
సాక్షి, అమరావతి: అప్పట్లో నాకు వడ్డాణం ఇవ్వనందుకే తనకు మంత్రి పదవి రాలేదని 27 ఏళ్ల తర్వాత ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించడం విడ్డూరంగా ఉందని తెలుగు–సంస్కృత అకాడమీ చైర్‌పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. ‘వైశ్రాయ్ సంఘటనలో ప్రధాన పాత్ర పోషించిన నీకు చంద్రబాబు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు’ అని ఎర్రబెల్లిని ఆమె నిలదీశారు. ‘చంద్రబాబు భార్య కూడా వజ్రాలు, వైఢూర్యాలు, వడ్డాణాలు అడిగారా? అందుకనే మంత్రి పదవి రాలేదా? అబద్ధాలు చెప్పడానికి సిగ్గుగా లేదా’ అని ఎర్రబెల్లిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశ్వాసఘాతకులు, ఎన్టీఆర్ హంతకులంతా మళ్లీ కలుస్తున్నారని.. తెలంగాణ సీఎం కేసీఆర్ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ సోమవారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్టీఆర్ అధికారంలోకొచ్చిన 8 నెలల్లోనే.. తనను బూచిగా చూపి.. చంద్రబాబును సీఎంను చేసేందుకు రామోజీరావు, ఏబీఎన్ రాధాకృష్ణ నిర్వహించిన పాత్రను ఆడియోలు, వీడియోలు ద్వారా ఎన్టీఆర్ అప్పట్లోనే లోకానికి తెలియజేశారని గుర్తుచేశారు. అప్పట్లో ఓ హోటల్లో జర్నలిస్టులకు డబ్బులు పంపిణీ చేసి.. ఎన్టీఆర్‌కు, నాకు వ్యతిరేకంగా, చంద్రబాబుకు అనుకూలంగా వార్తలు రాయించిన బ్రోకర్ రాధాకృష్ణ అని ధ్వజమెత్తారు.
‘ఆదివారం ఏబీఎన్‌లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో తెలంగాణ మంత్రి, ఇప్పటికీ టీడీపీ పురిటి కంపును వదల్చుకోని ఎర్రబెల్లి దయాకర్‌రావు నాపై చేసిన వ్యాఖ్యలు చూశాక ఈ ప్రకటన చేస్తున్నా.. ఎర్రబెల్లి దయాకర్‌రావు మనిషైతే గుడిలో దేవుడి ముందు తన బిడ్డలు, మనవలపై ప్రమాణం చేసి.. నేను అతడిని వడ్డాణం అడిగానని చెప్పగలరా’ అని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. ఎన్టీఆర్ ఏ నమ్మకంతో తనను వివాహం చేసుకున్నారో.. చివరి వరకూ ఆ నమ్మకాన్ని కాపాడుకుంటూ వచ్చానని తెలిపారు. ఎన్టీఆర్ ఇచ్చిన ఆస్తిని కూడా నిలబెట్టుకోలేక.. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న తనను సీఎం వైఎస్ జగన్ ఓ బిడ్డలా ఆదుకుని నిలబెట్టారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment