ఢిల్లీలోనూ చక్రం తిప్పుతం! | We will lead in delhi also:Cm kcr | Sakshi
Sakshi News home page

ఢిల్లీలోనూ చక్రం తిప్పుతం!

Published Thu, Jun 2 2016 12:50 AM | Last Updated on Tue, Aug 14 2018 10:59 AM

ఢిల్లీలోనూ చక్రం తిప్పుతం! - Sakshi

ఢిల్లీలోనూ చక్రం తిప్పుతం!

వచ్చే ఎన్నికల నాటికి కీలక శక్తిగా టీఆర్‌ఎస్
2019లో ప్రాంతీయ పార్టీలదే హవా
ప్రాంతీయ పార్టీల కూటమిగా ఢిల్లీని శాసిస్తాం

 
 ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి కేసీఆర్
 
 తెలంగాణ అవసరాల కోసమే ప్రాజెక్టుల రీడిజైన్ చేపడుతున్నం. ఎట్టి పరిస్థితుల్లో 2022 నాటికి కోటి ఎకరాలకు సాగునీరు ఇచ్చి తీరుతం.
 
 సాక్షి, హైదరాబాద్: వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో అత్యంత కీలక పాత్ర పోషిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఉద్ఘాటించారు. నూటికి 101 శాతం టీఆర్‌ఎస్ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతుందని స్పష్టంచేశారు. ప్రాంతీయ పార్టీల కూటమిగా ఢిల్లీని శాసిస్తామని, అందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదని పేర్కొన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ‘సాక్షి’కి బుధవారం ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే...

 2019లో ప్రాంతీయ పార్టీలదే హవా..
 జాతీయ రాజకీయాల్లో వందకు 101 శాతం కీలకంగా వ్యవహరిస్తాం. 2019 ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో మేమే కీలకమవుతాం. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. గడిచిన రెండేళ్లుగా రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో ప్రజలు స్థిరంగా టీఆర్‌ఎస్ వెంట ఉన్నారు. అద్భుతమైన ఫలితాలు ఇచ్చారు. ఇది రెండే ళ్ల పాలనకు, ప్రభుత్వ పథకాలపై ప్రజలు సంతోషంగా ఉన్నారనడానికి నిదర్శనం. అందువల్లే వారు ప్రభుత్వ పని తీరును ఆమోదిస్తున్నారు. వచ్చే మూడేళ్లలో రెచ్చిపోయి పనిచేస్తాం. 2019లో ప్రజాతీర్పు కోరాల్సి ఉంది. ఆర్థిక వనరులు, బలం, బలహీనతలపై పరిపూర్ణమైన స్పష్టత ఉంది. అందుకే రెచ్చిపోయి పనిచేస్తం.

కచ్చితంగా ప్రజలు మమ్మల్నే ఆశీర్వదిస్తరు. నాకు గుర్తున్నంత వరకు దేశవ్యాప్తంగా నాలుగైదు రాష్ట్రాల్లోనే జాతీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి. 20కిపైగా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి. అందులోనూ చాలా ముఖ్యమైన రాష్ట్రాలు. మహారాష్ర్టలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా.. శివసేన మద్దతుతోనే. శివసేన లేకుంటే అది కూడా లేదు. బిహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఏపీ, తెలంగాణ ఇలా అన్నీ ప్రాంతీయ పార్టీల పాలనలోనే ఉన్నాయి. కచ్చితంగా 2019 ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే హవా. ఉదాహరణకు, మొన్నటి ఎన్నికల్లో తమిళనాడులో జయలలిత రాకుంటే కరుణానిధి వస్తుండే.

అంతేగానీ బీజేపీ రాదు.. కాంగ్రెస్ రాదు. అదే పద్ధతి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ ఉంటది. నాకు తెలిసి 200 నుంచి 230 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుంది. 350 స్థానాల్లో ప్రాంతీయ పార్టీ వర్సెస్ జాతీయ పార్టీ లేదా ప్రాంతీయ పార్టీ వర్సెస్ మరో ప్రాంతీయ పార్టీల మధ్యే ఉంటుంది. నాతో ముగ్గురు నలుగురు నాయకులు మాట్లాడారు. వారు భిన్నాభిప్రాయంతో ఉన్నారు. అందరినీ ఒకటి చేయలేక పోయినా.. కనీసం 70-80 మంది ఎంపీల ను గెలిస్తే ప్రెషర్ గ్రూప్‌గా ఉంటాం కదా అన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే ఇది సరైన సమయం కాదు. ఎన్నికలకు ఒక ఏడా ది ముందు ఈ ప్రయత్నాలను ముమ్మరం చేస్తాం. యూపీ ఎన్నికలు జరిగాలి. పరిస్థితులను గమనించాలి. అక్కడేం జరుగుతదో చూడాలి. కూటమి ఏర్పాటు వంద శాతం జరుగుతుంది. నాకు భిన్నమైన ఆలోచన ఉంది. ఎన్డీఏలోనో.. యూపీఏలోనో చేరడం కాదు కానీ.. ప్రెషర్ గ్రూప్‌గా ఉంటాం.

 ఢిల్లీని శాసించే స్థాయికి ప్రాంతీయ పార్టీలు
 రెండు తెలుగు రాష్ట్రాలు చూస్తే.. తెలంగాణలో ఫలితాలు ఏకపక్షంగా ఉన్నాయి. ఏపీలో మాత్రం ఆ పరిస్థితి లేదు. కానీ ఈ రోజు.. దేశంలో ఇప్పుడు ఏ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలున్నాయో ఆ పార్టీల ఎంపీలు నిజమైన సమాఖ్య రాజకీయ అధికారాన్ని అనుభవిస్తున్నారు. ఢిల్లీ పాదాల కాడ పాదాక్రాంతం అయ్యే స్థితి నుంచి ఢిల్లీని శాసించే స్థాయికి ప్రాంతీయ రాజకీయ పార్టీలు ఎదిగాయి. 2019లో ప్రభుత్వం ఏర్పాటులో కచ్చితంగా ప్రాంతీయ పార్టీల కూటమి  శాసించే స్థాయిలో ఉంటుంది. ప్రభుత్వ ఏర్పాటులో వారిదే కీలక పాత్ర. టీఆర్‌ఎస్ కూడా తప్పకుండా ఓ కీలకమైన పాత్ర పోషిస్తది.

 చెన్నారెడ్డికి అపాయింట్‌మెంట్ దొరకలేదు
 ఢిల్లీలో నేనే ప్రత్యక్ష సాక్షి. 1980ల్లో అనుకుంటా.. మర్రి చెన్నారెడ్డి ఏపీ సీఎంగా ఉన్నారు. అప్పుడు ఆయన పవర్‌ఫుల్ సీఎం. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నారు. ప్రధానిని కలవడానికి చెన్నారెడ్డి వచ్చి వారం రోజులు ఎదురుచూశారు. కానీ అపాయింట్‌మెంట్ దొరకలేదు. అప్పుడు రాజకీయాల్లో జాతీయ పార్టీల గుత్తాధిపత్యం (మోనోపలీ) ఉండేది. ఎప్పుడైతే సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటు మొదలయ్యిందో అప్పట్నుంచి దేశంలో నిజమైన సమాఖ్య స్ఫూర్తి అనుభవిస్తున్నాం. అప్పుడు నేను యూత్ కాంగ్రెస్‌లో యూత్ లీడర్‌గా పనిచేస్తున్నా. మేమే మాట్లాడుకున్నాం ఇదేం అన్యాయం అని. కానీ  ఇప్పుడు పరిస్థితి మారింది. సంకీర్ణ శకం ఆరంభంతోనే జాతీయ పార్టీల గుత్తాధిపత్యానికి కాలం చెల్లింది.

 సాగునీళ్లపై చంద్రబాబుది మూర్ఖత్వం
 సాగునీటి వినియోగంపై చంద్రబాబుది మూర్ఖత్వం. ప్రతీ దానికి ఫిర్యాదు చేస్తమంటరు. అర్థం లేని, అనవసరమైన వివాదం. పట్టిసీమలో నిబంధనలు ఉల్లంఘించింది ఎవరు? అయినా.. అక్కడ్నుంచి మిగులు జలం సముద్రంలో కలిసేదే కాబట్టి.. మంచి పనే చేశారని అసెంబ్లీలోనే చెప్పిన కదా? ఆయన ఎవరికీ చెప్పకుండానే కట్టారు. ఒక బేసిన్ నుంచి మరో బేసిన్‌కు నీళ్లు తీసుకుపోతే.. అంతే పరిమాణంలో ఎగువ రాష్ట్రాలకు నీటి హక్కు ఉంటుందని బచావత్ ట్రిబ్యునల్‌లోనే ఉంది. రైతులకు నీళ్లివ్వడమే లక్ష్యం అయితే.. ఒక్క లిఫ్టు చాలు. పోలవరం నుంచి సోమశిల దాకా ఎక్కడా ఇబ్బంది లేకుండా గ్రావిటీతో నీళ్లు తీసుక పోవచ్చు.

అక్కడ 200 మీటర్ల ఎత్తులో ఒక్క లిఫ్ట్ పెడతే చాలు రాయలసీమను సస్యశామలం చే యొచ్చు. కడప, అనంతపురం, చిత్తూరుకు నీళ్లు అందుతాయి. ఇవి ఒదిలిపెట్టి ప్రతీ దానికి ఫిర్యాదులు. గోదావరి, కృష్ణా నది, చెరువులు, మీడియం ఇరిగేషన్‌ను అన్నీ కలిపినా 4,200 టీఎంసీల నీరు ఉంది. మేం కోటి ఎకరాలు అంటున్నాం. అంటే వెయ్యి టీఎంసీలు. తాగునీటి అవసరాలకు మరో 150 టీఎంసీలు తీసుకున్నా.. ఎంత లేదన్నా 3 వేల టీఎంసీల నీటిని మీరే వాడుకోమంటిమి. ఎలాం టి అభ్యంతరం లేదంటిమి. 3 కోట్ల ఎకరాలు పారించుకోమంటిమి. అయినా వాళ్లకు వివాదాలు కావాలి. ఏపీగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు పొరుగు రాష్ట్రాలతోనూ అన్నీ గొడవలే!

 ఉద్యమం వేరు.. ప్రభుత్వం వేరు
 పాత మిత్రులకు దూరమైంది ఏమీ లేదు. 2014 వరకు జేఏసీలో భాగంగా ఉద్యమం నడిపాం. ఫలం అందింది. ఇప్పుడు ప్రభుత్వాన్ని నడుపుతున్నం. యుద్ధ సమయంలో విన్‌స్టన్ చర్చిల్ సమర్థవంతమైన ప్రధానిగా పేరు తెచ్చుకున్నారు. కానీ ఆ తర్వాత అత్యంత ఫెయిల్యూర్ ప్రధానిగా మచ్చ తెచ్చుకున్నరు. ఉద్యమం నడపడం వేరు.. ప్రభుత్వం నడపడం వేరు. నీళ్లు- నిధులు- నియామకాల్లో నిధులు ఉన్నాయి. నియామకాలకు సంబంధించి రిక్రూట్‌మెంట్ జరుగుతోంది. రాష్ట్రం ఏర్పాటుతోనే ఈ రెండింటికి పరిష్కారం లభించింది. నీళ్ల కోసం వేట సాగుతోంది.
 
 ఇష్టం వచ్చినట్లు మాట్లాడతామంటే ఎలా?
  ప్రతిపక్షాలకు గొంతుండాలి. కానీ ఆ గొంతు డీసెంట్‌గా ఉండాలి కదా? బాధ్యతగల వారమని చెప్పుకుంటూ అడ్డంగా.. ఒక బాధ్యత గల ప్రభుత్వంపై ఎలా మాట్లాడతారు..? రేషనల్‌గా ఉండాలి. రీజన్ బేస్డ్‌గా ఉండాలి. పోనీ.. నాలుగు కుంభకోణాలో.. లంభకోణాలో ఉంటే ఆరోపణలు చేయొచ్చు. కనీసం ఒక్క అభియోగమైనా ఉండాలి కదా.. కరెక్టుగా ఒక్కటి తీసుకు రండి చర్య తీసుకుంటా. అసెంబ్లీ వేదికగా కూడా చెప్పా కదా. ఉత్తిగనే మా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతామంటే కరెక్టు కాదు. మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతానంటే ఎలా? పాయింటెడ్‌గా చెప్పాలి. రాజకీయ అవినీతి పూర్తిగా తగ్గింది. లేదంటే సెక్రటేరియట్ అల్లకల్లోలం అయ్యేది. పైరవీకారులతో నిండిపోయేది. అనవసర ఆరోపణలు చేస్తే లీగల్‌గానే చూసుకుంటం.. దీని ఫాలోఅప్‌కు లీగల్ టీం కూడా పెడతం. ప్రభుత్వంలో ఉండుడే తప్పన్నట్టు మాట్లాడితే ఎలా? అట్టెట్ట కుదురుతుంది?
 
 ఢిల్లీ పాదాల కాడ పాదాక్రాంతం అయ్యే స్థితి నుంచి ఢిల్లీని శాసించే స్థాయికి ప్రాంతీయ రాజకీయ పార్టీలు ఎదిగాయి. 2019లో ప్రభుత్వం ఏర్పాటులో కచ్చితంగా ప్రాంతీయ పార్టీల కూటమి  శాసించే స్థాయిలో ఉంటుంది.
 
 మంత్రివర్గ విస్తరణ టైం వేస్ట్..
 రాష్ట్రంలో రాజకీయ సుస్థిరత ఉంటేనే అభివృద్ధి సాధ్యమైతది. రాజకీయంగా బలోపేతం కావడం కంటే.. రాజకీయ స్థిరత్వం చాలా అవసరం. అది అనివార్యం కూడా. విజయవంతంగా ఆ లక్ష్యం చేరుకున్నం. పాత-కొత్త కలయిక విభిన్నం. కొత్త-పాతలను కలిపి ముందుకు తీసుకుపోవాలి. పాతవాళ్లు అడ్జస్ట్ కాక తప్పదు. మంత్రివర్గ విస్తరణ టైమ్ వేస్టు. ఇప్పటికే చిన్నచిన్న మార్పులు చేసుకున్నం. శ్రీనివాస్ యాదవ్‌కు కూడా వారం రోజుల ముందే చెప్పా. వాణిజ్య పన్నుల శాఖ నా దగ్గర ఉంటే పైరవీల కోసం ఎవడూ నా దగ్గరికి రాడు. ఫలితంగా ప్రభుత్వానికి మరో వెయ్యి కోట్ల నుంచి రూ.15 వందల కోట్ల దాకా అదనపు ఆదాయం వస్తుందని, కరప్షన్ తగ్గుతుందని చెప్పా. మంత్రులు అంతా బాగా పనిచేస్తున్నారు. ఒకరు ఎక్కువ కాదు.. ఒకరు తక్కువ కాదు. అప్ప జెప్పిన శాఖ, యాక్టివిటీని బట్టి కొందరు పేపర్లలో, మీడియాలో ఎక్కువగా  కనిపిస్తుండవచ్చు. కొందరికి ఆ అవకాశం లేకపోవచ్చు. అంత మాత్రాన పనిచేయనట్టు కాదు. అందరికీ ఒకే ర్యాంక్. వివిధ కారణాలతోనే నామినేటెడ్ పోస్టులు ఆలస్యం అయ్యాయి. చంద్రబాబు వల్ల పదో షెడ్యూల్ సంస్థల వ్యవహారం రెండేళ్లు ఆలస్యం అయ్యింది. అయినా.. ఏవో కొన్ని భర్తీ చేయడం మొదలు పెట్టాం. ఈ నెలలో, వచ్చేనెలలో ఈ పోస్టుల భర్తీ పూర్తి చేస్తం.
 
