్టీకీ లేదన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే మంత్రివర్గంలో 12 మంది ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు, నలుగురు మహిళలకు చోటిస్తామని చెప్పారు. ప్రభుత్వంపై యుద్ధమే: రేవంత్ రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం రాబందుల్లా పీల్చుకు తింటోందని టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామకాల నుంచి రైతులు, నిరుద్యోగుల దాకా అన్నింటా మోసగించారని ఆరోపించారు. అమరుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం, ఇంటికో ఉద్యోగం, భూమి, ట్యాంక్‌బండ్‌పై స్తూపాల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ది రైతు ప్రభుత్వం కాదని, రాబందుల ప్రభుత్వమని ఆరోపించారు. ఉద్యోగాల భర్తీకి కేలండర్ విడుదల చేయకుంటే ప్రభుత్వంపై యుద్ధం చేస్తామని హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణకోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి ఎందుకు తీసుకెళ్లడం లేదని ప్రశ్నించారు. పలు తీర్మానాల ఆమోదం టీడీపీ మహానాడులో పలు తీర్మానాలను ఆమోదించారు. సాగు, మద్దతు ధర, రైతు ఆత్మహత్యలు, రిజర్వేషన్లు, నిరుద్యోగం, విద్యారంగం, ఫీజు రీయింబర్సుమెంటు బకాయిలు, ఎన్నికల హామీల అమలులో తెలంగాణ రాష్ట్ర సమితి వైఫల్యాలు, మీడియాపై ఆంక్షలు తదితర అంశాలపై టీడీపీ సీనియర్ నాయకులు ప్రసంగించారు. -
టీఆర్ఎస్ గాలివాటం పార్టీ
ఎల్.రమణ, రేవంత్‌రెడ్డి ధ్వజం సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ కేవలం గాలివాటం పార్టీ అని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. టీటీడీపీ మున్సిపల్, పట్టణ, గ్రామ, మండల స్థాయి సంస్థాగత ఎన్నికల అధికారులకు సోమవారం జరిగిన శిక్షణాతరగతుల్లో వారు మాట్లాడారు. టీఆర్ఎస్కు సంస్థాగత నిర్మాణం, బలం, వ్యవస్థా లేవని రమణ అన్నారు. ప్రజల భావోద్వేగాలతో రాజకీయపబ్బం గడుపుకోవడం మినహా పరిపాలనపై పట్టులేదన్నారు. టీడీపీ హయాంలో మంత్రి పదవి రాకపోవడంతోనే కేసీఆర్ టీఆర్ఎస్ను పెట్టుకున్నారని విమర్శించారు. రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ వల్ల రాష్ట్రంలో అప్పులు రూ.60వేల కోట్ల నుంచి రూ.140వేల కోట్లకు పెరిగాయని ధ్వజమెత్తారు. తెలంగాణ ఏర్పాటు నాటికి మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. ఇప్పటిదాకా 4 బడ్జెట్లు ప్రవేశపెట్టినా దళితులకు, మైనారిటీలకు, రైతులకు, నిరుద్యోగులకు, విద్యార్థులకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకోసం నిధులను కేటాయించలేదని విమర్శించారు. టీఆర్ఎస్లో మంత్రి హరీశ్‌రావు చచ్చినపాము వంటివాడని ఆరోపించారు. టీడీపీపై మాట్లాడేస్థాయి, అర్హత మంత్రి కేటీఆర్‌కు లేవన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమైందన్నారు. -
కేసీఆర్ పీక పిసికే రోజొస్తుంది: ఎల్.రమణ
సాక్షి, హైదరాబాద్: ధర్నాచౌక్‌ను శివార్లకు తరలించడం అణగారిన వర్గాల పీక పిసికే చర్యేనని.. ఈ నిరంకుశ చర్యను విరమించుకోకపోతే కేసీఆర్ పీక పిసికే రోజు వస్తుందని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ వ్యాఖ్యానించారు. రాజకీయ అంటరానితనాన్ని ప్రోత్సహించే ఇలాంటి చర్యలను మానుకోవాలని.. కేసీఆర్ ఖబడ్డార్ అంటూ హెచ్చరించారు. శుక్రవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో విలేకరులతో రమణ మాట్లాడుతూ... రాష్ట్రంలో 1983కు ముందు మాదిరిగా కొన్ని కుటుంబాల చేతుల్లోనే గుత్తాధిపత్యం ఉండేలా ప్రస్తుత ప్రభుత్వ విధానాలున్నాయని, వాటిని బద్దలు కొట్టేందుకు టీడీపీ సిద్ధంగా ఉందన్నారు. -
రోగుల ప్రాణాలు పోతున్నా పట్టదా?
• ప్రభుత్వ తీరుపై టీటీడీపీ ధర్నా • 51 మంది అరెస్ట్.. ఉద్రిక్తత హైదరాబాద్: ప్రభుత్వాసుపత్రుల్లో కల్తీ మందులు, సెలైన్లతో పాటు డెంగ్యూ, స్వైన్‌ప్లూ ప్రబలి ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టకుండా కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం విడ్డూరమని టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ప్రజలకు నాణ్యమైన కార్పొరేట్ వైద్యం అందించాలని కోరుతూ టీటీడీపీ మహిళా విభాగం, వైద్య విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం కోఠిలోని డీఎంఅండ్‌హెచ్‌వో కార్యాలయ ముట్టడి చేపట్టారు. డీఎంఅండ్హెచ్ఎస్ ప్రధాన కార్యాలయం వద్ద ఎల్. రమణ, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, కూన వెంకటేశ్‌గౌడ్, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, అరవింద్‌గౌడ్, సారంగపాణి, మహిళ విభాగం అధ్యక్షురాలు శోభారాణితో పాటు పెద్ద ఎత్తున టీ డీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా పెద్దెత్తున నినాదాలతో కోఠిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో సుల్తాన్‌బజార్ ఏసీపీ చక్రవర్తి, ఇన్స్పెక్టర్ శివశంకర్ ఆధ్వర్యంలో అఫ్జల్‌గంజ్, చాదర్ఘట్ పోలీసులు టీడీపీ శ్రేణులను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, టీడీపీ నాయకులకు తోపులాట జరిగింది. ఎట్టకేలకు పోలీసులు 51 మందిని అఫ్జల్‌గంజ్ పోలీసుస్టేషన్‌కు తరలించి.. సొంత పూచికత్తుపై విడుదల చేశారు. అనంతరం ఎల్.రమణ మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ నిర్లక్ష్య పాలన వల్లే పేదల చావులు పెరుగుతున్నాయని మండిపడ్డారు. నిలోఫర్ ఆసుపత్రిలో 10 మంది బాలింతలు చనిపోయారన్నారు. గాంధీ ఆసుపత్రిలో చిన్నారికి ఫంగస్ ఉన్న సెలైన్ ఎక్కించడంతో మృత్యువు కబలించిందని ఆవేదన వ్యక్తం చేశారు. -
పార్టీల బలహీనానికే కొత్త జిల్లాలు: ఎల్.రమణ
సాక్షి, హైదరాబాద్: జిల్లాల ఏర్పాటుపై సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న తీరుతో వాటికున్న పవిత్రత పోతోందని టీటీడీపీ నేత ఎల్.రమణ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఇతర రాజకీయ పార్టీలను బలహీనపరిచేందుకే కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర భూసేకరణ చట్టం-2013 అమలు చేయకపోవడం, ఎంసెట్ లీకేజీతో విద్యార్థులకు నష్టం, కరువు వల్ల రైతాంగం కడగండ్లు వంటి ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్ ఈ ఆలోచన చేశారన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ సాధనలో ముఖ్య భూమిక పోషించిన కరీంనగర్ జిల్లాలో ఇతర జిల్లాల్లోని 8 ప్రాంతాలను కలిపారన్నారు. తూతూ మంత్రంగా, బలహీన వర్గాలను దెబ్బతీసేలా జిల్లాల విభజన ఉందని ఆరోపించారు. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో పరిశ్రమలకు కేంద్రమిచ్చే రాయితీలను ఏ జిల్లాలకు కేటాయిస్తారని టీడీపీ నేత పెద్దిరెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ మెట్రో రైలు పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని, అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేసి ప్రాజెక్టుపై ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. -
మహారాష్ట్రతో ఒప్పందం రాష్ట్రానికి శాపం : ఎల్.రమణ
సీఎం కేసీఆర్‌కు ఎల్.రమణ బహిరంగ లేఖ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్రతో చేసుకున్న జల ఒప్పందం రాష్ట్రానికి శాపమని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ విమర్శించారు. ఈమేరకు ఆయన శుక్రవారం సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా సాధిస్తామంటూ ఆర్భాటంగా ప్రకటించి.. అధికారంలోకి వచ్చాక అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రాజెక్టుల రీడిజైన్ల పేరిట ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. తాజాగా, గోదావరిపై ప్రాజెక్టుల కోసం మహారాష్ట్రతో చరిత్రాత్మక ఒప్పందాల పేరిట చేస్తున్న హడావిడి, తీసుకుంటున్న నిర్ణయాలు తెలంగాణ ప్రజల పాలిట శాపాలుగా పరిణమించే ప్రమాదముందని హెచ్చరించారు. తమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ 152 మీటర్లకు ఒక్క ఇంచు తగ్గినా రాష్ట్ర రైతాంగానికి భారీ ఎత్తున నష్టం వాటిల్లుతుందని ఉద్యమంలో పాల్గొన్న ఇంజనీర్లే చెబుతున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఏడు మండలాలను అంటే, సుమారు 5 లక్షల నుంచి 6 లక్షల ఎకరాలను ఏపీలో విలీనం చేశారని గుర్తు చేశారు. ఇదే తరహాలో తెలంగాణ ప్రాజెక్టుల కోసం మహారాష్ట్రలోని 1,852 ఎకరాల ముంపు ప్రాంతాన్ని రాష్ట్రంలో విలీనం చేయించాలన్నారు. ఇందుకోసం రాష్ట్ర బీజేపీ నేతల సాయం తీసుకుని ప్రధానిపై ఒత్తిడి తీసుకురావాలని రమణ తన లేఖలో ముఖ్యమంత్రిని కోరారు. -
టీడీపీని వీడే ప్రసక్తే లేదు: ఎల్.రమణ
కరీంనగర్: తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ స్పష్టం చేశారు. బుధవారం ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడారు. తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు. తన గురించి అనవసరంగా మాట్లాడితే ఊరుకోను' అని హెచ్చరించారు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎన్ని ఆస్తులు ఉన్నాయో అవే తన బిడ్డలకు ఇచ్చానట్టు వెల్లడించారు. టీఆర్ఎస్ నాయకులు అలా ఇవ్వగలరా? అంటూ ఎల్. రమణ సూటిగా ప్రశ్నించారు. -
టీ టీడీపీపై దుష్ర్పచారం మానుకోవాలి
భూసేకరణలో 2013 చట్టాన్ని అమలు చేయాలి: ఎల్.రమణ సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులకు అడ్డుపడుతోందంటూ టీడీపీపై బురదజల్లడం మానుకోవాలని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ టీఆర్ఎస్కు సూచించారు. తెలంగాణలో తక్షణం 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలన్నారు. పార్టీ నేతలు రావుల చంద్రశేఖర్ రెడ్డి, అరవింద్‌కుమార్‌గౌడ్‌తో కలిసి సోమవారం రమణ విలేకరులతో మాట్లాడారు. భూసేకరణ పేరుతో పేదల బతుకులతో ఆటలాడవద్దని ఆయన ప్రభుత్వానికి హితవు పలికారు. కేసీఆర్ ఎంపీగా ఉన్న సమయంలోనే 2013 భూసేకరణ చట్టాన్ని పార్లమెంటు ఆమోదించిందన్నారు. ఈ చట్టం లేదంటే జీఓ 123లో ఏది కోరుకుంటే దాని ప్రకారం పరిహారం ఇస్తామనడం కేసీఆర్ ద్వంద్వ నీతిని చూపుతోందన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటై రెండేళ్లు అయిన సందర్భంగా విద్యుత్తు, ఆర్టీసీ చార్జీల పెంపును రాష్ట్ర ప్రజలకు కానుకగా ఇచ్చారని రావుల ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ముస్లిం మైనారిటీలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ప్రాజెక్టుల పేరుతో జరుగుతున్న అవినీతికి మాత్రమే టీడీపీ వ్యతిరేకమని, ప్రాజెక్టులకు కాదన్నారు. -
తప్పులు ఎత్తిచూపితే భరించలేరా?
పాలనను గాడిలో పెట్టేందుకే రంగంలోకి దిగిన జేఏసీ టీటీడీపీ నేతలు ఎల్.రమణ, నామా నాగేశ్వర్రావు వరంగల్ : తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత అభివృద్ధి కోసం మేధావులు, ఉద్యమకారుల తో కమిటీలు వేస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్ ఆ విషయూన్ని మరిచిపోవడమే కాకుం డా.. తప్పులు ఎత్తిచూపిన వారిపై భజనపరులతో ఆరోపణలు చేయించడం గర్హనీయమని టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. హన్మకొండ బాలసముద్రంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణఉద్యమ సమయంలో ఏకాకిగా ఉన్న కేసీఆర్.. రాజకీయ జేఏసీని ఏర్పాటుచేసి చైర్మ న్గా కోదండరాంను నియమించినప్పుడు 45 మంది టీడీపీ ఎమ్మెల్యేలతో మద్దతు ప్రకటిం చామని గుర్తుచేశారు. టీఆర్ఎస్ రెండేళ్ల పాలన పై కోదండరాం ప్రశ్నిస్తే ఉలిక్కిపడడం ఎందుకని ప్రశ్నించారు. ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన కొండా మురళి వంటి వారిని కౌగి లించుకుంటున్న కేసీఆర్.. ప్రొఫెసర్ కోదండరాంను బొంతపురుగులా చూడటాన్ని ప్రజ లు జీర్ణించుకోలేరన్నారు. కేసీఆర్ తన పాలన ఫాంహౌస్ నుంచే సాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. రెండేళ్ల ప్రభుత్వ పాలనపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలి తెలంగాణ బిల్లుతోనే భూసేకరణ చట్టం బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందిందని, ఆ చట్ట ప్రకారమే సేకరించిన భూములకు నష్ట పరిహా రం చెల్లించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యు డు నామా నాగేశ్వర్రావు డిమాండ్ చేశారు. బ్రిటీష్ కాలం నాటి చట్టం ప్రకారం భూములకు నష్ట పరిహారం చెల్లించడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాశ్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు, ఈగ మల్లేశం, గట్టు ప్రసాద్‌బాబు, పుల్లూరు అశోక్‌కుమార్, ఆక రాధాకృష్ణ, మార్గం సారంగం ఉన్నారు. -
పార్టీ వీడే ప్రసక్తే లేదు
♦ కేసీఆర్ ప్రభుత్వంపై రాజీలేని పోరు ♦ టీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ సాక్షి, హైదరాబాద్: వ్యవసాయం సంక్షోభంలో పడటమే కాకుండా, రైతన్నపై కరువు కోరలు చాస్తుంటే, మొద్దు నిద్రపోతున్న కేసీఆర్ ప్రభుత్వంపై రాజీలేని పోరు సాగించడమే తమ ధ్యేయమని తెలంగాణ రాష్ట్ర టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ పేర్కొన్నారు. రమణ బుధవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. కరువు సహాయక చర్యల్లో వైఫల్యం చెందడమే కాక, అవకతవకల జల విధానం, మితిమీరిన అవినీతికి మారుపేరుగా మారిన టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ పబ్బం గడుపుతోందన్నారు. ఎంతో బాధ్యతాయుతమైన పార్టీ అధ్యక్ష పదవిని, గౌరవాన్ని ఇచ్చిన తెలుగుదేశం పార్టీనీ వీడే ప్రసక్తి లేదని రమణ స్పష్టం చేశారు. -
కారెక్కనున్న రమణ?
- త్వరలో గులాబీ కండువా కప్పుకోనున్న టీటీడీపీ అధ్యక్షుడు - ఇప్పటికే సీఎం, మంత్రి హరీశ్‌తో మంతనాలు - మరో ఎమ్మెల్యే సండ్ర కూడా టీఆర్ఎస్లో చేరే అవకాశం - పాలేరు ఉప ఎన్నిక లోపే జంప్! సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టీడీపీకి మరో పెద్ద షాక్ తగలనుందా..? పదిహేను మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే పన్నెండు మంది గట్టు దాటడంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఆ పార్టీలో మరో భారీ కుదుపు ఖాయమన్న వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు టీటీడీపీ విషయంలో పట్టింపే లేనట్టు ఉండటంతో తమ రాజకీయ భవిష్యత్ అంధకారమవుతుందని ఆందోళన చెందుతున్న ముఖ్య నాయకులు కొందరు పార్టీని వీడి గులాబీ గూటికి చేరడమే శ్రేయస్కరమన్న అభిప్రాయానికి వచ్చారని చెబుతున్నారు. పార్టీలోని విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ కొద్ది రోజుల్లోనే గులాబీ కండువా కప్పుకోవడానికి అన్ని లాంఛనాలు పూర్తయ్యాయని తెలుస్తోంది. టీడీపీకి మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య చేరికకు కూడా ముహూర్తం కుదిరిందని అంటున్నారు. వాస్తవానికి ఈ ఇద్దరు నేతల తో పాటు పలువురు నాయకులు టీడీపీ గోడ దూకుతారని కొద్ది నెలలుగా ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే తాజా పరిణామాలు ఈ ప్రచారాన్ని మరింత బలపరిచేవిగా ఉన్నాయి. టీడీపీకి భవిష్యత్తు ఏదీ? గడిచిన రెండేళ్లుగా అధికార టీఆర్ఎస్తో సై అంటే సై అన్న నాయకులు కూడా కాలక్రమేణా జావగారి పోయారని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ‘ఓటుకు కోట్లు’ కేసులో పార్టీ పీకల్లోతు కూరుకుపోవడం, ఏకంగా పార్టీ అధినేత చంద్రబాబు ఆడియో టేపులూ బహిరంగమవడంతో తెలంగాణ టీడీపీ పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయింది. దీంతో తెలంగాణ పార్టీ వ్యవహారాల విషయంలో చంద్రబాబు అంటీముట్టనట్టుగానే ఉంటున్నారన్నది పార్టీ వర్గాల అభిప్రాయం. రెండోసారి టీటీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న మాజీ మంత్రి ఎల్.రమణ నామమాత్రం అయ్యారన్న భావన వ్యక్తమవుతోంది. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితుడైన ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నీ తానై వ్యవహరిస్తుండడం, అధినేత పట్టించుకోకపోవడం వంటి పరిణామాలతో ఇక పార్టీలో కొనసాగడంలో అర్థం లేదన్న అభిప్రాయానికి రమణ వచ్చారని విశ్లేషిస్తున్నారు. తెలంగాణలో పార్టీ నిలబడే అవకాశాలు కనుచూపు మేరలో లేవన్న నిశ్చితాభిప్రాయనికి వచ్చిన పలువురు టీటీడీపీ నేతలు ప్రత్యామ్నాయం వెదుక్కునే పనిలో ఉన్నారని చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎల్.రమణ టీఆర్ఎస్లో చేరికకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. మంత్రి హరీశ్‌తో మంతనాలు? తన చేరికపై ఇప్పటికే ఒకటికి రెండుమార్లు సీఎం కేసీఆర్‌తో మాట్లాడిన ఎల్.రమణకు మంత్రి హరీశ్‌తో ‘లంచ్ మీటింగ్’ కూడా జరిగిందని విశ్వసనీయంగా తెలిసింది. సార్వత్రిక ఎన్నికల్లో జగిత్యాల నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎల్.రమణ ఓడిపోయారు. టీఆర్ఎస్ కూడా ఆ స్థానం లో ఓడిపోయింది. జగిత్యాలలో నాయకత్వ లేమి ఉందన్న ఆలోచనతోనే ఎల్.రమణను పార్టీలోకి ఆహ్వానిస్తూ మంతనాలు జరిపారని వినికిడి. ఇక్కడ్నుంచి కాంగ్రెస్‌కు చెందిన జీవన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1994 సార్వత్రిక ఎన్నికల నుంచి మొన్నటి 2014 సార్వత్రిక ఎన్నికల దాకా ప్రధాన పోటీ జీవన్‌రెడ్డి, ఎల్.రమణల మధ్యే కొనసాగుతోంది. మూడో వ్యక్తికి అవకాశం రాలేదు. దీంతో భవిష్యత్ రాజ కీయ అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని టీఆర్ఎస్ సమాలోచనలు జరిపిందని అంటున్నారు. అన్నీ అనుకూలిస్తే కొద్ది రోజుల్లోనే రమణ గులాబీ కండువా కప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఇక ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య చేరికపైనా టీఆర్ఎస్లో ప్రచారం జరుగుతోంది. పాలేరు ఉప ఎన్నికలు ముగిసేలోపే ఆయన టీఆర్ఎస్లో చేరినా ఆశ్చర్యం లేదంటున్నారు. -
వలసవాదులతో నిండిన టీఆర్ఎస్
టీయూడబ్ల్యూజే మీట్ ది ప్రెస్‌లో ఎల్.రమణ, కిషన్‌రెడ్డి ధ్వజం సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఇతర పార్టీల నుంచి చేరిన వలసవాదులతోనే నిండిపోయిం దని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు. అధికార పార్టీకి అభ్యర్థులు లేక టీడీపీ సహా ఇతర పార్టీల నుంచి అప్రజాస్వామికంగా వలసలను ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్(టీయూడబ్ల్యూజే) హైదరాబాద్ లో శుక్రవారం నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో ఎల్.రమణ, కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఎంఐఎం తో టీఆర్ఎస్ కుమ్మక్కైందని, ఇరు పార్టీల రాజకీయ ప్రయోజనాల కోసం డివిజన్ల స్వరూపాన్ని ఇష్టారాజ్యంగా మార్చుకున్నారన్నారు. టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా అధికారమే పరమావధిగా రాజ్యాం గాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయన్నారు. పాతబస్తీని ఓవైసీ కుటుంబం, కొత్త పట్నాన్ని కేసీఆర్ కటుంబం పంచుకొన్నాయన్నారు. టీఆర్ఎస్ నేతలు జీహెచ్ఎంసీ నిధులను దారి మళ్లిస్తున్నారని, మిగులు బడ్జెట్, ధనిక రాష్ట్రం అంటున్నా హైదరాబాద్‌లో చేసిన అభివృద్ధి ఏమిటో కేటాయించిన నిధులెన్నో చెప్పాలన్నారు. రెండు పడక గదుల ఇళ్లు ఇచ్చినట్టు, వాటి ముందు ముగ్గులేసినట్టు రంగుల కలలను అరచేతిలో టీఆర్ఎస్ నేతలు చూపిస్తున్నారన్నారు. స్కైవేల ప్రచారం తప్ప నిధులు మంజూరు చేయలేదన్నారు. టీఆర్ఎస్, మజ్లిస్ కంటే తమ కూటమి ఎక్కువ సీట్లు సాధిస్తుందని, 100 సీట్ల లక్ష్యంతో వ్యూహాత్మకంగా పనిచేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటే హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. హైదరాబాద్ డిజిటైజేషన్‌ను పూర్తిచేసి స్మార్ట్ సిటీగా చేస్తే అవినీతి లేని నగరం అవుతుందన్నారు. సోనియాపై కేసు ఎందుకు పెట్టలేదు.. వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ మాజీ ఎంపీ రాజయ్య ఇంట్లో జరిగిన సంఘటనకు సంబంధించి ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై పోలీసులు కేసు ఎందుకు నమోదు చేయలేదని బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ఆ కుటుంబాన్ని రాహుల్ గాంధీ ఎందుకు పరామర్శించలేదన్నారు. ఆత్మహత్యలపై కేసులు సూసైడ్‌నోట్ చుట్టూ తిరుగుతాయని, రోహిత్ విషయంలోనే కొత్త సంప్రదాయాన్ని అనుసురిస్తున్నారని ఆయన ఆరోపించారు. రోహిత్ లేఖలో కేంద్రం, దత్తాత్రేయ, బీజేపీ ప్రస్తావన లేదన్నారు. ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్ ఉత్తరంపై ఉన్నతస్థాయి విచారణ జరిగితే వాస్తవాలు తేలిపోతాయన్నారు. ఐజేయూ మాజీ సెక్రెటరీ జనరల్ కె.శ్రీనివాస్‌రెడ్డి, సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, ప్రెస్ కౌన్సిల్ సభ్యుడు కె.అమర్నాథ్, ఐజేయూ నేతలు నరేందర్‌రెడ్డి, కె.విరాహత్ అలీ, యాదగిరి, కోటిరెడ్డి పాల్గొన్నారు. -
బాబు దగ్గరే తేల్చుకుందాం!
