వెంకయ్య, చంద్రబాబు అనుకుంటే వర్గీకరణ కష్టం కాదు
- ఎస్సీ వర్గీకరణకు సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారు
- తెలంగాణ ఎమ్మార్పీఎస్ మహాధర్నాలో మంత్రి కడియం శ్రీహరి
- కొన్ని పార్టీలు వర్గీకరణను రాజకీయం చేస్తున్నాయని మండిపాటు
హైదరాబాద్: ‘‘కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అనుకుంటే ఎస్సీ వర్గీకరణకు చట్టబ ద్ధత కష్టం కాదు. కావాల్సిన పనులను ఇరువురూ కలసి చేసుకుంటున్నారు. వర్గీకరణ కోసం వారు ఎందుకు కలవడం లేదు’’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రశ్నించారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరించాలని, డప్పుకు, చెప్పుకు రూ.రెండు వేల పింఛన్ ఇవ్వాలనే డిమాండ్‌తో తెలంగాణ ఎమ్మార్పీ ఎస్ ఆధ్వర్యంలో బుధవారం ఇందిరా పార్కు వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో మంత్రులు ఈటల రాజేందర్, జగదీశ్‌రెడ్డితో పాటు కడియం శ్రీహరి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణకు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్త శుద్ధితో ఉన్నారని, అన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలకతీతంగా ప్రధాని మోదీపై ఒత్తిడి తెస్తేనే వర్గీకరణ సాధ్యమవుతుందని అన్నారు.
మాదిగల డప్పు, చెప్పుకు రూ.రెండు వేల పింఛన్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి సాను కూలంగా స్పందించారని, ప్రభుత్వ పరిశీల నలో ఉన్న పింఛన్ అమలు కోసం తాము కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణకు టీఆర్‌ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నా రని, అందులో భాగంగానే రాష్ట్ర అసెంబ్లీలో వర్గీకరణ కోసం ఏకగ్రీవంగా తీర్మానం చేయిం చి కేంద్రానికి పంపారని చెప్పారు. గతేడాది మేలో ముఖ్యమంత్రితో పాటు తాను ప్రధా నిని కలసిన సమయంలో వర్గీకరణ అంశాన్ని సీఎం కేసీఆర్ ప్రస్తావించి మాదిగలు, ఉపకులాలకు జరుగుతున్న నష్టాన్ని వివరించారని చెప్పారు. ఇతర రాష్ట్రాల అభిప్రాయాలతో సంబంధం లేకుండా తెలంగాణకు అవకాశం ఇవ్వాలని ప్రధానిని తాము కోరామన్నారు.
వర్గీకరణపై కొన్ని పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని, పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ వర్గీకరణ ఎందుకు చేయలేదని, టీటీడీపీ నాయకులు ఏపీ అసెంబ్లీలో ఎందుకు తీర్మానం చేయించలేదని, అధికారంలోకి వస్తే వంద రోజుల్లో బిల్లు పెడతామని చెప్పిన బీజేపీ రెండున్నరేళ్లుగా ఎందుకు బిల్లు పెట్టలేదని ప్రశ్నించారు. వీలైనంత త్వరలో అఖిల పక్షంతో ప్రధానిని కలుస్తామని ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించారని గుర్తుచేశారు. మాదిగలు, మాదిగ ఉపకులాలకు న్యాయం చేయడానికి టీఆర్‌ఎస్ కట్టుబడి ఉందని, జీవో 183ను తెలంగాణలో అమలు చేస్తామని కడియం చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మార్పీ ఎస్ అధ్యక్షుడు యాతాకుల భాస్కర్, జాతీయ ప్రధాన కార్యదర్శి మేడి పాపయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ వంగపల్లి భాస్కర్, జాతీయ అధ్యక్షుడు సుంకపాక దేవయ్య, నాయకులు మేకల నరేందర్, పి.రామకృష్ణ, రాజమౌళి, మల్లికార్జున్, రంగన్న, కిష్టయ్య, మంగేష్, కనకరాజ్, వెంకట్, అలెగ్జాండర్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.