బాబు దగ్గరే తేల్చుకుందాం!
- అంతర్గత విభేదాలపై తెలంగాణ తెలుగు తమ్ముళ్ల యోచన
- సోమవారం ఉదయం చంద్రబాబు అపాయింట్మెంట్ కోరిన ముఖ్యనేతలు
సాక్షి, హైదరాబాద్: కీలక నేతల మధ్య విభేధాలు రచ్చకెక్కడంతో విషయాన్ని ఇక అధినేత చంద్రబాబు నాయుడు వద్దే తేల్చుకోవాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఆధిపత్య పోరు చివరకు వ్యక్తిగత గొడవలకు దారితీస్తుండటం పార్టీ భవిష్యత్ కు ప్రమాదకరమని, ఇంటి గొడవలను పరిష్కరించుకోకుంటే నిత్య ఇబ్బందులు తప్పవన్న తీర్మానానికి వచ్చారు. కలిసికట్టుగానో, విడివిడిగానో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును కలిసి సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నంలో ఉన్నట్లు తెలిసింది.
వీలైనంత త్వరగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ కావాలని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ మేరకు సోమవారం ఉదయం పదకొండు గంటలకు బాబుతో భేటీకి సమయం కోరారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పార్టీని గట్టెక్కించేందుకు ప్రయత్నించాల్సిన తరుణంలో పార్టీలో ఆధిపత్యం కోసం కొందరు తాపత్రయ పడుతున్న తీరుపై పార్టీ సీనియర్లు పెదవి విరుస్తున్నారు.
టీ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, పార్టీ తెలంగాణ కమిటీ అధ్యక్షుడు ఎల్.రమణతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి మధ్య శనివారం రాత్రి జరిగిన చోటు చేసుకున్న గొడవ పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది. రేవంత్‌రెడ్డి తీరుపై పార్టీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు రమణ సహా అనేక మంది సీనియర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీ అధ్యక్షుడినైన తన పట్ల రేవంత్ కనీస మర్యాద లేకుండా క్రమశిక్షణ పరిధి దాటి వ్యవహరిస్తున్నారని రమణ తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ పార్లమెంటు స్థానం, నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగాల్సి ఉన్న సమయంలో పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళ్లేలా జరుగుతున్న సంఘటనలకు బ్రేక్ వేయాలని రమణ భావిస్తున్నారు.
పార్టీలో జరుగుతున్న కుమ్ములాటలతో పాటు, వరంగల్ ఎంపీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో అనుసరించాల్సి వ్యూహంపైనా బాబుతో భేటీలో చర్చించనున్నారని సమాచారం. ఈ స్థానం నుంచి బీజేపీ-టీడీపీల ఉమ్మడి అభ్యర్ధిని బరిలోకి దింపనున్నారు. వరంగల్ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిని రంగంలోకి దించాలని ఆ జిల్లాకు చెందిన ఎర్రబెల్లి దయాకర్‌రావు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. బీజేపీకి ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, టీడీపీకి గెలుపు అవకాశాలు ఉంటాయని ఆయన వాదిస్తున్నారు. చంద్రబాబుతో సమావేశం తరువాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నదని పార్టీ వర్గాలు వెల్లడించాయి.