'టీఆర్‌ఎస్‌తో కలిస్తే ఐఎస్‌ఐతో కలిసినట్టే'
'టీఆర్‌ఎస్‌తో కలిస్తే ఐఎస్‌ఐతో కలిసినట్టే'
Published Thu, Feb 9 2017 3:42 PM | Last Updated on Tue, Aug 14 2018 11:02 AM
హైదరాబాద్: భారతదేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయాలని ప్రయత్నించే ఐఎస్‌ఐ ఏజెంట్ తో కలవడం, తెలంగాణ ప్రజల జీవన విధ్యంసానికి పాల్పడుతున్న కేసీఆర్‌తో కలవడం ఒక్కటేనని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. టీడీపీకి ప్రధాన శత్రువు టీఆర్‌ఎస్ అని స్పష్టం చేశారు. తెలంగాణకు పట్టిన చీడపురుగు కేసీఆర్ అని ధ్వజమెత్తారు. తెలంగాణ సమాజానికి ద్రోహం చేస్తున్న కేసీఆర్‌ను గద్దె దింపడమే తమ పార్టీ లక్ష్యమని ప్రకటించారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ , టీఆర్‌ఎస్‌తో పొత్తుకు రహస్య మంతనాలు చేస్తోందంటూ దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అసలైన ఉద్యమకారులందరూ ఆస్తులను, ఉద్యోగాలను పోగొట్టుకుంటే కేసీఆర్ మాత్రం తెలుగు పత్రిక, ఉర్దూ పత్రిక, ఇంగ్లిష్ పత్రిక, టీవీ ఛానల్, వందలాది ఎకరాల ఫాంహౌస్‌తో పాటు వేల కోట్ల రూపాయల అక్రమాస్తులను సంపాదించారని ఆరోపించారు. 2004 లో కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి ఆ తర్వాత ఆ పార్టీని మోసం చేశారని, అలాగే 2009లో మహా కూటమి పేరుతో టీడీపీతో పొత్తు పెట్టుకుని టీడీపీకి కూడా మోసం చేశారని విమర్శించారు. 2014 లో టీఆర్‌ఎస్ పార్టీని కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తామని ఆ పార్టీని కూడా మోసం చేశారని, ప్రస్తుతం 2019లో జరిగే ఎన్నికలలోనూ ఇలాంటి మోసాలకు పాల్పడాలన్న ఉద్దేశంతో దుష్ప్రచారాలకు తెరతీశారని రేవంత్ ధ్వజమెత్తారు.
Advertisement