-
బాబు దగ్గరే తేల్చుకుందాం!
- అంతర్గత విభేదాలపై తెలంగాణ తెలుగు తమ్ముళ్ల యోచన - సోమవారం ఉదయం చంద్రబాబు అపాయింట్మెంట్ కోరిన ముఖ్యనేతలు సాక్షి, హైదరాబాద్: కీలక నేతల మధ్య విభేధాలు రచ్చకెక్కడంతో విషయాన్ని ఇక అధినేత చంద్రబాబు నాయుడు వద్దే తేల్చుకోవాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఆధిపత్య పోరు చివరకు వ్యక్తిగత గొడవలకు దారితీస్తుండటం పార్టీ భవిష్యత్ కు ప్రమాదకరమని, ఇంటి గొడవలను పరిష్కరించుకోకుంటే నిత్య ఇబ్బందులు తప్పవన్న తీర్మానానికి వచ్చారు. కలిసికట్టుగానో, విడివిడిగానో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును కలిసి సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నంలో ఉన్నట్లు తెలిసింది. వీలైనంత త్వరగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ కావాలని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ మేరకు సోమవారం ఉదయం పదకొండు గంటలకు బాబుతో భేటీకి సమయం కోరారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పార్టీని గట్టెక్కించేందుకు ప్రయత్నించాల్సిన తరుణంలో పార్టీలో ఆధిపత్యం కోసం కొందరు తాపత్రయ పడుతున్న తీరుపై పార్టీ సీనియర్లు పెదవి విరుస్తున్నారు. టీ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, పార్టీ తెలంగాణ కమిటీ అధ్యక్షుడు ఎల్.రమణతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి మధ్య శనివారం రాత్రి జరిగిన చోటు చేసుకున్న గొడవ పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది. రేవంత్‌రెడ్డి తీరుపై పార్టీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు రమణ సహా అనేక మంది సీనియర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీ అధ్యక్షుడినైన తన పట్ల రేవంత్ కనీస మర్యాద లేకుండా క్రమశిక్షణ పరిధి దాటి వ్యవహరిస్తున్నారని రమణ తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ పార్లమెంటు స్థానం, నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగాల్సి ఉన్న సమయంలో పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళ్లేలా జరుగుతున్న సంఘటనలకు బ్రేక్ వేయాలని రమణ భావిస్తున్నారు. పార్టీలో జరుగుతున్న కుమ్ములాటలతో పాటు, వరంగల్ ఎంపీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో అనుసరించాల్సి వ్యూహంపైనా బాబుతో భేటీలో చర్చించనున్నారని సమాచారం. ఈ స్థానం నుంచి బీజేపీ-టీడీపీల ఉమ్మడి అభ్యర్ధిని బరిలోకి దింపనున్నారు. వరంగల్ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిని రంగంలోకి దించాలని ఆ జిల్లాకు చెందిన ఎర్రబెల్లి దయాకర్‌రావు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. బీజేపీకి ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, టీడీపీకి గెలుపు అవకాశాలు ఉంటాయని ఆయన వాదిస్తున్నారు. చంద్రబాబుతో సమావేశం తరువాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నదని పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
'సైకిల్ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోండి'
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ గుర్తుపై ఎమ్మెల్యేలుగా గెలిచి టీఆర్ఎస్లో చేరిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ శాసనసభ స్పీకర్ ఎస్. మధుసూదనాచారికి విజ్ఞప్తి చేసింది. పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు ఎల్. రమణ, టీడీపీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్ రావు, జి.సాయన్న, మాగంటి గోపీనాథ్, ప్రకాశ్ గౌడ్, వివేకానంద, కృష్ణారావు, గాంధీ తదితరులు బుధవారం మధ్యాహ్నం అసెంబ్లీలో స్పీకర్‌ను కలిశారు. ఈ సందర్భంగా పార్టీ ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేసే అంశంపై చర్చించారు. పార్లమెంటరీ సంప్రదాయాన్ని కాపాడాలని కోరారు. గతంలో స్పీకర్లుగా పనిచేసిన నేతలు వ్యహరించిన తీరును గుర్తు చేశారు. ఒకపార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మరోపార్టీలో చేరినట్లు అన్ని సాక్ష్యాలు అందజేసినా వారిని సభ్యులుగా కొనసాగించడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ మంత్రిగా కొనసాగుతూ తన రాజీనామాను స్పీకర్ పంపానని, ఆయనే దాన్ని ఆమోదించడం లేదని స్పీకర్‌పై నెపాన్ని నెట్టేస్తున్నారని వివరించారు. ప్రజాస్వామ్యం, పార్టమెంటరీ వ్యవస్థను ఖూనీ చేస్తున్న టీఆర్ఎస్: ఎర్రబెల్లి అధికార టీ ఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని, పార్లమెంటరీ వ్యవస్థను ఖూనీ చేసే విధంగా వ్యవహరిస్తుందని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని ఇప్పటికే పలుమార్లు స్పీకర్, గవర్నర్లను కోరినా పట్టించుకోవడం లేదన్నారు. గతంలో మాట్లాడితే రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు వెళ్లే కేసీఆర్‌కు ఇప్పుడు ఓటమి భయం పట్టుకుందని, అందుకే రాజీనామాలు చేయించకుండా అడ్డుకుంటున్నారన్నారు. డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న పద్మా దేవేందర్ రెడ్డి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధమన్నారు. గతంలో ఇదే హోదాలో పనిచేసిన కేసీఆర్ గానీ, భట్టి విక్రమార్క మొదలైన వారు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండేవారని గుర్తు చేశారు. టీడీఎల్పీ ఉపనేత రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఎంపీగా జీతం తీసుకుంటున్న కడియం శ్రీహరి రాష్ట్ర మంత్రిగా ఇక్కడి సౌకర్యాలు ఎలా పొందుతారని ప్రశ్నించారు. గతంలో జయాబచ్చన్, సోనియాగాంధీ వంటి వారు వేరే హోదాల్లో ఉంటే రాజీనామా చేసి మళ్లీ పోటీ చేశారని గుర్తు చేశారు. మంత్రి జగదీశ్‌రెడ్డి మతిలేని మాటలు మాట్లాడుతున్నారని, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు గానీ, ఎంపీలు గానీ ఎవరూ టీడీపీలో చేరలేద ని, ఎస్పీవై రెడ్డి, బుట్టా రేణుక ఒకసారి చంద్రబాబును కలిసినా, ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఎంపీలుగానే కొనసాగుతున్నారని తెలిపారు. -
మారడం కాదు.. గెలవండి
- పార్టీ మారిన ఎమ్మెల్యేలకు చంద్రబాబు సవాల్ - మా పార్టీ వాళ్లకే మంత్రి పదవులిస్తున్నారు: ఎర్రబెల్లి, ఎల్. రమణ సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘తెలుగుదేశం పార్టీని చూస్తుంటే కేసీఆర్‌కు వణుకు పుడుతోంది. అందుకోసమే మంత్రి పదవులు ఎరవేసి మా ఎమ్మెల్యేలను లాక్కుంటున్నాడు’ అని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో సోమవారం జరిగిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రకాశ్‌గౌడ్ ప్రమాణ స్వీకారోత్సవంలో చంద్రబాబు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీకి నాయకులు కరువయ్యారని, అందుకోసమే టీడీపీ ప్రతినిధులను పశువుల్లా కొనుగోలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. నాయకులు పోయినంత మాత్రాన పార్టీ బలహీనపడదని, తెలుగుదేశం సంస్థాగతంగా బలమైన పార్టీ అని అన్నారు. ఎంతమంది నాయకులు వెళ్లిపోయినా కొత్త నాయకులను తయారుచేసే శక్తి టీడీపీకి ఉందన్నారు. తెలంగాణను, తమ హయాంలోనే హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామన్నారు. పార్టీ మారడం కాదు.. దమ్ముంటే గెలిచి చూపండి’ అని చంద్రబాబు సవాల్ విసిరారు. రాజకీయ భవిష్యత్తును ప్రసాదించిన పార్టీని వదిలివెళ్లిన ఎమ్మెల్యేలకు పుట్టగతులుండవని విమర్శిం చారు. రెండు ప్రాంతాలూ తనకు సమానమేనని, కరెంట్, నీటి అంశాలపై చేర్చించేందుకు సిద్ధమేనన్నారు. కేసీఆర్‌కు తాను శిక్షణ ఇస్తే.. ఆయన నాకు క్లాసులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. అనంతరం టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ టీడీపీ జెండాపై గెలిచిన వాళ్లు.. గులాబీ గూటికి వెళ్లి విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. బలమైన కార్యకర్తలున్న టీడీపీ మరింత బలపడడం ఖాయమన్నారు. పార్టీకి పూర్వవైభవం ఖాయమని, వచ్చే ఎన్నికల్లో అధికారం తధ్యమని అన్నారు. ఆ తర్వాత టీడీపీ ప్రతిపక్షనేత ఎర్రబెల్లి దరయాకర్రావు మాట్లాడుతూ టీఆర్ఎస్లో చేరిన టీడీపీ ఎమ్మెల్యేలకు దమ్ముంటే తిరిగి ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందాలన్నారు. అలా గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. టీడీపీ నేతలకు పదవుల పందేరం వేసి టీఆర్ఎస్ ప్రతినిధులకు కేసీఆర్ మొండిచెయ్యి చూపిస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వివేకానంద, గాంధీ, మాధవరం కృష్ణారావు, సీనియర్ నాయకులు సుభాష్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు ఏపీ టీడీపీకే అధ్యక్షుడు
టీడీపీ అధికారిక వెబ్సైట్లో పార్టీ కమిటీల విభజన సాక్షి, హైదరాబాద్: సమైక్య రాష్ట్రానికి 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌కు సీఎం అయిన చంద్రబాబు పార్టీలో సైతం అదేస్థాయికి చేరిపోయారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలుగుదేశంను జాతీయపార్టీగా మార్చాలన్న ఆలోచన కార్యరూపం దాల్చకపోవడంతో చంద్రబాబు పార్టీ ఏపీ శాఖకు మాత్రమే అధ్యక్షుడిగా మిగిలిపోయారు. ఈ విషయాన్ని తెలుగుదేశం అధికారిక వెబ్సైట్ (డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.తెలుగుదేశం.ఓఆర్జీ) స్పష్టం చేస్తోంది. పార్టీ వెబ్‌సైట్‌ను ఇటీవలే అప్డేట్ చేసిన ఆ పార్టీ ఐటీ విభాగం 2013లో ప్రకటించిన ఉమ్మడి రాష్ట్ర పార్టీ కమిటీని ప్రాంతాల వారీగా విభజించారు. ఆంధ్రప్రదేశ్ కమిటీకి అధ్యక్షుడిగా చంద్రబాబు(చిత్తూరు జిల్లా) పేరును స్పష్టంగా పేర్కొంటూ ఆ రాష్ట్ర పరిధిలోని 13 జిల్లాలకు చెందిన నేతలకు ఉన్న పదవులను వరుసగా కేటాయించారు. తెలంగాణ శాఖకు సంబంధించి అధ్యక్షుడిగా కరీంనగర్‌కు చెందిన ఎల్.రమణ పేరును వెబ్సైట్లో పొందుపరిచారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వరంగల్ జిల్లాకు చెందిన ఎర్రబెల్లి దయాకర్‌రావును చేర్చి మిగతా పదవులకు ఉమ్మడి రాష్ట్ర కమిటీ నుంచి వేరుచేసి పొందుపరిచారు. కాగా, ఎన్నికల ముందు తెలంగాణ శాఖకు ఏర్పాటు చేసిన తాత్కాలిక కమిటీలో పార్టీ కన్వీనర్‌గా ఉన్న మోత్కుపల్లి నర్సింహులు పదవి ఇప్పుడు లేదు. ఆయనను పొలిట్‌బ్యూరో సభ్యుడిగానే పేర్కొన్నారు. -
'సర్కారు భూములు అమ్మితే సహించం'
హైదరాబాద్: రంగారెడ్డి, హైదరాబాద్ మినహా తెలంగాణ జిల్లాల్లో టీఆర్ఎస్ సర్కారు భూములు అమ్మితే సహించబోమని టీటీడీపీ నేత ఎల్ రమణ హెచ్చరించారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన తర్వాతే భూముల అమ్మకంపై నిర్ణయం తీసుకోవాలన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
అమరుల ఆత్మలు ఘోషిస్తున్నాయి
* టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్రం కావాలనే భావన కూడా లేని వ్యక్తులకు రాష్ట్ర కేబినెట్లో చోటు కల్పించినందుకు, బలిదానాలు చేసిన అమరుల ఆత్మలు ఘోషిస్తున్నాయని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. మంగళవారం సచివాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యమానికి ఊతమిచ్చిన మహిళలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చిన్నచూపు చూశారని విమర్శించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా కేబినెట్లో కనీసం ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వకుండా సీఎం కేసీఆర్ సరికొత్త సంప్రదాయానికి తెరతీశారని చెప్పారు. ఒకటి, రెండు సామాజిక వర్గాలకే ప్రాధాన్యతనిచ్చి, తెలుగుదేశం ప్రభుత్వానికి ముందు పాలనను టీఆర్ఎస్ పార్టీ తిరిగి తెచ్చిందన్నారు. బడుగు, బలహీన వర్గాలకు అన్యాయం చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజాకోర్టులో శిక్ష పడడం ఖాయమన్నారు.