 ఓటుకు కోట్లుతో ఇక్కడ లాభం లేదనుకుంటున్నరు
 ఆంధ్రప్రదేశ్‌లో జనం అసంతృప్తితో ఉన్నరు. అక్కడ కొట్టే పరిస్థితి ఉంది. అందుకే ప్రభుత్వం విజయవాడకు షిప్ట్ అయితంది. చంద్రబాబుకు అది అనివార్య పరిస్థితి. ఇక్కడుంటే నష్టమనుకున్నరు. ఓటుకు కోట్లు కేసుతో ఇక్కడ లాభం లేదనుకుంటున్నరు. ఇక్కడ పోలీసు స్టేషన్లు కూడా పెడతమన్నరు. లీగల్ ఒపీనియన్ తీసుకుంటే తెలంగాణకే జూరిస్‌డిక్షన్  ఉంటదని చెప్పడంతో... ఇప్పుడేమన్నా సంతకాలు చేసినా, ఎట్ విజయవాడ అని రాస్తున్నరు. ఓటుకు కోట్లు కేసు కోర్టులో విచారణలో ఉంది. దానిపై ఏం వ్యాఖ్యానించను. ఏపీ సచివాలయం వెళ్లి పోతే మనకున్న సచివాలయంలోనే కొత్తది కట్టుకుంటం.
 
 ఆ రైల్వే లైన్‌కు అంత కష్టపడాల్సి వచ్చింది..
 ప్రాంతీయ పార్టీలు ఎంత గొప్ప పాత్ర పోషిస్తున్నాయంటే.. మీకో చిన్న ఉదాహరణ చెబుతా. యూపీఏలో మేం భాగస్వాములుగా ఉన్న సమయంలో సోని యాతో క్లోజ్‌గా ఉంటిని. ఎందుకంటే తెలంగాణ కావాలి కాబట్టి. తెలంగాణ కోసం నా తంటాలు ఏవో నేను పడుతుంటి. ఆమె ఓ రోజు తన ఇంట్లో భోజనం పెట్టింది. లాలు ప్రసాద్, నేనూ ఒక టేబుల్‌పై ఉన్నం. ప్రాంతీయ పార్టీల అధ్యక్షులం కాబట్టి.. మా నియోజకవర్గాలకు తలా ఓ రూ.500 కోట్లు ఇవ్వమన్నాం. నా డ్రీమ్ ప్రాజెక్టు హైదరాబాద్-కరీంనగర్ రైల్వే లైన్‌తోపాటు ఒక తాగునీటి ప్రాజెక్టు అడిగా. పీఎం మన్మోహన్ సింగ్‌కు నా ముందే చెప్పింది. ఓ రిప్రజెంటేషన్  ఇచ్చా.

లాలు ప్రసాద్ రైల్వే మంత్రిగా ఆయన ఒక ప్రాజెక్టు అడిగిండు. కానీ  ప్లానింగ్ కమిషన్, రైల్వే బోర్డు ‘అన్ వయబుల్’ అని మా ప్రాజెక్టులను రద్దు చేసింది. ఆ తర్వాత కేబినెట్ సమావేశం ఉన్న రోజున లాలు ఫోన్ చేసిండు. కచ్చితంగా మీటింగ్‌కు రమ్మన్నరు. ఎందుకంటే రైల్వే లైన్ నీది పోయింది. నాది పోయిందన్నడు. మనం కొట్లాడి చేయించుకోవాలన్నడు. మా ఎజెండా వచ్చింది. చిదంబరం ఆర్థిక మంత్రి. దీనికి ఒప్పుకోలేదు. ప్రధానికి గుర్తు చేశాం. మేడం చెప్పిన విషయం గుర్తు చేశాం. ప్లానింగ్ కమిషన్, రైల్వేబోర్డు కన్నా.. కేబినెట్ నిర్ణయమే కీలకమని లాలు ప్రధానికి చెప్పడంతో ఓకే చేశారు. నేనేమంటానంటే... ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడిగా ఉండి, కేంద్ర కేబినెట్‌లో ఉండే స్థాయిలో ఉన్న నేతను కాబట్టి ఈ ఎలక తోకంత రైల్వే లైన్ తీసుకోవడానికి సాధ్యపడింది. అదే సాధారణ  ఎంపీ అయితే చేతులు కట్టుకుని నిలబడాలే తప్ప.. సాధ్యం అయితదా?
 
