ఇంకా కొనసాగుతున్న బాబు కుట్రలు: హరీశ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుట్రలు ఆపలేదని రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఉమ్మడిపాలనలో జరిగిన అన్యాయాన్ని తెలంగాణ విడిపోయినా కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నారని, పాలమూరు సాగునీటి ప్రాజెక్టులకు బాబు అడ్డుపడుతున్నారని ఆయన ఆరోపిం చారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నేతలు శని వారం తెలంగాణ భవన్‌లో హరీశ్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబ్‌నగర్ జిల్లాకు ఉమ్మడి పాలనలో అన్యాయం జరి గిందని, బాబు హయాంలో ఈ జిల్లాను పట్టించుకోలేదని పేర్కొన్నారు.
వెనకబడ్డ పాలమూరును అన్ని రంగాల్లో తీర్చిదిద్దేందుకు ఇప్పుడు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. రాబోయే రెండున్నరేళ్లలో జిల్లా రూపురేఖలు మారుతాయన్నారు. పాలమూరును సస్యశ్యామలం చేసే ప్రాజెక్టులను అడ్డుకునేందుకు స్థానిక కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించడం శోచనీయమన్నారు. వైద్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటయ్యాక రాజకీయ పార్టీల నాయకులు అభివృద్ధిలో భాగస్వాములు అయ్యేందుకు జెండాలను పక్కనబెడుతున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ పాలమూరు జిల్లా అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ జితేందర్‌రెడ్డి, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.