టీఆర్‌ఎస్‌తో పొత్తుకు టీ-దేశం సందేశం! | TTDP ready to coil with TRS | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌తో పొత్తుకు టీ-దేశం సందేశం!

Published Thu, Feb 9 2017 1:48 AM | Last Updated on Tue, Aug 14 2018 11:02 AM

టీఆర్‌ఎస్‌తో పొత్తుకు టీ-దేశం సందేశం! - Sakshi

టీఆర్‌ఎస్‌తో పొత్తుకు టీ-దేశం సందేశం!

- అధికార పార్టీతో చెలిమికి ఉవ్విళ్లూరుతున్న తమ్ముళ్లు
- తెలంగాణలో పార్టీని కాపాడుకునే ప్రయత్నాలు
- రంగంలోకి దిగిన టీడీపీ సీనియర్లు
- మంత్రి తుమ్మల నేతృత్వంలో సీఎం కేసీఆర్‌తో భేటీ
- సమావేశంలో పాల్గొన్న నిజామాబాద్‌కు చెందిన మాజీ మంత్రి, ఏపీ మంత్రి, ఓ మీడియా బాస్‌
- రమణ సహా నేతలెవరినీ టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవద్దని విన్నపం
- ఈ భేటీ తర్వాత టీడీపీ నుంచి ఆగిపోయిన వలసలు
- దూకుడు తగ్గించిన రేవంత్‌రెడ్డి


సాక్షి, హైదరాబాద్‌:
రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకోనుందా..? తెలంగాణలో ఉప్పు–నిప్పులా ఉన్న టీఆర్‌ఎస్, టీడీపీ ఒకదానికొకటి సహకరించుకోనున్నాయా? రాష్ట్రంలో ఉనికి కోల్పోయి, వలసలతో చిక్కి శల్యమైన టీ–టీడీపీ.. పార్టీని కాపాడుకునేందుకు రాజకీయ చదరంగంపై ఎత్తులు వేయడం మొదలు పెట్టిందా..? అత్యంత విశ్వసనీయ వర్గాలు అందిస్తున్న సమాచారం మేరకు ఆ మొదటి ఎత్తు టీడీపీ నుంచే వచ్చింది!

తమ పార్టీ ఉనికినే ప్రశ్నార్థకం చేసిన అధికార టీఆర్‌ఎస్‌తో దోస్తీకి స్నేహహస్తం అందించే ప్రతిపాదన చేసింది. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా.. టీడీపీ తొందరపడి ఈ ప్రతిపాదన చేయడానికి పార్టీ నుంచి వలసలు నిరోధించడానికేనన్నది స్పష్టమవుతోంది. చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన సమయంలో కేసీఆర్‌తో సన్నిహితంగా మెలిగిన ముగ్గురు మంత్రులు, ఓ మీడియా బాస్‌ ఇటీవల తెలంగాణ సీఎంతో సమావేశమైనట్లు తెలిసింది.

మంత్రి తుమ్మల నేతృత్వం
తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన పొత్తు ప్రతిపాదన కార్యరూపం దాల్చాలని కోరుకుంటున్న మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు సీఎంతో సమావేశానికి చొరవ తీసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబుతో సన్నిహితంగా మెలిగి ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరిన ఈ మంత్రి.. వచ్చే ఎన్నికల్లో తన జిల్లాలో టీఆర్‌ఎస్‌ విజయానికి టీడీపీతో పొత్తు అవసరమని భావిస్తున్నారు. తనను నమ్మి పార్టీలోకి వచ్చిన ఎంపీ ఒకాయన మళ్లీ గెలువాలంటే టీడీపీ మద్దతు అవసరమని ఆ మంత్రి భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కేసీఆర్‌తో ఓ విందు సమావేశానికి ఒప్పించారు. ఈ సమావేశానికి తెలంగాణ టీడీపీ నేత, నిజామాబాద్‌ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, కేసీఆర్‌తో సన్నిహిత సంబంధాలున్న రాయలసీమకు చెందిన ఓ ఏపీ మంత్రితోపాటు ఓ మీడియా బాస్‌ కూడా హాజరయ్యారు. గతంలో తమకు కేసీఆర్‌తో ఉన్న స్నేహ సంబంధాలను దృష్టిలో ఉంచుకుని వారు పొత్తు ప్రతిపాదన తీసుకొచ్చారు. టీడీపీ ఉనికి కోల్పోతే ఆ పార్టీకి ఉన్న ఓటు బ్యాంక్‌ చెల్లాచెదురవుతుందని, దీంతో కాంగ్రెస్‌కు లాభం చేకూరే అవకాశం ఉందని వారు విశ్లేషించారు. విందు సమావేశంలో టీడీపీ ప్రతిపాదనపై చర్చించిన సీఎం కేసీఆర్‌ తన వైఖరిని మాత్రం బయటపెట్టలేదు.

