55 దాటతాయి.. పందెం ఎంత? | Betting On Telangana Elections Results | Sakshi
Sakshi News home page

55 దాటతాయి.. పందెం ఎంత?

Published Mon, Dec 10 2018 1:27 AM | Last Updated on Mon, Dec 10 2018 5:37 AM

Betting On Telangana Elections Results - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) జోరు కొనసాగుతుందని అన్ని జాతీయ చానళ్ల ఎగ్జిట్‌ పోల్స్‌ ద్వారా అంచనా వేసినా, కూటమి గెలుస్తుందన్న లగడపాటి జోస్యంతో వందల కోట్ల మేర బెట్టింగులు సాగుతున్నాయి. ఎవరు అధికారంలోకి వస్తారు.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి.. గజ్వేల్‌లో సీఎం కె.చంద్రశేఖర్‌రావు మెజారిటీ ఎంత? కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి గెలుస్తారా? మధిరలో భట్టి విక్రమార్క బయటపడతారా? వీటి మీదే ఇప్పుడు బెట్టింగ్‌లు పెడుతున్నారు. తెలంగాణ ఎన్నికలకు సంబంధించి బెట్టింగుల్లో పాలు పంచుకుంటున్న ఓ వ్యక్తి, ముంబై కేంద్రంగా బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ఓ సంస్థ నుంచి అందిన వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి.

ముంబై కేంద్రంగా బెట్టింగులు నిర్వహిస్తున్న ఈ సంస్థ ఏపీలో భీమవరం, తిరుపతి, తెలంగాణలోని వరంగల్‌ను ఉపకేంద్రాలుగా చేసుకొని వందల కోట్ల రూపాయల మేర బెట్టింగ్‌ వ్యాపారం చేసినట్లు తెలిసింది. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నదాని కంటే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్న దానిపైనే బెట్టింగ్‌లు సాగాయి. కీలకమైన నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారన్నదానిపై ఒక రకమైన బెట్టింగ్‌లు సాగితే, గెలుస్తారనుకున్న అభ్యర్థికి ఎంత మెజారిటీ రావచ్చన్న దానిపైనా బెట్టింగ్‌లు పెట్టారు. ఉదాహరణకు గద్వాలలో డీకే అరుణ గెలుస్తారని బెట్టింగ్‌కు ఎవరైనా ముందుకు వస్తే దానికి అనుబంధంగా ఎంతమెజారిటీ వస్తుందన్న దానిపైన బోలెడు మంది బెట్టింగ్‌లు పెట్టారు. 

రూపాయికి రెండు రూపాయిలు
జాతీయ చానళ్లు ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రసారం చేయడానికి ముందు రోజు దాకా టీఆర్‌ఎస్‌కు 55 సీట్లు వస్తాయని ఎవరైనా రూపాయి పందెం కాస్తే తిరిగి రూపాయి ఇవ్వడానికి ముందుకు వచ్చేవారు ఎక్కువగా కనిపించారు. ఎగ్జిట్‌ పోల్స్‌ తరువాత టీఆర్‌ఎస్‌కు 56 సీట్లు వస్తాయని రూపాయి బెట్టింగ్‌ కాస్తే అర్ధ రూపాయి మాత్రమే ఇవ్వడానికి ముందుకు వచ్చారు. టీఆర్‌ఎస్‌కు 60 సీట్లు వస్తాయని రూపాయి పెడితే అవతల వైపు నుంచి 75 పైసలు ఇస్తామంటున్నారు. టీఆర్‌ఎస్‌కు 65 సీట్లు వస్తాయని పందెం కట్టిన వారికి రూపాయికి రూపాయి నడుస్తోంది. ఆ పార్టీకి 66 దాటుతాయని ఎవరైనా రూపాయి పెడితే 2 రూపాయలు ఇవ్వడానికి చాలామంది ముందుకు వచ్చారు.

అదేవిధంగా మహాకూటమికి 40 సీట్లు మించి రావని రూపాయి పెడితే 75 పైసలు, 50 సీట్లు వస్తాయని పెడితే 2 రూపాయలు ఇవ్వడమన్నదాని మీద పందేలు నడుస్తున్నాయి. కూటమికి 55 దాటుతాయని రూపాయి పెడితే 3 రూపాయలు ఇవ్వడానికి కూడా ముందుకు వస్తున్నవారూ ఉన్నారు. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ సర్వే వెలువరించిన రోజు అర్ధరాత్రి దాకా కూటమికి 55 సీట్లు దాటుతాయంటే రూపాయి పెడితే రూపాయి ఇవ్వడానికి చాలామంది పోటీపడ్డారు. అయితే, లగడపాటి ఎగ్జిట్‌ పోల్‌ చేయలేదని, ఒక అంచనాతో సర్వే వివరాలు వెల్లడించారని వార్తలు రావడంతో శనివారం తెల్లవారేసరికి పందాల్లో మార్పు వచ్చింది. టీఆర్‌ఎస్‌కు 55 దాటుతాయని పందెం పెట్టినవాళ్లే అధికంగా ఉన్నారు. 

 రేవంత్‌ గెలుస్తారా? కేసీఆర్‌ మెజారిటీ ఎంత? 

టీఆర్‌ఎస్, కూటమికి ఎన్ని సీట్లు వస్తాయన్నదాని తరువాత బెట్టింగుల్లో రెండు అంశాలు ఆసక్తి రేపుతున్నాయి. కొడంగల్‌ నుంచి రేవంత్‌రెడ్డి గెలుస్తారని రూపాయి పెడితే 75 పైసలు తిరిగి ఇవ్వడానికి సిద్ధపడుతున్నవారు ఉన్నారు. రేవంత్‌ ఓడిపోతారని రూపాయి పందెం కాస్తే రూపాయి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి 5 వేల మెజారిటీ వస్తుందని బెట్టింగ్‌ పెడితే రూపాయికి 2 రూపాయలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నవారూ ఉన్నారు. గద్వాలలోనూ అంతే. డీకే అరుణ గెలుస్తుందని పందెం కాసే వారికి రూపాయికి రూపాయి నడుస్తోంది. గజ్వేల్‌లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు 25 వేల మెజారిటీ రాదని ఎవరైనా రూపాయి పెడితే రూపాయి తిరిగి ఇచ్చేందుకు బెట్టింగులు నడుస్తున్నాయి.

కేసీఆర్‌ మెజారిటీ 50 వేలు వస్తుందని రూపాయి పెడితే 2 రూపాయలు ఇస్తామనే వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న బెట్టింగ్‌లు ఆదివారం ఉదయం నుంచి మొదలయ్యాయి. కూటమిప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఎవరైనా రూపాయి పెడితే 2 రూపాయలు ఇవ్వడానికి బెట్టింగ్‌ వీరులు ఆసక్తి చూపుతున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని రూపాయి పెడుతున్న వారికి అర్ధ రూపాయి మాత్రమే ఇస్తామంటున్నారు. బీజేపీ, ఇండిపెండెంట్లు లేదా మజ్లిస్‌ సహకారంతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని రూపాయి పెట్టిన వారికి రూపాయి ఇస్తామంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement