సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ సొంత ఎజెండాతో నియంతలాగా వ్యవహరిస్తున్నారని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ విమర్శించారు. మంత్రులతో, ఎమ్మెల్యేలను కూడా ఆయన పట్టించుకోవడంలేదన్నారు. దొరల గడీలకు ప్రతిరూపంగా కోట్ల రూపాయలను దుర్వినియోగం చేస్తూ ప్రగతి భవన్ పేరిట పైరవీ భవన్ కట్టుకున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీకి ఉన్న కార్యకర్తల బలం రాష్ట్రంలో మరే పార్టీకీ లేదన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే మంత్రివర్గంలో 12 మంది ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు, నలుగురు మహిళలకు చోటిస్తామని చెప్పారు.
ప్రభుత్వంపై యుద్ధమే: రేవంత్
రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం రాబందుల్లా పీల్చుకు తింటోందని టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామకాల నుంచి రైతులు, నిరుద్యోగుల దాకా అన్నింటా మోసగించారని ఆరోపించారు. అమరుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం, ఇంటికో ఉద్యోగం, భూమి, ట్యాంక్‌బండ్‌పై స్తూపాల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్‌ది రైతు ప్రభుత్వం కాదని, రాబందుల ప్రభుత్వమని ఆరోపించారు. ఉద్యోగాల భర్తీకి కేలండర్ విడుదల చేయకుంటే ప్రభుత్వంపై యుద్ధం చేస్తామని హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణకోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి ఎందుకు తీసుకెళ్లడం లేదని ప్రశ్నించారు.
పలు తీర్మానాల ఆమోదం
టీడీపీ మహానాడులో పలు తీర్మానాలను ఆమోదించారు. సాగు, మద్దతు ధర, రైతు ఆత్మహత్యలు, రిజర్వేషన్లు, నిరుద్యోగం, విద్యారంగం, ఫీజు రీయింబర్సుమెంటు బకాయిలు, ఎన్నికల హామీల అమలులో తెలంగాణ రాష్ట్ర సమితి వైఫల్యాలు, మీడియాపై ఆంక్షలు తదితర అంశాలపై టీడీపీ సీనియర్ నాయకులు ప్రసంగించారు.
నియంతలా కేసీఆర్ పాలన: ఎల్.రమణ
Published Thu, May 25 2017 2:12 AM | Last Updated on Tue, Aug 14 2018 11:02 AM
Advertisement