ఆ ప్రతిపాదనకు కారణమిదీ..
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ టీఆర్‌ఎస్‌లో చేరడానికి రంగం సిద్ధమైన నేపథ్యంలో.. టీడీపీ ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. రమణ పార్టీని వీడితే జిల్లాల్లో అనేక మంది టీఆర్‌ఎస్‌లో చేరతారని, పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని భావించిన టీడీపీ.. వలసలను నిరోధించడానికి అగమేఘాల మీద ఈ ప్రతిపాదనకు రూపకల్పన చేసింది. పొరుగు రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా పార్టీని కాపాడుకోలేకపోయామన్న భావన ప్రజలకు రాకుండా ఉండేందుకు ఈ ప్రతిపాదనను వాడుకోవాలని నిర్ణయించారు. కనీసం పది శాతం ఓట్లున్న టీడీపీ ఉనికి కోల్పోతే టీఆర్‌ఎస్‌కు నష్టం వాటిల్లుతుందన్న తమ అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొంతమేరకు పరిగణనలోకి తీసుకున్నారని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

అవసరమైతే బీజేపీని కూడా కలుపుకొని వెళ్తే బాగుంటుందని విందు సమావేశంలో పాల్గొన్న ఓ నేత అభిప్రాయపడగా.. ఆ పార్టీ కేంద్ర నాయకత్వంతో మాట్లాడాల్సి ఉంటుందని కేసీఆర్‌ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఎప్పుడో రెండేళ్ల తర్వాత జరిగే ఎన్నికలకు ఇప్పట్నుంచే పొత్తు ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదని కేసీఆర్‌ భావిస్తున్నారు. అయితే టీడీపీ నుంచే ప్రతిపాదన వచ్చిన నేపథ్యలో ఆ పార్టీ నుంచి వలసలు లేకుండా చేయగలిగారు. కొత్తగా ఆ పార్టీ నుంచి ఎవ్వరినీ టీఆర్‌ఎస్‌లో చేర్చుకోలేదు. దాంతోపాటే అవకాశం ఉన్న అన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏపీ సీఎం చంద్రబాబుతో కలుస్తూనే ఉన్నారు. రెండేళ్ల క్రితం నిప్పు–ఉప్పుగా ఉన్న వీరిద్దరూ కలిసిన ప్రతిసారి అప్యాయంగా పలుకరించుకుంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్‌ ఎమ్మెల్యేకు భారీగా డబ్బులు ఆఫర్‌ చేస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన కేసు అంగుళం కూడా ముందుకు కదలకుండా చేయగలిగారు.

ఓటుకు కోట్లు కేసే ప్రధాన కారణమా?
గడచిన రెండున్నరేళ్లలో టీడీపీ నుంచి పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీకి ఉన్న ఒక్క ఎంపీ, స్థానిక ప్రజాప్రతినిధులు, పలువురు నాయకులు టీఆర్‌ఎస్‌కు క్యూ కట్టారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి 15 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ప్రస్తుతం ముగ్గురు మాత్రమే మిగిలారు. ఏకంగా 12 మంది టీటీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌ శాసనసభా పక్షంలో విలీనమయ్యారు. శాసన మండలిలోనూ ఇదే పరిస్థితి. ఇప్పుడు మండలిలో టీడీపీకి ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. అయినా టీడీపీ స్నేహహస్తం అందించడానికి ఓటుకు కోట్లు కేసే ప్రధాన కారణమని ఆ పార్టీ సీనియర్‌ నేత ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం. ఆ కేసు లేకుంటే ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీ వీడేవారు కాదని, పార్టీ అగ్రనాయకత్వం సలహా మేరకే వారు టీఆర్‌ఎస్‌లో చేరారని దక్షిణ తెలంగాణ జిల్లాలకు చెందిన ఆ సీనియర్‌ నేత విశ్లేషించారు. అయితే రానురానూ పార్టీ ఉనికే ప్రశ్నార్థకం అవుతున్న నేపథ్యంలో కేసీఆర్‌ను మచ్చిక చేసుకుని వలసలను అరికట్టడానికి ఈ విందు సమావేశం దోహదపడింది.

ఎర్రబెల్లితోనూ రహస్య భేటీ
కొద్దిరోజుల కిందటే ఏపీ మంత్రి నారాయణ అధికారిక నివాసంలో టీఆర్‌ఎస్‌ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, టీడీపీ నేతలు ఎల్‌.రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి రహస్యంగా భేటీ ఆయ్యారని సమాచారం. ఈ భేటీ వివరాలేవీ బయటకు రాకున్నా... అదే రోజు రాత్రి ఎల్‌.రమణ, ఎర్రబెల్లి సీఎం కేసీఆర్‌తో భేటీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. అయినా చేరికలకు సంబంధించి ఎలాంటి పరిణామం చోటు చేసుకోకపోవడం గమనార్హం. చాలా నెలలుగా రమణ టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. మొత్తంగా టీడీపీ నేతల ప్రతిపాదనపై సుదీర్ఘంగానే సమావేశం జరిగిందంటున్నారు. టీఆర్‌ఎస్‌తో యుద్ధం చేస్తామని చెపుతూ వచ్చిన తెలంగాణ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి ఈ మధ్య దూకుడు తగ్గించారు. టీఆర్‌ఎస్‌తో పొత్తు విషయం తన సన్నిహితులు ప్రస్తావించినప్పుడు అదంతా ఆషామాషీ కాదని ఆయన కొట్టిపారేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement