మాది రైతు ప్రభుత్వం..
- ప్రజలు టీఆర్‌ఎస్ వెన్నంటే ఉంటారు: మంత్రి హరీశ్‌రావు
- అభివృద్ధి కోసమే కొత్త జిల్లాల ఏర్పాటు
నాగిరెడ్డిపేట: రైతుల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం తమదని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఎవరెన్ని చెప్పినా.. ప్రజలు టీఆర్‌ఎస్ వెన్నంటే ఉంటారని తెలిపారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో శనివారం ఎల్లారెడ్డి, గాంధారి, సదాశివనగర్ మార్కెట్ కమిటీల పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబానికి ఆరు కిలోల బియ్యం ఇస్తున్నామని, వ్యవసాయానికి తొమ్మిది గంటల విద్యుత్, గృహావసరాలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. రైతులకు కరెంట్ ఇయ్యనోళ్లు, ఆరు కిలోల బియ్యం ఇస్తామని హామీ ఇచ్చి మాట మార్చినోళ్లు ప్రజల ముందుకు వస్తే ఎలా నమ్ముతారన్నారు.
తెలంగాణ రాష్ట్రం రాకుండా చూసేందుకు చంద్రబాబు దేశమంతా తిరిగారని, మొన్నటికి మొన్న గోదావరి నీళ్లు తెచ్చుకుంటామంటే ఢిల్లీలో ఫిర్యాదు చేశారని ఆరోపించారు. ఈ ప్రాంతంలో ప్రాజెక్టులను, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును, మన కరెంట్‌ను చివరిదాకా అడ్డుకుంది చంద్రబాబేనన్నారు. ఉచిత కరెంట్ సాధ్యం కాదన్నవారు, కరెంటు అడిగిన రైతులను పిట్టలను కాల్చినట్టు కాల్చినోళ్లు రైతుల కోసం పాదయాత్ర చేస్తామనడం.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని మంత్రి హరీశ్ విమర్శించారు.
వేగవంతమైన అభివృద్ధికి కొత్తజిల్లాల ఏర్పాటుతో దారులు ఏర్పడ్డాయ ని హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రజ ల సౌలభ్యం కోసమే నూతన జిల్లాలను ఏర్పాటు చేశామన్నా రు. కొత్త జిల్లాల ఏర్పాటుతో అధికారుల పర్యవేక్షణ పెరిగి, సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని కాటేవాడి, గూర్జుల్, మోతె, అమర్లబండ ప్రాజెక్టుల నిర్మాణానికి నవంబర్, డిసెంబర్‌లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామని, జనవరిలో పనులు నిర్వహించి నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీటిని అందించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, కలెక్టర్ సత్యనారాయణ, మాజీ ఎమ్మె ల్యే జనార్దన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.