చంద్రబాబు అంటే ఇష్టమే కానీ టీడీపీ బతకదు:ఎర్రబెల్లి
హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్ గా వ్యవహరిస్తోన్న సీనియర్ నేత, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కూడా ఆయన వెంట గులాబీ గూటికి చేరుకున్నారు. బుధవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం కేసీఆర్.. ఎర్రబెల్లి, ప్రకాశ్ గౌడ్ లకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చేరిక అనంతరం ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు.
తెలుగుదేశం పార్టీ అంటే ఇప్పటికీ తనకు ప్రేమ ఉందని, అయితే టీఆర్ఎస్ తోనే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నట్లు ఎర్రబెల్లి చెప్పారు. టీడీపీ ఇక్కడ బతకలేని పరిస్థితి అర్థమయినందునే తాను, ప్రకాశ్ గౌడ్ తో కలిసి పార్టీ మారినట్లు వివరించారు. మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేలను కూడా టీఆర్ఎస్ లో చేరాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.
'టీడీపీని వీడటం బాధగా ఉంది. చంద్రబాబంటే ఇప్పటికీ ఇష్టమే. కానీ ఇక్కడ పార్టీ బతకదు. ప్రజలు టీఆర్ఎస్ వెంట ఉన్నారు. మెన్నటి గ్రేటర్ ఎన్నికల్లోనూ ఇది స్పష్టంగా వెల్లడైంది. అందుకే ఈ పార్టీలో చేరా. కార్యకర్తలు, నాయకులు క్షమించి, సహకరించాలని కోరుతున్నా' అంటూ ఉద్వేగంగా మాట్లాడారు ఎర్రబెల్లి.
పార్టీ లేదా ప్రభుత్వంలో మీరు కీలకపాత్ర పోషించనున్నారా? అన్న విలేకరుల ప్రశ్నకు బదిలిస్తూ.. అలాంటి హామీలేవీ పొందలేదని స్పష్టం చేశారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనా తాను అనేక పదవులు చేపట్టానని గుర్తు చేశారు. ఇప్పటికి క్యాంప్ ఆఫీస్ లో కండువా కప్పుకున్నప్పటికీ త్వరలోనే వరంగల్ లోగానీ, హైదరాబాద్ లో గానీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ఎర్రబెల్లి చెప్పారు.