
విడుదల అనంతరం మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి
సాక్షి, కొడంగల్: ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ పోలీసుల నిర్భంధాలు.. అరాచాకాలు.. అక్రమాలు, రూ. 150 కోట్ల లావాదేవీలతో కొడంగల్ నియోజకవర్గంపై యుద్ధం ప్రకటించారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ ప్రజాశీర్వాద సభ నేపథ్యంలో ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు అనంతరం ఆయన ఇంటి వద్ద వదిలేశారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. కేసీఆర్ 2009లో మహబూబ్‌నగర్ ఎంపీగా ఎన్నికయ్యారని, 2014లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారన్నారు. ఈ 9 ఏళ్లు కేసీఆర్ ఏనాడు కొడంగల్ ప్రజలను కన్నెత్తి చూడలేదని, కనీసం వారి జీవన విధానం ఎలా ఉందో కూడా కనుక్కునే ప్రయత్నం చేయలేదని దుయ్యబట్టారు. కానీ చైతన్యవంతులైన కొడంగల్ ప్రజలు.. వారు నాటిన మొక్క తన గళాన్ని ఢిల్లీ వరకు వినిపించడంతో అణగదొక్కాలని ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
కొడంగల్ ప్రజల అభిమానాన్ని కొనుక్కోవాలని గత ఏడాది నుంచి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, దీనికోసం రూ.200 కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. అయినా కేసీఆర్ కోరిక నెరవేరకపోవడంతో.. అక్రమాలకు పాల్పడుతూ.. నియమ నిబంధనలు ఉల్లంఘించి కొడంగల్‌లో గెలవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఈ కుట్రలను కొడంగల్ ప్రజలు తిప్పికొట్టడంతో.. పోలీసులు, ఎన్నికల నిర్వాహణ అధికారులను మచ్చిక చేసుకుని తన అనచరులు, కుటుంబ సభ్యులపై దాడులు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీ మద్దతుతో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూస్తున్నారని, కొడంగల్‌లో 144 సెక్షన్ విధించినప్పుడు కేసీఆర్ సభ ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. కాగ్రెస్ కార్యకర్తలకే 144 సెక్షన్ వర్తిస్తుందా? అని నిలదీశారు. హైకోర్టులో కేసు వేసిన నేపథ్యంలోనే తనను పోలీసులు విడుదల చేసారని, రాబోయే 48 గంటల్లో టీఆర్‌ఎస్ శ్రేణులు దాడులు జరపవచ్చని అప్రమత్తంగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. అధికారంలోకి వచ్చాక చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
చదవండి: రేవంత్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలి: రజత్ కుమార్
Comments
Please login to add a commentAdd a comment