 ‘నీళ్ల’ వేట సాగుతోంది..
 తెలంగాణ ఉద్యమ నినాదమైన నీళ్లు, నిధులు, నియామకాల్లో... నిధులు, నియామకాలకు రాష్ట్ర ఆవిర్భావంతోనే పరిష్కారం దొరికింది. ఇక నీళ్ల కోసం వేట సాగుతోంది. కృష్ణా, గోదావరి నదుల్లో మొత్తంగా 3,855 టీఎంసీల జలాలు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ ఒక్క దానికే కృష్ణా, గోదావరి పరిధిలోని మైనర్ ఇరిగేషన్‌లో మరో 265, మీడియం ఇరిగేషన్‌లో 400 టీఎంసీల పైచీలుకు నీటి లభ్యత ఉంది. అంటే 4,400 టీఎంసీల దాకా నీరు అందుబాటులో ఉంది. ఈ లెక్కన నాలుగు కోట్ల ఎకరాలకు సాగునీరు ఇవ్వొచ్చు. మేం తెలంగాణలో కోటి ఎకరాలు అంటున్నాం. 42 శాతం కేటాయింపు ఉన్నా చాలంటున్నం.

అయినా పంచాయతీ పెడతుంటే ఎట్లా? నీళ్లున్నా సరే గాయి పెడతం.. బొబ్బలెడతం అంటే ఎట్లా? నీకు కట్టే చేతగాక, పనిచేయరాక మంది మీద పడి ఏడుస్తనంటే ఎట్లా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నన్ని రోజులూ అందరితో పంచాయతీ పెట్టిండ్రు. మరి మేం పొరుగు రాష్ట్రాలతో సఖ్యతగా ఉంటున్నం. నోరు మంచిదైతే.. ఊరు మంచిదైతది. మా తీరు చూసి చరిత్రలో మొదటిసారిగా కర్ణాటక మనకు ఒక టీఎంసీ నీళ్లు విడుదల చేసింది. గోదావరిపై ప్రాజెక్టు కోసం మహారాష్ట్రతో ఒప్పందం చేసుకుంటున్నం. తమ్మిడిహెట్టి వద్ద 1,148 టీఎంసీల లభ్యత ఉంటే.. కాళేశ్వరం వద్ద 1,651 టీఎంసీలు లభిస్తోంది. అంటే అదనంగా 500 టీఎంసీలున్నాయి. ఇంద్రావతి దగ్గర కూడా 800 టీఎంసీలు అదనంగా లభిస్తోంది. దేవాదులను ఒడ్డు మీద కట్టారు. ప్రపంచంలో ఎవడూ అలా కట్టడు, దానికోసం రూ.8వేల కోట్లు  ఖర్చు చేశారు. ది గ్రేట్ పొన్నాల లక్ష్మయ్య. ఇప్పుడు మేం కంతనపల్లి దగ్గర కాకుండా మన భూభాగంలో కొత్తూరు వద్ద కడుతున్నం. ఇన్నీ అవగాహన చేసుకుని ప్రాజెక్టులను రీడిజైన్ చేశాం. దీనిని చేయొద్దంటరు. వాళ్లకు ఇంక ఎవరు చెప్పాలె? తెలంగాణ అవసరాల కోసమే ప్రాజెక్టుల రీడిజైన్ చేపడుతున్నం. ఎట్టి పరిస్థితుల్లో 2022 నాటికి కోటి ఎకరాలకు సాగునీరు ఇచ్చి తీరుతం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement